Menu

పోరాటం విరమించబోం, పోరుజెండాను మరింత ఎత్తిపడతాం – సికాస ప్రకటన‌

anadmin 2 weeks ago 0 489

పత్రిక ప్రకటన
తేదీ: 11.10.2025

ముసుగు వీరులారా ఇంకెన్నాళ్ళు… మీ మెన్శివిక్ కుట్రలు…

ప్రియమైన విప్లవ శ్రేణులకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రజలారా…
ఈ సమాజంలో వర్గాలు అంతం కావాలని, కుల వివక్ష, ఆధిపత్యం, దోపిడీ లేని సమాజం కోసం భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు పోరాటాలు కొనసాగుతున్నారు. ఈ పోరాటాలను అనేక రూపాలలో కొనసాగించారు, నిరసనలు తెలిపారు. మూతికి గుడ్డలు కట్టుకొని కావచ్చు, నల్ల జెండాలతో కావచ్చు, గ్రామ బహిష్కరణలు కావచ్చు, దోపిడీదారులకు పనులు బందు చేయడం కావచ్చు, కార్మికులు ఉత్పత్తిని బంద్ చేయడం కావచ్చు, చట్టబద్ధమైన అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చిట్టచివరకు మాత్రమే ప్రజలు ప్రజాకంటకులకు తీవ్రమైన శిక్షలు వేస్తారు. ఇది చారిత్రిక సత్యం.

సింగరేణిలో నిరసనలు, బంద్ లు అనేక పోరాట రూపాలతో సింగరేణి ప్రారంభించిన తొలినాళ్ళ నుండి కొనసాగుతున్నాయి. బాంచన్ దొర… కాల్మొక్త దొర… ఇక చెల్లదంటూ ప్రారంభమైన జగిత్యాల జైత్రయాత్ర కాలం నుండి సింగరేణిలో ఉద్యమాలకు సైరన్ మోగించారు. సికాస ప్రారంభమైన 1982 నుండి కార్మికోద్యమం భారతదేశంలో అన్ని బొగ్గుగనుల ఉద్యమాలకు ఆదర్శమైనది. త్రాగునీరు, విద్య, వైద్య, నివాస సౌకర్యాల కోసం సాగించిన నిరసనల వలన చాలా ఫలితాలు కార్మికులు సాధించగలిగారు.

రాజ్యం అమలు చేసిన అనేక రకాల నిర్భందాలను భరిస్తూ అలుపెరుగని పోరాటం చేసినారు. ఆర్ధిక పోరాటాలను రాజకీయ పోరాటంగా మలిచినారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. సికాస నిర్వహించిన పోరాటాలకు అండగా నిలిచిన సుమారు 36 మంది రక్తతర్పణ చేసినారు. *పురిటినొప్పులు లేనిదే తల్లి బిడ్డకు జన్మనివ్వదు’ అనేది ఎంత వాస్తవమో పోరాటాలు, త్యాగాలు లేనిదే హక్కులు సాధించలేమనేది సింగరేణి కార్మికుల జీవితాల్లో నిలిచింది. “మంత్రాలకు చింతకాయలు రాలవు” అనేది జగమెరిగిన సత్యం. కాని మనువాదం ఒంటబట్టిన‌ వాళ్ళు పైసూక్తిని ఒప్పుకోరు.

సింగరేణి కార్మికుల పోరాటాల చరిత్ర వేణుగోపాల్ కు తెలియనిదికాదు, ఇప్పుడు ఆ వాస్తవాలను వక్రబుద్ధితో వక్రీకరిస్తూ చరిత్రను తలకిందులుగా చూపడానికి ప్రయత్నిస్తున్నాడు.

మార్క్స్ సిద్ధాంతం నుండి కర్మసిద్ధాంతంలోకి జారుకుంటున్నాడు. గత సంవత్సర కాలంగా ఆయనలో మొదలైన తిరోగమన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మెల్లమెల్లగా ఒక గుంపును పోగు చేసుకుంటున్నాడు. జినుగు నరసింహారెడ్డి లాంటి ఒకరిద్దరిని ఏజెంట్లుగా పెట్టుకొని తేనె పూసిన కత్తిలాగా పని సాగించాడు. అమరుల త్యాగాలను హేళన చేస్తూ, “మనువాదుల ముహూర్తాలకు” సహాయాన్ని అందిస్తూ భారత విప్లవ పురోగమనాన్ని అడ్డుకోవడానికి పూనుకున్నాడు.

సిద్ధాంత చర్చలను, వ్యూహా-ఎత్తుగడల విషయాలను కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకునే పద్ధతికి తిలోదకాలిచ్చి దోపిడీదారుల ఏజెంట్లు అయిన పాలకుల భాషనెత్తుకున్నాడు. మావోయిస్ట్ పార్టీలో, విప్లవ శ్రేణుల్లో, ప్రజాస్వామ్యవాదుల్లో, చివరికి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి పథకం ప్రకారం ఈ పని చేస్తున్నాడు. అనన్య త్యాగాలు చేసే విప్లవకారులు కాలమాన అవసరాలకు తగ్గట్టుగా వ్యూహం-ఎత్తుగడలను మార్చుకోవడానికి ఎప్పుడూ వెనుకాడరు. కాలమాన పరిస్థితి పేరుతో మనువాదులు చెప్పే కర్మసిద్ధాంతం విప్లవ పురోగమనానికి పనికిరాదు అని మాత్రమే సికాస భావిస్తున్నది.

శ్రమదోపిడీ లేని సమాజ లక్ష్యంగా చట్టబద్ధ, ప్రజాస్వామ్యయుత పోరాటాలను సికాస కొనసాగిస్తుంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మెజారిటీ కార్మికుల అభిప్రాయాలతో అన్ని పోరాట రూపాల్లో ముందుకు సాగుతుంది. “ఓటమి విజయానికి తల్లిలాంటిది”. ఉద్యమాల్లో, పోరాటాల్లో స్థల మార్పిడి ఉంటుంది కాని “అస్త్ర సన్యాసం” ఉండదు. ఇవన్ని వేణుగోపాల్ కు తెలియనివి కావు, భోదించనివి కావు, పేజీల కొద్ది రాయనివి కావు. పచ్చకామర్ల రోగిలాగా ఇప్పుడు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు… గుంపుకడుతున్నాడు… ఆయన చెప్తున్న ఈ సిద్ధాంతం చెల్లుబాటు కాదనేది తెలిసి కూడా గందరగోళం సృష్టిస్తున్నాడు.

సికాస తరుపున మేము చికాగో అమరుల రక్తంతో మొదలైన ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ కార్మికుల హక్కుల సాధనలో ముందుకు సాగుతామని మరోసారి తెలియజేస్తున్నాము. అమరుల త్యాగాలపైన ఏ మాత్రమైనా గౌరవం ఉంటే తప్పుడు ఆలోచనలు, విధానాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి, ద్రోహం తలపెడుతున్న నీవు కనీసం అమ్మ మధురమ్మకు ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రకటించుకున్న నీ వీలునామా మరచి నీవు అమ్మకు కూడా ద్రోహం చేస్తున్నావు.

అశోక్
కార్యదర్శి
సింగరేణి కార్మిక సమాఖ్య (సి.కా.స)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad