Menu

కగార్‌లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్‌

anadmin 2 weeks ago 0 696

ఇప్పుడు అర్థమైంది కదా? సందేహాలన్నీ తీరాయి కదా? మనుషులు జడుసుకొనే ఆ నవ్వు చూశాక బోధ పడింది కదా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఆలింగనం చేసుకోవడం ఒక్కటే తక్కువ. ఉమ్మడి లక్ష్యం నెరవేర్చిన తన్మయాన్ని ఆ దంపతుల కళ్లలో మీరు గమనించారు కదా? ప్రభుత్వ పురస్కారంగా పుష్పగుచ్ఛం అందుకుంటున్నప్పుడు వాళ్ల కళ్లలోని ముందస్తు దీపావళి మతాబులకు ఈ లోకమే చీకట్లపాలై మీరు కంగారుపడిపోయి ఉంటారు కదా?


విప్లవం అంతే. మామూలు మనుషులను మహోన్నత మానవీయులను చేస్తుంది. ఎప్పటికైనా అలాంటి మానవులతో ఈ జగత్తు తేజోవంతమవుతుందనే నిండు భరోసాను ఇస్తుంది. అయితే ఈ దారి అంత సులభం కాదు. మధ్యలో భీతిల్లిపోయే, విశ్వాసం సన్నగిల్లిపోయే దారుణాలు జరుగుతాయని, అవి బైటి నుంచే గాక లోపలి నుంచీ జరుగుతాయని దిటవు గుండెలతో నిలబడాలని హెచ్చరిస్తుంది. విప్లవ పథం ఎంత కఠినమైనదో తెలుసుకోకుండా ముందుకు పోలేరని చాటడానికే మల్లోజుల వేణుగోపాల్‌లాంటి హేయమైన మనుషులు తారసపడే అనుభవాన్ని చరిత్ర అప్పుడప్పుడూ ముందుకు తెస్తుంది. మల్లోజుల కోటేశ్వరరావు మొదలు వేల మంది అజరామర విప్లవ వీరుల గురించి వినీ, చదివీ, రాసీ, కలిసి పని చేసీ, వారి స్పర్శతో మధురానుభూతిని పొందిన ఈ దేశ ప్రజలు ఈ విషపు నవ్వును కూడా చూడవలసి వచ్చింది.


ఇది తప్పించుకోలేనిదే కావచ్చు. రేపో ఎల్లుండో ఇలాంటిదే మురుగు కాలువ సలసల ప్రవహించే ఇంకో సన్నివేశం మనకు ఎదురు కావచ్చు. ఒకరకంగా ఇంత బాహాటంగా, నిస్సిగ్గుగా, జుగుప్సాకరంగా, హేయంగా వేణుగోపాల్‌ లొంగిపోవడం మేలే అయినది. విప్లవం నుంచి ఎవరైనా తిరిగి రావచ్చు. ఎవరో వెళ్లమంటే వాళ్లు వెళ్లలేదు. అలసటతోనో, అనారోగ్యంతోనో, ఇక చాల్లే.. అనుకొనో ఇంటికి రావచ్చు. దాన్ని ఎవ్వరూ ఏమనడానికి లేదు. ఎప్పుడైనా వాళ్ల గురించి తలచుకుంటే విప్లవానికి వాళ్లు చేసిన దోహదాలో, విప్లవంలో వాళ్లు చేసిన సాహసాలో, అనుభవించిన కష్టాలో, చేసిన అద్భుత నిర్మాణాలో గుర్తుకు వస్తాయి. సగౌరవంగానే వాటిని గుర్తు చేసుకుంటాం. కానీ వేణుగోపాల్‌ ఈ తరహా కాదు. ఈ మినహాయింపుకు అర్హుడు కాదు. ఆయన తాను అలసిపోయి ఆయుధం వదిలేసి ఇంటికి వద్దామనుకోలేదు. అందరితో ఆయుధం అవతల పారేయించాలనుకున్నాడు. దీని కోసం చాలా కథలు చెప్పాడు. ‘పరితాప హృదయంతో’ ప్రజలకు బోలెడు కబుర్లు చెప్పాడు. విప్లవోద్యమం చాలా కాలంగా ముందుకు పోవడం లేదని ఆవేదన వెళ్లబుచ్చాడు. దాన్ని ముందుకు తీసుకపోవడానికి పార్టీ కమిటీల్లో చర్చలు చేశానని రాసుకున్నాడు. వాళ్లు అవేవీ వినలేదని ఫిర్యాదు చేశాడు. విప్లవోద్యమాన్ని కాపాడుకోడానికే తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అవసరం అని నమ్మించాలని చూశాడు. పోరాట విరమణ కూడా విప్లవానికే అని, సరికొత్త విప్లవ పంథా రూపకల్పనకే అని వాదించాడు.

అవేవీ నిజం కాదని మరెవరో రుజువు చేయనక్కరలేకుండా తానే చాటిచెప్పుకున్నాడు. విప్లవోద్యమానికి ఆయన దగ్గర ఇంకే పంథా లేదని చాటుకున్నాడు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వాధినేతకు తుపాకీ అప్పగించి, తనకు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చాననే పరమానందభరితంగా, నోరార నవ్వులు చిందిస్తూ ఆయన పక్కన నిలబడ్డతీరు ఒకానొక దృశ్యం మాత్రమే కాదు. అందులో అనేకానేక అర్థాలు ఉన్నాయి. విషపు వెల్లువలున్నాయి. ఒక పెద్ద దృశ్యంలో అల్లుకపోయిన రేఖలు ఉన్నాయి. వాటికి ముందుస్తు వ్యూహ గమనాలు ఉన్నాయి. ఒప్పందాలు ఉన్నాయి. అన్నీ కలిసిన పరిపూర్ణ చిత్రమే ఇవాళ(15.10.2025) ఉదయం గడ్చిరోలిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో మల్లోజుల లొంగుబాటు దృశ్యం.

అందుకే ఆయన లేవదీసిన ‘తాత్కాలిక సాయుధ పోరాట విరమణ’ అనేది కగార్‌ అణచివేత అనే ఫాసిస్టు వ్యూహంలో భాగం.


ఇప్పటికీ ఇంకా ఎవరైనా ఆయన విప్లవానికి కొత్త సిద్ధాంతాన్ని తయారు చేస్తున్నాడని అనుకుంటున్నారా? మావోయిస్టు ఉద్యమానికి కొత్త పంథా రచిస్తున్నాడని భ్రమలో ఉన్నారా? ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’ అని రాసిన ఆరు పేజీల్లో, పార్టీ కేడర్‌కు రాసిన ఇరవై రెండు పేజీల్లోని పరమ అసంగత, అబద్ధ, అసంబద్ధ వాక్యాల, ప్రతిపాదనల, నిర్ధారణల వెనుక కనీసం నాలుగు అక్షరాలైనా సమంజసంగా ఉండవా? అని వెతుక్కుంటున్నారా? ఇరవై ఏళ్ల దారుణ నిర్బంధంలో, చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకున్న విప్లవోద్యమం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులకు, సవాళ్లకు కేంద్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా ఆయన పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేశాడని ఇప్పటికీ నమ్ముతున్నారా? విప్లవోద్యమం ముందు నిస్సందేహంగా అనేక సవాళ్లు ఉన్నాయి. అవన్నీ పంథా వల్లనే వచ్చాయనే పండితులూ ఉన్నారు. మావోయిస్టులు మారాలని కోరుకొనేవాళ్లూ, తాము కోరుకున్నట్లు మారలేదని ఈసడించుకొనే వాళ్లకూ కొదువ లేదు. దీని కోసం తోచినట్లు మార్క్స్‌ను, లెనిన్‌ను ఉటంకించేవాళ్లకు అడ్డూ ఆపూ లేదు.

సరిగ్గా మల్లోజుల వేణుగోపాల్‌ కూడా మావోయిస్టు ఉద్యమాన్ని మార్చేద్దామని అనుకున్నాడు. నిజంగానే ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి బైటపడ్డానికి కాదు. తనతోపాటు యావత్‌ ఉద్యమాన్ని సరండర్‌ చేయడానికి. విప్లవోద్యమం కూడా తన ఆచరణను, అందులోని ఇబ్బందులను వాస్తవ పరిస్థితుల ఆధారంగా పరిశీలించుకుంటూ ఉంటుంది. ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. గత ఇరవై ఏళ్లుగా సాగుతున్న యుద్ధం వల్ల ఆ పని సరిగా జరగకపోవచ్చు. అంత మాత్రాన పంథా తప్పయిపోదు. గడ్డు పరిస్థితి నుంచి బైట పడ్డానికి ఉద్యమంలో నిరంతర సమీక్షలు ఉంటాయి. అలాంటి చర్చలు, అన్వేషణలు, సంఘర్షణలు ఉన్నందు వల్లనే విప్లవ నిర్మాణం సజీవంగా, సృజనాత్మకంగా పని చేస్తుంది. దాని ముందున్న సవాళ్ల లోంచి కొన్ని మాటలు ఉటంకించి, కొన్ని చర్చలను ప్రస్తావించి తానేదో విప్లవోద్యమాన్ని బాగు చేయదల్చుకున్నట్లు, ముందుకు తీసుకపోదల్చుకున్నట్లు మల్లోజుల ప్రకటించుకున్నాడు. విప్లవోద్యమాన్ని పూర్తిగా ఆపేసి, ఆ తర్వాత ఎప్పుడో ముందుకు తీసుకపోతానని చెబితే నవ్వులపాలవుతాననే భయం కూడా లేని బరితెగింపు ప్రదర్శించాడు.

ఆయన మాటల్లో పిసరంత నిజముంటే ఇంత హేయమైన లొంగుబాటుకు బీజేపీతో చేతులు కలిపేవాడే కాదు. విరమణ పేరుతో ఇంత రాజకీయ, నైతిక పతనం చెందాక ఆయనను ఏ ప్రజలు అంగీకరిస్తారు? ఎవరు దగ్గరికి రానిస్తారు? ఇంటికి వచ్చి సుఖంగా జీవించదల్చుకుంటే కొంచెం మర్యాద కాపాడుకొనేవాడు. మనిషి కాబట్టి ఆత్మగౌరవం కొంచెమైనా ఉంచుకొనేవాడు. మావోయిస్టు పార్టీ పంథా తప్పే అయితే, దాన్ని లోపల ఉండి సవరించే అవకాశమే లేకుంటే, బైటికి వచ్చి ప్రత్యామ్నాయ పంథాలో పోరాటమే చేయదల్చుకుంటే కొంచెమైనా సిగ్గును నిలబెట్టుకొనేవాడు. ఆయన ఇవేవీ చేయదల్చుకోలేదు. ఇవేవీ అవసరం అనుకోలేదు. ఆయన ఆపరేషన్‌ కగార్‌లో భాగమయ్యాడు. అదీ అసలు కథ. చెప్పుకోడానికి బాధగా ఉండవచ్చు. దు:ఖంగా ఉండవచ్చు. ఏమిటిది? అత్యున్నత ఆదర్శాలకు, విలువలకు, శాస్త్రీయ రాజకీయ సిద్ధాంతాలకు, వీటన్నిటికీ తిరుగులేని ప్రజాశక్తిని అందించే వర్గపోరాటంలోని త్యాగాలకు చిరునామా అయిన మావోయిస్టు ఉద్యమం అత్యున్నత స్థాయి నుంచి ఈ విష పురుగు ఎలా తొలుచుకొని వచ్చిందనే ప్రశ్న దిగ్భ్రాంతి కలిగిస్తుంది. కానీ నిజం. ఒకసారి చైనా విప్లవ నవల ‘ఎర్ర మందారాలు’ చదవండి. మల్లోజుల వేణుగోపాల్‌లాంటి క్రూరమైన వ్యక్తులు చైనా విప్లవంలో, రష్యా విప్లవంలో కనిపిస్తారు. వివరాల్లో తేడాల కోసం, పోలికల్లో దూరాల కోసం వెతికి అలసిపోనవసరం లేదు. సారాంశం ఒకటే. ఇంత హింసాత్మక, క్రూరమైన సమాజాన్ని మానవీయంగా మార్చే పనిలో వర్గ సమాజం కల్లోలానికి గురై, యుద్ధపు తది అంచుల్లో తల్లడిల్లి, నవనీతంలాంటి కోటానుకోట్ల మానవులు తయారవుతారు. ఈ వర్గ పోరాటంలో వేణుగోపాల్‌ లాంటి వాళ్లూ తయారవుతారు. అత్యున్నత స్థానం నుంచి అథో లోకంలోకి వికృతంగా దిగజారిపోతారు.


2024 జనవరి 1 నుంచి కగార్‌ నష్టాలకు ప్రజాస్వామికవాదులు, విప్లవాభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఉద్యమం ఎంత నష్టపోయిందో అని కంగారు పడ్డారు. ఇంతగా చుట్టుముట్టు నిర్మూలనా యుద్ధంలో తట్టుకొని నిలబడేనా? అనే సంశయానికి లోనయ్యారు. కానీ మనకంటే రాజ్యానికే సరైన అంచనా ఉంటుంది. ఇంత చేసినా, ఇంత మందిని చంపేసినా, ఆఖరి గడువు దగ్గరపడుతున్నది కానీ తను లక్ష్యానికి సదూరంగానే ఉన్నానని అమిత్‌షాకు తెలుసు. విప్లవాన్ని తుపాకులతో, ఎర్ర సైనికుల సంఖ్యతో, ఉద్యమ ప్రాంతాల విస్తరణతో చూసి రాజ్యం సరిపెట్టుకోదు. ఆ ప్రమాణాలతోనే విప్లవోద్యమ బలాన్ని అంచనా వేయదు. తుపాకులతో, యుద్ధ శకటాలతో, వైమానిక దాడులతో నిత్యం దాడులు చేసే రాజ్యం వాటి మీద మాత్రమే ఆధారపడదు.

శవంపడితే వేలాదిగా గుమ్మిగూడి దు:ఖించడంలో, ఎర్రజెండాల ఊరేగింపులో, మావోయిస్టు పార్టీ వర్థిల్లాలనే ఉద్విగ్నభరిత నినాదాల్లో, అనేక ఆటుపోట్ల మధ్యనే ఆ పార్టీ ఎంచుకున్న దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాకు దొరుకుతున్న సిద్ధాంత సమర్థనల్లో, హేతుబద్ధ నిరూపణల్లో, ప్రజా జీవితంలోని అనుకూలతలో విప్లవోద్యమ బలాన్ని అమిత్‌షా పసిగట్టగలడు.

బైటి నుంచి ఎన్ని లక్షల సైనిక బలగాలు దాడి చేసినా, అదనంగా కశ్మీర్‌ నుంచి సైనికులను దించినా, ఎన్ని వందల మందిని చంపేసినా విప్లవోద్యమాన్ని నిర్మూలించలేమని రాజ్యానికి తెలుసు. ఆఖరి మావోయిస్టు తుది శ్వాస కోసం తన నిరీక్షణ నిజం కాదని అంతకంటే ఎక్కువ తెలుసు. లోపలి నుంచి మరో యుద్ధాన్ని నడపకుండా అభేద్యమైన విప్లవోద్యమ కేంద్రాన్ని, ప్రాణ ప్రదమైన పంథాను, దానిపట్ల ఈ దేశ ప్రజలకుండే చారిత్రక విశ్వాసాన్ని దెబ్బతీయలేనని తెలుసు. విప్లవ పంథా తప్పని, ఇన్ని దశాబ్దాలుగా ఆచరించిందంతా అతివాదమని, రాజకీయాలు లేని సైనిక కలాపమని, పార్టీ అంతా సైన్యంగా మారిందని, ప్రజలకు దూరమయ్యామని, పార్టీది అంతా మిడిమిడి జ్ఞానమని లోపలి నుంచి అధినాయకుడు కూటవాదన లేవదీస్తే తప్ప విప్లవోద్యమాన్ని దెబ్బతీయలేనని తెలుసు.

కగార్‌ సైనిక యుద్ధమే కాదు, అదొక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక యుద్ధమని విప్లవోద్యమం మొదటి నుంచి చెబుతున్న మాట నిజమైంది.

విప్లవోద్యమం అనన్య త్యాగాలతో సంపాదించుకున్న ఆయుధాల్లో తనకు ఇచ్చిన తుపాకీని మల్లోజుల వేణుగోపాల్‌ ఈ రోజు రాజ్యానికి అప్పగించడమే మనం చూశాం కాని, ఆయన ఎప్పుడో రాజ్యం చేతిలో ఆయుధమయ్యాడు. ఇప్పటికీ మనకు తెలియాల్సిన వివరం ఒక్కటే. ఇదెలా జరిగింది అని. స్వచ్ఛందమా? బలవత్తరమా? ప్రలోభమా? ఎప్పుడు ఎలా మొదలై, ఈ రోజు దాకా ఎట్లా సాగింది? అనేది మాత్రమే. ఏదైనా సరే. విప్లవోద్యమ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విద్రోహం.

అందుకే వేణుగోపాల్‌ లేవనెత్తిన విప్లవోద్యమ సవాళ్ల సమీక్ష, ఉత్పత్తి సంబంధాల చర్చ, విప్లవోద్యమాన్ని ముందుకు తీసికెళ్లడానికే సాయుధ పోరాట విరమణ అనే వాదన అంతా సారాంశంలో ఆపరేషన్‌ కగార్‌లో భాగం. బైటి నుంచి నుంచి సాయుధంగా నిర్మూలనా యుద్ధం, లోపలి నుంచి సాయుధ పోరాటానికి కాలం కాదనే విరమణ వాదం జమిలిగా సాగుతున్నాయి. ఇరవై నెలల్లో ఆపరేషన్‌ కగార్‌ అనే అంతర్యుద్ధం విప్లవోద్యమం మీద ఈ వికృత అంతర్గత యుద్ధ రూపంగా ఎదిగింది. రక్తపాతానికన్నా, మానవ హననానికన్నా అత్యంత దుర్భరమైన హింస ఇది. ఈ చుట్టుముట్టు యుద్ధం వల్ల కొందరు కార్యకర్తలను, ఒక స్థాయి నాయకులను మల్లోజుల వేణుగోపాల్‌, తక్కెళ్ల వాసుదేవరావు మాటలు ప్రభావితం చేసి ఉండవచ్చు. తమ అధినాయకత్వంతో వారు దారి మళ్లించి కూడా ఉండవచ్చు. బలవంతపు సరెండర్లలో పోలీసుల్లాగే వీళ్లూ వ్యవహరించి ఉండవచ్చు. ఇదీ కగార్‌లోని కోణమే.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad