Menu

అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

anadmin 1 week ago 0 348

కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తూ మా పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులను, పార్టీ కార్యకర్తలను హత్యచేయడానికి వ్యతిరేకంగా అక్టోబర్ 18 నుండి 23 వరకు నిరసన వారాన్ని పాటించండి, అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా బంద్ ను విజయవంతం చేయండి.

నారాయణ్ పుర్ జిల్లాలోని మాడ్, బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్క్, కర్రెగుట్ట ప్రాంతాల్లో, సుక్మా జిల్లాలో, పశ్చిమ సింగ్ భుమ్ జిల్లాలో, ఒడిశాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదున్నర్ నెలల పాటు కొనసాగించనున్న కగార్ యుద్ధ
నిలిపివేతను డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గరియబంద్ జిల్లాలోని బాలుడిగ్గీ పరిసర అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 11 నాడు చుట్టివేత (ఎన్ సర్కిల్ మెంట్) దాడిని నిర్వహించి మా పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ మనోజ్ (మోడెం బాలక్రిష్ణ)ను, ఒడిశా రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ విజయ్ (చంద్రహాస్ ను వారిద్దరితో పాటు 10 మంది మా పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులను హత్య చేసాయి. సెప్టెంబర్ 11 – 20 మధ్య కేంద్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీలు మా పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్స్ కోస (కడారి సత్యనారాయణ రెడ్డి), రాజు (కట్టా రామచంద్రారెడ్డి)లను రాయ్ పుర్, బిలాస్ పుర్ పట్టణాల్లో అరెస్టు చేసి, క్రూరమైన చిత్రహింసల పాల్లేసి సెప్టెంబర్ 22 నాడు నారాయణ్ పుర్ జిల్లా, మాడ్ ప్రాంతంలోని నేలంగూర్ వద్ద హత్య చేసాయి. కామ్రేడ్స్ కోస, రాజులిద్దరూ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఉద్యమ నిర్మాణం కోసం నిరాయుధంగా పట్టణాల్లో వుండి విప్లవ కృషి చేస్తుండినారు. వారిని అరెస్టు చేసిన ప్రభుత్వాలు, వారిని కోర్టుకు హాజరుపర్చకుండా హత్యచేసాయి. సెప్టెంబర్ 12 నాడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ విజయ్, ఆర్.కే.బీ. డివిజనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ లోకేష్ లను నిరాయుధంగా పట్టుకుని బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యచేసాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి హజారీబాద్ జిల్లాలో సెప్టెంబర్ 14 నాడు చుట్టివేత దాడిని నిర్వహించి మా కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ అనూజ్ (సహదేవ్ సోరేన్) ను, తూర్పుబిహార్ – ఈశాన్య ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు కామ్రేడ్ రఘునాథ్ హేంబ్రంను, వీరిద్దరితో పాటు మరో ఇద్దరిని హత్యచేసాయి. ఈ హత్యలకు వ్యతిరేకంగా అక్టోబర్ 18-23 వరకు దేశవ్యాప్తంగా నిరసనవారాన్ని, 24 నాడు బంద్ ను పాటించాల్సిందిగా దేశ ప్రజలందరికి పిలుపునిస్తున్నాం.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్రప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని ‘వికసిత్ భారత్’గా (అభివృద్ధి చెందిన దేశంగా) అభివృద్ధి చేసే పేరుతో ‘కార్పొరేట్ హిందూ దేశంగా మార్చే దుష్టపథకాన్ని రూపొందించుకుంది. ఈ దేశద్రోహకర, ప్రజావ్యతిరేక దుష్టపథకపు అమలుకు ప్రధాన అడ్డంకి మా పార్టీ – భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకత్వంలో సాగుతున్న విప్లవోద్యమమే. కాబట్టి మా పార్టీని, దేశవ్యాప్త విప్లవోద్యమాన్ని నిర్మూలించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంలో గత 22 నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది విప్లవకారులను, పోరాట ప్రజానీకాన్ని హత్యచేసాయి. మిగిలిన కేంద్రకమిటీ సభ్యులను, వివిధ రాష్ట్రాల్లోని విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్రకమిటీ సభ్యులను, పార్టీ, ప్రజావిముక్తి గెరిల్లా సైన్యానికి (పీ.ఎల్.జీ.ఏ.కు) చెందిన యావత్తు విప్లవకారులను 31 మార్చి, 2026 నాటికి నిర్మూలిస్తామని దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర పోలీసుమంత్రులు పదే పదే బహిరంగంగా బెదిరింపు ప్రకటనలు చేస్తున్నారు. ఇది దేశంలోని దోపిడీ వర్గాలు రాసుకున్న రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించే, బేఖతరు చేసే రాజ్యాంగ వ్యతిరేక భాష. అంతేకాకుండా ‘భారత్ మంతన్’ తదితర పేర్లతో ఢిల్లీలో, తదితర పట్టణాల్లో సదస్సులు నిర్వహిస్తూ, సాయుధ నక్సలైట్ల నిర్మూలన తర్వాత ‘అర్బన్ నక్సలైట్ల (పట్టణ ప్రాంతాల్లోని నక్సలైట్ల)ను అంతం చేస్తామని కూడా ప్రకటిస్తున్నారు. అంటే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేటీకరణను, సైనికీకరణను, హిందుత్వను వ్యతిరేకించే వారందరిపై ‘అర్బన్ నక్సలైట్ల’ ముద్రవేసి ప్రజాపక్ష మేధావులందరినీ అంతం చేసే భయంకరమైన పరమ ఫాసిస్టు వ్యూహత్మక పథకపు అమలుకు పూనుకున్నాయి. మరోవైపు ‘విపక్ష ముక్త్ భారత్’ (ప్రతిపక్ష రహిత భారత్) ను ఏర్పాటు చేయడానికి 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షకాల సమావేశంలో ప్రవేశపెట్టింది. దోపిడీ వర్గాలు రూపొందించుకున్న రాజ్యాంగాన్ని సైతం మార్చివేసి ఆధునిక మనుస్మృతిని దేశ రాజ్యాంగంగా మార్చే ప్రయత్నాల్ని ఆర్ఎస్ఎస్-బీజేపీలు వేగవంతం చేసాయి. మధ్యప్రదేశ్ ఖజురహో దేవాలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని వేసిన పిటిషన్ పై 6 అక్టోబర్ నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తున్నాననే పేరుతో హిందుత్వ భావజాల న్యాయవాది ఒకడు ఆయనపై బూటు విసిరి వేసాడు.

హర్యాణా రాష్ట్రంలోని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పోలీసు ఉన్నతాధికారులు తనను దీర్ఘకాలంగా చేస్తున్న వేధింపులను తట్టుకోలేక రాష్ట్రంలో అదనపు డీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు రానున్న రోజుల్లో దళితులపై, ఆదివాసులపై, వెనకబడిన తరగతులకు, ఆ వర్గాలకు చెందిన ఉద్యోగస్తులపై, ఉన్నతాధికారులపై హిందుత్వ మనువాదులు తీవ్రతరం చేయనున్న దాడులకు సంకేతాలు మాత్రమే. మరోవైపు, అమర్ నాథ్ యాత్ర రక్షణ కోసం మోహరించిన సీ.ఆర్.పీ.ఎఫ్.కు చెందిన 80 శాతం బలగాల్ని, ఉత్తర భారతంలో మోహరించిన సీ.ఆర్.పీ.ఎఫ్.కు చెందిన గణనీయమైన బలగాల్ని ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో మోహరించి రానున్న ఐదున్నర నెలల్లో దండకారణ్యంలోని నారాయణ్ పుర్ జిల్లాలోని మాడ్, బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్క్, కర్రెగుట్ట ప్రాంతాల్లో, సుక్మా జిల్లాలో, ఝార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ్ సింగ్ భుమ్ జిల్లాలో, ఒడిశాలోని విప్లవోద్యమ ప్రభావిత జిల్లాల్లో విప్లవకారులను, పోరాట ప్రజానీకాన్ని భారీ సంఖ్యలో నిర్మూలించే దుష్టపథకపు అమలు ప్రారంభమైంది.

ఈ స్థితిలో కగార్ యుద్ధ నిలిపివేతను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే ‘వికసిత్ భారత్’ నిర్మాణం పేరుతో దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి ఆర్ఎస్ఎస్-బీజేపీలు వాటి నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని విశాల ప్రజానీకంపై, ప్రతిపక్ష పార్టీలపై, ప్రజాపక్ష మేధావులపై, ప్రజాపక్ష సంఘాలపై, సంస్థలపై సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా, వాటికి ప్రతిఘటనగా దేశవ్యాప్తంగా విశాల ప్రజా ఉద్యమాన్ని, ప్రజా ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది.

ఈ స్థితిలో, సెప్టెంబర్ నెలలో మా పార్టీకి చెందిన నలుగురు కేంద్రకమిటీ సభ్యులను, రాష్ట్రకమిటీ సభ్యులను, పార్టీ కార్యకర్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్యచేయడానికి వ్యతిరేకంగా అక్టోబర్ 18 నుండి 23 వరకు దేశవ్యాప్తంగా నిరసనవారాన్ని, అక్టోబర్ 24 నాడు దేశ వ్యాప్త బంద్ ను పాటించాల్సిందిగా యావత్తు దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. నిరసనవారంలో భాగంగా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో గ్రూపు మీటింగులు, సభలు, సదస్సులు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు వగైరా రూపాల్లో నిరసనను తెలియజేయాల్సిందిగా విశాల ప్రజలకు (పీడిత వర్గాల, పీడిత సాంఘిక సముదాయాల, పీడిత జాతుల) విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే, రానున్న ఐదున్నర‌ నెలల్లో నారాయణ్ పుర్ జిల్లాలోని మాడ్, బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్, కర్రెగుట్ట ప్రాంతాల్లో, సుక్మా జిల్లాలో, ఝార్ఖండ్ పశ్చిమ సింగ్ భుమ్ జిల్లాలో, ఒడిశా రాష్ట్రంలోని విప్లవోద్యమ ప్రభావిత జిల్లాల్లో కేంద్రీకరించి సాగనున్న కగార్ యుద్ధాన్ని నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విశాల ప్రజా ఉద్యమాన్ని, ప్రజా ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించి, కొనసాగించాల్సిందిగా దేశంలోని విశాల ప్రజానీకానికి, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలకు, సీపీఐ, సీపీఎం వామపక్ష ప్రతిపక్ష పార్టీలకు, దళిత, ఆదివాసీ, వెనకబడిన తరగతులకు చెందిన ప్రజాసంఘాలకు, సంస్థలకు, మహిళా సంఘాలకు, ప్రగతిశీల శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

విప్లవాభినందనాలతో,
అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad