ఇవాళ, అక్టోబర్ చలికాలపు వేళ, బస్తర్ లో రెండు వందల యాబై మంది నక్సల్ యోధులు తమ ఆయుధాలను రాజకీయ నాయకులకు, పోలీసులకూ అప్పగించారు. రెండు రోజుల కింద ఒక సీనియర్ నక్సల్ నాయకుడు వేణుగోపాల్ తన తుపాకిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టాడు. అందుకు బదులుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఒక రాజ్యాంగ ప్రతిని నక్సల్ నాయకుడికి చేతికి అందించాడు. ఆ నక్సల్ నాయకుడి కన్న ఆ రాజ్యాంగ ప్రతి ఆ ముఖ్యమంత్రికే ఎక్కువ అవసరం గదా అని నాకనిపించింది. ఎందుకంటే, కొద్ది నెలల కిందనే ఫడ్నవీస్ దొంగదారి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మహారాష్ట్రలో మాల్షిరాస్ అనే గ్రామంలో ప్రజలు తప్పుడు ఈవీఎమ్ ప్రకటించిన ఫలితాన్ని తిరస్కరించి, తాము మళ్లీ బ్యాలట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించినప్పుడు ఈ ముఖ్యమంత్రి అక్కడ పోలీసులను మోహరింపజేసి, కర్ఫ్యూ విధించి, గ్రామస్తుల మీద కేసులు పెట్టించాడు.
చాలా సంవత్సరాల కింద బస్తర్లో ఒక నక్సల్ నాయకుడితో జరిగిన చర్చలో ప్రజా ఉద్యమాల్లో హింసకూ అహింసకూ మధ్య పోటీ గురించి ఆయన నన్ను అడిగాడు: “మీరు అహింసాయుతంగా పోరాడుతారు గదా – మీరేమి సాధించారు? మేధా పాట్కర్ ఏమి సాధించారు? మీరు పోరాడినప్పటికీ నర్మదా ఆనకట్ట కట్టారు. ప్రజలను నిర్వాసితులను చేశారు” అని. నాకు కోపం వచ్చింది. ఆవేశపడ్డాను. “మరి మీరు తుపాకులతో ఏమి సాధించారు?” అని ఎదురు ప్రశ్న వేశాను. ఏది ఏమైనా, ఆ రాత్రంతా మేము కలిసే ఉన్నాం. కలిసి తిన్నాం. మర్నాడు ఆత్మీయంగా ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకున్నాం.
ఆ చర్చలో ఇద్దరమూ కూడా మా నిస్పృహలనే వెల్లడించామనుకుంటాను. అందుకే ఇద్దరమూ అవతలి వాళ్లు తప్పు అని రుజువు చెయ్యడానికి ప్రయత్నించాం. వాస్తవమేమంటే సామాజిక మార్పు కోసం జరిగే పోరాటాలు పెద్ద లక్ష్యాల కోసం, ఆశయాల కోసం జరుగుతాయి. కొన్ని తరాల పాటు త్యాగాలతో కూడిన సుదీర్ఘ క్రమం తర్వాత మనం ఒక ప్రత్యేకమైన చోటికి చేరుతాం. చాలాసార్లు మనం ఊహించిన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించలేం. కాని ఆ పోరాట క్రమమే సమాజంలో ఎన్నో సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
ఉదాహరణకు, నర్మదా బచావో ఉద్యమం, ఆనకట్ట నిర్మించకుండా ఆపలేకపోయినప్పటికీ, అది ప్రపంచవ్యాప్తంగా భారీ ఆనకట్టల నిర్మాణం గురించి పునరాలోచనా క్రమాన్ని ప్రారంభించింది. అందువల్లనే కొన్ని విజయవంతమైన ఉద్యమాలు కొన్ని నదులు స్వేచ్ఛగా ప్రవహించేలా చేశాయి. ఎన్నో భారీ ఆనకట్టలు కట్టకుండా ఆపగలిగాయి. జలచర జీవజాతులను రక్షించాయి.
అదే విధంగా, నక్సలైటు ఉద్యమం వల్లనే స్త్రీల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద భూస్వాముల పీడన కొంతవరకు తగ్గింది. ప్రభుత్వాలు భూసంస్కరణ చర్యల గురించి ఆలోచించవలసి వచ్చింది. తునికాకు కార్మికుల కూలీ రేట్లు పెరిగాయి.
నక్సల్స్ ఎవరు, వారు ఎందుకు ఆయుధాలు చేపట్టారు అనే విషయాలు కొత్త తరం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వం మనకు చెపుతున్నట్టుగా నక్సల్స్ దేశద్రోహులా? కాదు. వారు దేశద్రోహులు ఎంతమాత్రమూ కాదు. సమాజం నిండా వ్యాపించి ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా మనలో కొందరం పోరాడుతుంటాం. మనలో కొందరు ఆ అన్యాయం చూసి మరింత ఆందోళన పడి, అసంతృప్తి చెంది, ఆ అన్యాయానికి ముగింపు పలకాలంటే పీడకుల దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకుని, పీడకుల దుర్మార్గాన్ని ఎదుర్కోవలసిందే అనుకుంటారు. అంటే నక్సల్స్ మనకన్నా ఎక్కువ దేశభక్తులు అని కూడా అనవచ్చు. ఎందుకంటే వారు ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
భారతదేశం స్థితి చూడండి: దేశంలోని దళితులలో ఎనబై శాతం మందికి భూమి లేదు. అందువల్ల వారు నిరుపేదలుగా ఉన్నారు. అది సామాజిక ఆర్థిక స్థితి. వారు తమ కులం వల్ల పేదరికంలో ఉన్నారు. ఈ పేదరికం వల్ల దళితులు మరింతగా పీడనకూ దోపిడీకీ గురవుతారు. ఇవాళ్టికీ దేశంలో ప్రతిరోజూ సగటున పన్నెండు మంది దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులు ఏ ఒక్కరినైనా అసంతృప్తికి, అశాంతికి గురి చేయకపోతే, అసలు వారికి సమాజం పట్ల ఏమైనా పట్టింపు ఉన్నదా అని మనం అనుమానించాలి. భూమిహీనత, దారిద్ర్యం, అందువల్ల భారత రాజకీయ వ్యవస్థలో దళితులు బలహీనంగా ఉండడం, కార్మికుల మీద పెట్టుబడిదారీ దోపిడీ, స్త్రీల మీద పితృస్వామ్య పీడన, అసమాన స్థితి – ఈ సమస్యలన్నీ ఎన్నో రాజకీయ ఉద్యమాలకు దారి తీస్తున్నాయి. గాంధేయవాదులు, వామపక్షవాదులు, అంబేడ్కర్ వాదులు ఆ ఉద్యమాలను ముందుకు తీసుకుపోతున్నారు.
సమాజంలో ఉన్న పీడనకు వ్యతిరేకంగా పోరాడి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించినవారు చాలా మంది స్వానుభవంతో తెలుసుకున్నదేమంటే, బలవంతులుగా ఉన్న పీడకుల చేతుల్లో ఆయుధాలున్నాయి, గూండాలున్నారు, రాజ్యం ఉంది. సమాజాన్ని మార్చదలచుకున్నవారి మీద ఆ ఆయుధాల, గూండాల, రాజ్యం సహాయంతో వాళ్లు దాడులు చేస్తారు, చంపుతారు, జైళ్లలో నిర్బంధిస్తారు. కనుక మనం ఈ సాయుధ పీడకుల మీద పోరాడాలంటే, మన దగ్గరా ఆయుధాలుండాలి.
భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ దగ్గరా పెద్ద ఎత్తున ఆయుధాలున్నాయి. ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీల దగ్గర అందరికన్నా ఎక్కువ ఆయుధాలున్నాయి. కనుక నక్సల్ పార్టీ ఒక్కటే సాయుధమైనదని అనడం వాస్తవికంగా సరైనది కాదు.
ఆ ఉద్యమాన్ని నక్సలైట్ ఉద్యమం అని అనడం ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో నక్సల్బరి అనే గ్రామంలో 1967లో జరిగిన తిరుగుబాటుతో అది మొదలయింది. అప్పుడు అక్కడ రైతాంగం భూస్వాములకు వ్యతిరేకంగా లేచి నిలిచారు. కాని తెలంగాణ ప్రాంతంలో, స్వాతంత్ర్యానికి ముందే రైతాంగ ఉద్యమాలు జరిగాయి. వాటితో పాటే బెంగాల్ లో తెభాగా ఉద్యమం కూడా భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా శక్తిమంతమైన రైతాంగ పోరాటంగా జరిగింది.
స్వతంత్ర భారతదేశంలో గాంధీ హంతకుడు గాడ్సే తర్వాత, నానా ఆప్టే తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు దళిత రైతులు కిశే గౌడ, సిద్దరామయ్య ఒక భూస్వామిని చంపి, ఆయన భూమిని భూమిలేని నిరుపేదలకు పంచినందుకు మరణశిక్షకు గురయ్యారు. (రచయిత హిమాంశు కుమార్ ఇక్కడ రెండు పొరపాట్లు చేశారు. భూమయ్య, కిష్టాగౌడ్ ఇద్దరి పేర్లూ పొరపాటు రాశారు, అలాగే వారు ఆయన రాసినట్టు దళితులు కారు – అను.) అంటే భారత రాజ్యానికి దళిత రైతులే ప్రధానమైన సవాలుగా నిలిచారన్నమాట. ఈ ఉద్యమం నుంచి దళితులను వేరు చేయడానికే కాంగ్రెస్ 1971లో డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడం ప్రారంభించిందని భగత్ సింగ్ మేనల్లుడు, ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆ విగ్రహాలు గుండెల మీద రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, పార్లమెంటు వైపు వేలు చూపుతూ ఉంటాయి. అది ‘రాజ్యంతో పోరాడకండి, ఈ మార్గంలో వెళ్లండి’ అని దళితులకు సూచిస్తున్నదని జగ్మోహన్ సింగ్ అన్నారు.
ఆ తర్వాత, చాలా మంది ఆదివాసులు నక్సల్ ఉద్యమంలో చేరారు గనుక, దాన్ని ప్రాథమికంగా ఆదివాసీ ఉద్యమంగా చూడడం మొదలయింది. అయితే, బీహార్ లో నక్సల్ ఉద్యమం దళితులకు భూమి సంపాదించి పెట్టడంలో అద్భుతమైన కృషి చేసింది. ఆ తర్వాత ఎందరో దళిత కామ్రేడ్స్ ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారు.
ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల తర్వాత, 1991 తర్వాత, కార్పొరేట్ పెట్టుబడి భారతదేశపు ఆదివాసీ ప్రాంతాలలోని ఖనిజాలను కైవసం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకే ఆ ప్రాంతాలన్నిటా భద్రతా బలగాలని నింపివేశారు. తమ జల్ జంగల్ జమీన్ ను పరిరక్షించుకోవడానికి ఆదివాసులు ప్రారంభించిన పోరాటాన్ని నక్సల్ ఉద్యమం బలోపేతం చేసింది. చివరికి, ప్రభుత్వం వారితో చర్చలకు దిగివచ్చింది. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ పీపుల్స్ వార్, జనశక్తిలకూ మధ్య చర్చలు జరిగాయి. భూస్వాముల భూములను భూమిలేని నిరుపేదలకు పునఃపంపిణీ చేయాలనే డిమాండ్ ను అంగీకరించడానికి ప్రభుత్వం తిరస్కరించడంతో చర్చలు భగ్నమయ్యాయి. ఆ సమయంలోనే పీపుల్స్ వార్, పార్టీ యూనిటీ, ఎంసిసి విలీనం జరిగి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పడింది. ఒక సంవత్సరం తర్వాత, 2005లో మావోయిస్టులను తుడిచి పెట్టడానికి అనే పేరుతో, ఛత్తీస్ గడ్ లోని బిజెపి ప్రభుత్వం సాల్వా జుడుమ్ అనే సాయుధ చర్యలను ప్రారంభించింది. ఈ దాడిలో రాజ్యం ఆదివాసీ గ్రామాలను తగులబెట్టించింది. ఆదివాసీ మహిళల మీద సామూహిక అత్యాచారాలు చేయించింది. ఆదివాసులను హత్య చేయించింది. 2011లో సుప్రీం కోర్టు సాల్వా జుడుమ్ రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చినప్పటికీ ఈ దమనకాండ కొనసాగింది.
అప్పుడు నేను సహచరులతో కలిసి బస్తర్ లో ప్రభుత్వ సహకారంతో విద్యా, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి కల్పన వంటి గాంధేయ నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుతున్నాను. ఆదివాసుల మీద పాశవికంగా జరుగుతున్న మానవహక్కుల అణచివేతకు వ్యతిరేకంగా నేను గొంతెత్తగానే, బిజెపి ప్రభుత్వం నన్ను హత్య చేయించడానికి ప్రయత్నించింది. నేను నడుపుతుండిన పదహారు ఎకరాల గాంధేయ ఆశ్రమాన్ని 2009లో బుల్డోజర్లతో నేలమట్టం చేయించింది. నన్ను ఛత్తీస్ గడ్ నుంచి బహిష్కరించింది.
ప్రస్తుతం కేంద్రంలోనూ, ఛత్తీస్ గడ్ లోనూ బిజెపి అధికారంలో ఉంది. బిజెపి నిస్సంకోచంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పార్టీ. ఆదివాసీ ప్రాంతాలలో జల్ జంగల్ జమీన్ లను పెట్టుబడిదారులు దోచుకోవడానికీ, అమ్ముకోవడానికీ మార్గం సుగమం చేసేందుకు, వ్యతిరేకతను అణచివేసేందుకు, బిజెపి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 2026 మార్చ్ 31 నాటికి బస్తర్ నుంచి నక్సల్స్ ను పూర్తిగా నిర్మూలిస్తానని ప్రకటించాడు. గత రెండు సంవత్సరాలలో భద్రతా బలగాలు దాదాపు రెండు వేల మంది ఆదివాసులను, చిన్నపిల్లలను, స్త్రీలను, నక్సల్ కార్యకర్తలను చంపివేశాయి.
ఈ రక్తపాతానికి ముగింపు పలకడానికి, చాలా మంది నక్సల్ నాయకులు, యోధులు తామిక ఆయుధాలు వదిలి పెట్టి, ప్రజా సమస్యల మీద అహింసాయుత రాజకీయ ప్రక్రియల ద్వారా పని చేస్తామని ప్రకటించారు. ఆ కార్యక్రమం ఇంకా నడుస్తున్నది. అయితే, మావోయిస్టు పార్టీలో చాలా మంది ఆయుధాలు వదిలే నిర్ణయాన్ని అంగీకరించడం లేదు. ఆమరణాంతం పోరాడుతూనే ఉంటామని ప్రకటిస్తున్నారు.
ఇవాళ బస్తర్ టాకీస్ యూట్యూబ్ చానల్ లో జర్నలిస్ట్ వికాస్ తివారీతో మాట్లాడుతూ నక్సల్ నాయకుడు రూపేష్ తాము ఆయుధాలు విసర్జించాలని అనుకుంటున్నామని, ప్రజా సమస్యల మీద పని చేస్తామని అన్నాడు.
సమస్య ఏమంటే: ఇది సాధ్యమేనా? భారతదేశంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయాలు నడపవచ్చునా? బస్తర్ భూమిని అమిత్ షా అదానీకి అప్పగించాక ఈ నిరాయుధ నక్సల్ నాయకులు ప్రజాస్వామికంగా ఆదివాసీల నిరసనను సంఘటితం చెయ్యగలరా? దాన్ని అమిత్ షా సహిస్తాడా? ప్రతిపక్ష రహిత భారతదేశం కావాలని బిజెపి బహిరంగంగా ప్రకటిస్తుండగా, అది ఈ నక్సల్ భావజాలంతో ఉన్న నిరాయుధ కార్యకర్తలను బస్తర్ లో పని చెయ్యనిస్తుందా? మూలవాసి బచావో మంచ్ అనే ఆదివాసి యువకుల నిరాయుధ సంస్థను ప్రభుత్వం నిషేధించినప్పుడు, నిషేధ కారణాలుగా ప్రభుత్వాన్ని విమర్శించడం, వ్యతిరేకించడం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బిజెపి ని విమర్శించినందుకు జర్నలిస్టులను, న్యాయవాదులను, రచయితలను, ప్రొఫెసర్లను “అర్బన్ నక్సల్” అని ముద్రవేసి ఏళ్ల తరబడి జైలులో నిర్బంధించిన ప్రభుత్వం, తమను ప్రజల మధ్య పని చెయ్యడానికి అనుమతిస్తుందని ఇప్పుడు ఆయుధాలు వదిలిపెడుతున్న నక్సల్ నాయకులు ఎటువంటి ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదు.
కనుక ప్రశ్న ఏమంటే: సహజవనరుల లూటీనీ, నిరుపేదల దోపిడీనీ సవాలు చేసిన అంత శక్తిమంతమైన ఉద్యమమే ఓడిపోతే, ఇక వాస్తవంగా గెలిచేదెవరు? ప్రజాస్వామ్యం గెలిచింది అని బిజెపి ప్రభుత్వం అంటున్నది. కాని అసలు ఈ ప్రభుత్వమే వోట్ చోరీ మీద, చట్టవ్యతిరేకంగా ఏర్పడినది అయినప్పుడు, ఈ ప్రభుత్వపు విజయాన్ని ప్రజాస్వామ్య విజయం అని ఎవరు అనగలరు? పోనీ, ఈ నక్సల్ ఉద్యమ ఓటమి, భారత రైతాగపు విజయంగా మారిందా? కార్మికుల విజయంగా మారిందా? ఆదివాసీ మహిళల విజయంగా మారిందా? ఎంతమాత్రమూ కాదు – ఇది లూటీ చేయడానికి పెట్టుబడిదారుల విజయం. భారతదేశపు నీటినీ అడవులనూ భూమినీ కొల్లగొట్టి, భారతదేశాన్ని మరింత పేదరికంలోకి నెట్టేవారి విజయం ఇది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే శక్తుల విజయం ఇది. అత్యాచారాలు చేసేవారిని కాపాడే అధికారవర్గాల విజయం ఇది.
బందిపోటు దోపిడీని ఎదిరించిన ఒక శక్తిమంతమైన ఉద్యమం ఓడిపోయిందంటే, దాని సహజ పర్యవసానం మరింత లూటీ, మరింత అణచివేత, మరింత వేదన. దాని ఫలితంగా ఆకలి పెరిగిపోతుంది. ప్రతిఘటన పెరుగుతుంది. పోరాటం పెరుగుతుంది. యుద్ధం పెరుగుతుంది. ఇవాళ భారతదేశంలో ఎన్నెన్నో సమూహాలకు యుద్ధం అవసరం ఉంది. వారు యుద్ధం చేయవలసి ఉంది. దళితులు, ఆదివాసులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు – వారందరూ పోరాడుతారు. లేదా అంతరించిపోతారు.
అంటే, పోరాటం ఆగక పోవడం మాత్రమే కాదు, ఆయుధాలు చేపట్టి పోరాడే మార్గమూ మూసుకుపోదు. ఏ ఒక్కరి విజయమూ అంతిమం కాదు. ఏ ఒక్కరి ఓటమీ అంతిమం కాదు.
మహానుభావుడు వినోబా సమాజాన్ని మార్చడానికి మూడు మార్గాలుంటాయని చెప్పాడు: చట్టపరమైన మార్గం, ప్రేమమయమైన మార్గం, ప్రత్యర్థిని సంహరించే మార్గం. చట్టం న్యాయం ఇవ్వకపోతే, సమాజపు ప్రేమ తత్వం మేల్కొనకపోతే, పీడిత ప్రజలు తప్పనిసరిగా సంహార మార్గం ఎంచుకుంటారు అని ఆయన అన్నాడు. అందువల్లనే నేను ప్రజలలో ప్రేమ భావనను రేకెత్తించే పని పెట్టుకున్నాను. తద్వారా సమాజాన్ని సంహార మార్గంలోకి వెళ్లకుండా రక్షించాలని అనుకుంటున్నాను.
నేను వినోబా తో సుదీర్ఘ కాలం గడిపాను. వినోబా భావాలు ప్రచారం చేస్తూ దేశమంతా పాదయాత్రలు చేశాను. అందుకే నేను కూడా సమాజాన్ని సంహార మార్గం నుంచి తప్పించడానికి ప్రజలలో ప్రేమను రేకెత్తించదలిచాను.
(తెలుగు: ఎన్ వేణుగోపాల్)
(సుప్రసిద్ధ గాంధేయవాది, మానవహక్కుల కార్యకర్త హిమాంశు కుమార్ అక్టోబర్ 17న గ్రౌండ్ జీరో వెబ్ పత్రికలో రాసిన వ్యాసానికి అనువాదం)

అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ ద్రోహులు,పార్టీ విచ్చిన్నకులు, విప్లవ ప్రతిఘాతకులు -సోను, సతీష్ ముఠాపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
Jammu Kashmir National Students Federation statement in support of Maoist party
బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న జరగబోవు బంద్ కు మావోయిస్టు పార్టీ మద్దతు
కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
లొంగుబాటు స్వేచ్ఛకు హామీ ఇవ్వదు: మావోయిస్టు నాయకుడు దున్న కేశవ రావు @ ఆజాద్ కథ 