సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మీడియా ప్రకటన
సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు
బూటకపు ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగార్, ఆదివాసుల నిర్వాసితాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టండి.
సిపిఐ(మావోయిస్టు) పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్కౌంటర్ల పేరిట చంపడాన్ని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆపరేషన్ కగార్ పేరిట సిపిఐ(మావోయిస్టు) నాయకులు, కార్యకర్తలను, ఆదివాసులతో సహా లక్ష్యంగా చేసుకొని, చంపడాన్ని ఒక విధానంగా కొనసాగిస్తుంది. ఈ విధంగా చేపట్టే కార్యక్రమాల్లో రాజ్యాంగ పరమైన, చట్టపరమైన నియమాలను బుట్టదాకలు చేస్తోంది ప్రభుత్వం. ఈ విధంగా 2025 నవంబర్ 18న సిపిఐ(మావోయిస్టు) నాయకుడు మడావి హిడ్మాతో సహా ఆరుగురిని ఎన్కౌంటర్ పేరిట ఆంధ్ర ప్రదేశ్ లోని మారేడుమిల్లి ప్రాంతంలో చంపేశారు. నవంబర్ 19న మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఏడుగురిని రంపచోడవరం ప్రాంతంలో చంపివేశారు. ఈ ఎన్కౌంటర్ లన్నీ బూటకమని పౌర హక్కులు, ప్రజాస్వామిక హాక్కుల సంఘాలు ప్రకటించాయి. ఈ ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ గట్టిగా కోరుతుంది. ఎన్కౌంటర్లను ఆపి ఆపరేషన్ కగారును రద్దు చేయాలని కూడా కోరుతుంది. పెద్ద ఎత్తున సాగుతున్న ఈ ఎన్కౌంటర్లలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పాత్రను సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఖండిస్తోంది.
సిపిఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన వారుగా పేర్కొంటున్న అనేక మందిని ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేసినట్లుగా వార్తలు తెలియజేస్తున్నాయి. వీరిలో మావోయిస్టు పార్టీ నాయకుడు తిప్పని తిరుపతి / దేవ్జీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అరెస్టు చేసిన వారందరినీ ఆలస్యం చేయకుండా కోర్టుకు అప్పగించాలని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తుంది.
ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాల్లోని ఖనిజ వనరులను దేశ,విదేశీ కార్పొరేట్లకు స్వాధీనం చేసే ప్రభుత్వ విధానం అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలో భాగంగానే ఆపరేషన్ కగార్ ఉంది. ఈ వనరులను కొల్లగొట్టడానికి ప్రభుత్వం అనేక ఒప్పందాలు కార్పొరేట్లతో చేసుకుంది. ఆ విధమైన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలనీ, ఆదివాసులను తమ నివాసాల నుండి బలవంతంగా నిర్వాసితులను చేయరాదని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ఆదివాసుల హక్కులకు సంబంధించిన అటవీ హక్కుల చట్టం, పీసా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని, శాంతిని, న్యాయాన్ని ప్రేమించే ప్రజలందరికీ ప్రజాస్వామిక హక్కుల మద్దతుదారులందరికీ, ఆదివాసీల హక్కుల మద్దతుదారులందరికీ సిపిఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసీ విజ్ఞప్తి చేస్తుంది. బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని అరెస్టు అయిన వారందరినీ కోర్టుకు హాజరు పరచాలనీ, ఆపేరేషన్ కగార్ ను రద్దు చేయాలనీ, ఆదివాసీలు ఎవరిని నిర్వాసితులను చేయరాదని డిమాండ్ చేస్తూ, నవంబర్ 21, 22 తేదీలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రగతిశీల, ప్రజాస్వామిక సంస్థలూ, వ్యక్తులు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జరుగుతున్న ఈ ఆటవిక అణిచివేతకు, ప్రజాస్వామిక హక్కుల కాలరాచివేతకు వ్యతిరేకంగా గొంతులు ఎత్తాలి.
కేంద్ర కమిటీ,
సిపిఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసీ,
20-11-2025.

ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత
హిడ్మా మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు - ఇస్తాంబుల్లో ప్రచారం
కొందరి ద్రోహం వల్లనే హిడ్మా దొరికాడు;15న పట్టుకొని 19న చంపేశారు – మావోయిస్టు పార్టీ ప్రకటన
ఎన్ కౌంటర్ల పేరిట హత్యాకాండ చేస్తున్నారు – 10 వామపక్ష పార్టీల మండిపాటు
బూటకపు ఎన్ కౌంటర్లను ఆపేయండి, మావోయిస్టులతో చర్చించండి -మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
హిడ్మా ఎన్ కౌంటర్ ఫేక్, విచారణ జరపాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు 