భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మీడియా ప్రకటన
తేది : 20.11.2025.
*కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్ కౌంటర్ కట్టుకథను అల్లారు.
*ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచౌడవరం ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారు.
*ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా ‘నవంబర్ 23’న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం.
ప్రియమైన ప్రజలారా!
నేడు దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నది.
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని సహచరి కామ్రేడ్ రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్ లో ఆంధ్ర ఎస్ ఐబీ నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారు. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలు.
తమ ఆమూల్యమైన ప్రాణాలను అర్పించి, ఉద్యమ స్పూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది.
చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్ శంకర్ (ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు), కామ్రేడ్ రాజే (రీజినల్ కమిటీ సభ్యురాలు ) లకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది.
కామ్రేడ్ చైతు (పీపీసీఎం), కామ్రేడ్ కమ్లూ (పీపీసీఎం), కామ్రేడ్ మల్లాల్ (పీపీసీఎం), కామ్రేడ్ దేవే (పీఎం)లు తమ కర్తవ్య నిర్వహణలో తమ ఆమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్పూర్తిని నిలబెట్టిన వీరికి సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోంది.
కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, పువ్వర్తి గ్రామంలో 1974 ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తమ గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్ లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయ్యి, 1998 చివరి వరకు బాసగూడ దళంలో పనిచేసాడు. 1999లో గడ్చిరోలీలో పనిచేసాడు. తరువాత ఒక సంవత్సర కాలం దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేసాడు. 2001లో ఏరియా కమిటీ సభ్యుడయ్యి, దక్షిణ బస్తర్ కు వచ్చాడు. 2002లో ఊసూర్ ఎల్డీఎస్ కమాండర్ గాను, కొద్దికాలం కుంట ఎల్ఎస్ కమాండర్ గాను పనిచేసాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు. తరువాత కంపెనీ-2లో పీఎల్ కమాండర్ గా పనిచేసాడు. 2006 నుండి 2009 వరకు కంపెనీ -3 కమాండర్ గాను, కార్యదర్శిగాను పనిచేసాడు. 2009లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుండి బెటాలియన్ కమాండర్ గా పనిచేసాడు. 2011లో బీఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2020లో సెక్రటేరియట్ సభ్యుడయ్యాడు. 2024 ఆగస్టులో ఎస్.జెడ్.సీ. కార్యదర్శిగాను, కేంద్రకమిటీ సభ్యుడిగాను ప్రమోట్ అయ్యాడు.
కామ్రేడ్ హిడ్మా మొదటి నుండి ప్రజల్లో పనిచేస్తూ, ప్రజల నుండి నేర్చుకుంటూ అభివృద్ధి అయ్యాడు. ఉద్యమ అభివృద్ధి క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలను నేర్చుకున్నాడు. ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విశేషంగా అధ్యయనం చేసి రాజకీయంగాను, సిద్ధాంతపరంగాను అభివృద్ధి అయ్యాడు. ఉద్యమ క్రమంలో ఆయా సందర్భాలలో ఎన్నో సర్క్యులర్లను, బుక్ లెట్లను రాసి కాడర్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేసాడు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనాన్ని చేసి, ఆచరణలో మెరుగైన ఫలితాలను సాధించాడు. ఎన్నో మిలిటరీ చర్యలకు మెరుగైన పథక రచన చేసి, వాటిని విజయవంతం చేసాడు. ఈ క్రమంలో శత్రు బలగాల నుండి వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకుని పీ.ఎల్.జీ.ఏ.ను సాయుధం చేసాడు. కామ్రేడ్ హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంతో దక్షిణ సబ్ జోన్ లో ప్రజా రాజ్యాధికార అంగాలు (జనతన సర్కార్లు) నిర్మాణమయి, ఈ మధ్యకాలం వరకు ప్రజారాజ్యాధికారం అమలయింది. ప్రజల విశ్వాసాన్ని, కాడర్ల విశ్వాసాన్ని చూరగొన్నాడు.
పాలకవర్గ మీడియా, గోదీ మేధావులు ఎంతోకాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేసారు. హత్య చేసిన తర్వాత నేడు ఆ విష, అసత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల అజమాయిషిలో మరింత పెట్రేగిపోయి చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎన్ని చేసిన ప్రజల హృదయాలలో హిడ్మాకు గల స్థానం చెరిగిపోనిది. భగత్ సింగ్, కొమురం భీం, గూండాదూర్, గేంద్ సింగ్, అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తుంది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయి.
ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు దేశ సంపదను, ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతున్నాయి. ఆ పోరాటాలన్నింటిని ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయడం, పక్కదారి పట్టించడం, అణచివేయడం చేస్తున్నారు. మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. పూటకొక నినాదం, రోజుకొక పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటిని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ మోదీ కి ‘గోది’ కమిషన్ గా మారిపోయింది. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని బిహార్ ఎన్నికల్లో భారీ స్థాయి మోసాలు చేసి విజయాన్ని సాధించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని మొత్తాన్ని నిర్మూలించి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసే పథకాన్ని అమలు జరుపుతున్నారు.
సీపీఐ (మావోయిస్టు) నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సాహసోపేతులైన యుద్ధ సేనానుల చరిత్రను చూసి, ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ, అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాంగానికి, యువతకు, విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం.
విప్లవాభినందనాలతో,
అభయ్
అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)



ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత
హిడ్మా మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు - ఇస్తాంబుల్లో ప్రచారం
దేశ వ్యాప్త నిరసనలకు న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు
ఎన్ కౌంటర్ల పేరిట హత్యాకాండ చేస్తున్నారు – 10 వామపక్ష పార్టీల మండిపాటు
బూటకపు ఎన్ కౌంటర్లను ఆపేయండి, మావోయిస్టులతో చర్చించండి -మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
హిడ్మా ఎన్ కౌంటర్ ఫేక్, విచారణ జరపాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు 