Menu

మాడ్వి హిడ్మా – అమిత్ షా: రెండు అభివృద్ధి నమూనాలు

anadmin 58 minutes ago 0 10

(జనవాదీ కిసాన్ సభ కార్యకర్త రజనీశ్ భారతి ఫేస్ బుక్ మీద రాసిన ఈ హిందీ పోస్ట్ ను తెలుగు అనువాదం చేసింది వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ )

అమిత్ షా అభివృద్ధి నమూనా
ప్రజలను దోపిడీ చేసి, కొద్ది మంది బడా బడా పెట్టుబడిదారుల, విదేశీ సామ్రాజ్యవాదుల అభివృద్ధికి దోహదం చేయడం. ప్రజల ముందు ఎంగిలి మెతుకులు రాల్చి, వారిమధ్య కుల, మతాల పేరు మీద కుక్కల కొట్లాట సృష్టించడం.
ఇది అర్ధ భూస్వామ్య, అర్ధ వలస తరహా అభివృద్ధి నమూనా.
ఈస్టిండియా కంపెనీ అమలు చేసిన అభివృద్ధి నమూనా కూడా అదే. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం అమలు చేసిన అభివృద్ధి నమూనా అదే.
ఇవాళ భారతదేశం కోసం అమెరికా సామ్రాజ్యవాద అగ్రరాజ్యం తయారుచేసిన అభివృద్ధి నమూనా అదే.
భారతదేశంలో ఇప్పటివరకు పాలించిన అన్ని ప్రభుత్వాలూ అమలు చేసిన అభివృద్ధి నమూనా అదే. అమిత్ షా అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా అదే.
ఈ అభివృద్ధి నమూనా అమలు చేయడానికి అమిత్ షా లెక్కలేనంత నల్లధనంతో సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ప్రజలను వంచించి, ప్రజల వోట్లు సంగ్రహిస్తాడు.
మాడ్వి హిడ్మా అభివృద్ధి నమూనాలో

  1. భూమి లేని నిరుపేద రైతులకు భూమి ఇస్తారు
  2. వ్యవసాయోత్పత్తులకు తగిన, గిట్టుబాటు ధర ఇస్తారు
  3. ఎరువులు, విత్తనాలు, విద్యుత్తు, సాగునీరు, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్లు, డీజిల్, పెట్రోల్ తదితరాలు చౌకగా, సులభంగా అందేట్టు చూస్తారు
    హిడ్మా అభివృద్ధి నమూనాతో రైతుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. రైతుల కొనుగోలు శక్తి పెరగడం అంటే బజారులో కొనేవాళ్లూ, అమ్మేవాళ్లూ పెరుగుతారు, బజారు పెరుగుతుంది. బజారులోకి ఇంకా ఎక్కువ సరుకులు రావలసిన అవసరం పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ సరుకులు తయారు చేసే కార్ఖానాలు తెరవవలసి వస్తుంది. మూతబడిపోయిన కార్ఖానాలు తెరవవలసి వస్తుంది. ఆ కార్ఖానాల్లో నిరుద్యోగులకు పని దొరుకుతుంది. నిరుద్యోగులకు పని దొరకడమంటే వాళ్ళూ కొనుగోలుదారులవుతారు. అంటే బాజారు మరింత పెరుగుతుంది… ఈ అభివృద్ధి చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. అలా భారతీయ సమాజం వికసించి ఎటువంటి సమాజం ఏర్పడుతుందంటే అప్పుడు ఒక మనిషి రక్తాన్ని మరొక మనిషి పీల్చడానికి అవకాశం ఉండదు. ఆ సమాజంలో అంతిమంగా అందరూ సమానం అవుతారు. అందరూ ఆనందంగా ఉంటారు.
    ఇటువంటి అభివృద్ధి నమూనాను అమలు చేయడం మొదలుపెట్టి చైనా, ఉత్తర కొరియా, లావోస్, వియత్నాం వంటి వ్యవసాయ ప్రధాన దేశాలు శ్రామికుల, భూమిలేని నిరుపేద రైతుల కొనుగోలు శక్తిని పెంచి, తమ దేశాలను పారిశ్రామికీకరించుకుని, తమ దేశాలలో పేదరికం, అనారోగ్యం, ఆకలిచావులు లేకుండా చేసుకున్నారు. ఆ విషయం ప్రపంచానికంతా తెలుసు.
    ఈ రెండు రకాల పరస్పర విరుద్ధ అభివృద్ధి నమూనాలు మన ముందు ఉన్నాయి. ఈ రెండు రకాల అభివృద్ధి నమూనాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం సాగుతున్నది.
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-52), నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటం (1967), శ్రీకాకుళం రైతాంగ పోరాటం (1968-69) వంటి వాటితో పాటు వేలాది చిన్న చిన్న రైతాంగ పోరాటాలు మన నేల మీద జరిగాయి.
    వాటన్నిటిలో కలిపి దాదాపు ఒక లక్ష కన్నా ఎక్కువ మండి కమ్యూనిస్టులు ఇప్పటివరకూ అమరులయ్యారు. వేలాది మంది ఇప్పటికీ జైళ్ళలో నిర్బంధితులుగా ఉన్నారు. వేలాది మంది కమ్యూనిస్టులు ఇప్పటికీ అజ్ఞాతవాసంలో ఉన్నారు.
    ఈ అభివృద్ధి నమూనాను విశ్వసించే డజన్లకొద్ది కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఇవాళ్టికీ క్రియాశీలంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆ ఆశయం కోసం ఆయుధాలు చేపట్టాయి. మరికొన్ని ఆయుధాలు చేపట్టలేదు.
    హిడ్మా సభ్యుడైన పార్టీ తన అభివృద్ధి నమూనాను అమలులో పెట్టేందుకు ఆయుధాలు ఎత్తింది. యుద్ధం కొనసాగిస్తోంది.
    మోడీ, అమిత్ షా ల ప్రభుత్వం దగ్గర దేశంలో నిరుద్యోగాన్ని అంతం చేసేందుకు నిర్ణీతమైన గడువు ఏమీ లేదు. ప్రణాళిక ఏమీ లేదు.
    అధికధరలు, అవినీతి, వడ్డీ వ్యాపారం, అక్రమ నిల్వలు, కల్తీ వ్యాపారం, మద్యం వ్యాపారం, జూదం, భయం, ఆకలి, పోషకాహారలోపం… వీటిలో ఏ ఒక్కదాన్నీ అంతం చేయడానికి ఏ గడువూ లేదు.
    కాని ఇవి పెరిగిపోవడం వల్ల ప్రజల సమస్యలు ఎడతెగకుండా పెరిగిపోతున్నాయి.
    మరి వీళ్లదగ్గర నక్సలిజాన్ని అంతం చేయడానికి మాత్రం గడువు ఉంది. అమిత్ షా బహిరంగంగా ప్రకటించాడు – ‘మార్చ్ 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తాం’ అని.
    సర్దార్ పటేల్ కూడా సరిగ్గా ఇట్లాగే ప్రకటన చేశాడు: ‘తెలంగాణలో సాయుధ పోరాటాన్ని మూడు నెలల్లో అణచిపారేస్తాం’ అని. కాని ఆయన చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముందుకే సాగింది. దాన్ని ఎవరూ అణచివేయలేకపోయారు.
    కమ్యూనిస్టు పార్టీలోనే విద్రోహకార నాయకత్వం ఆ పోరాటాన్ని ఉపసంహరించింది. అయినా తెలంగాణలో నిప్పురవ్వ ఆరిపోలేదు.
    నక్సల్బరీ రూపంలో ఆ నిప్పురవ్వ తిరిగి అంటుకుంది. ఇవాళ్టికీ కూడా ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నది.
    దాని ఎదుగుదలలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. జరుగుతున్నాయి కూడా. మీకు వాటితో ఏకీభావం లేకపోవచ్చు. వామపక్ష శిబిరంలో చాలా చర్చ జరుగుతూనే ఉంది. కాని ఇక్కడ మనం చర్చిస్తున్నది ఆ పొరపాట్ల గురించి కాదు.
    మేమిక్కడ చెప్పదలచినదల్లా ఆ పోరాటపు ఉద్దేశం ఇప్పటికీ అదే అని.
    అదేమంటే:
    నిరుద్యోగ విద్యార్థి యువజనులకు ఉద్యోగాలు కావాలి.
    చిన్న దుకాణదారులకు కొనుగోలుదార్లు కావాలి.
    కార్మికులకు, రైతులకు, చేతివృత్తులవారికీ జీవనోపాధి భద్రత కావాలి.
    ప్రతి ఒక్కరికీ కుల మతాల ఘర్షణల చిచ్చు నుంచి విముక్తి కావాలి.
    కష్టజీవులకు పేదరికం నుంచీ, పీడన నుంచీ, పోషకాహారలోపం నుంచీ, ఆకలి చావుల నుంచీ విముక్తి కావాలి.
    ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం సమానంగా అందించే వ్యవస్థ కావాలి.
    ప్రజలకు అధికధరలు, నిరుద్యోగం, అవినీతి, అధిక వడ్డీలు, అక్రమ నిలువలు, కల్తీ, మద్యం, జూదం, పరాన్నభుక్కు తత్వం వంటివాటి నుంచి విముక్తి కావాలి. ప్రజలకు భయం లేని వాతావరణం కావాలి.
    ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి?
    ప్రధానమైన ప్రశ్న అభివృద్ధి గురించి కాదు, అభివృద్ధి నమూనా ఏమిటన్నదే అసలు ప్రశ్న. ఎటువంటి అభివృద్ధి నమూనాను అనుసరించాలి? హిడ్మా అభివృద్ధి నమూనానా? అమిత్ షా అభివృద్ధి నమూనానా?
    భారత ప్రజానీకం ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న ఇది.
    ఇది ఎటువంటి ప్రశ్న అంటే, ఒక హిడ్మాను చంపేస్తే, ఈ ప్రశ్న అంతమైపోడు. ఏదో ఒకరోజు మనలో ప్రతి ఒక్కరమూ ఈ ప్రశ్నను ఎదుర్కోవలసిందే.
    హిడ్మా అనుసరించిన పద్ధతులతో మనకు ఏకీభావం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాని భారతదేశపు నిరుద్యోగ విద్యార్థి యువజనులకు ఉద్యోగం కావలసిందే. చిన్న దుకాణదారులకు కొనుగోలుదారులు కావలసిందే. అంటే దేశంలో పారిశ్రామికీకరణ జరగవలసిందే. పారిశ్రామికీకరణ జరగాలంటే భూమిలేని నిరుపేద రైతుల కొనుగోలుశక్తి పెంచవలసిందే.
    విప్లవం వర్ధిల్లాలి!
  • రజనీశ్ భారతి
    (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad