స్మారకోపన్యాసం
(2000 ఫిబ్రవరి మూడో వారంలో రాజకీయ తరగతుల ప్రారంభం సందర్భంగా కామ్రేడ్ గణపతి ఇచ్చిన ఉపన్యాసం)
మన పార్టీ నాయకులు, మన ఉద్యమ నిర్మాతలు అయినటువంటి కామ్రేడ్ శ్యామన్న… (పెల్లుబికుతున్న దుఃఖంతో మాట్లాడలేక ఆగిపోతే, కామ్రేడ్ శ్యామన్న, మహేషన్న, మురళన్నలకు దుఃఖభారంతో పేరుపేరునా జోహార్లు చెబుతూ కామ్రేడ్స్ నినదించారు) కామ్రేడ్ మహేషన్న, కామ్రేడ్ మురళన్న, అదే విధంగా ఈ కామ్రేడ్స్ తో పాటు కామ్రేడ్ లక్ష్మీరాజం – నలుగురూ ఒకేసారి అమరులయ్యిండ్రు. మన కామ్రేడ్స్ విప్లవ ఆశయం కోసం ఎలాంటి జంకు, గొంకు లేకుండా, చాలా సులభంగా తమ ప్రాణాల్ని, తమ సర్వస్వాన్ని ప్రజల కోసం అర్పించిండ్రు. ఆ కామ్రేడ్స్ అమరులయిన తర్వాత, ఇప్పటికే మన పార్టీ అంతటా పార్టీ సెల్ నుండి మొదలుకుంటే మన సి.సి. వరకు, మన పార్టీ, మన గెరిల్లా బలగాలు, మన ప్రజా సంఘాలు, విప్లవ సానుభూతిపరులు, మన సోదర పార్టీలు దేశవ్యాప్తంగా కూడా అమరులకు జోహార్లు అర్పించినయి. వివిధ దేశాల విప్లవకారులు, శత్రువు కొనసాగించిన హత్యాకాండను నిరసించి, అమరుల ఆశయం కోసం తుదకంటా పోరాడుతామని శపథం చేసిండ్రు. మన కామ్రేడ్స్ అమరులై ఇప్పటికి సుమారు మూడు నెలలు కావొస్తుంది. ఆ కామ్రేడ్స్ అమరత్వం చాలా వున్నతమైనది. ఆ అమరుల బాటలో మనమందరం నడవాలని వీలున్న ప్రతి సందర్భాన్ని పురస్కరించుకుని మనం శపథాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన అవసరం వుంది.
మన కామ్రేడ్స్ అమరత్వమనేది వున్నతమైనది. నూతన సమాజ నిర్మాణం కోసం అలాంటి త్యాగాలు, మరణాలు ఇంకెన్నో జరగాల్సి వుంది. లక్షలాది మంది మరణించకుండా, లక్షలాది మంది పోరాటంలో నేలకొరగకుండా బలమైన శత్రువును అంతమొందించడం అసాధ్యం. శత్రువుతో పోరాటం అంటే, ముఖ్యంగా భారత పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాటమంటే, భారత పాలకవర్గాల పరిపాలనని, దోపిడీ పీడనలని నిరంతరం రక్షిస్తూ వున్న సుమారు 35-40 లక్షల పోలీస్, పారా మిలిటరీ, మిలిటరీ బలగాలకు వ్యతిరేకంగా పోరాడడం. ముఖ్యంగా ఆ రాజ్యాంగ యంత్రానికి వ్యతిరేకంగా పోరాడడం. కాబట్టి ఒక 40 లక్షల సంఖ్యలో సాయుధమై వున్నట్టి, సుశిక్షితమైనటువంటి సైన్యంతో పోరాడటమంటే, ప్రజలూ, ఆ ప్రజాయుద్ధానికి నాయకత్వం వహించే నాయకులూ, అంటే పార్టీ, పార్టీ నాయకులు, ప్రజా గెరిల్లాలు, గెరిల్లా కమాండర్లు, ప్రజా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కూడా లక్షలాది మంది మరణించకుండా ఈ వ్యవస్థను మార్చడం అసాధ్యం. కాబట్టి, ఈ విషయం స్పష్టంగా మనందరికీ తెలిసినప్పటికీ, మన పోరాట ప్రాంతాల్లో వుండే ప్రజలందరికీ తెలిసినప్పటికీ, మన నాయకులు, మన సహచరులు, ప్రజలు చనిపోయినపుడు మనం బాధపడుతాం. అదే విధంగా, వాళ్ల ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని ప్రతిజ్ఞ కూడా చేస్తాం. పోరాటంలో త్యాగం అనివార్యమైనదే! అయితే వీలైనంతవరకు అనవసరంగా జరిగే, అంటే పొరపాట్లు చేయడం ద్వారా, అదనంగా కలిగే నష్టాల్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసుకుంటాం. అదే విధంగా ఉద్యమకారుల్ని, ప్రజల్ని, నాయకుల్ని అంతమొందించిన ఈ వ్యవస్థను సమూలంగా మార్చడానికి, ఈ మార్పుకు ఆటంకంగా వున్న పాలకవర్గాలను అంతమొందించడం, వారిని రక్షిస్తున్న, రాజ్యాంగ యంత్రాంగాన్ని అంతమొందించడం లేదా నిర్వీర్యం చేయడం అనేది తప్పనిసరి అవసరంగా మనం గుర్తిస్తాం. అందులో ముఖ్యంగా, మనకు జరిగిన పెద్ద నష్టాల సందర్భంగా ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. అంతేకాకుండా, ఆ అమరులు, తమ జీవితకాలంలో మన ముందుకు తీసుకువచ్చిన ఆదర్శాలను, వాళ్ల గుణగణాలను, వాళ్లు విప్లవానికి చేసిన సేవను, ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని, వాటిని ఆదర్శంగా తీసుకుని, మనలో వున్న, అంటే పార్టీలో, దళాల్లో, సంఘాల్లో వున్న బలహీనతలను తొలగించుకుని పార్టీనీ, ప్రజా ఉద్యమాన్ని మరింత శక్తివంతం చేసి, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని మనం మరీ మరీ ప్రతిజ్ఞ చేస్తాం కూడా.
మన ముగ్గురు కామ్రేడ్స్, మన ముగ్గురు నాయకుల మరణం మన పార్టీకి నిజంగా తీరని నష్టం. వెంటనే లేదా అనతికాలంలో ఆ నష్టాన్ని పూడ్చుకునే పరిస్థితి వాస్తవంగా మనకు లేదు. మన ఉద్యమ నాయకత్వపరంగా, వ్యూహాత్మకంగా, ఎత్తుగడలరీత్యా కూడా అనేక రంగాల్లో, అనేక కోణాల్లో కూడా మన పార్టీ వెంటనే ఆ లోటును పూడ్చుకోవడం సాధ్యం కాదు. జరిగిన నష్టాన్ని మనం కచ్చితంగా గుర్తించాల్సిన అవసరం వుంది. అమరుల ఆశయాల్ని కొనసాగించడంలో వెనకబడవద్దు. అమరుల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో వెనుకబడొద్దు. భౌతికవాదులుగా మనం జరిగిన నష్టాన్ని కచ్చితంగా గుర్తించాల్సిన అవసరం వుంది. అలా గుర్తించినపుడే మనమీద వున్న అదనపు బాధ్యతల్ని, మొత్తం పార్టీ మీద, మొత్తం ఉద్యమం మీద వున్న అదనపు బాధ్యతను మనం కచ్చితంగా గుర్తించగల్గుతాం. ఆ ముగ్గురు కామ్రేడ్స్ ను కోల్పోవడం ద్వారా మన పార్టీకి పెద్ద నష్టమే జరిగింది. ఇలాగే 1992లో పెరూ పార్టీ ఛైర్మన్, పెరూ విప్లవ నాయకుడు కామ్రేడ్ గొంజాలో అరెస్టయినపుడు ”యావత్తు పెరూ విప్లవోద్యమం దెబ్బతినిపోయింది, పెరూ కమ్యూనిస్టు పార్టీ మెదడు స్తంభించిపోయింది, నడుం విరిగిపోయింది” అంటూ అమెరికన్ సామ్రాజ్యవాదులతో సహా ప్రపంచంలో వున్నటువంటి రియాక్షనరీలందరూ కూడా ప్రచారం చేసిండ్రు. అయితే ఆ పార్టీ జరిగిన నష్టాన్ని ఎలా సమీక్షించుకుంది? దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఒక సుదీర్ఘ క్రమం తీసుకునే విప్లవ పోరాటం. అందులో ఎగుడుదిగుడులు కూడా వుంటాయి. అనేక ఆటుపోట్లు కూడా వుంటయి. సాఫీగా, ఏకధాటిగా మొదటి నుండి చివరి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా విప్లవం కొనసాగదు అనేది వాళ్లు సమీక్షించుకున్నారు. వుద్యమ క్రమంలో ఎదురయిన ఒక మలుపుగా, ‘బెండ్ ఇన్ ద రోడ్’గా వాళ్లు నిర్ధారించుకున్నారు. ఉద్యమ అభివృద్ధి కొంత ఆగిపోతుంది. తాత్కాలికమైన పెద్ద నష్టం అని సమీక్షించిండ్రు. దానివల్ల ఆ పార్టీ మొత్తం బాధ్యతను గుర్తుంచుకుంది. తిరిగి ఆ పార్టీ ఏకతాటిపై నిలిచి ప్రజాయుద్ధాన్ని కొనసాగించాలనే కర్తవ్యాన్ని తీసుకుని పనిచేస్తూ, ముందుకు వెళుతున్నది.
కామ్రేడ్ గొంజాలో అరెస్టయి జైల్లో వున్నాడు. మన కామ్రేడ్స్ కనీసం ఈ రకంగా జైల్లో వుండే అవకాశం కూడా లేకుండా పోయింది. శత్రువు మరింత కర్కశంగా మన కామ్రేడ్స్ ను హత్యచేసిండు. అయితే ఈ నష్టాన్ని మన ఉద్యమం కూడా అలాంటి ‘బెండ్ ఇన్ ద రోడ్’గానే అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. అదే సమయంలో ఆ కామ్రేడ్స్ లేని లోటును మనం వెంటనే పూడ్చుకోలేం అనేది వాస్తవం. కానీ, శత్రువు ఆ కామ్రేడ్స్ ను హత్య చేసిన మరుసటి క్షణం నుండి మన పార్టీలో ముఠాలు వున్నయని, అంతర్గత ముఠాల వల్లనే ఆ కామ్రేడ్స్ పోలీసుల చేత చిక్కారనే దుష్ప్రచారం కూడా చేసిండు. ”పార్టీ మొత్తం నాయకత్వాన్ని కోల్పోయింది. ఈ పార్టీ యిక ముందుకెళ్లడం అసాధ్యం” అనే విషయాన్ని కూడా ప్రచారం చేసిండు. అదే విధంగా కనీసం పోలీసుల దగ్గరకు వచ్చి సరెండర్ అయ్యే పద్ధతి కాకుండా కలెక్టరులాంటి రెవెన్యూ అధికారుల దగ్గరకొచ్చి పేరు రాయించుకుపోతే సరిపోతుంది. అదే సరెండర్ పాలసీ అని కూడా ప్రకటించిండు. ముఖ్యమైన కామ్రేడ్స్ ను, నాయకత్వాన్ని కోల్పోయినప్పటికీ మన పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి పుట్టినది కాదు, పెరిగినది కాదు. ఇక ముందు అలా కొనసాగేది కూడా కాదు. మన పార్టీకి స్పష్టంగా మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం అనే సైద్ధాంతిక మార్గదర్శకత్వం వుంది. మన పార్టీకి స్పష్టంగా రాజకీయ లక్ష్యం వుంది. మన పార్టీకి వ్యూహం-ఎత్తుగడలు వున్నాయి. మన పార్టీకి నిర్మాణం వుంది, క్రమశిక్షణ వున్నది. మన పార్టీకి ప్రజా పునాది వున్నది. మన పార్టీ సుదీర్ఘకాలం పనిచేసి ఆచరణలో విస్త్రుతమైన అనుభవాన్ని పొంది వున్నది. మన పార్టీ మీద ప్రజలకు ఎనలేని విశ్వాసం వున్నది. మన పార్టీ కొద్ది ప్రాంతాలకు మాత్రమే కాకుండా, దేశంలోని విశాల ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నది. దేశంలోని అనేక ఎమ్.ఎల్. పార్టీలు వాటి తప్పుడు రాజకీయాల మూలంగా, దివాళాకోరు పంథాలు అనుసరిస్తూ ప్రజల నుండి దినదినం వేరవుతూ వున్న పరిస్థితిలో మన పార్టీ అందుకు భిన్నంగా అనేక కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ దేశంలో అనేక సెక్షన్ల ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దుష్ప్రచారం చేసినట్టుగానీ, శత్రువు కోరుకున్నట్టుగానీ, ఎంత గొప్ప నాయకులైనప్పటికీ కొద్దిమంది, లేదా ఒకానొక పరిస్థితి ఎదురైతే చాలా మంది నాయకులను కోల్పోయినప్పటికీ కూడా ఆగేది కాదు మన పార్టీ. ఇది శత్రువుకు తెలియక కాదు. ప్రజలను, సానుభూతిపరులను, లేదా కొంత ఊగిసలాటలో వున్న, బలహీనమైన కామ్రేడ్స్ ను గందరగోళానికి గురిచేసి వాళ్లను ఇనాక్టివ్ చేయడానికి ఏమైనా తోడ్పడుతుందనే ఆలోచనతో శత్రువు అలాంటి ప్రచారం చేసిండు.
మన కామ్రేడ్స్ గొప్ప కామ్రేడ్స్. కాని, ఆ గొప్ప కామ్రేడ్స్ కేవలం తాముంటేనే ఉద్యమం వుంటుందని ఎన్నడూ ఆలోచించలేదు. ఆ కామ్రేడ్స్ విప్లవ గతితర్కానికి అనుకూలంగానే, ఆలోచించిండ్రు. విప్లవ గతితర్కానికి అనుకూలంగానే కింది స్థాయి నుండి పనిచేస్తూ సాధారణ ప్రజా సంఘాల సభ్యులుగా, సాధారణ పార్టీ సభ్యులుగా తమ విప్లవ జీవితాన్ని ప్రారంభించి విప్లవకర కార్మికవర్గ పార్టీకి అగ్రగామి సభ్యులుగా వాళ్లు తమ చారిత్రక బాధ్యతను గుర్తెరిగి ప్రజలతోటుండి, ప్రజలకు నాయకత్వం వహిస్తూ ఉద్యమానికి నాయకులుగా ఎదిగిండ్రు. వాళ్ల జీవితాల్నుండి మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం, ఆ ముగ్గురు కామ్రేడ్స్ కూడా తాము కమ్యూనిస్టు పార్టీ సభ్యులం, తాము కమ్యూనిస్టు పార్టీ నాయకులం అంటూ ప్రజలకు దూరంగా లేదా సాధారణ కార్యకర్తలకు దూరంగా ఎన్నడూ ఊహించుకోలేదు. అలా ఊహించుకోవడమనేది కేవలం బూర్జువా పార్టీలకు సంబంధించిన అవగాహన. బూర్జువాలు మాత్రమే ప్రజలకు, తమ పార్టీకి తమల్ని తాము చాలా ఉన్నతులుగా ఊహించుకుంటారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ కూడా ప్రజల కొరకు పనిచేస్తూ, ప్రజల నుండి నేర్చుకుంటూ, లక్షలుగా, కోట్లుగా వున్న ప్రజల విస్త్రుత జీవితానుభవాన్ని అంతటినీ కూడా వాళ్ల దగ్గర పనిచేయడం ద్వారా సంపాదించుకుంటారు. మన ముగ్గురు కామ్రేడ్స్ కూడా ఆ రకంగా భావించడం వల్లనే వాళ్లు ప్రజలతో వుండి, ప్రజలకు నాయకులుగా ఎదిగిండ్రు. ఇది చాలా ముఖ్యమైన విషయం.
సిద్ధాంత గ్రంథాలు చదువుకుంటేనో, లేదా వాళ్లు గొప్పగా క్లాసులు చెప్పగలిగితేనో, ఏదో ఒక గొప్పతనం వుండడం వల్లనో నాయకులు కాలేదు ఆ కామ్రేడ్స్. ఆ కామ్రేడ్స్ అనేక విషయాల్లో ప్రజల నుండి, పార్టీ నుండి నేర్చుకోవడం వల్ల అనేక విషయాల్లో వాళ్లు మనందరి కంటే ముందున్నరు. అందువల్లనే పార్టీలో నాయకులుగా వాళ్లు గుర్తింపు పొందిండ్రు. పార్టీ గుర్తింపు మాత్రమే కాదు, వాళ్లు పుట్టి పెరిగిన గ్రామం నుండి మొదలుకొని యావత్తు మన పార్టీ అంతటా కూడా ఆ కామ్రేడ్స్ను ఎరిగిన, ఆ కామ్రేడ్స్తో ప్రత్యక్షంగా పరిచయం లేని వాళ్లుఅందరూ కూడా ఆ కామ్రేడ్స్ను ప్రేమించేవాళ్లుగానే, ఆ కామ్రేడ్స్ ను యిష్టపడేవాళ్లుగానే, ఆ కామ్రేడ్స్ ను ఆదర్శంగా తీసుకునే వాళ్లుగానే వున్నారు. కాబట్టి, మనం ఆ కామ్రేడ్స్ నుండి మొట్టమొదట నేర్చుకోవలసింది ఏమిటంటే, వాళ్లు బూర్జువా పార్టీల్లోలాగా ప్రజలకు, కేడర్కు వేరుగా వుండడం వల్ల నాయకులు కాలేదు. ఆ రకంగా నిర్మించుకున్న పార్టీలన్నీ దెబ్బతిని పోయినయి. నాయకులంతా దెబ్బతినిపోయిండ్రు. ఏ వొక్క క్షణమైనా మిగతావాళ్లకంటే గొప్ప వాళ్లమనుకుంటే వాళ్ల పతనం ప్రారంభమైనట్లే. మన కామ్రేడ్స్ కనీసం ఏ క్షణంలో కూడా ఆ రకంగా ఆలోచించలేదు. కామ్రేడ్ శ్యాం మన పార్టీలోకి వచ్చినప్పటి నుండి కూడా నాకు పరిచయం. ఇద్దరం కూడా ఒకే ప్రాంతంలో పనిని ప్రారంభించాం. దాదాపు ఇద్దరం ఒకే నెలలో పూర్తికాలం విప్లవకారులుగా పార్టీలో చేరడం జరిగింది. ఆ కామ్రేడ్ ది మొదటి నుండి కూడా కష్టపడే తత్వం, రిస్క్ నుండి తప్పుకునే తత్వం కాదు. రిస్క్ ను ఫేస్ చేసే తత్వం, సూటిదనం, నిజాయితీ, నేర్చుకునే గుణం, ప్రతిపనికి బాధ్యత పడే లక్షణం, అదే విధంగా ఆత్మవిమర్శనా ధోరణి, ఈ విషయాలన్నీ ఈ కామ్రేడ్లో మొదటి నుండీ నేను గమనించిన. ఆ కామ్రేడ్తో పరిచయమున్న అనేకమంది కామ్రేడ్స్ కూడా ఈ విషయాల్ని గమనించిండ్రు.
కామ్రేడ్ మహేషన్న 1990ల మధ్యలో నాకు పరిచయమైనాడు. లేదా నేను ఆయనకు పరిచయమయ్యాను. ఇద్దరం ఒకరికొకరం పరిచయమయ్యాం. ఆ కామ్రేడ్ అప్పుడు యింకా తక్కువ మాట్లాడేవాడు. కాని, తక్కువ మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినా ఆయన మాటలు పొల్లుపోకుండా వుండేవి. ప్రతి మాటకు, ప్రతి వాక్యానికి ఒక అర్థం, అందులో ఒక విషయం వుండేది. అది సాధారణమైన సంభాషణ కావచ్చు. చిన్న చిన్న విషయాలకు సంబంధించినది కావచ్చు, సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ, మిలిటరీపరమైన సీరియస్ విషయాలు కూడా కావచ్చు. నిజానికి ప్రతి విషయం కూడా అర్థవంతంగా వుండేది. ఆ కామ్రేడ్లో ఎంత సూటిదనం వుండేదంటే, ఏ మాటలతో కూడా పోల్చడానికి వీలులేనంతటి సూటిదనం ఆ మాటల్లో వుండేది. ఆయనకు స్పష్టత వుండేది. ఆయనకు నిజాయితీ వుండేది. బాధ్యత పడడంలో, ప్రతి విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఏ పనిచేసినా, దాంట్లో బాధ్యతపడే లక్షణం తనది. చివరకు మన పార్టీలో కొనసాగుతున్న తప్పులను సరిదిద్దడంలో కూడా ”యావత్తు పార్టీ ప్రజలకు బాధ్యత పడాలి. ప్రజలకు నాయకత్వం వహించడమంటే, ప్రజల్లో వున్న అంధకారాన్ని, వెనుకబాటుతనాన్ని పోగొట్టడం, పోగొట్టడంలో జరిగిన లోపాల్ని కూడా స్పష్టంగా గుర్తించి, పార్టీ వలన ప్రజలకు కలిగిన ఏ కష్టానికైనా పార్టీ బాధ్యత వహించాలి. కేవలం తప్పులకు మాత్రమే కాదు బాధ్యత వహించడం, ప్రజలకు నాయకత్వం వహిస్తున్నప్పుడు తగిన విధంగా ప్రజలను తీర్చిదిద్దడంలో మనం వెనుకబడిపోయినా అది మన బాధ్యతనే. ఎందుకంటే, శత్రువు ప్రతి క్షణం ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రజలను అంధకారంలో ముంచెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు మనం దానికి కౌంటర్గా, దానికి భిన్నంగా ప్రజలను విజ్ఞానవంతులను చేయడానికి, సంఘటితం చేయడానికి కృషి చేయకపోతే మనం బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నట్లు కూడా కాదు” అనే విషయం కూడా ఆ కామ్రేడ్ మనకు చెప్పిండు.
అదే విధంగా కామ్రేడ్ మురళన్న. ఆయన మన పై కమిటీలో వయసురీత్యా అందరికంటే చిన్నవాడు. కానీ, అనుభవంలో మొత్తం మన పార్టీలో, పై కమిటీలో కూడా ఎవరికీ తీసిపోని కామ్రేడ్. ఆ కామ్రేడ్కి తెలిసిన ప్రతి ఒక్క కామ్రేడ్ కూడా, సాధారణ సంఘ సభ్యులే అయినప్పటికీ కూడా ఆయనతోటిి ఆత్మీయతను పెంచుకునే వాళ్లు. ఆయన పలకరింపే, ఆయన మాట్లాడే పద్ధతే స్నేహపూరితమైనదిగా వుండేది. ఆ కామ్రేడ్ మన ఉద్యమంలో ఎదురయినటువంటి ప్రతి ఎదురుదెబ్బలో, ఉత్తర తెలంగాణా గెరిల్లాజోన్కు బెస్ట్ కమాండర్గా, కమాండర్-ఇన్-చీఫ్గా మన ఉద్యమాన్ని 1985 నుండి మొదలుకుంటే, ఇప్పటి వరకు కూడా నాయకత్వం వహించి ఆ బాధ్యతను నేడు ఉత్తర తెలంగాణా స్పెషల్జోనల్ కమిటీకి, మొత్తం పార్టీకి అప్పగించి వెళ్లిండు. ఆ కామ్రేడ్ కూడా స్వయం విమర్శ విషయంలో ఎప్పుడూ జంకేవాడు కాదు. స్వయం విమర్శ అంటే ఆయన చాలా ఉత్సాహపడేవాడు. ఎందుకంటే, ఏ పొరపాట్లున్నా కూడా వాటిని తొలగించుకోవడం వల్ల ఇంకా దృఢమైన కామ్రేడ్గా ఎదగవచ్చనే ఆలోచన చేసేవాడు.
ఆ రకంగా మన ముగ్గురు కామ్రేడ్స్, మన ముగ్గురు నాయకులలో మనం నేర్చుకోవలసిన అనేక విషయాలు వున్నయి. వాటన్నింటి నుండి మనం తప్పనిసరిగా స్ఫూర్తిని పొందాలి. అలాంటి దృఢమైన శక్తి సంపన్నులం కావడానికి మనందరం తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన అవసరం వుంది. ఆ కామ్రేడ్స్ తాము పని చేసి పార్టీకి నేర్పింది ఇలాంటి విషయాలు. సైద్ధాంతిక, రాజకీయ విషయాలే కాకుండా వాళ్లు విప్లవ నాయకులుగా, తమ విప్లవకర జీవితం నుండి దృఢమైన గొప్ప కామ్రేడ్స్ గా ఎదగడానికి కమ్యూనిస్టులు ఏయే లక్షణాలను సంతరించుకుని వుండాలి అనే విషయానికి సంబంధించి తమ జీవిత ఆచరణ ద్వారానే మనముందు ఒక నీతిని పరచిపోయిండ్రు.
అదే విధంగా, ఇంకొక విషయం, మనం గొప్ప కామ్రేడ్స్ ను కోల్పోయినం. కాని శత్రువు ఆశించినట్టుగా ఈ ఉద్యమం ఆగిపోదు. ఎందుకంటే మన పార్టీ కింది నుండి, ఏరియా కమిటీ మొదలుకుంటే కేందకమిటీ వరకు ఉద్యమం నుండి పుట్టి ఉద్యమాల్లో అనుభవం సంపాదిస్తూ, రాటుదేలుతున్న వాళ్లతో నిండి వున్నది. ముఖ్యంగా అనేక జిల్లా కమిటీల్లో వున్న అనేకమంది కామ్రేడ్స్, రాష్ట్ర కమిటీలో వున్న అందరు కామ్రేడ్స్, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీనే కాదు, ఉత్తర తెలంగాణా, దండకారణ్య కమిటీలు మాత్రమే కాదు, ఇవాళ మన పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రాంతాల్లోని అన్ని రాష్ట్ర కమిటీల్లో కూడా ఎవరూ దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం కంటే తక్కువ వున్న వారులేరు. 15 సంవత్సరాల నుండి 20-25 సంవత్సరాల అనుభవం కలిగినవాళ్లే మన రాష్ట్ర కమిటీల్లో, కేంద్రకమిటీలో వున్నారు. కాబట్టి శత్రువు ప్రచారం చేస్తున్నట్లుగా మన పార్టీ అంత బలహీనమైనదేమీ కాదు. మన పార్టీ ఆచరణ నుండి పుట్టి, ఆచరణ నుండి అభివృద్ధి అవుతున్న పార్టీ. అయితే ఇవాళ రాష్ట్ర కమిటీల్లో వున్న కామ్రేడ్స్ ను తీసుకొని మన ముగ్గురు కామ్రేడ్స్ స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఎలానూ వుంటుంది. భర్తీ చేయవచ్చు. ఒకవైపున తీవ్రమైన లోటు, ఆ కామ్రేడ్స్ లేని లోటును ఎదుర్కొంటున్నా శత్రువు ఆశించినట్లుగా, శత్రువు ప్రచారం చేస్తున్నట్లుగా మన పార్టీ నిలిచిపోయే పరిస్థితిలో లేదు. రెండూ ఒకే సమయంలో వున్నయి. ఒకవైపున పూడ్చుకోలేని నష్టం, రెండో వైపున మన పార్టీ, మన పార్టీ నాయకత్వ కమిటీలు ఈ ఉద్యమాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకుపోయే విధంగా అనుభవం కలిగి వున్నటువంటివే! ఇది కూడా మనం గమనంలో వుంచుకోవాల్సిన అవసరం వుంది. అదే విధంగా మన పార్టీ, ఆ ముగ్గురు కామ్రేడ్స్, తాము నిజమైన నాయకులుగా మనకు తమ పని ద్వారా అందించిన విజ్ఞానం, సంపద, వివిధ డాక్యుమెంట్ల రూపంలో వుంది.
మన మొత్తం పార్టీ చరిత్రను చూసుకుంటే 1978ల నుండి మొదలుకుని ఇప్పటివరకు ఏ కమిటీ అయినా కనీసం ఏడెనిమిది సంవత్సరాలు పనిచేసిన కమిటీలే. 1990లో మనం కేంద్రకమిటీని, (సి.ఒ.సి. అప్పుడు) ఎన్నుకున్నప్పటి నుండి చూస్తే మన కమిటీకి స్థిరత్వం వుంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మూడు రాష్ట్ర కమిటీలు కలిసి ఆ రోజు సెంట్రల్ ప్లీనం జరిపినయి. అప్పటికి మన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో, ఉత్తర తెలంగాణాలో, దండకారణ్యంలో, కర్ణాటకలో, తమిళనాడులో కొంతవరకు ఉద్యమంలో నిలదొక్కుకున్న లీడర్షిప్ వుంది. సాపేక్షికంగా ఆ రోజు తమిళనాడు కమిటీ బలహీనంగా అంటే కొత్త కామ్రేడ్స్ తో వున్నటువంటిది. అనుభవం చాలా తక్కువ, అనుభవం లేనటువంటి కామ్రేడ్స్ తో వున్నట్టిది. మిగతా కమిటీలన్నీ చాలా కాలంగా వుండి, ఉద్యమంలో రాజకీయంగా గానీ, సైద్ధాంతికంగా గాని, ఆచరణరీత్యాగాని నిలబడిన కమిటీలే. కాబట్టి 1990 తర్వాత వచ్చిన ఆటుపోట్లు కాని, కె.ఎస్., బండయ్యలు ముందుకు తీసుకువచ్చిన అవకాశవాదం గాని మన పార్టీని అడ్డుకోలేకపోయింది. వాళ్లెంతటి అవకాశవాదులు, ఆరోజు వాళ్లు తీసుకొచ్చిన సంక్షోభంలో ఎంత రివిజనిజం వుందనేది వాళ్ల ఆచరణలోనే తేలిపోయింది. అందులో చాలా మంది పాలకవర్గాలకు తొత్తులుగా పనిచేస్తున్నారు. కిరాయి గూండాలుగా పనిచేస్తున్నారు. వాళ్లకు రాజకీయం లేదు అనేది తమ ఆచరణ ద్వారానే రుజువు చేసుకున్నారు. మన పార్టీ దినదినం అభివృద్ధి అవుతున్నది, మునుముందుకే పోతున్నది. కాబట్టి 1990 నుండి మొదలుకుంటే, మనకు మన పార్టీకి ఒక కొనసాగింపు వుంది. మన ఉద్యమానికి ఒక అభివృద్ధి క్రమం వుంది. 1970 కాంగ్రెస్లో ఏర్పడిన మన పార్టీ సెంట్రల్ కమిటీ ఒక మీటింగ్ కూడా జరగకుండానే ఆ కమిటీలోని చాలామంది కామ్రేడ్స్ అమరులయ్యారు. మన పార్టీ నిర్మాత కామ్రేడ్ చారుమజుందార్ 1972 జూలైలో అమరుడయ్యాడు. సత్యం, కైలాసంలు 1970లోనే అమరులయ్యిండ్రు. కామ్రేడ్స్ అప్పు, సరోజ్దత్తా మరికొంతమంది సెంట్రల్ కమిటీ కామ్రేడ్స్ అప్పుడే అమరులయ్యిండ్రు. కొంతమంది సెంట్రల్ కమిటీలో అవకాశవాదులుగా, రివిజనిస్టులుగా, ద్రోహులుగా మారిపోయిండ్రు. అంటే ఒక కేంద్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నా, దాని కొనసాగింపు లేదు. కాని, ఆ రోజు మన పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా, ఆ రోజు అనేక ప్రాంతాల్లో జరిగిన విప్లవోద్యమాల ద్వారా ఆ అనుభవాల్ని మనం పొందాం.
ఆ నాయకులు లేరు. కాని, వాళ్లు అందించిన అనుభవం, వాళ్లు అందించిన లైన్ మన పార్టీకి వుంది. అందులో మంచి వుంది, కొంత చెడు కూడా వుంది. చెడును తృణీకరించి, మంచిని వారసత్వంగా పొంది ఆ పునాదుల మీద కె.ఎస్. మరొకసారి ఆంధ్రప్రదేశ్లో పార్టీని నిర్మించడానికి కృషిచేసిండు. దానిలో భాగంగానే గెరిల్లాజోన్ పర్స్పెక్టివ్ పెట్టి, కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలను ముందుకు తీసుకుపోవడంలో భాగంగా 1986 వరకు ఆయన గొప్ప పాత్ర పోషించాడు. తర్వాత ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆయన విఫలమై, పైగా అవకాశవాదానికి కూడా గురై మన పార్టీకి ఆటంకంగా కూడా నిలిచి తోసివేయబడిండు. అప్పుడేర్పడిన, అంటే 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడినపుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకత్వ కేంద్రం కూడా, మన సెంట్రల్ కమిటీ కూడా నాలుగైదేళ్లు వునికిలో వుంది. కానీ అదెప్పుడూ కేంద్రకమిటీ లాగా పనిచేయలేదు. పార్టీ లైన్ అనుసరించినది ఆంధ్ర రాష్ట్ర కమిటీనే. తమిళనాడుకు వస్తే పార్టీ కేంద్రకమిటీలో వున్న కొంతమందికి సంబంధించిన లైన్ అక్కడ అమలు జరపడానికి ప్రయత్నం చేసి ఉద్యమం అడ్వాన్స్ కాకుండా ఆ నాయకత్వమే ఆటంకం అయ్యింది. ఆఖరికి వాళ్లు పార్టీ నుండి కూడా తోసివేయబడ్డారు. లేదా వాళ్లే పక్కకు తప్పుకున్నారు.
1990 నుండి మినహాయించి, అంతకు ముందు చరిత్రలో అంటే రెండు దశాబ్దాలకు పైగా మనకు పార్టీ నాయకత్వం లేదు. ఉన్న నాయకత్వం చాలా తక్కువ కాలం పనిచేసింది. అయితే, వాళ్లు రూపొందించిన ఎత్తుగడలు, వాళ్లు మనకందించిన అనేక విషయాల నుండి మనం నేర్చుకున్నాం. కాని, ఇప్పుడు మన కామ్రేడ్స్ ముఖ్యంగా శ్యామన్న, మహేషన్న, మురళన్నలు మనకు లేకపోవడం ఎంతటి విచారకరమైన విషయమో, ఎంత నష్టమో మనకు తెలుసు. కాని, ఆ కామ్రేడ్స్ వున్నప్పుడు కమిటీ తీర్మానాలు జరిగినయి. సమీక్షలు జరిగినయి. పార్టీ కాన్ఫరెన్సులలో డాక్యుమెంట్లు తయారయినయి. మధ్య మధ్యలో పార్టీ సర్క్యులర్స్ కూడా రూపొందించుకుంది. వీటన్నింటి ద్వారా, వాళ్ల ఆలోచనలు, వాళ్ల భావాలు, వాళ్ల కృషి అంతా కూడా మనముందుంది. ఈ విషయాన్ని ఒక రోజు అంటే, బహుశా మన పార్టీ ఆలిండియా కాన్ఫరెన్సు అయిన తర్వాత కావొచ్చు; 1995లో జరిగిన ఆలిండియా కాన్ఫరెన్సుకు ముందు, ఆలిండియా కాన్ఫరెన్సు తర్వాత కూడా మొత్తం మన పార్టీ లీడర్షిప్ యొక్క కంటిన్యూటీ సమస్యని చర్చించుకోవడం జరిగింది. 1995 నుండి చూస్తే మన పార్టీలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణా, దండకారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో నాయకత్వాన్ని చాలామందిని కోల్పోయినాం. ఉద్యమం ఒక్కొక్క స్టెప్ అడ్వాన్స్ అవుతున్నది. కానీ నాయకత్వాన్ని చాలా వరకు కోల్పోతున్నాం. ఈ సమస్యనెట్లా పరిష్కరించుకోవాలి అని చర్చించినపుడు, ఈ సమస్య పరిష్కారానికి కొన్ని చర్యలు చేపట్టాలనే విషయంలో నిర్ణయాలు కూడా జరిగినయి. నాయకత్వాన్ని, వ్యక్తుల్ని కోల్పోయినామంటే అర్థం ఈ వుద్యమానికి కంటిన్యూయేషన్ వుందా లేదా? అంటే ఎలాంటి డాక్యుమెంట్లు, ఎలాంటి సర్క్యులర్లు, అనుభవాల సమీక్షలు లేకపోతే కంటిన్యూయేషన్ లేనట్లు. వ్యక్తులూ లేరు, ఆ అనుభవాలు కూడా లేవు. డాక్యుమెంట్లు, సమీక్షలు వున్న సందర్భాల్లో నూతన తరం పార్టీలోకి వచ్చినప్పుడు మిగిలి వున్నటువంటి పార్టీ సభ్యులు పనిచేస్తున్నప్పుడు వాళ్లు తిరిగి మరలా అన్ని ప్రయోగాలు చేయడం కాదు. ఆల్రెడీ గొప్ప సంపద, మన పార్టీ దశాబ్దాలుగా కొనసాగించిన ప్రాక్టీస్ మొత్తం డాక్యుమెంట్ల రూపంలో, సర్క్యులర్ల రూపంలో, సమీక్షల రూపంలో వుంది. కాబట్టి నాయకత్వం వ్యక్తులుగా కోల్పోవడం వల్ల కంటిన్యూటీ ఒక యాస్పెక్టులో లేదు. కానీ ఇంకొక యాస్పెక్టులో 1970ల్లో, 80ల్లో వున్నటువంటి డిస్కంటిన్యూటీ లేదనుకోవడం జరిగింది. ఆ ముగ్గురు కామ్రేడ్స్ పాల్గొన్నటువంటి సమావేశంలోనే ఈ సమీక్ష జరిగింది. ఈ విషయాలు చర్చించుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మనం గమనంలో వుంచుకుంటే మన కామ్రేడ్స్ చేసిన కృషి వాళ్లు పోవడంతోటే పోలేదు. మొత్తం పార్టీతో కలిసి, ఆ కామ్రేడ్స్ ప్రత్యేకంగా చేసిన కృషి మనముందుంది.
మన పార్టీ ఈ మూడోదశలో అంటే గెరిల్లాజోన్స్ నిర్మించి, ఆ గెరిల్లాజోన్స్ ప్రాథమిక స్థాయిలోనే కాకుండా, దాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి విముక్తి ప్రాంతాలుగా నిర్మించడానికి పథకాలు రూపొందించడంలో ఇందుకోసం మిలిటరీపరంగా అనుసరించాల్సిన ఎత్తుగడలను రూపొందించడంలో ఆ ముగ్గురు కామ్రేడ్స్ కేంద్రకమిటీలో, రాష్ట్ర కమిటీల్లో పనిచేయడం ద్వారా చాలా కీలకమైన కృషి చేశారు. కాబట్టి, ఆ రకంగా మన పార్టీ ఇంకొక స్టెప్ అడ్వాన్స్ కావడానికి అవసరమైన కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మన గెరిల్లా జోన్స్ సన్నాహక ప్రాంతాల్లో ప్రజా శత్రువులైన భూస్వాములు, పెత్తందార్లు, కులపెద్దల ఆధిపత్యాన్ని ధ్వంసం చేస్తూ, బలహీనపరుస్తూ ఆ స్థానంలో ప్రజల, ప్రజలంటే కార్మికులు, రైతాంగం, పట్టణ మధ్యతరగతి, జాతీయ బూర్జువాజీ – ఈ నాలుగు వర్గాల అధికారాన్ని నెలకొల్పడంలో భాగంగా ఎలాంటి నిర్మాణకృషి, రాజకీయ కృషి చేయవలిసి వుంటుందనేది, ముందే మనం ఒక అవగాహనకు వచ్చినాం. నాలుగు వర్గాల నియంతృత్వం అంటున్నాం, దీన్నే మనం కార్మికవర్గ ఆధిపత్యంలో నాలుగు వర్గాల నియంతృత్వం అంటున్నాం. అయితే, ఇవాళ మన ఉద్యమం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వుంది, రైతాంగంలో వుంది. అందులో వ్యవసాయకూలీ, పేద రైతు, మధ్యతరగతిలో ప్రధానంగా వుంది. ఇంకా ధనిక రైతులను మనం గెల్చుకోలేదు. ఒక చిన్న సెక్షన్ మాత్రమే మన తోటి వుంది. ఒక సెక్షన్ ను కొంతమేరకు తటస్థం చేశాం. ఇంకా చెప్పుకోదగ్గంత మంది మన ఉద్యమ ప్రాంతాల్లోనే మన ఉద్యమానికి బయట వున్నారు. పట్టణ మధ్యతరగతిలో మనం చిన్న సెక్షన్లోనే వున్నాం. జాతీయ బూర్జువాజీ మన గురించి ఇంకా ఆలోచించడమే లేదు. కాని, మనకొక పాలసీ వుంది.
ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ అధికారం నెలకొంటుందంటే అర్థం ఇది సారాంశంలో నూతన ప్రజాస్వామిక అధికారమే. అలాంటి పాలసీ మనం రూపొందించుకున్నాం. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రాజ్యాధికారం నిలబడాలంటే తప్పనిసరిగా ప్రజా మిలీషియా ఏర్పాటు చేసుకోవాలె. ప్రజల అధికారాన్ని రక్షించుకోవడానికి అక్కడ ప్రజలు సాయుధం కావలసిన అవసరం వుంది. గ్రామాల్లో వున్న పెత్తందారులను, ఇన్ఫార్మర్లను, దుష్టశక్తులను కంట్రోల్ చేస్తూ, పోలీసు, పారా మిలిటరీ బలగాలను చికాకుపరుస్తూ గ్రామాల్లో ప్రజల ప్రజాస్వామిక శక్తుల్ని కాపాడడం కోసం గెరిల్లా ప్రజాసైన్యంతో కలిసి శత్రువుతో పోరాడడం కోసం ప్రజా మిలీషియాను ఏర్పాటు చేసుకోవాలన్న విషయంలో కూడా మనం అవగాహనకొచ్చినాం. అదే విధంగా సుదీర్ఘకాలం గెరిల్లా దళాలుగా వుండి వందలు వేలుగా వస్తున్న శత్రువును ఎదుర్కోవడం సాధ్యం కాదు అనేది కూడా ఆచరణలో తేల్చుకుని మన పై కమిటీ గత సమావేశంలోనే ”మనం కూడా గెరిల్లా ప్రజాసైన్యాన్ని నిర్మించుకోవాలె, మనకున్న గెరిల్లా దళాలను గెరిల్లా ప్రజాసైన్యంగా అభివృద్ధి చేసుకోవాలె, రాజకీయ, నిర్మాణ మిలిటరీ కర్తవ్యాలను నెరవేర్చడానికి వేరు వేరు అంగాలను, వేరు వేరు యూనిట్లను అభివృద్ధి చేసుకోవాలె” అనే స్పష్టమైన అవగాహనకు రావడం జరిగింది. ఆ ముగ్గురు కామ్రేడ్స్ వున్నప్పుడే ఆ నిర్ణయం కూడా జరిగింది. అంటే, ఇవాళ మన గెరిల్లాజోన్స్ లో, పర్స్పెక్టివ్ జోన్స్ లో మనం ప్రజల రాజకీయాధికారం నెలకొల్పాలంటే, ప్రజాసైన్యం లేకుండా ప్రజలకుండేదేమీ లేదు అనే నినాదం చుట్టూతా ప్రజల్ని సాయుధం చేసి ప్రజారాజకీయాధికార అంగాలను నిర్మించుకోవాల్సిన అవసరం వుంది అనే అవగాహనకు కూడా మనం వచ్చినం. అదే విధంగా, శత్రువు చాలా బలమైనవాడు, కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాల వల్ల శత్రువును ఓడించడం సాధ్యంకాదు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం నిర్వహించేటటువంటి ఏ దేశంలోనైనా అసమాన ఆర్థిక రాజకీయ పరిస్థితుల మూలంగా తప్పనిసరిగా కొన్ని ప్రాంతాలలో ప్రారంభమైనప్పటికీ ఆ ఉద్యమం అనేక ప్రాంతాల్లో, చిన్న ప్రాంతాల నుండి పెద్ద ప్రాంతాలకి, ఒంటరి స్థలాల నుండి అనేక స్థలాల్లోకి, ప్రాంతాల్లోకి విస్తరించడం అనేది తప్పనిసరిగా జరగాలి కాబట్టి మన పార్టీని విస్తరింపజేయడానికి మన ముగ్గురు కామ్రేడ్స్ సీరియస్గా కృషి చేసిండ్రు. కాబట్టి మన పార్టీ విస్తరించింది కూడా. ఇంకా విస్తరించడానికి అవకాశం వుంది కూడా. కేవలం మన దేశంలోని నిజమైన విప్లవకారులతో సమైక్యం కావడమే కాకుండా ఇంకా ప్రపంచంలో వున్న విప్లవకర కార్మిక వర్గ పార్టీలతో సమైక్యం కావడానికి, వాళ్లతో కలిసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా మన పార్టీ వంతు పాత్ర నిర్వహించడానికి కూడా ప్రాథమిక కృషి ఆ ముగ్గురు కామ్రేడ్స్ వున్నప్పుడే ఆరంభమైంది. అదే విధంగా మనం ఒక బృహత్తరమైన రాజకీయ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. పార్టీ చాలా వరకు రైతాంగం నుండి పుట్టి పెరిగినటువంటిది. రైతాంగంలో పనిచేస్తున్నటువంటిది. ఇవాళ సమాజం చాలా త్వర త్వరగా మారిపోతున్నది. సామ్రాజ్యవాదం అన్ని రంగాల మీద, అన్ని రంగాల ప్రజల మీద దాడి చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు రాజకీయాలందాలి. శత్రువును సరిగ్గా చూడగల్గాలి. శత్రు ఎత్తుగడల్ని, దోపిడీ రూపాల్ని సరిగ్గా అర్థం చేసుకోగల్గాలి. అప్పుడే సరిగ్గా పోరాడడం అనేది సాధ్యమవుతుంది. దానికోసం పార్టీ సైద్ధాంతిక స్థాయిని అభివృద్ధి చేయాల్సిన అవసరంరీత్యానే మన పై కమిటీ ‘స్కోప్’ను ఏర్పాటుచేసింది. సెంట్రల్ పొలిటికల్ స్కూలును ఏర్పాటు చేసుకుని దాంట్లో భాగంగానే మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం ప్రాథమిక పాఠాలు విద్యగరపడానికి ప్రయత్నం చేసింది. ఆ కార్యక్రమం ఆ కామ్రేడ్స్ వున్నప్పుడే రూపొందించింది. అదే విధంగా మిలిటరీ స్పెషలైజేషన్ కోసం కూడా ఆ కామ్రేడ్స్ వున్నప్పు
డే ఆ ప్రయత్నాలు ఆరంభమైనాయి.
వ్యక్తులను, నాయకత్వంలో ఒక సెక్షన్ను లేదా ఒక మేజర్ సెక్షన్ను కోల్పోవడం వలన ఒక కోణంలో కొనసాగింపు లేకుండా పోతుంది. కానీ వాళ్లు రూపొందించిన విధానాలు, ఎత్తుగడల వలన మన పార్టీకి కొనసాగింపు వుంది. ఇది మనం అర్థం చేసుకుంటే, శత్రువు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం మనకు తేలికనే. ఎందుకంటే, కమ్యూనిస్టులకు ఆత్మవిశ్వాసం అనేది వాస్తవాలను అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది తప్ప, ఊహల ద్వారా రాదు. ఉపన్యాసాల ద్వారా కూడా రాదు. సరిగ్గా, వున్న పరిస్థితిని అర్థం చేసుకోవడం ద్వారానే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మన ముగ్గురు కామ్రేడ్స్ మన ఉద్యమాన్ని మరొక మెట్టు అభివృద్ధి చేయడానికి కావలసిన ఎత్తుగడలను రూపొందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని, దాన్ని దృఢంగా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తే, శత్రు నిర్బంధంలో మరికొన్ని నష్టాలు కూడా తప్పక పోయినా కానీ, మన ఉద్యమం మటుకు అభివృద్ధి చెందుతుంది. అంటే గెరిల్లా ప్రాంతాల్ని సంఘటితం చేసుకుంటూ, గెరిల్లా స్థావర ప్రాంతాల్ని అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. ఇలా అభివృద్ధి చెందితే దేశంలో చాలా మార్పులు వస్తాయి. మార్పులు రావడానికి కావలిసిన పరిస్థితులన్నీ మన కళ్లెదుట కనబడుతున్నాయి. కాబట్టి, మన ముగ్గురు కామ్రేడ్స్ ఆ రకంగా సుసంపన్నమైన అనుభవాన్ని, పాలసీలను మన ముందుంచిండ్రు. వాటిని తీసుకుంటే, మన పార్టీ తప్పనిసరిగా దేశంలో ఇంకా బలమైన సంస్థగా ఎదిగి ఈ వుద్యమానికి తప్పనిసరిగా నేతృత్వం వహించగలుగుతుంది.
మన ముగ్గురు కామ్రేడ్స్ను శత్రువు చంపిన తర్వాత వెంటనే మన పై కమిటీ సెక్రెటేరియేట్ సర్క్యులర్ పంపించింది. అందులో మనం నాయకత్వాన్ని కోల్పోయిన సందర్భంగా తిరిగి మనం నాయకత్వాన్ని సృష్టించుకోవడానికి చేయవలిసిన కొన్ని కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ గొప్ప కామ్రేడ్స్ను స్ఫూర్తిగా తీసుకొని మనం జూలై 28, రాబోయే అమరవీరుల స్మారకదినం వరకు ఆ కామ్రేడ్స్ గురించి మాట్లాడుకోవాలి. జ్ఞాపకాల్ని పంచుకోవాలి. మన బలహీనతల్ని పోగొట్టుకోవాలి. ప్రజల్లో ప్రచారం చేయాలి అనే కార్యక్రమం వుంది. అదే విధంగా మనం నూతన సభ్యులను తయారు చేసుకోవాలి. ఏ.పి.లో మనం చేసుకున్న సమీక్ష ఏంటి? మనం చాలా ప్రజా పోరాటాలు నిర్వహించాం. చాలా నిర్వహిస్తున్నాం. అయితే పోరాటానికి, నిర్మాణానికి వున్న లంకెను అర్థం చేసుకోకపోవడంలో మన లోపాన్ని కూడా గుర్తించాం. ఆ రకంగా నిర్మాణాల మీద కేంద్రీకరించాలని కూడా అనుకున్నాం. అది యిక్కడ ఎ.పి.కి సంబంధించిన నిర్దిష్ట కార్యక్రమం. ఈ సందర్భంగా మన సెంట్రల్ కమిటీ సెక్రెటేరియేట్ నుండి వచ్చిన సర్క్యులర్ ప్రకారం కొత్త పార్టీ సభ్యులను రిక్రూట్ చేసుకోవడానికి, అంటే ఫుల్ టైమర్స్గా అని కాదు, పార్టీ సభ్యులుగా తీసుకోవడానికి మనం ప్రత్యేకంగా ఒక సంవత్సరం క్యాంపెయిన్ జరపాల్సిన అవసరం వుంది. అదే విధంగా కింది స్థాయి నుండి పార్టీ సభ్యులను, కొత్త సభ్యులను తీసుకోవడంతో పాటు పార్టీ ఎడ్యుకేషన్ను పెంచి ఒక కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయవలిసిన అవసరం వుంది అనే పిలుపు కూడా ఆ సర్క్యులర్లో వుంది. కాబట్టి, నిర్దిష్టంగా రాష్ట్ర కమిటీలో, వివిధ స్థాయి కమిటీల్లో చర్చించుకుని, మనం ఒక సంవత్సరం కంటిన్యూగా ఆ ప్రోగ్రాం జరపవలిసిన అవసరం వుంది.
శత్రువు ముగ్గురు కామ్రేడ్స్ను చంపిండు. ఆ ముగ్గురు కామ్రేడ్స్ పార్టీలోకి వచ్చేటప్పటికి సాధారణ సభ్యులే! అంతకు ముందు మన ఆర్.ఎస్.యు. నాయకులయ్యిండ్రు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చి కొంతకాలం పనిచేసి వివిధ స్థాయిలకు సంబంధించిన నాయకులయ్యిండ్రు. మీ ముందున్న అనేక మంది కామ్రేడ్స్ సాధారణ సభ్యులు. మన పార్టీలో ఇప్పుడు కొన్ని వేల మంది వున్నారు. మొత్తం పార్ట్ టైమర్స్తో సహా లెక్కబెడితే కొన్ని వేల మంది మన పార్టీలో వున్నారు. సుమారు వేయికి పైగా మన పార్టీ గెరిల్లా దళాల్లో పనిచేస్తున్నారు. పదులవేల మంది మన ప్రజాసంఘాల్లో వున్నారు. మన పార్టీ పనిచేస్తున్న మొత్తం ప్రాంతాల జనాభా చూస్తే, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన రాజకీయ ప్రభావం తీవ్రంగా వున్న ప్రజలు కొన్ని కోట్ల మంది వున్నారు. మన పార్టీలో ప్రత్యక్ష సంబంధాలలో కొన్ని లక్షల మంది వున్నారు. కామ్రేడ్ శ్యాం 1974లో ఆర్.ఎస్.యు.లోకి వచ్చిండు. 1975లో ప్రొఫెషనల్గా వచ్చిండు. కామ్రేడ్ మురళన్న 1981లో వచ్చిండు. ఈ ఐదారు సంవత్సరాల, ఆ టైమ్లో మన పార్టీ పరిస్థితి చూసుకుంటే, ఈ రోజు ఇక్కడ మొత్తం మనం ఎంత మందిమి కూర్చున్నామో, ముఖ్యంగా 1977 దాకా ఇక్కడ కూర్చున్నంతమంది కూడా ఆ రోజు మన పార్టీలో లేరు. 1981 నాటికి ఒక రెండు, మూడు వందల మంది కామ్రేడ్స్ వున్నప్పటికీ, అప్పటికి అనుభవం కలిగిన వాళ్లు కొద్దిమందే వున్నారు. చాలామంది కొత్త కామ్రేడ్స్. ఆ రోజు పార్టీకి ఇంకా అనుభవం లేదు. ఆ పీరియడ్తో పోలిస్తే ఈ రోజు మన పార్టీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అయ్యింది. కాబట్టి, అలాంటి ప్రాథమిక దశలో ప్రవేశించిన కామ్రేడ్స్ ఉద్యమ క్రమంలో అంత నాయకులుగా ఎదిగితే, ఇవాళ వేలాదిగా వున్న మన పార్టీ సభ్యులను మనం ఎదిగించడానికి ప్రయత్నం చేస్తే, ఈ వుద్యమాన్ని మనం దృఢంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే, మనం కొత్త నాయకులను తయారు చేసుకోవడం అసాధ్యమైన విషయం కాదు.అనేకమంది కామ్రేడ్స్ ను మనం తయారు చేయవచ్చు. ఈ వుద్యమమే అలాంటిది. ఈ వుద్యమం అలాంటి నాయకులను తప్పక తయారు చేస్తుంది కూడా. నాయకులు ఎక్కడి నుండో తెచ్చిపెడితే తయారయ్యేవాళ్లు కాదు. ఈ వుద్యమ క్రమం నుండే అభివృద్ధి కావడానికి అనేక అవకాశాలున్నాయి.
కాబట్టి, మనం ఈ క్యాంపెయిణ్ ను ఈ అవగాహనతో, అంటే మనం కొత్త సభ్యులను చేర్చుకోవడం, రేపటి నాయకులను తయారు చేసుకోవడంలో భాగంగా తీసుకుంటే కొత్త సభ్యులను తయారు చేయగలుగుతాం. మన పార్టీని అభివృద్ధి చేయగలుగుతాం కూడా. అయితే, మన పై కమిటీ ఇచ్చిన సర్క్యులర్లో మరొక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన కామ్రేడ్స్ ను చంపడం ద్వారా మన పార్టీకి పెద్ద నష్టం జరిగింది. మన కామ్రేడ్స్ ను చిత్రవధ చేసి చంపడం అనేది మన కామ్రేడ్స్ ను చాలా తీవ్రంగా బాధించింది. మన ప్రియమైన కామ్రేడ్స్ ను శత్రువు హింసించి చంపడాన్ని మనం తీవ్రంగా ద్వేషిస్తున్నాం. మొత్తం శత్రువు పట్ల కసిని పెంచుకుని శత్రువును అంతమొందించాలనే ప్రతిజ్ఞ చేస్తున్నాం. అది మన కేంద్రకమిటీ సర్క్యులర్లో చెప్పినట్టుగా మొత్తం ఈ అర్ధ భూస్వామ్య, అర్ధ వలస వ్యవస్థను, సామ్రాజ్యవాదాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానాన్ని, భూస్వామ్య విధానాన్ని అంతమొందించడం ద్వారానే నిజంగా కసి తీర్చుకోగలుగుతాం. ఈ దుష్ట వ్యవస్థను మార్చడం ద్వారా, పాలకవర్గాలను అంతమొందించడం ద్వారా మనం కసి తీర్చుకోగలుగుతాం. ఇది చాలా సుదీర్ఘకాలానికి సంబంధించినది.కాని, తక్షణంగా మన పార్టీ ముందుకు పోకుండా, మన పార్టీకి పెద్ద నష్టం చేసి, మన పార్టీకి పెద్ద ఆటంకం కలిగించిన, మన ఉద్యమాభివృద్ధిని చెప్పుకోదగిన విధంగా అడ్డుకున్న శత్రువును మనం శిక్షించాల్సిన అవసరం వుంది. మన కామ్రేడ్స్ ను చిత్రవధ చేసి, చిత్రహింసలు పెట్టి చంపిన శత్రువు మీద మనం కసి తీర్చుకోవలిసిన అవసరం వుంది అన్న విషయాన్ని ఆ సర్క్యులర్ నొక్కిచెప్పింది. కాబట్టి ఈ సందర్భంగా శత్రువును, మన కామ్రేడ్స్ ను అంతం చేసిన దుష్టులను, హంతకులను మనం తప్పనిసరిగా శిక్షించాలి. ప్రత్యక్షంగా మన కామ్రేడ్స్ ను చంపిన వాళ్లను చంపడమే కాదు, అందులో పాత్ర నిర్వహించిన, రాజకీయంగా నిర్వహించినా, ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వహించినా, మరొక రకంగా నిర్వహించినా ఆ ద్రోహుల్ని, ఆ హంతకుల్ని కూడా మనం తప్పనిసరిగా శిక్షించాలి. శిక్షించడం కోసం మనం ప్రతిజ్ఞ చేయాలి. శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. మన పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీలు, వివిధ రీజినల్, జిల్లా కమిటీలు ఎప్పుడు, ఎవరికి పిలుపిస్తే ఆ బాధ్యతలు నిర్వహించడానికి ప్రతి కామ్రేడ్, గ్రామంలో వున్న మన పార్టీ సభ్యుడు మొదలుకొని, మన గ్రామాల్లో వుండే గ్రామ రక్షక దళసభ్యులను మొదలుకుని కేంద్రకమిటీ సభ్యుల వరకు ఆ హంతకులను శిక్షించడంలో ముందుకు రావలసిన అవసరం వుంది. మన ఉద్యమం అభివృద్ధి అవుతున్నప్పటి నుండి, ముఖ్యంగా 1982లో శత్రువు మన కామ్రేడ్స్ ను పట్టుకుని చంపడం అనేది ఆరంభించిండు. మరీ ప్రత్యేకంగా 1985 నుండి ఊచకోత కోయడం ద్వారా మన పార్టీ నాయకత్వాన్ని, దళాల్ని, మన గ్రామాల్లో వుండే నాయకులను వరుసగా హత్యచేస్తుండు. ఉద్యమంలో ముఖ్య నాయకులుగా ఎదిగి రావలిసిన చాలా మంది కామ్రేడ్స్ ను శత్రువు హత్యచేసిండు.మన కామ్రేడ్స్ కు ఉద్యమంలో ఇప్పటి వరకు బతకడానికి అవకాశం లభించింది కాబట్టి వాళ్లు ముగ్గురూ అంత గొప్ప కామ్రేడ్స్ అయ్యిండ్రు. ఇవాళ మనకు అవకాశముంది కాబట్టి మనం పనిచేయగలుగుతున్నాం. కాని, ఉద్యమంలో అమరులు అయిన కామ్రేడ్స్ ను ఒక్కొక్కరిని గుర్తుకు తెచ్చుకుంటే ఎంతో మంది కామ్రేడ్స్ చాలా చురుకైన వాళ్లు. కొత్త కామ్రేడ్స్ అయినప్పటికీ రాజకీయంగా, సైద్ధాంతికంగా చాలా పరిణతి వున్న కామ్రేడ్స్, చాలా అనుభవం పొందిన కామ్రేడ్స్, ప్రజల అభిమానం చూరగొన్న కామ్రేడ్స్, మంచి యోధులు, ఎంతో మంది కామ్రేడ్స్ అమరులయ్యిండ్రు. ఆ కామ్రేడ్స్ ఇవాళ ఉద్యమంలో వుంటే, మనకు ఎంతో గొప్ప నాయకత్వముండేది. ఎంతో గొప్ప నాయకత్వం ఎదిగేది. అలాంటి పరిస్థితి లేకుండా చేసిన శత్రువును ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుని, మనం తప్పనిసరిగా కసి తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయవలిసిన అవసరం వుంది. ఏ కామ్రేడ్స్ కు బాధ్యత ఇస్తే ఆ కామ్రేడ్ ఎలాంటి తటపటాయింపులు లేకుండా ప్రాణమైనా త్యాగం చేయడానికి ముందుకు వచ్చి రంగంలోకి దిగాల్సిన అవసరం వుంది. (”శిక్షిద్దాం! శిక్షిద్దాం!! అమరులను బలిగొన్న హంతకులను శిక్షిద్దాం!” అన్న నినాదాలు సభలో మిన్నుముట్టాయి.)కాబట్టి తాత్కాలికమైన నష్టమే అయినప్పటికీ ఇది దీర్ఘకాలంలో ఉద్యమానికి చెరుపుచేసేది. శత్రు చొరవను మనం దెబ్బ కొట్టాల్సిన అవసరం వుంది. ప్రజల చొరవను పెంచాల్సిన అవసరం వుంది. ప్రజల బలం ముందు ప్రజా శత్రువు యొక్క కిరాయి మూకలు పిరికిపందలని, వాళ్లుకొట్లాడలేరనేది నిరూపించాల్సిన సమయం వచ్చింది. మనది ఇప్పటికీ చిన్న సంస్థే. శత్రువుతో, వాడి 40 లక్షల బలగంతో పోలిస్తే మనం నాలుగువేల మందిమి కూడా లేం. కాని మనం వంద కోట్ల ప్రజల తరఫున పనిచేస్తున్నాం. మన శక్తంతా ప్రజలే. మన శక్తంతా మన సిద్ధాంతంలో వుంది. మన రాజకీయాల్లో వుంది. మన ప్రజల్లో వుంది. మన నిర్మాణ కృషిలో వుంది. కాబట్టి, ప్రస్తుతం చిన్న శక్తి అయినప్పటికీ మనం బ్రహ్మాండమైన శక్తిగా ఎదుగుతాం.
ఈ రోజు వున్న స్థితిలోకి మన ఉద్యమం ఎదగడానికి గత మూడు దశాబ్దాల కాలం పట్టింది. కాని ఇక ముందు అంతకాలం అవసరం లేదు. మనం పెద్ద పెద్ద గండాలు దాటినం. ఇక ముందూ మన పార్టీకి ఇలాంటి నష్టాలు కొన్ని జరుగుతాయి. అయినప్పటికీ ఇవాళ దేశంలో వున్న పరిస్థితులను అందుకోవడానికి మనం సీరియస్గా ప్రయత్నం చేస్తే మన ఉద్యమం అభివృద్ధి కావడానికి అవకాశాలు చాలా వున్నాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవలిసిన అవసరం వుంది.ఈరోజు సాధారణంగా చూసినపుడు ప్రపంచం అంతా కూడా పోరాటానికి సిద్ధంగా వుంది. కొన్ని దేశాల్లో సాయుధ విప్లవాలు కూడా జరుగుతున్నాయి. పెరూలో, ఫిలిప్పీన్స్ లో, నేపాల్లో, టర్కీలో, ఇండియాలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధాలు జరుగుతున్నయి. ప్రపంచంలో అనేక దేశాల్లో చిన్పవైనప్పటికీ విప్లవకర కార్మికవర్గ పార్టీలు తలెత్తుతున్నాయి. ప్రపంచ కార్మికవర్గం, పీడిత దేశాల్లోని రైతాంగం, ప్రజాస్వామిక శక్తులు పోరాటాల్లోకి వస్తుండ్రు. సామ్రాజ్యవాదుల దోపిడీ పీడనలు ఏ వొక్క సెక్షన్ను కూడా గతంలో లాగా స్తబ్ధంగా వుంచే పరిస్థితి లేదు. ప్రతి వర్గం, అంటే ప్రతి పీడిత వర్గం, ప్రతి సెక్షన్ ఏదో ఒక రూపంలో తమ నిరసనను తెలుపుతున్నది. పోరాటాలు జరుగుతున్నయి. ఉధృతమవుతున్నయి. అయితే వాటికి కావలసింది ఒకే ఒక్కటి, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కావలిసి వుంది. రాజ్యాధికారాన్ని చేపట్టాలనే లక్ష్యం కలిగిన, స్పష్టమైన అవగాహన కలిగిన కార్మికవర్గ పార్టీ కావలిసిన అవసరం వుంది. అలాంటి పార్టీ వ్యక్తులు కోరుకుంటే రాదు. వర్గ వైరుధ్యాల నుండి శత్రువు చేసే దాడి నుండి ప్రజలు తమంత తాము సంఘటితం కావలిసిన అవసరాన్ని గుర్తిస్తారు. అలాంటి పరిస్థితులు నేడు ప్రపంచమంతటా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో, మరి కొన్ని దేశాల్లో అలాంటి బ్రహ్మాండమైన పరిస్థితులు పెరుగుతున్నయి.ఎక్కడికన్నా వెళ్లండి. ప్రపంచం గురించి, దేశం గురించి ఆలోచన తర్వాత చేద్దాం కానీ, మనం పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రాంతాన్ని పరిశీలించండి. పక్క ప్రాంతాల ప్రజలు మనల్ని రమ్మని అంటుండ్రు. పార్టీ కావాలని కోరుకుంటుండ్రు. కేవలం, ఇక్కడ మన ప్రాంతానికే సంబంధించినది కాదు. ఏ రాష్ట్రానికైనా వెళ్లండి, అటువంటి పరిస్థితులే వున్నాయి. చాలా రాష్ట్రాల్లో మన పీపుల్స్ వార్ పార్టీని కోరుకుంటుండ్రు. అదే విధంగా, ప్రజాస్వామికవాదులు పీపుల్స్ వార్ పట్ల నమ్మకాన్ని పెంచుకుంటుండ్రు. పీపుల్స్ వార్ పట్ల నమ్మకాన్ని పెంచుకోవడమంటే విప్లవపార్టీ పట్ల నమ్మకం పెంచుకోవడమనే. అంటే, పోరాడే ఒక కార్మికవర్గ నాయకత్వాన్ని కోరుకుంటుండ్రు అనే. అంటే, మన పార్టీ గొప్పదా కాదా అనే విషయానికి సంబంధించినది కాదు. భారత ప్రజలు, భారత ప్రజాస్వామికవాదులు పార్టీని కోరుకుంటుండ్రు. ఇప్పుడున్న పరిస్థితులను సరిగ్గా సద్వినియోగం చేస్తూ, ప్రజల్ని సంఘటితం చేసి ముందుకు తీసుకుపోగల నాయకత్వాన్ని కోరుకుంటుండ్రు. కాబట్టి, ఇన్ని ఎన్కౌంటర్ల మధ్యలో, ఇన్ని నష్టాల మధ్యలో మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో గాని, పక్క ప్రాంతాల్లో గాని, మన పక్క రాష్ట్రాల్లో గాని, మొత్తం దేశంలో గాని పార్టీని కోరుకుంటుండ్రు. ఇది ఈ రోజు వస్తుగత స్థితికి సంబంధించినది. ఇవాళున్న వర్గవైరుధ్యాల నుండే ప్రజలు అట్లా ఆలోచిస్తున్నారు.
కాబట్టి కామ్రేడ్స్, ప్రపంచంలో వున్న పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నయి. ఇది ఈ రోజున్న వస్తుగత స్థితి. మన ముగ్గురు కామ్రేడ్స్, యావత్తు పార్టీ విశ్వాసం చూరగొన్న కామ్రేడ్స్… చివరి వరకు ప్రజల పట్ల, ఉద్యమం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ సర్వస్వాన్ని అర్పించారు. వాళ్ల నుండి మనం స్ఫూర్తిని పొందుతూ ఇవాళ ప్రపంచంలో వున్న, దేశంలో వున్న పరిస్థితులను గుర్తుకు తెచ్చుకోవాలి. శత్రువు ఈ సందర్భంగా ముందుకు తెచ్చిన ప్రతి ఆరోపణ బూటకం. వాస్తవంగా మన పార్టీ 1990 నుండి కె.ఎస్., బండయ్య ముఠాను వదిలిపెడితే, మొత్తం మన పార్టీ దినదినం సమైక్యం అవుతుంది. ఉద్యమ, విప్లవ అభివృద్ధి పార్టీ సమైక్యతను పెంచుతయి. మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు అవన్నీ పెటీబూర్జువా స్వర్గానికి సంబంధించినవి. మనకూ ఆప్యాయతలు, వగైరాలుంటయి. మన ఆప్యాయతలకు, మన ప్రేమకు, మన స్నేహానికి, మన అనుబంధానికి అన్నిటికీ రాజకీయాలు పునాది. అవి వుద్యమాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన రాజకీయాలు.మన ఉద్యమాన్ని అడ్వాన్స్ చేయడంలో భాగంగా పార్టీ అభివృద్ధి అయ్యింది. కాబట్టి శత్రువు చేసిన అనేక రకాలైన ప్రచారం అంతా తప్పుడు ప్రచారం. మన కామ్రేడ్స్ మన పార్టీ ఆశయాన్ని, మనందరిమీద పెట్టి, మనందరి మీద నమ్మకం పెట్టుకుని అమరులయ్యిండ్రు.
ఇవాళ, మన పార్టీ జవమూ జీవమూ ఎక్కడుంది? వర్గపోరాటంలో వుంది. మన రాజకీయాల్లో వుంది. కామ్రేడ్స్ చేస్తున్న త్యాగాలలో వుంది. వుద్యమ ప్రాంతాలలో వుంది. కాబట్టి, దీన్నంతటినీ మనం గమనంలో వుంచుకోవాలి, ఆ కామ్రేడ్స్ చాలా స్పిరిట్ ను మనకందించిండ్రు. కామ్రేడ్స్ మరణించడం వల్ల, కామ్రేడ్స్ మనకు లేకపోవడం వల్ల మనకు ఎంత దుఃఖం కలుగుతుందో అంతకంటే ఎక్కువగా మనకు ప్రేరణ వుంది. అంతకంటే ఎక్కువగా ఆ కామ్రేడ్స్ మనకు అందించిన గొప్ప ఆశయం వుంది. కాబట్టి, దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా దృఢంగా పనిచేద్దాం. మన లోపాలను పూడ్చుకుందాం. ఆ కామ్రేడ్స్ లాగనే మనం తుదివరకూ పోరాడాలి. భారత విప్లవం విజయవంతం అయ్యేవరకు కూడా పోరాడాలి. మన ముగ్గురు కామ్రేడ్స్ మన పార్టీని తీర్చిదిద్దుకోవల్సిన అవసరం వుందని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉత్తర తెలంగాణాలలో మన పార్టీ త్వరత్వరగా అభివృద్ధి చెందడానికి, మన పార్టీ ముందుకు పోయి గొప్ప నాయకత్వంగా ఎదగడానికి కొన్ని ఆటంకాలు వున్నాయని గుర్తించిండ్రు. మన పార్టీలో వున్న కొన్ని లోపాలను, తప్పులను సరిదిద్దుకోవడానికి- మనం దిద్దుబాటు బోధన క్యాంపెయిన్ అంటున్నాం. ఏ కార్యక్రమం చేపట్టవల్సి వుందో ఆ ముగ్గురు కామ్రేడ్స్ స్పష్టంగా మన ముందుంచిండ్రు. కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం. అందులో ఇచ్చిన ముఖ్య కర్తవ్యం మన పార్టీని సైద్ధాంతికంగా అభివృద్ధి చేసుకోవాలి, స్థాయిని పెంచాలి. అదే విధంగా ప్రజలతో మరింత సమైక్యం కావాలి అనేది. ఆ కామ్రేడ్స్ మనకిచ్చిన కర్తవ్యాలను తప్పనిసరిగా ముందుకు తీసుకుపోదాం. కేవలం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణాల్లోనే కాదు, ఇక్కడ తీసుకున్న రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ వెలుగులో, దీని సహకారంతో మొత్తం పార్టీలో ఏ యూనిట్లో, ఏ ప్రాంతంలో ఏ లోపాలున్నప్పటికీ వాటిని సరిదిద్దుకొని మొత్తం పార్టీని రాజకీయంగా మరింత సంఘటితం చేసి దృఢంగా ముందుకు తీసుకుపోదామని శపథం చేద్దాం.

హిడ్మాను పట్టించింది ఆ నలుగురే – మావోయిస్టు పార్టీ ప్రకటన
Let us celebrate the 25th anniversary of the PLGA – CPI (Maoist)
మాడ్వి హిడ్మా – అమిత్ షా: రెండు అభివృద్ధి నమూనాలు
ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత
హిడ్మా మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు - ఇస్తాంబుల్లో ప్రచారం
కొందరి ద్రోహం వల్లనే హిడ్మా దొరికాడు;15న పట్టుకొని 19న చంపేశారు – మావోయిస్టు పార్టీ ప్రకటన 