Menu

కామ్రేడ్ తోట సీతారామయ్య – భారత విప్లవంలో ఓ అన్‌సంగ్ హీరో!

anadmin 1 month ago 0 157

విప్లవోద్యమానికి ప్రధాన స్రవంతి అని చెప్పుకోదగిన అజ్ఞాత ప్రజా జీవితంలో ఎక్కువ మంది ‘అజ్ఞాతం’గా ఏమీ ఉండరు. ఆయా వ్యక్తులు నిర్వహించే నాయకత్వ బాధ్యతల వల్ల, లేదా వివిధ ఉద్యమాల్లో వారు పోషించే పాత్రల వల్ల వారి పేర్లు బయటి సమాజానికి తెలుస్తూ ఉంటాయి. లేదా ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే వారికి మీడియా కవరేజి లభిస్తూ ఉంటుంది. ఉద్యమ క్రమంలో వారు ప్రాణాలు అర్పించినప్పుడు, వారి చరిత్ర మొత్తంగా కాకున్నా చాలా వరకు బయటి ప్రపంచానికి పరిచయమవుతుంది. కానీ విప్లవోద్యమంలో అజ్ఞాత త్యాగాలు కూడా ఉంటాయి. అంటే ప్రజల్లో ఏ పేరూ సంపాదించుకోకుండా, అసలు ప్రజలకు పెద్దగా తెలియకుండా అనామకంగా మిగిలిపోయే త్యాగాలూ ఉంటాయి. అయితే, వారి త్యాగాలు కూడా విప్లవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవే. నిజంగా చెప్పుకోవాలంటే.. వారిది మరింత నిస్వార్థమైన త్యాగం. వాళ్లు అన్‌సంగ్ హీరోస్!
అలాంటి త్యాగమూర్తుల్లో ఒకరు కామ్రేడ్ తోట సీతారామయ్య. 2025 డిసెంబర్‌ 8న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 65 వరకు ఉండొచ్చేమో. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతరేల గ్రామం ఆయన స్వస్థలం. చీరాలలో డిగ్రీ చదువుతూ కొంతకాలం RSUలో పని చేసిన ఆయన 1980లో పూర్తికాలం కార్యకర్తగా విప్లవోద్యమంలో భాగమయ్యాడు. కొంతకాలం పీస్ బుక్ సెంటర్‌లో విప్లవ సాహిత్యాన్ని అమ్మే పని చేశాడు. అప్పుడు ఆయనను అందరూ ‘పీబీసీ కుమార్’ అని పిలిచేవారు. 1985 నాటికి రాజ్య నిర్బంధం వల్ల పీస్ బుక్ సెంటర్‌ను మూసెయ్యాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆయన రహస్య జీవితంలోకి వెళ్లాడు. ఆ కాలంలో ఆయన కొరియర్‌గా పని చేశాడు. కంప్యూటర్, డీటీపీ, ఆఫ్‌సెట్ ప్రింటింగ్ వంటి పనులు నేర్చుకొని విప్లవ సాహిత్యాన్ని అచ్చువేసి ఉద్యమ ప్రాంతాలకు తరలించే బాధ్యతలు కూడా నిర్వహించాడు. అలా ఆ 15 ఏళ్ల కాలంలో ఆయన ఇంకా ఏమేం పనులు చేశాడో బయటకు తెలియదు కానీ 2001 నుంచి ఆయన కార్యరంగం ప్రధానంగా దండకారణ్యానికి మారింది. ఆనాటి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతికి కంప్యూటర్ ఆపరేటర్‌గా, ఆయనకు అత్యంత నమ్మకమైన సహాయకుడిగా పని చేశాడు. దండకారణ్యంలోని కేడర్లలో ఆయన ‘కంప్యూటర్ ఆనందన్న’గా పేరు గాంచాడు. కంప్యూటర్ ఆయన ఇంటిపేరులా మారిపోయిందని చెప్పొచ్చు.
తక్కువ మాట్లాడుతూ, ఎక్కువగా పరిశీలిస్తూ, అలుపనేదే లేకుండా గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తూ కనిపించేవాడు. తన బాధ్యతల్లో భాగంగా గణపతి ఎక్కడికి వెళ్తే ఆనంద్ కూడా ఆయా రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్తూ ఉండేవాడు. అలా దేశవ్యాప్తంగా విప్లవోద్యమ నేతలకు ఆయన పరిచయమయ్యాడు. ముఖ్యంగా పై కమిటీల మీటింగ్‌లు జరిగేటప్పుడు పగలు, రాత్రి పని చేయాల్సి వచ్చేది. అయినా పేరుకు తగ్గట్టుగా ఎప్పుడూ ఆనందంగా, చిరునవ్వుతో కేంద్ర, రాష్ట్ర కమిటీల సభ్యులకు కావాల్సిన ప్రింటౌట్లు తీసివ్వడం, ఫైల్స్ కాపీ చేసి ఇవ్వడం, తీర్మానాలు టైప్ చేసి ఇవ్వడం వంటి పనులు చేస్తూ ఉండే వాడు. దండకారణ్యంలో చాలా మంది జూనియర్ కామ్రేడ్స్‌కు ఆయన డీటీపీ పనులు నేర్పించాడు. ఎవరి కంప్యూటర్‌లో ఏదైనా సమస్య తలెత్తినా దాన్ని ఆయనే బాగు చేసి ఇచ్చేవాడు. అలసట, విసుగు, విశ్రాంతి అనేవి ఆయన డిక్షనరీలో ఉండేవి కాదంటే అతిశయోక్తి కాదు.
దండకారణ్యంలో అడుగు పెట్టేటప్పటికే నలభైళ్లో ఉన్న ఆయన.. తెల్ల జుట్టుతో కాస్త వయసుకు మించి కనిపించే వాడు. దాంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా సభ్యులు ఆయనకు చేదోడువాదోడుగా ఉండేవాడు. ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణాలు చేసేటప్పుడు ఆయన కంప్యూటర్‌ను, ఇతర సామాన్లను స్వచ్ఛందంగా మోసేవాళ్లు. అయితే, ఎప్పుడూ ఏ ప్రత్యేకతా కోరుకోని ఆయన తన పనులు తానే చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అయినా సభ్యులు ముందుకొచ్చి, ఆయన భుజం పైనుంచి సామాన్లు బలవంతంగా తీసుకునేవారు. ఆయనకు గోండీ భాష సరిగా రాకున్నా తెలుగు, హిందీ, గోండీ, ఇంగ్లిష్ అంతా కిచిడీలా కలిపి మాట్లాడే మాటలు సభ్యులకు వినోదంగా కూడా అనిపించేవి. అలా వారితో ఆయన, ఆయనతో వాళ్లు వివిధ భాషల మిశ్రమంతో మాట్లాడుతూ, గెరిల్లా క్యాంపుల్లో ఎప్పుడూ నవ్వుల్ని పూయిస్తూ ఉండేవాళ్లు.
ఇక పని విషయానికి వస్తే.. తప్పులు లేకుండా టైప్ చేయడం, చాలా వేగంగా టైప్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన ఏదైనా టైప్ చేసి ఇస్తే అందులో కరెక్షన్స్ చేయాల్సిన అవసరం చాలా అరుదుగానే ఉండేది. సమయం చాలా తక్కువ ఉన్నప్పుడు గణపతి, లేదా ఇతర కేంద్ర నాయకులు డిక్టేట్ చేస్తుంటే చాలా వేగంగా టైప్ చేస్తుండేవాడు. క్రమశిక్షణ ఆయనలో ఉన్న మరో గొప్ప గుణం. ప్రధాన కార్యదర్శికి చేదోడువాదోడుగా ఉండేటప్పుడు తీర్మానాలతో పాటు కమిటీల్లోని అంతర్గత విషయాలు, వివాదాలు కూడా ఆయన దృష్టికి రావడం సహజం. కానీ వాటిని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా, ఎవరితోనూ ఆ విషయాలు మాట్లాడకుండా క్రమశిక్షణతో మెలిగేవాడు.
ఆదివాసీ ప్రజలతో ఆయనకు సంబంధాలు తక్కువే అయినా, ఆదివాసీ కేడర్లతో ఆయన చాలా మంచి సంబంధాలుండేవి. నిజానికి ఆయన పై కమిటీల్లోని నాయకత్వ కేడర్లతోకన్నా, ఎప్పుడు సమయం దొరికినా సరే కింది స్థాయి సభ్యులతోనే మాట్లాడుతూ కనిపించేవాడు. గెరిల్లా క్యాంపుల్లో రాత్రివేళల్లో సినిమాలు చూపించేది ఆయనే కాబట్టి సభ్యులు ఆయనతో ముందే మాట్లాడుకొని వారికి ఏ సినిమా కావాలో ముందే డీల్ చేసుకునేవారు. అలా సభ్యులతో ఆయనకు ‘రహస్య’ సంబంధాలుండేయన్న మాట!
రాజకీయ చర్చల్లో ఆయన ఎప్పుడూ చాలా సంక్షిప్తంగా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. తన అభిప్రాయాలను నిస్సంకోచంగా ముందుంచేవాడు. అయితే, అవసరం లేదు అనుకున్న చర్చల్లో పొరపాటున కూడా భాగం అయ్యేవాడు కాదు. అంతకన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది – ఆయన మెమోరీ పవర్. ఏ ఫైల్, ఏ వ్యాసం, ఏ తీర్మానం ఎక్కడ, ఏ డ్రైవ్‌లో, ఏ ఫోల్డర్‌లో ఉంటుందో చెప్పడానికి ఆయనకు సెకన్ల సమయం కూడా పట్టేది కాదు. అందరూ ఆయనది ‘కంప్యూటర్ బ్రెయిన్’ అని మెచ్చుకునే వాళ్లు. నాటి ప్రధాన కార్యదర్శి గణపతి, అమరులు నంబాళ్ల కేశవరావు, చెరుకూరి రాజ్‌కుమార్… తదితరులకు అవసరమైన ఎన్నో రిఫరెన్స్ వ్యాసాలు, తీర్మానాలు అడిగిన వెంటనే తీసివ్వడం ద్వారా వారికి ఎంతో గొప్ప సహాయకుడిగా నిలబడి, ఆ విధంగా విప్లవోద్యమానికి ఎంతో గొప్ప దోహదం చేసిన వ్యక్తి కామ్రేడ్ తోటసీతారామయ్య.
అలాంటి అద్భుతమైన మనిషి 2023లో వైద్యానికి వచ్చి అరెస్ట్ అయ్యే నాటికి ఇతర అనారోగ్య సమస్యలతో పాటు అల్జైమర్స్‌‌ అనే మతిమరుపు సమస్యతో బాధపడుతున్నాడట. పోలీసుల కస్టడీలో కూడా ‘అదిగో… పోలీసులు వస్తున్నారు.. పదండి క్యాంపు ఖాళీ చేసి వెళ్లిపోదాం’ అని ఆందోళనగా మాట్లాడేవాడట. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన ఆయనకు కుటుంబ సభ్యులు ఓ సహాయకుడిని ఏర్పాటు చేసి ఆయనకు తిండి, స్నానం వంటి పనులన్నీ జరిగేలా ఏర్పాటు చేశారట. ఈ ఏడాది మే నెలలో ఓ మిత్రుడు ఆయనను పరామర్శించడానికి వెళ్లినప్పుడు, ఆయన జ్ఞాపకశక్తి మెరుగు కానప్పటికీ ఆరోగ్యంగానే కనిపించాడట. ఆ సమయంలో ఆ మిత్రుడు ఊరికే.. ‘ఎర్ర సైన్యం, తెల్ల సైన్యం’ అని ప్రస్తావిస్తే…. ‘ఔను.. ఎర్రసైన్యం… నేను లొంగిపోను… నేను లొంగిపోను…’ అన్నాడట. తాను ఎక్కడ, ఎవరి మధ్య ఉన్నానో కూడా అర్థం కానంత స్మృతిరహిత స్థితిలో ఉన్నప్పటికీ మౌలిక విషయాలు మాత్రం ఆ మెదడులో ఏదో మూలలో గట్టిగా పాదుకొని ఉన్నాయేమో… ఆ జ్ఞాపక శకలాలు అల్జైమర్స్‌కు సైతం లొంగకుండా మొండిగా నిలిచిపోయాయేమో…!
ప్రస్తుత చారిత్రక సందర్భంలో… విప్లవ ప్రతిఘాతుకత్వం అత్యంత జుగుప్సాకరంగా, నిర్లజ్జగా రాజ్యం చంకలో ఊరేగుతూ విప్లవోద్యమ మనుగడను అత్యంత ఘోరమైన ప్రమాదంలో పడవేస్తూ, మౌలిక సూత్రాలకే వక్రభాష్యం చెబుతున్న అసాధారణ విద్రోహ సమయంలో తోట సీతారామయ్య లాంటి సాదా సీదా కామ్రేడ్స్ విప్లవం కోసం, విప్లవాన్నే సర్వస్వంగా భావిస్తూ చేసిన కృషిని గుర్తు చేసుకోవడం, అలాంటి త్యాగాలను గౌరవించడం చాలా చాలా అవసరం.

  • ఊర్మిళ
Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad