(అరుణతార సంపాదకీయం )
బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూంకాల్ పోరాటం నడిపిన గుండాదుర్.. మావోయిస్టు హిడ్మాగా విప్లవాత్మక పరిణామం చెందాడు. ఈ నూటా పదిహేనేళ్ల కాలాన్ని వర్గపోరాట చరిత్రగా భారత విప్లవోద్యమం అభివృద్ధి చేసింది. సువిశాల దండకారణ్యంలోని దక్షిణ బస్తర్‌లో ఉన్న మారుమూల పువర్తి విప్లవ కుగ్రామంగా ఎదిగి ఈ దేశ విప్లవోద్యమానికి ఒక అగ్రనాయకుడ్ని అందించింది. పీపుల్స్‌వార్ దళాలు బస్తర్‌లో చేసిన విప్లవోద్యమ సన్నాహాలను బాల్యంలో చూసి ప్రభావితుడైన హిడ్మా ఆ తర్వాత ఉద్యమానికే మార్గదర్శిగా ఎదిగాడు. సుమారు పాతికేళ్లపాటు ఆ విప్లవోద్యమ దశలన్నిటిలో తన వ్యక్తిగత జీవిత దశలను దాటుకుంటూ సేనానిగా మారాడు.
దేశ విప్లవం ఎవరికి అవసరమో, ఎవరు దాన్ని నిర్వహించాల్సి ఉన్నదో ఆ ప్రజల దగ్గరికి ఉద్యమం చేరుకున్నాక జరిగే అద్భుత పరిణామాలను హిడ్మా జీవితంలో, ఆచరణలో చూడవచ్చు. ఆయన ప్రధానంగా దండకారణ్యానికే పరిమితమైనా, దేశ విప్లవాన్ని అర్థం చేసుకోగల, నాయకత్వం వహించగల రాజకీయ, సైనిక, సాంస్కృతిక వ్యూహకర్తగా మారాడు. పీడిత ప్రజలను అంటిపెట్టుకొని, వాళ్లను సమరశీలంగా తీర్చిదిద్ది, వాళ్ల చేత, వాళ్ల కొరకు నడిచేలా విప్లవోద్యమాన్ని తీర్చిదిద్దడంలో మావోయిస్టు సుగుణాలన్నిటినీ ఆయన పుణికిపుచ్చుకున్నట్లు ఇవాళ ప్రపంచమంతా గుర్తించింది.
గుండాదుర్ నడిపిన భూంకాల్ మహౌద్యమం ఆదివాసీ జీవన సంస్కృతిలో, పోరాట ఉత్తేజంలో సజీవంగా మిగిలి ఉన్నదనడానికి గత నలభై ఏళ్ల విప్లవోద్యమమే తార్కాణం. ఆనాడు గుండాదుర్‌కు లేని విప్లవ సిద్ధాంత మార్గదర్శకత్వం ఈ కాలపు ఆదివాసులకు చారిత్రకంగా దొరికింది. ఆనాటి పోరాట అనుభవాన్ని విప్లవ లక్ష్యంగా మలుచుకొని సమాజ విముక్తికి సిద్ధమయ్యారు. మూడు తరాల దండకారణ్య విప్లవోద్యమ ఫలితంగా వేలాది గుండాదుర్‌లు ఆవిర్భవించారు. వాళ్లందరి చైతన్యానికి, పోరాటతత్వానికి, సాహసిక త్యాగానికి గుర్తుగా హిడ్మా ఈ కాలపు మహా నాయకుడయ్యాడు.
గుండాదుర్ కాలంతో పోల్చితే మైదాన ప్రాంత దోపిడీ శక్తులు, రాజ్యం అనేక రెట్లు శక్తివంతమయ్యాయి. అందువల్ల ఆదివాసులు అప్పటికంటే తీవ్రంగా జీవన్మరణ పోరాటం చేయవలసి వస్తున్నది. ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పొరేట్ శక్తులు అటవీ ప్రాంతంలోని వనరుల కోసం ఆదివాసుల మీద దండయాత్ర చేస్తున్న కాలంలో ఈ కాలపు గుండాదుర్‌గా హిడ్మా వాళ్లకు నాయకత్వం వహించాడు. కేవలం ఆదివాసులకేగాక, యావత్ భారత పీడిత ప్రజలు కార్పొరేట్ దోపిడీ నుంచి బైటపడ్డానికి చేయవలసిన సుదీర్ఘ పోరాటానికి కావలసిన రాజకీయార్థిక, సైనిక వ్యూహాలను సిద్ధం చేశాడు. వాళ్లందరికీ అవసరమైన పోరాట అనుభవాలను దండకారణ్యపు నెత్తుటి చిత్తడి నుంచి రంగరించి అందించాడు. ఈ దేశ ప్రజలు రాజ్యానికి, సామ్రాజ్యవాదానికి, కార్పొరేట్ పెట్టుబడికి వ్యతిరేకంగా నిలబడవలసిన పోరాట రంగ స్థలాన్ని సిద్ధం చేశాడు.
హిడ్మా దండకారణ్యంలో జీవించి, విప్లవించినా, మరణంతో ఇప్పుడు బస్తర్‌ను దాటి భారతదేశ పోరాట చిత్రపటంగా మారాడు. ప్రపంచ పోరాట ప్రజల ఉత్తేజంగా విస్తరించాడు. ఆయన పరాక్రమం గురించి ఇంత కాలం కథలు కథలుగా చెప్పుకున్నవన్నీ ఇప్పుడు చారిత్రక సత్యంగా మారాయి. హిడ్మా మరణించి మహాశక్తిసంపన్నుడిగా పునర్జీవిస్తున్నాడు. ఆయన మరణం తర్వాత దండకారణ్యాన్ని ఆదానీ కబ్జా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆదివాసుల మనసుల నుంచి హిడ్మాను తొలగించడం భారత రాజ్యానికి సాధ్యమవుతుందా? ఈ దేశ విప్లవోద్యమ చరిత్ర నుంచి ఆయన అజరామర స్ఫూర్తిని రద్దు చేయడం అయ్యేపనేనా? ఆదివాసులకు ఆయన ఎంత ప్రియ మానవుడో అంత్యక్రియల జన సందోహమే ప్రకటించింది. అది కేవలం సంఖ్యతో చెప్పగలిగేది కానే కాదు. వాళ్ల దు:ఖం, ఆగ్రహం, విశ్వాసం, ప్రేమ, ఉత్తేజమూ కలగలసిన ఒక సామూహిక, నైసర్గిక, చారిత్రక ప్రకటన అది. నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో హిడ్మా స్ఫూర్తి వెల్లువెత్తుతున్నది. మొన్నటి దాకా ఆయనను ఒక పేరుగానే విని ఉన్న యువతరం ఇప్పుడు ఆయనను సొంతం చేసుకున్నది. ఏక కాలంలో ఆదివాసులనూ, మైదానవాసులనూ కదిలించగల ప్రేరణాశక్తిగా హిడ్మా రూపాంతరం చెందాడు.
విప్లవోద్యమం గురించి సునిశిత మేధతో, సహృదయంతో ఆలోచించగల వాళ్లందరిముందుకు ఆయన అమరుడై అనేక ప్రశ్నలను తీసుకొచ్చాడు. విప్లవం ఎంత మానవీయమైనదో, అది ఎంత అట్టడుగు నుంచి ప్రజ్వరిల్లుతుందో, వర్గపోరాట రాజకీయాల ప్రభావం ఏమిటో, అందులోని న్యాయ భావన ఎట్లా ఒక సామూహిక శక్తిగా మారుతుందో, విప్లవం ఒక చారిత్రక అవసరంగా నిరూపణ అవుతోందో, అంతిమంగా అదొక నూతన మానవ నిర్మాణ గని వంటిదో హిడ్మా వ్యక్తిత్వం నిరూపించింది.
దీన్నంతా కేవలం నిజాయితీగా, తెగువగా, ధర్మాగ్రహంగా, తన ఆదివాసీ ప్రజల పట్ల ప్రేమగా కుదిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఆయన పెద్దగా చదువుకోలేదనీ, మావోయిస్టు సిద్ధాంతాలు తెలుసుకోగల పరిణతి లేదనీ అంటున్నారు. కానీ ఆయన జీవితమూ, ఆచరణా, అమరత్వమూ చెబుతున్న సందేశం అంత పరిమితమైంది కాదు. అలాంటి వ్యక్తిత్వాల నిర్మాణానికీ, విప్లవోద్యమ నిర్మాణానికీ చరిత్ర పురోగమనంతో ఉన్న సంబంధాన్ని హిడ్మా నిరూపించాడు. చరిత్ర నిర్మాణంలో అట్టడుగు మానవుల సృజనాత్మక, క్రియాశీల పాత్ర గురించిన అనేక సజీవ సిద్ధాంత సమాధానాలు ఆయన మనకు అందించాడు. అత్యంత ప్రాచీన మురియా తెగ నుంచి వచ్చిన హిడ్మా మానవ చరిత్ర నిరంతరాయంగా ఎట్లా పురోగమిస్తున్నదో రుజువు చేసి వెళ్లిపోయాడు.
నిజానికి మనం హిడ్మా అనే వ్యక్తి గురించి, ఒక విప్లవకారుడి గురించి మాట్లాడుకుంటున్నాంగాని, ఆయన మాత్రం ఇటీవలి పాతిక ముప్పై ఏళ్ల విప్లవోద్యమ చరిత్ర గురించి తర్కించుకోడానికి మనకు కొన్ని సామాజిక, సాంస్కృతిక పరికరాలు అందించాడు. సమాజానికి మానవ ఆచరణ కేంద్రమనీ; అందులోంచి సంఘర్షణనూ, యుద్ధాలనూ, నిర్మాణాలనూ, గెలుపు ఓటముల గుండా సాగే ముందు వెనుకల ప్రయాణాలనూ వేరు చేయలేమనే పరిశీలనా పద్ధతి మీదికి మన చూపు మళ్లించాడు.
ఈ దేశ ప్రజల రక్త మాంసాలతో, చైతన్యంతో, వ్యూహాత్మక ఆచరణతో నిర్మాణమైన విప్లవోద్యమం యుద్ధం మధ్య, విద్రోహాల నడుమ చెల్లాచెదరైపోతున్న విషాదకరమైన రోజుల్లో హిడ్మా తన బలిదానంతో కూడా చరిత్ర ఆటుపోట్ల క్రమాన్ని అర్థం చేసుకోగల వెలుగును పంచాడు.
మరో పక్క హిడ్మాను హత్య చేయడానికి భారత రాజ్యం ఎన్ని దాడులు చేసిందో, ఎన్ని కుట్రలు పన్నిందో, ఆయన మరణించాడని ఎన్నిసార్లు అబద్ధాలు ప్రచారం చేసి సంతోషించిందో లెక్కలేదు. ఒక ఆదివాసీ యువకుడి పేరు, ఉనికి ఇంత శక్తిశాలి అయిన సర్వసత్తాక రాజ్యానికి ఎందుకు భయం కలిగించాయి? ఆరోజు గుండాదుర్‌ను హత్య చేయడానికి బ్రిటీష్ పాలకులు చేసినదానికంటే వందల రెట్ల దుర్మార్గానికి భారత రాజ్యాంగబద్ధ పాలన ఎందుకు పాల్పడింది? చివరికి ఆయన లొంగిపోయినా వదిలిపెట్టం అని అధికారికంగానే ప్రకటించిందంటే అది వ్యక్తిగా ఆయన మీద ద్వేషమా? లేక ఆయన ఎంచుకున్న పోరాటమార్గం మీద శతృత్వమా?
తొలి రోజుల్లో ఒక సాధారణ కార్యకర్తగా బయల్దేరి, అంచెలంచెలుగా ఎదిగి కార్పొరేట్లకు, వాళ్ల కోసం అధికారంలో కూచున్న పాలకులకు వణుకుపుట్టించే నాయకుడిగా ఎదగడానికి కారణమైన విప్లవోద్యమం ఉన్నంతకాలం, దానికి దండకారణ్యంలో నాయకత్వం వహిస్తున్న హిడ్మా జీవించినంత కాలం తమ దోపిడీ నడవదని పాలకులు ఆయనను హత్య చేశారు. నిన్నటి దాకా ఆయన పేరు వింటేనే భయపడిన రాజ్యం ఆయనను ఒక నిందితుడిగా, ప్రమాదకరమైన వ్యక్తిగా చిత్రీకరించింది. వర్గయుద్ధంలో బరిగీచి ఒక పక్షం తీసుకున్న నాయకుడు కావడంతో ఆయన మీద క్రూరమైన ప్రచారం చేసి సంతృప్తి చెందింది. ఆయన తన శతృపక్షాన్ని అన్ని వైపుల నుంచి గురి చూసి, ఎక్కడెక్కడి నుంచి కార్పొరేట్ వ్యతిరేక ప్రజా యుద్ధం నడపవలసి ఉన్నదో తెలిసిన వాడు కావడంతో సహజంగానే అవతలివైపు నుంచి ఆయన మీద అనేక అబద్ధ, అసంబద్ధ కథనాలు ప్రచారమయ్యాయి.
కానీ ప్రజలకు హిడ్మా ఏమిటో తెలుసు. ఆయన తమ నుంచి పుట్టి, తమను ముందుకు నడిపించిన నాయకుడు. అచ్చమైన తమవంటి ఆదివాసీ విప్లవకారుడు. అందుకే పాలకుల ఆరోపణలకు భిన్నమైన కథనాలను హిడ్మా కోసమే కాదు, తమ కోసమూ అల్లుకున్నారు. తమ పోరాటానికి ఉన్న చారిత్రకతను, న్యాయబద్ధతను, సమరశీలతను చాటుకొనే జ్ఞాపకాన్ని ఆయన మరణం తర్వాత కూడా పదిలపరుచుకున్నారు.
ఈ రోజు విప్లవోద్యమం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకపోయి ఉండవచ్చు. కానీ దాని త్యాగ సంప్రదాయానికి మరకలు అంటవు. దాని ధీరోదాత్తమైన ఆచరణ వన్నె తగ్గదు. ఈ దేశ ప్రజలు అందుకున్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి ప్రాసంగికత తీరదు. ఇప్పటికిప్పుడు బలాబలాల పొందిక మారవచ్చు, వెనకడుగు వేయవచ్చు, దెబ్బతిని పోవచ్చు, కానీ దాని చారిత్రక పాత్ర ఈ అణచివేతతో, విద్రోహంతో ముగిసిపోయేది కాదు. ఎక్కడ కుంటుపడిందో, సరిగ్గా అక్కడే లేచి నిలబడి, ఈ దేశ ప్రజలను ముందుకు నడిపిస్తుంది. మనం మామూలుగా ఈ వేలాది త్యాగాలు వృథాకావని అంటాం. అది అక్షర సత్యం. ఇన్ని దశాబ్దాల పోరాట అనుభవం కూడా వృథా కాదు. విప్లవం చేయగల మానవ వ్యక్తిత్వాలను, చైతన్యక్రమాలను, పని పద్ధతులను, సాంస్కృతిక, నైతిక విలువలను అందించిన ఈ అసాధారణ ప్రయోగాలు ఎన్నటికీ వృథా కావు. ఈ సమాజాన్ని మార్చగలం.. అత్యంత మానవీయంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దగలం.. అనే భరోసా, విశ్వాసం ఎప్పటికీ ఒట్టిపోవు. జీవితాన్ని ప్రయోగంగా మార్చి, సామాజిక సాంస్కృతిక రాజకీయార్థిక పాలనా ప్రయోగాలు చేసిన విప్లవోద్యమం అడుగుజాడలు తుడిచిపెట్టుకపోవు.
అమరుడు హిడ్మా, ఆయన జీవన సహచరి రాజె, వారితోపాటు మారేడుమిల్లిలో ప్రాణత్యాగం చేసిన వీరులందరూ ఇన్ని దశాబ్దాల విప్లవోద్యమ చరిత్ర నిర్మాణంలో భాగం. ఈ పోరాట సంప్రదాయాన్ని అట్లాంటి వేలాది మంది తమ రక్తమాంసాలతో నిర్మించారు. హిడ్మా కళ్ల ముందు, ఆయన భాగస్వామ్యంతో, నాయకత్వంతో, ఆయన ఆలోచనలతో మానవాకృతిదాల్చిన ఈ చరిత్ర ఎన్నటికీ మలిగిపోదు. త్యాగమూ, ద్రోహమూ ఒరుసుకొని నడుస్తున్న ఈ వర్తమాన చరిత్ర కన్నీరింకి సారవంతమవుతుంది. ద్రోహం ఓడిపోతుంది. త్యాగం లేచి నిలబడుతుంది. అదే మహత్తర చరిత్రను వాగ్దానం చేస్తుంది. అక్కడ కామ్రేడ్ హిడ్మా ఎర్రజెండాలా రెపరెపలాడుతూ కనిపిస్తాడు.

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్రమాలు
హిడ్మాను పట్టించింది ఆ నలుగురే – మావోయిస్టు పార్టీ ప్రకటన
మాడ్వి హిడ్మా – అమిత్ షా: రెండు అభివృద్ధి నమూనాలు
ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత
హిడ్మా మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు - ఇస్తాంబుల్‌లో ప్రచారం
కొందరి ద్రోహం వల్లనే హిడ్మా దొరికాడు;15న పట్టుకొని 19న చంపేశారు – మావోయిస్టు పార్టీ ప్రకటన 