రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (campaign against state repression CASR) పత్రికా ప్రకటన
ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలు, రాజకీయ అసమ్మతిపైన రాజ్యం సాగిస్తున్న క్రమబద్ధమైన దాడికి మరొక నిదర్శనమైన ప్రముఖ సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అరెస్టును ఖచ్చితంగా ఖండిస్తున్నాం..
గాదె ఇన్నయ్యపైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం (ఉపా) సెక్షన్లు 13, 39, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 152 కింద కేసు నమోదు చేసారు.
సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రామచంద్ర రెడ్డి (వికల్ప్) అంత్యక్రియలకు హాజరుకావడం; మావోయిస్టు సిద్ధాంతానికి మద్దతుగా ప్రసంగించారనే ఆరోపణలనే ఈ అరెస్టుకు ప్రధాన ప్రాతిపదికగా చూపించారు.
హింసకు ప్రేరేపించకుండా లేదా చట్టవిరుద్ధమైన చర్యలలో పాల్గొనకుండా—కేవలం ఒక అంత్యక్రియలకు హాజరుకావడం; రాజకీయ లేదా సైద్ధాంతిక అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేరం కాజాలదని స్పష్టంగా చెబుతున్నాం.
“చట్టవ్యతిరేక కార్యకలాపాలు”, “ఉగ్రవాద సంస్థకు మద్దతు” గురించి వివరించే ఉపా సెక్షన్లు 13, 39 వంటి కఠినమైన నిబంధనలను ప్రయోగించడం అనేది, వాస్తవ నేరాలను అరికట్టడం కంటే.. సిద్ధాంతాన్ని, సాంగత్యాన్ని, అసమ్మతిని నేరపూరితం చేయడానికే ఉద్దేశించిన చట్ట దుర్వినియోగం.
“కుట్ర” అని పిలిచే బూటకపు కేసులను సృష్టించడం ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ), సామాజిక, ప్రజాస్వామిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం ఒక విస్తృతమైన, స్థిరపడిన ధోరణిగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.
దేశవ్యాప్తంగా, ఎటువంటి హింసాత్మక లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన ప్రణాళికవేయడం, అమలుచేయడం లేదా పాల్గొనడానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు చూపకుండానే, ఉపా కింద అస్పష్టమైన, నిరాధారమైన కుట్ర ఆరోపణలతో అరెస్టులను సమర్థించుకోవడానికి ఎన్‌ఐఎ ప్రయత్నిస్తోంది.
నిరూపించదగిన నేర ప్రవర్తనపై కాకుండా, కేవలం వారి సైద్ధాంతిక భావజాలం, గత కార్యకలాపాలు, బహిరంగ ప్రసంగాలు లేదా కొన్ని కార్యక్రమాలకు హాజరుకావడం వంటి అంశాల ఆధారంగానే ఇటువంటి కేసులు తయారుచేస్తున్నారు.
“కుట్ర” అనే పదాన్ని ఒక సాగే గుణం కలిగిన ఆరోపణగా మార్చడం ద్వారా, దర్యాప్తు సంస్థలు రాజ్యాంగపరమైన రక్షణలను దాటవేస్తూ, విచారణ లేకుండా జైలు శిక్షను పొడిగిస్తూ, విచారణ ప్రక్రియనే ఒక శిక్షగా మారుస్తున్నాయి. ఇది నిర్దిష్ట చర్యలను, ఉద్దేశాన్ని నిరూపించాలనే నేర చట్టశాస్త్ర ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా, “సాంగత్యం ఆధారంగా నేరస్థులుగా పరిగణించడం”పైన న్యాయవ్యవస్థ పదేపదే ఇచ్చిన హెచ్చరికలకు విరుద్ధంగా ఉంది. గాదె ఇన్నయ్యను లక్ష్యంగా చేసుకోవడం ఎన్‌ఐఎ అనుసరిస్తున్న ఈ కలవరపరిచే ధోరణిలో భాగమే. ఇక్కడ ఉపా చట్టాన్ని సరైన దర్యాప్తు కోసం కాకుండా, రాజకీయంగా భయపెట్టే ఆయుధంగా వాడుతున్నారు.
గాదె ఇన్నయ్యకు సామాజిక, ప్రజాస్వామిక ఉద్యమాలలో సుదీర్ఘమైన, బహిరంగ చరిత్ర ఉందనే అంశాన్ని ముఖ్యంగా గమనింఛాలి. ఆయన అనాథ పిల్లల కోసం ఆశ్రయాలను నడుపుతూ, మద్దతు ఇస్తూ, సామాజిక సంక్షేమం, మానవతా చర్యల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రజాస్వామిక పోరాటంలో ఆయన ముందు వరుసలో ఉండి పనిచేసారు.
అంతేకాకుండా, రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, పౌర హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ‘భారత్ బచావో’ అనే ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక వేదికలో ఆయన నాయకత్వ పాత్రను పోషిస్తున్నారు.
రాజకీయ అభిప్రాయాలను, సైద్ధాంతిక వైఖరిని “ఉగ్రవాద మద్దతు”గా చిత్రీకరించడం ద్వారా, ఒక కార్యకర్త జీవితకాల ప్రజాస్వామిక కృషిని నేరపూరితమైనదిగానూ, చట్టవిరుద్ధమైనదిగానూ మార్చాలని రాజ్యం ప్రయత్నిస్తోందని ఈ అరెస్టు నొక్కి చెబుతోంది. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం.
సిద్ధాంతాన్ని నేరంగా పరిగణించకూడదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పదేపదే స్పష్టం చేసింది. అరూప్ భుయాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం, ఇంద్రా దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం వంటి కీలక తీర్పులలో, నిషేధిత సంస్థలో సభ్యత్వం ఉన్నంత మాత్రాన లేదా ఆ సిద్ధాంతంపై సానుభూతి ఉన్నంత మాత్రాన అది నేరం కాదని కోర్టు పేర్కొంది. హింసకు ప్రేరేపించినట్లు లేదా ఉగ్రవాద, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప, ఎవరినీ నేరస్థులుగా పరిగణించలేమని వివరించింది. కేవలం ఆలోచనల ప్రచారానికి, ప్రజాశాంతికి ముప్పు కలిగించే చర్యల మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసాన్ని కోర్టు నిరంతరం నొక్కి చెబుతోంది.
గాదె ఇన్నయ్యపై కేవలం సైద్ధాంతిక సానుభూతి, అంత్యక్రియల్లో పాల్గొనడం, కల్పిత కుట్ర కథనాల ఆధారంగా ఉపా, బిఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలను ప్రయోగించడం అంటే రాజ్యాంగ గ్యారెంటీలను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అవుతుంది. అసమ్మతిని అణచివేయడానికి, కార్యకర్తలను భయపెట్టడానికి, ప్రజాస్వామిక భాగస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఇటువంటి కఠినమైన చట్టాలను ప్రయోగించడం ఒక ప్రమాదకరమైన ధోరణిగా మారింది.
నేడు మావోయిస్టు సిద్ధాంతాన్ని నేరంగా పరిగణించడం అనేది, రేపు ఏ రకమైన ప్రతిపక్ష, తీవ్రవాద లేదా ఫాసిస్టు వ్యతిరేక సిద్ధాంతాలనైనా నేరంగా పరిగణించడానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నాం. ఆలోచనలను, విశ్వాసాలను, శాంతియుత రాజకీయ వ్యక్తీకరణలను నేరాలుగా పరిగణించినప్పుడు, దర్యాప్తు సంస్థలు రాజకీయ అణచివేతకు సాధనాలుగా మారినప్పుడు ప్రజాస్వామ్యం మనజాలదు.
అందుకని ఈ డిమాండ్లు చేస్తున్నాం
- గాదె ఇన్నయ్యగారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి.
- ఉపా, బిఎన్‌ఎస్‌ఎస్ చట్టాల క్రింద పెట్టిన అబద్ధపు, కల్పిత అభియోగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
- అసమ్మతిని, ప్రజాస్వామిక కార్యాశీలతను అణచివేయడానికి క్రూర చట్టాలను దుర్వినియోగం చేయడాన్ని, కుట్రచేస్తున్నారనే అభియోగాలను మోపడాన్ని వెంటనే ఆపివేయాలి
- హింస లేదా ప్రేరేపణ లేనప్పుడు భావజాలం, సాంగత్యం లేదా విశ్వాసాన్ని నేరంగా పరిగణించడాన్ని నిషేధించిన సుప్రీం కోర్ట్ తీర్పులకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి.
రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామిక స్వేచ్ఛలు, చట్ట పాలనలను కాపాడుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, గాదె ఇన్నయ్యకు, రాజ్య అణచివేతను ప్రతిఘటించే వారందరికీ అచంచలమైన సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం.
ఆర్గనైజింగ్ టీం:
(ఎఐఆర్‌ఎస్‌ఒ, ఎఐఎస్‌ఎ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, ఎఎస్‌ఎ, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎం, భీమ్ ఆర్మీ, బిఎస్‌సిఇఎం, సిఇఎం, కలెక్టివ్, సిఆర్‌పిపి, సిఎస్ఎం, సిటిఎఫ్, డిఐఎస్ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరమ్ అగైన్స్ట్ రిప్రెషన్ తెలంగాణ, ఫ్రెటర్నటీ, ఐఎపిఎల్, ఇన్నోసెన్స్ నెట్వర్క్, కర్నాటక జనశక్తి, ఎల్ఎఎ, మజ్దూర్ ఆధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రికా, ఎన్ఎపిఎం, నజరియా మ్యాగజైన్, నిశాంత్ నాట్య్ మంచ్, నౌరుజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయ్ మంచ్, సమాజ్‌వాదీ జన్‌పరిషద్, సమాజ్‌వాదీ లోక్‌మంచ్, బహుజన్ సమాజ్‌వాదీ మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ పీస్ అలయన్స్, డబ్ల్యూఎస్‌ఎస్, వైఫర్‌ఎస్)

అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
బీజేపీ బాటలో ఆప్… దళితులకు భూమి కోసం పోరాడుతున్న ముకేశ్ మలౌద్ అక్రమ అరెస్ట్
సమాజాన్ని భయాందోళనకు గురిచేసేందుకే గాదె ఇన్నయ్య అరెస్టు -భారత్ బచావో
మన దేశంలో అబద్దపు కేసులు, అరెస్టులు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఇది ఒక ఉదహరణ
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజు జర్నలిస్టు అరెస్టు
Condemn the actions of security forces who are committing severe repression against farmers 