రచన: అజిత్/మురళి
సీపీఐ (మావోయిస్టు) నేతృత్వంలోని విప్లవ ఉద్యమం ప్రస్తుతం మధ్య భారతదేశంలోను, బీహార్–ఝార్ఖండ్ లోను తీవ్రమైన ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్, కేంద్ర సైనిక కమిషన్ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా వంటి పలువురు నాయకులు చనిపోయారు. కొందరు లొంగుబాటు వాదులు శత్రు శిబిరంలో చేరారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని, ఎంఎల్ (మార్క్సిస్టు–లెనినిస్టు) శిబిరంలోని కొన్ని సంస్థలు విస్తృతంగా, తమ వాదనలను హేతుబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ (మావోయిస్టు) ఎదుర్కొంటున్న సంక్షోభం ఆ పార్టీ అనుసరించిన అతివాద సాహసవాద’, విధానాల వల్లనే అనివార్యంగా వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ రోజు మావోయిస్టు విప్లవ ఉద్యమం ఎదుర్కొంటున్న ఎదురుదెబ్బకు నిజంగా లోతైన విశ్లేషణ, అవసరమైన సవరణలు అవసరమే. సీపీఐ (మావోయిస్టు) బహిరంగంగా అందుబాటులో ఉన్న పత్రాలు చూస్తే, వారి నాయకత్వం ఇప్పటికే అనుభవాలను సమీక్షిస్తూ, పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించే ప్రక్రియను ప్రారంభించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రక్రియను వారు మరింత లోతుగా కొనసాగిస్తారన్నది సందేహానికి తావు లేదు. ఎందుకంటే ఇప్పటివరకు వారు అలాగే చేశారు.
అయితే, ఈ విశ్లేషణ, సవరణ ఏ దృక్కోణంతో చేయాలి? 1970ల ప్రారంభంలో భారత విప్లవ ఉద్యమం తీవ్రమైన ఎదురుదెబ్బను ఎదుర్కొంది. సీపీఐ (ఎంఎల్) కేంద్ర నాయకత్వంలోని వారు, విప్లవ మార్గానికి కట్టుబడి ఉన్నవారు, ఆ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ చారు మజుందార్ సహా అనేక మంది చని పోయారు.. ఆ ఎదురుదెబ్బను నిజాయితీగా అధిగమించేందుకు ప్రయత్నించినవారు ఉన్నారు. అదే సమయంలో, నక్సల్బరీ సాయుధ రైతు తిరుగుబాటుతో ఏర్పడిన విప్లవ మార్గాన్ని వదిలేసి, ‘తప్పులను సరిదిద్దుతున్నాం’ అన్న పేరుతో ఎన్నికల మార్గానికి తిరిగిపోయినవారూ ఉన్నారు.
వీరిలో ఎవరు భారత విప్లవ ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చారు? అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపునిచ్చారు? దీనికి సమాధానం అందరికీ స్పష్టంగానే ఉంది. ప్రజల శక్తిని సాయుధ రైతు విప్లవం ద్వారా స్థాపించాలన్న నక్సల్బరీ రాజకీయాలు ఎక్కడ, ఎవరి చేత అమలయ్యాయో కూడా మనకు తెలుసు. ఇది సాధ్యమైంది రాజకీయాలను ముందుండి నడిపించడం ద్వారా, పార్టీని మౌలిక ప్రజల్లో బలంగా పాతుకుపోయేలా చేయడం ద్వారా, ప్రజల నాయకత్వ సామర్థ్యాన్ని విడుదల చేసి అభివృద్ధి చేయడం ద్వారా, దీర్ఘకాల ప్రజా యుద్ధ మార్గాన్ని అనుసరించడం ద్వారా. ఈ మార్గాన్ని అనుసరించినవారు ప్రజలను విస్తృత స్థాయిలో సమీకరించగలిగారు. పాక్షిక డిమాండ్ల కోసం శక్తివంతమైన పోరాటాలు చేసిన ప్రజా సంఘాలను నిర్మించారు. ఆ సామూహిక పనిని అణచివేసే వరకు కొనసాగించారు.
ఈ మార్గాలను వదిలేయకుండా, వాటి మీద నిలబడి కొత్త వ్యూహాలు అభివృద్ధి చేయాలి. అలా చేసినప్పుడే ప్రజల విప్లవ ఆకాంక్షలకు న్యాయం జరుగుతుంది. అలా చేసినప్పుడే విప్లవ మార్గానికి కట్టుబడి ఉంటూనే, ప్రస్తుత ఎదురుదెబ్బను అధిగమించగలుగుతాం.
ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఇదే ఇప్పటికీ నిర్ణయాత్మక ప్రశ్న. 1970లలో ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే.
(అజిత్, విప్లవ మేధావి. అనేక పుస్తకాలు రాశారు. ‘Against Avakianism’, On Brahiminism, మొదలైన పుస్తకాలు రాశారు.)

‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
తల్లికి మావోయిస్టు పార్టీ నాయకుడు పాక హనుమంతు @ గణేష్ లేఖ
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్రమాలు
జైలు చీకటి కొట్లలో కేకలేస్తున్న మానవ హక్కులు: యాతనలు, ఆకలి, క్రూరత్వాల భయంకర చిత్రం
Comrade Thota Seetharamaiah – An Unsung Hero of the Indian Revolution 