Menu

బీజేపీ బాటలో ఆప్… దళితులకు భూమి కోసం పోరాడుతున్న ముకేశ్ మలౌద్ అక్రమ అరెస్ట్

anadmin 1 week ago 0 55

రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం పత్రికా ప్రకటన
30-12-2025

జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ (జెడ్‌పిఎస్‌సి) అధ్యక్షుడు ముకేశ్ మలౌద్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
మహారాష్ట్రలో జరిగిన అంబేద్కర్ మిషన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి పంజాబ్‌కు వస్తుండగా, ముకేశ్ మలౌద్‌ను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు సంగ్రూర్ జిల్లాలోని పాత కేసులు కారణమని పోలీసులు తెలిపారు. వీటిలో 2014లో బలాద్ కలాన్ గ్రామంలో పంచాయతీ భూమిలో దళితులకు దక్కాల్సిన చట్టబద్ధమైన మూడవ వంతు వాటా కోసం జెడ్‌పిఎస్‌సి నేతృత్వంలో జరిగిన ఉద్యమానికి సంబంధించిన కేసు కూడా ఉంది.
మే 20న బీర్ ఈశ్వన్ గ్రామంలో జరగాల్సిన నిరసన ప్రదర్శనకు సంబంధించిన కేసును కూడా పోలీసులు ప్రస్తావించారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మాజీ జింద్ రియాసత్‌కు చెందిన 927 ఎకరాల భూమిని భూమిలేని దళితులకు పంపిణీ చేయాలని జెడ్‌పిఎస్‌సి డిమాండ్ చేసింది. ఆ నిరసన సమయంలో ముకేశ్ మలౌద్‌ అక్కడ లేనప్పటికీ, ఆ పిలుపు ఆయనే ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఉద్యమ సమయంలో 400 మందికి పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకోగా, ఇప్పుడు ఈ కేసులో ముకేశ్ మలౌద్‌ను కూడా అరెస్ట్ చేశారు.
ముఖేష్ మలౌద్ పంజాబ్‌లో దళిత భూ హక్కుల ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. జెడ్‌పిఎస్‌సి అధ్యక్షుడిగా, గ్రామ ఉమ్మడి భూములపై దళితులు, భూమిలేని ప్రజల చట్టబద్ధమైన హక్కుల కోసం ఆయన శాంతియుతమైన, ప్రజాస్వామిక పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉద్యమం కుల వివక్షను, దళిత వర్గాలకు భూ హక్కులను క్రమపద్ధతిలో నిరాకరించడాన్ని నిరంతరం బహిర్గతం చేస్తోంది.
అతని అరెస్టు జరిగిన తీరు—పంజాబ్ వెలుపల జరగడం, పారదర్శకత లేకపోవడం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ప్రత్యేక పోలీసుల సమన్వయంతో నిర్వహించడం మొదలైనవన్నీ ప్రజాస్వామిక అసమ్మతిని అణిచివేసేందుకు జరుగుతున్న ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని వెల్లడిస్తున్నాయి. గతంలో తాను వ్యతిరేకిస్తానని చెప్పుకున్న అణచివేత పద్ధతులనే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తోంది. ప్రజాస్వామ్య హక్కుల విషయంలో, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వానికి, ఇతర ప్రాంతాల్లోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలకు మధ్య ఎటువంటి తేడా లేదు. ప్రజలు తమ హక్కుల కోసం గళమెత్తినప్పుడు, ప్రతిఘటనను అణచివేయడానికి అన్ని పార్టీల ప్రభుత్వాలు రాజ్యాధికారాన్ని ఉపయోగించడంలో ఏకమవుతాయి.
ఈ అరెస్టు విడి ఘటన కాదు. గతంలో కూడా, భూమి లేని దళిత కుటుంబాల భూ హక్కుల కోసం చేస్తున్న చట్టబద్ధమైన పోరాటం కారణంగానే జెడ్‌పిఎస్‌సికి చెందిన పలువురు సభ్యులను, నాయకులను అరెస్టు చేశారు; వారిపైన తప్పుడు కేసులను మోపారు. పోలీసు కేసులు, అరెస్టులు, బెదిరింపులను పదేపదే ఉపయోగించడం అనేది, ఒక ప్రజాస్వామిక ప్రజా ఉద్యమం చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులుగా, ఆ ఉద్యమాన్ని నేరంగా చిత్రీకరించే నిరంతర ధోరణిని ప్రతిబింబిస్తోంది.
భూ సంస్కరణల చట్టాలను అమలు చేసి, భూమి లేని సముదాయాలకు న్యాయం చేసే బదులు, పంజాబ్ ప్రభుత్వం అణచివేత, వేధింపులు, దౌర్జన్యపు చర్యలను ఎంచుకుంది. ముఖేష్ మలౌద్ అరెస్టు స్పష్టంగా పెరుగుతున్న భూ హక్కుల ఉద్యమాన్ని బలహీనపరచడానికి; కార్యకర్తలు, అణగారిన వర్గాలలో భయాన్ని నింపడానికి ఉద్దేశించినదే. ఇటువంటి చర్యలు చేపట్టడం ప్రజాస్వామిక నియమాలను, అసమ్మతిని వ్యక్తం చేసే, సంఘటితమయ్యే, న్యాయం కోసం పోరాడే ప్రాథమిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది.
మా డిమాండ్లు:
ముకేశ్ మలౌద్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి!
జెడ్‌పిఎస్‌సి, సభ్యులు, కార్యకర్తల పైన పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలి!
దళిత, భూమిలేని ప్రజల ఉద్యమాలను అణచివేసే ఎత్తుగడలను అంతం చేయాలి
ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళాన్నెత్తాలని, పంజాబులోని దళితుల భూమిహక్కు పోరాటాలకు సంఘీభావంగా నిలబడాలని అన్నీ ప్రజాస్వామిక శక్తులకు, పౌరసమాజ సంస్థలకు, సంబంధిత ఆందోళన చెందుతున్న పౌరులందరికీ పిలుపునిస్తున్నాం.
ఆర్గనైజింగ్ టీం
(ఎఐఆర్‌ఎస్‌ఒ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, ఎఎస్‌ఎ, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎం, భీమ్ ఆర్మీ, బిఎస్‌సిఇఎం, సిఇఎం, కలెక్టివ్, సిఆర్‌పిపి, సిఎస్ఎం, సిటిఎఫ్, డిఐఎస్ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరమ్ అగైన్స్ట్ రిప్రెషన్ తెలంగాణ, ఫ్రెటర్నటీ, ఐఎపిఎల్, ఇన్నోసెన్స్ నెట్వర్క్, కర్నాటక జనశక్తి, ఎల్ఎఎ, మజ్దూర్ ఆధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రికా, ఎన్ఎపిఎం, నజరియా మ్యాగజైన్, నిశాంత్ నాట్య్ మంచ్, నౌరుజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయ్ మంచ్, సమాజ్‌వాదీ జన్‌పరిషద్, సమాజ్‌వాదీ లోక్‌మంచ్, బహుజన్ సమాజ్‌వాదీ మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ పీస్ అలయన్స్, డబ్ల్యూఎస్‌ఎస్, వైఫర్‌ఎస్)

ఇంగ్లీషు ప్రకటనకు తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad