ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ సాలిడారిటీ విత్ పోలిటికల్ ప్రిసనర్స్
(రాజకీయ ఖైదీల సంఘీభావంలో అంతర్జాతీయ సదస్సు)
తుది తీర్మానం
పారిస్, 2025 డిసెంబర్ 20-21
పాలస్తీనా, కుర్దిస్తాన్, టర్కీ, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, ట్యునీషియా, చిలీ, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, కెమెరూన్, ఇరాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, పెరూ, గ్రీస్, మెక్సికో దేశాలకు చెందిన విప్లవ, పోరాట సంస్థలు, వక్తల భాగస్వామ్యంతో రాజకీయ ఖైదీలకు సంఘీభావం తెలుపుతూ పారిస్‌లో అంతర్జాతీయ సదస్సు (2025 డిసెంబర్ 20–21) జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీల పట్ల అంతర్జాతీయ సంఘీభావాన్ని పెంపొందించడం ద్వారా, ప్రజా పోరాటాలకు, ప్రతిఘటనలకు బాటలు వేసే ఒక ప్రాథమిక శక్తిగా తీర్చిదిద్దుతామని ఈ సదస్సు చేసిన తుది తీర్మానంతో మేం మా ఉమ్మడి నిబద్ధతను చాటుతున్నాము.
సామ్రాజ్యవాద సంక్షోభం, ఫాసిజం పెరుగుదల; అణచివేత పాలనలు
సామ్రాజ్యవాదం తీవ్రమైన, నిర్మాణాత్మక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది సామూహిక పేదరికం, దుర్భరమైన స్థితిగతులు, ప్రతిఘాతుక యుద్ధాలు, మారణహోమాలు, దురాక్రమణలు, తిరుగుబాట్లు, ప్రతిఘటనల రూపంలో స్పష్టమవుతోంది. పెరుగుతున్న ఆయుధాల పోటీని, మూడవ ప్రపంచ యుద్ధానికి జరుగుతున్న సన్నాహాలను, రాజకీయ స్వేచ్ఛను క్రమబద్ధంగా కాలరాయడాన్ని మనం చూస్తున్నాము. పితృస్వామిక పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజల ప్రాథమిక అవసరాలను, స్వేచ్ఛా ఆకాంక్షలను నెరవేర్చడంలో స్పష్టంగా విఫలమైంది; తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఇది హింస, అణచివేత, దౌర్జన్యాలను మరింత ఎక్కువగా ఆశ్రయిస్తోంది.
పెట్టుబడిదారీ విధానం నిరంతర సంక్షోభం ఫలితంగా, అనేక దేశాలలో ఫాసిస్టు ఉద్యమాలు బలపడుతున్నాయి; అధికారంలోకి వస్తున్నాయి లేదా ప్రభుత్వ యంత్రాంగంలో నిర్ణయాత్మక స్థానానికి చేరుకుంటున్నాయి. ఈ ప్రక్రియతో పాటు అణచివేత విధానాలు, పోలీసు హింస, నిఘా వ్యవస్థల విస్తరణ పెరుగుతున్నాయి. పెరూ, భారతదేశం, టర్కీ, ప్రపంచంలోని ఇతర అనేక దేశాలలో, విప్లవ వ్యతిరేక రాజ్య వ్యూహాలలో భాగంగా ‘ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు’ ప్రాథమిక ఆయుధాలుగా మారాయి.
మా ప్రతిఘటనకు ప్రేరణ – రాజకీయ ఖైదీలు
రాజకీయ ఖైదీలతో ఆచరణాత్మక, వ్యవస్థీకృత సంఘీభావాన్ని కలిగి ఉండడం అనేది సమాజ పరివర్తన కోసం అన్ని విప్లవ శక్తులు చేసే పోరాటంలో అంతర్భాగం. చరిత్రలోని ఈ కీలక తరుణంలో, ఖైదీలు ప్రతిఘటనకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు.
రాజకీయ ఖైదీలు ఏకాంత కారాగార వాసాన్ని, శారీరక, మానసిక దాడులను, కమ్యూనికేషన్ ఆంక్షలను, వైద్య సహాయ నిరాకరణను, బహిష్కరణలను, లైంగిక వేధింపులను, అన్ని రకాల చట్టవ్యతిరేక చర్యలను ఎదిరించి పోరాడుతున్నారు. దశాబ్దాల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా, వారి విడుదలలో ఒక పద్ధతి ప్రకారం ఆలస్యం జరుగుతోంది. ఖైదీలకు సంఘీభావం తెలపడం నేరం అవుతోంది. వారి హక్కుల కోసం పోరాడే వారు కూడా అదే రకమైన అణచివేత యంత్రాంగాలను ఎదుర్కొంటున్నారు.
హింస, ఏకాంతం, వైద్య నిర్లక్ష్యం, లైంగిక వేధింపులు ఉన్నప్పటికీ పాలస్తీనా ఖైదీలు జియోనిస్ట్ వలసవాద పాలన అత్యంత క్రూరమైన, నిర్దాక్షిణ్యమైన రూపాన్ని ఎదుర్కొంటూ, జియోనిస్ట్ చెరసాలలను సామూహిక ప్రతిఘటనా కేంద్రాలుగా మార్చారు. జియోనిస్ట్ ఇజ్రాయెల్ పాలన వందలాది మంది పాలస్తీనా బాల ఖైదీలను కూడా అదే రకమైన క్రూరత్వానికి గురిచేస్తోంది.
పాలస్తీనా ప్రజలపై జియోనిస్ట్ రాజ్యం సాగిస్తున్న మారణహోమ విధానాల నేపథ్యంలో, ఖైదీలు ఎదుర్కొంటున్న దాడులను, హింసను అంతం చేయడానికి వెంటనే అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిస్తున్నాం.
టర్కీలో, విప్లవవోద్యమాలు, కుర్దిష్ ప్రజల స్వేచ్ఛా పోరాటం, సోషలిస్టు శక్తులపైన ఫాసిస్ట్ రాజ్యం సాగిస్తున్న సంపూర్ణ యుద్ధానికి జైళ్లు కేంద్రబిందువులుగా ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన “వెల్-టైప్ జైళ్ల”1 వంటి తీవ్రమైన ఏకాంత పరిస్థితులు, నిరంకుశ హింసకు గురవుతున్నప్పటికీ, ఖైదీలు వెనక్కి తగ్గకుండా, తమను అణచివేయాలని, నాశనం చేయాలని చూస్తున్న రాజ్య ప్రయత్నాలను ధిక్కరిస్తున్నారు.
ఖైదీలందరికీ వారి మాతృభాషలో విద్య, రక్షణ, సమాచార సంబంధాల హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. 26 ఏళ్లుగా జైలులో ఉన్న అబ్దుల్లా ఓకలాన్‌పైన2 ప్రయోగిస్తున్న “ప్రత్యేక చట్టాన్ని” రద్దు చేయాలని, విడుదల కావాల్సిన ఖైదీలను విడుదల చేయాలని, రాజకీయ ఖైదీలందరికీ విడుదలవుతామని “ఆశ పడే హక్కును” (రైట్ టు హోప్) కల్పించాలని, ఫాసిస్ట్ ఆంక్షలు, చట్టాలను రద్దు చేయాలని మేము కోరుతున్నాము.
ఇరాన్‌లో కార్మికులు, ప్రజలు, మహిళలు సాగిస్తున్న స్వేచ్ఛా పోరాటం ప్రగతిశీల మానవాళి అందరి ఉమ్మడి పోరాటం. ఈ పోరాటం సామ్రాజ్యవాద, జియోనిస్ట్ జోక్యాలకు వ్యతిరేకంగా కూడా సాగుతోంది. ఇరాన్‌లోని ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీలు చేపట్టిన ‘మంగళవారం నిరసనలు’ 3 నిరాహార దీక్షలకు మా సదస్సు విప్లవాత్మక అభినందనలు తెలియజేస్తోంది. ఇరాన్ తదితర దేశాలలో సాగుతున్న ఉరిశిక్షలకు వ్యతిరేక పోరాటం, రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావం తెలపడంలో అత్యంత తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలలో ఒకటి అని మేము నొక్కి చెబుతున్నాము.
యూరప్‌లో కొత్త ఫాసిస్ట్ ఉద్యమాల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వాలతో అవి ఏర్పరుచుకుంటున్న ఫాసిస్ట్ కూటమిలు, రాజకీయ వాతావరణంలో వస్తున్న మితవాద ధోరణులు జాత్యహంకార, ఫాసిస్ట్ విధానాల అమలుకు దారితీస్తున్నాయి. ప్రతిఘటనోద్యమాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను ఉపయోగిస్తున్నారు; వలసదారులు, విప్లవకారులు, సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులపైన అణచివేత తీవ్రమవుతోంది. పాలస్తీనాకు సంఘీభావం తెలపడాన్ని ఒక “నేరం”గా ప్రకటిస్తున్నారు; ప్రదర్శనలను నిషేధిస్తున్నారు; రాజకీయ కార్యకలాపాలను అణచివేస్తున్నారు.
ఉత్తర ఆఫ్రికాలో, ముఖ్యంగా ఈజిప్ట్, మొరాకోలో రాజకీయ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటం తీవ్రమైన దాడులకు గురవుతోంది. మెక్సికోలో, స్టానిక ప్రజలు, విప్లవ సంస్థలు, సామాజిక ప్రతిపక్షాలపైన రాజ్య హింసకు జైళ్లు ప్రధాన కేంద్రాలుగా మారాయి. పెరూ దేశం జైళ్లను అణచివేతకు, భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఒక సాధనంగా ఎలా ఉపయోగిస్తుందో ‘పెర్సియో కేసు’ 4 వంటి రాజకీయ కేసులు స్పష్టంగా చూపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా, కెమెరూన్ వంటి దేశాలలో తిరుగుబాట్లలో పాల్గొంటున్న ప్రజలను అరెస్టు చేసి వారి గొంతు నొక్కుతున్నారు; పెట్టుబడిదారీ లాభాపేక్ష వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రకృతిని, తమ నివాస ప్రాంతాలను కాపాడుకోవడానికి పోరాడుతున్న స్వదేశీ ప్రజలను, కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు; హత్య చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రతిఘటించేవారు వీధుల్లో అణచివేత పాలనలను సవాలు చేస్తూనే ఉన్నారు.
భారతదేశంలోని ‘కగార్ ఆపరేషన్’ ద్వారానూ, ఫిలిప్పీన్స్‌లోనూ కనిపిస్తున్నట్లుగా, ప్రతిఘటించే, పోరాడే విప్లవ శక్తులు ప్రపంచ బూర్జువా వర్గం నుండి నిర్మూలనా దాడులను ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ శక్తులు జైళ్లలోనూ, ప్రతిఘటన ముందు వరుసలలోనూ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.
సామ్రాజ్యవాద-పెట్టుబడిదారీ వ్యవస్థ పితృస్వామ్యాన్ని, హెటెరోసెక్సిజంను (భిన్నలింగ సంపర్కాన్ని) నిర్మాణాత్మక అణచివేత యంత్రాంగాలుగా ఉపయోగిస్తోంది. అందువల్ల, మహిళలు, వ్యక్తులు బహుముఖ దోపిడీకి, హింసకు, వ్యవస్థీకృత తిరస్కరణకు లక్ష్యంగా మారారు. మహిళలు, ఎల్‌జిబిటి+ ఖైదీలు జైళ్లలో ఎదురవుతున్న లైంగిక వేధింపులను, అణచివేతను ప్రతిఘటించడం ద్వారా పితృస్వామ్య హింసా సాధనాలను సవాలు చేస్తున్నారు.
ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని మేము పిలుపునిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో లైంగిక హింసను అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అంతర్జాతీయ సంఘీభావం; ఉమ్మడి పోరాటం
అంతర్జాతీయ సంఘీభావం మన సామూహిక ప్రతిఘటనకు పునాది. మనం ఎటువంటి పరిస్థితుల్లో పోరాడినప్పటికీ, అణచివేత పరిస్థితులకు, వాటి హింసాత్మక సాధనాలకు వ్యతిరేకంగా మనం సాగించే ఉమ్మడి పోరాటమే మనల్ని ఏకం చేస్తుంది. పాలస్తీనా ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం సాగుతున్న పోరాటానికి మద్దతుగా ఉద్భవించిన ‘గ్లోబల్ ఇంటిఫాడ’5 లో ఈ సంఘీభావం అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది.
‘కుఫియా’ (పాలస్తీనీయనులు ఉపయోగించే స్కార్ఫ్) కేవలం మధ్యప్రాచ్యంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విముక్తికి ఒక ప్రపంచ చిహ్నంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలతో మా సంఘీభావం పెరుగుతోంది. దశాబ్దాల తరబడి జైలు శిక్ష అనుభవించి, విముక్తి పొందిన కామ్రేడ్ అరెనాస్, జార్జెస్ ఇబ్రహీం అబ్దుల్లా, లియోనార్డ్ పెల్టియర్‌లకు మేము విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. విడుదలైన తర్వాత కూడా పోరాటాన్ని కొనసాగిస్తూ వారు ప్రదర్శిస్తున్న గౌరవప్రదమైన వైఖరి మాకు శక్తిని, స్థైర్యాన్ని ఇస్తుంది.
బూర్జువా వ్యవస్థ చెరసాలల్లో ఉండి, ప్రతి విచారణలోనూ, ప్రతి అన్యాయమైన తీర్పుతోనూ తమ ప్రతిఘటనను రోజురోజుకూ బలోపేతం చేస్తున్న రాజకీయ ఖైదీలందరికీ మేము వందనం చేస్తున్నాము. అహ్మద్ సాదత్, మర్వాన్ బర్గూతీ, ముమియా అబు-జమాల్, జైనబ్ జలాలియన్, డిమిత్రిస్ చాట్జివాసిలియాడిస్, నికోస్ మాజియోటిస్, డానియెలా క్లెట్టే, ఫిగెన్ యుక్సెక్డాగ్, హటీస్ డెనిజ్ అక్తాస్, ఫిల్టన్ 24, ఇంకా ఇక్కడ పేర్లు చెప్పలేకపోతున్న లెక్కలేనంత మంది ఇతర రాజకీయ ఖైదీలు మా కొనసాగుతున్న ప్రతిఘటనకు స్ఫూర్తిప్రదాతలు.
రాజకీయ ఖైదీల ప్రతిఘటన అనేది నిరసనలు, వ్యవస్థను ఎండగట్టే వాదనలు, సృజనాత్మక కార్యకలాపాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షల ద్వారా అన్ని రకాల నిర్మూలన విధానాల నుండి ప్రాణాలను కాపాడుతుంది. వారి ప్రతిఘటనే మా ప్రతిఘటన.
మార్చి 8, మార్చి 18, ఏప్రిల్ 17, జూన్ 19, డిసెంబర్ 3 వంటి రాజకీయ పోరాట ముఖ్య దినాలలో సంఘీభావ చర్యలను మరింత సమన్వయం చేయాలని పిలుపునిస్తున్నాం.
అందువల్ల, రాజకీయ ఖైదీలతో సంఘీభావం తెలిపే అంతర్జాతీయ సదస్సులో “రాజకీయ ఖైదీల సంఘీభావం కోసం అంతర్జాతీయ సమన్వయ కమిటీ”ని (ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఫర్ సాలిడారిటీ విత్ పోలిటికల్ ప్రిసనర్స్) స్థాపించాలని నిర్ణయించాం. రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావాన్ని విస్తరించడం, పోరాటాన్ని బలోపేతం చేయడానికి సమాచార, సహకారాలను పెంపొందించడం; ఈ సమన్వయ కమిటీ తన రాజకీయ, ఆచరణాత్మక కార్యకలాపాలను సమీప భవిష్యత్తులో ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ చొరవ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ సదస్సు అందించిన ఐక్యత, ఉత్సాహంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీలందరికీ మేము మా అచంచలమైన సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము.
రాజకీయ ఖైదీలందరికీ విముక్తి లభించాలి! అంతర్జాతీయ సంఘీభావం వర్ధిల్లాలి!
ప్రిసనర్స్ వాయిస్ ప్లాట్‌ఫాం (టిఎస్‌పి)
2025 డిసెంబర్ 21.
నోట్స్: 1. “వెల్-టైప్ ప్రిజన్” (వెల్-టైప్ జైళ్ళు) అనే పదం టర్కీలోని ఖైదీలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆధునిక, అత్యంత భద్రత కలిగిన జైలు సౌకర్యాలను విమర్శించడానికి ఉపయోగించే ఒక అనధికారిక పదం. ముఖ్యంగా న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కొత్త Y- & S-రకం జైళ్లను ఇలా పిలుస్తారు.
అధికారికంగా, టర్కీలో మూడు ప్రధాన రకాల జైళ్లు ఉన్నాయి: మూసివేసిన, పాక్షిక-బహిరంగ (సెమీ-ఓపెన్), బహిరంగ (ఓపెన్) జైళ్లు. వీటితో పాటు F-రకం వంటి ఉన్నత భద్రతా సౌకర్యాలు ఉండే జైళ్ళు కూడా ఉన్నాయి.
“వెల్-టైప్” జైళ్ల లక్షణాలు: ఈ జైళ్లలోని కఠినమైన పరిస్థితులు, ఒంటరితనాన్ని, నియంత్రణను పెంచే విధంగా రూపొందించిన వాటి నిర్మాణ శైలిని బట్టి వీటికి ఈ పేరు వచ్చింది. వీటి ముఖ్య లక్షణాలు:
- ఏకాంతమూ- పరిమిత సామాజిక సంబంధాలు: ఖైదీలు రోజుకు 23 గంటలు ఒంటరిగా లేదా చిన్న సమూహాల సెల్స్‌లో గడుపుతారు. ఇతర ఖైదీలతో మాట్లాడటం చాలా వరకు నిషేధం.
- నిర్మాణ శైలి: ఖైదీలకు బయటి ప్రపంచం కనిపించకుండా ఈ జైళ్లను నిర్మిస్తారు. వీరికి కేవలం గంట సేపు మాత్రమే ఆకాశాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణాన్ని ఒక “దుర్భర లోకం” లాగా వర్ణిస్తారు.
- నిఘా: నిరంతరం కెమెరా నిఘా ఉండటం వల్ల గోప్యత ఉండదు, ఇది ఖైదీలపై మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
- పరిమిత హక్కులు: వైద్యం, ఫోన్ కాల్స్, ఉత్తరాలు, కుటుంబ సభ్యుల సందర్శన వంటి ప్రాథమిక హక్కులపై ఆంక్షలు ఉంటాయి.
- మానసిక ప్రభావం: తీవ్రమైన ఒంటరితనం కారణంగా ఖైదీలు నిద్రలేమి, కుంగుబాటు (డిప్రెషన్) వంటి మానసిక సమస్యలకు గురవుతున్నారు.
టర్కీలోని మానవ హక్కుల సంస్థలు, పార్లమెంటరీ విచారణలు ఈ జైళ్లలో హింస, ఖైదీలను మానసికంగా దెబ్బతీసే చర్యలు జరుగుతున్నట్లు గుర్తించాయి. కిర్సెహిర్- మర్మారా (సిలివ్రి) వంటి ప్రాంతాల్లోని జైళ్లు రాజకీయ ఖైదీలపై అణచివేతకు చిహ్నాలుగా మారాయి.
2.ఓజలాన్ 1999లో అరెస్టు అయిన నాటి నుండి దేశద్రోహం, వేర్పాటువాదం ఆరోపణలపైన న జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. జైలులో ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు, ప్రభుత్వం ఇద్దరినీ ప్రజాస్వామ్య పరిష్కారం వైపు నడిపించడంలో ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. (2024-2025): 2024 చివరలో, 2025లో, టర్కీ పార్లమెంటు సభ్యులు ఆయనను కలవడం, ఆయన న్యాయవాదులతో సంప్రదింపులు పెరగడం వంటి మార్పులు చోటుచేసుకున్నాయి. ఇది శాంతి ప్రక్రియలో సంభావ్య మార్పుకు సంకేతంగా నిలిచింది.ఈ పరిణామాల తర్వాత, పికెకె (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ)తన పోరాటాన్ని విరమించి, టర్కీ నుండి తమ యోధులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జైలు పరిస్థితులు: నివేదికల ప్రకారం ఆయన జైలు పరిస్థితులు స్వల్పంగా మెరుగుపడి, పరిమితంగా ఇతరులతో కలిసే అవకాశం లభించినప్పటికీ, ఆయన ఇప్పటికీ ఎక్కువగా ఏకాంతంలోనే ఉన్నారు. అయినప్పటికీ, ఆయన రాజకీయ పరిష్కారాల కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు.
3.డిసెంబర్ 23, 2025న, ఇరాన్ పీపుల్స్ మొజాహెదీన్ ఆర్గనైజేషన్ (PMOI/MEK) అనుబంధ “రెసిస్టెన్స్ యూనిట్లు”, ఇరాన్ అంతటా విస్తృతంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో “ఉరిశిక్షలొద్దు – మంగళవారాలు” ప్రచార కార్యక్రమం 100వ వరుస వారాన్ని జరుపుకున్నాయి.
ఘెజెల్హేసర్ జైలులో ప్రారంభమై ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 జైళ్లకు విస్తరించిన ఈ ప్రచారంలో, రాజకీయ ఖైదీలు ప్రతి వారం నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వం మరణశిక్షలు విధించడాన్ని నిరసిస్తున్నారు. రెసిస్టెన్స్ యూనిట్లు జైలులో పుట్టిన ఈ పోరాటాన్ని వీధుల్లోకి తీసుకెళ్లి, ఒక సమన్వయ జాతీయ ఉద్యమంగా మార్చాయి.
4.పెరూలో రాజకీయ అణచివేత; ‘పెర్సియో’ కేసుపై విశ్లేషణ
2022 మార్చి 10 నుండి, పెరూ అధికారులు ఆ దేశంలోని ప్రధాన ప్రతిపక్ష శక్తి అయిన ‘మూవ్‌మెంట్ ఫర్ ఆమ్నెస్టీ అండ్ ఫండమెంటల్ రైట్స్’ (మొవాడెఫ్) పైన. గత ప్రభుత్వాల వలెనే, ప్రస్తుత పెరూ అధికారులు కూడా ప్రతిపక్షాలపైన ద్వేషం, పగతో కూడిన విధానాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాలు, ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను ఉల్లంఘిస్తూ పెరూ న్యాయ వ్యవస్థ ఈ లక్ష్యానికి వంత పాడుతోంది.
ముఖ్య అంశాలు: ‘పెర్సియో’ అని పిలవబడే ఈ న్యాయ ప్రక్రియ ‘మూవ్‌మెంట్ ఫర్ ఆమ్నెస్టీ అండ్ ఫండమెంటల్ రైట్స్’ (మొవాడెఫ్) ని నాశనం చేయడానికి రూపొందించబడింది. 2022 మార్చి 31న జరిగిన సెషన్‌లో, నిందితుల తరపు న్యాయవాదులను వాదించకుండా నిషేధించారు; కేసు గురించి అవగాహన లేని ప్రభుత్వ న్యాయవాదులను వారిపై రుద్దారు. 2014లో ఒబామా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని మొవాడెఫ్‌ని అంతం చేయడమే లక్ష్యంగా ఈ రాజకీయ ప్రణాళికను రూపొందించింది. పెరూలోని ప్రతి ప్రభుత్వం ఈ వేధింపుల ప్రక్రియలో అక్రమంగా జోక్యం చేసుకుంటూనే ఉంది.
పెరూలో సామ్యవాద భావజాలాన్ని నిర్మూలించడమే అమెరికా, పెరూ అధికారుల బహిరంగ లక్ష్యం. అమెరికా సైనిక వ్యూహాలకు పెరూ ఒక ముఖ్యమైన ప్రాంతం. మొవాడెఫ్ సభ్యులకు 15 ఏళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలు వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా, మరణించిన ఖైదీల మృతదేహాలను కూడా మాయం చేసేలా పెరూ ప్రభుత్వం అమానుషమైన చట్టాలను తెచ్చింది. ఇది గతంలోని నాజీ నియంతృత్వ విధానాలను గుర్తుకు తెస్తోంది. దేశంలో ఆర్థిక, సామాజిక సంక్షోభం ముదురుతున్న తరుణంలో, ఆకలి, పేదరికంపై ప్రజలు నిరసన తెలపకుండా అడ్డుకోవడమే ఈ అణచివేత వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.
5.”ఇంతిఫాదా” అనేది అరబిక్ పదం, ఇది “దులిపివేయుట” లేదా “విదిలించుట” అనే అర్థం వచ్చే క్రియ నుండి పుట్టింది. ఇన్స్టిట్యూట్ ఫర్ మిడిల్ ఈస్ట్ అండర్‌స్టాండింగ్ ప్రకారం, 1987-1993; 2000-2005 మధ్య కాలంలో వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీలో ఇజ్రాయెల్ ఉనికికి వ్యతిరేకంగా జరిగిన “రెండు ప్రధాన తిరుగుబాటులను” వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
ఈ రెండు ఇంతిఫాదా కాలాల్లోనూ పాలస్తీనియన్లు శాంతియుత నిరసనలు, శాసనోల్లంఘన చర్యల్లో పాల్గొన్నారు, అయితే వీటిని ఇజ్రాయెల్ భద్రతా దళాలతో జరిగిన హింసాత్మక ఘర్షణలు, ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రవాద దాడులతో కూడా గుర్తిస్తారు. 1987లో మొదటి ఇంతిఫాదా ప్రారంభం నుండి, రెండవ ఇంతిఫాదాను ముగించిన 2005 షర్మ్ ఎల్ షేక్ శిఖరాగ్ర సమావేశం వరకు జరిగిన ఇటువంటి సంఘటనలలో 1,000 కంటే ఎక్కువ మంది ఇజ్రాయెలీలు, సుమారు 5,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ సైనిక ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రతిఘటనకు అంతర్జాతీయ మద్దతును కోరడానికి “గ్లోబలైజ్ ది ఇంటిఫాడను ప్రపంచవ్యాప్తం చేయాలి (గ్లోబలైజ్ ది ఇంటిఫాడ) అనే నినాదాన్ని ఉపయోగించారు. రెండవ ఇంతిఫాడ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘీభావ ప్రదర్శనలలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. అక్టోబర్ 7 దాడుల తర్వాత గాజాలో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను ప్రారంభించినప్పటి నుండి, పాలస్తీనా అనుకూల ప్రదర్శనలలో ఇది ఒక సాధారణ నినాదంగా మారింది.
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

