Menu

‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్‌

anadmin 2 days ago 0 247

తెలుగు సాహిత్యంలో పెద్ద పెద్ద పేర్లు చాలానే వినుంటాం. కొత్త కొత్త పేర్లు కూడా వింటూనే ఉన్నాం. మనం వింటున్న పేర్లకు సమాంతరంగా రూపుదిద్దుకుంటున్న రచయితలు ఎందరో ఉన్నారు. రోజువారిగా మనం చదువుతున్న సాహిత్యానికి సమాంతరంగా అజ్ఞాత రచయితలు రాశిపోస్తున్న రచనలు ఎన్నో ఉన్నాయి. అవి మనకు తెలిసిన ‘గొప్ప’ రచనలకు ఏమాత్రం తీసిపోవు. ఎందుకంటే, అవి కాల్పనిక రచనలు కావు. నిత్యం మృత్యువుతో తలపడే జీవితానుభవంలోంచి పుట్టుకొచ్చిన రచనలు. విప్లవాచరణలో తమదైన అస్తిత్వాన్ని పూర్తిగా రద్దుచేసుకున్న వాళ్లు చేసిన రచనలు.

తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్పులాంటి ఈ రచనల్ని విప్లవ రచయితల సంఘం ఇటీవల వెలువరించింది. మావోయిస్టు ఉద్యమంలో భాగమైన మహిళా రచయితలు రాసిన కథలను ‘వియుక్క’ పేరుతో ఆరు సంకలనాలను ప్రచురించింది. అజ్ఞాత జీవితం గడుపుతున్న, గడిపిన మహిళా గెరిల్లాలు రాసిన దాదాపు 280కిపైగా కథలు ఈ సంకలనంలో భాగమయ్యాయి. యాభై మందికిపైగా అజ్ఞాత రచయిత్రులు రాసిన కథలు. ఈ రచయితలు ఎవరు అని చెప్పడం కష్టమే. ఎందుకంటే, వాళ్లు తమ సొంత పేర్లను రద్దుచేసుకొని విప్లవోద్యమంలో భాగమైన వాళ్లు. వాళ్లలో చాలామంది మహిళా గెరిల్లాలు అమరులయ్యారు కూడా. ఈ కథలు చదవితే… వాళ్ల సృజన్మాకతను ఇంతకాలం గుర్తించనందుకు మనమీద మనకు జాలేస్తుంది. మన పక్కనే జరుగుతున్న యుద్ధ బీభత్సం వైపు, దాన్ని సవాల్‌ చేసి సంఘర్షణలో నిలబడిన జీవితాల వైపు దృష్టిసారించని మనలో ఓ గిల్టీ మొదలవుతుంది.

సాహిత్య ప్రమాణాల గురించి, వస్తువు, శిల్పం గురించి గంభీరమైన మాటలు మాట్లాడే సాహితీ జీవులు ఇటు వైపు చూస్తే, దండకారణ్య సాహిత్యోద్యమం గడిచిన ఐదు దశాబ్దాల్లో ఎంత పరిణతి సాధించిందో అర్థమవుతుంది. విప్లవోద్యమంవైపు అడుగులేయడం మొదలు, వర్గపోరాటాన్ని పదునెక్కించే క్రమంలో మావోయిస్టు ఉద్యమం ఎలా కొత్త పుంతలు తొక్కిందో ఈ రచనల్లో కనిపిస్తుంది. దళ జీవితం మొదలు, ఆదివాసీ సమాజాల్లో సాంఘీక దురాచారాలపై పోరాటం, స్త్రీ – పురుష సంబంధాలు, ప్రజా యుద్ధం వరకు ఇలా కథాంశాలు ఈ కథల్లో కనిపిస్తాయి.

దాదాపు 3000 పేజీల్లో ఆరు సంకలనాలుగా వెలువడిన మహిళా గెరిల్లాల సాహిత్యంలో చేరని రచనలు ఇంకా ఎన్నో ఉండే ఉంటాయి. ఎందుకంటే, నిత్యం యుద్ధం మధ్యన సాగే ప్రయాణంలో తమ రచనల్ని కాపాడుకోవడం కూడా ఒక యుద్ధమే. అయినా, తీవ్ర శత్రు నిర్బంధంలో కూడా మావోయిస్టు ఉద్యమం వేరు వేరు భాషల్లో, వేరు రంగాలకు ప్రాతినిథ్యం వహించే పత్రికలను దశాబ్దాలుగా నిర్వహిస్తోంది. వాటిల్లో పార్టీ సభ్యులు, గెరిల్లాలు చేసిన రచనలను ప్రచురిస్తోంది. అలాంటి సేకరించడం కూడా కష్టమే. అలా ఎందరో మావోయిస్టు రచయితలు దళ జీవితంలో ఉంటూ చేసిన రచనలు బయటి ప్రపంచం దృష్టికి రాకుండానే శత్రువు చేతజిక్కి ఉండవచ్చు.

అలాంటి ఆరు కథలను ‘అప్రతిహత’ పేరుతో ప్రచురించింది అమరుల బంధు మిత్రుల సంఘం. గతేడాది జూన్‌ 18న మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో అమరురాలైన మావోయిస్టు నాయకురాలు అరుణ వేరువేరు పేర్లతో రాసిన కథలను సంకలనంగా ప్రచురించింది. మహిళా సమస్యలపై పనిచేస్తూ, రెండున్నర దశాబ్దాల క్రితం విప్లవోద్యమంలోకి వెళ్లిన చైతన్య మావోయిస్టు అరుణక్కగా మారింది. విప్లవోద్యమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ చనిపోయేనాటికి ఆంధ్ర – ఒడిశా బార్డర్‌ స్పెషల్ జోనల్‌ కమిటీ సభ్యురాలిగా ఉంది.

రెండున్నర దశాబ్దాల ఉద్యమ జీవితమంతా ఆంధ్ర, ఒడిశాలోని ఆదివాసీల మధ్యే సాగింది. ఆదివాసీల్లో ఆదివాసీగా మారిన అరుణ, వారిని ప్రజా యుద్ధ గెరిల్లాలుగా మార్చడంలో కీలక భూమిక పోషించింది. ‘అప్రతిహత’ కథా సంకలనాన్ని పరికిస్తే, ప్రజాయుద్ధం ఎందుకు అనివార్యమో స్పష్టంగా అర్థమవుతుంది.

2018లో జరిగిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో ప్రధాన పాత్రదారి అంటూ మీడియా చేసిన ప్రచారంలో అరుణ పేరును చానాళ్లుగా వింటూనే ఉన్నాం. కానీ, ఆమె కేవలం గెరిల్లా సైనికురాలే కాదు, మంచి రచయిత్రి కూడా. తాను విప్లవోద్యమంలోకి వెళ్లక ముందు, మహిళా సమస్యలపై పనిచేస్తున్న కాలంలో రాసిన ‘ప్రశ్నిస్తేనే’ కథ మొదలు, 2023లో తన తమ్ముడి అమరత్వం నేపథ్యంలో రాసిన ‘వేగుచుక్క’ కథ వరకు ప్రతి కథలోనూ గొప్ప రచనా నైపణ్యాన్ని ప్రదర్శించింది.

‘కరవు దాడి’ కథలో ఆకలితో అలమటించే ఆదివాసీలు అన్నలతో కలిసి సాహసాన్ని కళ్లకు కట్టింది రచయిత్రి. ఆకలితో చనిపోయే కంటే, పోరాడి చనిపోవడమే నయమనుకున్న ప్రజలు వర్గపోరులో ఎలా భాగమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ‘అప్రతిహత’ కథలో – ప్రజల భాగస్వామ్యంలో విప్లవోద్యమం సాధించిన గొప్ప విజయాన్ని అక్షరీకరించారు రచయిత్రి. ఒడిశాలోని కోరాపుట్‌ ఆయుధ కర్మాగారంపై దాడి చేసి, ఆయుధాలు తీసుకెళ్లిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజాయుద్ధాన్ని ముమ్మరం చేసే క్రమంలో విప్లవోద్యమం చేసిన పెద్ద సాహసం ఇది. ఇందుకోసం విప్లవోద్యమం ఎంత పకడ్బందీ వ్యూహరచన చేసిందీ, అందులో ప్రజల భాగస్వామ్యం ఎలా సాధ్యమైంది. విప్లవోద్యమ చర్యకు ప్రజలు ఎలా అండగా నిలిచారో ఈ కథ చెబుతుంది. కరువు దాడి, అప్రతిహత కథాంశాలు భారత విప్లవోద్యమంలోని గుణాత్మక మార్పుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఒక రకంగా మొబైల్ వార్‌ స్థాయికి చేరుకున్న దశను ఈ కథలు కళ్లకుకడతాయి.

‘ఎర్రజెండా’ కథలో తీవ్ర నిర్బంధం మధ్యలో కూడా ప్రజలు తమ హక్కుల కోసం ఎలా నిలబడ్డారో అర్థమవుతుంది. మావోయిస్టు ఉద్యమం ప్రజలు దూరమైందని, అడవికే పరిమితమైందని వాదనచేసే వాళ్లకు విప్లవోద్యమం నీటిలో చేపల్లా ప్రజల్లో ఎలా కలిసిపోయిందే అర్థం చేయించే కథ ఇది. ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, గృహదహనాలు, అత్యాచారాలు వీటన్నిటి నడమ కూడా ప్రజలు ఎలా విప్లవోద్యమం వెంట ఎలా నిలిచారో నారాయణ పట్న భూపోరాటం చెబుతుంది. మరోవైపు భౌతిక నిర్మూలనతో పాటు మానసిక యుద్ధానికి తెగించిన రాజ్యానికి ఎప్పటికైనా ఓటమి తప్పదని చెప్పే కథ ‘చరిత్ర మునుముందుకే’. బూటకపు సరెండర్లు, మావోయిస్టు వ్యతిరేక ప్రతిఘాతుక ఆందోళనలు, స్థూపాల కూల్చివేతలు, ఉద్యమంపై తప్పుడు ప్రచారాలు, గ్రామాల్లో పోలీసుల క్యాంపుల నడుమ కూడా తిరిగి నిలబడగలమన్న విశ్వాసాన్ని విప్లవోద్యమం ఎలా ప్రోదిచేసుకుంటుందో చెబుతుంది. అమరుడు కామ్రేడ్‌ సాకేత్‌ జ్ఞాపకాలతో సాగే ఈ కథ ఇవాల్టి సందర్భంలో తప్ప చదవాల్సినది.

చివరి కథ ‘వేగుచుక్క’ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు ఉద్యమాన్ని వెతుక్కుంటూ వెళ్తే, వాళ్ల జ్ఞాపకాల్లో జీవితాన్ని వెళ్లదీసే తల్లిదండ్రుల కథ. చిత్రవధచేసి, శరీరాన్ని జల్లడ చేసి కొడుకును చంపేస్తే, కుళ్లి, పురుగులు పట్టిన స్థితిలో శవాన్ని తెచ్చుకొని నా కొడుకు ప్రజలకోసం ప్రాణమిచ్చాడని గర్వంతో కన్నీళ్లను అదుముకున్న తండ్రి కథ. ఇది నా ఒక్కడి దుఃఖం కాదని, సామూహిక దుఃఖమని, అది అంతమయ్యే రోజొకటి వస్తుందని ఎదురుచూస్తున్న తల్లి కథ.

ముహుర్తాలు పెట్టి మరీ విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని పాలకులు ప్రకటిస్తున్న వేళ, మారిన పరిస్థితుల్లో దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని రాజ్యం ముందు మోకరిల్లిన వాళ్లు నీతిసూత్రాలు వల్లిస్తున్న వేళ ఈ కథల అవసరం ఎంతో ఉంది. విప్లవోద్యమ భవితవ్యం చుట్టూ అనేకానేక ప్రశ్నలు పొడచూపుతున్న వేళ వర్గపోరాట రాజకీయాలను అర్థం చేసుకునేందుకు, విప్లవసాహిత్యోద్యమంలో భాగమైన ఈ అరుదైన రచనలు చదవాల్సిందే. ప్రజా యుద్ధ పంథా విఫలమైందని, విప్లవోద్యమం పూర్తిగా నష్టపోవడానికి అదే కారణమనే వాదన వినిపిస్తున్న సమయంలో; విప్లవోద్యమం సాధించిన విజయాలను, ఆదివాసీలకు ఇచ్చిన పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకునేందుకు ఈ కథలు చదవాల్సిందే.

” ‘ఉద్యమాలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మనలో చాలా మంది గందరగోళపడతారు. మనం గెలుస్తామా? అనే సందేహాలు కూడా కలుగుతాయి. అలాంటప్పుడు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూడాలి. చరిత్రను గతితార్కిక దృక్పథంతో అర్థం చేసుకోవాలి. వీరోచిత పోరాటాల్లో ప్రజలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. చరిత్రలో న్యాయమైన ప్రజా యుద్ధాలన్నీ గెలిచాయి. మనమూ గెలుస్తాం. ఓటములు, వెనుకంజలు తాత్కాలికమే. ప్రతి ఓటమీ విజయానికి తల్లి వంటిదే. ప్రతికూలతల్లోనూ అనుకూలతలను పట్టుకోవాలి.’ సూటిగా, తీక్షణంగా సాకేత్‌ నోటి నుండి…” (‘చరిత్ర మునుముందుకే’ కథ నుంచి…)

అప్రతిహత పుస్తకం విరసం బుక్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad