Menu

ఈ నెల 24, 25వ తేదీల్లో విరసం 30వ మహాసభలు

anadmin 1 day ago 0 98

భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం

నక్సల్బరీ ఉద్యమం భారతదేశ ప్రజా రాజకీయాల్లోకి వర్గపోరాటాన్ని తీసుకొచ్చింది. వర్గపోరాట అత్యున్నత రూపంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను పీడిత వర్గానికి అందించింది. ఒక సమగ్ర పోరాట మార్గంగా ప్రజా జీవితంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. నక్సల్బరీ ప్రజ్వలనలో పుట్టిన విప్లవ రచయితల సంఘం భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాట రాజకీయాలను ఆచరిస్తోంది. తన సృజనాత్మక రచనతో, విశ్లేషణతో ముందుకు తీసుకపోతోంది.
వర్గపోరాటం ఒక చారిత్రక నియమమే అయినా, అది నిర్దిష్ట స్థల కాల రూపాల్లో కొనసాగుతుంది. తక్షణ, దీర్ఘకాల సామాజిక పరిణామాలను వ్యక్తులు గ్రహించలేకపోయినా మానవ సమాజం వర్గపోరాటం మీదే పురోగమిస్తుంటుంది. సమస్త ప్రజా ఆకాంక్షల్లో, వాటి వ్యక్తీకరణల్లో, భిన్న సామాజిక పరివర్తనా రూపాల్లో వర్గపోరాట అంశ ఉంటుంది. సామాజిక ప్రయోగాల్లో, శాస్త్ర ఆవిష్కరణల్లో, భావజాల సాంస్కృతిక సంఘర్షణల్లో వర్గపోరాటం ఇమిడి ఉంటుంది. పాత నాగరికతా గర్భం నుంచీ, ప్రాచీన సామాజిక, సాంస్కృతిక బంధనాల నుంచీ స్వేచ్ఛా మానవుల ఆవిర్భావం వర్గపోరాట ఇరుసు మీదే సాధ్యం. కార్మికవర్గం తన విప్లవాత్మక చైతన్యంతో, నిర్ణయాత్మక వర్గపోరాట ఆచరణతో పెట్టుబడిదారీ దశ నుంచి, దాని అత్యున్నత రూపమైన సామ్రాజ్యవాదం నుంచి చరిత్రను ముందుకు తీసుకపోతుంది.
ఇంత విశాలమైన జీవన తాత్వికతగా, రాజకీయార్థిక సారంగా, వందల వేల ప్రజా పోరాట రూపాల అంతరార్థంగా, వేర్వేరు సామాజిక రాజకీయ, సాంస్కృతిక పక్రియలుగా, అంతిమంగా చరిత్ర చోదకంగా వర్గపోరాటాన్ని విప్లవ రచయితల సంఘం అర్థం చేసుకుంటోంది. ఈ యాభై ఐదేళ్లుగా విప్లవోద్యమ దశలన్నిటిల్లోంచీ, అన్ని సామాజిక జీవన సంక్షోభ సందర్భాల్లోంచీ వర్గపోరాటాన్ని గ్రహించి, అర్థం చేసుకొని రచిస్తోంది, వివరిస్తోంది.

ఇప్పుడు విప్లవోద్యమ సంక్షోభం అలాంటి ఒక ప్రత్యేక సందర్భం. ఇది గత చరిత్రలో ఎన్నడూ అనుభవంలోకి రానిది.

హిందుత్వ కార్పొరేట్ ఫాసిజం ఈ దేశం మీద మంద్రస్థాయి యుద్ధం చేస్తున్న సందర్భం ఇది. ప్రజల రక్తమాంసాలతో, సృజనాత్మకతతో, చైతన్యంతో నిర్మించుకున్న నాగరికతనూ, సంస్కతినీ, పోరాట ధారలనూ తుడిచి పెట్టే మారణకాండ నడుస్తున్నది. ఇందులో భాగంగానే ఫాసిస్టులు విప్లవోద్యమ నిర్మూలనకు కగార్ ఆపరేషన్ ఆరంభించారు. ఫాసిజం అనేక సూక్ష్మ, రహస్య, అదృశ్య, ప్రచ్ఛన్న రూపాల్లో కూడా విధ్వంసానికి పాల్పడుతూ చివరి మావోయిస్టును కూడా హత్య చేయడానికి అంతర్యుద్ధాన్ని తలపించే అణచివేత కొనసాగిస్తున్నది. రాజకీయ, సైనిక, సాంస్కతిక అణచివేత రూపాల్లో మంద్రస్థాయి యుద్ధ వ్యూహాన్ని సామ్రాజ్యవాద వెన్నుదన్నుతో భారత పాలకవర్గం ఆరంభించిందనే ఎరుక 2005నాటికే భారత విప్లవోద్యమానికి ఉన్నది. ఎప్పటి నుంచో జాతి విముక్తి ఉద్యమాల మీద ఈ రణతంత్రం అమలవుతూ వచ్చింది. అది కగార్ రూపంలో విప్లవోద్యమాన్ని, మొత్తంగా సమాజాన్ని అనేక స్థాయిల్లో చుట్టుముట్టిన ఈ విషాదకర సందర్భంలో విరసం తన ముప్పైవ మహా సభలను భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం అనే ఇతివృత్తంతో నిర్వహించాలనుకుంటోంది.

విప్లవోద్యమ చరిత్రలోనే సంక్షోభ సందర్భం:
ఇరవయ్యో శతాబ్ది విప్లవాలు, సోషలిస్టు ప్రయోగాలు చరిత్రలో కలిసిపోయాక ఇక వర్గపోరాటానికి కాలం చెల్లిపోయిందనీ, పెట్టుబడిదారీ విధానమే చరిత్ర తుది ఘట్టమనే రాజకీయ సిద్ధాంత వాతావరణం ఆవరించింది. ఈ శతాబ్దం అన్ని రకాలుగా చరిత్రను కొత్త దశలోకి తీసికెళ్లింది. ఈ కాలంలోనే అనేక దేశాల్లో విప్లవోద్యమాలు ముందంజ వేశాయి. అణచివేత వల్ల, అంతర్గత సమస్యల వల్ల సంక్షోభాల్లోకీ వెళ్లిపోయాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనే భారత విప్లవోద్యమం అభివృద్ధి సాధించింది. 1990ల నుంచి పాలకవర్గం తనకు అనుగుణమైన కొత్త భారతదేశాన్ని నిర్మించే పథకాన్ని ముమ్మరం చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా విప్లవోద్యమం నిజమైన ప్రజా భారతదేశాన్ని విప్లవాత్మకంగా నిర్మించే పనికి పూనుకుంది. అప్పటికి ముప్పై ఏళ్లుగా విప్లవోద్యమంలో లేని అనేక కొత్త భావనలను, ఆచరణ రూపాలను, నిర్మాణ పక్రియలను ప్రవేశపెట్టి గొప్ప ముందంజతో 1990ల మధ్య నుంచి విప్లవోద్యమం గుణాత్మక దశలోకి వెళ్లింది. అంతకు ముందు లేని అత్యద్భుతమైన ప్రజాస్వామిక పోరాటాలు కూడా ఈ కాలం నుంచే ఆరంభమయ్యాయి. ఈ సమయంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తన రూపాన్ని కూడా వదిలేసి నియంతృత్వశక్తిగా మారింది. చివరికి అది కార్పొరేట్స్వాంమ్యంగా, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా మారింది.
ఈ సందర్భంలో విప్లవోద్యమం గ్రీన్ హంట్ నుంచి మూడు నాలుగు చుట్టివేత అణచివేతలకు గురైంది. కగార్ పేరిట పాలకవర్గం ప్రకటించిన అంతిమ యుద్ధంలో చిక్కుకపోయింది. ఇవన్నీ కలిసి వెనుకంజలో పడింది. ఈ అణచివేతలోంచే విప్లవ ప్రతీఘాతుకత్వం వలన సంక్షోభం తలెత్తింది. ఈ స్థితి గత యాభై ఏళ్లలో విప్లవోద్యమం ఎదుర్కొన్న అంతర్గత సవాళ్ల వంటిది కాదు. గత యాభై ఏళ్లలో జరిగిన చీలికల్లాంటిది కూడా కాదు. నిస్సందేహంగా సంక్షోభకాలం ఇది. విప్లవ పంథానే సమూలంగా నిర్మూలించే యుద్ధ వ్యూహం ఇది.

కాబట్టి సహజంగానే ఇది విప్లవోద్యమం గురించి తీవ్రమైన రాజకీయ, సిద్ధాంత చర్చా సందర్భంగా మారిపోయింది. ఇది ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి, మానవాళి భవితవ్యం గురించిన భావజాల సంఘర్షణగా మారింది. ఇన్ని దశాబ్దాల విప్లవోద్యమ రాజకీయాల అనుభవాన్నీ, ఆచరణనేగాక ఈ సంక్షోభం లేవనెత్తిన అనేకానేక రాజకీయ, సైద్ధాంతిక, సాంస్కతిక ప్రశ్నలన్నిటితో సునిశితంగా, దృఢంగా తలపడవలసిన సందర్భం.
భారత విప్లవోద్యమ ప్రస్తుత సంక్షోభ సందర్భంలో వినిపిస్తున్న వాదనలను, వైఖరులను అర్థం చేసుకోడానికి సైద్ధాంతిక, రాజకీయ చర్చా సంవిధానం అవసరం. లేకపోతే చిలువల వాదనలు, స్వీయాత్మక వైఖరులు, శుష్క మానవతావాద అంచనాలు, వాస్తవాలతో నిమిత్తం లేని పాండిత్య ప్రదర్శనలు.. వెరసి చరిత్రపట్ల వినయం లేని విచిత్ర విన్యాసాలే సత్యమయ్యే ప్రమాదమేర్పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, లోతైన అంతర్మథనంతో, గడచిన అనుభవాల సంశ్లేషణలతో, గాఢమైన గుణపాఠాలతో దీర్ఘకాల వ్యూహాత్మక సిద్ధాంత కృషి చేయడానికి విప్లవ, ప్రగతిశీల మేధో శిబిరం సిద్ధం కావాలి.

ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభ స్వభావం ఏమిటి? దాని మూలాలేమిటి?
ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభం తాత్కాలికమైనదీ కాదు. తక్షణంగా ముగిసేదీ కాదు. దీనికి గతంలో మూలాలు ఉంటాయి. భవిష్యత్తును ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. విప్లవోద్యమ నిర్మూలనా పథకానికి నాయకత్వం వహిస్తున్న కార్పొరేట్ హిందుత్వ శక్తుల స్వభావం వల్ల ఇది భావజాల సంక్షోభంగా కూడా మారింది. అణచివేతతో విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించడం అసాధ్యం అని తెలుసుకున్నాకే బైటి శక్తులతో తలపడే యుద్ధ పద్ధతినీ, లోపలి నుంచి వేరుపురుగులా తొలిచేసే అంతర్గత విధ్వంస పద్ధతినీ కలిపి ఒకే ఆపరేషన్ ను బహిరాంతర రూపాల్లో తయారు చేసుకున్నది. 2024 జనవరి 1న ఆపరేషన్ కగార్ ను సైనిక రూపంలో మొదలు పెట్టింది. దీనికి మాతృక మంద్రస్థాయి యుద్ధతంత్రం. భారతదేశంలోని రెండు అభివృద్ధి నమూనాల మధ్య, ఫాసిస్టులకూ-విప్లవ ప్రజాస్వామిక లౌకిక పీడిత అస్తిత్వ శక్తులకూ మధ్య దశాబ్దాల సంఘర్షణ ఈ రూపం తీసుకున్నది. సమాజమంతా అలుముకపోయిన ఈ ఫాసిస్టు అణచివేత సాంద్ర రూపంలో విప్లవోద్యమం మీద కొనసాగుతున్నది. దీని లక్ష్యం విప్లవోద్యమ నిర్మాణాన్నే కాదు, విప్లవ పంథానే తుడిచిపెట్టేయడం.

సాయుధ పోరాట విరమణే ప్రస్తుతం అనుసరించాల్సిన మార్గమని చెప్పడం కగార్లోజ భాగం. తీవ్రమైన అణచివేత మధ్య కూడా కూడా దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని కొనసాగిస్తామని విప్లవోద్యమం ప్రకటించింది. జరుగుతున్న పరిణామాలను ఆ వైపు నుంచి చూస్తేనే వర్గపోరాటం గీటురాయి మీద భావజాల రంగంలో ప్రతీఘాతుక శక్తులనూ, కార్పొరేట్ ఫాసిస్టు శక్తులనూ ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఇదంతా వర్గపోరాట రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రజా పోరాటాల మీద విశ్వాసం పోయేలా తయారైంది. చరిత్ర పురోగమనం మీదే సందేహాలు లేవదీసింది. ఇదంతా ఒకానొక నిర్మాణ వ్యవహారం కానే కాదు. భావజాల రంగానికి, సిద్ధాంత, చారిత్రక దృక్పథాలకూ నేరుగా సంబంధించింది. దీన్ని ఎదుర్కోవాలంటే వర్గపోరాటాన్ని భావజాల రంగంలో కేంద్ర స్థానానికి తేవాల్సిందే.

మన మేధో రంగం ఎట్లా ప్రతిస్పందిస్తోంది?
సమాజం చాలా మారిందనీ, విప్లవకారులు మారాలనే వాదనను చాలా కాలంగా కొంత మంది మోసుకతిరుగుతున్నారు. వీళ్లందరి ఉమ్మడి నినాదం ‘మావోయిస్టులు మారాలి’. ఈ ప్రజాస్వామ్యం పొడువు వెడల్పులకు, ఎత్తు లోతులకు తగినట్లు విప్లవకారులు మారాలి. సారాంశంలో విప్లవాన్నీ, సాయుధ పోరాటాన్నీ ఆపేయాలి. ఈ ధోరణి మన మేధో వాతావరణాన్ని ఎంతో కొంత ఆవరించి ఉంది.
ఇది స్థూల చిత్రమేగాని, ఇందులో కనీసం మూడు రకాల సమూహాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న కగార్ అణచివేతలో ప్రాణనష్టం నివారించడానికి లొంగుబాటు తప్పదని ఉదారవాదులు అంటున్నారు. సాయుధ పోరా•ం తగదనీ, అందునా ఇప్పుడు అసలే తగదనీ, ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా చేస్తేనే ఫలితాలు ఉంటాయనీ వీళ్లు అంటున్నారు. వీళ్లకు వర్గపోరాటమంటే ఏమిటో తెలియదు. అందువల్ల లొంగుబాటును ఆశావహంగా చూస్తున్నారు. వీళ్లు మొదటి సమూహం.

ఇక రెండో రకం వాళ్లు ఏనాడో విప్లవాన్ని వదిలేసి వచ్చారు కాబట్టి, అందరూ తమ దారిలోకే రావాలని కోరుకుంటున్నారు. పాత వ్యతిరేకతలను ప్రకటించడానికి అన్ని సందర్భాలను వాడుకుంటున్నారు. ఆచరణలోనే కాదు, ఆలోచనల్లో కూడా నిష్క్రియగా తయారైన వాళ్లకు ఆ పక్క బలిదానాలతో విప్లవోద్యమం కొనసాగుతూ ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి నైతిక వెరపు లేని భావజాల వాతావరణం కావాలని కోరుకుంటారు. దాని కోసం విప్లవోద్యమ పంథా తప్పనీ, ప్రజలకు దూరమైందనీ, విప్లవం ఒక అబద్ధమనీ, అది ఎన్నటికీ నిజం కాదనీ, విప్లవం కేవలం కాల్పనిక భావన అనీ, సమాజంతో సంబంధం లేని సాహసమనీ, ఇంత కాలం ప్రత్యామ్నాయాలనుకున్నవేవీ ప్రత్యామ్నాయాలు కాదనీ, అసలు అలాంటివేవీ లేవనీ, ఎప్పటికైనా కనుక్కోగలమో లేదో తెలియదనీ, ముందు సాయుధ పోరాటాన్నయితే వదిలేయాలనీ గట్టిగా చెబుతున్నారు.
ఈ ‘ప్రజాస్వామ్యం’ ఘోరంగా ఉందని అంటూనే, విప్లవమైతే వద్దని అనగల తాత్విక లేమి, అచారిత్రకత, వాస్తవ పరిస్థితులు గ్రహించలేని మేధో వైకల్యపు అంచుల్లో వీళ్లు ఉన్నారు. బైటకి మాత్రం విప్లవం వద్దనడం లేదనీ వీళ్లు వాదించవచ్చు. కానీ ఇవన్నీ పైపై మాటలే. సారాంశంలో యథాతథ స్థితిని సమర్థించే వాదనలివి. పైగా ఇండ్లలో భద్రంగా ఉండేవాళ్లు అడవుల్లో విప్లవకారులను పోరాడమని ఎట్లా చెబుతారనే ఎదురు ప్రశ్న వేస్తున్నారు. విప్లవ రాజకీయాలనూ, చరిత్ర గతినీ నైతిక స్థాయికి ఎవ్వరు కుదించినా అది అవివేకమే. వీటికి భయపడకుండా వర్గపోరాట చైతన్యంతో తీవ్రంగా తలపడవలసిన భావజాల వాతావరణం ఇది.

మూడో రకం విమర్శలు వాదనలు వామపక్ష, విప్లవ సంస్థల నుంచి వినిపిస్తుంటాయి. వీటిలో దృఢమైన రాజకీయ వైఖరులు ఉంటాయి. ఇవన్నీ ఒకటి కాదు. పార్లమెంటరీ కమ్యూనిస్టుల వాదనలు చాలా కాలంగా వింటున్నవే. చారుమజుందార్ అతివాదాన్ని పూర్తిగా వదిలిపెట్టకుండా, కొన్ని సవరణలతో అనుసరించడం వల్లే ఈ స్థితి వచ్చిందనే వాదన విప్లవ శిబిరంలోంచి ఈ సందర్భంలో కూడా వినిపిస్తోంది. విప్లవోద్యమాన్నీ, రాజ్యాన్నీ, విరుద్ధ శక్తుల సంఘర్షణనూ విశాలమైన చారిత్రక ప్రపంచంలో చలనంలో చూడకుండా, ఫాసిస్టు పని విధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, అతివాద బాలారిష్టమనే పాత కాలపు మాటలనే పునరుక్తి చేస్తున్నారు. విప్లవ శిబిరంలోని ఇంకో వాదన ఏమంటే భారతదేశంలో సర్వ స్వతంత్ర పెట్టుబడిదారీ విధానం ఉన్నదనీ, దానికి తగినట్లు విప్లవ కార్యక్రమం లేకపోవడం వల్ల విప్లవోద్యమానికి ఈ ఎదురు దెబ్బ తగిలిందనీ వీళ్లు అంటున్నారు. భూస్వామ్యం ఎంతో కొంత ఉన్న ప్రాంతాల్లో పని చేస్తూ చివరికి ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లిపోయి ఆదివాసీ విప్లవోద్యమంగా కుదించుకపోయిందనీ వీళ్ల వాదన. ఈ వాదనల్లో విప్లవోద్యమ చరిత్రలోని విస్తరణ-కుదింపులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవలసే ఉన్నది.

విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎట్లా చూడాలి?
విప్లవోద్యమం సవాళ్లను ఎదుర్కొన్న ప్రతిసారీ విప్లవ పంథా తప్పని వాదన లేవదీయడం కొత్తేమీ కాదు. పారిస్ కమ్యూన్ దెబ్బతినిపోయినప్పుడూ, 1905లో రష్యన్ విప్లవం ఘోరమైన ఓటమికి గురైనప్పుడూ ఎన్ని వాదనలను చూడలేదు? కానీ ఆ రెండు సందర్భాల్లో మార్కస్, లెనిన్ కార్మిక వర్గం మరింత దృఢంగా వ్యవహరించి ఉండాల్సిందని చెప్పారు. చరిత్రలోని పోలికలతో ఎంత సౌకర్యం ఉంటుందో అంతే అసౌకర్యం కూడా ఉంటుంది. అయినా సరే 1905లో రష్యన్ విప్లవం తీవ్రంగా నష్టపోయినప్పటి మేధో, రాజకీయ వాతావరణమే ఇప్పుడూ సుమారుగా కనిపిస్తోంది. దీన్ని విప్లవోద్యమ పరిమితులతో, బలహీనతలతో, లోపాలతో సహా కలిపి చూడాలి. ఇదంతా కేవలం నిర్మాణ, సైనిక రంగాలకే సంబంధించింది కాదు. తాత్విక, సిద్ధాంత రంగాల్లో కూడా ఈ వెనుకంజకు కారణాలు ఉంటాయి. ఒక్కోసారి తీవ్ర సంఘర్షణా దశే రాజకీయంగా, సైద్ధాంతికంగా కొత్త అవగాహనలను ప్రేరేపిస్తుంది. అన్ని రంగాల్లో విస్తరణకు దారి చూపుతుంది. భారత విప్లవోద్యమం తీవ్ర అణచివేతను, ముఖ్యంగా ఫాసిస్టు అంతర్యుద్ధాన్ని తట్టుకొని రెండు దశాబ్దాలపాటు నిలబడగలిగింది. ఈ కాలమంతా పౌర సమాజం నుంచి మద్దతు పొందింది. ఇంత అణచివేత మధ్యనే ఎన్నో రాజకీయ, సాంస్క•తిక ప్రయోగాలు చేసి, తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నది.

ఈ ఆచరణాత్మకత అనుభవాల నుంచి ప్రస్తుత సంక్షోభాన్ని అర్థం చేసుకోగల సైద్ధాంతిక చర్చా పద్ధతిని అనుసరించాలి. సాహిత్యం, కళలు, భావజాలం, సంస్క•తి తదితర రంగాల్లో ప్రతీప శక్తులను ఎదుర్కోగల సరికొత్త వ్యూహాత్మక సన్నద్ధం చేయాలి. గత యాభై ఏళ్లుగా విప్లవోద్యమం సాహిత్య విమర్శతో సహా పాటలు, కళారూపాలు, కథలు, కవిత్వం, నవలలు, వాటి భాషా వ్యక్తీకరణల్లో సహితం తీసుకొచ్చిన మార్పులు క్షేత్రస్థాయిలో దీర్ఘకాలిక ప్రజా యుద్ధ ఆచరణ సాధించిన విజయాలనూ, అది సరైనదనే వాస్తవాన్నీ నిరూపించాయి. విప్లవ పంథాకు వ్యతిరేకంగా ఇప్పుడు లొంగుబాటుదారులు, కొందరు మేధావులు లేవనెత్తిన వాదనలను, సంశయాలను రాజకీయార్థిక, భావజాల, సాంస్క•తిక కోణాల్లో ఎదుర్కోవలసి ఉన్నది. ఫాసిజం, మంద్రస్థాయి యుద్ధం, ఆపరేషన్ కగార్ సంస్క•తీ విధ్వంసానికి కూడా పాల్పడుతున్నాయి. నైతికశక్తిని ధ్వంసం చేసి, వ్యవస్థకు లొంగిపోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న వాదనలన్నిటిలో ఇలాంటి సాంస్క•తిక, నైతిక, భావజాల కోణాలు బలంగా ఉన్నాయి. వీటిని వర్గపోరాట చైతన్యంతోనే ఎదుర్కోగలం. మారుతున్న పరిస్థితుల్లో విప్లవానికీ, విప్లవోద్యమ పంథాకూ రాజ్యం నుంచీ, వ్యవస్థ నుంచీ ఎదురవుతున్న సవాళ్లను భావజాల, సాంస్క•తిక రంగాల్లో ఎదుర్కోవలసి ఉన్నది. ఆ లక్ష్యంతోనే విరసం తన 30వ మహా సభలు నిర్వహిస్తోంది. అందరికీ ఇదే స్వాగతం.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad