Menu

మన దేశంలో అబద్దపు కేసులు, అరెస్టులు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఇది ఒక ఉదహరణ‌

anadmin 3 days ago 0 67

ఈ దేశంలో ప్రభుత్వాలకు నిరసన గొంతు వినిపించే ప్రజలపై పోలీసుల అబద్దపు కేసులు, దాష్టికాలు ఎలా ఉంటాయో మనకు కొత్తేంకాదు. ఆ ప్రభుత్వం బీజేపీదా, కాంగ్రెస్ దా, బీఆరెస్ దా, టీడీపిదా, వైసీపీదా లేక తృణమూల్ కాంగ్రెస్ దా అనే దానితో సంబంధం లేకుండా పాలిస్తున్నదెవరైనా వారి అడుగులకు మడుగులొత్తడం పోలీసులకు ట్రైనింగ్ లోనే అబ్బుతుందనుకుంటా. రెండు సంవత్సరాలుగా స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న హిందోళ్ మజుందార్ అనే విద్యార్థిని బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఈ ఏడాది మార్చ్ లో జరిగి ఓ నిరసనకు సంబంధించిన ఓ కేసులో ఇరికించి, ఆయన నిన్న స్పెయిన్ నుండి వచ్చి ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే అరెస్టు చేశారు. ఆయన అరెస్టు ను ఖండిస్తూ రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం Campaign Against State Repression (CASR) విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం…

రీసెర్చ్ స్కాలర్ హిందోళ్ మజుందార్‌ను కలకత్తా పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఈ ఏడాది మార్చిలో విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు కాన్వాయ్ పైన జరిగిన దాడిలో పాల్గొన్నాడనే ఆరోపణలు చేసి ఆయనపై జారీ చేసిన ఒక లుక్అవుట్ సర్క్యులర్ ఆధారంగా గత రెండు సంవత్సరాలుగా స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న జాధవపుర్ విశ్వవిద్యాలయంలో ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి హిందోళ్ మజుందార్‌ను ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఉదయం 10:30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.
యూనివర్సిటీలో ఉన్నప్పుడు హిందోళ్ బెంగాల్‌లోని డెమోక్రటిక్ యూత్-స్టూడెంట్స్ అసోసియేషన్‌లో పని చేసాడు. 13వ తేదీ సాయంత్రం, అతని తల్లిదండ్రులను (జాదవ్ పూర్ యూనివర్సిటీ నుండి పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు) ఢిల్లీ పోలీసులు ఐజిఐ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అతన్ని కలకత్తా పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు.
పది గంటల పాటు అతడిని వేధింపులకు గురిచేసిన తరువా అతని ఫోన్, ల్యాప్‌టాప్‌లను బలవంతంగా స్వాధీనం చేసుకున్న కోల్‌కతా పోలీసులు అతడిని అదే కేసు కింద అరెస్టు చేశారు. కేసు 39/25 u/s 126{2), 118{1), 54, 324{2), 61{2) బిఎన్ఎస్ 3&5 పిడిపిపి యాక్ట్, 9 డబ్ల్యుబిఎమ్ ఒ యాక్ట్, 2 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002తో కలిపి చదవాలి.
ఈ ఆరోపణలలో అక్రమ నిరోధం, ప్రమాదకరమైన మార్గాల ద్వారా గాయం లేదా తీవ్రమైన గాయం కలిగించడం, దుర్మార్గం, నేరపూరిత కుట్ర, ప్రజా ఆస్తికి నష్టాన్ని కలుగచేసే లేదా పాడుచేసే చర్యలు, జాతీయ జెండాను గౌరవించకపోవడం మొదలైనవి ఉన్నాయి. ఈ కేసు పూర్తిగా తప్పుడు కేసు; పోలీసు బలగాల కల్పిత కథనం ఆధారంగా పెట్టిన కేసు.
బ్రాత్య బాసు వాహన కాన్వాయ్ పై జరిగిన “దాడి”గా చెబుతున్న ఘటన వాస్తవానికి జాధవ్‌పూర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, వివిధ ప్రజాస్వామిక, ప్రగతిశీల విద్యార్థి సంస్థలు తమ డిమాండ్లను టీఎంసీకి అనుబంధంగా ఉన్న పశ్చిమ బెంగాల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూబీసీయూపీఏ) సమావేశానికి వచ్చిన బెంగాల్ విద్యాశాఖ మంత్రికి సమర్పించడానికి నిర్వహించిన ఉమ్మడి నిరసన. గత ఐదేళ్లుగా వాయిదా పడిన యూనియన్ ఎన్నికల గురించి విద్యార్థులు శాంతియుతంగా బసుతో చర్చలు జరపడానికి ప్రయత్నించినప్పుడు, వారిపైన వెయ్యి మందికి పైగా టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు గల గూండాలు దాడి చేసారు.
విద్యార్థులు తన వాహనం ముందు గుమిగూడినప్పుడు, వారితో మాట్లాడే బదులు, మంత్రి ఎదురుగా వచ్చిన విద్యార్థులపైకి తన వాహనాన్ని నడిపించి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతని కారు ఢీకొట్టడంతో రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ (ఆర్ ఎస్ ఎఫ్) కు చెందిన ఒక విద్యార్థికి తలపై గాయం తగిలి విపరీతంగా రక్తం కారి, ఐసియులో చేర్చాల్సి వచ్చింది. మరో డెమోక్రటిక్ యూత్-స్టూడెంట్స్ అసోసియేషన్ (DYSA డి వై ఎస్ ఎ) కార్యకర్తకు మెడ, కాళ్ళ మీద తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మరో పది మంది ఆసుపత్రిలో చేరారు. విద్యార్థులను చంపే ప్రయత్నంలో కారును నడిపించిన మంత్రిపై చర్యలు తీసుకోని రాజ్యం, పోలీసులు విద్యార్థులను వేధింపులు, బెదిరింపులు, కల్పిత ఆరోపణలతో అరెస్టు చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
బసు కాన్వాయ్‌పై జరిగిన దాడి నిజానికి విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలనే ప్రజాస్వామిక డిమాండ్ కోసం నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై మంత్రి, ఆయన అనుచరులు చేసిన దాడి. ఇది విద్యా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలపై దాడి. 2021లో లఖింపూర్‌లో నిరసన ప్రదర్శిస్తున్న రైతులపై మంత్రి కొడుకు కారును నడిపిన ఘటనతో పోలిన దాడి ఇది. ప్రజాస్వామిక అవకాశాలు, స్వరాల పైన రాజ్యం చేస్తున్న దాడి ఇది.
మార్చి ఒకటో తేదీన జరిగిన నిరసనల అనంతరం విద్యార్థులను వేటాడి, వేధించడం, లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం, ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం, కల్పిత కేసులు పెట్టడం, తప్పుడు ఆరోపణలు, అరెస్టులు చేయడం మొదలైనవి బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం తమ ప్రాథమిక ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం పోరాడుతున్న విద్యార్థులపైన, ఈ దేశ ప్రజలపైన చేసిన మరొక దాడి. మంత్రి కాన్వాయ్ పై జరిగిన “దాడి” కి సంబంధించి అరెస్టు చేసిన హిందోల్, ఆ ఘటన జరిగినప్పుడు దేశంలోనే లేడు.
2023 నవంబర్ నుంచి అతను స్పెయిన్‌లో తన పరిశోధనా పనిలో ఉన్నాడు. కాబట్టి అతనిని అరెస్టు చేయడానికి ఏ ఇతర ఆధారం లేకపోవడంతో, “ఈ సంఘటనలో పాల్గొన్నవారికి నిధులు సమకూర్చాడు” అనే తప్పుడు కథనాన్ని రాజ్యం సృష్టించింది.
ప్రజాస్వామిక వాదులందరిపైనా, విభేదించే వారందరిపైనా విస్తృత స్థాయిలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇది జరిగింది. 2022లో సూరజ్ కుండ్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ దాడి తీవ్రతరం అయింది. ఈ పథకం “పెన్ అండ్ గన్ నక్సలిజం” (కలం తుపాకీ నక్సలిజం)ను తుడిచిపెట్టాలని పేర్కొంది. దీని కింద విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కళాకారులు, కవులు మొదలైన ప్రజాస్వామిక వాదుల స్వరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు.
భారతదేశ రాజ్యం ప్రజాస్వామ్యం అనే తన నటనను కూడా క్రమంగా బహిర్గతం చేస్తోంది. ప్రజల ప్రజాస్వామిక హక్కులు, విద్యాపర స్వేచ్ఛాలన్నింటినీ లాగేసుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అణచివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినందుకు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన14 మంది విద్యార్థులను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో సింధూర్ ఆపరేషన్ ను ఖండించినందుకు అశోక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అలీ ఖాన్ ముహమ్మద్ ను మే నెలలో అరెస్టు చేశారు. 2025 జూలైలో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ద్వారా ఢిల్లీకి చెందిన ఏడుగురు విద్యార్థులు, కార్యకర్తలను అక్రమంగా కిడ్నాప్ చేయడం, బలవంతంగా అదృశ్యం చేయడం, మూడో డిగ్రీ హింసలకు గురి చేయడం జరిగింది. ఈ నెల ప్రారంభంలో జమ్ము & కశ్మీర్ హోం డిపార్ట్ మెంట్ కశ్మీర్ పై 25 పుస్తకాలను నిషేధించింది. లక్నో కుట్ర కేసు (బికె16 రకం మరొక తప్పుడు కుట్ర కేసు) ను సిద్ధం చేస్తున్నప్పుడు ఎన్ఐఏ తన పత్రికా ప్రకటనలలో పలుసార్లు ఈ కేసులో విద్యార్థి సంఘాలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే ప్రణాళికలను ప్రస్తావించింది.
విద్యార్ధులపైనా, విద్యా సంస్థలపైనా, విద్యా స్వేచ్ఛలపైనా జరుగుతున్న దాడులను నిర్దంద్వంగా ఖండిస్తున్నాం. హిందోళ్ మజుందార్‌ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు, ప్రొఫెసర్లు, కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులను వేటాడి, వేధించడానికి వ్యతిరేకంగా సమాజంలోని అన్ని సెక్షన్ల వారూ నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సూరజ్ కుండ్ పథకాన్ని వ్యతిరేకించడానికి అన్ని ప్రజాస్వామిక శక్తులు కలిసి రావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం:
ఎఐఆర్ఎస్ఒ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, ఎఎస్ఎ, బిఎపిఎస్ఎ, బిబిఎయు, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎమ్, భీమ్ ఆర్మీ, బిఎస్‌సిఇఎమ్, సిఇఎమ్, కలెక్టివ్, సిఆర్‌పిపి, సిఎస్ఎమ్, సిటిఎఫ్, డిఐఎస్‌ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరం అగైన్స్ట్ రిప్రెషన్, తెలంగాణ, ఫ్రటర్నిటీ, ఐఏపిఎల్, ఇన్నోసెన్స్ నెట్‌వర్క్, కర్ణాటక జనశక్తి, ఎల్‌ఎఎ, మజ్దూర్ అధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రిక, ఎన్‌ఎపిఎమ్, నజరియా, నిశాంత్ నాట్య మంచ్, నౌరూజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయి మంచ్, సమాజ్‌వాది జన్ పరిషద్, సమాజ్‌వాది లోక్ మంచ్, బహుజన్ సమాజ్‌వాది. మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ పీస్ అలియన్స్, డబ్ల్యూఎస్ఎస్, వై4ఎస్

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad