సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ సగులూరి చిన్నన్న ఎలియాస్ విజయ్ అంత్యక్రియలు 16వ తేదీన ఆయన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామంలో జరిగాయి. అంతిమయాత్రకు వందలాది మంది ప్రజలు, విప్లవాభిమానులు హాజరై చిన్నన్నకు నివాళులు అర్పించారు. దాదాపు 30 ఏళ్ళపాటు అఙాతంలో, ప్రజా పోరాటంలో ఉన్న తమ చిన్నన్నను చివరి సారి చూడడం కోసం దూరప్రాంతాలనుండి కూడా ప్రజలు తరలి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కింద పోస్ట్ చేశాము.
ఈ సందర్భంగా అమరుడు చిన్నన్న గురించి విరసం కార్యవర్గ సభ్యుడు పాణి రాసిన వసంతమేఘం వెబ్ సైట్ లో రాసిన వ్యాసం మీ కోసం…
ఆగస్టు 13న చత్తీస్ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూడా చనిపోయినట్లు సమాచారం. వాళ్ల గ్రామస్థులు కావచ్చని, అందుకే వాళ్ల వివరాలు ప్రకటించడం లేదని అనుమానం. ఇప్పటికి పోలీసులు ప్రకటించిన ఇద్దరు మావోయిస్టులలో ఒకరు స్థానిక ఆదివాసీ, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్.
విప్లవం ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఎందరిని అసాధారణ మానవులుగా తీర్చిదిద్దుతుందో .. చరిత్రను నిర్మించే ఎన్ని సామాజిక సాంస్కృతిక నైతిక పరివర్తనా క్రమాలను ముందుకు నడుపుతుందో. ఇందులో పాల్గొనే కోటానుకోట్ల మందికి ప్రతినిధులనదగిన లక్షలాది మందిని ఉదాహరణలు చూపవచ్చు. వాళ్లంతా అచ్చమైన మామూలు మనుషులు. వాళ్లే చరిత్ర నిర్మాణానికి దోహదం చేస్తారు. ప్రజలు నిర్మించే చరిత్రలో భాగమవుతారు. అట్లాంటి వరుసలో సుగులూరి చిన్నన్న ఒకరు.
చెల్లాచెదరుగా ఉండిన కర్నూలు విప్లవోద్యమానికి నల్లమల కేంద్రమయ్యాక చిన్నన్న ఉద్యమ సంబంధాల్లోకి వచ్చాడు. ప్రస్తుత నంద్యాల జిల్లాలోని అనేక పల్లెల్లో రైతు కూలీ సంఘాలు, రాడికల్ యువజన సంఘాలు ఏర్పడ్డాయి. అట్లా ఆత్మకూరు దగ్గర ఉండే అడివంచు వడ్ల రామాపురం గ్రామస్తుడిగా ఆ ఊళ్ళో ఏర్పడ్డ రైతు కూలీ సంఘం సభ్యుడిగా ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ సంస్థలన్నీ ప్రభుత్వ నిషేధానికి గురయ్యాయి. అట్లాంటి నిషేధిత ఉద్యమంలోకి ఆయన వచ్చాడు. అప్పుడు ఆయన వయసు ఇరవై ఉంటాయేమో. ఊరేగింపుల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినాదిలిస్తూ కనిపించేవాడు. కర్నూల్లో జరిగే విప్లవ సాహిత్య సభల్లో వెనుక వరుసలో కూచొని విని వెళ్లిపోయేవాడు. తెలుగు చదవడం మాత్రమే వచ్చినవాడిగా పరిచయం. ఆ రోజుల్లో ఒక రకమైన అమాయకపు పల్లెటూరిదనం ఆయనలో ఉట్టిపడేది. బహుశా ఆప్పటికి ఆయనను ప్యాంటు మీద చాలా తక్కువమందే చూసి ఉంటారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకొనే కుటుంబం నుంచి వచ్చాడు.
రైతు కూలీ సంఘం పనులు చేస్తూ విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లాడు. స్థానిక నిర్మాణ బాధ్యతలు నిర్వహించాడు. అగ్రకుల పెత్తందారీతనం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బలంగా ఉండేది. అలాంటి గ్రామాల్లో ఆయన విప్లవకార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన పనుల గురించి ఆ గ్రామాల్లోని పైకులాల వారు ఒకింత ద్వేషంతో మాట్లాడేవారు. చిన్నన్న చేయవలసిన పని చేస్తున్నాడనడానికి ఆ మాటలు రుజువు అనిపించేవి.
2004 శాంతి చర్చల తర్వాత నల్లమలలో ఘోరమైన రక్తపాతం జరిగింది. అనేక మంది విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు. విప్లవోద్యమం అక్కడి నుంచి దండకారణ్యానికి తరలిపోయింది. చిన్నన్న ఈ తీవ్రమైన పరిణామాల్లో తట్టుకొని నిలబడ్డాడు. నల్లమల పోరాట స్ఫూర్తిని దాచుకొని సుదూర ప్రాంతంలో విప్లవోద్యమ నిర్మాణం కోసం వెళ్లిపోయాడు. దండకారణ్య కమిటీ నాయకుడిగా ఎదిగాడు. . ఎక్కడి నల్లమల సరిహద్దు గ్రామం? ఎక్కడి దండకారణ్యం ? ఒక మామూలు దళిత యువకుడు భౌగోళికంగానే గాక ఇంత సుదూర జీవితానుభవ ప్రయాణం చేశాడు. విప్లవ సానుభూతిపరుడుగా మొదలై విప్లవోద్యమ నాయకుడయ్యాడు . ఇంత సుదీర్ఘ జీవితంలో ఆయనకు ఏదీ ఆటంకం కాలేదు. భార్యను, ఇద్దరు పిల్లలను వదిలి విప్లవంలోకి వెళ్లాడు. అప్పుడు ఆయనకు కుటుంబం, విప్లవం పక్కపక్కనే. కానీ విప్లవం ఎట్లాంటిది? దానికి ప్రాంతాలుంటాయా? ఎక్కడికైనా తీసికెళుతుంది. ఎట్లాంటి నడక అయినా నేర్పిస్తుంది. మానవాళిని ప్రేమించడమే దాని సరిహద్దు.
ఆయన విప్లవ జీవితంలో మూడు ప్రధాన ఘట్టాలను చూడవచ్చు. ఒకటి: విప్లవోద్యమం చట్ట రూపంలో కూడా నిషేధాన్ని ఎదుర్కొని తీవ్ర నిర్బంధానికి గురవుతున్న రోజుల్లో విప్లవంలోకి వచ్చాడు. అన్ని రాజకీయ పార్టీలు దళితులకు ఇచ్చే ఓటరు గుర్తింపును తిరస్కరించి అసలైన రాజ్యాధికార సాధన కోసం విప్లవ పార్టీలోకి వెళ్లాడు. రెండు: శాంతి చర్చలు ఆగిపోయాక నల్లమల ఎదుర్కొన్న తీవ్ర నిర్బంధంలో దృఢంగా నిలబడ్డాడు. దేశవ్యాప్తంగా విప్లవోద్యమం మీద యుద్ధ సన్నాహాలు జరుగుతున్న కాలంలో వర్గపోరాట కేంద్రం అనదగిన దండకారణ్యానికి చేరుకున్నాడు. మూడు: ఫాసిస్టు యుద్ధాన్ని ప్రజాయుద్ధంతో ఎదుర్కొంటూ తిరిగి మళ్లీ శాంతి చర్చల సందర్భంలో అమరుడయ్యాడు.
భారతదేశ విప్లవంలోని ఈ మూడు ముఖ్యమైన మలుపుల్లో చిన్నన్న భాగమయ్యాడు. నల్లమలలో ఆయనతో పని చేసిన వాళ్లు ఎందరో అమరులయ్యారు. ఎందరో నిష్క్రమించారు. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. ఇదేమీ విప్లవం మీద మొండి విశ్వాసం కాదు. వ్యక్తిగత జీవితంలో కలిసి వచ్చిన అవకాశం కాదు. విప్లవాన్ని రాజకీయంగా అర్థం చేసుకున్నాడు. అంతకంటే లోతుగా జీవితంలోంచి విప్లవాన్ని కనుగొన్నాడు. విప్లవమంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమని చిన్నన్నలాంటి వాళ్లు పదే పదే నిరూపిస్తుంటారు. లేకపోతే ఒక మామూలు మనిషికి ఇంత సుదీర్ఘ ప్రయాణం సాధ్యం కాదు. నిటారు కొండ మీదికి నడిచి వెళ్లడమనే కార్యాచరణ అయ్యే పని కాదు. తటపటాయింపులు లేకుండా, సందిగ్ధత లేకుండా, సొంతం గురించిన ఆరాటం లేకుండా సాగిపోగల నైతికశక్తిని విప్లవోద్యమం అందిస్తుంది. తన ప్రభావంలోకి వచ్చిన వాళ్లందరికీ దాన్ని పంచిపెడుతుంది. కానీ కొందరే దాని అర్థం తెలుసుకోగలరు. వ్యక్తిత్వంగా మలుచుకోగలరు. ఎన్ని సాధకబాదకాలున్నా జీవిత పర్యంతం విప్లవంలో ఉండటం అన్నిటికన్నా అత్యున్నత విలువ . అది ఎట్లా ఉంటుందో చిన్నన్న నిరూపించాడు .
విప్లవం గెలుస్తుందా? అనే సందేహంతో కొందరు తల్లకిందులవుతుంటారు. విప్లవాన్ని సాంతం తుడిచిపెట్టేస్తామని మరి కొందరు ఫీుంకరిస్తుంటారు. విప్లవానికి ఈ చివర ఒకరు. మరో చివరన ఇంకొకరు. వీటికి సమాధానం ఎవరు చెప్పగలరు? సిద్ధాంత చర్చలతో ఎవరు భరోసా ఇవ్వగలరు? చిన్నన్నలాంటి వాళ్లే తమ అసాధారణ వ్యక్తిత్వం, దార్శనికత , కఠోర ఆచరణ వల్ల విప్లవం ఎప్పటికైనా వస్తుందనే భరోసా ఇస్తారు. ఆయనలాంటి సమరశీల, చారిత్రక దృక్పథం ఉన్న వాళ్లే రాజ్యానికి సవాల్ విసురుతూ ఉంటారు.. వ్యక్తులను చంపగలరేమోగాని విప్లవోద్యమాన్ని తుడిచిపెట్టడం మీ వల్ల కాదని.
సుమారు ముప్పై ఐదేళ్ల విప్లవోద్యమ ఆచరణలో సుగులూరు చిన్నన్న నిరూపించిన సత్యం ఇదే. తన జీవితాన్నే రాజకీయ సాంస్కృతిక నైతిక ప్రయోగంగా మలచుకొని, మరణానంతరం ఈ సత్యప్రకటన చేస్తున్నాడు.