Menu

ఆనాటి తాత్కాలి క సాయుధ పోరాట విరమణ: ముందు వెనుకలు -పాణి

anadmin 3 weeks ago 0 460

(‘శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం ‍- విప్లవోద్యమం’ పుస్తకంలో ఒక భాగం)

ఈ చర్చలో చాలా మంది గతంలో జరిగిన ‘తాత్కాలిక సాయుధ పోరాట విరమణ’ను ఇష్టం వచ్చినట్లు ప్రస్తావించారు. బహుశా ఆ రోజు ఏం జరిగిందో అర్థం కాకపోవడం వల్ల కావచ్చు. జ్ఞాపకాల మీద ఆధారపడినందు వల్ల కావచ్చు. ఇంతకూ అదేమిటంటే, 1977 ఆగస్టు 8న అప్పటి పార్టీ ఒక రాజకీయ తీర్మానం చేసింది. విప్లవోద్యమ చరిత్రలో ఆగస్టు తీర్మానంగా దీనికి పేరుంది. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితి`మన కర్తవ్యం’ అనే పేరుతో ఇది క్రాంతి మాస పత్రిక అక్టోబర్‌ 1977లో అచ్చయింది. ఆరు పేజీల ఈ తీర్మానంలో ఒక భాగం ‘ప్రస్తుతానికి సాయుధ పోరాటాన్ని ఆపి విప్లవానికి చైతన్యపూరితమైన ప్రజా పునాదిని నిర్మించడం ప్రధాన కర్తవ్యం’.

ఎమర్జెన్సీ ఎత్తేశాక ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచిన నేపథ్యంలో ఈ తీర్మానం చేశారు. ప్రజా పునాదిని బలోపేతం చేసుకోవాలనే స్ఫూర్తిని పూర్తిగా గుర్తిస్తూనే అలాంటి తీర్మానం చేయనవసరం లేకుండెననే అభిప్రాయం తర్వాతి రోజుల్లో కలిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చలో దాన్ని రెండు మూడు రకాలుగా ప్రస్తావిస్తున్నారు. అప్పుడే సాయుధ పోరాటం వదిలేద్దామనుకున్నప్పటికీ మళ్లీ ప్రారంభించినందు వల్లే ఇట్లా అయిందని అన్నవాళ్లున్నారు. అప్పుడు వదిలేసినందు వల్లే విప్లవోద్యమానికి చాలా మేలు జరిగింది కాబట్టి ఇప్పుడూ వదిలేయాలని సూచించినవాళ్లున్నారు. సాయుధ పోరాట పంథా వల్ల అడవులకు పరిమితమైన ఉద్యమం తిరిగి ప్రజల్లోకి వెళ్లాలంటే సాయుధ పోరాటం పూర్తిగా విరమించాల్సిన చారిత్రక పరిస్థితి వచ్చిందని కొందరు గత తీర్మానాన్ని గుర్తు చేశారు.

ఈ తీర్మానాన్ని విప్లవోద్యమ చరిత్రలో భాగంగా చూడాలి. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం పూర్తిగా దెబ్బతినిపోయాక విప్లవోద్యమ పునర్నిర్మాణ ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి 1974లో ‘గతాన్ని సమీక్షించుకొని సాయుధ పోరాటబాటలో విజయవంతంగా ముందుకు సాగుదాం’ అనే ఆత్మ విమర్శ నివేదిక ఆధారమైంది. అప్పటికే వివిధ ప్రజా సంఘాల సన్నాహం మొదలైంది. 1977 ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ ప్రాంతీయ మహాసభ సాయుధ పోరాటాన్ని నిర్మించడానికి అడవిలోకి దళాలను పంపించాలని తీర్మానించింది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని వినియోగించుకోడానికి తెలంగాణ ప్రాంతీయ మహాసభ నిర్ణయాలకు తగిన ఎత్తుగడల్లో భాగంగా ఆ సంవత్సరం ఆగస్టులో రాష్ట్ర కమిటీ చేసిన విస్తృత తీర్మానంలో ప్రస్తుతానికి సాయుధం పోరాటం ఆపాలనే నిర్ణయం ఒక భాగం.
ఆ తర్వాత 1978 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘బూటకపు ఎన్నికలను బహిష్కరించి వ్యవసాయక విప్లవంలో పాల్గొనాలని విప్లవ పార్టీ పిలుపు ఇచ్చింది. 1979 అక్టోబర్‌ వరంగల్‌ జిల్లా పైడిపల్లిలో అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా కొండపల్లి సీతారామయ్య చేసిన ప్రసంగం ఆ మరుసటి నెల క్రాంతి పత్రిక సంచికలో అచ్చయింది. అందులో ‘రహస్య దళ చర్యల్ని తాత్కాలికంగా విరమించింది ప్రజల కోసం. వీరులు అన్నీ చేసిపెడతారనే తప్పుడు ధోరణిని తొలగించి పటిష్టమైన ప్రజాసంఘాల, ఉద్యమాల నిర్మాణంతో కార్మికవర్గ పార్టీ సాయుధ పోరాటాన్ని సమన్వయించడానికే, మరింత గట్టిగా తుపాకీ పట్టుకోడానికే.. ’ అని ఆయన అన్నట్లు రిపోర్ట్‌ అయింది.

అప్పటికే ఉధృతంగా ఉండిన ‘కరీంనగర్‌, ఆదిలాబాద్‌ రైతాంగ పోరాటాలను నూతన దశకు తీసికెళ్లండ’నే అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌ 1980 జనవరి 5న విడుదలైంది. ప్రజల మిలిటెన్సీ గొప్పగా వ్యక్తమైన ఆ పోరాటాల మీద తీవ్రమైన నిర్బంధాన్ని అధిగమించాలంటే వర్గపోరాటాన్ని అభివృద్ధి చేయడానికి ఈ అవగాహనను విప్లవోద్యమం స్వీకరించింది. ఈ పత్రానికి ‘గెరిల్లా జోన్‌ పర్‌స్పెక్టివ్‌’ అనే పేరు కూడా స్థిరపడిరది. ఆ తర్వాత 1980 ఏప్రిల్‌ 22న పీపుల్స్‌వార్‌ ఏర్పడిరది. విప్లవోద్యమ విస్తరణలో భాగంగా దండకారణ్యానికి సాయుధ దళాలు వెళ్లాయి.

తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనే తీర్మానం ముందు వెనుకల వెంట వెంట ఇన్ని పరిణామాలు జరిగాయి. ఇంత అవగాహన విస్తరించింది. నిజానికి ఆగస్టు తీర్మానం నాటికి ప్రత్యేకించి సాయుధ నిర్మాణం అంటూ లేదు. సాయుధ చర్యలు లేవు. ఆత్మ విమర్శ పత్రం ఆధారంగా విస్తృత ప్రజా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. తెలంగాణ ప్రాంతీయ మహాసభ నిర్ణయాల అమలు కోసం ఎత్తుగడలో భాగంగా ఆగస్టు తీర్మానం వచ్చింది. ఆ తర్వాత ఏడాదికే అసెంబ్లీ ఎన్నికల బహిష్కరణ ప్రచారం చేశారు.

ఇదంతా చూస్తే సాయుధ పోరాట విరమణ తీర్మానం విప్లవోద్యమ పునర్నిర్మాణ క్రమంలో, మౌలిక పంథాను విడిచిపెట్టకుండా చేసిన అనేక ఆలోచనల, ఆచరణల వరుసలో భాగమని అర్థమవుతుంది. అప్పటికీ ఆ తీర్మానం సహజంగానే వివాదాస్పదం అయింది. ఆ కాలమంతా జరిగిన ప్రజా కార్యాచరణకు ఆత్మ విమర్శ నివేదిక, తెలంగాణ ప్రాంతీయ మహాసభ అందించిన స్ఫూర్తి, గెరిల్లా జోన్‌ పర్‌స్పెక్టివ్‌, పీపుల్స్‌వార్‌ ఏర్పాటు మార్గదర్శకత్వం వహించాయి. విప్లవోద్యమం అతివాద, మితవాదాల నుంచి బైటపడి వర్గపోరాటానికి సన్నాహం చేసిన తొలిదశ అది.

ఇప్పుడు ఈ మొత్తాన్ని వ్యాఖ్యానించే క్రమంలో కొందరు సదుద్దేశంతోనే కావచ్చు, తాత్కాలిక సాయుధ పోరాట విరమణతోనే విప్లవోద్యమ పునర్నిర్మాణం జరిగినట్లు చెబుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే ఇదే ఏకైక కారణం కాదని ఎవ్వరికైనా తెలుస్తుంది. ఆగస్టు తీర్మానానికి ముందు కనీసం ఐదేళ్ల కిందే ఆరంభమైన ప్రజా పోరాటాలనూ, ఆ తీర్మానం తర్వాత వరుసగా జరిగిన పరిణామాల్లోంచి ఎదిగి వచ్చిన రాజకీయ నిర్మాణ రూపాలనూ విస్మరించడానికి లేదు. వీటన్నిటి మధ్య ఈ తీర్మాన ప్రభావాన్ని 1977 ఆగస్టు8`1980 ఏప్రిల్‌ 22 మధ్య చూడాలి. పీపుల్స్‌వార్‌ ఏర్పడ్డాక సాయుధ బలగాలను దండకారణ్యానికి, తూర్పు ప్రాంతానికి పంపించారు. అప్పటి నుంచి సాయుధ, చట్టబద్ధ పోరాటాల సమన్వయంతో విప్లవోద్యమం నడిచింది. ఇదంతా పక్కన పెట్టి కేవలం సాయుధ పోరాట విరమణ ప్రకటన వల్లనే విప్లవోద్యమం పునర్నిర్మాణమైందని అనడం పాక్షిక సత్యం. ఆ కాలంలో శక్తివంతమైన వర్గపోరాటాలు జరిగి, వాటి ఉన్నత రూపంగా సాయుధ పోరాటం బలపడిరది. వర్గపోరాట చైతన్యాన్ని, ఆచరణను బలోపేతం చేయడం వల్లనే బహుముఖీన పోరాటాలు ప్రజ్వరిల్లాయి.

ఈ అనుభవంతో ఇప్పుడు సాయుధ పోరాటం విరమించాలని మేధావులు చెబుతున్న మాటను పరిశీలించాలి. విప్లవోద్యమానికి ఎన్నడూ జరగనంత నష్టం ఇప్పుడు జరుగుతున్న మాట వాస్తవమే. అందువల్ల గతంలా తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయాలని అంటున్నారు. అయితే ఆనాటి పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు పోలికేలేదు. విప్లవోద్యమ చరిత్రలో ఇవి పూర్తి భిన్నమైన దశలు. అనేక జయాపజయాల అనుభవాల నుంచి భారతదేశంలో విప్లవం చేయగల నిర్మాణానికి నమూనాగా విప్లవ పార్టీ రూపొందింది. సాయుధ, చట్టబద్ధ పోరాటాల కలయికగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని ఓపికగా నడిపి అద్భుత విజయాలు సాధించింది. ఇటీవల ఉద్యమం వెనుకంజకు గురికావడానికి తీవ్రస్థాయి నిర్బంధం ఒక ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది సాయుధ పోరాట విరమణ కాదు. ఇప్పటి నిర్బంధ పరిస్థితులను అధిగమించి, ఈనాటి విప్లవానుకూలతకు తగినట్లు ప్రజా సమీకరణ చేయాలి. దానికి కొత్త పద్ధతులను అనుసరించాలి. గత అనుభవాల నుంచి మారిన పరిస్థితుల్లో కొత్త పోరాట రూపాలకు సిద్ధం కావాలి. లేకపోతే ప్రాణ నష్టాన్ని నివారించడం సాధ్యం కాదు. విప్లవోద్యమ విస్తరణకు కొత్త దారులు దొరకవు.

కానీ ప్రస్తుత ఉద్యమ స్థితికి పంథాయే కారణం అని ఈ చర్చలో చాలా మంది అంటున్నారు. ప్రజలను వదిలేసి అడవుల్లో ఉండటమే కారణం అంటున్నారు. ప్రజా పోరాటాలు చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ చర్చలోకి వెళ్లాంటే కూడా కనీసం గత ఇరవై పాతికేళ్లుగా ప్రజా సమీకరణకు విప్లవోద్యమం ఏం చేసిందో సూక్ష్మస్థాయి సమాచారం ఉండాలి. విప్లవోద్యమ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఇప్పటికిప్పుడు తలెత్తలేదు. ప్రభుత్వం ఈ ప్రయత్నం తీవ్రం చేసినప్పటి నుంచి మావోయిస్టు పార్టీ ఉద్యమ స్థావరాలను కాపాడుకోడానికి మైదాన, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రయోగాలు చేసింది? మొత్తంగానే విప్లవోద్యమాన్ని దేశంలోని అన్ని వైవిధ్యపూరిత ప్రాంతాలకు విస్తరింపచేయడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేసింది? తెలుసుకోవాలి. ఆ ప్రయత్నాల్లో లోపాలు ఉండవచ్చు. కానీ అవేమిటో తెలుసుకోకుండా నష్ట నివారణకు సాయుధ పోరాటం వదిలేయాలని ఎవ్వరు చెప్పినా సరైన వాదన కాదు.

వాదనలు చేసేవాళ్లు ఇవ్వన్నీ తెలుసుకొని మాట్లాడాలనే నియమం ఏమీ లేదు. కానీ విప్లవోద్యమం నిర్వహించాల్సిన వాళ్లు మాత్రం ఇప్పటి స్థల కాలాల్లో ప్రజలను చట్టబద్ధ, సాయుధ పోరాట రూపాల్లోకి సమీకరించాలి. సాపేక్షంగా పెట్టబడిదారీ ధోరణులు పెరుగుతున్న చోట దానికి తగిన నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలి. ఈ పని చేయడమా? లేక సాయుధ పోరాటాన్ని విరమించడమా? అనే సందిగ్థతకు గురి కానవసరం లేదు. వ్యూహం మార్చుకోనవసరం లేదు. పంథా రోజుకోసారి మార్చేది కాదు. నిజానికి దేశంలో జరుగుతున్న మార్పులన్నీ మావోయిస్టు పంథాను బలపరిచేలా ఉన్నాయి. వీటిలోని అననుకూల పరిణామాలకు కంగారుపడిపోవడానికి లేదు.

ఈ మార్పులకు అనుగుణంగా మావోయిస్టులు మరింత సృజనాత్మకంగా తమ ఎత్తుగడల్లో భాగంగా ఎన్నో పోరాటాలు చేయవలసి ఉండిరది. ఈ మార్పులేవీ ప్రతిబంధకాలు కావు. కాకపోగా గతంలో లేని కొత్త పోరాట అవకాశాలు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మార్కెట్‌ ప్రభావంతో జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో మార్పులు అనేక పోరాటాలకు అనుకూల అంశాలయ్యాయి. కానీ నిర్బంధం వల్ల వాటిని అందుపుచ్చుకోలేకపోయారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad