Menu

లొంగుబాటు స్వేచ్ఛకు హామీ ఇవ్వదు: మావోయిస్టు నాయకుడు దున్న కేశవ రావు @ ఆజాద్ కథ

anadmin 2 weeks ago 0 303

ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్‌లో ఉన్న జార్పడ హైసెక్యూరిటీ జైలులో మావోయిస్టు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఎన్నో సంవత్సరాలుగా నిరవధిక నిర్బంధంలో ఉన్నారు.

వారి జీవిత కథలు ఒకే రకమైన మౌన వేదనను చెబుతాయి: అంతులేని రిమాండ్‌లు, విచారణ ప్రారంభంకాని కేసులు, వైద్య నిరాకరణ, మానవ గౌరవం పట్ల నిర్లక్ష్యం.

ఈ జాబితాలో అత్యంత వేదనభరితమైన కథలో ఒకటి: దున్న కేశవరావు @ ఆజాద్, సిపిఐ (మావోయిస్టు) గా లొంగిపోయిన ఒక నాయకుడి కథ.

స్వచ్ఛంద లొంగుబాటు… కానీ నిరవధిక నిర్బంధం.

ఆంధ్రప్రదేశ్ పోలీసుల వద్ద దున్న కేశవరావు (ఆజాద్) 2011 మే 18 నాడు సరెండర్ అయ్యాడు.

ఆయన అప్పట్లో సిపిఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఒరిస్సా స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ (ORSOC) సభ్యుడు.

ఆ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ స్పష్టంగా ఉంది: సరెండర్ అయితే రక్షణ, పునరావాసం, సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం.

కానీ కేవలం పది రోజుల్లోనే 2011 మే 29న ఒడిశా పోలీసులు ఆయన్ని తమ అదుపులోకి తీసుకుని జూన్ 2, 2011న అధికారికంగా అరెస్ట్ చూపించారు.

అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. ప్రశాంత జీవనం కోసం చేసిన ఆత్మ సమర్పణ చివరికి నిర్బంధంగా మారిపోయింది.

విచారణ లేని సంవత్సరాలు – వాగ్దానాల మోసం

గడిచిన సంవత్సరాల్లో ఆయనపై అనేక కేసులు నమోదు అయ్యాయి. ‘విచారణ’ పేరుతో సాగిన ఆ ప్రయాణమే ఒక ‘శిక్ష’ గా మారింది. ఆయన జీవితం ఇప్పుడు ఒక అంతులేని విచారణ అయ్యింది.

పీటీ వారంట్ల (Prisoner Transit warrants) పై హాజరు పరచటం, పదే పదే వాయిదాలు ఎదుర్కోవడం – న్యాయ వ్యవస్థలో అంతులేని చక్రం. ఇవి అతని జీవితాన్ని నిర్వచించాయి.

అతను లొంగిపోయినప్పటికీ, ప్రభుత్వం అతనికి పునరావాసం కల్పించలేదు; ఆయనను తిరిగి “శత్రువు”గా చూడటమే కొనసాగించింది.

రాజకీయ ఖైదీగా గుర్తించాలని, త్వరిత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఆయన జైలులో అనేకసార్లు నిరాహార దీక్షలు చేశారు.

కుటుంబం అనేక మార్లు రెండు రాష్ట్రాల అధికారులను, మంత్రులను కలసి విన్నవించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

కేసుల వివరాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు:

ఆజాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయా రాష్ట్రాల ఇద్దరు డీజీపీలు తమ అఫిడవిట్లలో అతని కేసుల వివరాలను సమర్పించారు.

ఒరిస్సా పోలీసులు సుప్రీమ్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం:

  • అజాద్ పై 43 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
  • వీటిలో 10 కేసులలో విచారణ పూర్తయి జనవరి 25, 2024 నాటికి నిర్దోషిగా విడుదలయ్యారు.
  • మిగిలిన 33 కేసులలో, 18 కేసులు కోర్టులో హాజరు పరిచినప్పటికీ విచారణ ప్రారంభం కాలేదు.
  • ఇంకా 15 కేసులలో ఇప్పటికీ కోర్టులో హాజరు పరచలేదు. అవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తన మీద 16 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 16 కేసుల్లో ఆజాద్‌ను ఇప్పటివరకు న్యాయస్థానం ముందు ఇంకా హాజరుపరచలేదు అని పేర్కొన్నారు.

జూలై 2025 నాల్గవ వారంలో, సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ (క్రిమినల్) నం. 511/2024 ద్వారా అతని కేసులో ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, సెప్టెంబర్ మొదటి వారం నుంచి అన్ని కేసులను విచారణకు తీసుకోవాలని, అలాగే ఆజాద్‌పై ఉన్న అన్ని కేసులను ఒక సంవత్సరంలోపు పూర్తిచేయాలి అని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది.

సుప్రీమ్ కోర్టు చెప్పిన సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ వచ్చేసింది. ఇంకా ఆ తీర్పు ప్రకారం అజాద్ కేసుల్లో కనీస పురోగతి లేదు.

ఆగస్టు 21 ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో మంత్రిమండలి సమావేశ జరిగింది అని ఒక కథనం వచ్చింది. అందులో దున్న కేశవరావు @ అజాద్ కు వ్యతిరేకంగా ఉన్న 16 కేసులకు 7 వ అదనపు జిల్లా జడ్జి, శ్రీకాకుళం ను నియమించినట్టు రాశారు.

ఆ మంత్రి మండలి తీర్మానం కేవలం రాతలకు పరిమితం అయ్యింది. ఇప్పటికి అందులో సరైన పురోగతి లేదు.

ఈ విషయంపై దున్న కేశవ రావు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు.

“న్యాయం జరగకపోతే అక్టోబర్ 15 నుంచి నా కుమారుడు నిరాహార దీక్ష చేపడతాడు” అని ఆయన తల్లి దున్న కోమలమ్మ తెలిపారు.

ఆమె విజ్ఞప్తి ఒక తల్లి కేక మాత్రమే కాదు – రాజ్యం ఇచ్చిన వాగ్దానాల పట్ల చారిత్రక ఆరోపణ.

దున్న కేశవరావు @ అజాద్ కథతో పాటు జార్పడా జైలు గోడల వెనుక నిశ్శబ్దంగా ఊపిరి తీసుకుంటున్న మరెన్నో జీవితాలున్నాయి

స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఆ స్వేచ్ఛను కలగంటున్నవారి కథలు.

ఆ గోడల మధ్య రోజులు లెక్కపెడుతున్న వారి పేర్లు వేరైనా, బాధ ఒకటే: చిన్న రావు @ సంతు, రంజు కిల్లో @ చంటి, దుబాసి శంకర్ @ అరుణ్, జునుములూరి శ్రీనుబాబు @ రైను.

శిక్ష పడిన, ఆగని కొత్త కేసులు: చిన్న రావు

గమెలి చిన్న రావు అలియాస్ సంతు, రాయగడ జిల్లాలో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కార్యకర్తగా ఆరోపణలు ఉన్న వ్యక్తి.

BSF సిబ్బందిపై దాడి కేసులో తనకు పది సంవత్సరాల జైలు శిక్ష 2017లో విధించారు.

తనకు శిక్ష పడినా, ఎనిమిదేళ్ల జైలు జీవితాన్ని గడిపినా, తన మీద PT వారంట్లు, కొత్త కేసులు, తరలింపులు. ఈ చక్రం ఎప్పుడూ ఆగదు.

పక్షవాతంతో చంటి

రంజు కిల్లో అలియాస్ చంటి, మాల్కాన్గిరి జిల్లాకు చెందిన ఆదివాసీ యువకుడు.

2012లో జరిగిన ఒక దాడి కేసులో 2023లో NIA ఆయనను అరెస్టు చేసింది.

ఆ సమయానికే ఆయన పక్షవాతంతో మంచం పట్టి ఉన్నాడు.

2013 నుంచి 2019 వరకు జైలులో గడిపిన కాలంలోనే ఆయన శరీరం పూర్తిగా దెబ్బతింది.

జైలు నుండి విడుదలైన తర్వాత అనారోగ్యంతో ఇంట్లో మంచంపై కదలేని స్థితిలో జీవించాడు. అలాంటి స్థితిలో ఉన్న తనను 2023లో పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు.

ఇప్పుడు ఆయన స్థితి మరింత దిగజారింది. ఇప్పుడు రెండు చేతులు, కాళ్లు కదలవు. ఒరిస్సా లోని కటక్ ఆసుపత్రిలో నెలల తరబడి చికిత్సలో ఉన్నప్పటికీ బెయిల్ నిరాకరించారు.

సహఖైదీలు చెబుతున్నారు: “అలాంటి స్థితిలో ఉన్న మనిషిని జైలులో పెట్టడం అమానుషం.”

జైలు మార్పిడే వారి జీవితం: దుబాసి శంకర్, రైనూ

దుబాసి శంకర్ (అలియాస్ అరుణ్): ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతను 2021లో అరెస్టయ్యాడు. ప్రస్తుతం జార్పడా జైలులో ఉన్నాడు.

జె శ్రీనుబాబు అలియాస్ రైను: 2023 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఆయన మాటల్లో:

“బెయిల్ వస్తుందనగానే మొదట మేము మా బట్టలు సర్దుకుంటాం. విడుదల అవుతామని కాదు, మరో కేసులో PT వారంట్ వేసి ఇంకో జైలుకు తీసుక వెళతారు కాబట్టి.”

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సెంట్రల్ జైలు, ఛత్తీస్గఢ్ లోని జగదల్‌పూర్ సెంట్రల్ జైలు, ఒరిస్సా లోని భువనేశ్వర్ హై సెక్యూరిటీ జైలు – మూడు రాష్ట్రాల జైళ్ల మధ్య నిరంతర మార్పిడి ఆయనకు విధిగా మారింది.

“నన్ను విశాఖపట్నం జైలులో ఉంచి అక్కడి నుంచి మిగతా రాష్ట్రాలలో ఉన్న కోర్టు కేసులలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవడానికి అనుమతిస్తే సరిపోతుంది. కనీసం నా కుటుంబం నన్ను చూడగలదు” అని ఆయన విజ్ఞప్తి చేసుకుంటున్నాడు.

న్యాయం ఎక్కడ?

ఈ కథలు కొన్ని కఠినమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి:

  • లొంగిపోయిన వారికి పునరావాసం కాకుండా నిరవధిక జైలు అనేది బహుమతి (రివార్డు)గా ఎందుకు మారింది?
  • పారాలిసిస్‌తో మంచం పట్టిన ఆదివాసీ ఖైదీకి బెయిల్ ఎందుకులేదు?
  • విచారణ లేకుండా సంవత్సరాల తరబడి ఖైదీ చేయడం ఎందుకు?
  • చాలా రాష్ట్రాల్లో కేసులు ఉన్నవారిని వారు కోరుకున్నట్టు స్వంత రాష్ట్రంలో ఉంచి మిగతా రాష్ట్రాల కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచకూడదా?

జార్పడ జైలును దాటిన సంక్షోభం

జార్పడా జైలు కేవలం ఒక భవనం కాదు.
అది చట్టం నిశబ్దంగా ఉన్న చోటు,
మానవత్వం చూపని చోటు,
ఖైదీల పట్ల రాజ్యం తన బాధ్యతలను విస్మరించిన చోటు.

అక్కడ చట్టం నిశ్శబ్దంగా ఉండవచ్చు. కానీ న్యాయం మచ్చుకైనా లేదు.

దున్న కేశవరావు @ ఆజాద్ కేసు ఈ వ్యవస్థ విఫలతకు సాక్ష్యం. స్వచ్ఛందంగా లొంగిపోయిన ఈ వ్యక్తి 2016 లో 21 రోజుల పాటు నిరహార దీక్ష చేశాడు.

  • వేగవంతమైన విచారణ కోసం పోరాడాడు.
  • రాజకీయ ఖైదీ హోదా కోసం పోరాడాడు.
  • అతనిపై నమోదైన కేసులలో విచారణ చేయమని పోరాడాడు.
  • క్రమం తప్పకుండా కోర్టులో హాజరుపరచమని పోరాడాడు.

తల్లి దున్న కోమలమ్మ మాట:
“మేము చట్టాన్ని నమ్మాము. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలే అమలు కాకపోతే, మా కుమారుడికి ఏ ఆశ మిగిలింది? అక్టోబర్ 15 నుంచి నా కుమారుడు కనీసం సుప్రీమ్ కోర్టు తీర్పునైనా పాటించమని ఈ రాజ్యానికి తెలియజేస్తూ నిరాహార దీక్ష చేయబోతున్నాడు.”

ఈ ఒక్క వాక్యం లొంగిపోయిన మావోయిస్టుల “పునరావాస” విధానాన్ని ప్రతిబింబిస్తుంది: ఇది ప్రశాంతమైన జీవితానికి దారితీసిన సరెండర్ కాదు, నిరవధిక నిర్బంధానికి దారితీసిన సరెండర్.

రచయిత: జాబాలి, హక్కుల కార్యకర్త.

countercurrents.org సౌజన్యంతో

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad