Menu

పోరాడండి; లొంగిపోవద్దు: కామ్రేడ్ బసవరాజు అమరత్వ పిలుపు -కె. మురళి @ అజిత్

anadmin 2 weeks ago 0 424

[2025 నవంబర్ 3 నాడు ఢిల్లీలో కార్పొరేటీకరణ, సైనికీకారణ వ్యతిరేక వేదిక (ఫోరం ఎగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్) ఏర్పాటు చేసిన సమావేశానికి కామ్రేడ్ కె. మురళి పంపిన సందేశం]

“బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించి, ఆ ప్రాంతాన్ని దేశీయ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి వీలుగా, అక్కడి ఆదివాసీ స్థానిక జనాభాను బలవంతంగా నిర్వాసితులను చేసే దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయడానికి, భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గమైన అణచివేత క్యాంపెయిన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా, ఆదివాసీ గ్రామాలలో పదేపదే వైమానిక బాంబు దాడులను కూడా చేసింది. ఇటీవలి నెలల్లో భారత ప్రభుత్వం చేతిలో చనిపోయిన వారిలో దాదాపు సగం మంది పిల్లలతో సహా ఆదివాసీలే ఉన్నారు.”
“పరిస్థితిపై పలువురు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు; భారత ప్రభుత్వాన్ని, అలాగే మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని యుద్ధ విరమణ ప్రకటించి, చర్చలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ నాయకత్వం ఈ పిలుపుకు స్పందించి, ఏకపక్షంగా యుద్ధ విరమణను ప్రకటించింది, ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రకటించి, చర్చలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించాలని కోరింది. సానుకూలంగా స్పందించడానికి బదులుగా, భారత ప్రభుత్వం తన హత్యాకాండ అణచివేత క్యాంపెయిన్‌ను కొనసాగించింది. సీపీఐ (మావోయిస్ట్) కార్యదర్శి, కామ్రేడ్ బసవరాజ్‌ను, అతనితో పాటు ఉన్నవారిని చుట్టుముట్టి కాల్చి చంపింది.”
“అన్ని నిబంధనలను ఉల్లంఘించి, ఈ కామ్రేడ్‌ల మృతదేహాలను సరైన అంత్యక్రియల కోసం వారి బంధువులకు అప్పగించడానికి ప్రభుత్వం నిరాకరించింది. దానికి బదులుగా, రహస్యంగా మృతదేహాలను తరలించి, వాటిని దహనం చేసింది. ఈ విధంగా భారత ప్రభుత్వం తన అమానవీయ స్వభావాన్ని దారుణంగా బయటపెట్టింది. దీనికి తోడుగా, సోను-రూపేష్ వర్గం నేతృత్వంలోని కొంతమంది ద్రోహులు ఇప్పుడు కామ్రేడ్ బసవరాజ్‌ను అత్యంత హేయమైన పద్ధతిలో నిందిస్తున్నారు. అతను ఆయుధాలు విడిచిపెట్టి, లొంగిపోవడానికి మద్దతు ఇచ్చాడని వారు చెబుతున్నారు. తద్వారా తాము సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఎంతో అధిక శక్తిని కలిగిన శత్రు బలగాలను ఎదుర్కొంటున్నప్పటికీ, కామ్రేడ్ బసవరాజూ, అతని సహచరులు చూపిన వీరోచిత ప్రతిఘటనను అపహాస్యం చేస్తున్నారు. ఆ కామ్రేడ్‌లు చివరి వరకు పోరాడాలని ఎంచుకున్నారు. వారు లొంగిపోవడానికి సిద్ధంగా లేరు. బదులుగా, నిజమైన కమ్యూనిస్ట్ సంప్రదాయంలో విప్లవ ప్రజ్వల పతాకాన్ని పైకి ఎత్తి పట్టుకొని, త్యాగానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు.”
“ఇటీవల, ప్రముఖ ఆదివాసీ మానవ హక్కుల కార్యకర్త సోని సోరి, లొంగిపోయిన వారిని ఉద్దేశించి కొన్ని చాలా సముచితమైన ప్రశ్నలను సంధించారు: ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఆదివాసీలకు వారి జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి)పైన హక్కు లభిస్తుందా? ప్రభుత్వం ఆ ప్రాంతం నుండి సాయుధ శిబిరాలను ఉపసంహరించుకుంటుందా? విదేశీ, భారతీయ కార్పొరేట్‌లకు తమ లాభాల కోసం ఆ భూమిని నాశనం చేయడానికి అనుమతి దొరకకుండా ఉంటుందా? ఈ దేశ పాలకుల విధానాలు, ప్రయోజనాల గురించి ఏ మాత్రం తెలిసినవారికైనా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసు. అలాంటిది ఏదీ జరగదు. బదులుగా, ఆ ప్రాంతంలో తీవ్రమైన దోపిడీ మరింత ముమ్మరం కాబోతోంది.
లొంగిపొమ్మని కాదు, పోరాటం చేయాలని అణచివేతకుగురవుతున్న వారికి, వారికి మద్దతు ఇచ్చేవారికి కామ్రేడ్ బసవరాజు అమరత్వం పిలుపునిస్తోంది. కామ్రేడ్ బసవరాజ్ వంటి గొప్ప అమరవీరుల గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టాలని పిలుపునిస్తోంది.”

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad