ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించేటప్పుడు సాధారణంగా ‘ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడికో వెళ్లి అసువులు బాశారు’ అని పాడుతుంటారు. కీర్తిస్తుంటారు. కానీ హిడ్మ విషయం వేరు. ఆయన అక్కడే పుట్టాడు. అక్కడే పెరిగాడు. అక్కడే ఎదిగాడు. అక్కడే చరిత్ర నిర్మించాడు. చివరకు అదే మట్టిలో కలిసిపోయాడు. అదే బస్తర్ నేల. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతం, శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన నంబాళ్ల కేశవరావు ఆరు నెలల కింద ఇదే బస్తర్ నేలలో రక్తం చిందించగా.. బస్తర్‌లో పుట్టిన మాడ్వి హిడ్మ తూర్పు కనుమల్లోని మారేడుమిల్లి ప్రాంతంలో 2025 నవంబర్ 18న ప్రాణాలు విడిచాడు. ఆరు నెలల వ్యవధిలోనే భారత ప్రజాయుద్ధం ఇద్దరు సమర్థులైన సేనానులను కోల్పోయింది.
హిడ్మ గురించి తెలుసుకునే ముందు ఆయన పుట్టి, పెరిగిన బస్తర్ గురించి తెలుసుకోవాలి. నిజానికి బస్తర్ నేల మీద ఆయన మొదటి యోధుడేం కాదు. నిజానికి బస్తర్‌లో పోరాటాల చరిత్ర హిడ్మతోనో, హిడ్మ ప్రాతినిధ్యం వహించిన మావోయిస్టు పార్టీతోనో మొదలవలేదు. చరిత్రలో నమోదైన రికార్డుల ప్రకారమే చెప్పుకున్నా, 1825లో, అంటే భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలవడానికి మూడు దశాబ్దాల ముందే గేంద్ సింగ్ అనే ఆదివాసీ జమీందార్ మొదటిసారి తిరుగుబాటు జెండా ఎత్తాడు. బ్రిటిష్ అండతో ఆదివాసుల హక్కులపై ఉక్కుపాదం మోపిన మరాఠా రాజులకు వ్యతిరేకంగా జరిగిన పరాల్‌కోట్ తిరుగుబాటుకు ఆయన నాయకుడు. నాటి పాలకులు ఆయనను ఉరితీశారు.
ఆ తర్వాత కూడా చిన్నవీ, పెద్దవీ ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. అయితే 1910లో జరిగిన భూమ్‌కాల్ పోరాటం, ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గుండాదూర్‌ది మరో చరిత్ర. కోయ, దొర్ల, మాడియా, మురియా, గోండ్, హల్బా, భత్ర లాంటి ఎన్నో తెగలను ఏకం చేసి బ్రిటిష్ వలసవాదుల దోపిడీ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆయన నడిపిన పోరాటం మరింత సంఘటితమైన, విస్తృతమైన తిరుగుబాటు.
ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1960 దశకంలో ప్రవీర్ చంద్ర భంజ్‌దేవ్ అనే రాజు ఆదివాసుల హక్కుల కోసం గళమెత్తినందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వ బలగాల తూటాలకు బలైన చరిత్రను కూడా జల్-జంగల్-జమీన్ కోసం జరుగుతున్న పోరాట పరంపరలో భాగంగా చెప్పుకోవాలి.
ఇప్పుడైతే దీర్ఘకాలిక పోరాటానికి కాలం చెల్లిందా, చెల్లలేదా? సాయుధ పోరాట పంథా ఇప్పుడు నడుస్తుందా, నడవదా? చైనా పంథానా? రష్యా పంథానా? అనే రకరకాల చర్చలు, ముఖ్యంగా తెలుగు సమాజంలో చాలానే జరుగుతున్నాయి కానీ, లిఖిత ఆధారాలున్న మేరకే చూసినా, బస్తర్‌లో దీర్ఘకాలిక పోరాటానికి దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో సాయుధం పాలెంత, నిరాయుధం ఎంత.. అనేది కేవలం ప్రజలు మాత్రమే ఎంచుకున్నది కాదు. ఆయా కాలమాన పరిస్థితులు నిర్ణయించినవి. లేదా వారి శత్రువు నిర్దేశించినవి.
ప్రవీర్ చంద్ర భంజ్‌దేవ్ ఆయుధాలేమీ పట్టుకోలేదు. ఆ మాటకొస్తే 1989లో విజయభాస్కర్ (సుఖ్‌దేవ్) గెరిల్లా దళ కమాండర్‌గా ఉత్తర్ బస్తర్‌లోని కేష్కాల్ ప్రాంతంలో ఉద్యమ విస్తరణ కోసం వెళ్లడానికి ముందే కువేమారీలో బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన స్థానిక గోండ్ ఆదివాసులు కూడా తుపాకులేం పట్టుకోలేదు. వాళ్ల పోరాటంతో మమేకమైన సుఖ్‌దేవ్ కూడా వారికి తుపాకులు పట్టుకొని పోరాడమనేం చెప్పలేదు. చట్టబద్ధ మార్గాలన్నీ చూపించి, వాళ్లను రోడ్ల మీదికి వెళ్లి ధర్నాలు చేసేలా, ఊరేగింపులు జరిపేలా ప్రోత్సాహించాడు. ‘సంగే దాకాల్.. బాటో కువ్వే ఖదాన్ తున్ బంద్ కీయాలా’ అనే పాట తనే స్వయంగా రాసి, పాడి మరీ వాళ్లను ముందుకు నడిపాడు. ఇవ్వాళ ప్రజాస్వామ్య పోరాటాలు లేదా రాజ్యాంగ పోరాటాలు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వాళ్లకన్నా చాలా ముందు నుంచే అలాంటి పోరాటాలన్నింట్లో బస్తర్ ప్రజలు ఆరితేరి ఉన్నారు. సుఖ్‌దేవ్ ఆయుధం పట్టుకున్నాడు కానీ సాయుధ పోరాటమే ఏకైక మంత్రం అని ఆయన చెప్పలేదు. ఆయనే కాదు, ఆయన పార్టీ కూడా అలా చెప్పలేదు. సాయుధ పోరాటం ప్రధాన పోరాట రూపంగా మారడానికి చరిత్రలో మనం ఇంకా చాలా ముందుకు వెళ్లాలి.
1993లో మావ్‌లీభాట అనే చోట ప్రభుత్వం ఆదివాసుల భూములను బలవంతంగా లాక్కొని స్టీల్ ప్లాంట్ తెరుస్తానన్నప్పుడు దానికి వ్యతిరేకంగా సంఘటితమైన ప్రజలకు అసలు మావోయిస్టు (ఆనాడు పీపుల్స్‌వార్) పార్టీతో సంబంధాలే లేవు. దానికి మద్దతుగా ప్రజలతో కలిసి జగ్దల్‌పుర్‌లో ఊరేగింపు తీస్తున్న బస్తర్ మాజీ కలెక్టర్ బీడీ శర్మ మెడలో చెప్పులు వేసి, ముఖానికి నల్లరంగు పూసి, అవమానించినప్పుడు తమ చట్టబద్ధమైన, శాంతియుతమైన, రాజ్యాంగబద్ధమైన పోరాటం ఎలా క్రూరమైన అణచివేతకు గురైందో బస్తర్ ప్రజలు తమ కళ్లతో చూశారు. ఆ పోరాటానికి ఉన్న పరిమితులేంటో అర్థం చేసుకున్నారు.
2000లో నగర్నార్ అనే చోట మళ్లీ స్టీల్ ప్లాంట్ పేరుతోనే గ్రామసభ తీర్మానాన్ని తుంగలో తొక్కుతూ ప్రజల భూములను లాక్కొంటున్నప్పుడు చేతికందిన కర్రలతో, రాళ్లతో తిరుగబడ్డ ఆదివాసులకు దీర్ఘకాలిక పోరాట సిద్ధాంతం తెలియదు. మావో ఆలోచనా విధానం కూడా తెలియదు. వారికి తెలిసిందల్లా ప్రతిఘటించకపోతే తమ మనుగడ ఉండదన్న విషయం ఒక్కటే.
2005లో లొహండిగూడలో టాటా కంపెనీ మరోసారి స్టీల్ ప్లాంట్ పేరుతోనే భూముల ఆక్రమణకు దిగినప్పుడు అక్కడ మావోయిస్టు పార్టీ ఉనికే లేదు. అయినా సరే.. ప్రతిఘటించకపోతే భూములు దక్కవని, భూములు కోల్పోతే వలస కూలీలుగా మారిపోయి దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుందనే ఎరుకే వారిని చేతికి అందిన పనిముట్టునే ఆయుధంగా మల్చుకొని వీధుల్లోకి వచ్చేలా చేసింది.
అదే సమయంలో, దానికీ, ఇంకా మరెన్నో ఇతర కార్పొరేట్ ప్రాజెక్టులకు రక్షణగా మాత్రమే కాకుండా, ముందస్తు హామీగా మొదలైన సల్వాజుడుం పశ్చిమ, దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో ప్రజలను ఊచకోత కోస్తూ, గ్రామాలకు గ్రామాలే తగులబెడుతుంటే.. లొహండిగూడ ప్రాంత ప్రజలు తమ పోరాటానికి సరైన మార్గదర్శకత్వాన్ని వెతుక్కుంటూ చిత్రకోట్ జలపాతానికి కింది వైపున్న గ్రామాల్లోకి వెళ్లి మావోయిస్టు సంబంధాలు దొరికించుకున్న చరిత్ర మరీ పాతదేం కాదు. ఓ 20 ఏళ్ల కిందిదే.
ఇలాంటి గొప్ప వారసత్వం గల గడ్డపైన 1970 దశకం చివరలో, దక్షిణ బస్తర్‌లోని ఒక మారుమూల పల్లెలో హిడ్మ పుట్టాడు. అప్పటికి బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని పువ్వర్తి ఆయన ఊరు. బాల్యం అంతా ప్రజాపోరాటాల మధ్యే గడిచింది. ఎందుకంటే, అప్పటికే దక్షిణ బస్తర్‌లో మొదట ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ల దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా, ఆ తర్వాత ఆదివాసీ భూస్వాములకు వ్యతిరేకంగా భూమిలేని, నిరుపేద ఆదివాసులు పార్టీ నాయకత్వంలో జరిపిన భూపోరాటాల ఫలితంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ అందరికీ భూములు దక్కాయి. ప్రజాపోరాటాల ఫలితంగా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, తునికాకు కూలీలకు న్యాయమైన ధర.. ఇవన్నీ లభించడంతో ఓ మేరకు స్వేచ్ఛగా జీవిస్తున్న కాలంలో ఆయన బాల్యం గడిచింది. అధికారం కోల్పోతున్న భూస్వామ్య వర్గాల రక్షణ కోసం, ఈ పోరాటాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వం 1990-92ల మధ్య జన్ జాగరణ్ అభియాన్ పేరుతో రెండు సార్లు అణచివేత క్యాంపెయిన్‌లకు దిగితే, వాటిని కూడా ఓడించి ఉద్యమం ముందుకు సాగుతున్న దశలో ఆయన యవ్వనంలో అడుగుపెట్టాడు.
దాదాపు అదే సమయంలో గ్రామగ్రామంలో మొదట సహకార సంఘాల ఏర్పాటు, ఆ తర్వాత బలమైన గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలు (తదనంతర కాలంలో జనతన సర్కార్ పేరుతో సంఘటితమైన ప్రజా ప్రభుత్వ అంగాలు) నిర్మాణమయ్యాయి. గ్రామస్థాయిలో వర్గ శత్రువులపై పై చేయి సాధించిన ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్దేశించుకోవాలనే లక్ష్యంతో గ్రామాల్లో విత్తనాల బ్యాంకుల ఏర్పాటు, సేద్యం పనుల్లో సహకార పద్ధతులు, గ్రామాల్లో చెరువుల నిర్మాణం, చేపల పెంపకం, కూరగాయల సాగు, వైద్య బృందాలు, చదువు నేర్పేందుకు బడులు… ఇలా అనేక రూపాల్లో ప్రజా పరిపాలన ప్రాథమిక స్థాయిలో చిగురిస్తున్న కాలం అది.
సరిగ్గా అలాంటి సమయంలో, 1996 లేదా 1997లో చాలా సహజంగా… ఆ ప్రాంతంలో ఆ తరానికి చెందిన అనేక మంది యువకుల్లానే హిడ్మ కూడా దళంలో చేరాడు. అప్పటికే ప్రైమరీ స్కూల్లో కొంత చదువుకున్నవాడు కావడం, సహజంగానే అన్నీ తెలుసుకోవాలనే, నేర్చుకోవాలనే కుతూహలం మెండుగా ఉన్నవాడు కావడంతో దళంలో సభ్యుడిగా ఉన్న కాలం అంతా చదువు కోసం కేటాయించాడు. తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే పని చేసే బాసగూడ దళంలో సభ్యుడిగా పని చేస్తూ, అదే సమయంలో దండకారణ్యంలో ఫీల్డ్ స్టడీ కోసం కోసం వచ్చి, అదే దళంలో చేరిన ప్రముఖ విప్లవమేధావి, ఉద్యమకారిణి అనూరాధ గాంధీతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు ఏ కొంచెం తీరిక దొరికినా తనకు ఇంగ్లిష్ చదవడం, రాయడం నేర్పాలని పట్టుబట్టే వాడు. ఇంగ్లిష్ ఒక్కటే కాదు, సైన్స్, లెక్కలు.. ఇంకా బయటి ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాల గురించి ఆమెను అడుగుతూ ఉండేవాడు. అంతేకాదు, ఆ సమయంలో ఆ దళంపై ఒకసారి పోలీసులు దాడి చేసి కాల్పులు జరినపుడు, దళం అంతా చెల్లాచెదురైంది. అలాంటి సమయంలో అనూరాధను జాగ్రత్తగా, సురక్షిత ప్రాంతానికి తరలించిన నమ్మకమైన యువ కామ్రేడ్ హిడ్మ.
ఆ తర్వాత పార్టీ ఆయనను దండకారణ్యంలో ఏర్పాటైన మొట్టమొదటి ప్లాటూన్‌లోకి సభ్యుడిగా ఎంపిక చేసింది. కానీ అదే సమయంలో ఆయనకు కాలు బెణికి చాలా కాలం పాటు సరిగా నడవలేకపోవడంతో దానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే, తుపాకుల రిపేరింగ్, తయారీ పనులు చేసే టెక్నికల్ విభాగంలో పని చేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఏడాది, రెండేళ్ల పాటు అందులో పని చేసిన హిడ్మ ఆయుధాలు, మందుగుండు, వాటి పనితీరు, వాటిలో తలెత్తే సమస్యలు, పరిమితులు ఇలా ఎన్నో సాంకేతిక విషయాలు నేర్చుకున్నాడు.
ఆ తర్వాత ఆయనను పార్టీ మళ్లీ దక్షిణ బస్తర్ డివిజన్‌లో ఆర్గనైజేషనల్ బాధ్యతల్లోకి పంపించింది. కొంత కాలం పాటు ఆయన జేగురుగొండ ప్రాంతంలో, కుంట ప్రాంతంలో పని చేశాడు. ఈ క్రమంలో 2005లో మొదలైన సల్వాజుడుం బస్తర్ చరిత్రను ఓ మలుపు తిప్పింది. బస్తర్ ప్రాంతంలో ప్రజాయుద్ధాన్ని కూడా అది మలుపు తిప్పింది. అదే సమయంలో హిడ్మ జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. గ్రామాలపై వందల సంఖ్యలో దాడులు చేస్తూ, ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ దోచుకొని ఊళ్లకు ఊళ్లే కాలబెడుతూ, కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ ప్రభుత్వం సాగించిన తెల్ల బీభత్సకాండ పేరే సల్వాజుడుం. 2005 జూన్ నుంచి 2006 చివరి వరకు సల్వాజుడుం కాల్చి బుగ్గి చేసిన గ్రామాలు 640కి పైగా ఉంటాయని, హత్యకు గురైన వారి సంఖ్య 1200లకు పైగా ఉంటుందని మానవ హక్కుల నివేదికల అంచనా. తమపైన ఘోరమైన లైంగిక దాడులు జరిగాయని వాంగ్మూలం ఇచ్చిన వందల మంది ఆదివాసీ మహిళలున్నారు.
రెండేళ్ల పసిపాప నుంచి 60 దాటిన వృద్ధుల వరకూ అన్ని వయసుల వారినీ సల్వాజుడుం మూకలు క్రూరంగా హత్య చేశాయి. వేలాది మందిని బలవంతంగా కాన్‌సెంట్రేషన్ క్యాంపులకు తరలించాయి. మరోవైపు.. ఇది మావోయిస్టుల దురాగతాలకు వ్యతిరేకంగా ఆదివాసులే చేస్తున్న తిరుగుబాటుగా బయట తప్పుడు ప్రచారం చేస్తూ, మారుమూల ప్రాంతాల్లో కనీవినీ ఎరుగని విధ్వంసకాండ కొనసాగిస్తూ, పత్రికల్లో ఒక్క వార్త కూడా రానివ్వకుండా కట్టడి చేస్తూ, అత్యంత ఫాసిస్టు పద్ధతుల్లో కొనసాగించిన అణచివేత క్యాంపెయిన్ – సల్వాజుడుం. ఈ అమానుష దమనకాండ రెండు, మూడేళ్ల పాటు కొనసాగింది.
ఈ క్రమంలో 2007 సెప్టెంబర్‌లో ఉర్పల్‌మెట్ట అనే గ్రామం దగ్గర 24 మంది సీఆర్పీ జవాన్లను హతమార్చిన ఘటన హిడ్మను తొలిసారి వార్తల్లో నిలబెట్టింది. హిడ్మ నాయకత్వంలో దాదాపు 60-70 మంది గెరిల్లాలతో కూడిన కంపెనీ ఒక చోట ఉండగా, 200-300 మంది భద్రతా బలగాలు ఉర్పల్‌మెట్ట, దాని సమీప గ్రామాలపై దాడి చేసి విధ్వంసకాండకు దిగాయి. కొన్ని ఊళ్లను తగులబెట్టాయి. గ్రామస్థులంతా చెల్లాచెదురుగా ఎక్కడి వాళ్లు అక్కడే పారిపోయారు. ప్రజల నుంచి ఈ సమాచారం అందుకున్న హిడ్మ, ఆయన సహచరులు దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం పరుగెత్తి ప్రభుత్వ బలగాలను చుట్టుముట్టారు. అప్పటికే చాలా మంది తప్పుకొని పారిపోగా, 24 మంది సీఆర్పీ జవాన్లు వారి ఆంబుష్‌లో చిక్కి హతులయ్యారు.
ఈ దాడి ప్రజలకు ఒక విశ్వాసాన్నిచ్చింది. హిడ్మకూ విశ్వాసాన్నిచ్చింది. హిడ్మ నాయకత్వంపై కేడర్లకు విశ్వాసాన్నిచ్చింది. మొత్తంగా పార్టీకి ప్రజాయుద్ధం అభివృద్ధిపై విశ్వాసాన్నిచ్చింది.
తాడిమెట్లలో 76 మంది జవాన్లను హతమార్చిన హంతకుడిగా ప్రభుత్వానికి ఊడిగం చేసే మీడియా చానెల్స్, వాటి బాస్‌లు ఇప్పుడు ఎంతైనా ప్రచారం చేయొచ్చు. హిడ్మ ఏమైనా పుట్టుకతోనే హంతకుడా? ఆయన మరొకరి ప్రాంతం మీదికి దండయాత్రకు వెళ్లాడా? అసలు వేలాది మంది సీఆర్పీ జవాన్లకు, నాగా, మిజో బెటాలియన్లకు అక్కడేం పని? వాళ్లెందుకు అక్కడికి వెళ్లారు? ఎవరి కోసం వెళ్లారు? ఎవరి ఆదేశాలపై, ఏ చట్టాల ప్రకారం వాళ్ల ఊళ్లను వల్లకాడుల్లా మార్చారు? దొరికిన ఆడవారినల్లా ఎందుకు చెరబట్టారు? దొరికిన వాళ్లను దొరికినట్టే ఎందుకు హత్య చేశారు?
2010 ఏప్రిల్ 10న తాడిమెట్లలో జరిగిన 4 గంటల హోరాహోరీ సమరంలో అలసిపోయిన గెరిల్లాలకు ప్రజలే యుద్ధరంగంలోకి దూసుకొచ్చి మరీ అంబలి తాగించారు. గాయపడ్డ 20 మందికి పైగా గెరిల్లాలను, ప్రాణాలు కోల్పోయిన 12 మంది గెరిల్లాలను వాళ్లే మంచాల మీద మోసుకెళ్లారు. అయినా, ఆ మాటకొస్తే హిడ్మ వెంట ఉన్న గెరిల్లాలెవరు? ఆయన ఒక్క సైగతో ప్రాణాలకు భయపడకుండా శత్రువు మీదికి దూసుకెళ్లిన యోధులెవరు? వాళ్లలో ప్రతి ఒక్కరూ తమ గుడిసెనో, గూడాన్నో సల్వాజుడుం దహనకాండలో బుగ్గై పోతుంటే నిస్సహాయంగా చూసిన వాళ్లే. వాళ్లలో దాదాపు ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఒకరినో, కొందరినో సల్వాజుడుం హత్యాకాండలో కోల్పోయిన వాళ్లే. యుద్ధం వాళ్ల అవసరం కాదు. అనివార్యత. అలా వాళ్లు యోధులయ్యారు. హిడ్మ వారికి నాయకుడయ్యాడు. అదొక గతితార్కిక పరిణామక్రమం.
2005-06 వరకూ ఆంబుష్‌లలో ఎక్కువగా మందుపాతరలపైనే ఆధారపడే గెరిల్లాలు క్రమంగా శత్రుబలగాలను చుట్టుముట్టి కాల్పుల ద్వారానే నష్టపర్చే ఎత్తుగడలు చేపట్టారు. ఈ మార్పుకు నాంది పలికిన వారిలో హిడ్మా ముఖ్యుడు. ఆ తర్వాత ఆయన అనేక దాడులకు పథకరచన చేశాడు. దగ్గరుండి నేతృత్వం వహించాడు. ఆయన తనదైన పోరాట శైలిని అభివృద్ధి చేసుకున్నాడు. తను పుట్టిన పెరిగిన ప్రాంతంలో నేలలోని ఎత్తుపల్లాలు సహా భౌగోళిక పరిస్థితులన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాడు కాబట్టి ఎక్కడ ఎలాంటి పోరాట ఎత్తుగడ పని చేస్తుందో ఆకళింపు చేసుకున్నాడు. తన వెంట ఉండే సహచరుల బలాలు, బలహీనతలు అన్నీ తెలిసిన వాడు కాబట్టి ఎవరిని ఎక్కడ మోహరించాలో, ఎవరితో ఏ ఫలితం రాబట్టాలో అంచనాలు వేసుకున్నాడు. ఏ ఆయుధాన్ని ఎక్కడ, ఎలా వాడాలో తెలుసుకున్నాడు. ఏ ప్రజలపై, ఏ మేరకు ఆధారపడాలో అర్థం చేసుకున్నాడు. అలా మావోయిస్టు ప్రజాయుద్ధ శాస్త్రాన్ని తనకు కొట్టిన పిండి లాంటి స్థానిక భౌగోళిక పరిస్థితులకు, ప్రజాపునాది స్థాయికి సరిగ్గా అన్వయించుకున్నాడు.
ప్రజలే హిడ్మ బలం. ఆ ప్రజలకు హిడ్మ బలం. అదే ఆయన విజయ రహస్యం. ఆ దశలో, ఆ ప్రాంతంలో ప్రజాయుద్ధం వరుసగా విజయాలు సాధించగలగడానికి కూడా అదే కారణం. హిడ్మను ప్రజలే తయారు చేశారన్నా అతిశయోక్తి కాదు. వాళ్లే ఆయనకు అడుగడుగునా కళ్లూ, చెవులూ, కాళ్లూ, చేతుల్లా పని చేశారు. ఎందుకంటే, తమ గ్రామాలను తగులబెట్టి, ఆడపడచులను రేప్ చేసి, తమ బిడ్డలను, కొడుకులను హత్య చేస్తున్న సల్వాజుడుం గుండాలను, ప్రభుత్వ సాయుధ బలగాలను శిక్షించగల హీరోగా ప్రజలు ఆయనను చూశారు. తమ గ్రామాలను, తమ ప్రాణాలను, తమ అడవులను, తమ నదులను.. మొత్తంగా తమ ప్రాంతాన్ని కాపాడే యోధుడిగా వారు ఆయనను కొలిచారు. ఆయన మరణం తర్వాత మీడియాతో మాట్లాడిన వాళ్లలో చాలా మంది గ్రామస్థులు, బంధువులు అది బూటకపు ఎన్‌కౌంటర్ అని, పట్టుకొని చంపారని అన్నారు. వారిలో చాలా మంది హిడ్మను ప్రత్యక్షంగా చూసిన వారు కాదు. అయితే, వాళ్ల ఆరోపణలో పోలీసులపై అనుమానంకన్నా, హిడ్మను అలా ముఖాముఖి యుద్ధంలో చంపలేరనే నమ్మకమే ఎక్కువ కనిపిస్తుంది. పోరాటంలో ఆయనను ఎవరూ ఓడించడలేరనే ధీమా ఆ మాటల్లో కనిపిస్తుంది.
అలాంటి హిడ్మ తన ప్రాంతం గాని ప్రాంతంలో, విద్రోహపు వలలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ముఖాముఖి పోరాటాల్లో ఆయనతో తలపడే సాహసం ఏనాడూ చేయని శత్రు బలగాలు ఆయనను నిరాయుధంగా మాత్రమే పట్టుకోగలిగాయి. లొంగిపోతే వదిలేస్తామని శత్రువులే కాదు.. నిన్నటి వరకూ తనతోనే కలిసి నడిచిన కొందరు విభీషణులు సైతం వారికి వంతపాడుతున్నా, ఆయన ఒక వీరుడిగానే మరణించాలని నిర్ణయించుకున్నాడు. చివరి ఊపిరి వరకూ యోధుడిగానే నిలబడాలనుకున్నాడు.
అత్యంత తీవ్రమైన నిర్బంధంలో, కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య, కొద్ది గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేయాలనే కచ్చితమైన ఆదేశాల మధ్య వందల సంఖ్యలో ఆదివాసులు పువ్వర్తికి చేరుకున్నారు. హిడ్మ, ఆయన సహచరి రాజెల శవాల పక్కన రోదించిన వాళ్లలో, వారి శవయాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. బహుశా నిర్బంధం వల్ల పురుషులు ఎక్కువ మంది రాలేకపోవచ్చు. అక్కడికి వచ్చిన మహిళల్లో చాలా మంది హిడ్మను బహుశా ఒకసారి కూడా చూసి ఉండకపోవచ్చు. పేరు మాత్రమే విని ఉండొచ్చు. ఆయన సాధించిన సైనిక విజయాలను ఆస్వాదించి మాత్రమే ఉండొచ్చు. చాలా మంది మహిళలు చంకలో పసిపిల్లలను ఎత్తుకొని అడుగులు వేస్తూ వీడియోల్లో కనిపించారు. వడివడిగా నడుస్తున్న తల్లులు ఏడుస్తున్న తమ పిల్లలకు ఏం చెప్పి సముదాయించారో, ఆ పసివాళ్ల కళ్లల్లో ఏ రూపం గూడు కట్టుకుంటుందో, లేదా.. రేపు ఏ తరం మరోసారి హిడ్మా తరంలా జూలు విదిలిస్తుందో తెలియదు కానీ కానీ హిడ్మ వారసత్వం మాత్రం ఇప్పట్లో ముగిసేది కాదు. హిడ్మ చరిత్ర ఎన్నటికీ చెరిగిపోయేది కాదు!

హిడ్మా మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు - ఇస్తాంబుల్‌లో ప్రచారం
కొందరి ద్రోహం వల్లనే హిడ్మా దొరికాడు;15న పట్టుకొని 19న చంపేశారు – మావోయిస్టు పార్టీ ప్రకటన
దేశ వ్యాప్త నిరసనలకు న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు
ఎన్ కౌంటర్ల పేరిట హత్యాకాండ చేస్తున్నారు – 10 వామపక్ష పార్టీల మండిపాటు
బూటకపు ఎన్ కౌంటర్లను ఆపేయండి, మావోయిస్టులతో చర్చించండి -మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
హిడ్మా ఎన్ కౌంటర్ ఫేక్, విచారణ జరపాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు 