మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు మడావి హిడ్మాతో సహా మారేడు మిల్లి ఎన్ కౌంటర్ కు, ఏపీ లో జరిగిన అరెస్టులకు విజయవాడకు చెందిన కలపవ్యాపారి-ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్-సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, వాళ్లతో పాటు తమ నుండి పారిపోయి తమ కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం…
కామ్రేడ్స్ హిడ్మాల్ (మారెడుమిల్లి), శంకర్ (రంపచోడవరం)ల హత్యలపై న్యాయవిచారణ జరిపించి, దోషులను
కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి.
కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్ జీ కారణమంటూ మనీష్ కుంజాం, సోని సోడీలు చేసిన తప్పుడు
ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
మా కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాల్ ను, ఆయనతో వున్న 5 గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్టు చేసి మూడు రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేసారు. కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్లాడు. ఆ తర్వాత మరికొద్దిమంది వెళ్లారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మాల్ సహ ఆరుగురిని పట్టుకుని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో వాళ్లు చనిపోయారని పోలీసులు కట్టుకథను ప్రచారం చేసారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7 గురు మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధులైన ఏఓవీ ఎస్.జెడ్.సీ. సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను, మరో ఆరుగురిని అరెస్టు చేసి బూటకపు ఎన్కౌంటర్ లో హత్యచేసారు. నవంబర్ 18, 19 తేదీల్లో శత్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసువులు బాసిన కామ్రేడ్స్ కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది. వారి ఆశయసాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడుతామని శపథం చేస్తోంది. వాళ్ల కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తోంది.
ఈ రెండు ఘటనల్లో కూడా వారిని బయటికి తీసుకెళ్లిన వ్యక్తులే పోలీసు ఇన్ఫార్మర్లని ఇప్పుడు అర్థమవుతోంది. నవంబర్ 9 నాడు మా బలగాల నుండి కోసాల్ అనే కంపెనీ పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండరయ్యాడు. ఈయనకు కామ్రేడ్ హిడ్మాల్ ప్రయాణ వివరాలు, ఆయన బయట వుంటున్న విషయం తెలుసు. కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాల్ కు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్స్ తెలియజేసారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీముతో లోపలికి రావడానికి సిద్దమయి ఉంటాడు. ఈ విషయాన్ని ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో, పోలీసులు కామ్రేడ్ హిడ్మాల్ ను, ఆయనతో వున్న మిగతా 5 గురిని అరెస్టు చేసి, హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ ను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ హిడ్మాల్ టీమును, కామ్రేడ్ శంకర్ టీమును, అరెస్టు చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్యచేసారు. ఈ రెండు ఘటనలకూ, విజయవాడ, ఎన్.టీ.ఆర్., కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్లను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలపవ్యాపారి-ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్-సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ ఈ ముగ్గురే కారకులు. వాళ్లతో పాటు మా నుండి పారిపోయి మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమే.
కోసాల్ మా నుండి పారిపోయిన తర్వాత మా కామ్రేడ్స్ లోపలికి రావడానికి సిద్ధమవుతుండడంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకుని, 13 మందిని హత్య చేసారు, 50 మందిని అరెస్టు చేసారు.
అరెస్టయిన వారిలో కామ్రేడ్స్ దేవ్ జీ గానీ, సంగ్రాం (మల్లా రాజిరెడ్డి) గానీ లేరు. వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, కామ్రేడ్స్ హిడ్మాల్ తదితరుల సమాచారం కామ్రేడ్ దేవ్ జీ పోలీసులకు ఇవ్వలేదు.
ఈ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్ ఏజెన్సీలు పరస్పర సమన్వయంతోనే కామ్రేడ్స్ హిడ్మాల్, శంకర్ తదితర 13 మందిని హత్య చేసాయి, 50 మందిని అరెస్టు చేసాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. దీనంతటికి సూత్రధారి దేశ, విదేశీ కార్పొరేట్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్తపిపాసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
వాస్తవాలు ఇలా ఉండగా, కామ్రేడ్ హిడ్మాల్ అమరుడయి ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉన్న స్థితిలో, ఈ హత్యలకు కారకులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నించకుండా, ఈ హత్యలపై న్యాయవిచారణ జరిపించి, ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్ జీ కారణమని మాజీ ఎంఎల్ఎ మనీష్ కుంజాం, సోనిసోడీలు ఆరోపించడమంటే అది కుట్రపూరిత ప్రకటనే. ‘కామ్రేడ్ హిడ్మాల్ సహ 50 మందిని సరెండర్ చేయిస్తానని దేవ్ జీ వీరందరిని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి హిడ్మాల్ ను చంపించాడు, 50 మందిని అరెస్టు చేయించాడు’ అని మనీష్ కుంజాం నవంబర్ 21 నాడు కుట్రపూరిత ప్రకటన చేసాడు.
దేశాన్ని ‘కార్పొరేట్ హిందూదేశం’గా మార్చడానికి, మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించే గడువును నిర్ణయించుకుని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీకి చెందిన కేంద్రకమిటీ సభ్యులను, వివిధ రాష్ట్రాల రాష్ట్రకమిటీ సభ్యులను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చుట్టివేత-నిర్మూలనా దాడులు చేస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహ అనేకమంది కేంద్ర, రాష్ట్రకమిటీ సభ్యులను హత్య చేసాయి. మిగిలిన కామ్రేడ్స్ గణపతి, దేవ్ జీ, మిసిర్ బిస్రా, సంగ్రాం తదితర కేంద్ర, రాష్ట్రకమిటీ సభ్యులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలన్నీ దృశ్య, శ్రవ్య మాధ్యమాల ద్వారా నిరంతరం చేస్తున్న ప్రకటనలు గుడ్డివారికి సైతం కనపడేలా, చెవిటి వాడికి సైతం వినబడేలా సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా సాగుతుంటే మాజీ ఎంఎల్ఎ మనీష్ కుంజాం, సోనిసోడీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా దేవ్ జీని టార్గెట్ చేయడమంటే అది భారీ కుట్రలో భాగమే.
ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ప్రజలు, కగార్ యుద్ధాన్ని ఆపాలని, బస్తర్ లో జరుగుతున్న నరసంహారాన్ని ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతిచర్చలు చేయాలని ప్రచార ఆందోళనలు చేస్తుంటే, 2024, మే 10 నాడు పిడియలో తునికాకు కూలీలను పోలీసులు హత్య చేసిన ఘటన అనంతరం బస్తర్ లో జరుగుతున్నవన్నీ నిజమైన ఎన్కౌంటర్లేనని ఈ సంవత్సరం మే నెలలో బస్తర్ టాకీస్ కిచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ కుంజాం నిర్లజ్జగా అబద్దలాడి బస్తర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు కగార్ పేరుతో చేస్తున్న ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించాడు. 2024 మే తర్వాత ఇప్పటివరకు బస్తర్ లో ఎన్నోచోట్ల కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామీణ ప్రజానీకాన్ని హత్యచేసాయి / చేస్తున్నాయి. డిసెంబర్ 13 నాడు కలాజా-డోండ్రువేడ పరిసరాల్లో జరిగిన చుట్టివేత దాడిలో కామ్రేడ్స్ కార్తిక్, రమీలతో పాటు 5 గురు గ్రామస్థులను ఉద్దేశ్యపూర్వకంగా హత్యచేసాయి. ఫిబ్రవరి నెలలో తోడ్క గ్రామ పరిసరాల్ని చుట్టివేసి (ఎన్ సర్కిల్ మెంట్) 7 గురు గ్రామస్తుల్ని, పార్టీ సభ్యుడు నీలకంఠ్ ను హత్యచేసాయి. మార్చి 31 నాడు ఇంద్రావతి ఏరియాలోని బేల్ నార్ గ్రామంలో నిరాయుధంగా ఉన్న ఎస్.జెడ్.సీ. సభ్యురాలు కామ్రేడ్ చైతేను పట్టుకుని హత్య చేసాయి. ఆ తర్వాత అదే ఏరియాలో కామ్రేడ్ సుధీర్ తో పాటు, ఇద్దరు గ్రామీణ యువకులను పట్టుకుని హత్య చేసాయి. ఇలా ఎన్నో ఘటనల్లో గ్రామీణ ప్రజానీకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేసాయి. నిజాయితీ కలిగిన వ్యక్తులు, శక్తులు, సామాజిక సంఘాలు ఈ హత్యకాండను, నరసంహారాన్ని బహిర్గతం చేస్తుంటే మనీష్ కుంజాం పథకం ప్రకారం వీటన్నింటిని నిజమైన ఎన్కౌంటర్లని ప్రకటించడమంటే అది ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించడమే. ఇపుడు కామ్రేడ్ హిడ్మా హత్యకాండకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా, ఆ హత్యకాండపై న్యాయవిచారణ చేసి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా, ఆందోళన చేయకుండా దానికి కామ్రేడ్ దేవ్ జీని టార్గెట్ చేయడమంటే అది భారీ కుట్రలో భాగమే. బస్తర్ లో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణకు బస్తర్ లో మైనింగ్ చేస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు తను దళారీగా మారిన ఫలితమే ఇలాంటి ప్రకటనలు. ఇది కేవలం దేవ్ జీని టార్గెట్ చేయడమే కాదు, మొత్తం మావోయిస్టు పార్టీపై, విప్లవోద్యమంపై దాడి చేయడంలో భాగమే. మావోయిస్టు పార్టీపై, పార్టీ నాయకత్వంపై, విప్లవోద్యమంపై దాడిచేసి విప్లవ శిబిరంలో గందరగోళాన్ని, అవిశ్వాసాన్ని సృష్టించే ఇంటలిజెన్స్ ఏజెన్సీలు చేసే మానసిక యుద్ధంలో పథకం ప్రకారం పాలుపంచుకోవడంలో భాగమే ఈ ప్రకటన. అందుకే ఈ ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేటీకరణకు / దేశ, విదేశీ కార్పొరేట్లకు దళారీగా మారిన, ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపి బస్తర్ లో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మనీష్ కుంజాం చేస్తున్న, చేయదలచిన కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం.
కామ్రేడ్ హిడ్మాల్ అంతిమయాత్రకు హాజరైన సోనిసోడి ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఇది హత్య అని సరిగానే ఖండించినప్పటికీ, దేవ్ జీ పోలీసులకు చిక్కి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హిడాల్ గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించాడని ఆమె ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ హిడ్మాల్ హత్య గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రజాసంఘాల వారి ద్వారా వాస్తవాలు సేకరించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం తీవ్ర అక్షేపణీయం. ఒకవేళ తను ప్రజాపక్షాన, ఆదివాసులు పక్షాన నిలబడాలనుకుంటే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటుతో ప్రకటన చేసానని ప్రకటించాలని ఈ ప్రకటనను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
కామ్రేడ్ హిడ్మాల్ తదితర కామ్రేడ్స్ తమ పోలీస్ ఇన్ఫార్మర్ల వద్ద వున్నారని తెలిసి, వారిని హత్య చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతనే ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ పువ్వర్తి గ్రామానికి వెళ్లాడు. అక్కడ కామ్రేడ్ హిడ్మాల్ తల్లితో ఆయన సరెండర్ కావాలని ప్రకటన ఇప్పించాడు. కామ్రేడ్ హిడ్మాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు సరెండర్ కాడనేది శత్రువుకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ ప్రకటన ఇప్పించాడు. సరెండర్ కావాలని కోరినప్పటికీ తను సరెండర్ కాలేదు కాబట్టి హిడ్మాల్ ను చంపాల్సి వచ్చిందని, తాము చేసిన హత్యకాండను సమర్థించుకునే దుష్టపథకంలో భాగమే ఇది. మరోవైపు, కామ్రేడ్ హిడ్మాల్ శత్రువుకు సరెండర్ కావడానికి ప్రయత్నించడనేది ఆయన చరిత్రను కళంకితం చేసే దుష్టపథకంలో భాగమే.
ప్రజలకు విజ్ఞప్తి!
కామ్రేడ్ హిడ్మాల్ (మారెడుమిల్లి), కామ్రేడ్ శంకర్ ల (రంపచోడవరం) హత్యకాండపై న్యాయవిచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, కార్పొరేట్ల కోసం సాగుతున్న కగార్ యుద్ధాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్టయిన 50 మంది కామ్రేడ్స్ కు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందించాల్సిందిగా, వారి విడుదల కోసం కృషి చేయాల్సిందిగా ప్రజాపక్ష న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
దేశాన్ని ‘కార్పొరేట్ హిందూదేశం’గా మార్చడానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తూ మా పార్టీ కేంద్రకమిటీ సభ్యుల నుండి మొదలుకుని గ్రామీణ ప్రజల వరకు హత్యలు చేస్తున్నాయి. ఈ స్థితిలో కగార్ యుద్ధానికి వ్యతిరేకంగా మనపార్టీ నాయకత్వంలో పోరాడడం, అమరుల ఆశయసాధన కోసం విప్లవోద్యమంలో దృఢంగా నిలబడి పోరాడడం మనందరి కర్తవ్యం. నేటి కగార్ యుద్ధ తీవ్రత రీత్యా మేం రెగులర్ గా ప్రకటనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. అందుకే మనీష్ కుంజాం లాంటి వారి అబద్దపు ప్రకటనలతో గందరగోళానికి, అవిశ్వాసానికి గురికావద్దు. సోను, సతీష్ లాంటి విప్లవ ద్రోహుల సరెండర్లతో, ఇతరుల సరెండర్లతో నిరాశపడవద్దు. ఇకముందు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్ ఏజెన్సీలు దేశంలోని, దండకారణ్యంలోని మనీష్ కుంజాం లాంటి తమ దళారీల ద్వారా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎన్నో దుష్ట అబద్దపు ప్రచారాలు చేస్తారు. వాటితో గందరగోళ పడవద్దు. ఏ విషయంపైనయినా గ్రామాల్లోకి వచ్చే మనపార్టీ కార్యకర్తల ద్వారా వాస్తవాల్ని తెలుసుకోవాలని, విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.
విప్లవాభినందనాలతో,
వికల్ప్
అధికార ప్రతినిధి,
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).

కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, మురళిల అమరత్వం… గణపతి స్మారకోపన్యాసం
Let us celebrate the 25th anniversary of the PLGA – CPI (Maoist)
మాడ్వి హిడ్మా – అమిత్ షా: రెండు అభివృద్ధి నమూనాలు
ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత
హిడ్మా మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు - ఇస్తాంబుల్లో ప్రచారం
కొందరి ద్రోహం వల్లనే హిడ్మా దొరికాడు;15న పట్టుకొని 19న చంపేశారు – మావోయిస్టు పార్టీ ప్రకటన 