Menu

విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా

anadmin 9 hours ago 0 266

(ఈ వ్యాసం పెద్దగా ఉండటం వల్ల రెండు భాగాలుగా విభజించాము. ఇది మొదటి భాగం.

రెండవ భాగం కోసం avaninews.com వెబసైట్ లో చూడండి)

విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు
కార్మికవర్గ మేధావి, కేంద్ర నాయకుడు కామ్రేడ్ రాజు దాదా

  • కుటుంబ సభ్యులు & బంధుమిత్రులు

2025 – భారత విప్లవోద్యమం మునుపెన్నడూ చూడనంత భారీ నష్టాన్ని చవిచూసిన ఏడాది. అత్యంత హేయమైన విద్రోహాన్ని, ప్రతిఘాతకత్వాన్ని ఎదుర్కొన్న ఏడాది. ఆపరేషన్ కగార్ (అంతిమ యుద్ధం) పేరుతో భారత రాజ్యం మొదలుపెట్టిన ఫాసిస్టు దాడుల్లో ఎందరో గొప్ప నేతలను, కార్యకర్తలను, సానుభూతిపరులను వందల సంఖ్యలో కోల్పోయిన ఏడాది. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాళ్ల కేశవరావు, కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్స్ చలపతి, ప్రయాగ్ మాంఝీ, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, కడారి సత్యనారాయణరెడ్డి, ఖాత రామచంద్రారెడ్డి, మాడ్వి హిడ్మ, పాక హన్మంతులతో పాటు ముఖ్యమైన మహిళా నేతలు రేణుక, అరుణ, విజయలక్ష్మి సహా మరెందరో అమరులుగా చరిత్రలో నిలిచిపోయిన ఏడాది. వీరిలో కొందరు కొన ఊపిరి ఉన్నంత వరకూ శత్రు బలగాలతో పోరాడుతూ ప్రాణాలు అర్పించగా, మరి కొందరు శత్రు చేతిలో చిక్కి, అత్యంత క్రూరమైన చిత్రహింసలను ఎదుర్కొన్నప్పటికీ విప్లవాశయాన్ని, విప్లవోద్యమ పంథాను ఎత్తిపడుతూ, లొంగిపోకుండా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. వీరిలో ఒకరైన ఖాత రామచంద్రారెడ్డి జీవిత విశేషాలను తెలుసుకుందాం.

కేంద్రకమిటీ సభ్యులైన కామ్రేడ్ ఖాత రామచంద్రారెడ్డి (62), కడారి సత్యనారాయణరెడ్డి (70) పార్టీ బాధ్యతల రీత్యా ఛత్తీస్గఢ్లోని ఒక నగరంలో ఆశ్రయం తీసుకుంటూండగా, సెప్టెంబర్ 2025 మధ్యలో శత్రువుకు పట్టుబడ్డారు. అప్పటికే మల్లోజుల వేణుగోపాల్ (సోను), తక్కెళ్లపల్లి వాసుదేవరావు (సతీష్@రూపేష్@ఆశన్న) అనే ఇద్దరు కీలక నేతలు ద్రోహులుగా మారి, శత్రువుతో చేయి కలిపి, పార్టీని చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, సామూహికంగా శత్రువుకు ఆయుధాలు సమర్పించడానికి కుట్ర పన్ని, అన్ని ఏర్పాట్లూ చేసుకొని, లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారు.

‘కోవర్టుగా మారిన సతీష్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే శత్రుబలగాలు వీరిద్దరిని బంధించగలిగాయి’ అని
మావోయిస్టు పార్టీ డిసెంబర్ 2025లో ప్రకటించింది. ‘ లొంగుబాటుకు సిద్ధపడితే ప్రాణాలతో వదిలిపెడతాం’ అంటూ శత్రువు ఎంత ప్రలోభపెట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా వీరు విప్లవపంథాను ఎత్తిపడుతూ ప్రాణాలివ్వడానికే సిద్ధపడ్డారు తప్ప లొంగుబాటు ఆలోచనను దరిచేరనివ్వలేదు. రెనగేడ్ సోను ప్రతిపాదించిన లొంగుబాటు పథకాన్ని 2024లోనే వ్యతిరేకించిన వీరిద్దరూ.. తాము చనిపోయినా సరే భవిష్యత్ తరాలు తమ విప్లవాదర్శాన్ని గుర్తుంచుకుంటాయని, తమ ఆశయాన్ని కొనసాగిస్తాయనే నమ్మకంతో శత్రువు పెట్టిన చిత్రహింసలన్నీ భరించారు. వీరిద్దరిని కొన్ని రోజుల పాటు హింసించిన శత్రుబలగాలు, చివరకు సెప్టెంబర్ 22న కాల్చి చంపి, మాడ్లోని నేలంగూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు చనిపోయినట్టు ప్రకటించాయి.

కానీ పోలీసులు ప్రసారం చేసిన ఈ కట్టుకథను ప్రజలెవ్వరూ నమ్మలేదు. పెరిగిన తెల్లగడ్డంతో, ఒంటి నిండా గాయాలతో, కళ్లు కూడా పీకేసినట్టు కనిపించిన వీరిద్దరి మృతదేహాల ఫొటోలు శత్రువు అమానుషత్వానికి, క్రూరత్వానికి, చట్టాన్ని లెక్కచేయని బరితెగింపుతనానికి సాక్ష్యంగా నిలిచాయి. నిరాయుధంగా, నిస్సహాయ స్థితిలో సజీవంగా పట్టుబడ్డ వీరిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ, తమది అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే భారత రాజ్యం… రాజ్యాంగ సూత్రాలను, చట్టాలను… ఆఖరుకు యుద్ధనియమాలను కూడా ఘోరంగా ఉల్లంఘిస్తూ ఇలా హత్య చేయడాన్ని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించారు.

తీగలకుంటపల్లె నుంచి మొదలైన విప్లవ ప్రస్థానం:
దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు కొనసాగిన విప్లవోద్యమ ప్రస్థానంలో కామ్రేడ్ ఖాత రామచంద్రారెడ్డి అనేక మారుపేర్లతో పని చేశాడు. రవి, విజయ్, జూరు దాద, జాన్, రాజు దాద లాంటి అనేక పేర్లతో ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో సుపరిచితుడైన ఆయన.. వేర్వేరు కాలాల్లో ‘గుడ్సా ఉసెండి’, ‘వికల్ప్’, ‘అభయ్’ పేర్లతో పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశాడు. సౌలభ్యం కోసం ఇక నుంచి ఇందులో ఆయనను రాజు దాదగా వ్యవహరిద్దాం. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా), కోహెడ మండలం తీగలకుంటపల్లెలో 1963 జులై 5న ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో ఆయన జన్మించాడు. ఆయన తల్లి ఖాత వజ్రమ్మ, తండ్రి ఖాత మల్లారెడ్డి. ఆయన స్కూలు చదువు తీగలకుంటపల్లె, కోహెడ గ్రామాల్లో పూర్తయింది. సిద్దిపేటలో ఇంటర్మీడియట్ చదివిన ఆయన 1981-82లో వరంగల్లో టీచర్ ట్రెయినింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత 1983లో, కామ్రేడ్ రాజు దాదకు పెంచికలపేట గ్రామంలో ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం వచ్చింది. అప్పటికి ఆయన వయసు కేవలం 19 ఏళ్లే. ఆ తర్వాత ఆయన వరికోలు అనే గ్రామానికి బదిలీ అయ్యాడు. టీచరు ఉద్యోగం చేస్తూనే ఆయన సిద్దిపేటలో బీఎస్సీ, హైదరాబాద్లో బీఎడ్ చదివాడు.

కామ్రేడ్ రాజు దాదకు చిన్నతనం నుంచే ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలంగా కొనసాగుతున్న విప్లవోద్యమంతో పరిచయం ఉంది. ఆనాటికి అణగారిన వర్గాలపై పెత్తందార్లు, భూస్వాములు పాల్పడుతున్న దోపిడీ, అణచివేతలను చూసి, దానికి వ్యతిరేకంగా పోరాడాలనే చైతన్యంలో ఆయనలో పెంపొందింది. తన సొంతూళ్లో భూస్వాముల పెత్తనాన్ని ఎదిరించేందుకు ఆనాడే ఆయన పదిహేను మందితో ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అలా తొలి నుంచి విప్లవ రాజకీయాలను ఆయన.. అనేక మందిని ఉద్యమంవైపు ఆకర్షించడం కోసం కృషి చేశాడు. సహజంగా అందరితో కలుపుగోలుగా, నిజాయితీగా, చురుకుగా వ్యవహరించే వ్యక్తి కావడంతో ఆయన ఎక్కడున్నా తన చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకునేవాడు. అలా ఆయనకు చాలా పెద్ద మిత్రబృందమే ఉండేది. వారిలో చాలా మంది ఆ తర్వాతి కాలంలో కవులుగా, కళాకారులుగా, న్యాయవాదులుగా, వైద్యులుగా, వివిధ బూర్జువా పార్టీల్లో రాజకీయ నాయకులుగా స్థిరపడ్డారు. ఆ తర్వాత, విప్లవోద్యమంలో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించిన కాలంలో అలాంటి వారితో తన పాత స్నేహసంబంధాలను కొనసాగిస్తూనే, ఆయా సందర్భాల్లో విప్లవానికి అవసరమైన ఎన్నో పనులు వారితో చేయించాడు. వారందరూ ఆయన ఎప్పుడు ఏది కోరినా వీలైన రూపాల్లో సహకారం అందించేందుకు ముందుకు వచ్చేవారు.

కామ్రేడ్ రాజు దాద ఉపాధ్యాయుడిగా పని చేసిన కాలంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వందలాది మంది టీచర్లను ఏపీటీఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) అనే ఉపాధ్యాయ సంఘంలోకి ఆకర్షించాడు. విప్లవ రాజకీయాలతో ప్రభావితులైన ఎంతో మంది టీచర్లు ఆనాటికే ఆ సంస్థలో భాగంగా ఉండేవారు. టీచర్లు ఎదుర్కొనే అనేక సమస్యలపై ఉద్యమించేలా ఆయన కృషి చేశాడు. అలా ఆయన ఆ సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. టీచరుగా పని చేస్తున్న కాలంలోనే తన మిత్రుడైన ప్రభాకర్ ఇంటికి ఆయన తరచూ వెళ్తుండేవాడు. ఆయన సోదరి కామ్రేడ్ శాంతిప్రియ (మాలతి)తో ఏర్పడ్డ పరిచయం కొద్ది కాలంలోనే ప్రేమకు, పెళ్లికి దారి తీసింది. ఆనాటికి శాంతిప్రియకు విప్లవరాజకీయాలతో ఎక్కువ పరిచయం లేకున్నా, రాజు దాద వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని చూసి జీవిత భాగస్వామిగా ఎన్నుకుంది. ఆమె సోదరుడికి, కుటుంబసభ్యులకు అందరికీ ఆయనపై సదభిప్రాయం ఉండటంతో వారందరి ఆమోదంతో 1988 డిసెంబర్ 14న వారిద్దరి కులాంతర వివాహం జరిగింది. అప్పటికే ఓవైపు ఉద్యోగం చేస్తూనే, విప్లవ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న రాజు దాదకు శాంతిప్రియ సాహచర్యం మరింత చొరవగా, ఉత్సాహంగా పని చేసేందుకు ఎంతగానో తోడ్పడింది.

పెళ్లి తర్వాత ఆయన ఓ వైపు ఉపాధ్యాయ సంఘ కార్యకలాపాల కోసం, మరోవైపు విప్లవోద్యమ పనుల కోసం మునుపటికన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించసాగాడు. 1980ల మధ్య నాటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విప్లవోద్యమంపై ప్రభుత్వ అణచివేత తీవ్రస్థాయికి చేరుకుంది. ఎంతో మంది కామ్రేడ్స్ బూటకపు ఎన్కౌంటర్లలో అమరులయ్యారు. విప్లవకారులు చేపట్టిన ప్రతిఘటనా చర్యల్లో కొందరు పోలీసులు అధికారులు హతులయ్యారు. ఆ జిల్లా పార్టీ నాయకత్వంతో రాజు దాదకు సన్నిహిత సంబంధాలుండటంతో, పెరిగిన పోలీసు నిఘా కారణంగా ఇక ఆయన బహిరంగంగా ఉంటూ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో 1989లో ఆయన తన ఉద్యోగం నుంచి లాంగ్ లీవ్ తీసుకొని ఎల్ఎల్బీ చదివేందుకు ఆనాటి మధ్యప్రదేశ్లోని రాయ్పుర్ నగరానికి వెళ్లాడు. సహచరి శాంతిప్రియ కూడా ఆయనను అనుసరించింది. అప్పటికే ఆయన విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా పని చేసేందుకు సిద్ధపడ్డాడు.

1980 నుంచి దండకారణ్యంలో (ప్రధానంగా ఛత్తీస్గఢ్లోని ఉమ్మడి బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతాలు) విప్లవోద్యమ విస్తరణ మొదలైంది. గెరిల్లా దళాలు ఆదివాసులను సమీకరించి జల్-జంగల్-జమీన్పై అధికారం కోసం, అటవీశాఖ అధికారులు ప్రజలపై జరిపే అన్యాయాలపై పోరాటాలు ప్రారంభించాయి. అలా 1980ల మధ్యనాటికి దండకారణ్యంలోని గణనీయమైన ప్రాంతంలో విప్లవోద్యమం సంఘటితపడింది. స్థానిక ఆదివాసులు విప్లవ కార్యకర్తలుగా, గెరిల్లా దళ సభ్యులుగా, కమాండర్లుగా ఎదిగే క్రమం మొదలైంది. పెరుగుతున్న ఈ ఉద్యమానికి పట్టణ ప్రాంతాల్లోని కార్మికులు, మధ్యతరగతి, మేధావుల మద్దతును కూడగట్టేందుకు, పెరిగే ఉద్యమ అవసరాలను తీర్చేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం కొందరు ఆర్గనైజర్లను కేటాయించింది. వారిలో ఒకరు రాజు దాద. అలా రాజు దాద, శాంతిప్రియల జంట రాయ్పుర్ స్థిరపడింది.

రాయ్పుర్లో విప్లవోద్యమ నిర్మాణ కృషి:
రాయ్పుర్ నగరంలో రాజుదాద మొదట ‘రవి’ పేరుతో పని చేశాడు. వారిద్దరి జంట క్రమంగా హిందీ భాషపై పట్టు సంపాదించింది. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు రాజు దాద మొదట ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడే ‘ఈనాడు’ పత్రికకు రాయ్పుర్ నుంచి కాంట్రిబ్యూటర్గా పని చేశాడు. అది ఆయనకు మంచి కవర్గా, పరిచయాలు పెంచుకునే సాధనంగా పని చేసింది. అదే సమయంలో ఇల్లు గడవడానికి శాంతిప్రియ పిల్లలకు ట్యూషన్లు చెబుతుండేది. అప్పటికే వారికి ఒక అమ్మాయి పుట్టింది. ఆమె ఇంటి పనులు, ట్యూషన్లతో పాటు పాపను చూసుకుంటూ ఉండగా, రాజదాద ‘రవి’గా రిపోర్టింగ్ పనులు చేస్తూనే విప్లవోద్యమ నిర్మాణం కోసం పరిచయాలు పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా పొద్దంతా సైకిల్పై తిరుగుతూ ఉండేవాడు. వారు అద్దెకు ఉండే ఇంటి యజమానులకు గానీ, చుట్టుపక్కల వారికి గానీ ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవడంతో పాటు, అందరితో స్నేహసంబంధాలు కొనసాగించేవారు. అలా వారి ఇల్లు పార్టీ నాయకత్వానికి ఒక షెల్టర్గా ఉపయోగపడేది. అయితే తాను కొనసాగించే ఉద్యమ కార్యకలాపాల గురించి తన కుటుంబానికి కూడా తెలియకుండా రాజు దాద జాగ్రత్త పడేవాడు.

రాయ్పుర్లో రాజు దాద పని చేస్తున్న కాలంలో మరి కొందరు ఆర్గనైజర్లు భిలాయ్, దుర్గ్, దల్లీ-రాజహరా ఇతర పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తుండేవారు. పార్టీ వారందరినీ కలుపుతూ ఆర్డీఆర్(రాయ్పుర్-దుర్గ్-రాజ్నాంద్గాం) పేరుతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, రాజు దాద తప్ప ఆ కమిటీలోని మిగతా ఇద్దరు కామ్రేడ్స్ ఆ తర్వాతి కాలంలో తమ రాజకీయ, వ్యక్తిగత బలహీనతలతో పార్టీని వదిలి వెళ్లిపోయారు. రాజు దాద ఈ మొత్తం ప్రాంతంలో పాత్రికేయులను, ప్రొఫెసర్లను, ఇతర మేధావులను కలుస్తూ వారిని పార్టీ రాజకీయాల వైపు ఆకర్షించేందుకు కృషి చేశాడు. తనకు పాత్రికేయుడిగా ఉన్న గుర్తింపును వాడుకుంటూ ఆయన అనేక మందిని కలుస్తుండేవాడు.

రాయ్పుర్, భిలాయ్, దల్లీ-రాజహరా ప్రాంతాల్లోని కార్మిక వాడల్లో కూడా ఆయన పరిచయాలు పెంచుకున్నాడు. ముఖ్యంగా రాయ్పుర్ సమీపంలోని, చుట్టుపక్కల ఉండే అనేక ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులను వివిధ సమస్యలపై కూడగట్టేందుకు కృషి చేశాడు. వారిలోంచి కొందరిని ఆ తర్వాతి కాలంలో విప్లవోద్యమంలో పూర్తికాలం పని చేసే కార్యకర్తలుగా, బలమైన సానుభూతిపరులుగా తయారు చేశాడు. ఛత్తీస్గఢ్ పట్టణ, మైదాన ప్రాంతాల్లో ఉన్న వేర్వేరు ఎం-ఎల్ గ్రూపులను, ముఖ్యంగా రెడ్ఫ్లాగ్ కామ్రేడ్స్తో కూడా ఆయన పరిచయాలు పెంచుకున్నాడు. ఆ క్రమంలో రెడ్ఫ్లాగ్ గ్రూపులో రాష్ట్రకమిటీ సభ్యుడిగా ఉన్న కామ్రేడ్ హరఖ్ (దల్లీ-రాజహరా) ఆ పార్టీని వదిలి, ఆనాటి సీపీఐ (ఎం-ఎల్) (పీపుల్స్వార్)లో చేరాడు. (ఆ తర్వాతి కాలంలో ఆయన శ్రీకాంత్ పేరుతో గడ్చిరోలి జిల్లాలో చాలా కాలం పాటు విప్లవోద్యమానికి నాయకత్వం వహించి, చివరకు 2013లో అనారోగ్యంతో కన్నుమూశాడు.) అలా ఆర్డీఆర్ కమిటీ కొత్త శక్తులతో మళ్లీ పటిష్టమైంది. అది పార్టీ కార్యకలాపాల విస్తరణకు మరింత దోహదం చేసింది. రాజ్నాంద్గాం గ్రామీణ ప్రాంతంలో కామ్రేడ్ హరఖ్కు చాలా విస్తృతమైన సంబంధాలుండేవి. ఆయన చొరవ వల్ల కొందరు కళాకారులు, సాంస్కృతిక బృందాల సభ్యులు కూడా పార్టీ వైపు వచ్చారు. హరఖ్ స్వయంగా కళాకారుడు, గేయ రచయితే కాకుండా వీధినాటకాల్లో కూడా మంచి పట్టున్న వ్యక్తి. ఆ ప్రాంతంలో ఆయన, రాజు దాద ఇద్దరూ కలిసి చేసిన కృషి ఫలితంగా అనేక మంది కళాకారులు పార్టీలో చేరారు. అంతే కాదు, వారిలో కొందరు అప్పటికే ఏర్పడ్డ ఏఐఎల్ఆర్సీ (అఖిల భారత విప్లవ సాహిత్య, సాంస్కృతిక సంస్థ)లో భాగమయ్యారు.

ఇలా 1990 దశకంలో ఆర్డీఆర్ కమిటీ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ పట్టణ, మైదాన ప్రాంతాల్లో విప్లవ కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో కొందరు కమిటీ సభ్యులలో బలహీనతలు తలెత్తాయి. మరోవైపు, దండకారణ్య ఫారెస్టు కమిటీ పట్టణ యంత్రాంగాన్ని పోలీసులు అరెస్టు చేయడంతో ఆర్డీఆర్ కమిటీ పని చేయడంలో అడ్డంకులు ఎదురయ్యాయి. కమిటీని తిరిగి సంఘటితం చేయడానికి పార్టీ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. దాంతో ఆర్డీఆర్ ప్రాంతంలో మిగిలిన కమిటీ సభ్యులను, ఇతర కామ్రేడ్స్ను అటవీ ఉద్యమంలో భాగం చేయాలని నాయకత్వం నిర్ణయించింది. కానీ దీని వల్ల పార్టీ 1980ల ప్రారంభంలో, ముందుచూపుతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయానికి విఘాతం కలుగుతుందని కామ్రేడ్ రాజు దాద నాయకత్వంతో చర్చించాడు. ఈ విషయంలో ఆనాటి నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో స్పష్టంగా విభేదించాడు. తక్షణ సమస్యలను పరిగణనలోకి తీసుకొని దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రయోజనాలను విస్మరించకూడదనేది ఆయన అభిప్రాయం. దాంతో పార్టీ నాయకత్వం మరోసారి చర్చించి, మిగతావారిని అటవీ ప్రాంతానికి తరలించినప్పటికీ రాజు దాదను మాత్రం అక్కడే కొనసాగించేందుకు సిద్ధపడింది. నిజానికి ఆయన అలా అక్కడే ఉండి పని చేయడం వల్లనే ఆ తర్వాతి కాలంలో విప్లవోద్యమానికి ఎంతో ఉపయోగపడిందని ఆ తర్వాతి చరిత్ర రుజువు చేసింది.

‘విలేఖరి’ పనికి స్వస్తి.. విప్లవ కృషి ముమ్మరం:
కామ్రేడ్ రాజు దాద ఆర్లనైజేషన్ పనులలో నిండా మునిగిపోవడంతో, ఇక ‘పత్రికా విలేఖరి’గా రిపోర్టులు పంపడం కష్టంగా మారింది. దాంతో ఆయన దాన్ని పూర్తిగా వదిలేశాడు. దాంతో పాటే ఆయన తన పేరు కూడా మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ‘విజయ్’గా మారాడు. 2001 నాటికి దండకారణ్యంలో ప్రజాయుద్ధం ముందుకు సాగుతుండగా అనేక కొత్త అవసరాలు ముందుకు వచ్చాయి. పట్టణ యంత్రాంగం ఆవశ్యకత అనేక రెట్లు పెరిగింది. రెండు పార్టీల విలీనం అంశం కొత్తగా ఎజండాలోకి వచ్చింది. అప్పటికే కామ్రేడ్ రాజు దాద, శాంతిప్రియ దంపతులకు మరో సంతానం కలిగింది. ఈసారి వారికి కొడుకు పుట్టాడు. పట్టణ జీవితానికి తగినట్టు సహజమైన కవర్ ఉండాలనే ఆలోచనతో, పార్టీ సలహా మేరకు కామ్రేడ్ రాజు దాద రాయ్పుర్ బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా తీసుకున్నాడు. అంతేకాదు, ఆయన తన కవర్ను పటిష్టంగా కొనసాగించడం కోసం అక్కడి రవిశంకర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీతో పాటు హిందీ సాహిత్యంలో ఎంఏ కూడా ప్రైవేటుగా పూర్తి చేశాడు.

ఇక్కడే వీరి కుటుంబ జీవనం గురించి కూడా కొంత చెప్పుకోవాలి. మొదట్లో రాయ్పుర్లో వీరు చాలా ఇబ్బందులతో గడిపారు. చాలా పొదుపుగా బతకాల్సి వచ్చేది. వారికి పార్టీ నుంచి అందే అతి తక్కువ డబ్బులతో ఇల్లు గడవడం, నెలనెలా ఇంటి కిరాయి చెల్లించడం కూడా కష్టంగా ఉండేది. కానీ దీన్ని రాజు దాద దంపతులు, పిల్లలు దీన్నంతా ఓపికగా భరించారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ అవసరాలు పెరగడం, వారి ఇంటిని ఒక ముఖ్యమైన షెల్టర్గా ఉపయోగించుకోవలసిన అవసరం ఏర్పడటం, మరోవైపు, బార్ కౌన్సిల్లో నమోదైన న్యాయవాదిగా ఆయన గుర్తింపు పొందడంతో, 2004 నుంచి కొంత మేరకు మెరుగైన సదుపాయాలుండే, మధ్యతరగతి తరహా ఇంటిని అద్దెకు తీసుకొని ఉండసాగారు. వీరి ఇద్దరు పిల్లలు ప్రైమరీ, హైస్కూళ్లలో చదవసాగారు.

దండకారణ్య ఉద్యమ నేతగా…
2003లో జరిగిన పార్టీ ప్లీనంలో కామ్రేడ్ రాజు దాద దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఆ క్రమంలో ఆయనపై బాధ్యతలు అనేక రెట్లు పెరిగాయి. దండకారణ్య పార్టీ అవసరాలు తీర్చడం, కేంద్రకమిటీ అప్పగించే వివిధ రకాల పనులు చేయడంతో పాటు, పట్టణ ప్రాంతంలో ఆర్గనైజేషన్ బాధ్యతలను కూడా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సానుభూతిపరులను, కొరియర్లను కలవడం, వేర్వేరు సంస్థల్లో ఉన్న విప్లవకారులతో సంబంధాలను కొనసాగించడం, తన కవర్ దెబ్బతినకుండా, అడపాదడపానైనా న్యాయవాదులతో గడపడం, కోర్టుకు వెళ్లడం వంటి పనులు చేయాల్సి వచ్చేది. కామ్రేడ్ రాజు దాదలో ఉన్న అపారమైన శక్తిసమర్థతలతో పాటు ఆయనకు కుటుంబం నుంచి అందిన సహకారం వల్లనే ఆయన ఈ పనులన్నీ చేయగలిగాడు. అలా పార్టీ ముందుకు వచ్చిన ఎన్నో అవసరాలను తీర్చగలిగాడు. నూతన ప్రాంతాల్లోకి పార్టీ విస్తరణకు అవసరమైన ముందస్తు సర్వే పనుల నుంచి సైనిక చర్యలకు అవకాశం వున్న శత్రువు శిబిరాల రెక్కీ పనుల వరకూ.. అనారోగ్యంతో బాధపడే ఉద్యమకారులకు, పోరాటాల్లో గాయపడే గెరిల్లాలకు అవసరమైన వైద్య సహాయం అందించడం నుంచి పోరాట ప్రాంతాల అవసరాలు తీర్చడానికి కావాల్సిన ఎన్నో రకాల సైనిక సప్లయిలను చేరవేయడం వరకు… ఆయన ఎన్నో విధాలుగా పని చేశాడు.

ఛత్తీస్గఢ్లోని వివిధ పట్టణాల్లో తన పరిచయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆయన ఏదో విధంగా పార్టీ అవసరాలు తీర్చేందుకు నేర్పుగా వినియోగించుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల కాలంలో రాయ్పుర్, భిలాయ్, బిలాస్పుర్ తదితర పట్టణాల్లో వేర్వేరు చోట్లలో వారి కుటుంబం అద్దెకు ఉన్న ఇంటి యజమానులను, ఇరుగుపొరుగు వారిని కూడా ఆయన విప్లవోద్యమ అవసరాలు తీర్చే సానుభూతిపరులుగా మార్చాడంటే ఆశ్చర్యపోకతప్పదు. ఆయన, ఆయన సహచరి ఏ ఇంట్లో అద్దెకు ఉన్నా, ఆ ఇంటి యజమానులకు, చుట్టుపక్కల వారికి అన్నావదినలుగానో, కొడుకు-కోడలుగానో మారిపోయేవారు. అలా వారికి తలలో నాలుకలా మెలిగేవారు. ఆఖరుకు గాంధేయవాదులను కూడా విప్లవోద్యమ అవసరాలు తీర్చే విధంగా తయారుచేసిన సమర్థుడు ఆయన. ఆయన అనేక సందర్భాలలో పార్టీ కేంద్ర నాయకత్వాన్ని అడవిలోంచి నగరాలకు, నగరాల్లోంచి అడవిలోకి చేర్చడంలో శత్రువుకు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకునేవాడు. ఆయన నడిపే వాహనం పేపర్స్ నుంచి తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ వరకు అన్నీ పక్కాగా ఉండేలా చూసుకునే వాడు.

‘సల్వాజుడుం’ శ్వేత బీభత్సాన్ని ఎండగట్టిన ప్రచార కమిటీ నేత:
2000-01 నుంచే ఆయన ‘గుడ్సా ఉసెండి’ పేరుతో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా పని చేస్తూ, ఉద్యమానికి సంబంధించిన రాజకీయ ప్రకటనలు ఎప్పటికప్పుడు ప్రెస్కు అందించడం మొదలుపెట్టారు. అయితే, కామ్రేడ్ రాజు దాద ఈ పని చేస్తున్న విషయాన్ని పార్టీ శ్రేణులకు సైతం తెలియకుండా ఆనాటి నాయకత్వం రహస్యంగా ఉంచింది. 2006 వరకు ఆయన ఈ బాధ్యతలో కొనసాగాడు. ఉద్యమ ప్రచార అవసరాలు మరింత పెరగడంతో ఆనాటికే ఎస్జెడ్సీ ప్రచార కమిటీని ఏర్పాటు చేయగా, దానికి ఆయన బాధ్యుడిగా వ్యవహరించాడు. 2005 జూన్లో దండకారణ్యంలోని దక్షిణ, పశ్చిమ బస్తర్ ప్రాంతాల్లో సల్వాజుడుం పేరుతో అత్యంత బీభత్సకరమైన అణచివేత క్యాంపెయిన్ మొదలుకావడంతో దీని గురించి బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై మరింత పెరిగింది. ఈ అణచివేత ఏయే రూపాల్లో, ఎంత హింసాత్మకంగా జరుగుతుందో వివరిస్తూ ఎన్నో బుక్లెట్స్, కరపత్రాలతో పాటు ఒక డాక్యుమెంటరీ ఫిల్మును తయారు చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు.

పట్టణ ప్రాంతాల్లోని న్యాయవాదులను, జర్నలిస్టులను, ప్రజాస్వామికవాదులను, వివిధ మానవ హక్కుల సంస్థలను స్వయంగా కలిసి, వారు ఉద్యమ ప్రాంతాల్లోకి వెళ్లి నిజనిర్ధారణ జరిపేలా, విప్లవోద్యమానికి సంఘీభావం ప్రకటించేలా చేయడంలో కామ్రేడ్ రాజు దాద కృషి ఉంది. సల్వాజుడుం చేస్తున్న అరాచకాలను, హత్యాకాండలను ఎండగడుతూ ప్రచార కమిటీ రూపొందించిన డాక్యుమెంటరీ ఫిల్మును సీడీల్లో రికార్డ్ చేసి బయటి ప్రపంచానికి అందించడంతో పాటు, వాటిని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యేలకు కూడా రహస్యంగా చేరవేసేలా ఆయన ప్లాన్ చేశాడు. అప్పటికి మీడియానంతా తన గుప్పిట్లో పెట్టుకొన్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు.. సల్వాజుడుం చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాలు ఏవీ బయటకు రాకుండా పకడ్బందీగా మేనేజ్ చేస్తూ, సల్వాజుడుం అనేది నక్సల్స్పై ఆదివాసులు తమంతట తామే శాంతియుతంగా చేస్తున్న సత్యాగ్రహం అనే బూటకపు ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ ఆ సీడీ బయటకు రావడంతో సల్వాజుడుం అసలు రూపం ఏంటో మొదటిసారి రాయ్పుర్ తదితర నగరాల్లో చర్చకు వచ్చింది. రాజ్యానికి తొత్తులుగా పనిచేసే మీడియా సంస్థలు సైతం ఆ సీడీలో ఉన్న వివరాలను రిపోర్ట్ చేయక తప్పలేదు.

కామ్రేడ్ రాజు దాద చేసిన కృషి ఫలితంగా ఛత్తీస్గఢ్లోని కొన్ని శ్రామిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సల్వాజుడుంకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశాయి. అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ సల్వాజుడుంను ఖండించింది. సల్వాజుడుం పాల్పడుతున్న హింసాకాండ గురించి క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవడానికి, రిపోర్ట్ చేయడానికి దేశ, విదేశాల నుంచి వచ్చిన పాత్రికేయులను ఉద్యమ ప్రాంతంలోకి పంపించడంలో ఆయన ఓ వారధిలా పని చేశాడు. అంతేకాదు, ఆ విధ్వంసకాండలో గాయపడిన, రోగాలపాలైన ఆదివాసులకు వైద్య సేవలు అందించడానికి ‘డాక్టర్స్ వితవుట్ బార్డర్స్’ లాంటి అంతర్జాతీయ సంస్థలను సంప్రదించి, ఒప్పించి, బస్తర్ అడవుల్లోకి పంపించడం వెనుక కూడా ఆయన చొరవ ఉంది.

పార్టీ పట్టణోద్యమ విధాన రూపకల్పనలో:
2001 తర్వాత సీపీఐ (ఎం-ఎల్) (పీపుల్స్ వార్) తన మౌలిక డాక్యుమెంట్లతో పాటు వివిధ సామాజిక, ఆర్థిక సమస్యలపై అనేక పాలసీ పేపర్లు రూపొందించింది. వాటిలో ‘పట్టణాల్లో పని – మన అవగాహన’ అనే పేరుతో వచ్చిన పాలసీ పేపర్ ఒకటి. ఈ పేపర్ తయారీ కోసం పార్టీ దేశంలోని వివిధ పట్టణాలలో, కార్మికరంగంలో పని చేస్తున్న నాయకత్వ కామ్రేడ్స్తో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. పట్టణాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వివిధ దేశాల విప్లవోద్యమాల్లో పట్టణ పని ప్రాముఖ్యత, అక్కడి విప్లవ పార్టీల పని విధానం, వాటి అనుభవాలను అధ్యయనం చేసి, చాలా లోతైన చర్చలు చేసి ఆ పేపర్ రూపొందించారు. ఆ పనిలో కామ్రేడ్ రాజు దాద భాగస్వామ్యం కూడా ఉంది.

కామ్రేడ్ రాజు దాద రాయ్పుర్లో విలేఖరిగా పని చేసిన కాలంలో, ఆ తర్వాతి కాలంలో పట్టణ ప్రాంతాల పరిస్థితులను లోతుగా అధ్యయనం చేశాడు. ముఖ్యంగా రాయ్పుర్, రాజ్నాంద్గాం, భిలాయ్, దుర్గ్ మొదలైన పట్టణాలు ఒక విశాలమైన కార్మిక కేంద్రంగా ఎలా రూపుదిద్దుకుంటున్నాయో ఆయన చాలా సన్నిహితంగా చూశాడు. దాన్ని అధ్యయనం చేశాడు. అలాగే, దల్లీ రాజహరా సహా అనేక కార్మిక కేంద్రాల్లో ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చా (సీఎంఎం) సంస్థాపక నాయకుడు కామ్రేడ్ శంకర్ గుహ నియోగి నాయకత్వంలో కార్మిక సమస్యలపై జరిగిన పోరాటాలను అధ్యయనం చేశాడు. వేర్వేరు కార్మిక సంఘాల నాయకత్వంలో కార్మికుల సమస్యలపై చేపడుతున్న పోరాటాలను నిరంతరం తెలుసుకుంటూ ఉండేవాడు. ట్రేడ్ యూనియన్ల నాయకత్వ అవినీతిని, వారి కార్మిక వ్యతిరేక స్వభావాన్ని ఎత్తిచూపుతూ, వాటిపై కార్మికులలో జాగరూకత పెంచేవాడు. భిలాయ్ ప్రాంతంలో ఒక విప్లవాభిమాని కార్మికుల కోసం నడిపించే ‘మజ్దూర్ మార్గ్’ అనే పత్రికకు రెగ్యులర్గా కార్మిక సమస్యలపై వ్యాసాలు రాయడమే కాకుండా, ఆ పత్రిక నిర్వహణకు ఆయన మార్గదర్శకత్వం కూడా వహించాడు.

1991లో కామ్రేడ్ శంకర్ గుహ నియోగిని కార్పొరేట్ యాజమాన్యాలు హత్య చేయించిన తర్వాత ఆ సంస్థ మూడు భాగాలుగా చీలిపోయింది. కామ్రేడ్ నియోగి ఆశయాలను నిజాయితీగా ముందుకు తీసుకెళ్లడానికి బదులు తమ స్వార్థం కోసం సంస్థ పేరు ప్రతిష్టలను వినియోగించుకొని సొమ్ము చేసుకునేవాళ్లే ఎక్కువయ్యారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న కామ్రేడ్ రాజు దాద నియోగి అనుచరులను, దగ్గరి వాళ్లను కలిసి వారితో ఒక కొత్త ప్రజా సంఘాన్ని ఏర్పాటు చేయించడం కోసం ప్రయత్నించాడు. దల్లీ రాజహరా చుట్టూ ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతను అందులోకి సమీకరించడానికి కృషి చేశాడు. అయితే, అక్కడి నాయకత్వ శక్తుల్లో నిబద్ధత లోపించడంతో ఆ కృషి పెద్దగా ఫలితాలివ్వలేదు.

(ఇంకా ఉంది)

(రెండో భాగం రేపు..)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad