Menu

చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ‌ యోధుడు కామ్రేడ్ రాజు దాదా

anadmin 3 hours ago 0 25

రెండవ భాగం

విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు

కార్మికవర్గ మేధావి, కేంద్ర నాయకుడు కామ్రేడ్ రాజు దాదా

రెండు విప్లవ స్రవంతుల విలీనం కోసం:


2001లో నాటి సీపీఐ (ఎం-ఎల్) (పీపుల్స్ వార్) 9వ కాంగ్రెస్ తర్వాత, ఆనాటి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) ప్రతిపాదించిన ఐక్యతా చర్చలను కొనసాగించాలని కేంద్రకమిటీ నిర్ణయించింది. అలా రెండు పార్టీల కేంద్రకమిటీల మధ్య అనేక దఫాలుగా సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల కోసం నాయకత్వ కామ్రేడ్స్ ప్రయాణాలు సాఫీగా సాగడానికి కామ్రేడ్ రాజు దాద ఎంతో కృషి చేశాడు. అంతకు ముందే రెండు పార్టీల నాయకత్వం ఓ సందర్భంలో సమావేశమైనపుడు ఆయన వారికి అనువాదకుడిగా సహకరించాడు. అలా ఆయనకు రెండు పార్టీల ఉన్నత నాయకత్వంతో మంచి పరిచయం, చనువు ఉండేవి.

2004లో విలీనం తర్వాత ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఐక్యతా కాంగ్రెస్ – 9వ కాంగ్రెస్ 2007 జనవరిలో జరిగింది. ఈ కాంగ్రెస్లో కామ్రేడ్ రాజు దాదా ప్రతినిధిగా హాజరయ్యాడు. అంతేకాదు, ఆ మహాసభకు దండకారణ్యం, ఉత్తర తెలంగాణా జోన్ల నుంచి ప్రతినిధులుగా వెళ్లిన వారి ప్రయాణాలు మొదలు, వారి అధ్యయనం కోసం వసతి ఏర్పాట్లు వగైరా పనులన్నీ ఆయనే ప్లాన్ చేశాడు. కాంగ్రెస్లో ప్రతినిధిగా పాల్గొనడంతో పాటు, అనువాదకుడిగా కూడా తన సేవలందించాడు. వివిధ ప్రాంతాల వక్తల ప్రసంగాలను, అభిప్రాయాలను తెలుగు నుంచి హిందీలోకి, హిందీ నుంచి తెలుగులోకి ఎప్పటికప్పుడు అనువదించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. కామ్రేడ్ రాజు దాద ఒక మంచి వక్త. మంచి చదువరి. ఆయనకు అనేక విషయాల మీద మంచి పట్టు ఉండటంతో అనర్గళంగా మాట్లాడేవాడు. ప్రసంగ అంశంపై ముందే సిద్ధమై వచ్చేవాడు కాబట్టి ఎక్కడా బోర్ కొట్టించకుండా, మధ్య మధ్య చలోక్తులతో ఆసక్తికరంగా మాట్లాడేవాడు. అప్పటికే ఆయన హిందీ మీద మంచి పట్టు సంపాదించాడు. ఆయన హిందీ మాట్లాడినా, రాసినా నేటివిటీ ఉండేది. దాంతో చాలా మంది ఆయన హిందీ ప్రాంతం వాడనే అనుకునేవారు.

పట్టణ ఉద్యమంపై విరుచుకుపడిన రాజ్యం:
2008లో కామ్రేడ్ రాజు దాద పార్టీ పని మీద అడవిలోకి వెళ్లగా బయట కామ్రేడ్ శాంతిప్రియ (మాలతి) వుండే డెన్ మీద పోలీసులు దాడి చేశారు. ఆమెను అరెస్టు చేశారు. హైస్కూలు చదువుతున్న ఇద్దరు పిల్లలు హఠాత్తుగా దిక్కులేని వారయ్యారు. వాస్తవానికి ఆయన నిర్వహించే పార్టీ పనుల వివరాలు ఆయన సహచరికి గానీ, పిల్లలకు గానీ చాలా వరకు తెలియవు. అయినప్పటికీ, ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, డబ్బు, పార్టీ సాహిత్యం దొరికాయనే తప్పుడు ఆరోపణలతో కామ్రేడ్ మాలతిపై అనేక కేసులు బనాయించారు. ఎమ్మెల్యేలకు సీడీ పంపించిందన్న కేసు కూడా మోపారు. దాంతో ఆమె దాదాపు పదకొండేళ్ల సుదీర్ఘ జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చింది. భర్త అడవిలో, తల్లితండ్రులిద్దరికీ దూరమైన పిల్లలు హైదరాబాద్ నగరంలో ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో జైల్లో ఆమె తీవ్రమైన మనోవేదనకు గురైంది. ఇలాంటి కఠిన పరిస్థితులను, ఇబ్బందులను భరిస్తూనే కామ్రేడ్ రాజు దాద ఎంతో పట్టుదలతో అప్పటి నుంచి ఇక అడవిలోనే ఉంటూ గెరిల్లా బలగాలకు, పార్టీ శ్రేణులకు ప్రత్యక్ష నేతృత్వం వహించసాగాడు. అలా తూర్పు బస్తర్లో ‘రాజు దాద’ పేరుతో ఆయన గెరిల్లా జీవితం మొదలైంది. దండకారణ్యం అంతటా ఆయన అదే పేరుతో ప్రజల్లో, కేడర్లలో అభిమానపాత్రుడైన నేతగా నిలిచాడు. తర్వాతి కాలంలో కామ్రేడ్ రాజుదాద బయటకు వెళ్లి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చాలా సార్లు అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. రాయ్పుర్ అరెస్టుల తర్వాత వరుసగా, సీసీ యంత్రాంగం దెబ్బతినడంతో పాటు కొందరు సీసీ కామ్రేడ్స్ బూటకపు ఎన్కౌంటర్లలో అమరులు కావడంతో ఇక ఆయన అడవిలోనే ఉండిపోవాల్సివచ్చింది.

అడవిలో ఆదర్శ పాఠశాలల్ని నడిపిన ఉపాధ్యాయుడు:
కామ్రేడ్ రాజుదాద మంచి టీచర్. విప్లవోద్యమంలోకి రావడానికి ముందే ఆయన టీచర్ ట్రెయినింగ్ చేసి, కొంత కాలం ప్రభుత్వ స్కూల్స్లో టీచరుగా పని చేసి వచ్చాడు కాబట్టి ఆయనకు బోధనా పద్ధతులపైన శాస్త్రీయమైన అవగాహన ఉండేది. పట్టణాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ పనుల రీత్యా ఎప్పుడు అడవికి వచ్చినా గెరిల్లాలతో విజ్ఞానదాయకమైన చర్చలు చేసేవాడు. గెరిల్లా ప్రాంతాల్లో వివిధ స్థాయిల కేడర్ల కోసం నిర్వహించే రాజకీయ తరగతుల్లో ఆయన టీచరుగా హాజరయ్యేవాడు. ఆయన చెప్పే మార్క్సిస్ట్ పాఠ్యాంశాలను కేడర్లు చాలా ఆసక్తిగా వినేవారు. చదువురాని లేదా కేవలం 1-2 తరగతులు మాత్రమే చదువుకొని విప్లవోద్యమంలో చేరిన గెరిల్లాలకు పద్ధతి ప్రకారం అకాడమిక్ విద్యను అందించాలన్న లక్ష్యంతో 2001లో మాస్ (మొబైల్ అకడమిక్ స్కూల్) ఏర్పాటైంది. ఆ తర్వాత కేడర్లకు రాజకీయ శిక్షణ ఇచ్చేందుకు మోపోస్ (మొబైల్ పొలిటికల్ స్కూల్) ఏర్పాటైంది. ఈ రెండింటిని ప్రారంభించడానికి కామ్రేడ్ రాజు దాద ఎంతో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. వీటిని నడిపించడానికి పార్టీ నియమించిన టీచర్లకు కామ్రేడ్ రాజు దాద ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. మాస్ పుస్తకాల తయారీలో రచయితలకు అవసరమైన సలహాలు ఇచ్చాడు. అదే విధంగా, దండకారణ్యంలో 2007లో ఏర్పడిన ఈడీసీ (విద్యా విభాగ కమిటీ)ని కూడా ఆయన సన్నిహితంగా గైడ్ చేశాడు. వారు ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల వరకు పాఠ్యపుస్తకాలను తయారుచేయడానికి కావల్సిన గైడెన్స్ అందించాడు.

చిన్న వయసులోనే పార్టీలో చేరుతున్న వారికి, అలాగే అప్పటికే పార్టీలో పని చేస్తున్న సీనియర్ కేడర్ల పిల్లలు ఉద్యమంలో చేరడానికి ముందుకు వస్తున్న క్రమంలో అలాంటి వారికి చదువుతో పాటు కమ్యూనిస్టు విలువలు, సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ అందించాలనే ఉద్దేశంతో 2009లో బీసీటీఎస్ (బేసిక్ కమ్యూనిస్ట్ ట్రెయినింగ్ స్కూల్) ఏర్పాటైంది. కామ్రేడ్ రాజు దాద చొరవతో ఏర్పడ్డ ఈ స్కూలును ఆయన తన ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో, తూర్పు బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేశాడు. ఏటా 6 నెలల పాటు నడిచిన ఈ స్కూలులో అకడమిక్ పాఠ్యాంశాలతో పాటు, పార్టీ మౌలిక డాక్యుమెంట్లపై పాఠాలు చెప్పేవారు. అంతేకాకుండా, వారికి కంప్యూటర్ శిక్షణ, మోటార్ సైకిల్ నడిపించడం వంటి ప్రత్యేక స్కిల్స్ కూడా నేర్పించేవారు. విప్లవోద్యమంలో భిన్న ఆసక్తులు, నైపుణ్యాలు గల కామ్రేడ్స్ను గెస్ట్ టీచర్లుగా పిలిచి, వారితో కూడా ట్రెయినింగ్ ఇప్పించేవారు. బీసీటీఎస్ విద్యార్థులు తమ శిక్షణలో భాగంగా కొద్ది రోజులు గ్రామాలకు వెళ్లి, ప్రజలతో కలిసి, వ్యవసాయ పనుల్లో పాల్గొని, శ్రమ దానం కూడా చేసేవారు. ఆ తరువాతి కాలంలో పెరిగిన పోలీసు దాడుల మధ్య ఈ స్కూలును 6 నెలలు నడిపించడం సాధ్యం కాదని కోర్సును కుదించి నాలుగు నెలలు (ప్రధానంగా వర్షాకాలం) నిర్వహించడం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కగార్ దాడులు మొదలయ్యేంత వరకూ పరిమితులతోనైనా ఈ స్కూలును నడిపించేలా చేయడంలో కామ్రేడ్ రాజు దాద చేసిన కృషే ప్రధానమైంది.

బీసీటీఎస్లో చదివిన యువ గెరిల్లాలు ఆ తర్వాతి కాలంలో పార్టీకి అవసరమైన ఎన్నో ప్రత్యేక పనులు నిర్వహించారు. ప్రత్యేకించి నాయకత్వానికి అవసరమైన కొరియరింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్ వంటి పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. శత్రు దాడుల ఉధృతి వల్ల వారిలో కొందరు విప్లవోద్యమం నుంచి వెనక్కి వెళ్లిపోయినా, తమకు కమ్యూనిస్టు విలువల్ని అలవర్చడం కోసం కామ్రేడ్ రాజు దాద చేసిన కృషిని వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు.

శత్రు దాడుల మధ్యే ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రజా నేత:
కామ్రేడ్ రాజు దాద పట్టణ జీవితం నుంచి అడవిలోకి వచ్చిన కొద్ది కాలానికే, అంటే 2009 ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో మరో సైనిక అణచివేత క్యాంపెయిన్ మొదలైంది. ఈలోపు ఆయన చాలా త్వరగానే గెరిల్లా జీవితానికి అలవాటుపడ్డాడు. ఫీల్డులో శత్రు దాడుల్ని సైనికంగా ఎదుర్కోవడంలో ఆయన గెరిల్లాలకు మార్గదర్శకత్వం వహించాడు. అదే సమయంలో, ఆ దాడిని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం వివిధ ప్రజాస్వామిక శక్తులను కూడగట్టడానికి ఆయన ప్రత్యేక కృషి చేశాడు. ఆ కాలంలో దండకారణ్యంలో జరిగిన అనేక బూటకపు ఎన్కౌంటర్లను బట్టబయలు చేయడానికి ఆయన వెంట వెంట ఫీల్డ్ నుంచి రిపోర్టులు తీసుకొని హక్కుల సంస్థలకు, విప్లవోద్యమ మద్దతుదారులకు చేరవేశాడు. దాదాపు పదేళ్ల పాటు ఈస్ట్ బస్తర్కు ఇంచార్జిగా పని చేసిన ఆయన ఆ డివిజన్లో రహస్య పార్టీ నిర్మాణాలను, ప్రజాసంఘాలను, ప్రజా మిలీషియాను, గ్రామ, ఏరియా జనతన సర్కార్లను గైడ్ చేశాడు. తూర్పు బస్తర్లో విప్లవోద్యమానికి బలమైన కేంద్రాలుగా ఉన్న ఇన్నర్, మర్సుకోలా, టేడూం, తొండవేడ, కొంగెర, కిల్లెం, వెడ్మా, ఇర్పనార్, తూస్వాల్, కడియమెట్ట, అందెవేడ లాంటి గ్రామాల ప్రజలతో, ప్రజాసంఘాల కార్యకర్తలతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి.

విప్లవోద్యమం గురించి ప్రపంచానికి పరిచయం చేయడంలో..:
భారత విప్లవోద్యమం గురించి, ప్రత్యేకించి దండకారణ్యంలో పురోగమిస్తున్న ఉద్యమం గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్వీడన్కు చెందిన మార్క్సిస్టు మేధావి, రచయిత యాన్ మిర్దాల్ 2010 ప్రారంభంలో తూర్పు బస్తర్ ప్రాంతానికి వచ్చారు. అక్కడ కామ్రేడ్ రాజు దాదతో కొద్ది రోజుల పాటు గడిపిన ఆయన అక్కడి నుంచి బయలుదేరి, కేంద్ర నాయకత్వాన్ని కలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన ‘భారతదేశంపై అరుణతార’ (రెడ్ స్టార్ ఓవర్ ఇండియా) పేరుతో రాసిన పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణుల్లో పేరు గాంచిందన్నది తెలిసిందే. ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్త, ఈపీడబ్ల్యూ సంపాదక మండలి సభ్యుడు, రచయిత గౌతం నవలఖా కూడా దండకారణ్యంలో పర్యటించారు. ఆయన కూడ తన అనుభవాలను, ఆలోచనలను ఒక పుస్తకంగా వెలువరించారు. ప్రత్యేకించి గ్రీన్ హంట్ లాంటి అమానుష దాడులు కొనసాగుతున్న కాలంలో వీరి పర్యటనలు జరగడం, ఆ తర్వాత వీరు ప్రచురించిన పుస్తకాలు, వ్యాసాల ద్వారా అక్కడ జరుగుతున్నదేంటో ప్రపంచానికి అర్థమైంది. వీరిద్దరి పర్యటనలు పూర్తి రక్షణలో, సజావుగా జరగడంలో కామ్రేడ్ రాజు దాద కృషి ఉంది. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం యాన్ మిర్దాల్ పర్యటనను నిషేధించింది.

అదే ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ రచయిత, ఉద్యమకారిణి అరుంధతి రాయ్ దండకారణ్యంలో పర్యటించారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆమె పర్యటనలో కామ్రేడ్ రాజు దాద ఆమె వెంటే ఉన్నారు. ఈ కాలంలో ఆమె అనేక స్థాయిల కామ్రేడ్స్ను, ప్రజలను కలిశారు. వారి నుంచి ఉద్యమం గురించి, ఉద్యమంపై జరుగుతున్న అణచివేత గురించి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 10న అదే ప్రాంతంలో జరిగిన భూంకాల్ వేడుకలలో కూడా ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె బస్తర్ ఆదివాసులు సాగిస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ అనే సుదీర్ఘ వ్యాసం రాశారు. అందులో చాలా చోట్ల కామ్రేడ్ రాజు దాద ప్రస్తావన ఉంటుంది. ఆ రకంగా, దండకారణ్య విప్లవోద్యమ అధ్యయనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రచయితలు, కళాకారులు, పాత్రికేయులు, విమర్శకులను ఆహ్వానించి, వారికి ఉద్యమ లోతుపాతుల్ని వివరించడం ద్వారా వారికి సరైన అవగాహన కలిగేలా చేయడంలో కామ్రేడ్ రాజు దాద కీలక పాత్ర పోషించాడు. అలా ఉద్యమ ప్రాంతాల్లో ప్రజలు చేస్తున్న పోరాటాలు, ప్రభుత్వాలు సాగిస్తున్న హింస, అణచివేతల గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా.. కేంద్రకమిటీ సభ్యుడిగా..:
కామ్రేడ్ రాజుదాద 2003లో డీకే ఎస్జెడ్సీ సభ్యుడిగా ఎన్నికైనపుడు కానీ, ఆ తర్వాత 2006లో జరిగిన డీకే పార్టీ 4వ మహాసభలో కానీ ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయాడు. ఇతర అత్యవసర పనుల కారణంగా ఆయనకు వీలు కాలేదు. కానీ, 2011 నుంచి 2020 వరకు జరిగిన మూడు ప్లీనాలలో కామ్రేడ్ రాజుదాద ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, వాటి నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. ప్లీనాల ముందు ప్రవేశపెట్టే రాజకీయ, నిర్మాణ సమీక్షలను రూపొందించడంలో, సభలో ప్రతినిధులు లేవనెత్తే ప్రశ్నలకు, విమర్శలకు జవాబులివ్వడంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించాడు. 2019లో డీకే ఎస్జెడ్సీ కార్యదర్శి కామేడ్ రామన్న (రావుల శ్రీనివాస్) అమరుడు కాగా, 2020లో జరిగిన పార్టీ ప్లీనంలో కామ్రేడ్ రాజుదాద డీకే ఎస్జెడ్సీ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
దండకారణ్య విప్లవోద్యమం గడ్డు పరిస్థితిలో ఉందని 2011లో జరిగిన ప్లీనం గుర్తించింది. ఆ తర్వాతి కాలంలో పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది. అయితే ఈ ప్రతికూల పరిస్థితిని ఒక సవాల్గా తీసుకొని, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన చివరి వరకూ మేధోపరంగా, శారీరకంగా, రాజకీయంగా సైనికంగా, నిర్మాణపరంగా ఎంతో పట్టుదలగా కృషి చేశాడు. కానీ, శత్రు దాడుల తీవ్రతతో పాటు స్వీయాత్మక లోపాలు, నష్టాల కారణంగా విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజకు లోనైంది. ఆ పరిస్థితి నుంచి విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి, పురోగమింపచేయడానికి తాను చివరి రోజులలో ప్రత్యేక అధ్యయనానికి పూనుకున్నాడు. ఆ కృషి కొనసాగిస్తున్న క్రమంలోనే ఆయన కోవర్టు కుట్ర ఫలితంగా తన చిరకాల సహచరుడు, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ కడారి సత్యానారాయణ రెడ్డి (కోసదాద)తో పాటు శత్రు చేతికి చిక్కి, బూటకపు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు.
పట్టణ ప్రాంతంలో సుదీర్ఘకాలం పని చేసిన కామ్రేడ్ రాజుదాద, అటవీ ప్రాంతంలో కూడా వర్గ పోరాటంలో, గెరిల్లా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా అపారమైన అనుభవం సంపాదించాడు. ఆయన విప్లవ నిబద్ధత, నిజాయితీ, రాజకీయ అధ్యయన స్థాయిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కమిటీ 2020లో కేంద్ర కమిటీలోకి తీసుకుంది. ఆ తర్వాత 2023లో జరిగిన సీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సమావేశంలో ఆయనకు ఉత్తర భారతంలో పార్టీని, ప్రధానంగా పట్టణాలను ఆర్గనైజ్ చేసే బాధ్యత సీసీ అప్పగించింది. కానీ, అనేక పట్టణాలతో సమన్వయం దెబ్బతిన్న పరిస్థితులలో ఆయన చాలా కాలం వరకు ఎటూ వెళ్లలేకపోయాడు. చివరకు, కగార్ సైనిక దాడి మొదలయ్యాక, వేగంగా మారుతున్న పరిస్థితుల మధ్య బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూనే తన బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అంతిమంగా, విప్లవ ప్రతిఘాతకులు పాల్పడ్డ ద్రోహం ఫలితంగా శత్రు చేతికి చిక్కి అమరుడయ్యాడు.

పత్రికల సంపాదకుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా కామ్రేడ్ రాజుదాద:
2014లో దండకారణ్య పార్టీ అధికార పత్రిక ‘ప్రభాత్’ సంపాదక బాధ్యతలు చేపట్టిన కామ్రేడ్ రాజు దాద, దాదాపు దశాబ్ద కాలం పాటు ఆ బాధ్యతలు నిర్వహించాడు. తనతో పాటు సంపాదకవర్గంలో సభ్యురాలిగా ఉన్న కామ్రేడ్ చైతే (2025 మార్చ్ 31న బూటకపు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన గుముడవెల్లి రేణుక)ను ప్రధాన సంపాదకురాలిగా చేయాలనే పథకంతో ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఆమె హిందీ భాష మెరుగుదలకు తోడ్పడ్డాడు. క్రమంగా, కామ్రేడ్ చైతే 2023 నాటికి తానే మొత్తం ‘ప్రభాత్’ పత్రికను తయారుచేసే విధంగా తయారైనప్పటికీ చివరన ఓసారి రాజుదాద కూడా చూస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఆయనకు అందించేది. ఆ రకంగా వారిద్దరూ కలిసి ‘ప్రభాత్’ పత్రికను చాలా శక్తిమంతమైన రాజకీయ ఆయుధంగా, విప్లవ ప్రచార సాధనంగా ప్రజలలోకి తీసుకెళ్లడానికి కృషి చేశారు.

కామ్రేడ్ రాజుదాద ఎస్జెడ్సీ కార్యదర్శిగా ఎన్నికయ్యాక పార్టీ సైద్దాంతిక పత్రిక ‘వియ్యుక్క’ సంపాదక బాధ్యతలు చేపట్టి దానిని రెగ్యులర్గా తీసుకురావడానికి కృషి చేశాడు. తోటి కమిటీ సభ్యుల నుంచి, సీసీ కామ్రేడ్స్ నుంచి ఆ పత్రికకు వ్యాసాలు రాయించి దాన్ని కేడర్లలోకి తీసుకువెళ్లడానికి పాటుపడ్డాడు. అలాగే, డీకే ఎస్జెడ్సీ వెలువరించే సైనిక పత్రిక ‘పడియోర పొల్లో’ను రెగ్యులర్గా తీసుకువచ్చేలా ఆ పత్రికా నిర్వాహకులను ప్రోత్సహించే వాడు. అయినప్పటికీ, పత్రికలను క్రమం తప్పకుండా తేవడంతో కమిటీ కార్యదర్శిగా తన నుంచి జాప్యం జరుగుతుందని ఎలాంటి మొహమాటం లేకుండా కేడర్ల ముందు ఆత్మ విమర్శను ప్రవేశపెట్టేవాడు.

దాంతో పాటు 2014 నుంచి కామ్రేడ్ రాజు దాద దాదాపు దశాబ్ద కాలం పాటు మళ్లీ ‘గుడ్సా ఉసెండి’ పేరుతో, ఆ తర్వాత ‘వికల్ప్’ పేరుతో దండకారణ్య స్పెషల్ జోన్ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించాడు. ఛత్తీస్గఢ్ రాజకీయ, సామాజిక పరిణామాలపై ప్రత్యేక అధ్యయనం, పట్టు కలిగి ఉన్న ఆయన.. దేశ, ప్రపంచ పరిణామాలను చాలా నిశితంగా అధ్యయనం చేస్తుండేవాడు. దాంతో అధికార ప్రతినిధి బాధ్యతలు ఆయన సమర్థవంతంగా నిర్వహించగలిగాడు. విప్లవోద్యమంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించడం, విప్లవ దినాల సందర్భంగా పార్టీ సందేశాలు అందించడం, భూంకాల్ దినం సందర్భంగా జనతన సర్కార్లకు సందేశాలు ఇవ్వడం మొదలైన బాధ్యతలు నిర్వహించాడు. కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన ఈ బాధ్యతలను కొనసాగించాడు. బస్తర్లో మావోయిస్టులతో పాత్రికేయులకు ప్రమాదం వుందంటూ రాజ్యం సాగించిన ప్రచారంపై 2016లో ఆయన దండకారణ్య అధికార ప్రతినిధిగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూతో పార్టీ వైఖరేంటో ప్రజల్లోకి వెళ్లింది. అలాగే, కొందరు పార్టీ కార్యకర్తలు తొందరపాటుతో సాయిరెడ్డి అనే పాత్రికేయుడిని చంపేసినప్పుడు అది తప్పని ఒప్పుకుంటూ, పార్టీ నుంచి జరిగిన లోపాన్ని ఆయన పత్రికా ప్రకటన ద్వారా ప్రపంచం ముందుంచాడు. వివిధ సందర్భాలలో తొందరపాటుతో జరిగిన కొన్ని గెరిల్లా చర్యల మూలంగా నష్టపోయిన బాధిత కుటుంబాలు విప్లవోద్యమాన్ని అర్థం చేసుకోవాలనీ, పార్టీ వైపు నుంచి జరుగుతున్న లోపాలు ఉద్దేశపూరితమైనవి కాదని, ఒక అనివార్య పరిస్థితిలో ఇలాంటివి తలెత్తుతున్నాయని బహిరంగంగానే ప్రజల ముందు ఒప్పుకున్నాడు.

కామ్రేడ్ రాజుదాద విడుదల చేసే ప్రతి ప్రకటనలోనూ వర్గ దృకృథం చాలా స్పష్టంగా వుండేది. ఇది పార్టీ అధికార ప్రతినిధులకు చాలా అవసరమైనది. అలాగే, దేశంలో ఖాకీ యూనిఫాం ధరించిన లక్షలాది మంది ఈ దేశ శ్రామికవర్గంలో భాగమేనని, రైతుకూలీల బిడ్డలేననే, వర్గరీత్యా వాళ్లంతా అన్నాదమ్ముల్లాంటి వాళ్లేననే అవగాహనతో అనేక సందర్భాలలో వారిని ఉద్దేశించి పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేశాడు. వారు ప్రజా ఉద్యమానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదంటూ అనేక సార్లు విజ్ఞప్తులు చేశాడు. ఈ వైఖరి దండకారణ్యంలో మిత్ర శక్తులను పెంచుకోవడానికి ఎంతగానో తోడ్పడింది.

2023లో కామ్రేడ్ కటకం సుదర్శన్ అమరుడయ్యాక, కామ్రేడ్ రాజుదాద కొద్దికాలం పాటు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ‘అభయ్’గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. 2024 ఆగస్టులో ఆయన ఉత్తర భారతంలో విప్లవోద్యమ బాధ్యతలపై వెళ్లాలని నిర్ణయం కావడంతో ఆయన ‘అభయ్’ బాధ్యతల నుంచి రిలీవయ్యాడు. అదే సమయంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతల నుంచి కూడా ఆయన రిలీవ్ కావడంతో కామ్రేడ్ మాడ్వి హిడ్మ ఆ బాధ్యతలు చేపట్టాడు. కామ్రేడ్ రాజు దాద అధికార ప్రతినిధిగా కొనసాగినంత కాలం వీలైన మేరకు అన్ని రాజకీయ సమస్యలపై పార్టీ వైఖరిని ప్రజలలోకి తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాడు.

కార్పొరేట్ వ్యతిరేక పోరాటాల్లో ముందు నిలిచిన ప్రజా నాయకుడు:
2016లో హైదరాబాద్లో తలపెట్టిన విస్థాపన వ్యతిరేక చర్చాగోష్టికి దండకారణ్యం నుంచి పంపించిన పేపర్ను కామ్రేడ్ రాజుదాద రూపొందించాడు. తూర్పు బస్తర్ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బోధ్ఘాట్ భారీ ప్రాజెక్ట్ను ప్రభుత్వం మళ్లీ ముందుకు తేవడంతో ప్రజలను దానికి వ్యతిరేకంగా సమీకరించడానికి కామ్రేడ్ రాజుదాద ప్రత్యేక కృషి చేశాడు. దాదాపు వంద గ్రామాలను, వేలాది ఎకరాల అడవిని, అటవీ భూములను ముంచెత్తే ఈ ప్రాజెక్టు ప్రజావ్యతిరేకమైందని, ఇది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అని ప్రజలకు అర్థం చేయిస్తూ బుక్లెట్స్, కరపత్రాలు విడుదల చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. మరోవైపు, తులాడిమెట్ట నుంచి ఇనుప ఖనిజాన్ని తవ్వి తీసుకెళ్లడానికి మైనింగ్ కంపెనీలు చేసిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకునేలా తూర్పు బస్తర్ డివిజన్లోని ప్రజలను, పార్టీ, సైనిక యూనిట్లను ఆయన నిరంతరం మోటివేట్ చేశాడు. ప్రజా ప్రతిఘటన ఫలితంగా ఈ ప్రాంతంలో మైనింగ్ కంపెనీల ఆగడాలకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. కానీ 2022 నుంచి రాజ్యం తీవ్రమైన నిర్బంధంతో విరుచుకుపడటంతో, పార్టీ, పీఎల్జీఏ శక్తులు బలహీనపడిపోయాయి. ఆ తర్వాత మైనింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. దాంతో ఇప్పుడు ఆ ప్రాంతం అంతటా పర్యావరణ విధ్వంసం విచ్చలవిడిగా కొనసాగుతోంది.

ఐక్య సంఘటనను బలమైన ఆయుధంగా వాడిన నేత:
2020 చివరలో కడియనార్ గ్రామంలో పోలీసు క్యాంపు ఏర్పాటును స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసు క్యాంపులన్నీ తమ ప్రాంతం నుంచి గనులను తవ్వి ఖనిజ సంపదను దోచుకెళ్లడానికేనని వారు అనుభవపూర్వకంగా గ్రహించారు. కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడడం కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నారంటూ, జల్-జంగల్-జమీన్పై తమదే అధికారం అంటూ చట్టబద్ధ పద్ధతుల్లో, శాంతియుతంగా పోరాడటం ప్రారంభించారు. ప్రభుత్వమే చేసిన పెసా చట్టాన్ని అమలు చేయడం లేదనీ, దాని ప్రకారం గ్రామసభలను ఏర్పాటు చేయడం లేదనీ, వాటిని వెంటనే అమలు చేయాలనీ వేలాది మంది ప్రజలు వారాల తరబడి నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత సిలింగేర్ సహా దండకారణ్యంలోని అనేక ప్రాంతాలలో పెసా అమలు కోసం పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు జరిగాయి. వాటిని సంఘటితం చేస్తూ, బలమైన ఐక్య సంఘటనను ఏర్పాటు చేసే లక్ష్యంతో కామ్రేడ్ రాజుదాద ప్రత్యేక కృషి చేశాడు.

అటవీ హక్కుల సాధన కోసం, ఆదివాసుల మనుగడను కాపాడుకోవడం కోసం దండకారణ్యంలో జరిగిన చట్టబద్ధ పోరాటాలలో సిలింగేర్ ప్రజా పోరాటం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఆ ప్రజా పోరాటాన్ని కామ్రేడ్ రాజుదాద అధ్యయనం చేశాడు. 2021 మే నుంచి 2022 జూన్ వరకు ఆయన దక్షిణ, పశ్చిన బస్తర్ డివిజన్లలో వున్నపుడు అక్కడ పెల్లుబికిన అనేక ప్రజా పోరాటాలను దగ్గరగా పరిశీలించాడు. అలాంటి ఉద్యమాలను మరింత పెంపొందించాలని, ప్రజలను మరింతగా సమీకరించాలని, మావో చెప్పిన మూడు మంత్రదండాల్లో ఒకటైన ఐక్య సంఘటనను బలోపేతం చేయాలని ఆయన పార్టీ కేడర్లకు, ప్రజాసంఘాల బాధ్యులకు అర్థం చేయించాడు.
ఆ వెల్లువ దక్షిణం నుంచి ఉత్తరానికి వ్యాపించింది. వెచ్చఘాట్, సీల్పరస్, కడియమెట్ట, మడోహ్నార్, బెరహవేడ, ఇరక్భట్టి లాంటి చోట్లలో వేలాది మంది ప్రజలు ధర్నా, ప్రదర్శనల్లో భాగమయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లపై గొంతెత్తారు. ఇదొక కొత్త పోరాట రూపం. ప్రజల సామూహిక పోరాట రూపం. ఆదివాసీ ప్రజల సమైక్యతా భావనకు ప్రతీకగా నిలిచిన ఉద్యమం ఇది. ఈ నూతన పోరాటాలలో వేలాది మంది యువత పాల్గొన్నారు.
ఒకప్పుడు తమ తండ్రులు, తాతలు చేసిన పోరాటాన్ని కొనసాగించేందుకు నవతరం, ముఖ్యంగా చదువుకున్న ఆదివాసీ విద్యార్థులు ముందుకు రావడం ఒక గొప్ప పరిణామం. ఈ యువతను విప్లవోద్యమంలో సంఘటితం చేసుకోవాలని రాజుదాద ఎంతో తాపత్రయపడ్డాడు. వారిని రాజకీయంగా గెలుచుకొని విప్లవోన్ముఖులను చేయడంలో వెనుకబడిపోవద్దని పార్టీ శ్రేణులకు సూచించాడు. బస్తర్ను 6వ షెడ్యూల్లో భాగం చేయాలనే డిమాండ్తో ప్రజా పోరాటాన్ని తీవ్రతరం చేయాలన్న నిర్ణయం ప్రకారం కామ్రేడ్ రాజుదాద ఒక డ్రాఫ్ట్ తయారు చేశాడు. మాడ్లో నివసించే మాడియా ఆదివాసులను మోసం చేసేందుకు సామూహిక పట్టాలు ఇస్తామంటూ ప్రభుత్వం ముందుకు వచ్చినపుడు, దానికి కౌంటర్గా మాడ్లో తరతరాలుగా జీవిస్తూ, విశిష్టమైన జీవనశైలిని కలిగి ఉన్న మాడియా సముదాయానికి స్వయం పాలనా అధికారం ఇవ్వాలనే డిమాండ్ను పార్టీ ముందుకు తెచ్చింది. దాని కోసం అవసరమైన డ్రాఫ్ట్ను తయారు చేసేందుకు కామ్రేడ్ రాజుదాద పాటుపడ్డాడు. అయితే, అది పూర్తి కాకముందే ఆయన శత్రు చేతికి చిక్కి అమరుడయ్యాడు.

కగార్ దాడుల మధ్య దృఢంగా నిలబడ్డ యోధుడు:
సూరజ్కుండ్ సైనిక పథకంలో భాగంగా జనవరి 2024న ఆపరేషన్ కగార్ మొదలైంది. ఇది మునుపటి సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్లతో పోలిస్తే అత్యంత క్రూరమైన నిర్మూలనా యుద్ధ వ్యూహం. దీనిని ఖండిస్తూ కామ్రేడ్ రాజుదాద పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో వెంట వెంట పార్టీ వైఖరిని ప్రజలలోకి తీసుకెళ్లాడు. కగార్ దాడిలో భాగంగా, మొట్టమొదట 2024 ఏప్రిల్ 16న ఉత్తర బస్తర్లోని ఆపటోల అడవుల్లో జరిగిన దారుణ హత్యాకాండ జరిగినప్పుడు కామ్రేడ్ రాజుదాద అక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. ఆ దాడిలో 29 మంది కామ్రేడ్స్ ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొందరు ముఖాముఖి పోరాటంలో చనిపోగా, నిరాయుధులుగా ఉన్న అత్యధికులు గాయపడి శత్రువుకు సజీవంగా పట్టుబడ్డారు. వారిని కొంత దూరం వరకూ పట్టుకెళ్లి అందరినీ నిలబెట్టి చట్టవిరుద్ధంగా కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను ఆయన వెంటనే పత్రికా ప్రకటన ద్వారా బయటకు చేరవేశాడు. ఆ తర్వాత జూన్ నెలలో మాడ్లోని కొడ్తమర్క ప్రాంతంలో జరిగిన చుట్టుముట్టి మట్టుబెట్టే దాడిలోంచి కూడా కామ్రేడ్ రాజుదాద పీఎల్జీఏ రక్షణలో త్రుటిలో తప్పుకున్నాడు.

కామ్రేడ్ రాజుదాద చాలా కాలం పాటు మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన పట్టణాల్లో పని చేస్తున్నప్పుడే మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ ఆ ఆపరేషన్ సరిగా జరగకపోవడంతో మోకాళ్ల నొప్పులతో చివరి వరకూ బాధపడ్డాడు. ఎక్కువ దూరం నడవడం ఆయనకు ఇబ్బందిగా ఉండేది. దాంతో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా తోడైంది. పెరిగిన దాడులతో ఈ అనారోగ్య సమస్యలు మరింత ఇబ్బందికరంగా తయారయ్యాయి. దాంతో అనివార్యంగానే, ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
కగార్ దాడులలో పార్టీకి జరుగుతున్న నష్టాలను డీకే ప్రెస్ యూనిట్ ఇంచార్జ్, ఎస్జెడ్సీ సభ్యురాలు కామ్రేడ్ చైతే (రేణుక) ద్వారా వెంట, వెంట రికార్డు చేయించిన రాజుదాద ఆమెతో సవివరమైన పుస్తకాన్ని తయారు చేయించి, ప్రపంచానికి అందించాడు. కామ్రేడ్ రాజుదాద చివరిసారిగా 2024 నవంబర్ 13న దండకారణ్య ప్రెస్ కామ్రేడ్స్ నుంచి వీడ్కోలు తీసుకొని వెళ్తున్నపుడు, ‘నువ్వు ఎట్టి పరిస్టితిలో కన్నీరు పెట్టొద్దు. మనం డీకేలో కలవడం, విడిపోవడం సహజమే. ఈసారి కూడా అలాగే వుండాలి. కన్నీరు పెడితే అది ప్రత్యేకంగా వుండి కేడర్లు ఆలోచిస్తారు. నేను బయటికి వెళ్తున్నానని అనుమానిస్తారు’ అని కామ్రేడ్ చైతేకు ముందే చెప్పాడు. కామ్రేడ్ చైతేలో బడబాగ్నులు బద్దలవుతున్నప్పటికీ ఆమె దాన్ని అక్షరాలా అమలు చేసింది. అదే రాజుదాద చివరి చూపు కావచ్చని ఆమెకు తెలుసు. ఆ తర్వాత మార్చ్ 31న ఆమె శత్రు చేతికి చిక్కి బూటకపు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయింది.
ఆయన లేడు.. కానీ ఆయన ఆశయం మిగిలే ఉంది!

కామ్రేడ్ రాజుదాద చాలా సున్నితమైన మనిషి. ముఖంలోకి చూస్తే గంభీరంగా కనిపించే ఆ మనిషిలో చక్కని హాస్యచతురత ఉండేది. ఎవ్వరితోనైనా నిష్కల్మషంగా మాట్లాడే ఆయనను అందరూ అభిమానించేవారు. వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతున్నవారు.. మహిళలు, పురుషులు.. అన్ని వయసుల వారూ ఆయనతో వాటిని పంచుకునేవారు. ఆయన సరైన గైడెన్స్ ఇస్తాడని, తమ ప్రైవసీని కాపాడుతాడని వాళ్లకు నమ్మకం. నడక, బరువుల మోత, నిద్రలేమి, సరైన తిండి దొరక్కపోవడం, సమయానికి దొరక్కపోవడం, రోజూ స్నానానికి వీలు కాకపోవడం, దాడుల్లో సహచరులను కోల్పోవడం… నిత్యజీవితంలో ఇలాంటి కష్టాలు, సవాళ్లు గెరిల్లా జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. అయితే కామ్రేడ్ రాజుదాద ఎక్కడున్నా ఇలాంటి వాటిని మర్చిపోయేలా చేయగల ఆసక్తికర సన్నివేశాలు కల్పించేవాడు. అప్పటికప్పుడు ఏదో ఒక పాత స్మృతిని కొత్తగా రీక్రియేట్ చేసి వినిపించి నవ్వించేవాడు. అంతేకాదు.. ఆయన ‘మతిమరుపు’ సమస్య కూడా ఎన్నో సార్లు ప్రాక్టికల్ జోక్లకు దారితీసేంది. వాటిని గుర్తు చేసుకొని మరీ గెరిల్లా సభ్యులు నవ్వుకునేవారు.

అయితే.. ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదురైనా, తను పట్టణ ప్రాంతంలో విప్లవోద్యమ కార్యకలాపాల్లో నిమగ్నమైనప్పుడు తనకు ఎన్నో విధాలుగా అండగా, భావోద్వేగపరమైన ఆలంబనగా నిలబడ్డ భార్యాపిల్లలతో దాదాపు 17 ఏళ్ల పాటు సంబంధాలు లేకుండా పోయినా, ఉద్యమం ఎన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా ఆయన తన చివరి ఊపిరి వరకూ విప్లవపంథాకు, విప్లవాశయానికి దృఢంగా కట్టుబడి నిలబడ్డాడు. తానూ, తనతో పాటు తన ప్రియసహచరుడు, కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ కడారి సత్యనారాయణరెడ్డి (కోస దాద) ఇద్దరూ ప్రాణాలతో పట్టుబడి, శత్రువు పెట్టిన చిత్రహింసలను, చూపిన బూటకపు ప్రలోభాలను అన్నింటినీ జయించి ప్రాణత్యాగం చేశారు. నాజీల నిర్బంధంలో చిత్రహింసలు ఎదుర్కొని, 1943లో ఉరికంబం ఎక్కిన చెక్ విప్లవకారుడు జూలియస్ ఫ్యూజిక్ మాటల్లో చెప్పాలంటే “విప్లవకారులకు అంతిమ పరీక్ష జరిగేది శత్రు నిర్బంధంలోనే. శత్రువుపై చేసే పోరాటాల పరీక్షలో చాలా మంది ధైర్యంగానే ఉత్తీర్ణులవుతారు. కానీ ఒక వ్యక్తి ఆత్మబలానికి అసలైన పరీక్ష జరిగేది శత్రు నిర్బంధంలోనే.” అటువంటి అంతిమ పరీక్షలో కామ్రేడ్ ఖాత రామచంద్రారెడ్డి (రాజు దాద), కామ్రేడ్ కడారి సత్యనారాయణరెడ్డి (కోస దాద) ఇద్దరూ విజేతలుగా నిలిచారు.

కుటుంబ సభ్యుల న్యాయపోరాటం:
2025 సెప్టెంబర్ 22న కామ్రేడ్ రాజుదాదను హత్యచేయడంతోనే ఆయన పోరాటం ఆగిపోలేదు. ఒక విప్లవకారుడిగానే కాకుండా న్యాయవాదిగా కూడా పీడిత ప్రజలకు న్యాయం దక్కాలంటూ పోరాడిన ఆయన స్ఫూర్తిని నిలబెడుతూ, ఆయన శవానికి న్యాయం జరగాలంటూ ఆయన కుటుంబం న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఆయన మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులకు ఈమెయిల్ పంపించారు. తాము హైదరాబాద్ నుంచి బయలుదేరి నారాయణ్పుర్ చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి శవాన్ని భద్రపర్చాలని, పరీక్ష (ఇంక్వెస్ట్), పోస్ట్మార్టం తాము అక్కడికి చేరుకున్న తర్వాతే చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు దానికి ఎలాంటి జవాబూ ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు నారాయణ్పుర్ చేరుకోవడానికి ముందే పోలీసులు చట్టవిరుద్ధంగా, తూతూమంత్రంగా పోస్ట్మార్టం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎస్పీ, జిల్లా కలెక్టర్లతో చాలా సేపు వాదనలు చేసిన తర్వాతే, రాత్రి చీకట్లో కేవలం ఐదు నిమిషాల పాటే, మృతదేహంలో ఒక భాగాన్ని మాత్రమే చూడటానికి వారికి అనుమతినిచ్చారు. ఆ భాగంపై కనిపించిన గాయాల గుర్తుల ఆధారంగా, ఇది బూటకపు ఎన్కౌంటర్ అనే అనుమానాలు తమకు ఉన్నాయని, శవానికి రీపోస్ట్మార్టం జరిపించాలని, ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్ జరిపించాలంటూ సెప్టెంబర్ 24న ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు దీనిపై త్వరగా విచారణ జరిపేందుకు నిరాకరించడంతో కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు… హైకోర్టు దీనిపై తీర్పు ఇచ్చేంత వరకు శవాన్ని భద్రపర్చాలని, దీన్ని త్వరగా విచారించాలని హైకోర్టును ఆదేశించింది. అయితే, దీనిపై న్యాయవిచారణ జరిపించాలనే విజ్ఞప్తిని మాత్రం సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. ఈ ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 1న నారాయణ్పుర్ జిల్లా యంత్రాంగం కుటుంబ సభ్యుల సమక్షంలో కామ్రేడ్ రాజు దాద మృతదేహాన్ని జగ్దల్పుర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించింది.

ఆ తర్వాత అక్టోబర్ 14న పిటిషన్ను విచారణకు చేపట్టిన బిలాస్పుర్ హైకోర్ట్.. దాన్ని తోసిపుచ్చింది. దీంతో పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుందని, ఇంకా రకరకాల పేలవమైన కారణాలు చూపిస్తూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని తిరస్కరించింది. కోర్టు ఆదేశాల తర్వాత శవాన్ని తీసుకెళ్లాలంటూ పోలీసులు, ప్రభుత్వ అధికారులు కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేశారు. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చెప్పినా వినకుండా, ‘మీరు శవాన్ని తీసుకెళ్లకపోతే, మేమే దహనం చేస్తాం’ అంటూ ఒత్తిడి చేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో కామ్రేడ్ రాజు దాద మృతదేహాన్ని అక్టోబర్ 17న కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామం తీగలకుంటపల్లెకు తరలించారు. అక్టోబర్ 18న, అంటే మరణం తర్వాత సరిగ్గా 26 రోజులకు జరిగిన ఆయన అంత్యక్రియల్లో వేలాది మంది ప్రజలు, విప్లవాభిమానులు హాజరయ్యారు. విప్లవ నినాదాల మధ్య ఆయన మృతదేహాన్ని వారి పొలంలో ఖననం చేశారు. అప్పటికే బాగా కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని చూసి చలించిపోయిన ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పోలీసులు పాల్పడ్డ క్రూరహత్యను, ప్రభుత్వ యంత్రాంగం అనుసరించిన ప్రజావ్యతిరేక చర్యలను, న్యాయవవస్థ వ్యవహరించిన అన్యాయమైన వైఖరిని ఎండగట్టారు. ఖండించారు. అలా ఖండించిన వారిలో కొందరిని ప్రభుత్వం తప్పుడు కేసులతో, జైలుశిక్షలతో భయపెడుతోంది. ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం జాతీయ దర్యఫ్తు సంస్థ (ఎన్ఐఎ) కామ్రేడ్ రాజు దాదా అంతిమ యాత్రలో పాల్గొన్న దాదాపు 230 మంది గ్రామస్తులు, మిత్రులు, పాత సహచరులు, కవులు, టీచర్లు, సానుభూతిపరులు, రాజకీయ పార్టి నాయకులు నుండి కూరగాయలు అమ్మే సాధారణ ప్రజలకు కూడా వారి ముందర హాజరు కావాలని నోటిసులు పంపించింది. ఈ రకంగా అంతిమ యాత్రలో పాల్గొనడాన్ని కూడా దుర్మార్గంగా ఒక నేరంగా రాజ్యం చిత్రికరిస్తున్నది.

మరోవైపు.. పోస్ట్మార్టమ్ రిపోర్టు, వీడియో తదితర సాక్ష్యాలను బట్టి ఆయనను సజీవంగా పట్టుకొని చిత్రహింసలు పెట్టి ‘ఎన్కౌంటర్’ పేరుతో హత్య చేశారనే అనుమానాలు మరింత బలపడ్డ నేపథ్యంలో, హైకోర్టు తీర్పులోని లోపాలను సవాల్ చేస్తూ అక్టోబర్ 24న సుప్రీంకోర్టులో కుటుంబసభ్యులు అపీల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇది రాసేనాటికి సుప్రీంకోర్టు దాన్ని విచారణకు చేపట్టలేదు.

(కామ్రేడ్ ఖాత రామచంద్రారెడ్డితో వేర్వేరు కాలాల్లో కలిసి పని చేసిన వేర్వేరు కామ్రేడ్స్ మాకు అందించిన సమాచారం, పార్టీ కేంద్రకమిటీ చేసిన అధికారిక ప్రకటనలతో పాటు మా కుటుంబానికి, బంధుమిత్రులకు తెలిసిన ఇతర వాస్తవాల ఆధారంగా 2026 మర్చి 22న రాసినది.)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad