Menu

సికాస సమ్మన్న~ దెబ్బకొకని కూల్చినావు తూర్పుదిక్కు పొడిచినావు

anadmin 1 year ago 0 569

ఈ రోజుకు సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి కామ్రేడ్ సమ్మిరెడ్డి, అలియాస్ రమాకాంత్ ఆయన అమరడయ్యి 28 ఏళ్ళయ్యింది. ఆయన గురించి తన ఙాపకాలను రాశాడు రచయిత నరేష్కుమార్ సూఫీ

1995 లో అప్పటి నా దోస్తుగాళ్లకు ఎందరికి గుర్తున్నదో గానీ మా బడికి పోయ్యే తొవ్వలో ఉన్న ఎల్లారెడ్డి పటేలు ఇంటి గోడల మీద ఎర్రటి జాజుతో కలిపి రాసిన అక్షరాలు #సికాస వర్థిల్లాలి (సింగరేణి కార్మిక సమాఖ్య) అనే అక్షరాలు మెరుస్తూ కనిపిస్తుండే. ఊళ్ళెనే మమతా బడి(మమతా హై స్కూల్) అనే ప్రైవేట్ స్కూల్ ఉన్నా మా నాన్న (విధ్యా వలంటీర్ గా)పని చేస్తున్న చందనాపూర్ గవర్నమెంట్ స్కూల్లనే చేరిన. 1996 లో ఆరో తరగతి లో చేరాక నడిచి పోయోస్తుంటిమి. ఆటైంలో నే విన్న కామ్రేడ్ రమాకాంత్ అనే పేరు, సింగరేణి సమ్మన్నను పోలీసులు సంపేషిన్లు అన్న మాటతోనే ఆపేరు పరిచయం. మళ్ళా కొన్నాళ్ళు #జమాల్కాకహోటల్ కాడ కూడా అదే చర్చ. ఆ తర్వాత మా వూరితో పాటు స్కూల్ దారిలో కూడా #పెద్దంపేట, #సింగిరెడ్డి పల్లెలో చానా గోడల మీద అదే రంగు అలాంటివే అక్షరాలు… చక్కగా తీర్చి దిద్దినట్టు కాకుండా ఆదరా బాదరా రాసి పోయినట్టు #కామ్రేడ్రమాకాంత్అమర్రహే! అన్న అక్షరాలు కూడా కనిపించేవి.
నాన్న, కుమ్మరోళ్ళ మల్లయ్య మామా, బొదిలీ ప్రతాప్ సింగ్ తాత మాటలల్ల సింగరేణి కార్మికుల కోసం కొట్లాడిన మనిషిని పోలీసులు చంపేసిన్ళు అని అర్థమయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి శ్రీపాదరావు (మాజీ స్పీకర్) మరణం సమయంలో జనాల మాటల్లో మాటగా.. పాతవిషయాలు తలుసుకున్నప్పుడు. ఇంకోసారి సికాస పేరు, కామ్రేడ్ రమాకాంత్ పేరూ విన్న. అతను ఒక “తీవ్రవాది అనీ, ఇలాంటి నక్సలైట్ల వల్ల దేశం నాశనం అయితదనీ చెప్పిండు మానాన్న. (ఆరెస్సెస్ మనిషి కదా) అయినా ఆ అక్షరాల మీద ప్రేమపోలేదు. ఎల్లయ్య సేట్ ఇంటికి ఇటుపక్కన ఉన్న ఆయన పేరు గుర్తులేదు (ఆయన కొడుకును మాత్రం మేషన్ తిరుపతన్న అని పిల్శెటోల్లం, అక్కడ ఇప్పుడు మాట్ల దుర్గయ్య మామ ఇల్లు ఉన్నట్టుంది) ఆ ఇంటిమీద ఉన్న అవే అక్షరాలు సికాస వర్థిల్లాలి, కా.సమ్మిరెడ్డి అమర్ రహే అన్న అక్షరాలు మాత్రం ఎందుకో నచ్చుతనే ఉండేవి. పోంగా… రాంగా… ఆ అక్షరాలని చదవటం ఒక అలవాటైపోయింది. 10థ్ క్లాస్ పరిక్షలు దగ్గర పడుతుంటే నైట్ క్లాసులు మొదలైనయ్…
సాయంత్రం 11ఏ (కోల్ మైన్) స్టాప్ కాడ ఇసుక లారీలు ఎక్కి స్కూల్ కి పోయేటోళ్ళం… బడి పక్కనుంచే కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎక్కించుకునేటోళ్ళు. అట్లనే నేనూ, అప్పారావు గాడూ (వైజాగ్ నుంచి మా ఊరికి వలస వచ్చిన కుటుంబం) ఇద్దరం ఇసుక లారీ ఎక్కినం. డ్రైవర్తో పాటూ కూసున్న ఇంకో అన్న చెప్తున్నడు. ‘ఆయినే లేకుంటే కథ వేరే ఉంటుండే. మనోళ్ళకు ఇంత మర్లవడుడు వస్తుండేనా”. అనుకుంటా చెప్తున్నడు డ్రైవర్ తోపాటు మేమూ ఇంటున్నం.
“ఒక్కలు కాదు ఇద్దరు కాదు 500 మంది పోలీసులు ఇంటిసుట్టు జేరిండ్లు. లోపట ఉన్న ఒక్క మనిషే అన్ని దిక్కులనుంచీ కాలుస్తున్నడు. దాంతోని లోపట ఎందరున్నరో అని పోలీసుల పర్షాన్.. అమ్మతోడు! ఒక్కొక్కని *ద్ద వణికింది ఇగ. లోపట ఉన్న ఒక్కడే అయిదు వందల మంది… ఏందీ..! అయిదువందల మందిని ఆగమాగం ఉరికిచ్చి ఉచ్చవోపిచ్చిండు… చెప్పుకుంట సిగిరేట్ ముట్టించిండు (సిగరెట్ లైటర్ చూడటం సినిమాల్లో కాక డైరెక్ట్ గా అదే మొదటిసారి) “తర్వాత ఏమైంది?” ఆపుకోలేక అడిగిన. “ఏం తమ్మీ ఈళ్ళంటే ఆంద్రోళ్ళు ఈళ్ళకు తెల్వది ఇంత ఇన్నంక నీగ్గూడ అర్థం కాలేదా? ఏం సదువుతున్నరు సదువులు” (ఆ టైంలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో మొరం తీయటానికి, సింగరేణిలోకి ఇసుక తేవటానికి చాలా మంది కాంట్రాక్టర్లూ, డ్రైవర్లూ ఇట్లా చానా మంది ఆంధ్రా ప్రాంతాలనుంచి వచ్చారు. ఇటు నా పక్కన ఉన్న అప్పారవు వాల్ల ఫ్యామిలీ కూడా అంతే అలా వచ్చి మాలో కలిసిపోయిన్లు. ఇప్పటికీ ఆంధ్రా తెలంగాణా అంటే మా మధ్యల గుర్తురాదు, ఆ డ్రైవర్ కూడా అలా వచ్చిన రాయల సీమ మనిషి అని అర్థమైంది)
మళ్లీ చెప్పుడు మొదలువెట్టిండు “తర్వాత ఏముంటది…. కొన్ని గంటలకు లొపట ఉన్న వాళ్ళ తూటాలు అయిపోయినయ్ అనీ, ఎక్కువమంది లేరనీ అర్థమయ్యింది. అంతే డాబామీదికి ఎక్కిన పోలీసులు పొక్కవొడిషి (రంద్రం చేసి) లోపలికి డీజిల్ కుమ్మరిచ్చిన్లు లీటర్ల కొద్దీ డీజిల్ పోషి ఆ ఇంటికి అగ్గి వెట్టిన్లు.. లొపట మనిషి కాలుతున్నా ఏడ్సుకుంట ఒర్రలే.. విప్లవం…అదేందో ఉంటది కదా ఆ…విప్లవం వర్థిల్లాలి అని ఒర్రిండట” ఇగ బయిట జనం సూడాలే ఆ చంద్రబాబుగాన్ని ఒగతిట్లు కాదూ, ఏడ్సుడు గాదూ. పోలీసుల మీదికి మర్లవడ్డరు గనీ ఇప్పుడున్నంత దైర్నం అప్పుడేడ ఉండే… లేకుంటే అక్కన్నె పోలీసులందర్ని ఏశి పడేద్దురు.” చెప్తూండగానే లారీ సింగిరెడ్డి పల్లె దాటి మాబడి వెనుక ఆగింది. వాటి దారి అక్కడినుంచీ ముస్త్యాల వైపు గంగ ఉష్కె (మా దగ్గర గోదావరిని కూడ గంగ అనే అంటం)తేవటానికి.
దిగేటప్పుడు అడిగిన “అన్నా ఆయిన పేరేంది?”
“ఎవలపేరు?”
“ఆ సచ్చిపోయినాయిన పేరు?”
“కామ్రేడ్ రమాకాంత్, సమ్మిరెడ్డన్న అనేటోళ్లు” చెప్పాడు…
ఒక్కసారి మళ్ళా గోడలమీద ఎర్ర అక్షరాలు కండ్ల్లల్ల మెదిలినయ్… లోపట లోపట దండాలో సమ్మన్నా పాట పాడుకుంటనే ఉన్న. ఆ ఆవాత మళ్ళీ కొన్ని ఏళ్ళకి ఆయన ఫోటో చూసిన.కామ్రేడ్ రమాకాంత్ ఇది ఉధ్యమం పెట్టిన పేరైతే అమ్మా,నాన్నా పెట్టుకున్న పేరు సమ్మిరెడ్డి. జనాల్లో మాత్రం #సమ్మన్న సి.కాస.సమ్మన్న. సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి. 1996జూన్ 23 అంటే ఇప్పటికి 28 సంవత్సరాల కిందట. ఈరోజు #కామ్రేడ్రమాకాంత్వర్థంతి.
ఇప్పటికీ ఊరికి పోయినప్పుడు ఆ అక్షరాలని వెతుక్కుంటా ఉంటా…కానీ కూలిపోయిన గోడల లోపల ఉన్న జీవితాలే కాదు వాటిమీది అక్షరాలూ చెరిగిపోయాయ్. కానీ కామ్రేడ్.రమాకాంత్ పేరూ, ఆ పాట మాత్రం ఎప్పటికీ చెరిగిపోలేదు..బహుశా ఇక పోవేమో కూడా..
ఏడిర సమ్మన్నంటే?
జనం మనిషినీ నేనూ
జనంలుంటనన్నావు
రణం మనిషినీ నేనూ
రణంలుంటనన్నావు
దెబ్బకొకని కూల్చినావు తూర్పుదిక్కు పొడిచినావు… తూర్పు దిక్కు పొడిచినావు…
(#చీకటిసూర్యులు అని ఆర్.నారాయణ మూర్తి తీసిన సినిమా కామ్రేడ్ రమాకాంత్ బయో పిక్ అనుకోవచ్చు)
#జోహార్ #కామ్రేడ్.రమాకాంత్

-నరేష్కుమార్ సూఫీ

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad