Menu

లొంగిపోయినందుకు 15 ఏళ్ళుగా జైలు – ఏడవరోజుకు చేరిన ఆజాద్ నిరాహార దీక్ష

anadmin 1 week ago 0 280

రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం
పత్రికా ప్రకటన

తేదీ – 2025 అక్టోబర్ 21

ఏడు రోజుల నిరాహార దీక్ష: దున్న కేశవరావు @ ఆజాద్ విషయంలో ప్రభుత్వాలు చేసిన నమ్మకద్రోహం – భారతదేశ న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నతను బహిర్గతం చేసింది

సిపిఐ (మావోయిస్ట్) పార్టీ నుండి లొంగిపోయిన నాయకుడు దున్న కేశవరావు @ ఆజాద్ భువనేశ్వర్‌లోని ఝార్పడా స్పెషల్ జైలులో చేపట్టిన నిరాహార దీక్ష నేటితో ఏడవ రోజుకు చేరుకుంది.

వేగవంతమైన విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలం అయినందున అక్టోబర్ 15న ఆజాద్ తన నిరహార దీక్షను ప్రారంభించారు.

దున్నా కేశవరావు 2011 మే 18 నాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారు. రక్షణ, పునరావాసం, సాధారణ జీవితాన్ని తిరిగి కల్పిస్తాం అని వారు చేసిన వాగ్దానంపైన ఆయన లొంగిపోయారు. కానీ, ఆ వాగ్దానానికి విరుద్ధంగా, ఆయనను వెంటనే ఒడిశా పోలీసులు తిరిగి అరెస్టు చేసి, దాదాపు 15 సంవత్సరాలుగా నిరవధిక నిర్బంధంలో ఉంచారు. శాంతియుత జీవితం కోసం లొంగిపోయిన తనకు ‘నిరవధిక జైలు జీవితం’ శిక్షగా మారింది.

ఈ నమ్మకద్రోహం అత్యంత కీలక దశకు చేరుకుంది. ఎందుకంటే, రిట్ పిటిషన్ (క్రిమినల్) నెం. 511/2024 లో సుప్రీంకోర్టు, ఆజాద్‌పై ఉన్న అన్ని కేసుల కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి, 2025 సెప్టెంబర్ మొదటి వారంలో విచారణ ప్రారంభించి, ఒక సంవత్సరంలోగా పూర్తి చేయాలని స్పష్టంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

“సుప్రీంకోర్టు పేర్కొన్న సెప్టెంబర్ నెల గడిచిపోయింది, అక్టోబర్ వచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఆజాద్ కేసుల్లో ఎటువంటి సరైన పురోగతి లేదు”.
స్పష్టమైన న్యాయపరమైన ఆదేశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చొరవ చూపకుండా ఉన్నాయి. దీనితో, తన రాజ్యాంగ హక్కులను డిమాండ్ చేస్తూ ఆజాద్ నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది.

  • ఆజాద్ లాగే, ఝార్పడా జైలులోని ఇతర రాజకీయ ఖైదీల జీవితాలు కూడా అత్యంత దయనీయంగా ఉన్నాయి: రంజు కిల్లో @ చంటి, అనే ఆదివాసీ యువకుడిని, పక్షవాతంతో మంచం పట్టి కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ 2023లో అరెస్టు చేశారు. నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, ఆయన తీవ్ర అనారోగ్య పరిస్థితి, కదలలేని స్థితిలో కూడా నిరంతర, అమానవీయ నిర్బంధం నుండి ఆయనకు మినహాయింపు ఇవ్వలేదు. అతడిని తక్షణమే విడుదల చేయాలి.
  • దుబాసి శంకర్ @ అరుణ్, జనుమూరి శ్రీనుబాబు @ రైను వంటి ఖైదీలను ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని జైళ్లకు పిటి వారెంట్ల ద్వారా నిరంతరం బదిలీ చేస్తున్నారు. ఈ విధానాన్ని బెయిల్ పొందే అవకాశాన్ని అడ్డుకోవడానికి, కుటుంబీకులను కలిసే అవకాశాన్ని నిరాకరించడానికి, ఇంకా విచారణ ప్రక్రియనే ఒక నిరవధిక శిక్షగా మార్చడానికి ఉపయోగిస్తున్నారు.

మా డిమాండ్లు:

  • దున్న కేశవరావు @ ఆజాద్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు తక్షణమే పాటించాలి.
  • రంజు కిల్లో @ చంటి అలాగే ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర ఖైదీలందరికీ తక్షణమే బెయిల్ మంజూరు చేయాలి. సరైన వైద్యం అందించాలి.
  • రాజకీయ ఖైదీల కోసం పిటి వారెంట్ల ద్వారా నిరంతర అంతర్-రాష్ట్ర జైలు బదిలీల విధానాన్ని ఆపాలి. చాలా రాష్ట్రాలలో కేసులు ఉన్న ఖైదీలను వారి సొంత రాష్ట్ర జైళ్లలోనే ఉంచి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర రాష్ట్రాల కోర్టు విచారణలకు హాజరయ్యేందుకు అనుమతించాలి.
  • మునుపటి శిక్ష ద్వారా ఇప్పటికే చాలా కాలం జైలు జీవితాన్ని గడిపిన తర్వాత కూడా కొత్త కేసులను ఎదుర్కొంటున్న చిన్నారావు @ సంతు వంటి వారితో సహా, సంవత్సరాల తరబడి విచారణ లేకుండా నిర్బంధంలో ఉన్న ఇతర రాజకీయ ఖైదీలందరి కేసులు సత్వరమే విచారణ జరిగేలా చూడాలి.
    అస్పష్టమైన ఆరోపణల కింద నిర్బంధించబడిన రాజకీయ ఖైదీలకు, సరైన విచారణ పొందే హక్కును, వేగవంతమైన విచారణను జరగకుండా క్రమపద్ధతిలో ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి, రాజకీయ ఖైదీలందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్ర అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం
నిర్వహణ బృందం
(ఎఐఆర్‌ఎస్‌ఒ, ఎఐఎస్‌ఎ, ఎఐఎస్ఎఫ్, ఏపీసీఆర్, ఏఎస్ఏ, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎం, భీమ్ ఆర్మీ, బిఎస్‌సిఇఎం, సిఇఎం, కలెక్టివ్, సిఆర్‌పిపి, సిఎస్ఎం, సిటిఎఫ్, డిఐఎస్ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరమ్ ఎగైన్స్ట్ అప్రెషన్, తెలంగాణ, ఫ్రటర్నటీ, ఐఎపిఎల్, ఇన్నోసెన్స్ నెట్వర్క్, కర్ణాటక జనశక్తి, ఎల్ఎఎ, మజ్దూర్ ఆధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రికా, ఎన్ఎపిఎం, నజరియా మ్యాగజైన్, నిశాంత్ నాట్య మంచ్, నౌరోజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయి మంచ్, సమాజ్‌వాదీ జనపరిషద్, సమాజ్‌వాదీ లోక్ మంచ్, బహుజన్ సమాజ్‌వాదీ మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ పీస్ అలియన్స్, డబ్ల్యూఎస్‌ఎస్, వై4ఎస్)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad