10 డిసెంబర్ 2025
ఇప్సా శతాక్షి
మానవ హక్కుల దినం ప్రత్యేకం;
మానవ హక్కుల భావన అభివృద్ధి ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇది 1215 నాటి మాగ్నా కార్టా నుండి ప్రారంభమైనట్లుగా పరిగణించబడుతున్నప్పటికీ, దీని ఆధునిక స్థాపన 1948 డిసెంబర్ 10 న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించటంతో జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జరుపుకుంటారు. 1948లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజుకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు.
మానవ హక్కుల దినోత్సవ అధికారిక ప్రారంభం 1950లో జరిగింది. ఆ సమయంలో, ప్రతి సంవత్సరం డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా పాటించాలని అన్ని దేశాలను, ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానం 423 (V) ను ఆమోదించింది. సర్వసభ్య సమావేశం ఈ ప్రకటనను ఆమోదించినప్పుడు, దీనిని ” ప్రజలందరికీ, అన్ని దేశాలకు సాధించవలసిన ఒక సాధారణ ప్రమాణం”గా ప్రకటించింది. దీని కోసం, వ్యక్తులు, సమాజాలు “జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రగతిశీల చర్యల ద్వారా, వాటి సార్వత్రిక, సమర్థవంతమైన గుర్తింపును, ఆచరణను నిర్ధారించడానికి” కృషి చేయాలని కోరింది.
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనపత్రం ప్రతి మనిషికి హక్కుగా ఉండవలసిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛల విస్తృత శ్రేణిని నిర్దేశిస్తుంది. ఇది జాతీయత, నివాస స్థలం, జెండర్, జాతీయత లేదా జాతి మూలం, మతం, భాష లేదా మరే ఇతర స్థితి ఆధారంగా ఎలాంటి వివక్ష లేకుండా, ప్రతి వ్యక్తి హక్కులకు హామీ ఇస్తుంది.
భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993 కింద ఏర్పాటు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ స్థాపన 1993 అక్టోబర్ 12 న జరిగింది. ఇది మానవ హక్కుల రక్షణ , ప్రోత్సాహం లక్ష్యంగా పనిచేసే ఒక స్వతంత్ర చట్టబద్ధ సంస్థ. ప్రతి సంవత్సరం మానవ హక్కుల దినోత్సవానికి ఒక థీమ్ ఉంటుంది, , ఈ సంవత్సరం థీమ్ రోజువారీ ఆహారం, నీరుతో సహా “మన దైనందిన అవసరాలు” .
అయితే, తరచుగా మనం పాలస్తీనా చిత్రాలలో అక్కడి ప్రజలు, చిన్న పిల్లలు సైతం ఆహారం, నీరు, నివాసం వంటి అన్ని దైనందిన అవసరాలకు దూరమవుతున్న దృశ్యాలను చూస్తున్నాము. దీనికి కారణం ఇజ్రాయెల్ దాడులు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి.
మనం దీనిని ప్రస్తుత దృక్పథంలో చూస్తే, ఈ అవసరాల కోత లేదా ఉల్లంఘనలకు గురవుతున్న అనేక ప్రాంతాలు ఉన్నాయి.
కానీ, కొన్ని ప్రదేశాలలో యుద్ధం లేదా ఆర్థిక కొరత లేకపోయినా, కేవలం అవినీతిలో కూరుకుపోయి, నైతికతను కోల్పోయిన కారణంగా కూడా మానవ హక్కుల ఉల్లంఘన కనిపిస్తుంది. ఇందులో అగ్రస్థానంలో మనం జైళ్లను చూడవచ్చు, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన బహిరంగంగా జరుగుతుంది.
జైలులో మానవ హక్కుల ఉల్లంఘన: ప్రత్యక్ష సాక్ష్యం
జైలులో ఉన్న కొందరు రాజకీయ ఖైదీలు, సాధారణ ఖైదీలతో జరిపిన సంభాషణ ద్వారా మనం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు:
గత మూడున్నర సంవత్సరాలుగా జార్ఖండ్, బీహార్‌లోని వివిధ జైళ్లలో ఉండి, ప్రస్తుతం బీహార్‌లోని పాట్నాలోని ఆదర్శ్ కేంద్రీయ కారాగారం లో విచారణ ఖైదీగా ఉన్న జర్నలిస్టు, మానవ హక్కులు, ప్రజా అనుకూల రిపోర్టింగ్‌కు ప్రసిద్ధి చెందిన వ్యక్తి రూపేశ్ కుమార్ సింగ్: “ఆదర్శ్ కేంద్రీయ కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన బహిరంగంగా జరుగుతుంది. ఇక్కడ ఖైదీలకు జైలు మాన్యువల్ ప్రకారం భోజనం అందదు, అలాగే సబ్బు, పళ్లపుల్ల లేదా టూత్‌పేస్ట్ వంటి ఇతర నిత్యవసర వస్తువులను కూడా ఇవ్వరు” అని చెబుతున్నారు.
అంతే కాకుండా, తాను ‘గోల్‌ఘర్’ (అండా సెల్ -అధిక భద్రతా సెల్) లో ఉన్నానని, అక్కడి చిన్న చిన్న గదులలో ముగ్గురు ముగ్గురు వ్యక్తులను ఉంచేవారని , ఇచ్చే ఆహారం అస్సలు తినడానికి పనికిరాదని తెలిపారు. అయితే, గత నవంబర్ 17న మావోయిస్ట్ ఖైదీగా ఉన్న 73 ఏళ్ల ప్రమోద్ మిశ్రా భోజనం , ఆరోగ్యం సంబంధిత 12 డిమాండ్లతో జైలు పరిపాలనకు ఒక దరఖాస్తును ఇచ్చారు. పరిస్థితి మెరుగుపడకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని షరతు కూడా పెట్టారు. రూపేశ్ కుమార్ సింగ్‌తో సహా ఇతర ఖైదీలు కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు.
అప్పటి నుండి ఆహారంలో కొంతవరకు మెరుగుదల ఉంది. ఖైదీలను వేర్వేరు గదులలో ఉంచారు. ఆరోగ్యానికి సంబంధించిన సరైన ఏర్పాట్లు కూడా జైలు యంత్రాంగం చేయడం లేదని కూడా ఆయన చెప్పారు. దీనితో పాటు, అక్కడ 100 మంది ఖైదీలకు స్నానం చేయడానికి ఒకే ఒక కుళాయి ఉంది. అందువల్ల, చాలా మంది ఖైదీలు మరుగుదొడ్డి సీట్‌పై కూర్చుని, మరుగుదొడ్డి కోసం అమర్చిన కుళాయి నుండి స్నానం చేయవలసి వస్తోంది. గోల్‌ఘర్‌లో కిటికీలు మొదట్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం అన్ని కిటికీలను ప్లాస్టర్‌తో మూసివేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ గదులలో కిటికీలు లేవు, కేవలం ముందు వైపున ఒక గేటు మాత్రమే ఉన్నది. ఊపిరాడకుండా ఉండే ఈ ప్రదేశంలో, గాలి ప్రసరణ కోసం గేటుతో పాటు ఒక చిన్న కిటికీ ఉండేది. దాన్ని మూసివేయడం వల్ల మరుగుదొడ్ల దుర్వాసన, ఇతర రకాల వాయువులు బయటకు పోలేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇది మానవ హక్కులతో చెలగాటం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
న్యాయస్థానం ఆదేశాలు; జైలు పరిస్థితులు
ఈ జైలు పరిపాలనా యంత్రాంగానికి ఉండే అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, న్యాయస్థానం నుండి కారణం చూపించమని నోటీసు వచ్చే వరకు, వారు కోర్టు ఆదేశాలను కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఆ ఆదేశాలు భౌతిక హాజరుకు సంబంధించినవి కావచ్చు లేదా ఖైదీల ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు. జైలులో బంధువులతో మాట్లాడటానికి దాదాపు 5000 మంది ఖైదీలకు కేవలం మూడు ఎస్‌టిడి బూత్‌లు మాత్రమే ఉన్నాయి, అందులో ఒకటి తరచుగా పనిచేయదు.
ఈ సమస్యలను, వీటిలో మెరుగుదలను డిమాండ్ చేస్తూ, ఆదర్శ్ కేంద్రీయ కారాగారం, బేయూర్‌లోని హై సెక్యూరిటీ సెల్‌కు చెందిన మొత్తం 6 మంది ఖైదీలు ఈ సంవత్సరం డిసెంబర్ 10 న మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నారు. వీరిలో ప్రమోద్ మిశ్రా, రూపేష్ కుమార్ సింగ్, సుధీర్ భగత్, అభ్యాస్ భుయిన్యా, అనిల్ యాదవ్, రాజేష్ గుప్తా ఉన్నారు. ఈ విషయమై డిసెంబర్ 08 న జైలు పరిపాలనకు ఖైదీల దరఖాస్తు రూపంలో లిఖితపూర్వక వినతిని సమర్పించారు.
దీంతో పాటు, ఈ అవకతవకలకు వ్యతిరేకంగా ఏ ఖైదీ అయినా గళం విప్పితే, అతనిపై జైలులో శాంతి భద్రతలను భంగపరచాడనే ఆరోపణ మోపి, మరో జైలుకు బదిలీ చేస్తారు. అక్కడ దోపిడీలో ఉండే కొత్త రూపం బయటపడుతుంది.
జైలులో ఖైదీలపై దౌర్జన్యం: ఒక ప్రత్యక్ష ఉదాహరణ
తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బీహార్‌లోని అనేక జైళ్లలో ‘పరిపాలనాయంత్రాంగ ఖైదీల’ (జైలు మార్పిడి అయిన ఖైదీలు) పైన దాడి జరుగుతుంది. దీని నుండి తప్పించుకునే ఖైదీలు దాదాపుగా ఎవరూ ఉండరు.
మావోయిస్ట్ ఖైదీగా ఉన్న దాదాపు 65 ఏళ్ల విజయ్ కుమార్ ఆర్య సరళమైన, నిరాడంబర స్వభావం కల వ్యక్తిగా అందరికీ తెలుసు. ఆయనను ఆదర్శ్ కేంద్రీయ కారాగారం, బేయూర్ నుండి కేంద్రీయ కారాగారం, బక్సర్‌కు బదిలీ చేసినప్పుడు, అక్కడకు చేరుకోగానే నిస్సత్తువయ్యేంత వరకు ఆయనపై లాఠీలతో దాడి చేశారు. మరొక జవాను నా మర్మాంగల పైన, తొడలపైన వందలాది లాఠీ దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు. ఆ జవాను అలసిపోయేంత వరకు కొట్టాడు; సిపాయి ఆయాసపడే వరకు కొట్టిన తర్వాత, నన్ను మళ్లీ జైలర్ ముందు నిలబెట్టారు. జైలర్ కళ్ళెర్రజేసి సిపాయిలను తిడుతూ, “ఇంకా ఇంత ధృడంగా నిలబడి ఉన్నాడంటే, మీరెలా కొట్టారు? ఇతను సెల్ (గది) వరకు కుంటుకుంటూ వెళ్ళేలా కొట్టండి!” అని అన్నాడు.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే: “2024 ఆగస్టు 30నాడు ఉదయం సుమారు 7 గంటలకు నేను బక్సర్‌లోని సెంట్రల్ జైలులోకి ప్రవేశించాను. అక్కడ నన్ను జైలు ప్రవేశ విభాగం కార్యాలయంలో అసిస్టెంట్ జైలర్ శివసాగర్ ముందు హాజరు పరిచారు. నన్ను చూడగానే ఆయన అమ్మ- అక్కల పేర్లతో తిట్ల దండకం మొదలుపెట్టాడు. జైలర్ ఎందుకు అంత చెడ్డగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక నేను ఆశ్చర్యపోయాను.
ఆయన జైలు సిపాయితో బయటి నుండి ఇద్దరు బీహార్ మిలటరీ సిపాయిలను లాటీలను తీసుకుని రమ్మని చెప్పాడు. వారు లోపలికి వచ్చిన తర్వాత, ‘నువ్వు బేయూర్ జైలులో ఏం చేశావు?’ అని ఆయన నన్ను అడిగాడు. ‘నేను అక్కడ ఏ తప్పు చేయలేదు. కానీ, జైలు మాన్యువల్ ప్రకారం భోజనం ఇవ్వకపోవడంతో మేము నిరాహార దీక్షను ప్రకటించాము’ అని చెప్పాను.
దీనికి ఆయన కోపంతో ఊగిపోయి, ఎర్రటి కళ్ళతో బీహార్ మిలటరీ సిపాయిలతో వీడికి బాగా బుద్ధి చెప్పండి అని అన్నాడు. బూతులు తిట్టాడు. ‘వీడిని మీరు ఎట్లా కొట్టారు. ఇంకా గట్టిగా నిలబడి ఉన్నాడు? వీడిని ఎట్లా కొట్టాలంటే సెల్ దాకా కుంటుతూ వెళ్ళాలి’ అని అన్నాడు.
అప్పుడు నన్ను అదే మూలకు తీసుకువెళ్లి, ఒక సిపాయి నా రెండు చేతులను పట్టుకుని నన్ను ముందుకు వంచాడు. మళ్లీ నన్ను అదే మూలకు తీసుకెళ్లారు. ఈసారి పట్టుకున్న సిపాయి లాఠీ తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు; రెండవ సిపాయి నన్ను పొట్టపై పడుకోబెట్టి నా వీపుపై కూర్చున్నాడు. నా కాళ్లను పైకి పట్టుకుని, అరికాళ్లపై లెక్కలేనన్ని లాఠీ దెబ్బలు కొట్టారు. అతను అలసిపోయిన తర్వాత, మళ్లీ నన్ను ఆ జల్లాద జైలర్ ముందు నిలబెట్టారు, అప్పటికే నాకు సరిగ్గా నిలబడలేటం కూడా చేతకావడం లేదు.
అమానవీయ హింస కొనసాగింపు
శివసాగర్ జైలర్ తిడుతూ, “చెవులు పట్టుకుని 20 సార్లు గుంజీలు తీయి, , ‘నేను ఇకపై ఏ జైలులోనూ అధికారులకు వ్యతిరేకంగా ఉద్యమం/నిరాహార దీక్ష చేయను’ అని చెప్పు” అని అన్నాడు. నేను అందుకు నిరాకరించడంతో, అతను సిపాయిలకు “ఇతను స్పృహ కోల్పోయి పడిపోయే వరకు రెండు వైపుల నుండి లాఠీలతో కొట్టండి” అని ఆదేశించాడు. ఇక తప్పక నేను గుంజీలు తీయవలసి వచ్చింది. నేను స్పృహ కోల్పోయి పడిపోయే వరకు గుంజీలు తీస్తూనే ఉన్నాను. దీని తర్వాత జైలర్ నన్ను అండా సెల్‌కు (అత్యంత ఏకాంత నిర్బంధ గది) పంపమని ఆదేశించాడు.
ఆఫీసు నుంచి బయటకు వచ్చి గేటు దగ్గరకు రాగానే, మళ్లీ తనిఖీ చేసిన తర్వాత నా చెల్లాచెదురైన వస్తువులను సర్దుకోవడం ప్రారంభించాను. అప్పుడే ఒక గేట్ వార్డర్ వెనుక నుండి అకస్మాత్తుగా 15-20 లాఠీ దెబ్బలు విచక్షణారహితంగా కొట్టాడు. అతను బహుశా ఇంకా కొట్టేవాడేమో, కానీ అతని తోటి పోలీసు అతని లాఠీని పట్టుకుని, “వదిలేయండి, ముసలోడు” అని అన్నాడు. నా వయస్సు 64 సంవత్సరాలు. నేను కుంటుకుంటూ గార్డు పోస్టు దగ్గరకు, అక్కడనుంచి సెల్ వరకు చేరుకున్నాను.
అండా సెల్‌లో ఆరోగ్య సమస్యలు, ఇతర ఉల్లంఘనలు
అండా సెల్‌కి వెళ్లిన తర్వాత, సాయంత్రం నేను డాక్టర్ దగ్గరకు వెళ్లి నొప్పి తగ్గడానికి మందులు తీసుకోవాలనుకున్నాను, కానీ నన్ను ఆసుపత్రికి వెళ్లనివ్వలేదు. వేడి నీళ్లు అడిగితే అది కూడా ఇవ్వకపోగా పోలీసు నన్ను తిట్టాడు. నేను 24 గంటల పాటు నా స్థితికి భయపడిపోయాను. రాత్రి పూట పడుకోలేకపోయాను, కూర్చోడం కూడా చేతకాలేదు. మూడు రోజుల వరకు కూర్చుని మల విసర్జన చేయడం కష్టంగా ఉండేది. మర్నాడు సాయంత్రం, జైలు ఆసుపత్రికి వైద్య పరీక్ష కోసం తీసుకెళ్లారు, కానీ మందులు ఇవ్వలేదు. సెల్‌లో నాకు ఒక కుండ, ఒక పళ్లెం , ఒక దుప్పటి ఇచ్చారు. నేను ఒక గిన్నె, గ్లాసు అడిగాను, కానీ అవి ఇవ్వలేదు. అక్కడ ఏ ఖైదీకి కూడా గిన్నె-గ్లాసు ఇవ్వరు. మీరు వేరే జైలు నుండి తెచ్చుకుంటే, దాన్ని గేటు దగ్గరలాక్కుంటారు.” (జనచౌక్‌లో 2025 జూన్ 21నాడు ప్రచురితమైంది).
73 ఏళ్ల ప్రమోద్ మిశ్రాను బేయూర్ జైలు నుండి భాగల్పూర్ క్యాంప్ జైలుకు పంపినప్పుడు ఆయనపై కూడా లాఠీలతో దాడి జరిగింది. దీనికి నిరసనగా, ఒక్క ఖైదీపై కూడా లాఠీ ఝుళిపించినా తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఫలితంగా, ఆ సమయంలో అక్కడ ఏ ఖైదీని కొట్టకుండా నిషేధం విధించారు.
రూపేష్ కుమార్ సింగ్ కూడా భాగల్పూర్‌లోని షహీద్ జుబ్బా సాహ్ని కేంద్రీయ కారాగారంలో ఉన్నప్పుడు, ఆయన తోటి ఖైదీలపై కూడా లాఠీలు ఉపయోగించారు. ఇందులో పేద, బలహీన వర్గాల ప్రజలతో పాటు, గతంలో సైన్యంలో ఉండి ఏదో కారణం చేత జైలులో ఉన్నవారు కూడా ఉన్నారు. అప్పుడు రూపేష్ కూడా దీనిని నిలిపివేయాలని జైలు పరిపాలనా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో, ఆయన 2024 మే 07నాడు భాగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు (జైలు లోపల జరుగుతున్న ఈ అఘాయిత్యాల గురించి ఒక దరఖాస్తును పంపారు. దాని కాపీలను బీహార్ ముఖ్యమంత్రి, హోం సెక్రటరీ, జైళ్ల ఐజి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ప్రధాన న్యాయమూర్తి, పాట్నా హైకోర్టుతో సహా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు పంపారు. దీని ఫలితంగా జైలు పరిపాలనా యంత్రాంగంపైన ఒత్తిడి పెరిగింది; ఆ తర్వాత ఈ అకృత్యాలు ఆగిపోయాయి. ఈ వార్త స్థానిక మీడియాలో కూడా వచ్చింది.
జైలు జీవితం: ఆహారం, వివక్ష, గోప్యతల లేమి
అదే షహీద్ జుబ్బా సాహ్ని కేంద్రీయ కారాగారంలో ఒకప్పుడు ఖైదీగా ఉన్న సంతోష్ రాయ్ (మాజీ సైనికుడు , ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు), జైలు పరిస్థితిని స్పష్టం చేయడానికి ఒక సంభాషణ సందర్భంగా ఇలా అడిగారు: “మీరు కేవలం ముల్లంగి కూరను వరుసగా ఎన్ని రోజులు తినగలరు? జైలు పొలంలో దాని పంటకాలం అయిపోయే వరకు ఖైదీలుగా ఉన్న మాకు ఉదయం, సాయంత్రం కూరగాయగా అదే పెట్టేవారు.”
అదే సమయంలో, కుటుంబ గొడవల్లో 6 నెలలు బేయూర్ జైలులో ఉన్న పాట్నా నివాసి ఒకరు, “జైలు అంటే మా పేదలకు నరకం” అని చెబుతున్నారు. జైళ్లలో కులం ఆధారిత వివక్ష కూడా చాలా లోతుగా ఉంది. సమాజంలో వెనుకబడిన కులంగా గుర్తించే సముదాయం నుండి వచ్చిన వారితోనే జైళ్లలో మురికిని శుభ్రం చేయిస్తారు.
జైలులో ఉన్న వ్యక్తులను సమాజం నుండి వేరు చేయటమే కాక, వారి కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తిగా దూరం చేస్తారు. వారు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు లేదా మరే ఇతర ప్రియమైన వారు కావచ్చు.
బీహార్-జార్ఖండ్ జైళ్లలో నేను స్వయంగా ఎదుర్కొన్న విషయం ఏమిటంటే, నేను రూపేష్‌ను కలవడానికి వెళ్లిన ప్రతిసారీ, అతని గది గార్డు పక్కనే నిలబడి ఉండేవాడు.
మొదటగా, రెండు మూడు గ్రిల్స్ లేదా అద్దాలు ఉండటం వలన మా మధ్య దూరం 5-7 అడుగులు అవుతుంది; సమావేశ సమయం కూడా కేవలం 15 నిమిషాలే ఉంటుంది; దానికి తోడు మేము గట్టిగా అరుస్తూ మాట్లాడవలసి వస్తుంది. వీటన్నింటి తర్వాత కూడా మా సంభాషణలను వినడానికి రూపేష్ పక్కన ఎప్పుడూ ఒకరు నిలబడే ఉండేవారు. అంటే, భార్యాభర్తలు మాట్లాడుకోవాలన్నా ఎలాంటి గోప్యత ఉండదు. ఒక్కసారి మీపై ఏదైనా ఆరోపణ మోపి జైలుకు పంపితే, మీ మానవ హక్కులన్నింటినీ అణచివేయవచ్చు.
జైలు నుండి ఖైదీలకు తమ కుటుంబం, స్నేహితులు, న్యాయవాది లేదా ఇతర జైళ్లలో ఉన్న కేసు సహ నిందితులకు ఉత్తరాలు రాసే సదుపాయం కూడా ఇవ్వరు. అలాగే ప్రతి జైలులోనూ దీనికి విరుద్ధంగా చేయడం సాధ్యం కాదు.
నాకు గుర్తుంది, రూపేష్ రాంచీలోని బిర్సా ముండా కేంద్రీయ కారాగారంలో ఉన్నప్పుడు, నేను 2023 ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే- ప్రేమికుల రోజు) రూపేష్ కోసం ఏదో రాసి అందించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, జైలు పరిపాలనా యంత్రాంగం నా లేఖను తీసుకోవడానికి నిరాకరించింది. “కలవడానికి వీలున్నప్పుడు, ఉత్తరాల పని ఏముంది?” అని అన్నారు. భాగల్పూర్‌లోని షహీద్ జుబ్బా సాహ్ని సెంట్రల్ జైలులో తప్ప రూపేష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం, స్నేహితులు పంపిన పోస్ట్ కార్డులను కూడా ఏ జైలులోనూ ఇవ్వలేదు.
అయితే, అక్కడ కూడా ప్రారంభ రోజుల్లో కాపీ, పుస్తకాలు, పెన్ను, చివరికి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఇవ్వడానికి కూడా నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదు లేఖ రాయవలసి వచ్చింది.
ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనపై న్యాయమూర్తి వ్యాఖ్యలు
2025 మార్చిలో ప్రచురితమైన ఒక వార్తా నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.కె. పట్నాయక్ ప్రజాస్వామిక హక్కులు, లౌకికత్వం పరిరక్షణ కమిటీ నిర్వహించిన “ప్రజాస్వామిక హక్కులు, లౌకికత్వంపైన జాతీయ సదస్సు”లో ప్రసంగిస్తూ, పోలీసు కస్టడీలో మరణాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, జైళ్లలో చిత్రహింసల సమస్యల గురించి నొక్కి చెబుతూ, దేశంలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు బాధ్యత వహించే సంస్థలే వీటిని అత్యధికంగా ఉల్లంఘిస్తున్నాయి అని పేర్కొన్నారు. ఆయన మాటల్లో: “ప్రజాస్వామిక హక్కుల రక్షణకు బాధ్యత వహించే సంస్థలే వీటిని అత్యధికంగా ఉల్లంఘిస్తున్నాయి. కస్టడీలో మరణాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు , జైలులో చిత్రహింసల సంఘటనలు పెరిగాయి.”
డిసెంబర్ 10 న ప్రతి జైలులో కూడా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు, కానీ వాస్తవం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
ప్రతిచోటా మానవ హక్కులను రక్షించడం; ప్రతి అర్హులైన వ్యక్తి ద్వారా దీనిపై సరైన చొరవ తీసుకోవడం లాంటి అంశాలపైనా పని చేయాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే కేవలం కాగితాలపై మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఔచిత్యం ఏమిటి ?
(వ్యాస రచయిత్రి ఇప్సా శతాక్షి జర్నలిస్టు రూపేశ్ కుమార్ సింగ్ జీవన సహచరి. తన సహచరుడు రూపేష్ జైఒలు జీవిత అనుభవాల నుంచి ఈ వ్యాసాన్ని రాసింది.)
తెలుగు: పద్మ కొండిపర్తి
(themooknayak.com సౌజన్యంతో)


ఏ మార్గాన్ని అనుసరించాలి?
పాట్నా జైలు నుంచి తోటి జర్నలిస్టులకు జర్నలిస్ట్ రూపేష్ విజ్ఞప్తి
మూడేళ్ళుగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్న జర్నలిస్టు - ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్నా పట్టించుకోని అధికారులు
కార్పోరేట్ల కోసమే ఈ నరసంహారం
ఆదివాసి యోధుడు ప్రయాగ్ మాంఝీ కి జోహార్లు!
బిర్సా ముండా, తిలకా మాంఝీల వారసుడు మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ ప్రయాగ్ మాంఝి అమర్ రహే ! 