ఇవాళ ఉదయం జార్ఖండ్ లో బొకారో జిల్లా లాల్పనియా సమీపంలోని లుగు కొండల్లో ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసి యోధుడు ప్రయాగ్ మాంఝీని, ఆయనతో పాటు ఎనిమిది మంది కార్యకర్తలను భద్రతా బలగాలు చంపేశాయని వార్తలు వస్తున్నాయి.
కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగిన ఆదివాసీ బిడ్డ ప్రయాగ్ మాంఝీ పేరు వినడం ఇదే మొదటి సారి. ఆయనతో పాటు చంపివేయబడిన వారిలో కనీసం మరొక ముగ్గురు మాంఝీ లు ఉన్నారు. మాంఝీ అనేది ఆదివాసుల ఇంటిపేరు.
ఆ పేరు వినగానే బ్రిటిష్ వలసవాదం మీద పోరాడిన తొట్టతొలి ఆదివాసీ యోధుడు తిల్కా మాంఝీ పేరు గుర్తుకొచ్చింది.
జబ్రా పహాడియా పేరుతో సుప్రసిద్ధుడైన సంథాల్ ఆదివాసీ యోధుడు తిల్కా మాంఝీ బ్రిటిష్ వలసవాద దోపిడీని ఎదిరించి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాల మీద యుద్ధం నడిపిన తొలి యోధుడు. ఆయన 1771-1784 మధ్య ఛోటా నాగపూర్ ప్రాంత ఆదివాసులను సమీకరించి బ్రిటిష్ సైనికుల మీద విల్లంబుల వంటి సాంప్రదాయక ఆయుధాలతో దాడులు చేశాడు. స్థానిక పహాడియా సర్దార్ అనే తెగతో కలిసి బ్రిటిష్ సైన్యపు రామ్ గడ్ శిబిరం మీద మెరుపు దాడి చేశాడు. “భూమి మాదే” అనేది ఆయన ఇచ్చిన రణన్నినాదం. ఆయనను పట్టుకున్న బ్రిటిష్ సైన్యం 1784లో బీహార్ లోని భాగల్ పూర్ లో ఒక మర్రి చెట్టుకు బహిరంగంగా ఉరి తీసింది.
ఆ తర్వాత రెండు వందల యాబై సంవత్సరాలుగా దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆదివాసీ పోరాటాలన్నిటికీ ఆయన ప్రేరణగా నిలిచాడు.
భాగల్ పూర్ విశ్వవిద్యాలయాన్ని ఆ తిల్కా మాంఝీ పేరుననే పిలుస్తున్న ప్రస్తుత పాలకవర్గాలు, ఆ తిల్కా మాంఝీ పోరాట వారసత్వాన్నే కొనసాగిస్తున్న ప్రయాగ్ మాంఝీని ఇవాళ కాల్చి చంపాయి. సరిగ్గా రెండు వందల యాబై ఏళ్ల కిందటి తిల్కా మాంఝీని ఉరి తీసి చంపినట్టుగానే…
ప్రయాగ్ మాంఝీ కి కన్నీటి జోహార్లు….
-ఎన్.వేణుగోపాల్

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్రమాలు
జైలు చీకటి కొట్లలో కేకలేస్తున్న మానవ హక్కులు: యాతనలు, ఆకలి, క్రూరత్వాల భయంకర చిత్రం
Comrade Thota Seetharamaiah – An Unsung Hero of the Indian Revolution
కామ్రేడ్ తోట సీతారామయ్య – భారత విప్లవంలో ఓ అన్సంగ్ హీరో!
Global Solidarity Call to EndState Militarization and Extrajudicial Killings in Resource-RichAdivasi Regions in India
పాట్నా జైలు నుంచి తోటి జర్నలిస్టులకు జర్నలిస్ట్ రూపేష్ విజ్ఞప్తి 