కార్ల్ మార్క్స్ కాపిటల్ కు నూట యాబై ఏళ్లు - ఎన్.వేణుగోపాల్

కార్ల్

(వీక్షణం మే 2017 సంచికలో ప్రచురించబడినది)
రచయిత ఎన్.వేణుగోపాల్, వీక్షణం సంపాదకులు

వ్యవస్థను అర్థం చేసుకోవడానికీ, మార్చడానికీ కరదీపిక కార్ల్ మార్క్స్ రచన కాపిటల్ మొదటి సంపుటం వెలువడి నూటయాబై ఏళ్లు అయిన సందర్భంగా దాన్ని వివరిస్తున్నారు ఎన్ వేణుగోపాల్
ప్రచురణ కథ కార్ల్ మార్క్స్ రచన కాపిటల్ వెలువడి ఈ సంవత్సరం సెప్టెంబర్ కు సరిగ్గా నూట యాబై ఏళ్లు. అంతకు ముందు ఇరవై ఐదు సంవత్సరాలుగా కార్ల్ మార్క్స్ (1818-1883) తన భావాలు ప్రకటిస్తూ, ఆ భావాలను ఆచరణలోకి అనువదిస్తూ ఉన్నప్పటికీ, ఆయన సిద్ధాంతాల సంఘటిత, సమగ్ర, సారాంశ రూపమైన కాపిటల్ గ్రంథం మొదటి సంపుటం వెలువడింది మాత్రం, ఆయన 49వ ఏట, 1867లోనే. జర్మన్ భాషలో కార్ల్ మార్క్స్ రచన దాస్ కాపిటల్ మొదటి సంపుటం తొలి కూర్పు తొలి ముద్రణ వెయ్యి కాపీలు అచ్చయి హాంబర్గ్ లోని ముద్రణాలయం నుంచి 1867 సెప్టెంబర్ 14న విడుదలై, యూరప్ లోని అన్ని దేశాలకూ చేరింది. ప్రచురణకర్త వెర్లాగ్ వాన్ ఆటో మీస్నర్ కు న్యూయార్క్ లో కూడ కార్యాలయం ఉండడంతో ఆ జర్మన్ ప్రతి అమెరికాకు కూడ చేరింది. మిగిలిన ఖండాలకూ దేశాలకూ చేరడానికి మరికొంత కాలం పట్టి ఉండవచ్చు. మొదటి సంపుటం తర్వాత మార్క్స్ పదహారు సంవత్సరాలు జీవించి ఉన్నప్పటికీ మిగిలిన సంపుటాలు ఆయన స్వయంగా అచ్చుకు పంపించడం కుదరలేదు. కాకపోతే రెండో సంపుటం, మూడో సంపుటం మార్క్స్ జీవించి ఉన్నప్పుడే ఆయన చేతులలోనే దాదాపుగా పూర్తి అయ్యాయి. మొదటి సంపుటం వెలువడడానికీ, మరణానికీ మధ్య కాలంలో మార్క్స్ ఆ మొదటి సంపుటంలో కూడ ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తూ వచ్చాడు. అలా ఆయన జీవితకాలంలో జర్మన్ రెండో కూర్పు 1873లో వెలువడగా, మూడో కూర్పు ఆయన మరణం తర్వాత ఎనిమిది నెలలకు 1883లో వెలువడింది. మార్క్స్ జీవితకాలంలోనే రష్యన్ (ఏప్రిల్ 1872), ఫ్రెంచి (సెప్టెంబర్ 1872) అనువాదాలు వెలువడ్డాయి. ఇంగ్లిష్, పోలిష్ తదితర భాషల్లోకి అనువాద ప్రయత్నాలు మొదలయ్యాయి. అనువాదకులతో, ప్రచురణకర్తలతో మార్క్స్, ఎంగెల్స్ ల ఉత్తర ప్రత్యుత్తరాలు, వెలువడిన రెండు అనువాదాల ప్రచురణలు, పంపిణీ ఎదుర్కొన్న ఇబ్బందులు వాటికవిగా అధ్యయనం చేయదగినంత ఆసక్తికరమైనవి. వీటిలో ఫ్రెంచి అనువాదం మొత్తాన్నీ స్వయంగా మార్క్స్ సరిచూశాడు. అందులో భాగంగా తన జర్మన్ మూలంలో లేని అదనపు వివరణలు కూడ చేర్చాడు.
మార్క్స్ 1883లో మరణించిన తర్వాత, కాపిటల్ లో మిగిలిన రెండు సంపుటాలకు ఆయన చిరకాల మిత్రుడు, సహవాసి ఫ్రెడరిక్ ఎంగెల్స్ (1820 - 1895) సంపాదకత్వం వహించి రెండో సంపుటం 1885లో, మూడో సంపుటం 1894లో ప్రచురించాడు. మార్క్స్, ఎంగెల్స్ ల మిత్రుడు శామ్యూల్ మూర్, మార్క్స్ కూతురు ఎలియనార్ సహచరుడు ఎడ్వార్డ్ అవెలింగ్ లు మొదటి సంపుటాన్ని ఇంగ్లిష్ లోకి అనువదించగా ఎంగెల్స్ దాన్ని సరిచూసి ముందుమాట రాసి 1887లో ప్రచురించాడు. మొదటి సంపుటానికి జర్మన్ లో నాలుగో కూర్పును కూడ తయారుచేశాడు. కాని కాపిటల్ కు నాలుగో సంపుటంగా, లేదా స్వతంత్రమైన గ్రంథంగా ఉన్న ʹథియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూʹను ఎంగెల్స్ కూడ అచ్చుకు సిద్ధం చేయలేకపోయాడు. అది వెలువడడానికి ఎంగెల్స్ మరణించాక పది సంవత్సరాలు పట్టింది.
కాపిటల్ మొదటి సంపుటం వెలువడిన 1867 నుంచి ఎంగెల్స్ మరణించిన 1895 వరకు, ఇరవై ఎనిమిది సంవత్సరాలలో మొదటి సంపుటం తొమ్మిది భాషలలో, పదిహేడు కూర్పులలో, ఎనిమిది దేశాలలో అచ్చయింది. ఈ కాలంలోనే రెండో సంపుటం జర్మన్ కూర్పులు రెండు, రష్యన్, డేనిష్ అనువాదాలు, మూడో సంపుటం మొదటి జర్మన్ కూర్పు వెలువడ్డాయి. ఈ అనువాదకులందరితో మార్క్స్, ఎంగెల్స్ లు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలలో మూలగ్రంథపు సైద్ధాంతిక అంశాలకూ, అనువాదానికీ సంబంధించిన వివరణలెన్నో ఉన్నాయి. రష్యన్ లోకి మిఖయిల్ బకూనిన్ చేసిన అనువాదం ఎందుకూ పనికిరానంత ఘోరంగా ఉన్నదని ఆ తర్వాతి అనువాదకుడు నికొలాయ్ డేనియల్సన్ అన్నాడు. ఫ్రెంచి అనువాదం విషయంలోనైతే మొదటి సంపుటం వెలువడడానికి ఐదు సంవత్సరాల ముందు నుంచే ఫ్రెంచి అనువాదకులను వెతకడానికి మార్క్స్ ప్రయత్నాలు ప్రారంభించాడు. జర్మన్ ప్రతి బైటికి రాగానే ఫ్రెంచి లోకి అనువదిస్తామని ఐదారుగురు అనువాదకులు స్వచ్చందంగా ముందుకు వచ్చినప్పటికీ 1872 దాకా ఏదీ కుదరలేదు. అప్పుడు కూడ ముక్కస్య ముక్కార్థ అన్నట్టుగా అనువాదం చేశారని, మార్క్స్ దాన్ని పూర్తిగా దిద్దాడు. రష్యన్ లోనూ, ఫ్రెంచి లోనూ మార్క్స్ ఎంగెల్స్ ల జీవితకాలంలోనే ఐదారుగురు అనువదించడానికి ప్రయత్నించడం, వారి అనువాదాల్లో లోపాలున్నాయనో, వారికి విషయం సరిగా అర్థం కాలేదనో పక్కనపెట్టడం జరిగాయి. రష్యన్ లోకి చివరికి అనువాదం చేసిన డేనియల్సన్ అనువాదాన్ని కూడ లెనిన్ విమర్శించాడు. డేనియల్సన్ తనను తాను మార్క్స్ సూత్రాల సమర్థకుడిగా భావించుకున్నప్పటికీ ఆయనకు మార్క్స్ ఎంతమాత్రం అర్థం కాలేదని లెనిన్ అన్నాడు. 1885లో జరిగిన ఒక ఇంగ్లిష్ అనువాదాన్ని చూసి ఎంగెల్స్ ʹమార్క్స్ ను ఎలా అనువదించగూడదుʹ అని ఒక వ్యాఖ్య రాయవలసి వచ్చింది. మార్క్స్ ను సక్రమంగా అనువదించాలంటే అనువాదకులకు తాము అనువదిస్తున్న విషయమూ, భాషలూ తెలిసి ఉండాలని ఎంగెల్స్ అన్నాడు. ʹఒక నిజమైన, సత్యసంధత కలిగిన శాస్త్రీయ రచన అంటే ఏమిటో ఈ అనువాదకుడికి ఎంతమాత్రం తెలిసినట్టు లేదుʹ అనీ, ʹజర్మన్ అర్థాన్ని ఇంగ్లిష్ అర్థరాహిత్యంగా మార్చడానికి ఇది ఉదాహరణʹ అనీ ఎంగెల్స్ అన్నాడు.
దాస్ కాపిటల్ జర్మన్ మూల గ్రంథం మొదటి సంపుటం మొదటిసారి వెయ్యి ప్రతులు మాత్రమే అచ్చు కాగా, మార్క్స్ ఎంగెల్స్ ల జీవితకాలంలో అచ్చయిన పదిహేడు కూర్పులూ కలిసి యాబైవేల ప్రతులు అచ్చయి ఉంటాయని ఒక అంచనా. కాపిటల్ మీద విశేష పరిశోధన చేసి, శతజయంతి సందర్భంగా ఒక పుస్తకమూ (ఫర్ ఆల్ టైమ్ అండ్ ఆల్ మెన్, ప్రోగ్రెస్ పబ్లిషర్స్, మాస్కో, 1969), ఎన్నో వ్యాసాలూ (ఉదాహరణకు, మొహిత్ సేన్, ఎంబి రావుల సంపాదకత్వంలో 1968లో పీపుల్స్ పబ్లిషింగ్ హౌజ్ ప్రచురించిన ʹదాస్ కాపిటల్ సెంటెనరీ వాల్యూంʹ వ్యాససంకలనానికి అనుబంధం - ఫాక్ట్స్ అండ్ డేట్స్ రిగార్డింగ్ దాస్ కాపిటల్) రాసిన ఎ డబ్ల్యు ఉరోయెవా ప్రకారం కాపిటల్ శతజయంతి నాటికి, అంటే 1967 నాటికి కేవలం సోవియట్ యూనియన్ లోనే ఎన్నో భాషలలో అరవై లక్షల ప్రతులు వెలువడ్డాయి. సోవియట్ యూనియన్ లో కాపిటల్ మొదటి మూడు సంపుటాలు, 18 భాషల్లోకి అనువాదమై, 167 కూర్పులలో అచ్చయ్యాయి. కాపిటల్ శతజయంతి సందర్భంగా 1967లో వేసిన లెక్క ప్రకారం అప్పటికి అది 43 భాషల్లోకి అనువాదమై, 220 కూర్పుల్లో, మరెన్నో పునర్ముద్రణలు పొందింది. ప్రస్తుతం మరొక యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఉరోయెవా చేసినంత విస్తృతమైన, నిశితమైన పరిశోధన ఎవరూ చేసినట్టు లేదు గాని, మరెంతో మంది ప్రచురణకర్తల మరెన్నో ప్రచురణలు, అనువాదాలు, పరిచయాలు, సంక్షిప్తీకరణలతో కనీసం మరొక నలబై లక్షల ప్రతులైనా చలామణీలోకి వచ్చి ఉంటాయి. 1970లలో వియత్నాం, కంపూచియా విజయాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో విప్లవోద్యమాలు విస్తరించినప్పుడూ, 2008లో సామ్రాజ్యవాద దేశాలను సంక్షోభం చుట్టుముట్టినప్పుడూ కాపిటల్ అధ్యయనం మీద ఆసక్తి మరొకసారి మరింతగా పెరిగింది. పెంగ్విన్ వంటి బహుళజాతి ప్రచురణసంస్థలతో సహా ఎన్నో దేశాల ప్రచురణకర్తలెందరో కాపిటల్ అనువాదాలను, సంక్షిప్తీకరణలను, పరిచయాలను ప్రచురించారు. ఎంతో మంది కొత్తగా కాపిటల్ అధ్యయనం వైపు మళ్లారు. అందువల్ల మరిన్ని అనువాదాలు, ప్రచురణలు జరిగే ఉంటాయి.
వీటిలో ఇంగ్లిష్ అనువాదాలదే ప్రథమస్థానం కావడం సహజమే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న కాపిటల్ ఇంగ్లిష్ అనువాదాలు రెండు. ఒకటి, శామ్యూల్ మూర్, ఎడ్వార్డ్ అవెలింగ్ అనువదించిన, ఎంగెల్స్ సంపాదకత్వం వహించిన మొదటి సంపుటం అనువాదం. దీన్ని మొదటిసారి లండన్ కు చెందిన స్వాన్ సాన్నెన్షీన్, లౌరీ అండ్ కంపనీ అనే ప్రచురణకర్త ప్రచురించగా ఎన్నో దేశాలలో ఎందరో ప్రచురణకర్తలు పునర్ముద్రించారు. ప్రొగ్రెస్ పబ్లిషర్స్, మాస్కో ఎన్నోసార్లు పునర్ముద్రించింది. 1990లో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ఈ ప్రచురణ ఆగిపోయింది గాని, వేరువేరు ప్రచురణకర్తలు ఇంకా ఆ గ్రంథాన్ని పునర్ముద్రిస్తూనే ఉన్నారు. సోవియట్ ప్రచురణలో ముందుమాటలు, ఉటంకింపులు, ఉపయుక్త గ్రంథసూచి, వివరణలు, పదసూచి వగైరాలతో కలిపి మొదటి భాగం 768 పేజీలు, రెండో భాగం 552 పేజీలు, మూడో భాగం 948 పేజీలు అంటే మూడు భాగాలూ కలిసి 2268 పేజీలు. రెండో సుప్రసిద్ధ ఇంగ్లిష్ అనువాదం బెన్ ఫౌక్స్ (మొదటి భాగం), డేవిడ్ ఫెర్న్ బాక్ (రెండో, మూడో భాగాలు) అనువదించిన, పెంగ్విన్ బుక్స్ 1970లలో ప్రచురించిన సంపుటాలు. పెంగ్విన్ ప్రచురణలో మొదటి భాగం 1152 పేజీలు, రెండో భాగం 624 పేజీలు, మూడో భాగం 1088 పేజీలు (మొత్తం 2864 పేజీలు). ఇవి కాక, వివిధ ప్రచురణకర్తలు ప్రచురించిన ఇంగ్లిష్ మొదటి సంపుటం, సంక్షిప్తీకరణలు, పరిచయాలు, వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. బొమ్మల్లో, కార్టూన్లలో, సమీకరణాల్లో మొదటి సంపుటాన్ని గాని, మొత్తం కాపిటల్ ను గాని వివరించిన ప్రచురణలూ ఎన్నో ఉన్నాయి. ఇటీవలి కాలంలో మొత్తం కాపిటల్ గ్రంథం ఆన్ లైన్ కూర్పు, ఆడియో బుక్ (ధ్వనిముద్రణ) కూడ దొరుకుతున్నాయి.
ఇక కాపిటల్ నాలుగో భాగంగా వెలువడిన ʹథియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూʹ అసలు కాపిటల్ కు మొదటి భాగంగా ఉండవలసిందని భావించే మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్తలు కూడ ఉన్నారు. తనకంటె ముందరి అర్థశాస్త్రవేత్తల అవగాహనలను విమర్శించే క్రమంలో, వారి అభిప్రాయాలను విస్తృతంగా ఉటంకిస్తూ, వాటిమీద వ్యాఖ్యలుగా, విమర్శలుగా, వివరణలుగా తన అభిప్రాయాలు ప్రకటిస్తూ, మార్క్స్ 1861-63ల్లో రాసుకున్న 23 నోట్ బుక్స్ ఇవి. ఆ కాలంలో ఫొటోకాపీ సౌకర్యం లేదు గనుక మార్క్స్ తాను వివరించదలచుకున్న, విశ్లేషించదలచుకున్న, విమర్శించదలచుకున్న పూర్వ రచయితల భావాలన్నిటినీ తన చేతిరాతలో రాసుకుని, వాటి మీద తన అభిప్రాయాలు, విమర్శలు, విశ్లేషణలు రాశాడు. అలా మార్క్స్ చేతిరాతలో ఉన్న నోట్ బుక్స్ మీద వరుసగా నోట్ బుక్ సంఖ్యా, వరుసగా మార్క్సే వేసిన పేజి నంబర్లు ఉన్నాయి. అలా ఈ థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూ 1472 పుటల్లో ఉంది. మార్క్స్ చనిపోవడానికి రెండు సంవత్సరాల ముందు పరిచయమైనా, మార్క్స్ ఎంగెల్స్ ల మిత్రుడుగా, మార్క్సిస్టు సిద్ధాంతకర్తగా సుప్రసిద్ధుడైన చెక్-ఆస్ట్రియన్ తత్వవేత్త కార్ల్ కాట్స్కీ (1854-1938) ఈ థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూకు సంపాదకుడుగా ఉంటే బాగుంటుందని ఎంగెల్స్ 1888లో ప్రతిపాదించాడు. కాట్స్కీ సంపాదకత్వంలో థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూ మూడు సంపుటాలుగా 1905-1910 మధ్య వెలువడింది. అయితే మూలరచనలో కాట్స్కీ అనవసరమైన జోక్యం చేసుకున్నాడనీ, మార్క్స్ పెట్టిన శీర్షికలను మార్చాడనీ, వరుస క్రమాన్ని మార్చాడనీ, కొన్ని వాదనలు తీసివేశాడనీ విమర్శలున్నాయి. చివరికి మార్క్స్ సొంత చేతిరాత నోట్ బుక్స్ సహాయంతో తూర్పు జర్మనీ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మార్క్సిజం లెనినిజం సంపూర్ణ, యథాతథ గ్రంథాన్ని జర్మన్ లో 1959లో ప్రచురించింది. దాన్ని ఇంగ్లిష్ లోకీ, ఇతర భాషలలోకీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మార్క్సిజం లెనినిజం, మాస్కో అనువదింపజేయగా, ఇంగ్లిష్ అనువాదాన్ని ప్రోగ్రెస్ పబ్లిషర్స్ మూడు భాగాలుగా (మొదటి భాగం అనువాదం ఎమిలీ బరన్స్ - 1963, రెండో భాగం అనువాదకుల పేరు లేదు, సంపాదకులు ఎస్ ర్యజన్ స్కయా - 1968, మూడో భాగం అనువాదం జాక్ కోహెన్, ఎస్ ర్యజన్ స్కయా – 1971) వెలువరించింది. ఈ మూడు భాగాలూ కలిసి 1806 పేజీలు (మొదటి భాగం 506 పేజీలు, రెండో భాగం 662 పేజీలు, మూడో భాగం 638 పేజీలు). అంటే మొత్తంగా కాపిటల్ ఆరు సంపుటాలు, నాలుగువేల పేజీలు.
ఇవి కాక మార్క్స్ రాజకీయార్థిక శాస్త్ర రచనలు మరికొన్ని ఉన్నాయి. ఇరవై ఆరేళ్ల యువకుడిగా ప్రవాసంలో పారిస్ లో రాజకీయార్థిక అంశాల గురించి చేసిన తొలి ఆలోచనలు ʹఎకనామిక్ అండ్ ఫిలసాఫిక్ మాన్యుస్క్రిప్ట్స్ ఆఫ్ 1844ʹ అనే పేరుతోనూ, ʹపారిస్ మాన్యుస్క్రిప్ట్స్ʹ అనే పేరుతోనూ ఎన్నో ఇంగ్లిష్ అనువాదాలు వెలువడ్డాయి. నిజానికి ఆయనకన్న ముందే ఎంగెల్స్ రాజకీయార్థిక శాస్త్రంలోకి ప్రవేశించాడు. మార్క్స్ సంపాదకుడిగా ఉండిన డాయిష్ ఫ్రాంజోసిష్ జార్బుషర్ అనే పత్రికలో ప్రచురణార్థం ఎంగెల్స్ 1843లో ఔట్ లైన్స్ ఆఫ్ ఎ క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే వ్యాసం పంపాడు. అది 1844లో అచ్చుకాగా దాదాపు అప్పటినుంచే ఇద్దరి మధ్య స్నేహం, మార్క్స్ లో రాజకీయార్థికశాస్త్రం మీద ఆసక్తి మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి 1847-48ల్లో ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అని వ్యాసాలతో, ఉపన్యాసాలతో ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. బ్రస్సెల్స్ లో 1847లో జర్మన్ వర్కింగ్ మెన్స్ క్లబ్ లో మార్క్స్ ఇచ్చిన ఉపన్యాసాలు 1849లో ʹవేజ్ లేబర్ అండ్ కాపిటల్ʹ పేరుతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. మార్క్స్ సుప్రసిద్ధ రచన ʹఎ కాంట్రిబ్యూషన్ టు ఎ క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీʹ 1859లో వెలువడింది. ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ మొదటి సమావేశంలో, 1865లో మార్క్స్ ఇచ్చిన ఉపన్యాసం ʹవాల్యూ, ప్రైస్ అండ్ ప్రాఫిట్ʹ పేరుతో అచ్చయింది. అలాగే 1857-58ల్లో మార్క్స్ తన సొంత వివరణ, విశ్లేషణ కోసం ఏడు నోట్ బుక్స్ నిండా రాసుకున్న గ్రండ్రస్సె డర్ క్రిటిక్ డర్ పొలిటిషెన్ ఒకానమీ (ఫండమెంటల్స్ ఆఫ్ క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ) అనే కాపిటల్ రచనకు సన్నాహక వ్యాఖ్యల రచన మాస్కోలోని భాండాగారంలో ఉండిపోయి, కొన్ని భాగాలు మాత్రం 1939లో, 1941లో తొలిసారి జర్మన్ లో వెలుగు చూశాయి. లెనిన్ కూడ చూడని, చదవని మార్క్స్ రచనగా ప్రసిద్ధమైన ఈ గ్రంథం జర్మన్ మూలపు పూర్తి ప్రచురణ 1953లో జరిగింది. దానికి మార్టిన్ నికొలస్ ఇంగ్లిష్ అనువాదం గ్రండ్రస్సె పేరుతో న్యూలెఫ్ట్ రివ్యూ సహకారంతో పెంగ్విన్ బుక్స్ ప్రచురణగా 1973లో మొదటిసారి వెలువడింది.
కాపిటల్ తో ఇవన్నీ కలిపితే మార్క్స్ రాజకీయార్థశాస్త్ర రచనలు ఐదువేల పేజీలు దాటుతాయి. నిజానికి ఈ రాజకీయార్థ శాస్త్ర రచనలు మాత్రమే కాక మార్క్స్ ఎంగెల్స్ ల రచనలన్నీ ఒక సమగ్ర ప్రాపంచిక దృక్పథంలో భాగమైనవే గనుక ప్రతి రచనలోనూ రాజయార్థిక విశ్లేషణా దృక్పథం కనబడుతుంది.
అయితే కాపిటల్ చదవడం కష్టం అనే అభిప్రాయం ఒకటి బలంగా ఉంది. ముఖ్యంగా మొదటి మూడువందల పేజీలు క్లిష్టంగా ఉంటాయని, అందువల్ల ఆ తర్వాత సులభంగా ఉన్నప్పటికీ ఈ అవరోధాన్నే చాలమంది దాటలేరని అంటారు. మార్క్స్ జీవితకాలంలోనే జరిగిన ఫ్రెంచి అనువాదం ఒక పత్రికలో సీరియల్ గా ప్రచురిస్తామన్నప్పుడు ఆయన వారికి ఒక హెచ్చరిక చేశాడు: ʹదాస్ కాపిటల్ అనువాదాన్ని విడతలు విడతలుగా ప్రచురించాలనే మీ ఆలోచనను ప్రశంసిస్తున్నాను. అ రూపంలో పుస్తకం శ్రామిక వర్గానికి ఎక్కువ అందుబాటులోకి వస్తుంది. ఆ ఆలోచనే నన్ను మిగిలిన వాటన్నిటినీ పక్కనపెట్టేలా చేస్తోంది. మీ సూచనలో అది మేలైన భాగం కాగా, ఆ నాణానికి బొరుసు ఏమిటో చూడండి: నేను ఈ పుస్తకంలో ఉపయోగించిన విశ్లేషణా పద్ధతి ఆర్థిక విషయాలకు సంబంధించి ఇంతవరకూ ఎవరూ ఉపయోగించనిది. అందువల్ల తొలి అధ్యాయాలు చదవడం చాల కష్టంగా ఉంటుంది. వెంటవెంటనే నిర్ధారణకు, ముగింపుకు రావాలని, సాధారణ సూత్రాలకూ తమ భావోద్వేగాలను ప్రేరేపిస్తున్న తక్షణ ప్రశ్నలకూ మధ్య సంబంధం ఏమిటో ఎప్పటికప్పుడే తెలుసుకోవాలని ఆత్రుతతో ఉండే ఫ్రెంచి ప్రజలు ఇది చదివి, ఇక్కడ ఏదీ తొందరగా కదలడం లేదని నిరుత్సాహపడవచ్చుʹ అన్నాడు. ఈ అననుకూలతను అధిగమించడం తనకు సాధ్యం కాదని, సత్యాన్ని గ్రహించాలనే ఆసక్తి ఉన్న పాఠకులకు ఎక్కువలో ఎక్కువ ఒక ముందస్తు హెచ్చరిక చేస్తానని, అలా అది చదవడానికి వారిని సన్నద్ధం చేస్తానని అంటూ, ʹశాస్త్రం నేర్చుకోవడానికి రాజమార్గమేమీ లేదు. కొండ ఎక్కేటప్పుడు దాని నిటారైన కష్టతరమైన బాటల మీద అలసిపోగొట్టే నడక సాగించడానికి భయపడని వారికే కొండకొమ్ము మీద ఉజ్వల కాంతిని చేరుకునే అవకాశం వస్తుందిʹ అన్నాడు. నిజంగానే కాపిటల్ అధ్యయన క్రమం కష్టతరమైనదే అయినప్పటికీ ఆ అధ్యయన ఫలం కొండకొమ్మున అందే ఉజ్వల కాంతి. కొండకొమ్మునుంచి దిగంతాల దాకా విస్తరించే విశాల దృక్పథం.
అయితే కాపిటల్ కావడానికి రాజకీయార్థిక శాస్త్ర పుస్తకమే, రాజకీయార్థ శాస్త్ర విమర్శ అనే ఉపశీర్షికతో ఉన్నదే అయినా అందులో సామాజిక, చారిత్రక, తాత్విక, సాహిత్య, రాజకీయార్థిక అంశాలెన్నో ఇమిడి ఉన్నాయి. అది చదవడానికి అర్థశాస్త్రంలో, తత్వశాస్త్రంలో, చరిత్రలో, సామాజిక శాస్త్రాలలో, సాహిత్యంలో కొంత పరిచయం అవసరం. అది ప్రధానంగా అంతకుముందు రెండు శతాబ్దాలకు పైగా సాగుతున్న రాజకీయార్థిక శాస్త్ర చర్చలను, ప్రత్యేకించి బ్రిటిష్ రాజకీయార్థిక శాస్త్రంలో ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డోల పెట్టుబడిదారీ విధాన సమర్థనలను విమర్శించింది. ఆ నేపథ్యం తెలియడం అవసరం. అలాగే జర్మన్ తత్వశాస్త్రంలో హెగెల్ సాధించిన గతితార్కిక వాదపద్ధతిని, ఫ్యూర్ బా అభివృద్ధి చేసిన భౌతికవాద విశ్లేషణను తనలో సంలీనం చేసుకుంది. ఆ తత్వశాస్త్ర చరిత్రతో పరిచయం అవసరం. నిజానికి లెనిన్ అయితే హెగెల్ గతితర్కం తెలియకుండా కాపిటల్ ను, ముఖ్యంగా మొదటి అధ్యాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అసాధ్యం అన్నాడు. తాను అభివృద్ధి చేసిన చరిత్ర పట్ల భౌతిక వాద దృక్పథం అనే భావనను వివరించడానికి మార్క్స్ కాపిటల్ లో ప్రయత్నించాడు. అందువల్ల చరిత్ర గురించి, ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల గురించి అవగాహన కాపిటల్ అధ్యయనానికి అవసరం. అలాగే మార్క్స్ విపరీతమైన చదువరి గనుకా, నిశితమైన పరిశీలకుడు గనుకా, తన అధ్యయనం ద్వారా గ్రహించిన ఎన్నో అంశాలను కాపిటల్ లో భాగం చేశాడు. కాపిటల్ మొదటి సంపుటం వరకే చూసినా, మార్క్స్ అందులో బైబిల్ నుంచీ, షేక్ స్పియర్, గెథే, మిల్టన్, వోల్టేర్, హోమర్, బాల్జాక్, డాంటే, సెర్వాంటెస్, డ్రైడెన్, హీన్, వర్జిల్, జువెనాల్, హొరేస్, థామస్ మోర్, శామ్యూల్ బట్లర్ వంటి జర్మన్, ఇంగ్లిష్, ఇటాలియన్, ఫ్రెంచి, గ్రీక్, లాటిన్ రచయితలెందరినో ఉటంకించాడు. జర్మన్ జానపద గాథలు, ఇంగ్లిష్ కాల్పనిక నవలలు, వీరగాథలు, సామెతలు వంటివెన్నో ఉపయోగించుకున్నాడు. బ్రిటిష్, జర్మన్ పరిశ్రమల గణాంకాలు, ప్రభుత్వ పత్రాలు, కార్ఖానాల పర్యవేక్షకుల నివేదికలు వంటివెన్నో వాడుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, కాపిటల్ ఒక విజ్ఞాన సర్వస్వం. అయితే ఇందులో అత్యధిక భాగం 1860ల ముందువనీ, కనుక కాలం చెల్లినవనీ, ఇప్పుడు అటువంటి పెట్టుబడిదారీ విధానం లేదనీ, అందువల్ల కాపిటల్ ఇప్పుడు పనికిరాదనీ అనే విమర్శకులు కూడ ఉన్నారు. అందులో కొన్ని గణాంకాలకూ, వివరాలకూ, స్థలకాలాలకూ కాలం చెల్లినా, వాటిని విశ్లేషించిన పద్ధతి, సంవిధానం ముఖ్యమైనవనీ. అసలు మార్క్సిజం అన్నా, కాపిటల్ అన్నా ప్రధానమైనది సంవిధానమేనని జవాబు చెప్పినవాళ్లు కూడ ఉన్నారు.
కాపిటల్ చదవడం కష్టం అనుకునేవాళ్లకు, కాపిటల్ లోకి ప్రవేశాన్ని సులభతరం చేయడానికి కూడ ఈ నూట యాభై ఏళ్లలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కాపిటల్ మొదటి భాగం పరిచయం, మూడు భాగాల పరిచయాలు, సంక్షిప్తీకరణలు, వ్యాఖ్యానాలు, వివరణలు ఇంగ్లిష్ లోనే వందకు పైగా పుస్తకాలు, వేలాది వ్యాసాలు ఉన్నాయి. నేరుగా కాపిటల్ పరిచయం అనకపోయినా, కాపిటల్ లో ఉన్న విషయాలను వివరించే రాజకీయార్థ శాస్త్రం, మార్క్సిస్టు రాజకీయార్థ శాస్త్రం, మార్క్సిస్టు అర్థశాస్త్రం పేర్లతో వచ్చిన పుస్తకాలు, ఇతర సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలకు కాపిటల్ విశ్లేషణా పద్ధతిని అన్వయించిన పుస్తకాలు వందల్లో ఉంటాయి.
అయితే ఈ పరిచయాలు, సంక్షిప్తీకరణలతో కొన్ని సమస్యలు కూడ ఉన్నాయి. ఈ పరిచయాలు, సంక్షిప్తీకరణలు చేసినవారిలో కొందరు మార్క్స్ ను పూర్తిగా, సరిగా అర్థం చేసుకోలేదు. తమకు అర్థమైన భాగాలే, తమకు అర్థమైన మేరకు, తోచిన పద్ధతిలో తమ భాషలో రాశారు. మార్క్స్ క్లిష్టంగా చెప్పినదాన్ని తాము సరళంగా చెపుతున్నామని అనుకుంటూ దాని సారాంశాన్ని మార్చి తమ సొంత కవిత్వం జోడించారు. మార్క్స్ మౌలిక భావనలను, పునాది ప్రతిపాదనలను ఖండిస్తూనే, ఆ మౌలిక భావనల ఆధారంగా మార్క్స్ నిర్మించిన వాదనలను సమర్థిస్తామని అన్నారు.
నిజానికి ఇలా మార్క్స్ భావనలను అరకొరగా అర్థం చేసుకొని, వాటి సమగ్రతను, సంక్లిష్టతను, సారాన్ని పోగొట్టి తమకు అర్థమైన పద్ధతిలో రాయడం మార్క్స్ జీవించి ఉన్నప్పుడే మొదలయింది. ఫ్రెంచి సోషలిస్టులు 1880లో ఫ్రెంచి కార్మిక పార్టీ (పార్టి ఒహయ్యె ఫ్రాంచేస్- ఫ్రెంచి మాటల్లో వర్ణక్రమానికి ఉచ్చారణకూ చాల తేడా ఉంటుంది) స్థాపిస్తున్నప్పుడు దాని నాయకులు జూల్స్ గెస్డె, పాల్ లఫార్గ్ (మార్క్స్ కూతురు లారా సహచరుడు) మార్క్స్ తో సంప్రదింపులతోనే ఆ పార్టీ ప్రణాళిక రాశారు. దానిలో కనీస కార్యక్రమం గురించి రాసినది మార్క్స్ భావాలకు అనుగుణంగా ఉన్నదని వారనుకున్నారు గాని, అది చూసి మార్క్స్, ʹనాకు కచ్చితంగా తెలిసిందేమంటే నేను మార్క్సిస్టును కానుʹ అన్నాడు. ఈ మాటను ఎంగెల్స్ ఆ తర్వాత కూడ మరి రెండు సార్లు ఉటంకించాడు. మళ్లీ ఆ లాఫార్గే మార్క్స్ రాజకీయార్థిక భావాలను వివరిస్తూ 1883లోనే ది రైట్ టు బి లేజీ అనే పుస్తకం రాశాడు.
అలాగే మార్క్స్ ఎంగెల్స్ లకు సన్నిహితుడు, థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూ సంపాదకుడు కార్ల్ కాట్స్కీ 1887లోనే ది ఎకనమిక్ డాక్ట్రిన్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్ అనే పరిచయ పుస్తకం రాశాడు. బహుశా కాపిటల్ కు, మార్క్స్ రాజకీయార్థిక భావనలకు పరిచయంగా వెలువడిన మొదటి పుస్తకం అదే కావచ్చు. కాని దాంట్లో కాట్స్కీ మార్క్స్ కృషిని కేవలం ఆర్థిక సిద్ధాంతం స్థాయికి కుదించివేశాడని, మార్క్స్ ప్రతిపాదించిన చారిత్రక గతితర్కాన్ని ఒకరకమైన పరిణామవాదంగా చిత్రించాడని విమర్శ ఉంది. అలాగే మార్క్స్ చెప్పిన మిగిలిన విషయాలన్నీ పక్కనపెట్టి కార్మికవర్గం నానాటికీ దారిద్ర్యంలోకి దిగజారడం, పెట్టుబడిదారీ కేంద్రీకరణ జరగడం అనే పరిణామం మీదనే నొక్కి చెప్పాడని విమర్శ ఉంది. అంతకన్న ముఖ్యంగా కార్మిక రైతాంగ ఐక్యత భావనను పూర్తిగా తిరస్కరించాడని, పెట్టుబడిదారీ రాజ్యాన్ని కూలదోసి, కార్మికవర్గం రాజ్యాధికారం చేపట్టడం శాంతియుత పద్ధతులలో జరుగుతుందని, కొనసాగుతున్న వ్యవస్థలను తలకిందులు చేయనవసరం లేదని రాశాడని కాట్స్కీ మీద విమర్శలున్నాయి.
కాపిటల్ మొదటి సంపుటం వెలువడిన వెంటనే ʹఎంగెల్స్ సినాప్సిస్ ఆఫ్ కాపిటల్ʹ పేరుతో కాపిటల్ పరిచయం రాశాడు. మార్క్స్ అల్లుడు, కాపిటల్ ఇంగ్లిష్ అనువాదకుడు ఎడ్వార్డ్ అవెలింగ్ 1891లోనే ʹది స్టూడెంట్స్ మార్క్స్ - యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ కాపిటల్ʹ అనే పుస్తకం రాశాడు. అమెరికాలో స్థిరపడిన జర్మన్ నావికుడు, సోషలిస్టు రచయిత ఎర్నెస్ట్ అంటర్ మన్ ʹమార్క్సియన్ ఎకనమిక్స్ : ఎ పాపులర్ ఇంట్రడక్షన్ టు ది త్రీ వాల్యూమ్స్ ఆఫ్ మార్క్స్ కాపిటల్ʹ 1907లో ప్రచురించాడు. జర్మన్ సోషలిస్టు జూలియన్ బొర్చార్డ్ట్ 1919లో ʹది పీపుల్స్ మార్క్స్ – అబ్రిడ్జ్ డ్ పాపులర్ ఎడిషన్ ఆఫ్ ది త్రీ వాల్యూమ్స్ ఆఫ్ కాపిటల్ʹ అనే పేరుతో సంక్షిప్తీకరణ చేశాడు. అది 1921లోనే ఇంగ్లిషులోకి అనువాదమై ఎన్నోసార్లు పునర్ముద్రణ అయింది (దీన్ని ఇంగువ మల్లికార్జున శర్మ తెలుగులోకి అనువదించి 1981లో ప్రచురించారు). మార్క్సిస్టు మేధావి రోమన్ రోస్డోల్స్కీ 1967లో ʹది మేకింగ్ ఆఫ్ మార్క్స్ కాపిటల్ʹ అని జర్మన్ లో రాసిన పుస్తకం 1977లో ఇంగ్లిషులో వెలువడింది. సోవియట్ అర్థశాస్త్రవేత్త విటాలీ వైగోడ్స్కీ ʹది స్టోరీ ఆఫ్ ఎ గ్రేట్ డిస్కవరీ – హౌ కార్ల్ మార్క్స్ రోట్ కాపిటల్ʹ అని 1965లో, ʹది ఎవర్ లాస్టింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మార్క్స్ కాపిటల్ʹ అని 1975లో కాపిటల్ పరిచయ పుస్తకాలు రెండు రాశారు. అమెరికన్ సమాజశాస్త్రవేత్త డేవిడ్ స్మిత్, చిత్రకారుడు ఫిల్ ఇవాన్స్ కలిసి 1982లో ʹమార్క్స్ కాపిటల్ ఫర్ బిగినర్స్ʹ అనే బొమ్మల పుస్తకం ప్రచురించారు (తెలుగులో కార్టూన్లలో పెట్టుబడి అనే పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది). నలబై సంవత్సరాలకు పైగా వేరువేరు శాస్త్రాల విద్యార్థులకు కాపిటల్ బోధిస్తున్న అమెరికన్ భౌగోళికశాస్త్ర అధ్యాపకుడు డేవిడ్ హార్వే కాపిటల్ మొదటి సంపుటం మీద వరుసగా 13 ఉపన్యాసాలు ఇచ్చి, ఆ ఉపన్యాసాల ఆధారంగా 2010 లో ʹఎ కంపానియన్ టు మార్క్స్ కాపిటల్ʹ పేరుతో పుస్తకం ప్రచురించారు. అలాగే రెండో సంపుటం మీద ఇచ్చిన ఉపన్యాసాలతో 2013 లో ʹఎ కంపానియన్ టు మార్క్స్ కాపిటల్ వాల్యూం 2ʹ ప్రచురించారు. ఆయన ఉపన్యాసాలన్నీ కూడ ఇంటర్నెట్ మీద అందుబాటులో ఉన్నాయి.
డబ్ల్యు ఎచ్ ఎమ్మెట్ రాసిన ʹది మార్క్సియన్ ఎకనమిక్ హాండ్ బుక్ అండ్ గ్లాసరీʹ, ఆల్థూసర్ రాసిన ʹరీడింగ్ కాపిటల్ʹ, అలెక్స్ కాలినికోస్ రాసిన ʹడెసిఫరింగ్ కాపిటల్ʹ, ఎర్నెస్ట్ ఫిషర్ రాసిన ʹహౌ టు రీడ్ మార్క్స్ʹ, మైకేల్ హీన్రిచ్ రాసిన ʹయాన్ ఇంట్రడక్షన్ టు ది త్రీ వాల్యూమ్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్ కాపిటల్ʹ, ఎర్నెస్ట్ మాండెల్ రాసిన ʹమార్స్క్సిస్ట్ ఎకనమిక్ థియరీʹ, కెకె దాస్ గుప్తా రాసిన ʹఎస్సెన్షియల్స్ ఆఫ్ మార్క్స్ కాపిటల్ʹ, పాల్ స్వీజీ రాసిన ʹది థియరీ ఆఫ్ కాపిటలిస్ట్ డెవలప్ మెంట్ʹ, బెన్ ఫైన్ రాసిన ʹమార్క్స్ కాపిటల్ʹ, హారీ క్లీవర్ రాసిన ʹరీడింగ్ కాపిటల్ పొలిటికల్లీʹ, స్టీఫెన్ షాపిరో రాసిన ʹమార్క్స్ కాపిటల్ʹ, ఫ్రాన్సిస్ వీన్ రాసిన ʹమార్క్స్ దాస్ కాపిటల్ʹ, హ్యూగో గిల్లెర్ట్ చిత్రించిన ʹకార్ల్ మార్క్స్ కాపిటల్ ఇన్ లిథోగ్రాఫ్స్ʹ, డేవిడ్ మెక్ లెల్లాన్ రాసిన ʹది థాట్ ఆఫ్ కార్ల్ మార్క్స్ – యాన్ ఇంట్రడక్షన్ʹ, రాయా దునాయెవ్ స్కయా రాసిన ʹఔట్ లైన్ ఆఫ్ మార్క్స్ కాపిటల్ వాల్యూం వన్ʹ, జెన్రిఖ్ వోల్కోవ్ రాసిన ʹబర్త్ ఆఫ్ ఎ జీనియస్ʹ వంటి పుస్తకాలు డజన్లకొద్దీ ఉన్నాయి. ఇవి కాకుండా మార్క్స్ ఎంగెల్స్ ల జీవిత చరిత్రలలో, రాజకీయార్థశాస్త్ర పాఠ్యపుస్తకాలలో, మార్క్సిస్టు రాజకీయార్థశాస్త్ర సూత్రాలను సామాజిక సమస్యలకు అన్వయించి రాసిన పుస్తకాలలో ఎన్నో చోట్ల కాపిటల్ భావనల వివరణలూ విశ్లేషణలూ ఉన్నాయి.
అలా 1880ల నుంచి ఇవాళ్టివరకూ కూడ ఎంతో మంది కాపిటల్ ను పరిచయం చేసినవారున్నారు. వాటిలో కాపిటల్ ను అద్భుతంగా, సులభంగా పరిచయం చేసినవీ ఉన్నాయి. కొన్ని భావనలు అద్భుతంగా ఉండి, మరికొన్ని భావనలు తప్పుడు అవగాహనను ఇచ్చేవీ ఉన్నాయి. మొత్తంగా మంచి పరిచయాలే అయినా, మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్తల మధ్యనే వివాదాస్పదంగా ఉన్న అంశాలలో భిన్నాభిప్రాయాల వల్ల అందరి ఆమోదాన్ని పొందని పుస్తకాలూ ఉన్నాయి. అవన్నీ కూడ ఆయా చర్చలను పరిగణనలోకి తీసుకుంటూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాలే.
కాపిటల్ ప్రచురణల, అనువాదాల సందర్భంలో చెప్పుకోవలసిన ఒక హాస్యాస్పద ఘటన కూడ ఉంది. లండన్ లో వెలువడిన ఇంగ్లిష్ ప్రతిని ఏ అనుమతులూ లేకుండానే అమెరికాలో న్యూయార్క్ కు చెందిన ఒక ప్రచురణకర్త 1890లో పునర్ముద్రించాడు. ఇటువంటి పునర్ముద్రణలను పుస్తకప్రచురణ రంగంలో నకిలీ ప్రచురణ (పైరేటెడ్ ఎడిషన్) అంటారు. ఆ పుస్తకం గురించి పత్రికల్లో వ్యాపారప్రటనలు వేసినప్పుడు ʹడబ్బు సంపాదించే మార్గం చెప్పే పుస్తకంʹ అని ప్రచారం చేశాడు. ఆ ప్రచారంతో కాపిటల్ అతి త్వరలోనే ఐదువేల ప్రతులు అమ్ముడయ్యాయి.
కాపిటల్ రచనకు మూలం అసలు రాజకీయార్థిక విశ్లేషణా రంగం వైపు మార్క్స్ ప్రయాణం, దాస్ కాపిటల్ రచన, అందుకోసం మార్క్స్ పడిన శ్రమ, తపన, అన్వేషణ, చివరికి పుస్తక ప్రచురణ, ప్రచురణానంతర పరిణామాలు అన్నీ కూడ కాల్పనిక రచనా సన్నివేశాలతో పోల్చదగిన ఉజ్వలమైన ఘటనలు. మానవజాతి చరిత్రలో కాపిటల్ వంటి అపారమైన, విస్తృతమైన ప్రభావం వేసిన గ్రంథాలు అతి తక్కువ ఉంటాయి. మూడు ప్రధాన సంపుటాలలో, మూడు పుస్తకాలుగా ప్రచురితమవుతున్న నాలుగో సంపుటంతో నాలుగు వేల పేజీలకు విస్తరించిన ఈ గ్రంథం మార్క్స్ జీవితకాల కృషి. ఆయన కనీసం తన ఇరవై ఆరో ఏటినుంచి మరణించేదాకా నలబై సంవత్సరాలు, 1844 నుంచి 1883 దాకా ఈ విషయాలు ఆలోచిస్తూ, రచిస్తూనే ఉన్నాడు. ఈ కృషి అంతా కూడ ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు, దేశబహిష్కారాల మధ్య, నిరంతర దుర్భర దారిద్ర్యం మధ్య, అనారోగ్యం మధ్య, దేశదేశాల కార్మికవర్గాన్ని, కార్మికవర్గ మేధావులను ఐక్యం చేసి కార్యాచరణలోకి నడిపించే కృషి మధ్య సాగింది.
నిజానికి మార్క్స్ రాజకీయార్థిక సిద్ధాంతవేత్త కావాలని బయల్దేరలేదు. తండ్రి కోరుకున్నది మార్క్స్ న్యాయశాస్త్రం చదవాలని. మొట్టమొదట బాన్ విశ్వవిద్యాలయంలో మార్క్స్ చదవాలనుకున్నవి తత్వశాస్త్రం, సాహిత్యం. అక్కడ ఒక కవుల బృందంలో సభ్యుడు కూడ అయ్యాడు. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యార్థిగా, జెనా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర విద్యార్థిగా తత్వశాస్త్రాన్నీ న్యాయశాస్త్రాన్నీ సమ్మేళనం చేయాలని ఆలోచించాడు. ʹతత్వశాస్త్రం లేకుండా ఏమీ సాధించలేంʹ అని కూడ రాశాడు. ఆ తత్వశాస్త్ర ఆసక్తి వల్లనే హెగెల్ భావాల అభిమానిగా, ఫ్యూర్ బా, బ్రూనో బావర్ ల అనుయాయిగా మారాడు. తత్వశాస్త్రంలోనే పి ఎచ్ డి సిద్ధాంతపత్రం రాశాడు. హెగెల్ తత్వశాస్త్ర రచనల ప్రచురణ బాధ్యతలు పంచుకున్నాడు. అలా ఏదో ఒక విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యుడుగా స్థిరపడదగిన అర్హతలున్నా, ʹతత్వశాస్త్ర ఆచార్యుల మధ్య ఉండడం దుర్భరంʹ అని భావించి అటువైపు వెళ్లలేదు. ఒకవేళ అలా విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా చేరదలచినా తన విప్లవ భావాల వల్ల, ప్రభుత్వ ఆంక్షల వల్ల అది కుదిరేది కాదు. అప్పుడు, రచనా స్వాతంత్ర్యం ఉంటుందని కొంత , భుక్తి కోసం కొంత ప్రారంభించి చివరిదాకా పత్రికారచయితగా కొనసాగాడు. ఈ మధ్యలో ఒక నవల రాశాడు, ఒక నాటకం రాశాడు. జెన్నీ గురించి ప్రేమ కవిత్వం రాశాడు. కాని ʹసాహిత్యం నాకు సరిపడదు, అది వదిలేస్తున్నానుʹ అని కూడ రాశాడు. ఇదంతా 1843కు ముందు. అలా కవిగానో, నవలాకారుడుగానో, నాటకకర్తగానో, న్యాయవాదిగానో, తత్వవేత్తగానో, విశ్వవిద్యాలయ అధ్యాపకుడుగానో, పత్రికారచయితగానో మిగిలిపోగలిగిన కార్ల్ మార్క్స్ ను చరిత్రే రాజకీయార్థిక శాస్త్రం వైపు నడిపించింది. యూరప్ దేశాలలో 1840లలో జరిగిన పరిణామాలు, పెట్టుబడిదారీ సంక్షోభాలు, సామాజిక సంక్షోభాలు, బుద్ధిజీవుల మధ్య సాగిన లోతైన తాత్విక, రాజకీయ, సామాజిక చర్చలు ఆయనను రాజకీయార్థిక శాస్త్రం వైపు చూసేలా చేశాయి. ప్రత్యేకంగా రైనిష్ జీటుంగ్ సంపాదకుడిగా వాణిజ్య సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద, ప్రభుత్వ పాలన మీద రాస్తున్నప్పుడు, వ్యాఖ్యానిస్తున్నప్పుడు తాను అనివార్యంగా రాజకీయార్థ శాస్త్రం వైపు చూడవలసి వచ్చిందని మార్క్స్ చెప్పుకున్నాడు.

(ఇంకా ఉంది)

- ఎన్.వేణుగోపాల్, వీక్షణం సంపాదకులు

(వీక్షణం మే 2017 సంచికలో ప్రచురించబడినది)

Keywords : Karl Marx, Engels, capital, Marxism, communism,
(2024-04-01 14:16:17)



No. of visitors : 2089

Suggested Posts


కార్ల్ మార్క్స్ కాపిటల్ కు నూట యాబై ఏళ్లు - ఎన్.వేణుగోపాల్ (2)

ʹʹశాస్త్ర విజ్ఞానంలోనూ, ప్రజాజీవితంలోనూ ఏకకాలంలో నాయకులుగా ఉండగలిగిన అరుదైన మనుషుల్లో మార్క్స్ ఒకరు. ఆ రెండు అంశాలూ ఆయనలో ఎంత అవినాభావంగా ఏకమయ్యాయంటే ఆయనలోని మేధావినీ, సామాజిక యోధుణ్నీ కలిపి మాత్రమే అర్థం చేసుకోగలం. ఆ పరిశోధన అంతిమ ఫలితాలు ఏమైనా సరే అని శాస్త్ర విజ్ఞానాన్ని దానికదిగానే అధ్యయనం చేయాలని మార్క్స్ అనుకునేవాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కార్ల్