కార్ల్ మార్క్స్ కాపిటల్ కు నూట యాబై ఏళ్లు - ఎన్.వేణుగోపాల్ (2)

కార్ల్

(వీక్షణం మే 2017 సంచికలో ప్రచురించబడినది)
రచయిత ఎన్.వేణుగోపాల్, వీక్షణం సంపాదకులు

రాజకీయార్థ శాస్త్ర అధ్యయనం ప్రారంభించిన పదమూడు సంవత్సరాల తర్వాత, 1857లో రాసి, 1859లో అచ్చయిన ఎ కాంట్రిబ్యూషన్ టు ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీలో మార్క్సే స్వయంగా తాను రాజకీయార్థ శాస్త్ర అధ్యయనం వైపు ఎలా వచ్చాడో అద్భుతంగా వివరించాడు: ʹʹచట్టపరమైన సంబంధాలను గానీ, రాజకీయ రూపాలను గానీ వాటంతటవే అర్థం చేసుకోలేమనీ, సాధారణ మానవ మేధో అభివృద్ధి అనబడేదాని ఆధారంగా కూడ అర్థం చేసుకోలేమనీ నిర్ధారణకు నా అన్వేషణ నన్ను చేర్చింది. చట్టపరమైన సంబంధాలూ రాజకీయ రూపాలూ కూడ భౌతిక జీవన పరిస్థితులలోనే పుట్టుకు వస్తాయని నిర్ధారణకు నేను వచ్చాను. ఈ భౌతిక జీవన పరిస్థితులు అనే మొత్తాన్ని పద్దెనిమిదో శతాబ్దపు ఇంగ్లిష్, ఫ్రెంచ్ ఆలోచనాపరులూ, వారిని అనుసరిస్తూ హెగెల్ కూడ ʹపౌరసమాజంʹ అనే పదం కింద చుట్ట చుట్టారు. ఐతే ఈ పౌరసమాజ శరీరనిర్మాణం రాజకీయార్థ శాస్త్రం లోనే దొరుకుతుంది. అలా నా రాజకీయార్థ శాస్త్ర అధ్యయనం పారిస్లో ప్రారంభించాను. ఎం గిజో జారీచేసిన బహిష్కరణ ఉత్తర్వుల వల్ల అక్కడి నుంచి బ్రస్సెల్స్కు వెళ్లి, అక్కడ కొనసాగించానుʹʹ అని మార్క్స్ రాశాడు.

మార్క్స్ తొలి రచనలు చూస్తే, హెగెల్, ఫ్యూర్ బా ల అనుచరుడిగా, తత్వశాస్త్ర విద్యార్థిగా పరాయీకరణ గురించి ఎక్కువగా ఆలోచించినట్టు కనబడుతుంది. మనిషి దేవుడి నుంచి, ప్రకృతి నుంచి, సమాజం నుంచి పరాయీకరణకు గురవుతున్నాడని, ఈ పరాయీకరణను అర్థం చేసుకోవాలని పారిశ్రామిక యుగపు తొలిరోజుల తత్వవేత్తలందరూ ఆలోచించారు. కాని వాళ్లు పరాయీకరణ మూలాన్ని వెతకడంలో విఫలమయ్యారు. తోటి మనుషుల నుంచి మనిషి పరాయీకరణ చెందడానికి మూలం తన నుంచి తాను పరాయి కావడంలో ఉందని, తన నుంచి తాను పరాయి కావడానికి మూలం తన శ్రమ ఫలితం నుంచి పరాయి కావడంలో ఉందని, శ్రమ ఫలితం నుంచి పరాయీకరణ అంటే మానవసారమైన శ్రమ పరాయీకరణేనని, అందువల్ల మానవ సంబంధాల సమాహారమైన మనిషి తోటి మనుషుల నుంచి పరాయి అవుతున్నాడని మార్క్స్ గుర్తించాడు. అంటే పరాయీకరణ గురించి అర్థం చేసుకోవాలంటే, శ్రమ గురించి, ఉత్పత్తి గురించి అర్థం చేసుకోవాలనుకున్నాడు. అలా తత్వశాస్త్ర చర్చ నుంచి రాజకీయార్థిక చర్చ వైపు ప్రయాణించాడు.

రచన విషయంలో మార్క్స్ సమగ్రతావాది, పరిపూర్ణతావాది. తాను రాసినదానిమీద అసంతృప్తితో, దాన్ని ఇంకా ఇంకా సమగ్రం చేయాలని, మెరుగుపెట్టాలని మళ్లీ మళ్లీ తిరగరాస్తుండేవాడు. అలాగే జీవితమంతా నిత్య విద్యార్థిగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి, తన అభిప్రాయాలను ఆ కొత్త విషయాల వెలుగులో పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించేవాడు. విద్యార్థి దశలోనే ఆయన గ్రీకు, లాటిన్ లతో పాటు ప్రధాన యూరపియన్ భాషలన్నీ చదవడం నేర్చుకున్నాడు. జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లిష్లో రచనలు చేయగలిగేవాడు. రష్యన్ సాహిత్యంలో, సామాజిక శాస్త్రాలలో తనకు అప్పటికి తెలియని విషయా లున్నాయని, అవి మూలంలో చదవాలని అనుకుని 50 ఏళ్లు దాటాక రష్యన్ నేర్చుకున్నాడు. కాపిటల్ రాస్తున్న క్రమంలో తనకు తెలిసిన ప్రాథమిక అంకగణితం సరిపోవడం లేదని భావించి అంకగణితంతో పాటు ఆల్జీబ్రా, కాలిక్యులస్ నేర్చుకున్నాడు.

ʹʹశాస్త్ర విజ్ఞానంలోనూ, ప్రజాజీవితంలోనూ ఏకకాలంలో నాయకులుగా ఉండగలిగిన అరుదైన మనుషుల్లో మార్క్స్ ఒకరు. ఆ రెండు అంశాలూ ఆయనలో ఎంత అవినాభావంగా ఏకమయ్యాయంటే ఆయనలోని మేధావినీ, సామాజిక యోధుణ్నీ కలిపి మాత్రమే అర్థం చేసుకోగలం. ఆ పరిశోధన అంతిమ ఫలితాలు ఏమైనా సరే అని శాస్త్ర విజ్ఞానాన్ని దానికదిగానే అధ్యయనం చేయాలని మార్క్స్ అనుకునేవాడు. కాని అదే సమయంలో శాస్త్రవేత్త ప్రజాజీవితంలో క్రియాశీల భాగస్వామ్యం వహించకుండా, తన గ్రంథాలయంలోనో, ప్రయోగశాల లోనో తలుపులు మూసుకుని జున్నుగడ్డలో పురుగులాగ కూచుంటే, తన సమకాలికుల జీవితం నుంచీ, రాజకీయ పోరాటం నుంచీ దూరంగా ఒంటరిగా ఉండిపోతే తనను తాను కించపరచుకున్నట్టే అని కూడ భావించే వాడు. ʹశాస్త్ర విజ్ణానం స్వార్థపూరిత సంతోషం కాదు. శాస్త్రీయ అన్వేషణలకు తమను తాము అంకితం చేసుకునే సదవకాశం దొరికిన వాళ్లు, తమ జ్ఞానాన్ని మానవజాతి సేవకు అందించడంలో అగ్రభాగాన ఉండాలిʹ అని ఆయన అనేవాడు. ఆయనకు ఇష్టమైన సూక్తులలో ʹమానవ జాతి కోసం కృషి చేయాలిʹ అనేదొకటిʹʹ అని అని పాల్ లఫార్గ్ 1890లో రాసిన మార్క్స్ సంస్మరణ వ్యాసంలో అన్నాడు.

కాపిటల్ ప్రణాళిక

ఇప్పుడు దొరుకుతున్న రూపంలో కాపిటల్ నిజానికి మార్క్స్ రాయదల చుకున్న ఉద్గ్రంథంలో పావువంతు కన్న తక్కువ. తన రాజకీయార్థిక శాస్త్ర అధ్యయనాన్నీ, విశ్లేషణనూ క్రోడీకరిస్తూ ఆన్ ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ పేరుతో వరుసగా కొన్ని పుస్తకాలు రాయాలని ఆయన మొదట అనుకున్నాడు. ఆ ఆలోచనను ఎన్నోసార్లు మార్చు కున్నాడు. 1858లో వేసుకున్న ఒక ప్రణాళిక ప్రకారం ఈ విషయాల మీద ఆరు పుస్తకాలు (1. ఆన్ కాపిటల్, 2. ఆన్ ప్రాపర్టీ ఇన్ లాండ్, 3. ఆన్ హైర్డ్ లేబర్, 4. ఆన్ ది స్టేట్, 5. ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, 6. ఆన్ ది వరల్డ్ మార్కెట్) రాయాలని అనుకున్నాడు. అలాగే రాజకీయార్థ శాస్త్ర చరిత్ర మీద, ఆర్థిక ప్రత్యయాలు-సంబంధాల అభివృద్ధి మీద మరి రెండు పుస్తకాలు రాయాలని అనుకున్నాడు.

ఈ ప్రణాళికకు అనుగుణంగానే 1859లో బెర్లిన్లోని డంకర్ పబ్లిషింగ్ హౌజ్ అనే ప్రచురణకర్తతో ఒప్పందం కుదుర్చుకుని ఆన్ ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే మొదటి విడత పుస్తకం ఇచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు పని ముందుకు సాగలేదు. 1862 చివరి నాటికి తన పుస్తకానికి కాపిటల్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ మధ్యలో ఇంటర్నేషనల్ పనులు, ఆర్థిక ఇబ్బందులవల్ల పని వేగంగా సాగలేదు.

చివరికి 1865 డిసెంబర్లో కాపిటల్ ముసాయిదా ప్రతి సిద్ధం చేశాడు. అది పూర్తిచేశాక, 1866 ఫిబ్రవరి 13న ఎంగెల్స్కు రాసిన ఉత్తరంలో ʹʹఇప్పుడు అచ్చుకు పంపే ముసాయిదా ప్రతి సిద్ధమయింది గాని, అది ఎంత పెద్దదయిందంటే, దాన్ని నేను తప్ప మరెవరూ ప్రచురించలేరు, నువ్వు కూడ ప్రచురించలేవుʹʹ అని రాశాడు. ఆ పుస్తకాన్ని సంపుటాలుగా విడదీసి మొదటి సంపుటాన్ని పూర్తి చేయమనీ, మిగిలిన సంపుటాల పని తర్వాత చూసుకోవచ్చుననీ ఎంగెల్స్ సలహా ఇచ్చాడు. ఇక మార్క్స్ మొదటి సంపుటంలో వాక్య నిర్మాణాలు, వాదనలు తుది మెరుగులు దిద్దేపని మొదలుపెట్టాడు. ʹʹఅతి కష్టంగా ప్రసవించిన తర్వాత, బిడ్డను శుభ్రం చేయడానికి నాకుతున్నట్టుగా ఉందిదిʹʹ అని రాశాడు.

కాని దశాబ్దాల కృషి ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. దీర్ఘకాలంగా బాధిస్తున్న సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, కాలేయ వ్యాధి, నిద్రలేమి ఆయన పనికి ఆటంకాలు కలిగించాయి. 1866 మొదట్లో తీవ్రంగా జబ్బుపడి, పనిచేయలేని స్థితిలో ʹʹ... నేను ఎల్లవేళలా సమాధి అంచున ఉన్నట్టు అనిపిస్తున్నది. కనుక నేను ప్రతి క్షణాన్నీ పొదుపుగా వాడుకుని, పనిచేయగలిగినప్పుడే నా పుస్తకాన్ని పూర్తిచేయాలి. ఆ పుస్తకం కోసమే నేను నా ఆరోగ్యాన్నీ, సంతోషాన్నీ, కుటుంబాన్నీ త్యాగం చేశానుʹʹ అని ఎంగెల్స్కు ఉత్తరం రాశాడు. ఈ ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు ఉండనే ఉన్నాయి. పుస్తకాల మీద వచ్చే ఆదాయం తక్కువ.

న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్ విలేఖరిగా అంతకు ముందు క్రమబద్ధంగా అందుతుండిన పారితోషికం అమెరికాలో 1861లో అంతర్యుద్ధం చెలరేగడంతో ఆగిపోయింది. ఎంతో కొంత సంపాదన కోసం రైల్వే కార్యాలయంలో గుమస్తాగా పనిచేయడానికి వెళ్లాడు గాని ఆయన చేతిరాత ఘోరాతిఘోరంగా ఉన్నదని వాళ్లు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ స్థితిలో 1864లో మరణించిన సన్నిహిత మిత్రుడు, తొలితరం జర్మన్ కమ్యూనిస్టు విల్హెల్మ్ వోల్ఫ్ తన ఆస్తి మార్క్స్కు చెందాలని వీలునామా రాయడంతో కుటుంబ ఆర్థిక స్థితి మెరుగయింది. కాపిటల్ మొదటి సంపుటాన్ని మార్క్స్ ఆ విల్హెల్మ్ వోల్ఫ్కే అంకితం చేశాడు. ʹʹ...మరే పుస్తకమైనా ఇంతకన్న కష్టతరమైన పరిస్థితుల్లో రాయబడి ఉంటుందా అనుమానమే. నేనే గనుక ఈ పుస్తక సృష్టి వెనుక ఉన్న రహస్య చరిత్రను రాస్తే, దాంట్లో అనంతమైన నిగూఢ ఆందోళనలు, విచారాలు, కడగండ్లు బైటపడి ఉండేవిʹʹ అని మిత్రుడు లుడ్విగ్ కుగెల్మన్కు మార్క్స్ సహచరి జెన్నీ ఉత్తరం రాసింది.

- ఎన్.వేణుగోపాల్, వీక్షణం సంపాదకులు

(వీక్షణం మే 2017 సంచికలో ప్రచురించబడినది)

Keywords : Karl marx, engels, das capital, revolution, communism, Marxism
(2024-04-25 10:06:47)



No. of visitors : 1225

Suggested Posts


కార్ల్ మార్క్స్ కాపిటల్ కు నూట యాబై ఏళ్లు - ఎన్.వేణుగోపాల్

తోటి మనుషుల నుంచి మనిషి పరాయీకరణ చెందడానికి మూలం తన నుంచి తాను పరాయి కావడంలో ఉందని, తన నుంచి తాను పరాయి కావడానికి మూలం తన శ్రమ ఫలితం నుంచి పరాయి కావడంలో ఉందని, శ్రమ ఫలితం నుంచి పరాయీకరణ అంటే మానవసారమైన శ్రమ పరాయీకరణేనని, అందువల్ల మానవసంబంధాల సమాహారమైన మనిషి తోటి మనుషుల నుంచి పరాయి అవుతున్నాడని మార్క్స్ గుర్తించాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కార్ల్