నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

నక్సల్బరీ

PART 2

(వీక్షణం మే 2017 సంచికలో ప్రచురించబడినది)

ఇది చారు మజుందార్, సరోజ్ దత్తా, వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి కాలం నుంచి ఇవ్వాళ్టి వరకు విప్లవోద్యమంలోని భూమిసేన, సాంస్కృతి సేనలను అనుసంధానం చేసి నిర్వహిస్తున్న విప్లవ మార్గంగా రూపొందింది. ఈ క్రమంలో విప్లవ రచయితల సంఘం, జననాట్యమండలి దేశంలోనే సాంస్కృతిక రంగానికి 1970ల నుంచి 90ల దాకా ఒక అగ్రగామి పాత్ర నిర్వహిస్తే, ఇవాళ ఆ కర్తవ్యాన్ని దండకారణ్యంలోని చేతనా నాట్యమంచ్ నిర్వహిస్తున్నది.

మౌఖిక, దృశ్య కళారూపాలలో గాయకులు మొదలు, వాద్యకారుల వరకు దళిత, ఆదివాసి, వృత్తి కులాల నుంచి వాళ్లు విప్లవ సాంస్కృతిక కార్యకర్తలుగా మారడం అనేది ప్రత్యామ్నాయ రాజకీయాలు సాధించిన ఒక సాంస్కృతిక విజయం.

విద్యారంగంలో నక్సల్బరీ ప్రతిపాదించిన విప్లవాత్మక ప్రత్యామ్నాయం గురించి ముందే ప్రస్తావించుకున్నాం.

చైనా విప్లవం కాలంలోనే విప్లవంలో మహిళలు నిర్వహించవలసిన పాత్ర గురించి మావో సె టుంగ్ ʹవాళ్లు ఆకాశంలో సగంʹ అన్నాడు. ఇవాళ దండకారణ్యంలో వాళ్లు పోరాటంలో సగమై, ఐక్య సంఘటన, పార్టీ, ప్రజాసంఘాలన్నిటా సమాన భాగం పంచుకొని విప్లవ నిర్మాణం చేస్తున్నారు. దండకారణ్యంలోని త్యాగాల పరంపరలో నిత్యం మనం వింటున్నది మహిళల త్యాగాల గురించే. ఒక రకంగా ఇది నక్సల్బరీ ఒరవడి. గురజాడ అప్పారావు చెప్పిన ఆధునిక స్త్రీ రేపటి చరిత్రను రచిస్తుందనేది మన వ్యవస్థ స్వభావ, స్వరూప సందర్భంలో నక్సల్బరీ, ఆదివాసి మహిళ ఒక నూతన ప్రజాస్వామిక చైతన్యంతో, తన నెత్తుటి త్యాగాల చాలుతో ఇవాళ దేశవ్యాప్తంగా విప్లవోద్యమంలో భాగమైంది. దండకారణ్య క్రాంతికారీ మహిళా సంఘటన్లో ఇవాళ దేశంలోని ఏ మహిళా సంఘంలో లేనంతగా ఒక లక్ష మంది సభ్యత్వం ఉన్నారు.

బయట ఏ మహిళా సంఘానికి, సాంస్కృతిక సంఘానికి సాధ్యం కాని చరిత్ర నిర్మాణం మాత్రమే కాదు, చరిత్ర రచన కూడా చేతనా నాట్యమంచ్కు, దండకారణ్య క్రాంతికారి మహిళా సంఘటన్కు సాధ్యం కావడమే ఇందుకు నిదర్శనం. ఇతర సంఘాలకు సాధ్యం కాకపోవడానికి కారణాలు ఏమైనా కావచ్చు. విప్లవ క్రమశిక్షణ వల్ల ఈ రెండు సంఘాలు కూడా దండకారణ్య విప్లవోద్యమం యవ్వన ప్రాయంలో ప్రవేశించిన ముప్పై ఏళ్లకు తమ చరిత్రను ప్రకటించుకున్నవి. అవి పునర్ముద్రణను పొందినవి. ఇతర భాషల్లోకి అనువాదం అవుతున్నవి.

భాషా శాస్త్రజ్ఞులు కాడ్వెల్ నాటికి, భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు నాటికి ఒక కొలిక్కి తెచ్చిన చర్చలు విప్లవోద్యమ క్రమం మరింత ముందుకు తీసుకువెళ్లి ఇవాళ గోండు, కోయ జాతుల మూల భాష అయిన కోందు భాష ఆదివాసి భాష ద్రవిడ భాషల మూల రూపమనే చర్చను ప్రతిపాదిస్తున్నది. ఆఫ్రికాలో స్వాహిలీ, గికుయు వంటి భాషల గురించి సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు లేవనెత్తిన చర్చల వంటివే ఇవాళ ఆదివాసి భాషల గురించి దండకారణ్య నేపథ్యంలో మన దగ్గర జరుగుతున్నవి.

కార్మికవర్గ నాయకత్వంలో రైతాంగ పోరాటం తరువాత నక్సల్బరీ పంథా అయినా, దానిని కొనసాగించడానికి ఏర్పడిన విప్లవ పార్టీ అయినా ప్రాధాన్యం ఇచ్చిన అంశం దేశంలోని జాతుల సమస్య.

భారతదేశంగా మనం పిలుచుకుంటున్నది వాస్తవానికి భారత ఉపఖండం. ఇది బ్రిటిష్ ఇండియా ఏర్పడే వరకు కూడా ఎన్నడూ ఒక పరిపాలన కింద లేదు. చక్రవర్తులుగా పేరుపడిన అశోకుడు, అక్బర్లు కూడా వింధ్యాచలాలు దాటి దక్షిణ భారతానికి రాలేదు. వచ్చి గోల్కొండ గెలిచిన ఔరంగజేబు నియమించిన సుబేదార్ తరువాత స్వతంత్రత ప్రకటించుకున్నాడు. బ్రిటిష్ ఇండియా వెలుపల హైదరాబాద్ వంటి పెద్ద సంస్థానం మొదలుకొని జునాఘడ్ వంటి చిన్న సంస్థానాలు ఐదు వందలు ఉండేవి. దేశం అనే భావనను, జాతి అనే భావనను ప్రచారంలో పెట్టింది వలస పాలనయే. పెట్టుబడిదారీ విధానం వల్ల యూరప్లో జాతులే దేశాలుగా ఏర్పడిన నేపథ్యం నుంచి వచ్చిన అవగాహన అది.

వాస్తవానికి అంతకన్న ముందు మనం జాతులు అని ఈ దేశంలో పిలుచుకుంటున్నవన్నీ చెప్పన్నారు దేశాలు.

వలస పాలనలో మన రాజకీయ నాయకత్వమంతా వలస విద్యా విధాన ఆలోచనలతో రూపొందిందే గనుక ఈ జాతి, భాష ప్రాతిపదికగనే 1936 నుంచి భాషా రాష్ట్రాల ప్రస్తావన తెస్తూనే మరొకవైపు భారతజాతి అనే ఒక కృత్రిమ భావవాదాన్ని వలస వ్యతిరేక పోరాటం కోసం ప్రచారం చేసింది. 1967 నాటికి భాషా రాష్ట్రాలు ఏర్పడినవి గనుక, అవి జాతి, భాష ప్రాతిపదికనే ఇంచుమించు ఏర్పడినవి గనుక అప్పటికి ఉన్న స్థితి గురించి ఎం.ఎల్. పార్టీ విశ్లేషించింది. ఈ దేశం జాతుల బందిఖానాగా మారిందని నిర్వచించింది. దీనిని ఒక నందనోద్యానంగా మార్చాలని పిలుపు ఇచ్చింది.

అయితే కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల వంటి జాతులు ఎన్నడూ భారత ఉపఖండంలో భాగం కాపోవడమే కాకుండా ఎన్నడూ ఢిల్లీ పాలన కింద లేవు కనుక వాటి స్వయం నిర్ణయాధికార హక్కును గుర్తించింది.

ఆదివాసులు కూడా స్వయం ప్రతిపత్తిగల రాజ్యాలతో ఒక కేంద్రీకృత రాజ్యాన్ని, ఒక కేంద్రాన్ని బ్రిటిష్ పాలన మొదలైన తరువాత తమపై రుద్దబడిన మార్కెట్ను నిరాకరిస్తూ తమ జల్, జంగల్, జమీన్లను వాటితో పాటు తమ స్వయం పాలనను కాపాడుకునే పోరాటాలు ఈస్ట్ ఇండియా పాలన కాలం నుంచే చేస్తున్నాయని గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనైతే ఇండియన్ యూనియన్ నుంచి విడివడడానికి ఈ పోరాటాలు ఇప్పటికీ సాయుధంగానే కొనసాగుతున్నాయి. ఒక గ్రూప్ కేంద్రానికి లొంగిపోయినా మరొక చిన్న బృందమైనా తమ స్వతంత్రం కోసం ప్రతిఘటించే స్థితిని మనం మణిపూర్ వంటి ప్రాంతాల్లో చూడవచ్చు.

మణిపూర్ ఆదివాసుల పోరాటం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నిర్మాణం చేసుకునే దశకు ఎన్నడో చేరుకున్నది. అక్కడ సైన్యానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చే చట్టాన్ని రాజీవ్గాంధీ ప్రధానిగా ప్రవేశపెట్టిన నాటి నుంచి అక్కడి మహిళలు ముందు భాగాన నిలిచి వీరోచిత పోరాటాలు చేశారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఇరోం షర్మిలా చేసిన పదహారు సంవత్సరాల నిరాహార దీక్షను కూడా ఒక పోరాట రూపంగా గుర్తించిన మణిపూర్ ప్రజలు అందుకే ఆమె ఎన్నికల దారిని ఎంచుకునే వరకు కేవలం 72 ఓట్లు మాత్రమే వేసి ఆ పద్ధతిని నిరాకరించారు.

నాగాలాండ్ ఉద్యమం అయితే తమదైన ఒక స్వతంత్ర రాజ్యాన్ని సోషలిస్ట్ లక్ష్యంతో ఏర్పర్చుకొని ప్రధాని, సైన్యం వంటి అన్ని హంగులతో నడుపుకొని ఇండియన్ యూనియన్ ప్రధాని వాజ్పేయ్ కాలంలో సమాన స్థాయిలో విదేశాల్లో చర్చలు చేశారు.

ఈశాన్య రాష్ట్రాల విషయంలో గాని, కశ్మీర్ విషయంలో గాని ఇవాళ పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్న వాళ్లు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు గాని చారిత్రకంగా వాటి స్వయం ప్రతిపత్తిని గుర్తించక తప్పని స్థితికి కేంద్రంలోని ప్రతి ప్రభుత్వం ఇవాళ్టికీ నెట్టబడుతున్నది.

కశ్మీర్ విషయంలో నెహ్రూ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికే స్వయం నిర్ణయాధికారానికి హామీ పడింది. ఆచరణలోనేమో కశ్మీర్తో సహా ఈశాన్య రాష్ట్రాలంతటా సైనిక పాలన కొనసాగుతున్నది. మారణకాండ కొనసాగుతున్నది. అణచివేత, దౌర్జన్యం, హింస రచన రీత్యా చూసినప్పటికి కూడా ఇండియన్ యూనియన్ విదేశాల మీద దాడి చేసినంతగా ఈ రాష్ట్రాలలో రాజ్యహింసను అమలు చేస్తున్నది.

బుర్హాన్ వలి ఎన్కౌంటర్ కాలం నుంచి శ్రీనగర్ ఎన్నికల దాకా కేంద్రం, సైన్యం అనుసరించిన దమననీతి, ప్రజల ప్రతిఘటన ఆరు శాతం, రెండు శాతం ఓట్లతో, సైనిక ట్యాంకర్కు సైన్యం రక్షణ కోసం తాము చిత్రహింసలు పెట్టిన కశ్మీరీ యువకుడి దేహాన్ని కట్టుకొని వీథుల్లో స్వైర విహారం చేసే స్థితిని చూస్తే అక్కడి ప్రజల ఆజాదీ ఆకాంక్ష ఎంత బలమైనదో అర్థమవుతుంది.

సైన్యం నిర్వహిస్తున్న మారణకాండ, అత్యాచారాలు, దౌర్జన్యాలకు నిరసనగా యువకులు చేసిన దాడిలో ఒక సైనికుడు చనిపోతే ఇవాళ దేశమంతా కశ్మీరీ యువకులపై జరుగుతున్న దాడిని చూస్తే ఇండియన్ యూనియన్లోని సగటు మానసికత కశ్మీరీ ప్రజల పట్ల వాళ్లు, మనం అనేదే తప్ప మరొకటి కాదు.

1948 నుంచి డెబ్భై సంవత్సరాలుగా సాగుతున్న ఆజాదీ పోరాటానికి నక్సల్బరీ పంథాను అనుసరిస్తున్న విప్లవ పార్టీలు మాత్రమే మద్దతు ప్రకటిస్తున్నాయి.

దేశాలు స్వాతంత్య్రాన్ని కోరుతాయి. జాతులు విముక్తిని కోరుతాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతారు. ఈ మూడు సందర్భాల్లోనూ, దశల్లోనూ కార్మికవర్గం నాయకత్వం వహించినప్పుడు అవి దశల వారీగా విప్లవోద్యమంలో భాగమవుతాయని మావో సె టుంగ్ చేసిన పరిశీలనయే నక్సల్బరీ పంథాకు గీటురాయి. వియత్నాం పోరాటం అందుకు ఒక చక్కటి ఉదాహరణ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-51), 1971 బంగ్లాదేశ్ పోరాటం అటువంటి గుణాత్మక మార్పులోకి ప్రవేశించకుండా నెహ్రూ, ఇందిరాగాంధీ పోలీసు చర్య పేరుతో, ముక్తి ఫౌజ్ పేరుతో చేసిన సైనిక జోక్యం, దాడి ఫలితాలే అక్కడ ప్రజాస్వామిక విప్లవాలు అసంపూర్ణంగా మిగిలిపోవడం.

1974లో చీలిపోయిన ఎంఎల్ పార్టీలను, ముఖ్యంగా ఎంఎల్ పార్టీ ఏర్పడినప్పుడు కేంద్ర కమిటీలో ఉన్న వాళ్లందరినీ ఒకచోటికి తేవాలనే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ నాయకత్వం చొరవతో సిపిఐ (ఎంఎల్) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడినప్పుడు అందులో కశ్మీర్ నుంచి ష్రాఫ్ చేరాడు. కాని ఆ సిఒసియే ఎక్కువ కాలం మనలేదు.

స్వీయాత్మక శక్తుల కొరత వల్ల కూడా కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో విప్లవ పార్టీల నిర్మాణం నిర్దిష్టంగా ఏర్పడలేదు. అక్కడి జాతివిముక్తి ఉద్యమాలు భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలుగా నిర్వహించడానికి ఏమేరకైనా ప్రయత్నం చేసే శక్తులకు దోహదం ఇచ్చేవిగానే అక్కడి విప్లవ పార్టీ కార్యాచరణ ఉంటున్నది. జాతి విముక్తి ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకునేదిగానే ఉంటున్నది.

1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం జాతుల సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సదస్సు, బహిరంగ సభ ఈ ప్రయత్నంలో ఒక బలమైన అడుగు. ఆ సందర్భంలో వచ్చిన పత్రాలన్నీ ఇంగ్లిష్, హింది పుస్తక రూపంలో కూడా వచ్చాయి. విప్లవోద్యమాన్ని బలపరిచే ఎఐపిఆర్ఎఫ్, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారం కోసం ఉద్యమిస్తున్న శక్తులు, ముఖ్యంగా హురియత్ కలిసి ఒక సమన్వయ కమిటీ కూడా ఏర్పడింది. కాని ఆ తరువాత తగినంత స్వీయాత్మక శక్తులు లేకపోవడం వల్ల అది ముందుకు సాగలేదు.

పీపుల్స్వార్ పార్టీగా పార్టీ స్థాయిలో నాగాలాండ్, మణిపూర్లలో నిర్మాణం కోసం కృషి చేసి అక్కడి జాతివిముక్తి సాయుధ పోరాటాలు నిర్వహిస్తున్న శక్తులతో సంయుక్త కార్యాచరణ రూపొందించుకున్న దశ కూడా 1990లలో కనిపించింది. కాని తీవ్రమైన రాజ్యహింసతో అది సెట్బ్యాక్కు గురైంది.

నక్సల్బరీ పంథాలోనే ఇమిడి ఉన్న అంశమేమిటంటే అది ఆచరణలోకి వచ్చిన ప్రాంతాలను, సామాజిక వర్గాలను చూసినప్పుడు గాని, అది పిలుపు ఇచ్చిన ప్రకారం గాని అది సాంఘిక చోదక శక్తిగా, ఆదివాసి, దళిత, అణగారిన వర్గాల విముక్తి మార్గం. నక్సల్బరీ, శ్రీకాకుళం, వైనాడ్ వంటి ఆదివాసి అడవి ప్రాంతాల్లో సాయుధ పోరాటంగా అది ప్రారంభం కావడం, విప్లవ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి వెళ్లే విద్యార్థులను, యువకులను దళితుల ఇళ్లల్లోనే ఉండి ప్రచారం చేయాలని చెప్పడం నక్సల్బరీ కాలం నుంచి గ్రామాలకు తరలండి పిలుపు దాకా ఒక కొనసాగింపుగా చూశాం.

ఈ వ్యవస్థను అర్ధవలస, అర్ధ భూస్వామ్యం అని నిర్వచించడంలోనే వెనుకబాటుతనం గురించి కులం, మతంపై అగ్రవర్ణాల, దళారీ వర్గాల పట్టు గురించి చెప్పినట్లయింది. పైగా ఎం.ఎల్. పార్టీ తీర్మానంలో అస్పృశ్యత ప్రస్తావన ఉన్నది.

భౌతిక వాస్తవికత కూడా నక్సల్బరీ విప్లవం ప్రారంభమైన కాలంలోనే దక్షిణాన మద్రాస్ రాష్ట్రంలో కిలవేన్మణి ప్రాంతంలో దళితుల దహనకాండ జరిగింది. నలభై దళితుల గుడిసెలను అగ్రవర్ణాలు బయటి నుంచి గొళ్లాలు పెట్టి తగులబెట్టారు. ఆ గుడిసెల్లోని దళిత కుటుంబాలన్నీ సజీవ దహనానికి గురయ్యాయి. అగ్రవర్ణాలు అంత బీభత్సంగా వ్యవహరిస్తాయని నమ్మలేకపోతున్నామని న్యాయవ్యవస్థ వాళ్లను నిర్దోషులుగా తీర్పు చెప్పింది. దళిత శ్రేణులు ఎక్కువగా కలిగిన విప్లవ పార్టీ ఆ అగ్రవర్ణాలపై చర్య తీసుకొని శిక్ష విధించింది. ఇందిరా పార్థసారథి, మీనా కందసామి ఈ ఘటన మీద నవలు రాశారు.

అడవిలో ఆదివాసులు గాని, మైదాన ప్రాంతంలో దళితులు గాని భూస్వాధీనం కోసం చేసే పోరాటాలు భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా చేస్తున్నాయంటే అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా చేస్తున్నాయని అర్థం. అయితే తొలిరోజుల్లో వ్యవసాయ కూలీలుగా, భూమిలేని నిరుపేదలుగా దళితుల గురించి విప్లవోద్యమ రాజకీయ పత్రాల్లోనూ, కార్యక్రమాల్లోనూ ఉన్నంత ప్రస్తావన దళితులుగాను, సాంఘికంగా స్వీయ గౌరవం కోరుకుంటున్న అంటరానివారుగాను లేకపోవడం ఒక లోపం.

రాజకీయార్థిక పరిభాషలో దళితులను వ్యవసాయ కూలీలుగా, భూమిలేని నిరుపేదలుగా విశ్లేషించి వర్గపోరాటంలోకి తెచ్చినంతగా బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ వివక్షతో అంటరానివారుగా, స్వీయ గౌరవం కోసం పోరాడుతున్న వారుగా చూడకపోవడం ఒక లోపం.

క్షేత్రస్థాయిలో వాస్తవమేమిటంటే గ్రామాల్లో భూపోరాటమంతా పెత్తందారీ అగ్రవర్ణాలతోటే జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల అది రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రకులాలకు వ్యతిరేకంగా. భూమిగాని, ఆస్తిగాని ఎక్కువగా భూస్వామ్య వర్గాలుగా వాళ్ల చేతుల్లోనే ఉన్నది.

ఉపరితల అంశాల్లోకి వస్తే ఈ అగ్రవర్ణాల వారి పిల్లలందరూ విద్యాలయాల్లో పాలకవర్గాల పార్టీల విద్యార్థి సంఘాల్లో ఉన్నారు. ముఖ్యంగా అందులో మిలిటెంట్ స్వభావం ఉన్న ఎబివిపిలో ఉన్నారు. దళితుల, ముస్లిం మైనారిటీల, అణగారిన వర్గాల, కులాల పిల్లలందరూ నక్సల్బరీ తరువాత విప్లవ విద్యార్థి సంఘాల్లో ఉన్నారు. నక్సల్బరీకి సమాంతరంగా ఈ రెండు విద్యార్థి వర్గాల మధ్యన భావఘర్షణలు, భౌతిక ఘర్షణలు అదే స్థాయిలో మొదలయ్యాయి.

ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి హత్య ఈ ఘర్షణలకు ఒక స్పష్టమైన వ్యక్తీకరణ. వరంగల్ ఆర్ఇసి, కెఎంసిలలో సూరపనేని జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు వంటి వాళ్లు అటువంటి పోరాటాలు ప్రారంభించారు. ఇంక ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు క్షేత్రస్థాయిలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను స్పష్టంగా ఇందులో ఇమిడి ఉన్న వర్గ, కుల ఘర్షణను ముందుకు తెచ్చాయి. ఇది సాంస్కృతిక పరంగా ఎంతో ఎక్కువగా ప్రతిఫలించిన వ్యక్తీకరణయే ʹఊరు మనదిరా, వాడ మనదిరాʹ పాట. ʹకాళ్లకింది మట్టి కంట్లో ఎగసి పడిందʹనే మాట. ఏ ఇంట్లో కోడి కూసినా దొర ఇంట్లోనే తెగాలి వంటి భావగర్భితమైన దోపిడీ, అత్యాచారాల గురించిన వ్యక్తీకరణ. వీటికి వ్యతిరేకంగానే అశేష పీడిత వర్గాలు కదిలాయి.

రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రైతు కూలీ సంఘం, జననాట్యమండలి వంటివి ఇటువంటి స్వీయ గౌరవ పోరాటాలను, కుల నిర్మూలన పోరాటాలను వర్గ పోరాటంలో భాగంగా 1985 వరకు అపూర్వంగా నిర్వహించాయి. లోపం ఎక్కడ జరిగిందంటే ఈ పోరాట ఆచరణనంతా ఒక రాజకీయార్థిక పోరాటంగా తప్ప సాంఘిక, సాంస్కృతిక పోరాటంగా సైద్ధాంతీకరించక (కాన్సెప్చువలైజ్ చేయక) పోవడంలో ఉంది.

ఆ అవసరమే కావచ్చు, అవకాశమే కావచ్చు కారంచేడు కల్పించింది. కారంచేడు దళితులపై అగ్రవర్ణాల దాడి, మారణకాండ దళితుల స్వీయ గౌరవ పోరాటాన్ని ముందుకు తెచ్చింది. పీపుల్స్వార్ పార్టీ నాయకత్వంలో ఈ అగ్రవర్ణాల దాడిని దళితులు మిలిటెంట్గా ఎదుర్కొని హంతకునిపై చర్య తీసుకొని శిక్షించారు. కిలవేన్మణి నుంచి కారంచేడు ఒక గుణాత్మక దశకు చేరుకున్నది.

సరిగ్గా ఇదే కాలం విప్లవోద్యమంలో జెండర్ సమస్య కూడా వచ్చింది. 1980ల ఆరంభంలో ఐక్యరాజ్య సమితి 80వ దశాబ్దాన్ని జెండర్ దశాబ్దంగా ప్రకటించింది. 1980 పీపుల్స్వార్ ఏర్పడి ప్రజాయుద్ధానికి పిలుపు ఇచ్చి దండకారణ్యంలో ప్రవేశించిన కాలం. ప్రజాపంథా చేపట్టి మిలిటెంట్ ప్రజా ఉద్యమాలు నిర్మించిన కాలం. 1985 నాటికి దానిపై తీవ్రమైన నిర్బంధం వచ్చింది. కేంద్రంలోని రాజీవ్గాంధీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఎన్టిఆర్ ప్రభుత్వం అమలు చేసిన రాజ్యహింస గురించి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇక్కడ చెప్పుకోవలసిందల్లా ఇది 1991లో బయటపడిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణలకు డ్రెస్ రిహార్సల్ జరిగిన కాలం. ఇటువంటి ప్రయత్నం ఒకటి ప్రపంచబ్యాంక్ ఎమర్జెన్సీ కాలంలోనే చేసింది. 1984 నుంచి మాత్రం దానికి కొనసాగించే అవకాశం వచ్చింది.

ఇంద్రవెల్లి మారణకాండ తరువాత విప్లవోద్యమం అడవిలో విస్తరించే కాలంలో తునికాకు పోరాటం ఒక విశాల ప్రజాపోరాటంగా అడవి, మైదానాలను కలిపింది. తునికాకు ఏరడం నుంచి బీడీలు చేసే దాకా ఆదివాసులు, మైదాన ప్రాంత బడుగు వర్గాలు కుటుంబాలుగా ఈ పోరాటంలో పాల్గొన్నాయి. కుటుంబాలు అన్నప్పుడు ఎక్కువగా స్త్రీలు, పిల్లలు. అట్లాగే భూపోరాటంలో వ్యవసాయ కూలీలన్నప్పుడు ఎక్కువగా దళిత స్త్రీలు, పిల్లలు. కనుక దళిత, బడుగువర్గాల కుటుంబాలు ఆశ్రయం ఇచ్చే వాళ్లుగా మాత్రమే కాకుండా పోరాట భాగస్వాములు అయ్యారు. అంతర్గతంగా విప్లవోద్యమం జెండర్ సమస్యను ఇట్లా ముందుకు తెచ్చింది.

ఎన్టిఆర్ బిసి రిజర్వేషన్ను 40 శాతానికి పెంచిన సందర్భంగా, తిరిగి మండల్ కమిషన్ సందర్భంగా దళిత ఉద్యమం ఒక అస్తిత్వ ఉద్యమంగా ముందుకు వచ్చింది. 1992లో నిషేధానికి గురయ్యే దాకా పీపుల్స్వార్ గాని, నేరుగా పీపుల్స్వార్ కార్యక్రమాన్ని ప్రచారం చేసి, బహిరంగంగా ఆచరించే ప్రజాసంఘాలుగా ఆర్ఎస్యు, ఆర్వైఎల్, రైతుకూలీ సంఘం, సికాస గాని నిషేధానికి గురయ్యే దాకా ఇటువంటి స్వీయగౌరవ, అస్తిత్వ పోరాటాలన్నీ వర్గపోరాటంలో భాగంగానే జరిగాయి.

1985 నుంచి 89 దాకా అప్రకటిత నిషేధానికి గురైన విప్లవ ప్రజాసంఘాలు 1991 సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, 1992 బాబ్రీ మసీదు విధ్వంసంతో పాటు వచ్చిన నిషేధంతో బహిరంగంగా ప్రజల మధ్య పారదర్శకంగా పనిచేయలేని స్థితి వచ్చింది.

సరిగ్గా ఇదే కాలంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అస్తిత్వ ఉద్యమాలను, ముఖ్యంగా దళిత ఉద్యమాన్ని విప్లవోద్యమానికి కేటాగా నిర్వహించే శక్తులకు దోహదం చేసింది. చుండూరు మారణకాండ తరువాత కారంచేడు వంటి చొరవ విప్లవోద్యమానికి సాధ్యం కాని స్థితిని రాజ్యం కల్పించగలిగింది. చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.

విప్లవోద్యమం అస్తిత్వ ఉద్యమాలను, ముఖ్యంగా దళిత ఉద్యమాన్ని అస్పృశ్యతకు వ్యతిరేకంగా, స్వీయగౌరవానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా గుర్తించి, గౌరవించి విప్లవోద్యమంలో ఒక క్రియాశీలమైన నినాదంగా, కార్యాచరణగా మార్చడం జరగాల్సి ఉన్నది. దళిత అస్తిత్వ ఉద్యమం భూస్వాధీన పోరాటాలు, కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనే పోరాటాలు మిలిటెంట్గా చేపట్టాల్సి ఉన్నది.

దళితులకు రాజ్యాధికారం ఓటు ద్వారానే సిద్ధిస్తుందనే భ్రమ నుంచి వర్గపోరాటంలో భాగంగానే కుల నిర్మూలన పోరాటాలు నిర్వహించబడాల్సి ఉంటుందని, అందుకు ప్రాతిపదిక స్వీయగౌరవంతో పాటు భూస్వాధీన పోరాటం కావాలని గ్రహించాల్సి ఉంటుంది. దళితులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా ఆ వాస్తవాన్ని గుర్తిస్తున్న సందర్భం ఉనా సంఘటనతో ఏర్పడింది.

ఒక విధంగా ఉనా సంఘటన, లేదా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్లాఖ్ హత్యతో మొదలై గోవధ, గొడ్డు మాంసం తినడం అనే పేరుతో ముస్లింలతో మొదలై, దళితులపై సంఘ్ పరివార్ శక్తులు సాగిస్తున్న మారణకాండ వీళ్లను ఏకం చేస్తూ, స్వీయగౌరవంతో పాటు భూస్వాధీన పోరాట గుర్తింపును ముందుకు తెచ్చింది.

ఈ గుర్తింపు భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో విప్లవోద్యమంలో సంలీనం అయి దళితుల స్వీయ గౌరవ, అంటరానితనానికి వ్యతిరేకంగా వర్గపోరాటంలో భాగంగా కొనసాగాల్సి ఉందనే అవగాహన దృఢం కావడానికి దోహదం చేయాలి. ఆ కృషి ఇరువైపులా సాగాలి.

ముస్లిం, మైనారిటీలను విప్లవోద్యమంలో భాగం చేయడంలో నక్సల్బరీ పంథా ఈ యాభై ఏళ్ల కాలంలోను చేయవలసినంత చేయలేదనేది స్వీయ విమర్శ చేసుకోవాల్సిన అంశం. బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ మారణకాండ సందర్భంగా బాధిత ముస్లిం సమాజానికి విప్లవ పార్టీలు గాని, వాటి ప్రజాసంఘాలు గాని ఎంత అండగా నిలబడినప్పటికీ వారిని తమలో సంలీనం చేసుకోలేకపోయాయి. బాధితులుగా ముస్లింలు విప్లవోద్యమాన్ని సేవియర్ (రక్షకులు)గానే చూశారు గాని అందులో భాగం కాలేకపోయారు.

మైనారిటీ మతానికి ఉండే ఒక అభద్రతా భావం, దేశంలో రెండో పౌరులుగా చూడబడుతుండడం వల్ల ఏర్పడే ఒక ముడుచుకునే స్వభావం, మత విశ్వాసాలు ఇందుకు కారణమైనా అవిభక్త కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన కాలంలో విశేషంగా ముస్లింల విశ్వాసాన్ని చూరగొన్న స్థితి నుంచి విప్లవ పార్టీ నిర్మాణ కాలానికి కారణాలేమైనా బలహీనపడడమే కనిపిస్తున్నది.

ముస్లిం మత నాయకత్వం పేద ముస్లిం ప్రజలను, శ్రేణులను తమ గుప్పిటలో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అశేష ముస్లిం ప్రజానీకానికి క్యాపిటలిజం ఎంత శత్రువో కమ్యూనిజం అంత శత్రువు అని చెప్తూ ఇస్లాం మాత్రమే విముక్తి మార్గమని చెప్తున్నది. ముస్లిం యువత అందుకే అటువంటి మిలిటెన్సీకి, ఇస్లాం రాజ్యానికి ఆకర్షింపబడినంతగా తమను విముక్తి చేయగల విప్లవోద్యమం వైపు ఆకర్షింపబడడం లేదు.

క్షేత్రస్థాయి వాస్తవం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా చమురు, ప్రకృతి సంపదలు కలిగినందు వల్ల ఆదివాసుల తరువాత సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు ఇస్లాం మతస్తులుగా భావించబడుతున్న ముస్లిం దేశాల ప్రజలే. సహస్ర వృత్తుల, సమస్త చిహ్నాలతో శరీర శ్రమలో పాల్గొనే పీడిత, పోరాట ప్రజలుగా కూడా ముస్లింలు బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు. ముఖ్యంగా ఈ అనుకూలాంశం వల్ల విప్లవోద్యమం వీళ్లను నిర్మాణంలోకి తెచ్చే విషయంలో కేంద్రీకరించాల్సి ఉంది. 1990వ దశకం ఆరంభంలో తప్ప అటువంటి కృషి జరగలేదు.

2007లో మావోయిస్టు పార్టీ ఐక్య కాంగ్రెస్లో ప్రజల ముందు ఉంచిన రెండు మిలిటెంట్ కార్యక్రమాల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణను ప్రతిఘటించడం అనే మొదటి కార్యక్రమంతో పాటు, బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులను ప్రతిఘటించాలన్న రెండో కార్యక్రమం ఇంకా ఆచరణ రూపానికి రావాల్సే ఉన్నది.

ట్రంప్, మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అటు సామ్రాజ్యవాద ఫాసిజాన్ని, ఇటు బ్రాహ్మణీయ హిందు ఫాసిజాన్ని విశ్లేషించి, నిర్వచించిన మావోయిస్టు పార్టీ దేశంలో అధికారంలో ఉన్న బ్రాహ్మణీయ హిందు ఫాసిజాన్ని మిలిటెంట్గా ప్రతిఘటించే ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సే ఉన్నది.

కారణాలు ఎన్ని ఉన్నా ఈ స్వీయాత్మక ఆకాంక్షకు పెద్ద ప్రతిబంధకం గా ఉన్నది మాత్రం విప్లవ నిర్మాణ కార్యాచరణను బహిరంగంగా, పారదర్శకంగా చేపట్టే విప్లవ ప్రజాసంఘాలు లేపోవడమే. నక్సల్బరీ, శ్రీకాకుళాలు సెట్బ్యాక్కు గురైన కాలంలో విరసం, జననాట్యమండలి మొదలు 1980లలో ఎఐఎల్ఆర్సి, ఎఐపిఆర్ఎఫ్లు దేశవ్యాప్తంగా నిర్వహించగలిగిన కనీస కర్తవ్యాలను ఇవాళ నిర్వహించడానికి ఒక విప్లవ ప్రజాసంఘం కూడా లేదు.

రెండు రాష్ట్రాల్లో విరసం, దేశవ్యాప్తంగా ఉండీ లేని ఆర్డిఎఫ్ తప్ప ఇవాళ నేరుగా, ప్రత్యక్షంగా ప్రాపంచిక దృక్పథ ప్రచారాన్ని, ప్రజాయుద్ధ ప్రచారాన్ని చేసే ఒక విప్లవ ప్రజాసంఘం లేకపోవడమే ఒక కొరత.

ప్రత్యామ్నాయ రాజకీయం తాను వచ్చిన కులాన్ని, మతాన్ని, వర్గాన్ని రద్దుచేసుకొని, సాంఘిక వ్యక్తిత్వాన్ని రద్దుచేసుకొని విప్లవ సమష్టిలో భాగమైన నూతన స్వరూపాన్ని సంతరించుకుని విప్లవమే చిరునామాగా మారింది. విప్లవంలో కొనసాగినంత కాలం అంతర్ బాహిర్ యుద్ధాన్ని నిర్వహిస్తూనే విప్లవకారులుగా ఈ లక్ష్యం కోసం నక్సల్బరీ కాలం నుంచి ఈ యాభై ఏళ్ల కాలంలో ఎందరు అమరులయ్యారో. అట్లా అమరులు అయినప్పుడు మాత్రమే వాళ్లు మళ్లీ తమ ఊరు, పేరులతో నలుగురికి తెలుస్తున్నారు, గుర్తింపబడుతున్నారు. అంటే విలువలు, జీవనశైలి, ప్రజల్లో మమైక్యం కావడం, ఈ రాజకీయ లక్ష్యం కోసం అన్నిటికంటే విలువైన ప్రాణాలు ఇవ్వడం అనేది నక్సల్బరీ పంథా నెలకొల్పిన ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ సంస్కృతి.

ఈ రాజకీయ క్రమం బయట ఉండే బూర్జువా రాజకీయ జీవనశైలికి పూర్తిగా భిన్నమైనది. వృత్తి విప్లవకారులందరు అజ్ఞాత జీవితంలో ఉండడం పార్టీ నాయకత్వం పూర్తిగా ప్రజల్లోను, బేస్ ఏరియాల నిర్మాణం దృష్ట్యా అడవిలోను ఉండడం ఒక నియమంగా అమలవుతున్నది. అంటే, వ్యక్తిగత ఆస్తి రద్దు చేసుకొని, వ్యక్తిగత గుర్తింపు రద్దు చేసుకొని, ఊరు, పేరు, ఆవాసం అన్ని మార్చుకొని నుదుటిపై మరణశాసనం రాసుకొని ప్రజల కోసం విప్లవంలోకి దూకడం అనే ఒక కఠిన నియమాన్ని విప్లవకారులు అనుసరిస్తున్నారు. ఇది ఇవాళ ఎన్నికల రాజకీయాల జీవనశైలికి పూర్తి భిన్నమైన ప్రజా ప్రత్యామ్నాయం. ఎన్నికల రాజకీయాలు ఒక పంచాయితీ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ఆస్తి సంచయంగా మారినవి. అవినీతిగా మారినవి. ఆశ్రిత పక్షపాతంగా మారినవి. అక్రమంగా మారినవి. హింస, దౌర్జన్యం, పెత్తనంగా మారినవి. ఒక్కమాటలో ఆధిపత్య భావజాలంగా మారినవి.

అందుకే చారు మజుందార్ ఇది త్యాగాల, బలిదానాల యుగం అన్నాడు. శత్రువు కూడా ఈ విలువ ప్రమాణంగా నక్సల్బరీ రాజకీయాల గురించి మాట్లాడేవారిని, ఆ రాజకీయాలు ఆచరించేవారిని విమర్శించే స్థితి ఉండడమనేదే నక్సల్బరీ రాజకీయాలకు ఉన్న ఒక ప్రాసంగికత. ఒకప్పుడు ఒక కమ్యూనిస్టును సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవారు. ఇవాళ ఒక మావోయిస్టును అట్లా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారు. ఆ ప్రత్యేకత కనిపించకపోతే అది ఒక లోపంగా చర్చిస్తున్నారు. నక్సల్బరీ నెలకొల్పిన ఒక ఉన్నతమైన ప్రమాణం అది. నూతన మానవావిష్కరణ అనేది నక్సల్బరీ ఆకాంక్ష ఆ నూతన మానవావిష్కరణ అనే ప్రమాణానికి ఏమాత్రం భిన్నంగా ఉన్నా ప్రజలే కాదు శత్రువు కూడా ఒక సాకుగా చూపే ప్రత్యామ్నాయ విలువను నక్సల్బరీ ప్రతిపాదించింది. జనతన సర్కార్ ఆచరణ సందర్భంగాను, చర్చ సందర్భంగాను ఈ నూతన మానవావిష్కరణ నూతన ప్రజాస్వామిక విప్లవ విలువగా ఇవాళ విస్తృతంగా చర్చలో ఉన్నది.

ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆటుపోట్లతోనైనా సరే మానవ జీవన పార్శ్వంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తూ, సమాజంలోని సకల రుగ్మతలకు ఒక శాస్త్రీయమైన శస్త్ర చికిత్సగా నక్సల్బరీ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రాజకీయ పంథా ఇవాళ దేశవ్యాప్తంగా ఎంత బీజరూపంలోనైనా సరే పాదాల కింద నలుగుతూ తలెత్తుతున్న గడ్డివేళ్లు చిగురిస్తున్న నూతన అంకురాల వలె, మరణిస్తున్న విత్తనం హామీ పడుతున్న నూతన సృష్టి వలె పునర్నవిస్తూనే ఉన్నది.
- వరవరరావు
(రచయిత విరసం వ్యవస్థాపక సభ్యులు)

Keywords : virasam, varavararao, naxalbari, maoists, revolution
(2024-04-27 09:46:09)



No. of visitors : 4480

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నక్సల్బరీ