రాజా కవి సినారె - పాణి

రాజా

ఒకసారి ఏబీఎన్‌ చానల్‌ ఇంటర్వ్యూలో ʹమీరు తెలంగాణ వాళ్లయి ఉండీ ఎందుకు విప్లవ సాహిత్యం వైపు తొంగి చూడలేదు?ʹ అని సి.నారాయణరెడ్డిని అడిగారు. దానికాయన ʹనేను రాజకీయ కోణంలో ఎప్పుడూ చూడలేదు... నాది ప్రగతిశీల మానవతావాదంʹ అన్నారు. ఈ ఇంటర్వ్యూను సినారె మరణించిన రోజు ఆంధ్రజ్యోతి పునర్ముద్రించింది.

ఇది తెలిసిన వాళ్లు సినారె రాజకీయ కవి అంటే ఒప్పుకోకపోవచ్చు. కానీ ఈ మాట ఆయనకు నూరుశాతం సరిపోయేదే. నారాయణరెడ్డి విస్తారమైన సాహిత్య జీవితం గడిపారు. పూర్ణ జీవితం గడిపి వెళ్లిపోయారు. జననం ముదావహం అన్నట్లు మరణం బాధాకరం. ఆయనతో వ్యక్తిగత సాన్నిత్యం ఉన్న వాళ్లకు ఆ వెలితి తెలుస్తుంది. రచన తనకు దినచర్య అని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. అలాగే రాశారని అంటారు. సాహిత్యజీవులకు ఇది ముచ్చటగొలిపేదే. ఆయన డజన్ల కొద్ది పుస్తకాలు రాశారు. వేలాది సినిమా పాటలు రాశారు. వీటన్నిటి ఆధారంగా కవిగా నారాయణరెడ్డి ఏమిటి? అనే ప్రశ్న తప్పక ఎదురవుతుంది.

అయితే ఇదంతా అక్కర్లేకుండానే ఆయన రాజకీయ కవి అని టక్కున, సూటిగా చెప్పవచ్చు. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు రాజకీయాలనే మాట రాగానే నక్సలైట్‌ రాజకీయాలే గుర్తుకు వస్తాయి. నారాయణరెడ్డి అచ్చమైన పాలకవర్గ రాజకీయ కవి. రచయితలు పాలక పక్షాన ఉన్నంత మాత్రాన రాజకీయ నాయకుల్లాగా ఎదురుబొదురు నిలబడి ప్రజలకు నష్టం కలిగించరు. కలిగించలేరు. వాళ్ల భావాలు ఏ వర్గానికి మేలు చేసేలా ఉన్నాయి? ఎంచుకున్న జీవన చట్రం ఏ వర్గానికి దగ్గర్లో ఉంది? ఏ వర్గ కార్యకలాపాలకు అనుబంధంగా ఉంది? అనేవే ముఖ్యం. ఈ అర్థంలో ఆయన పాలకవర్గ పక్షాన ఉన్న కవి. దీనికి అటూ ఇటూ ఎన్నయినా చమత్కరించవచ్చుగాక. సున్నితమైన మాటలేవో చెప్పి గడ్డు విషయం మరుగునపరచవచ్చుగాక. కోర్‌ పక్కకు పోయి అంచుల్లోనివి ప్రధానం చేయవచ్చుగాక.. మన మురిపెం కోసం కవిగా ఆయన గురించి ఇంకేదో మాట చెబితే అది ఆయనకూ, ఆయన జీవన విధానానికి తీవ్ర అపచారమే. ఇది మాత్రం నిక్కం. ఎంతగానంటే సినిమా గొప్ప జనరంజక మాధ్యమమైనా అందులో హీరో, హీరోయిన్ల గురించి తెలిసినంతగా పాటలు రాసినవాళ్ల గురించి ʹమాస్‌ʹకు తెలియదు. సినిమా సంస్కారం ఎక్కువగా ఉన్న వాళ్లకే గాయకులు, పాటల రచయితల గురించి తెలుస్తుంది. ఆ రకంగా నారాయణరెడ్డి అంటే పాటల రచయిత అని సినిమా ʹమాస్‌ʹకు ఎంత తెలుసోగాని అందరికీ ఆయన ప్రభుత్వ కవి అని మాత్రం తెలుసు. సినిమా పాపులారిటీ వల్లనో, లేక సినిమా వాళ్లే రాష్ట్రాధినేతలు కావడం వల్లనో, వాళ్ల దగ్గర మిగతా సినిమా రచయితల కంటే ఎక్కువ ప్రాపకం ఉన్నందువల్లనో గాని సినారె ప్రభుత్వానికి చేరువయ్యారు. మెల్లగా అందులో భాగమయ్యారు. ఒక కవికి ప్రభుత్వం నుంచి రాగల అన్ని హోదాలు వచ్చినవారెవరయ్యా అంటే తెలుగులో చప్పున చెప్పగల పేరు సినారె. ఇందులో ఆయనకు సాటి రాగల వారెవరూ లేరు. ప్రభుత్వం నుంచి ఆయన ఎంత తీసుకోవాలో అంతా తీసుకున్నారు. ఆ విషయం మర్చిపోకుండా ఆయన సమాజానికి ఇచ్చిన కవిత్వాన్ని కూడా వాటితో కలిపి అర్థం చేసుకోవాలి.

సినారె సినిమా కవిగానే ఇదంతా సంపాదించుకొని ఉంటే మనకే ఇబ్బందీ లేదు. సినిమా, రాజ్యం మేలు కలయిక అని సరిపెట్టుకునే వాళ్లం. కానీ ఆయనకు తెలుగు సాహిత్యంతో సంబంధం ఉన్నది. అందువల్ల ఆ వైపు నుంచి కూడా సినారె అంటే ఏమిటి? అనే ప్రశ్న తప్పడం లేదు. చాలా విచిత్రం ఏమంటే ఆయన బతికి ఉన్నన్ని రోజులూ సీరియస్‌ తెలుగు సాహిత్యంలోని ఏ స్రవంతికీ కవిగా సినారె ఏమిటి? అనే ప్రశ్నే తలెత్తలేదు. అంతగా ఆయన ఆ ప్రపంచానికి దూరం. తెలుగు సాహిత్యంలో ఎన్ని ధోరణులు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని కతలు..? ఈ మొత్తంలో దేనికి చెందని వాడు కాబట్టి కవిగా సినారె ఏమిటనే ప్రశ్నే ఎవ్వరికీ అవసరం లేకపోయింది. రాజకీయంగా ప్రభుత్వ కవి అని సరిపెట్టు కున్నారు. బహుశా ఆయన రాజకవి అని పట్టించుకోవడం మానేశారు. అంత పెద్ద తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా ఈ రాజకవిని కదిలించలేదు. ʹరాజ్యమేʹ తెలంగాణ హోరుకు కదిలింది కాని రాజును మించిన ఈ రాజభ్త కవి ఎన్నడూ ఎరగాని మాట తెలంగాణ గురించి మాట్లాడలేదు. (సినారె కంటే రాజకవులు తెలంగాణలో ఇప్పుడు ఎక్కువైపోయారు కాబట్టి కొంపదీసి వాళ్లంతా ఇప్పటికే తెలంగాణకు సినారె చేసిన సేవల మీద సభలు నిర్వహించారేమో. పుస్తక రచనలో కూడా ఉన్నారేమో. ఈ మారుమూల భూఖండం మీద ఉన్న నాకు ఆ వివరాలేవీ తెలియవు).

అయినా కవిగా సినారె ఏమిటి అనే మాటకు రాజకీయ కవి, ప్రభుత్వ కవి అనే మాటలు సరిపోవు. ఇవి ఆయన ఎంచుకున్న జీవన విధానానికి సంబంధించినవి. వాటి వల్ల ఆయనకు వచ్చిన గుర్తింపు అది. ఆయన పాపులారిటీ ఎలాంటిదంటే.. దీర్ఘకాలం ప్రభుత్వ భాషా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరగడం దిన పత్రికలు చదివే వారికి కూడా తెలిసే ఉంటుంది. ఆ అర్హతతోనే ఆయనను రాజ్యసభకు పంపించారని కూడా తెలుసుకోగలరు. వీటన్నిటినిబట్టి ఆయన ప్రభుత్వం పక్షాన నిలబడ్డ కవి అని అందరూ సరిగానే అర్థం చేసుకోగలిగారు.

అయినా కవిగా ఆయన ఏమిటో చెప్పవలసే ఉన్నది. ఆయన ఆధునిక రూపంలో ఉండే సంప్రదాయ కవి. ఈ మాట కూడా ఆయన అభిమానులకు నచ్చకపోవచ్చు. కాబట్టి సంప్రదాయం చెదిరిపోకుండా కాపాడుకున్న ఆధునికకాలపు కవి అని సవరించవచ్చు. ఆయన పరిశోధనా పుస్తకం పేరు ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు, ప్రయోగములు. ఇందులో ఆయన చేసిన పరిశోధన అంతా సంప్రదాయంలో ఆధునికత ఎలా భాగమో చెప్పడమే. లేదా ఆధునికతను, దానికి సంబంధించిన ప్రయోగాలను సంప్రదాయంలో బలవంతంగా భాగం చేయడమే. దీని కోసం ఆయన ఆధునికత అంటే ఏమో తెలియని రాయప్రోలు సుబ్బారావును, గురజాడ అప్పారావును సమ ఉజ్జీలను చేశారు. పొసగని రెండు భావధారలను కలిపి కిచిడీ తయారు చేశారు. నిజానికి ఆధునిక దృష్టి ఉన్నవాళ్లయితే పొరబాటున కూడా గురజాడ పక్కన రాయప్రోలును నిలబెట్టే పని చేయరు. గురజాడతో రాయప్రోలుకు పోలికే లేదు అనడం ఆధునిక దృక్పథం అవుతుంది. ఆ ఇద్దరినీ పక్క పక్కనే నిలబెట్టడంలో.. ఈ పక్క గురజాడ ఉన్నా సరే.. సంప్రదాయాన్నే ఎత్తిపట్టినట్లవుతుంది. (గురజాడ చారిత్రక, సాహిత్య పాత్రపట్ల పూర్తి గౌరవంతోనే ఆయన గురించిన చర్చలో ఇప్పుడు చాలా కొత్త ఆలోచనలు ముందుకు వచ్చాయి. అవన్నీ ఇక్కడ మాట్లాడలేం) సినారెలో అలా సంప్రదాయం దాగి ఉంటుంది. బైటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన కవిగా ఎదిగి గుర్తింపు తెచ్చుకున్న కాలానికే ఆధునికత ప్రభావశీలంగా ఉండింది. కానీ ఆయన పరిశోధకుడిగా, కవిగా సంప్రదాయ కుదురు మీద రూపొందారు. ఎక్కడా ఆయన దానితో తెగతెంపులు చేసుకోవాలని ప్రయత్నించలేదు. ఆ తర్వాత ఆయనకు ఆ అవసరమే రాలేదు. దాన్నలా అట్టి పెట్టుకొనే చివరి సంవత్సరాల్లో భాషలో కొంచెం మార్పు తెచ్చుకొని సమకాలీన వచన కవిత రాయడానికి ప్రయత్నించారు. అయినా అందులోనూ స్వచ్ఛమైన సంప్రదాయ ఛాయలు కనిపిస్తాయి.

కవిగా ఆయనకు గుర్తింపు తెచ్చిన ప్రాతినిధ్య రచనలు విశ్వంభర, కర్పూరవసంత రాయలు, నాగార్జునసాగరంలో ఆయన సంప్రదాయ భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది. కర్పూర వసంతరాయలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఉదాహరణకు విశ్వంభరలో..
ఎన్ని అంచులో రాగాత్మకు
ఎన్ని అలలో నాదాత్మకు
సభాసరసిలో విరిసింది పద్మంలా
సమరావనిలో మెరిసింది శంఖంలా..
ఇలా ఈ కావ్యం ప్రకృతి, మనిషి, చరిత్ర చుట్టూ తిరుగుతుంది. అందులో భాష మాత్రమే సంప్రదాయం కాదు. అంతా అలాగే ఉంటుంది. మానవతావాదం, ఆధ్యాత్మికం.. ఇలా ఏవేవో కలగలిపినట్లు ఉంటుంది. కవిత్వానికి సంబంధించిన ఫీల్‌ కూడా కలగదు. ఆడంబరంగా ఉండే గజిబిజి భాష, గందరగోళం అభిప్రాయాలు కలిపి ధారపోస్తే విశ్వంభర.
ఇంకోచోట ఇలా అంటాడు..
ఆకాశం నిండా కోటి కళ్లుంటాయని
సూర్య చంద్రుల్ని చప్పరించి వదిలేసే
సూక్ష్మ శక్తులుంటాయని
అడుగు నేలపై ఆనని యవ్వనం
అడుసులోకి దిగబడుతుందని
నిత్య దీప్తమని అనుకున్న జీవితం
లిప్తలో ఆరిపోతుందని..
ఇదంతా ఏమిటో తెలియదు. మనిషి, పరిణామం వంటి అంశాలను ఇలా చూడవచ్చునా? చూస్తే ఏం తేలుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కావ్యంలో ఏదో మెట్ట వేదాంతం కనిపిస్తుంది. నారాయణరెడ్డి కొత్త, పాత రచనలన్నీ చదవండి. అక్కడక్కడ ఆధునిక భాష ఉన్నా ప్రధానంగా ఆయనది సంప్రదాయ భాష. సంస్కృతభూయిష్టమైన భాష. విశ్వంభర అనే శీర్షికలోనే అలాంటి ధ్వని ఉంది. అక్కడక్కడా ప్రగతిశీల భావజాలం కనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి అది మానవతావాదం. అంతకు మించి ఫలానా అంటూ ఏమీ తేలదు.

దీన్నంతా ఇంకోలా చెప్పుకోవాలంటే కవిగా ఆయనకు మౌలికంగానే వస్తు నిర్దిష్టత లేదు. ఆ మేరకు భాషలో కూడా నిర్దిష్టత లేదు. ఇంత సుదీర్ఘకాలం కొనసాగిన ఒక కవికి వస్తు నిర్దిష్టత లేకపోవడం ఆశ్చర్యం. తెలుగు సాహిత్యానికి వస్తు నిర్దిష్టత ప్రాణం. ఎన్ని వాద వివాదాలు ఉన్నా, గొడవలున్నా వస్తు నిర్దిష్టత తప్పనిసరి. ఆయన్ను కవిగా చాలా గౌరవించేవాళ్లు కూడా ఆయన కవిత్వంలోని వస్తు నిర్దిష్టత చూపలేరు. విశ్వంభర, నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు కావ్యాల ఇతివృత్తం గురించి చెప్పగలం అంతే. ఆ తర్వాత రాసిన వాటిలో మానవతావాద ఛాయలు కనిపిస్తాయి. మానవతావాదమే రంగు రుచి వాసన లేని సరుకు. ఏ పాత్రలోపోస్తే ఆ పాత్ర ఆకారంలోకి వస్తుంది. ఏ కవికి అయినా అదేం దారి చూపుతుంది? వస్తు నిర్దిష్టతను ఎలా ఇస్తుంది? ఉదాహరణకు ఆయన మరో పుస్తకం ʹప్రపంచపదులుʹ అనేది తీసి చదవండి. ఏమీ అనిపించదు. కవిత్వం చదువుతున్న థిల్‌గాని, అనుభూతిగాని, ఆశ్చర్యంకాని అనిపించదు. ఏదో భాషను అలా అల్లుకుంటూ పోయినట్లు ఉంటుంది.
అసలు ఆయన తనది ప్రగతిశీల మానవతావాదమని చెప్పుకోవడంలోనే అంతులేని గందరగోళముంది. అందులోంచి ఎదురెక్కి వచ్చే ప్రశ్నల గురించి ఆయన పట్టించుకోలేదు. దానికి ఆయన జీవన చట్రమే కారణం. జనంలోపడితే పాఠకులో, అభిమానులో ఎవరో ఒకరు అడిగేవారు. లేదా ఏదో ఒక ప్రశ్న ఎదురయ్యే సన్నివేశం వచ్చేది. ప్రగతిశీల మానవతావాదమనే మాటలో ప్రగతిశీలం కాని మానవతావాదం అనేది ఒకటి ఉన్నదా? మానవతాదృష్టి లేని ప్రగతిశీలం ఉన్నదా అనే ప్రశ్నలు దాగి ఉన్నాయని ఆయనకు అనిపించలేదు. ఎన్నోసార్లు ప్రగతిశీల మానవతావాదం గురించి చెప్పుకున్నారు.

నారాయణరెడ్డికి తాను ఆధునికకాలంలో జీవిస్తున్నాననే ఎరుక పుష్కలంగా ఉన్నది. అంతే కాదు దృక్పథ స్పష్టత కూడా నిండుగా ఉన్నది. ఆధునిక కాలంలో ప్రగతిశీల భావన లేకుండా బతకడం తెలుగు సాహిత్య రంగంలో చాలా కష్టం. అట్లా అని దాన్ని స్వీకరిస్తే చాలా చికాకులు ఉంటాయి. చాలా వాటికి బాధ్యత పడాలి. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎక్కడో ఒక చోట నిలబడి ప్రగతిదాయకంగా ఉందామనుకుంటే అది ఒప్పుకోదు. అది జబ్బపుచ్చుకొని మనకు ఇష్టం ఉన్న చోటికి, లేనిచోటికి కూడా లాక్కెళుతుంది. ఫలానా ʹఅభ్యంతరకరమైన రాజకీయమʹనే దాని దగ్గరికే కాదు, అలా ఇంకెన్నో అభ్యంతరకరమైన తావులకు లాక్కెళుతుంది. అది ఆయన ఎంచుకున్న రాజకవి జీవితానికి పొసిగేది కాదు. అట్లని కవులు ఒక పథకం ప్రకారం తమ దృక్పథాలు నిర్వచించుకుంటారని అపోహపడటానికి లేదు. అనేకానేక సొంత అనుభవాలు, కారణాలు, సామాజిక కారణాలు, కవిగా రూపొందుతున్న కాలానికి ఉన్న ప్రత్యేకతలు ఎన్నో వ్యక్తావ్యక్తమైనవన్నీ కలిసి కవికి దృక్పథం ఏర్పడుతుంది. అట్లని స్పష్టమైన ఎంపిక అనే ప్రక్రియనే కాదంటే మనిషి చైతన్యవంతమైన పాత్రను, దానికి ప్రేరణ ఇచ్చే భౌతిక పరిస్థితులను తిరస్కరించినట్లవుతుంది.

అట్లా సినారె తాను ఎంచుకున్న జీవితానికి తగినట్లు తనకు పట్టుబడిన దృక్పథాన్ని వ్యాఖ్యానించుకున్నారని అనిపిస్తుంది. ప్రగతిశీలంతో ఇన్ని ఇబ్బందులు ఉంటాయని తెలియని వాడేమీ కాదాయన. అందుకని దానికి మానవతావాదాన్ని కలిపారు. ఉత్త మానవతావాదాన్నే ఎంచుకుందామంటే అది శుష్కప్రాయమైనది. తెలుగు సాహిత్యంలో దానికి పెద్ద గౌరవం లేదు. అందుకని ఆ రెంటినీ కలిపారు.

అయితే తెలుగు సాహిత్యం అభ్యుదయం, ప్రగతి అనే భావనలు దాటి విప్లవం దాకా, అనేక పీడిత సాంఘిక అస్తిత్వాల దాకా విస్తరించింది. ఈ మొత్తంలో ప్రగతిశీల మానవతావాదమనే అనిర్దిష్ట, అమూర్త భావనకు చోటే లేదు. ఒక క్రమంలో సినారెకు ఇవ్వాల్టి తెలుగు సాహిత్య ప్రపంచంలోని ఏ కార్నర్‌లో కూడా చోటు లేకపోవడానికి ఇదే కారణం. ఆయన అంత అనిర్దిష్ట కవి.

ఉదాహరణకు ఏదో ఒక మేరకు ప్రగతి అనే భావనను భుజానేసుకొని ఉంటే మిగతా సామాజిక సమస్యల మాట ఎలా ఉన్నా కనీసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్నయినా బలపరచాల్సి వచ్చేది. పైగా ఆయన తెలంగాణ వాడు. కాబట్టి పెద్దగా ప్రగతిదాయక ఆలోచనలతో పని లేకున్నా అస్తిత్వ పరిధిలో అయినా తప్పేది కాదు. ఆ రకంగా ప్రగతి అనే గీటురాయి మీదికిపోయి తెలంగాణ పక్షాన నిలబడితే అది అక్కడ ఆగేది కాదు. ఇక మానవతావాదం తెలంగాణ గురించి మాట్లాడటానికి పనికి వచ్చేది కాదు. అందుకని మౌనం పాటించారు. ఇది తన దృక్పథం పట్ల ఆయనకున్న స్పష్టతను తెలియజేస్తుంది. అంతే కాదు, తెలంగాణకు అన్యాయం ప్రభుత్వం వల్ల జరిగింది. ఆయన ప్రభుత్వం నుంచి పొందాల్సినవన్నీ పొందారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ అస్తిత్వవాదిగా మారిపోయి ప్రభుత్వం వల్ల తెలంగాణకు ఏదో అన్యాయం జరిగిపోయిందని అనడానికి తాను ఎంచుకున్న దృక్పథమే కాదు, జీవన చట్రం కూడా అనుమతించదు. దీన్నంతా కలిసి దృక్పథం అనుకున్నామంటే అందులో ఆయనకు ఎంత స్పష్టత ఉన్నదో, అది విధించిన పరిధిని అతిక్రమించకుండా దానికి ఎంతగా నిబద్ధుడై ఉన్నాడో ముచ్చటేస్తుంది. కవిగా ఆ పక్షాన ఉన్నాను కాబట్టి దానికి బద్ధుడనై ఉండాలనే విలువ అది.

ఇప్పుడు తెలంగాణలో ఆయన కవితా వర్గ వారసత్వాన్ని కొనసాగిస్తున్న చాలా మంది కవులు, రచయితలు, మేధావులు ఈ స్పష్టతతో ఉన్నారా? అని సందేహం. తన గురించి ప్రగతిశీల తెలుగు సాహిత్యం లోకం ఏమనుకుంటుందో నారాయణరెడ్డికి ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఇన్నేళ్ల రాజకవి జీవితంలో గ్రహించే ఉంటారు. అయితే ఎప్పుడూ, ఎక్కడా దానికి ఆయన సమాధానం చెప్పుకున్నట్లు కనబడదు. ఎంచుకొని ఆయన అలా జీవించాలనుకున్నారు. రాజకీయాల్లో పదవులు, సాహిత్యంలో అవార్డులు వాటికవిగా రావు. తెచ్చుకుంటే వచ్చేవే. లేదా ఎవరో వాళ్ల కోసం తెచ్చి పెడితే వచ్చేవే. ఎలాగైతేనేం అలాంటివన్నీ ఆయనకు వచ్చాయి. పుచ్చుకున్నారు. ఉండవసిన పరిధిలో ఉండి వెళ్లిపోయారు. కానీ తెలంగాణలో ఆయనలా ఇప్పుడు రాజ్యం పక్షాన ఉన్న రచయితలు, మేధావులు ఇంత హుందాగా ఉండగలరా? తమ గురించి లోకం ఏమనుకోవాలో నిర్దేశించే పని పెట్టుకోకుండా, ఎదురు విమర్శలకు దిగకుండా ఎంచుకున్న పరిధిలో సినారెలాగా జీవించగలరా? కాలం కలిసి వస్తే విప్లవాల వారసులం మేమే అనే వాగాడంబరానికి దూరంగా ఉండగలరా? ఏమో చరిత్ర చెప్పాల్సిందే.

చివరగా .. కవిత్వంలో అనిర్దిష్టత సంప్రదాయ లక్షణం కాదు. అయితే అనిర్దిష్టత, సంప్రదాయం కలిసిన సాహిత్య వ్యక్తిత్వం నారాయణరెడ్డిది. దీనికి పాలకవర్గ ప్రాపకం దొరికింది. అందువల్ల చక్కగా అక్కడ ఫిట్‌ అయ్యారు. సినిమాకు దీనితో వైరుధ్యం లేకపోగా అదీ అంతకంటే చక్కగా అమరిపోయింది. అందుకే ఆయన కొన్ని పాత సినిమా పాటల్లో సహితం సంప్రదాయ భాషా పాటవం కనిపిస్తుంది. అలాంటి ʹమంచిʹ పాటలతోపాటు కొన్ని లేకి పాటలూ రాశారు. మన ʹసంప్రదాయానికిʹ ఇది కూడా చక్కగా అతికేదే. ఏం పేచీ లేదు. అసలు ఒకరి వ్యాపారం కోసం రాసే పాటల గురించి ఇంత చర్చే అక్కర్లేదు. ఎవరైనా అభ్యుదయంగా సినిమా పాటలు రాసినా అక్కడ అది ఉండాలని నిర్మాతనో, దర్శకుడో అనుకోవడం వల్ల రాసినవే అయి ఉంటాయి. ఏ సినిమా కవి విషయంలో అయినా ఇంతే.

నారాయణరెడ్డి రాసిన నాగార్జునసాగర్‌ గురించి అప్పుడేం అనుకున్నారో తెలియదు. ఇప్పుడైతే నాగార్జునసాగర్‌ను ఎవరు, ఏ అర్థంలో, ఏ కారణం వల్ల ప్రస్తుతించినా రాయలసీమ వాళ్లకు వొళ్లు మండుతుంది. తమకు జరిగిన సకల విద్రోహాలకు నాగార్జునసాగర్‌ ప్రతీక అని ఆ ప్రాంతం వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. ఎవరో దొంగతనం చేస్తోంటే వాడి చోరకళ మీద చెప్పిన కవిత్వమని ఆ పుస్తకాన్ని వాళ్లు భావిస్తే ఇప్పుడు మనమేం చేయలేం. వ్యక్తిగా ఆయనలోని సుగుణాలనూ, మంచితనాన్నీ ఎవరైనా ఎందుకు కాదంటారు? అవి గౌరవనీయం. మరణానంతరం తలచుకునేది వాటినే కదా.

- పాణి

(అరుణ‌తార జూలై 2017 సంచిక‌లో ప్ర‌చురితం )

Keywords : C.Narayanareddy, telangana, writer, revolution
(2024-03-14 18:38:02)



No. of visitors : 1556

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాజా