నేరెళ్ళ సాక్షిగా మాఫియా పాలన, పోలీసు రాజ్యం

నేరెళ్ళ

(వీక్షణం సహాయ సంపాదకులు వై.రామచంద్రం, తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులు మానువాడ విజయ్ లు రాసిన ఈ వ్యాసం ఆగస్ట్ 2017 వీక్షణం సంచికలో ప్రచురించబడినది)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలిచివేస్తున్న ఘటన జరిగిన నేరెళ్ల గ్రామం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటన వివరాల్లోకి వెళితే జూలై 2న నేరెళ్ల గ్రామానికి చెందిన ఎరుకల భూమయ్య(55) అనే రైతు ఎరువుల కోసం జిల్లెల క్రాసింగ్‌కి వెళ్లి మోటర్‌ సైకిల్‌పై తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఇసుక లారీ భూమయ్య మోటార్‌ సైకిల్‌ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గత రెండు సంవత్సరాల కాలంలో ఇసుక లారీలు గుద్దడం వల్ల ఐదుగురు చనిపోయారు. అందులో నేరెళ్ల గ్రామానికి చెందిన గంధం మల్లేశం(58), బొల్లవేని రమేష్‌(45), వడ్ల రవి(31), బంగారపు భూమయ్య(55), జిల్లెలకు చెందిన కారంగుల కరుణాకర్‌ రావు(32) ఉన్నారు. 46 మంది గాయాలపాలయ్యారు. ఇలా చనిపోయిన సందర్భాల్లో కాంట్రాక్టర్లు, తాము లారీ యజమానులం కాదని స్థానిక నాయకులు, పోలీసులు మృతుల కుటుంబాలకు చెప్పి తప్పించు కుంటున్నారు. కావాలంటే కోర్టులో కేసు వేసుకొమ్మని సలహా ఇచ్చి శవాన్ని అక్కడి నుండి తరలించడానికి మాత్రం తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరిగిన ప్రతిసారి స్థానిక ప్రజలు ఈ దారి గుండా ఇసుక లారీలు నడుపవద్దని నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే క్రమంలో జూలై 2న భూమయ్య కూడా ఇసుక లారీ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలియడంతో నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాల ప్రజలు ఆవేదనకు లోనయ్యారు. ఎప్పటి నుండో ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుని తమ ప్రాణాలను తీస్తున్న లారీలపై దాడి చేశారు. ఈ దాడిలో నాలుగు లారీలు కాలిపోయాయి. మరో ఐదు లారీల అద్దాలు పగిలాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎస్‌.ఐ. సైదారావు కానిస్టేబుళ్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడి ప్రజలను చెదరగొట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రజలు శవాలుగా మారుతుంటే స్పందించని వారు మమ్మల్ని చెదరగొట్టడమేంటని ప్రజలు నిలదీశారు. దీంతో ఎస్‌.ఐ. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్‌.పి. విశ్వజిత్‌ కంపాటి, సి.ఐ. శ్రీనివాసరావు పోలీసు బెటాలియన్‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రజలు చెదిరి పోకుండా ఆరు గంటలపాటు రోడ్డుపైనే కూర్చున్నారు. కాలుతున్న లారీల మంటలను ఆర్పడానికి వచ్చిన ఫైర్‌ ఇంజన్లను కూడా ప్రజలు అడ్డుకున్నారు. ఆయిల్‌ ట్యాంకులు పేలిపోతాయనడంతో వదిలారు. ఇది మొదటి రోజు జరిగిన సంఘటన వివరాలు.

ఇక రెండవ రోజైన జూలై 3న నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాల ప్రజలు సిరిసిల్లలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బైటాయించారు. ఎవరు పట్టించుకున్నది లేదు. అన్నింటికి పోలీసులే సమాధానాలు చెపుతున్నారు.

ప్రజలు వ్యక్తం చేసిన ఆగ్రహం ప్రభుత్వానికి, పోలీసులకు చట్ట వ్యతిరేకమైనదిగా అనిపించింది. అందులో భాగంగానే స్థానిక పోలీసులు లారీ దగ్ధం కేసులో అనుమానితులు అనే పేరుతో నేరెళ్ల గ్రామంలోని ఇండ్లలోకి బలవంతంగా చొరబడి యువకులను పట్టుకుపోయారు. అడ్డుపడిన కుటుంబ సభ్యులతో ఎస్‌.పి. విశ్వజిత్‌ కంపాటి మాట్లాడి పంపిస్తామని చెప్పారు. పోలీసులు పట్టుకుపోయిన వారిలో పెంట బాలయ్య, కోలా హరీష్‌, చెప్యాల బాలరాజ్‌, పసుల ఈశ్వర్‌, గంధం గోపాల్‌, బత్తుల మహేష్‌, చికోటి శ్రీనివాస్‌, గణేష్‌లు ఉన్నారు. తమ పిల్లలు సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు జూలై 6న ఎస్‌.పి.ని కలిశారు. ʹమీరు గనుక మీ పిల్లలకోసం రోడ్డెక్కితే మీ పిల్లలు శవాలుగా వస్తారʹని బెదిరించి పంపించారు. 8వ తేదీన ఎనిమిది మందిని సిరిసిల్ల కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లారు. తీవ్రగాయాలతో వచ్చిన వారిని చూసిన జైలర్‌ జైల్లో పెట్టుకుంటే వారికి ఏమవుతుందోననే భయంతో చికిత్సకోసం తిప్పిపంపారు. పోలీసులు వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించి మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకువచ్చి జైలుకు పంపారు.

కుటుంబ సభ్యులు జూలై 10న జైలుకెళ్లి కలిశారు. తమ పిల్లల ఒంటిపై ఉన్న దెబ్బలకు చలించిపోయి భోరున ఏడ్చామన్నారు. పట్టుకెళ్లినప్పటి నుండి వరుసగా నాలుగు రోజులు కొట్టారని యువకులు తెలిపారు. కొట్టే క్రమంలో సొమ్మసిల్లి పడిపోతే కరెంట్‌ షాక్‌లిచ్చి లేపి కొట్టారన్నారు. రోకలిబండలెక్కిచ్చి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసినట్లుగా తెలిపారు. చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని ఎక్కడైనా చెపితే మీ కుటుంబంలోని మహిళలపై వ్యభిచారం కేసు పెడతామని, గంజాయి కేసు పెడతామని, ఎన్‌కౌంటర్‌ చేస్తామని ఎస్‌.పి. బెదిరించారని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాధితులను కలిసి మాట్లాడి ఆ విషయాల్ని మీడియాకు తెలిపారు. ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో పెట్టారు. బయటికి కనిపించే తీవ్రగాయాలతో లేవలేకుండా వణికిపోతున్నవారి పరిస్థితి చూస్తే దీనికోసమేనా మనం తెలంగాణను పోరాడి సాధించుకున్నది అని అనిపించక మానదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దళితులకు జీవించే హక్కు లేదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక మాఫియా రాజ్యాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసమే ప్రజల్ని చిత్రహింసలు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జెఏసి చైర్మన్‌ కోదండరాం, పౌరహక్కుల సంఘం, మందకృష్ణ మాదిగ, టిమాస్‌ వారు బాధితులను కలిసి పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకొని ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు విషయాన్ని బయటి ప్రపంచానికి తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై దాదాపు 150 సంఘాలు కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ భవన్‌లో అన్ని పార్టీలతో చర్చలు జరిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్‌.పి. కంపాటి పై ఎస్‌సి/ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, హత్యానేరం కేసు పెట్టాలని, మొదటగా అతన్ని సస్పెండ్‌ చేయాలని, దళిత సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. గత నాలుగు నెలలుగా తెరిచిన రౌడీ షీట్లపైన, బైండ్‌ ఓవర్‌ల పైన పూర్తి విచారణ జరిపించాలనే డిమాండ్‌లతో జూలై 31న ఛలో సిరిసిల్లకు పిలుపునిచ్చారు.

జూలై 2న జరిగిన సంఘటనలు విడదీసి చూస్తే మొదటిది ఇసుక మాఫియా ప్రయోజనంలో భాగంగా జరిగినది. రెండవదానికి కారణం మొదటిదే. ఎందుకంటే ఏ కారణం లేకుండా ప్రజలు తమకు తామే వెళ్లి లారీలను తగులబెట్టలేదు. ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు స్పందించని ప్రభుత్వం, పోలీసులు ఇసుక లారీలను ప్రజలు కాల్చారన్న కారణంతో అరెస్టులు, చిత్రహింసలు, కేసులు, జైళ్లతో స్పందించింది. ఇది పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు జరుగుతున్న న్యాయం! ఇక్కడ ప్రాణంలేని ఒక వస్తువైన లారీకి ఇచ్చినంత విలువ మనిషి ప్రాణానికి ఇవ్వడం లేదు. అట్లే ఇంకా కొంచెం ముందుకు వెళితే దేశంలో చనిపోయిన పశువుకు ఇచ్చిన విలువ నేను మనిషినే అని అనుకునే దళితులకు లేదు అనే విషయం ఈ ప్రభుత్వాలు రోజూ గుర్తుచేస్తునే ఉన్నాయి.

గతంలో ఇదే కారణంతో చనిపోయినప్పుడు స్థానికులు ఇసుక లారీలు ఆ దారిలో రావద్దని రాస్తారోకో చేసినా ఎటువంటి స్పందనా లేదు. ఇసుక లారీలు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా స్థానిక రాజకీయ నాయకులు, పోలీసుల అండతో రోజూ తిరుగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, పార్టీలు, హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రజల జీవించే హక్కుకు భగ్నం కలుగుతోందని ఆందోళన చెందుతున్న సందర్భంలో పౌరహక్కుల సంఘానికే అధ్యక్షున్ని అవుతానన్న ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందనాలేదు. స్థానిక ఎంఎల్‌ఎ, మంత్రి, యువరాజు కెటిఆర్‌ ఈ ఘటనపై ప్రతిపక్షాలు స్పందిస్తే తప్ప స్పందించలేదు. పాలకుల ఈ మౌనానికి కారణాలు ఆర్థిక ప్రయోజనాలలోను, వ్యక్తిగత బంధుత్వాలలోను ఉన్నాయి. మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో మునిగిపోయే ఈ భూములలో అపారమైన ఇసుక తవ్వితీయవచ్చునని అది ప్రభుత్వం తలపెట్టిన నిర్మాణ కార్యక్రమాలకు పనికి వస్తుందని సాకు చూపుతూ ఇష్టా రాజ్యంగా కాంట్రాక్టర్లకు ఈ ప్రాంత ఇసుక రీచ్‌లు అప్పగించారు. రోజుకు కనీసం వెయ్యి లారీలు, లక్షా ముప్పై ఐదు వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలిస్తున్నాయని అంచనా. ఒక లారీ ఇసుక తవ్వుకు పోయినందుకు ప్రభుత్వం వసూలుచేసేది రు. 8,250 కాగా ఒక లారీ ఇసుకను ఓపెన్‌ మార్కెట్‌లో అమ్మితే కనీసం ఆదాయం రు. 70-80 వేలు. దీనితో కాంట్రాక్టర్లు ఎట్లా కోట్లకు పడగెత్తుతున్నారో, అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎంత ముడుపులు చెల్లిస్తున్నారో ఊహించవలసిందే. ప్రత్యేకంగా నేరెళ్ల, జిల్లెల ప్రాంతంలో ఇసుక తవ్వుకు పోతున్న గోల్డ్‌మైన్‌ మినరల్స్‌ నలుగురు యజమానులలో ఇద్దరు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు సన్నిహిత బందువులు. వారిలో ఒకరు టి.ఆర్‌.ఎస్‌. అధికార పత్రిక నమస్తే తెలంగాణ మేనేజింగ్‌ డైరెక్టర్‌.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ముందుంచుతున్న ప్రజాస్వామిక వాదులను పోలీసులు భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు. సిరిసిల్లలో నిత్యం బైండోవర్ల పేరుతో, రౌడీషీట్లు తెరుస్తున్నారు. సంఘ విద్రోహులని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో అమలుపరుస్తున్న విధానాల వల్ల సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు ఈ సమస్యల మూలాలను అర్థం చేసుకోకుండా ప్రశ్నించే వారి గొంతునొక్కడమే పరిష్కారంగా భావిస్తున్నాయి. ఇదంతా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం అమలుచేస్తున్న విధానం.

తెలంగాణలో జరుగుతున్న భూకుంభకోణాలను వెలికితీస్తే వేలాది ఎకరాలు బయటపడతాయి. దాంతో కె.సి.ఆర్‌ దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఇవ్వొచ్చు, గ్రామాల్లో బతుకు లేకుండా అయి పట్టణాలకు వచ్చిన వారికి నిలువ నీడ కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రభుత్వం, మీడియా భూకుంభకోణాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ఎప్పుడు లేదన్నట్లుగా వ్యక్తిగత విషయమైన మత్తు పదార్థాల అన్వేషణలో పోలీసులు, మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. సామాజిక పరమైన విషయాల కన్నా వ్యక్తిగత విషయాలనే సామాజిక విషయాలుగా భ్రమింపజేస్తూ రోజుకో కథనం వినిపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో కొనసాగుతోంది.

కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఈ ఇసుక మాఫియా కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలోనే నడిచింది. అప్పటి నుండి ప్రజల మనుసుల్లో తమ భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే సహజ వనరు అక్రమంగా తరలిస్తున్నారనే వ్యతిరేకత గూడుకట్టుకొని ఉంది. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ కొనసాగిస్తోంది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా అధికారంలో ఎవరు ఉంటే వారు ఇటువంటి అక్రమాలు కొనసాగిస్తారు.

జూలై 31న ఛలో నేరెళ్లకు ఇచ్చిన పిలుపును భగ్నం చేయడానికి జూలై 27 రాత్రి నుండే స్థానిక నాయకులను, ప్రజాస్వామిక వాదులను, దళిత సంఘాల నాయకులను, జిల్లాలోని ప్రతిపక్ష రాజకీయ నాయకులను అరెస్ట్‌ చేసి వివిధ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత, బహుజన సంఘాలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నాయి. నేరెళ్లలో ఇసుక మాఫియా వల్ల ఉత్పన్నమయిన అసలు సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలేదు. కాని స్థానిక ప్రజల మరణాలకు కారణమైన రాజకీయ ఇసుక మాఫియాను కాపాడడానికి, దానికి చట్టం పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇసుక మాఫియాకు సహకరిస్తున్న జిల్లా ఎస్‌.పి. విశ్వజిత్‌ కంపాటిని కాపాడడం కోసం ప్రభుత్వం ప్రజలను అణచివేయ జూస్తుంది.

సహజ వనరులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడి ప్రజలను బెదిరించి, నిర్వాసితుల్ని చేసి లేదంటే ట్రాక్టర్లతో, లారీలతో తొక్కించి, మహిళలపై అత్యాచారాలు చేసి, హత్యలు చేసి, జైళ్లలో నిర్బంధించి, బాంబులు వేసైనా వనరులను దోచుకెళ్లడం జరుగుతున్నది. అది నేరెళ్లలో ఇసుక మాఫియా కావచ్చు, ఆదివాసి ప్రాంతాల్లోని ఖనిజ సంపదను బహుళజాతి సంస్థలకు కట్టబెడుతున్న భారత పాలక వర్గాలు కావచ్చు, గల్ఫ్‌ దేశాల్లోని ఆయిల్‌ కోసం సామ్రాజ్యవాద దేశాలు కావచ్చు. సహజ వనరులున్న ప్రాంతాల్లోని ప్రజలు వాటిని భవిష్యత్‌ తరాలకు అందించడానికి నిత్యం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. మిగతా సమాజమంతా తమకు సంబంధంలేని విషయంగా చూస్తుంది. మొత్తం సమాజానికి చెందవలసిన సహజ సంపదను కొద్ది మంది దోచుకోవడాన్ని వాళ్లు అడ్డుకుంటున్నారు. ఈ వనరులను కొల్లగొట్టడానికి స్థానిక నాయకులు మొదలుకొని కేంద్ర స్థాయిలో ఉండే నాయకుల వరకు ఎవరి స్థాయిలో వారు స్థానిక, విదేశీ దోపిడీశక్తులకు ఉపయోగపడుతున్నారు. అలాంటప్పుడు దేశ సహజ సంపదను కాపాడుతున్న ప్రజలకు మిగతా సమాజం బాసటగా నిలిచి ఈ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యతా, అవసరం ఉన్నాయి. అలా చేయకపోతే మిగతా సమాజం బతుకు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఎంతో దూరంలో లేదనే విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

- వై.రామచంద్రం, వీక్షణం సహాయ సంపాదకులు
- మానువాడ విజయ్, తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులు

Keywords : sirisilla, nerella, karim nagar, telangana, dalits, trs, kcr, ktr
(2024-04-18 23:36:48)



No. of visitors : 1589

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నేరెళ్ళ