అదానీ కోపం..ఈపీడబ్ల్యూ సంపాదకుడి రాజీనామా - ఎన్.వేణు గోపాల్

అదానీ

(ఈ వ్యాసం వీక్షణం సెప్టంబర్, 2017 సంచికలో ప్రచురించబడినది)

దాదాపు ఏడు దశాబ్దాలుగా సామాజిక శాస్త్రవేత్తల, ప్రగతిశీల బుద్ధిజీవుల, ఉద్యమ కార్యకర్తల విశేష ఆదరాభిమానాలను చూరగొంటూ ప్రపంచంలోనే అగ్రశ్రేణి పత్రికగా పేరుపొందిన ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఇపిడబ్ల్యు) గత నెల ఒక అవాంఛనీయమైన, విచారకరమైన వివాదంతో వార్తలకెక్కింది. అప్పటికి పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న సంపాదకుడు సి రామమనోహర్‌ రెడ్డి పద్దెనిమిది నెలల కింద రాజీనామా చేశాక, ఆ స్థానంలో సంపాదకుడుగా వచ్చిన పరంజయ్‌ గుహ ఠాకూర్తా పదిహేను నెలలు కూడ కాకుండానే హఠాత్తుగా జూలై 18న రాజీనామా చేశారు. అదానీ గ్రూపు కంపెనీలకు రు. 500 కోట్ల ప్రయోజనం కలిగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఇపిడబ్ల్యు వెబ్‌ సైట్‌ మీద అంతకు కొద్ది రోజుల ముందు వెలువడిన వ్యాసాన్ని కూడ ఆయన రాజీనామాతోపాటే తొలగించారు. తన రాజీనామాకూ, ఆ వ్యాసం తొలగింపుకూ ఇపిడబ్ల్యు యాజమాన్యం సమీక్షా ట్రస్ట్‌ తనతో వ్యవహరించిన పద్ధతే కారణమని ఠాకూర్తా ఆ తర్వాత అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ సమీక్షా ట్రస్ట్‌ తరఫున ట్రస్టీలలో ఇద్దరు రొమిల్లా థాపర్‌, దీపాంకర్‌ గుప్తా ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో ఒక లేఖ రాశారు. ఆ తర్వాత సమీక్షా ట్రస్ట్‌ జూలై 20న, ఆగస్ట్‌ 2న రెండు పత్రికా ప్రకటనలు విడుదల చేసి తన కథనాన్ని ప్రకటించింది. పూర్వ సంపాదకులు రామమనోహర్‌ రెడ్డితో సహా ఎంతో మంది విశ్లేషకులు ఈ వివాదం మీద తమ అభిప్రాయాలు ప్రకటించారు. ాఇపిడబ్ల్యు పాఠకులు, రచయితలు, అభిమానుల్ణు ఇటువంటి అరుదైన సంస్థ ధ్వంసమై, అంతరించి పోకుండా కాపాడాలని విజ్ఞప్తి ప్రకటనలు విడుదల చేశారు.

ఇపిడబ్ల్యు వంటి ప్రతిష్టాత్మకమైన పత్రిక గురించి ఇటువంటి వివాదం రావడం, అందులోనూ దీపక్‌ నయ్యర్‌ అధ్యక్షుడిగా, రొమిల్లా థాపర్‌, దీపాంకర్‌ గుప్తా, ఆంద్రె బెటిల్‌ వంటి ఉదార ప్రజాస్వామిక వాదులు సభ్యులుగా ఉన్న సమీక్షా ట్రస్ట్‌ అదానీ గ్రూప్‌ బెదిరింపులకు భయపడి, వ్యాసాన్ని తక్షణమే తొలగించాలని పట్టు పట్టిందన్న అనుమానాలు తలెత్తడం, అంబానీలు, ఎస్సార్‌ గ్రూప్‌ తో సహా ఎన్నో కార్పొరేట్‌ సంస్థల అక్రమాలను బైటపెట్టి పరిశోధనాత్మక జర్నలిజంలో సుప్రసిద్ధుడైన ఠాకూర్తా ఇటువంటి పరిస్థితిలో రాజీనామా చేయవలసి రావడం, సమీక్షా ట్రస్ట్‌ రెండు పత్రికా ప్రకటనలు విడుదల చేసినప్పటికీ ప్రధానమైన అదానీ వ్యాసం తొలగింపు విషయాన్ని ప్రస్తావించకపోవడం నిజంగా విచారకరమైన అంశాలు. అయితే ఇవి కేవలం ఇపిడబ్ల్యు అనే ఒకానొక పత్రికకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు. ఈ అంశాలు దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడికి, భిన్నాభిప్రాయాల పట్ల పెరుగుతున్న అసహనానికి, అప్రజాస్వామిక వ్యవహారశైలికి, కార్పొరేట్‌-ప్రభుత్వ మిలాఖత్తు సాగిస్తున్న దాష్టీకానికి, స్థిరంగా, ధైర్యంగా నిలబడలేని ప్రగతిశీల శిబిరం అశక్తతకు సూచికలుగా ఉన్నాయి. అందువల్ల ఈ ఉదంతం పూర్వాపరాలను వివరంగానే పరిశీలించవలసి ఉంది.

రిలయన్స్‌, ఎస్సార్‌ వంటి కార్పొరేట్‌ సంస్థల అక్రమాలను, ఆ కార్పొరేట్లకూ ప్రభుత్వాలకూ మధ్య ఉన్న మిలాఖత్తును బైటపెట్టి పరిశోధనాత్మక జర్నలిస్టుగా సుప్రసిద్ధుడైన పరంజయ్‌ గుహ ఠాకూర్తా ఇపిడబ్ల్యుకు సంపాదకుడిగా 2016 జనవరిలో చేరారు, ఏప్రిల్‌ నుంచి పని ప్రారంభించారు. అలా ఇపిడబ్ల్యుకు అప్పటిదాకా అర్థశాస్త్రవేత్తలు సంపాదకులుగా ఉండే సంప్రదాయం మారి, మొదటిసారి పూర్తిగా జర్నలిజం నేపథ్యం నుంచి, అది కూడ పరిశోధనాత్మక వార్తావ్యాసాలు రాసే నేపథ్యం నుంచి వచ్చిన సంపాదకుడు వచ్చినట్టయింది. అంతకు కొద్ది ముందే ఆయన ాగ్యాస్‌ వార్స్‌-క్రోనీ కాపిటలిజం అండ్‌ ది అంబానీస్ణ అనే దాదాపు 600 పేజీల, విస్తృతమైన పరిశోధనతో ఒక పుస్తకం వెలువరించారు. ఆ పుస్తకానికి ప్రచురణకర్తలు దొరకకుండా, రచయితే సొంతంగా అచ్చువేసుకుంటే దాని ఆవిష్కరణ జరగకుండా, పెద్ద పత్రికలలో సమీక్షలు రాకుండా అంబానీలు అడుగడుగునా అడ్డు తగిలారు. ప్రధానంగా ఆయన ఎప్పటికప్పుడు కార్పొరేట్ల, ప్రభుత్వాల అక్రమాలను బైటపెట్టాలని తపనపడే పరిశోధనాత్మక జర్నలిస్టు. అందువల్లనే ఆయన సంపాదకుడిగా ఉన్న 15 నెలల్లో కూడ ఇపిడబ్ల్యులో ఆయన సొంతంగా రాసినవీ, ఇతరులతో కలిసి రాసినవీ ఇరవై వ్యాసాలు వచ్చాయి. ఇతరుల రచనలను చదివి ప్రచురణాహ్రం అవునో కాదో నిర్ణయించే, దిద్దే అధికారం ఉన్న సంపాదకుడే వ్యాస రచయిత అయినప్పుడు, ఆ వ్యాసాలు మరెవరి పరిశీలన లేకుండా అచ్చు కావడం చూసి సమీక్షా ట్రస్ట్‌ ట్రస్టీలు ఇబ్బందిపడడం మొదలుపెట్టారు. అలాగే సంపాదకుడికీ ట్రస్ట్‌ కూ ఎటువంటి సంబంధాలు ఉండాలనే విషయం కూడ అప్పటికి నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలేమీ లేకపోవడం వల్ల ఈ దూరం పెరుగుతూ వచ్చింది. ఒక్క మేనేజింగ్‌ ట్రస్టీ తప్ప మిగిలిన ట్రస్టీలెవ్వరూ ఎన్నడూ ఇపిడబ్ల్యు కార్యాలయానికి రాలేదని, అక్కడ వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో చూడలేదని కూడ ఆరోపణలున్నాయి. సమీక్షా ట్రస్ట్‌ కు అర్థశాస్త్రవేత్త ప్రొ. దీపక్‌ నయ్యర్‌ అధ్యక్షుడు, డి ఎన్‌ ఘోష్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, సమాజ శాస్త్రవేత్త ప్రొ. ఆంద్రీ బెటిల్‌, వ్యాపారవేత్త దీపక్‌ పరేఖ్‌, చరిత్రకారిణి ప్రొ. రొమిలా థాపర్‌, సమాజ శాస్త్రవేత్త ప్రొ. దీపాంకర్‌ గుప్తా, రాజనీతి శాస్త్రవేత్త ప్రొ. రాజీవ్‌ భార్గవ, అంబేద్కర్‌ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొ. శ్యామ్‌ మీనన్‌ ట్రస్టీలు.

ట్రస్ట్‌ కూ సంపాదకుడికీ మధ్య ఇలా దూరం పెరుగుతుండగానే, పరంజయ్‌ గుహా ఠాకూర్తా, శింజనీ జైన్‌, అద్వైత్‌ రావు పాలెపు రాసిన -అదానీ గ్రూప్‌ వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగగొట్టిందా? అనే సుదీర్ఘ వ్యాసం ఇపిడబ్ల్యు 2017 జనవరి 14 సంచికలో వెలువడింది. ఈ వ్యాసం అదానీ గ్రూప్‌కు కోపం తెప్పించిందనడానికి ఆధారాలున్నాయి. ఆ తర్వాత జూన్‌ 19న ఇపిడబ్ల్యు వెబ్‌ ఎడిషన్‌ మీద ప్రత్యేక వ్యాసంగా - అదానీ గ్రూప్‌కు మోడీ ప్రభుత్వపు రు. 500 కోట్ల కానుక్ణ అనే వ్యాసం వెలువడింది. ఈ వ్యాసం పరంజయ్‌ గుహా ఠాకూర్తా తో పాటు, అద్వైత్‌ రావు పాలెపు, శింజనీ జైన్‌, అబీర్‌ దాస్‌ గుప్తా అనే ముగ్గురు సహరచయితల పేర్ల మీద వెలువడింది. ఈ వ్యాసం మీద తమ అభ్యంతరం ప్రకటిస్తూ అదానీ గ్రూప్‌ తరఫున న్యాయవాది సంజీవ్‌ థాకర్‌ ఇపిడబ్ల్యుకు ఒక నోటీస్‌ పంపారు. న్యాయశాస్త్ర పరిభాషలో దీన్ని లాయర్స్‌ నోటీస్‌, లీగల్‌ నోటీస్‌ అంటారు. ఇటీవలి కాలంలో స్ట్రాటెజిక్‌ లా సూట్‌ అగెనెస్ట్‌ పబ్లిక్‌ పార్టిసిపేషన్‌ (ఎస్‌ఎల్‌ఎపిపి- స్లాప్‌) గా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది పరువు నష్టం కేసు కాదు. అటువంటి కేసు వేస్తే, పాత్రికేయులు ఆధారాలు చూపుతారని, తమ గెలుపు సాధ్యం కాదని కార్పొరేట్‌ సంస్థలకు తెలుసు. కాని, తమ మీద రాసే పత్రికా రచయితలను, తమకు వ్యతిరేకంగా మాట్లాడే ఉద్యమకారు లను బెదిరించడానికి, వారి నోరు మూయించడానికి స్లాప్‌ ఒక సాధనం. అంటే అది భావప్రకటనా స్వేచ్చ మీద దెబ్బ. దానికది కేసు కాదు, తదనంతర పరిణామాలు తమకు అనుకూలంగా లేకపోతే, అంటే ప్రత్యర్థులు లొంగిపోకపోతే పరువు నష్టం కేసు పెడతామని చేసే బెదిరింపు మాత్రమే. ఆ బెదిరింపుతోనే చాలమంది పత్రికా రచయితలు, యాజమాన్యాలు భయపడి ఆగిపోతాయని కార్పొరేట్ల అభిప్రాయం. కాని అదానీల లాయర్స్‌ నోటీస్‌కు జవాబుగా ఇపిడబ్ల్యు సంపాదకుడు తమ వ్యాసంలో ప్రతి అక్షరానికీ తాము కట్టుబడి ఉన్నామని చెపుతూ, తమ తరఫున చంద్రచూడ్‌ భట్టాచార్య అనే న్యాయవాదితో జవాబు రాయించి, అదానీల లాయర్‌ నోటీస్‌ నూ ఇపిడబ్ల్యు జవాబునూ కూడ ఇపిడబ్ల్యు వెబ్‌సైట్‌ మీద ప్రచురించారు.

ఆ వెంటనే సమీక్షా ట్రస్ట్‌ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి సంపాదకుడిని పిలిపించింది. ఇపిడబ్ల్యు స్వర్ణోత్సవ డాక్యుమెంటరీ విషయాలు చర్చించడానికి పిలుస్తున్నారని ఠాకూర్తా అనుకున్నారట. కాని సమావేశం ప్రారంభం నుంచే ట్రస్ట్‌ సభ్యులు సంపాదకుడి మీద ఆగ్రహం ప్రదర్శించారట. సమీక్షా ట్రస్ట్‌ మీద, సంపాదకుడి మీద, రచయితల మీద వచ్చిన కేసుకు సంపాదకుడు ఒక్కరే ఒక న్యాయవాదిని పెట్టుకుని జవాబు ఎలా రాస్తారని ట్రస్టీలు ప్రశ్నించారట. ఇది అనుచిత చర్య అని, సంపాదకుడి మీద ట్రస్ట్‌ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమని ట్రస్టీలు అన్నారట. తమకు సమాచారం లేకుండా, తమ అనుమతి లేకుండా తమ తరఫున న్యాయవాది ప్రకటన ఎలా వెలువరిస్తారని అడిగారట. వారికి సమాచారం లేకుండా ఈ పని చేయడం తన పొరపాటేనని, అందుకు క్షమాపణలు చెపుతానని ఠాకూర్తా అన్నారట. అదానీ కేసు వల్ల వందల కోట్ల నష్టపరిహారం చెల్లించడమో, ట్రస్టీలు జైలు శిక్ష అనుభవించడమో జరుగుతుందని ట్రస్టీలు సమావేశంలో అన్నారట. అసలు అదానీల నుంచి వచ్చినది లాయర్‌ నోటీస్‌ మాత్రమే నని అది కేసు కాదని, కేసు దాకా పోయినా ప్రతి అక్షరానికీ తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని ఠాకూర్తా చెప్పిన మాట ట్రస్టీలు అంగీకరించ లేదట. ఆ వ్యాసాన్ని, దాని మీద న్యాయవాదుల వాద ప్రతివాదాలను వెంటనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలన్నారట. అవి తొలగించేవరకూ సంపాదకుడు ఆ గది వదిలిపోగూడదని అన్నారట. ఆయన వెంటనే అక్కడి నుంచే ముంబై కార్యాలయానికి ఫోన్‌ చేసి అవి తొలగించమని ఆదేశించారట. ఆ తర్వాత ఇకనుంచి ట్రస్ట్‌కూ సంపాదకుడికీ సంబంధాలు ఎలా ఉండాలో మార్గదర్శక సూత్రాలు తయారు చేస్తామని, సంపాదకుడికి సమాంతరంగా అదనపు సంపాదకుడిని నియమిస్తామని, ఇక ముందు పత్రికలో సంపాదకుడు స్వయంగా రచనలు చేయగూడదని, చేసినా ట్రస్ట్‌ అనుమతితో మాత్రమే ప్రచురించాలని అన్నారట. ఈ చివరి షరతు వినగానే పరంజయ్‌ గుహ ఠాకూర్తా ఆ ట్రస్టీలనే ఒక కాగితం అడిగి తీసుకుని తన రాజీనామా రాసి ఇచ్చి తక్షణమే తనను బాధ్యతల నుంచి తప్పించమని కోరారట. ఈ సమావేశంలో ఇతరులతో పాటు ప్రొ. రొమిలా థాపర్‌, ప్రొ. దీపాంకర్‌ గుప్తా కూడ ఉన్నారు.

యాజమాన్యానికి తెలియకుండా చట్టపరమైన వివాదంలో సొంత నిర్ణయం తీసుకోవడం సంపాదకుడికి ఉచితం కాదన్నంతవరకు సరైనదే. దానికి ఠాకూర్తా క్షమాపణ కూడ చెప్పారు. కాని అదానీ కార్పొరేట్‌ అక్రమాల గురించి వ్యాసాన్ని తొలగించాలనడం ఎటువంటి పరిస్థితిలోను ఆమోదయోగ్యం కాదు. అదానీకి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో సంబంధాలున్నాయి గనుక, న్యాయస్థానంలో కూడ ఏదైనా మాయ చేయగలడని, శిక్షో, పెద్ద ఎత్తున నష్టపరిహారమో విధింపజేయగలడని ట్రస్టీలు అనుమానించి ఉంటారు. వందల కోట్ల నష్టపరిహారం శిక్ష విధిస్తే ఇపిడబ్ల్యు మనుగడే అసాధ్యమవుతుందని భావించి ఉంటారు. తాము వ్యక్తిగతంగా జైలు శిక్ష అనుభవించవలసి వస్తుందని భయపడి ఉంటారు. కాని అవన్నీ నిజమే అనుకున్నా, సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో, కార్పొరేట్‌-ప్రభుత్వ అక్రమాల గురించి వ్యాసాన్ని తొలగించాలనడం మాత్రం ఇంతకాలం ప్రగతిశీల చరిత్ర ఉన్న మేధావులకు ఉచితం కాదు.

ఇపిడబ్ల్యు అనే ఒకానొక పత్రికలో జరిగిన అంతర్గత వివాదం గురించి, సంపాదకుడి రాజీనామా గురించి ఇంతగా చర్చించడానికి ఆ పత్రిక చారిత్రక నేపథ్యమే కారణం. ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీగా ప్రస్తుతం నడుస్తున్న పత్రిక ఎకనమిక్‌ వీక్లీ అనే వారపత్రికగా 1949లో ప్రారంభమయింది. వలస పాలన ముగిసిన తర్వాత భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ చలనంపై మేధోపూర్వక ప్రతిస్పందనగా, చర్చావేదికగా ఉండాలనే ఉద్దేశంతో బెంగాలీ అర్థశాస్త్రవేత్త సచిన్‌ చౌధురి (1904-1966) బొంబాయిలో ఈ వారపత్రికను ప్రారంభించారు. గుజరాతీ మధ్యతరహా పత్తి వ్యాపార సంస్థ సెఖ్సారియా ఈ పత్రికకు అవసరమైన పెట్టుబడి సమకూర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామాల గురించి వార్తలు, వ్యాఖ్యలు ప్రకటించడం ఈ పత్రిక ఎంచుకున్న పని. ఆనాటి సుప్రసిద్ధ శిల్పి శంఖ చౌధురికి, సుప్రసిద్ధ రచయిత్రి, సంఘసేవిక ధరిత్రీ దేవికి (మహాశ్వేతాదేవి తల్లి) సోదరుడిగా, కళా, సాహిత్యాలకు నిలయమైన కుటుంబం నుంచి వచ్చిన బెంగాలీ బుద్ధిజీవిగా సచిన్‌ చౌధురి ఆనాటి యువకులందరి లాగానే నెహ్రూ తరహా సోషలిస్టు భావాలతో ప్రభావితులయ్యారు. ఆ ప్రభావమే పత్రికలోకి కూడ ప్రవహించింది. వలస పాలన ముగిసిన భారత సమాజం ఏదో సాధించాలనే కలలతో, సాధిస్తుందనే ఆశతో ఉండిన బుద్ధిజీవులు, ప్రధానంగా అర్థ, రాజనీతిశాస్త్రాల విద్యార్థులు, నిపుణులు, మొత్తంగా భారత సమాజ అభివృద్ధి గురించి ఆలోచిస్తుండిన వారెందరో ఈ పత్రికను ఆదరించారు. మొదటి పంచవర్ష ప్రణాళికతో పాటు ప్రారంభమైన ఈ పత్రికకు అధికార వర్గాలలో, నిర్ణయాధికారం ఉన్న రాజకీయవేత్తలలో చాల ప్రాధాన్యత దొరికింది. కొద్ది కాలంలోనే ఇది దేశంలో అతి ముఖ్యమైన పట్టించుకోక తప్పని పత్రికగా మారింది. కేవలం ఆర్థిక పరిణామాల మీద వార్తలకూ, వ్యాఖ్యలకూ పరిమితం కాకుండా మొత్తంగా సామాజిక శాస్త్ర చర్చలకూ, పరిశోధనలకూ వేదికగా మారింది. అలా పదిహేను సంవత్సరాల పాటు విధాన నిర్ణయ రంగంలో, విద్యావంతులలో ఆదరణతో, ప్రాచుర్యంలో, ప్రకటించే విషయాలలో, ప్రామాణికతలో ఈ పత్రిక నానాటికీ ఎదుగుతూ వచ్చింది. కాని ఆ సమయంలోనే యాజమాన్యానికీ సంపాదకుడికీ విభేదాలు మొదలయ్యాయి. పత్రిక స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకోవడానికి అంగీకరించని సచిన్‌ చౌధురి పత్రికను మూసివేయడానికి కూడ సిద్ధపడ్డారు. అలా 1965 చివరిలో ఎకనమిక్‌ వీక్లీ మూతపడింది.

కాని అప్పటికే ఆ పత్రిక దేశవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నదంటే అప్పటికి సుప్రసిద్ధులైన యాబైమంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ పత్రికను కాపాడడానికి ముందుకు వచ్చి ఇటువంటి పత్రిక ఆగిపోవడానికి వీలులేదని ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఆ పత్రికను పునరుద్ధరించడం సాధ్యం కాకపోతే, అదే ధోరణిలో నడిచే మరొక వారపత్రికను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. రానున్న పత్రిక ఏదైనా అవే భావాలతో, అవే ప్రమాణాలతో, సచిన్‌ చౌధురి సంపాదకత్వం లోనే రావాలని వాళ్లు కోరుకున్నారు. కాకపోతే పాత అనుభవం వల్ల ఈ కొత్త పత్రికకు వ్యాపార దృష్టి గల యాజమాన్యం ఉండకుండా చూడాలని భావించారు. కనీసం రెండు లక్షల యాబైవేల రూపాయల విరాళాలు సేకరిస్తే ఇటువంటి పత్రికను నడపవచ్చునని వాళ్లు భావించారు. అలా 1966 తొలిరోజుల్లో వెలువడిన ఈ మేధావుల ప్రకటన మీద సంతకం చేసిన వారిలో అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన అర్థశాస్త్రవేత్తలు ఎకె దాస్‌ గుప్తా, కెఎన్‌ రాజ్‌, విఎం దండేకర్‌, సమాజ శాస్త్రవేత్త ఎంఎన్‌ శ్రీనివాస్‌, చరిత్రకారులు సర్వేపల్లి గోపాల్‌, తపన్‌ రాయ్‌ చౌధురి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు, అర్థశాస్త్రవేత్తలు కెఎస్‌ కృష్ణస్వామి, ఎం నరసింహం, దీనా ఖట్కటే, ప్రభుత్వంలో ఉన్నతాధికారులు పిఎన్‌ ధర్‌, ఎచ్‌వై శారదా ప్రసాద్‌, పీతాంబర్‌ పంత్‌ వంటి వారితో పాటు అప్పుడప్పుడే మేధో రంగంలో పేరు తెచ్చుకుంటున్న సామాజిక శాస్త్రవేత్తలు అశోక్‌ మిత్రా, ఎకె సేన్‌, జగదీష్‌ భగవతి, రొమిలా థాపర్‌, అర్జున్‌ సేన్‌ గుప్తా, పత్రికారచయితలు రొమేష్‌ థాపర్‌, బిజి వర్ఘీస్‌, ఆర్‌కె లక్ష్మణ్‌, పారిశ్రామికవేత్తలు సుధీర్‌ మూల్జీ, ఎచ్‌టి పరేఖ్‌ వంటి వారెందరో ఉన్నారు. ఈ ప్రకటన మీద సంతకం చేసిన మేధావులు ఇటువంటి పత్రికకు వ్యాపార యాజమాన్యం ఉండడం ఉచితం కాదని భావించారు గనుక తామే చొరవ చేసి ఒక స్వతంత్ర ట్రస్ట్‌ ను స్థాపించారు. ఆ ట్రస్ట్‌ పత్రికను ప్రచురించడం మాత్రమే కాక ఇతరేతర సామాజిక పరిశోధనా, చర్చా, ప్రచురణా కార్యక్రమాలు కూడ చేపట్టాలని లక్ష్య ప్రకటన రాసుకుని ట్రస్ట్‌ ను రిజిస్టర్‌ చేయించారు. తర్వాత కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన పిబి గజేంద్రగడ్కర్‌ అధ్యక్షుడుగా ప్రారంభమైన ఆ ట్రస్ట్‌కు సమీక్షా ట్రస్ట్‌ అని పేరు పెట్టారు. సమీక్షా ట్రస్ట్‌ చర్చల సందర్భంలో కెఎన్‌ రాజ్‌ పత్రిక పేరులో అప్పటికి ఉండిన ఎకనమిక్‌ వీక్లీకి పొలిటికల్‌ అనే మాట కూడ చేర్చాలని సూచించారట. అలా ఆ తర్వాత యాభై సంవత్సరాలుగా ప్రపంచమంతటా అపారమైన ఆదరణను చూరగొన్న ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (మిత్రులకూ చదువరులకూ ఇపిడబ్ల్యు) 1966 ఆగస్ట్‌లో ప్రారంభమైంది. కాని నాలుగు నెలలు తిరగకుండానే డిసెంబర్‌లో సచిన్‌ చౌధురి మరణించారు.

ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ పట్టభద్రుడు, అప్పటికే మూడు సంవత్సరాలుగా ఎకనమిక్‌ వీక్లీ లోను, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ లోను సచిన్‌ చౌధురికి సహాయ సంపాదకుడిగా పని చేస్తున్న కృష్ణరాజ్‌ (1937-2004) కు పదోన్నతి కల్పించే బదులు సమీక్షా ట్రస్ట్‌ బైటి నుంచి కొత్త సంపాదకుడిని తీసుకురావాలని ఆలోచించింది. అలా బొంబాయి విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉండిన ఆర్‌కె హజారిని సంపాదకుడిగా నియమించారు. అప్పటికే ప్రణాళికా సంఘంతో, ప్రభుత్వంతో, పరిశ్రమలతో సన్నిహిత సంబంధంలో ఉన్న హజారిని కేంద్ర ప్రభుత్వం 1969 బ్యాంకుల జాతీయకరణ తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు డెప్యూటీ గవర్నర్‌ గా నియమించడంతో సమీక్షా ట్రస్ట్‌కు కృష్ణ రాజ్‌ను సంపాదకుడిగా నియమించక తప్పలేదు.

అప్పటి నుంచి 2004లో మరణించేదాకా 35 సంవత్సరాల పాటు తన సర్వస్వాన్నీ ఇపిడబ్ల్యుకు ధారపోసిన కృష్ణరాజ్‌ ఇపిడబ్ల్యుకు పర్యాయ పదంగా మారిపోయారు. తాను స్వయంగా అర్థశాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన తన స్వీయ రచనల మీద కన్న పత్రిక సంపాదకత్వం మీద, పత్రికద్వారా అంతకంతకూ ఎక్కువగా కొత్త రచయితలను, పరిశోధకులను వెలుగులోకి తేవడం మీద, పత్రికను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం మీద కేంద్రీకరించారు. ఆయన సంపాదకుడిగా ఉన్న కాలంలోనే ప్రపంచంలోనూ, దేశంలోనూ ఆర్థిక, సామాజిక, రాజకీయ సంచలనాలెన్నో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కోపోద్రిక్త యువతరం ఉద్యమాల బాటపట్టిన దందహ్యమాన దశాబ్దమైన అరవైల మధ్య కొత్త రూపంలో ప్రారంభమైన ఇపిడబ్ల్యు కృష్ణరాజ్‌ సంపాదకత్వంలో ఆ సంచలనాలన్నిటికీ వేదిక కల్పించింది. నక్సల్బరీ ప్రజ్వలనం, భారత సమాజాన్ని నక్సల్బరీ అర్థవలస అర్థభూస్వామ్య వ్యవస్థగా నిర్వచించడం, ఆ తర్వాత భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిందా లేదా అనే విస్తృతమైన చర్చ ఆయన సంపాదక బాధ్యతలు చేపట్టడానికి సమాంతరంగా జరిగాయి. ఆ ఉత్పత్తి విధాన చర్చలో కీలకమైన వ్యాసాలెన్నో ఇపిడబ్ల్యులోనే అచ్చయ్యాయి. అప్పటి నుంచి ప్రారంభించి ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలలోను ఇపిడబ్ల్యు కేవలం సామాజిక శాస్త్ర పరిశోధనా వ్యాసాల వేదికగా, ఆర్థిక, రాజకీయ వార్తల, వ్యాఖ్యల పత్రికగా మాత్రమే కాక, ప్రత్యామ్నాయ ఉద్యమాల గళంగా కూడ మారింది. ఒకవైపు తీవ్రమైన మేధో చర్చలకూ, పరిశోధనా వ్యాసాలకూ, సంక్లిష్టమైన సైద్ధాంతిక వాదవివాదాలకూ వేదికగా ఉంటూనే సమకాలీనంగా జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ప్రజానుకూల వార్తలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు ప్రకటిస్తూ వచ్చింది. ఒకవైపు లబ్ధ ప్రతిష్ఠుల నుంచి, అంతర్జాతీయ స్థాయి నిపుణుల నుంచి ప్రామాణికమైన పరిశోధనా పత్రాలు సేకరిస్తూనే, అట్టడుగు గ్రామీణ ప్రాంతాల నుంచి, చిన్నపట్టణాల నుంచి రాస్తున్న రచయితలను, క్షేత్ర స్థాయి నివేదికలను ప్రోత్సహించడంలో కృష్ణరాజ్‌ ఎంతో కృషి చేశారు. ముప్పై ఐదు సంవత్సరాల సంపాదకత్వంలో తొలి ఇరవై సంవత్సరాలకు పైగా వామపక్ష భావాలతో, ఆ తర్వాత ప్రారంభమైన ప్రపంచీకరణలో ఎంతో కొంత మేలు ఉన్నదనే ఉదార భావాలతో ఆయనకు వ్యక్తిగతంగా ఏకీభావం ఉన్నప్పటికీ పత్రికను మాత్రం ఒక విశాలమైన, స్థిరమైన ప్రజానుకూల గళంగా నిలబెట్టడంలో కృష్ణరాజ్‌ అనితరసాధ్యమైన కృషి చేశారు. తనకు మార్క్సిజంలో, సోషలిజంలో విశ్వాసం ఉన్నప్పటికీ భిన్నాభిప్రాయాలకు పత్రిక తలుపులు మూయలేదు. ప్రపంచీకరణ వల్ల ప్రయోజనం ఉందని తాను నమ్మినప్పటికీ ప్రపంచీకరణకు వ్యతిరేక అభిప్రాయాలకు పత్రికలో చాల ఎక్కువ స్థానం ఇచ్చారు.

అయితే ఒకవైపు ప్రమాణాలు, పాఠకుల ఆదరణ పెరుగుతుండగానే పత్రిక తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం మొదలయింది. అసలు వార్తాపత్రికల ఆర్థిక వ్యవహారాల పరిస్థితే అది. పత్రికలు నడపని వారికి, కేవలం చదివేవారికి పత్రికల ఆర్థిక వ్యవస్థ గురించి అసలు విషయాలు తెలియవు. ఏ పత్రికకైనా దాని ఉత్పత్తి వ్యయాన్నంతా పాఠకుల దగ్గరే వసూలు చేయడం కనీసం భారత సమాజంలో అసాధ్యం. పత్రిక క్రమబద్ధంగా వెలువడాలంటే కాగితం, అచ్చు, రవాణాల మీద వెచ్చించే దానికన్న ఎక్కువగా కార్యాలయం, ఉద్యోగులు వంటి నిర్వహణా వ్యవస్థ మీద వెచ్చించవలసి ఉంటుంది. అందువల్ల దినపత్రికల వంటి వాటికైతే మూడో వంతో, నాలుగో వంతో మాత్రమే అచ్చు వ్యయం, మిగిలినదంతా నిర్వహణ వ్యయంగా ఉంటుంది. చిన్నపత్రికలకైతే కాగితం, అచ్చు వ్యయం, నిర్వహణ వ్యయం సగం సగంగా ఉంటాయి. ఇవాళ ఏ దినపత్రికైనా ఒక ప్రతి ఉత్పత్తి వ్యయం దాదాపు రు. 20 ఉండగా, అది రు. 5 కన్న ఎక్కువ ధర పెట్టడానికి వీలు లేదు. చిన్న పత్రికలకైతే అవి అచ్చయ్యే ప్రతుల సంఖ్య తక్కువ గనుక ఉత్పత్తి వ్యయం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉత్పత్తి వ్యయంలో సగానికో, ముప్పాతికకో మాత్రమే అమ్మవలసి వస్తుంది. మిగిలిన లోటు పూరించుకోవడానికి అన్ని పత్రికలూ వ్యాపార ప్రకటనల మీద ఆధారపడతాయి. వ్యాపార హంగులు ఉన్న పత్రికలైతే ఈ ప్రకటనల రాబడితో లాభాలు కూడ గడిస్తాయి. చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వడానికి వ్యాపార సంస్థలేవీ ముందుకు రావు గనుక వాటికి లోటు ఎప్పటికీ పూడదు. చిన్న పత్రికలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఎంతో ఆందోళన జరిగిన తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ ప్రకటనల వ్యయంలో కొంత భాగాన్ని, అతి చిన్న భాగాన్ని చిన్న పత్రికలకు కేటాయించాలని నిర్ణయించాయి. కాని అది కూడ ఆ ప్రభుత్వాల, అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయి, చిన్న పత్రికల ఆర్థిక స్థితి దినదిన గండంగా మారిపోయింది.

ఇపిడబ్ల్యుకు కూడ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ, దేశవ్యాప్త ప్రముఖ మేధావులతో కూడిన సమీక్షా ట్రస్ట్‌ యాజమాన్యం ఉన్నప్పటికీ, ఆర్థిక సుస్థిరత సాధ్యం కాలేదు. పత్రిక ప్రారంభించేటప్పుడు విరాళాలు సేకరించిన సమీక్షా ట్రస్ట్‌ ఆ తర్వాత ఆర్థిక స్థితి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి ద్రవ్య సంస్థ (ముఖ్యంగా బ్యాంకులు) ఒక ఆర్థిక పత్రికలో తమ వార్షిక నివేదికలు తప్పనిసరిగా ప్రకటన రూపంలో ఇవ్వాలనే నిబంధన వల్ల వచ్చే వ్యాపార ప్రకటనలు, కొద్ది మంది ఇపిడబ్ల్యు అభిమానులు సేకరించి పెట్టిన వ్యాపార ప్రకటనలు మినహా పత్రిక ఆర్థిక స్వావలంబనకు అవసరమైన నిధులు లేకుండానే పత్రిక నడిచింది. అయినా కృష్ణరాజ్‌ క్రమబద్ధంగా, ఒక్కొక్కసారి రెండు మూడు సంచికలు కలిపి అయినా పత్రికను వెలువరిస్తూనే వచ్చారు. ఉద్యోగులకు చాలీచాలని జీతభత్యాలే ఇచ్చినా, రచయితలకు పారితోషికం చాల తక్కువగానే ఉన్నా, కృష్ణరాజ్‌ వ్యక్తిత్వమే పత్రికకు అపారమైన గౌరవాన్ని, కొంతవరకు ఆర్థిక వనరులను సంపాదించి పెట్టింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధినేత డిఎన్‌ ఘోష్‌ 1990ల మొదట్లో సమీక్షా ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా మారిన తర్వాత, పత్రికకు ఒక మూలనిధి ఏర్పాటు చేయాలని, ఆ మూలనిధి మీద వడ్డీతోనే పత్రిక నిర్వహణ జరగాలని ఆలోచించి, అందుకు అవసరమైన నిధుల సేకరణ ప్రారంభించారు. 1990ల దాకా ఎప్పటి ఆదాయం అప్పటి వ్యయానికి సరిపోయే స్థితిలోనే నడిచిన పత్రికకు ఆ తర్వాత కొంత మెరుగైన ఆర్థిక స్థితి ఏర్పడింది. 1990ల చివరిలో కొద్ది సంవత్సరాల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ రు. పది లక్షల వార్షిక విరాళం ఇచ్చింది. అయితే ఆ నిధులు ప్రధానంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇపిడబ్ల్యు రిసర్చ్‌ ఫౌండేషన్‌ అవసరాలకే సరిపోయాయి.

అలా ఒకరకంగా పత్రిక సుస్థిరంగానే నడుస్తున్న సమయంలో 2004లో కృష్ణరాజ్‌ మరణించారు. ఇపిడబ్ల్యు మళ్లీ పాత పద్ధతిలో కొనసాగగలుగుతుందా అని ఎందరో అభిమానులు ఆందోళన పడ్డారు. స్వయంగా అర్థశాస్త్రవేత్త, హిందూ దినపత్రికలో సంపాదకుడిగా ఉన్న సి రామమనోహర్‌ రెడ్డిని కొత్త సంపాదకుడిగా సమీక్షా ట్రస్ట్‌ నియమించింది. రామమనోహర్‌ రెడ్డి సంపాదకత్వంలో ఇపిడబ్ల్యు తన పాత ప్రమాణాలను కొనసాగించడం మాత్రమేకాక, కొత్త సంప్రదాయా లను ప్రవేశపెట్టింది. మరిన్ని ఎక్కువ విషయాలలోకి, మరింత విస్తృతమైన పరిధిలోకి విస్తరించింది. మారుతున్న కాలానికి తగినట్టుగా డిజిటల్‌ ప్రచురణ కూడ చేపట్టింది. ఆయన సంపాదకుడిగా ఉన్న సమయంలోనే పత్రికకు యాబై సంవత్సరాలు నిండబోతుండగా, ఆ సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలను రూపొందించుకుంది. అప్పటికే పత్రిక చిన్న పత్రిక స్థాయి నుంచి పెద్ద పత్రికగా ఎదిగింది. వారం వారం వందకుపైగా పేజీలతో, క్రమం తప్పకుండా వెలువరించడం ఒక ఎత్తయితే, ప్రతి వారం పత్రికకు అందుతున్న దాదాపు వంద రచనల నుంచి వాటిలో మూడో వంతు మాత్రమే ప్రచురణకు ఎంపిక చేయడం మరొక ఎత్తు. అప్పటికే ఇపిడబ్ల్యు వార్షిక బడ్జెట్‌ రు. 5 కోట్లకు చేరింది. ఈ స్థాయికి ఎదిగిన బృహత్తర సంస్థను రామమనోహర్‌ రెడ్డి సమర్థంగా నిర్వహించారు.

అయితే సంస్థ నిర్వహణకు, చేపట్టిన కార్యక్రమాలకు, ఇపిడబ్ల్యు స్వర్ణోత్సవాల సందర్భంగా తేదలచుకున్న ప్రచురణలకు, ఇపిడబ్ల్యు చరిత్రపై డాక్యుమెంటరీకి అవసరమైన నిధుల సేకరణ విషయంలో రామమనోహర్‌ రెడ్డికి సమీక్షా ట్రస్ట్‌కు మధ్య భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. సంపాదకుడి చొరవతో చాలమంది పెద్ద దాతల నుంచి విరాళాలు సేకరించడం మొదలయింది.

2006, 2007ల్లో ప్రణాళికా సంఘం ఏడాదికి రు. 25 లక్షల చొప్పున రెండుసార్లు నిధులు సమకూర్చింది. 2006లోనే రోహిణి, నందన్‌ నీలెకణి దంపతులు రు. రెండు కోట్ల విరాళం ఇచ్చారు. ఆ తర్వాతి సంవత్సరం మరొక రెండున్నర కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ సమయంలోనే సర్‌ దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌ మూడు సంవత్సరాల మీద రు. 1.6 కోట్ల విరాళం ఇవ్వడానికి అంగీకరించింది. మరికొన్ని ద్రవ్య, పారిశ్రామిక సంస్థలు కూడ మూల నిధికి విరాళాలు ఇచ్చాయి. ఈ విరాళాల సేకరణ గురించి భిన్నాభిప్రాయా లతో రామమనోహర్‌ రెడ్డి తన సంపాదక బాధ్యతల నుంచి రాజీనామా చేశారు. అయితే ఈ విరాళాలు ఎంతగా వస్తున్నా, 2016 నాటికి ఇపిడబ్ల్యు వార్షిక బడ్జెట్‌ రు. 5 కోట్లకు చేరింది గనుక అందులో పది శాతం కన్న తక్కువ మాత్రమే మూలనిధి మీద వడ్డీగా వచ్చేది. మిగిలిన బడ్జెట్‌లో 50 శాతం చందాల నుంచి, 40 శాతం దాకా వ్యాపార ప్రకటనల నుంచి వచ్చేది. ఏమైనా, పత్రికను ఆర్థికంగా సుస్థిరంగా మార్చడానికి సంపాదకుడుగా రామమనోహర్‌ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఆయన అర్ధాంతర రాజీనామాకు దారితీశాయి.

పత్రిక ద్వారా కార్పొరేట్‌ - ప్రభుత్వ మిలాఖత్తు అక్రమాలను బైటపెట్టడానికి పరిశోధకుడుగా, సంపాదకుడుగా పరంజయ్‌ గుహా ఠాకూర్తా చేసిన ప్రయత్నాలు ఆయన అర్థంతర రాజీనామాకు దారితీశాయి.

ఇప్పుడు ఇపిడబ్ల్యు వంటి అపారమైన, ప్రజానుకూల, ప్రత్యామ్నాయ చరిత్ర ఉన్న పత్రికను ఇలా విధ్వంసం చేయగూడదని ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో మేధావులు, బుద్ధిజీవులు, రచయితలు, పాఠకులు సమీక్షా ట్రస్ట్‌కు విజ్ఞప్తులు చేస్తున్నారు. ట్రస్ట్‌ తన విధానాలు సవరించుకుంటుందా లేక ప్రత్యామ్నాయ గళాలు అతి ఎక్కువగా అవసరం ఉన్న ప్రస్తుత వాతావరణంలో ఇపిడబ్ల్యు కుంగి కృశించి రద్దయిపోతుందా చూడవలసే ఉంది.
-ఎన్.వేణు గోపాల్

(రచయిత వీక్షణం సంపాదకులు)

Keywords : EPW, Editor, adani, ambani, modi, bjp
(2024-04-24 19:26:16)



No. of visitors : 1158

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం

వీక్షణం, రాజకీయార్థిక సామాజిక మాసపత్రిక గత పదిహేడు సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజాపక్షం వహిస్తున్నందుకు, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను, విధానాలను విమర్శనాత్మకంగా పరిశీలించి, ప్రజలకు తెలియజేస్తున్నందుకు పాలకుల కన్నెర్రకు గురవుతున్నది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అదానీ