ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్


ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

ʹసామాజిక

(ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక అక్టోబర్ సంచికలో ప్రచురించబడినది)

రాజనీతి శాస్త్రవేత్త, బహు గ్రంథకర్త, బహుజన సామాజిక కార్యకర్త ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్‌ రాసిన ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ అనే చిన్న పుస్తకంపై గత మూడు వారాలుగా విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఆ పుస్తకం, ముఖ్యంగా ఆ పుస్తక శీర్షిక తమ మనోభావాలను గాయ పరచిందని అనడం దగ్గర ప్రారంభించి ఐలయ్యను దూషించడం, అవమానించడం, ఉరి తీయాలని, నడివీథిలో నరుకుతామని అనడం, భౌతిక దాడి చేయడానికి ప్రయత్నించడం, పుస్తకాన్ని నిషేధించాలని, రచయితను శిక్షించాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తులు చేయడం దాకా ఆర్యవైశ్య సంఘాలు, సాధారణంగా కోమటి కులస్తులు తమ ప్రతిస్పందన ప్రకటిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. పనిలో పనిగా హిందూ మతోన్మాద సంఘ్‌ పరివార్‌ శక్తులు, బాబాలు, స్వాములు కూడ ఈ వ్యవహారంలోకి దిగి కోమట్లను రెచ్చగొట్టడానికి, కుల వివాదాల మంటను ఎగసన దోయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగయంత్రం కూడ ఈ వివాదంలో తలదూర్చి ఐలయ్య మీద ఏ కేసు పెట్టాలా అని ఆలోచిస్తున్నది. స్వయంగా మంత్రులు, శాసనసభ్యులు పుస్తకానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరొకవైపు దళిత, బహుజన శక్తులు, ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, సంఘాలు ఐలయ్య మీద దాడిని ఖండిస్తూ, ఆయనకు ఏమైనా జరిగితే ఈ ఆర్యవైశ్య, సంఘ్‌ పరివార్‌ శక్తులే బాధ్యత వహించాలని అంటున్నాయి. శీర్షికతో సహా పుస్తకాన్ని, అందులోని అంశాలను పూర్తిగా అంగీకరించేవారి దగ్గరి నుంచి ఐలయ్య ఉపయోగించిన సంవిధానంతో ఏకీభావం లేనివారి వరకు ఎందరో ఈ దాడిని ఖండిస్తున్నారు. ఐలయ్యకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

నిజానికి ఈ వివాదం ఇప్పుడే చెలరేగడానికి ఈ పుస్తకం ఐలయ్య తాజా రచనేమీ కాదు. ఆ భావాలను ఐలయ్య ఇప్పుడే కొత్తగా వ్యక్తీకరించడం లేదు. ఆయన గత ఇరవై సంవత్సరాలుగా రాస్తున్న పుస్తకాలలో, వ్యాసాలలో, చేస్తున్న ఉపన్యాసాలలో ఇటువంటి భావనలు, వాదనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పుస్తకం విషయానికే వస్తే, ఇది ఐలయ్య రాసిన, 2009లో సేజ్‌ పబ్లికేషన్స్‌ అనే ప్రతిష్ఠాత్మకమైన ప్రచురణ సంస్థ ప్రచురించిన ʹపోస్ట్‌ హిందూ ఇండియాʹ అనే పెద్ద పుస్తకంలో ఒక అధ్యాయం మాత్రమే. ఆ పుస్తకం తెలుగు అనువాదాన్ని ʹహిందూ మతానంతర భారతదేశంʹ పేరుతో 2011 లో ఎమెస్కో ప్రచురణ సంస్థ వెలువరించింది. హిందూ మతం నిర్మించిన, శతాబ్దాలుగా పెంచి పోషించిన కుల ఆధారిత సాంస్కృతిక వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాల వల్ల భారతదేశంలో లోలోపల ఒక అంతర్యుద్ధం సాగుతున్నదని, ఆ అంతర్యుద్ధం ఎప్పుడైనా విస్ఫోటనం కావచ్చునని, అలా తన స్వభావం వల్లనే హిందూ మతం అంతరించి పోతుందని ఐలయ్య సూత్రీకరించారు. హిందూ మతం అంతరించిన తర్వాత భారతదేశం ఎలా ఉంటుందని ఐలయ్య ఆ పుస్తకంలో కొన్ని ఆలోచనలు చేశారు.

ఏ మతానికైనా ఆధ్యాత్మిక న్యాయం అనే భావన పునాదిగా ఉంటుందని, ఉండాలని, కాని హిందూ మతానికి ఆ పునాది లేదని రుజువు చేయడానికి ఆయన హిందూ మతంలోని కులవ్యవస్థలోని అన్యాయాన్ని విప్పి చెప్పడానికి ప్రయత్నించారు. ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలైన క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం, హిందూ మతాలలో మొదటి మూడూ తరతమ స్థాయిల్లో ఆధ్యాత్మిక న్యాయ భావనను ఆలంబన చేసుకోగా, హిందూ మతం మాత్రం ఆధ్యాత్మిక ఫాసిజాన్ని, ఆధ్యాత్మిక ఆధిపత్యవాదాన్ని పునాదిగా పెట్టుకున్నదని ఆయన వాదించారు. ఈ ఫాసిజాన్ని, ఆధిపత్యవాదాన్ని వివరించడానికి ఆయన కులం, సంస్కృతి, శాస్త్రవిజ్ఞానం అనే మూడు కోణాల నుంచి ఒక్కొక్క కులం మీద తన పరిశీలనలు ప్రకటించారు. పదమూడు అధ్యాయాల పుస్తకంలో మొదటి ఎనిమిది అధ్యాయాలలో ఉత్పత్తి కులాలను, శ్రామిక కులాలను, ఆదివాసి, చండాల, శూద్ర కులాలను విశ్లేషించారు. తొమ్మిదో అధ్యాయంలో కోమట్ల (వైశ్యుల) గురించి, పదో అధ్యాయంలో బ్రాహ్మణుల గురించి, పదకొండో అధ్యాయంలో బ్రాహ్మణ - బనియా విద్యావంతుల గురించి రాశారు. రానున్న అంతర్యుద్ధం, తత్ఫలితంగా అంతరించిపోనున్న హిందూమతం గురించి పన్నెండో అధ్యాయంలో, హిందూ మతానంతర భారతదేశం గురించి పదమూడో అధ్యాయంలో రాశారు. నిజానికి ఇంగ్లిష్‌ పుస్తకంలో అధ్యాయాలకు ఆయన పెట్టిన శీర్షికల్లో కుల ప్రస్తావన లేదు. ఉచిత ఉపాధ్యాయులు, సబాల్టర్న్‌ శాస్త్రవేత్తలు, ఉత్పాదక సైనికులు, సబాల్టర్న్‌ స్త్రీవాదులు, సామాజిక వైద్యులు, మాంసం, పాల ఆర్థికవేత్తలు, అజ్ఞాత నిర్మాణశాస్త్రవేత్తలు, ఆహార ఉత్పత్తిదారులు, సామాజిక స్మగ్లర్లు, ఆధ్యాత్మిక ఫాసిస్టులు, మేధో గూండాలు అనేవే ఆయన ఇంగ్లిష్‌ మూలంలో పెట్టిన శీర్షికలు. పుస్తకానికి తెలుగు అనువాదం వెలువడినప్పుడు కూడ ఆ శీర్షికలు అలాగే ఉన్నాయి.

అయితే భూమి బుక్‌ ట్రస్ట్‌ అనే ప్రచురణ సంస్థ 2017లో ఒక్కొక్క అధ్యాయాన్నీ ఒక్కొక్క చిన్న పుస్తకంగా పన్నెండు పుస్తకాలు ప్రచురించింది. ʹమాలల తత్వం,ʹ ʹమాదిగ తత్వంʹ, ʹఅజ్ఞాత ఇంజనీర్లు కుమ్మరి, కమ్మరి, కంసాలి, వడ్రంగి, గౌండ్లʹ, ʹఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలుʹ, ʹబహుజన స్త్రీవాదులు చాకలోళ్లుʹ, ʹసామాజిక వైద్యులు మంగలోళ్లుʹ, ʹకాపులు - శూద్రులుʹ, ʹఆధ్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులుʹ ʹఇంటలెక్చువల్‌ గూండాలు,ʹ అనే శీర్షికలు పెట్టింది. ఈ పుస్తకాలలో కొన్నిటికి ఐలయ్య కొత్త ముందుమాటలు కూడ రాశారు.

పుస్తకంలో ఏముంది, దానిలో చర్చించిన అంశాలలో ఆమోదయోగ్యమైనవి, సమర్థనీయమైనవి, తిరస్కరణీయమైనవి, చర్చనీయమైనవి ఏమిటి అని విమర్శనాత్మకమైన, విశ్లేషణాత్మకమైన సంభాషణ జరిగితే సమాజానికీ, రచయితకూ, ఆయా వర్గాలకూ కూడ ఉపయోగకరంగా ఉండేది. కాని శీర్షిక చూస్తూనే కోమటి కులస్తులు అది తమను అవమానించేలా ఉందని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు ప్రారంభించారు. అది ఫిర్యాదు స్థాయిలోనే ఉన్నా కూడ చర్చకు ఆస్కారం ఉండేది. కాని త్వరలోనే వీథి ప్రదర్శనలు, ఐలయ్య మీద వ్యంగ్యవ్యాఖ్యలు, దుర్భాషలు, చెప్పుల దండలు వేయడాలు, అవమానకర దూషణ నినాదాలతో ఊరేగింపులు, దిష్టిబొమ్మ తగులబెట్టడాలు, కేసు పెట్టమని పోలీసులకు, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడాలు మొదలయ్యాయి. ఈ ఆందోళనలకు ఆర్యవైశ్య సంఘాల నాయకులు, అవోపా నాయకులు నేతృత్వం వహించారు. ఈ నిరసన సభల్లో ఐలయ్యకు ఉరి విధించాలని, నడివీథిలో నరికి చంపాలని కూడ ఆర్యవైశ్య నాయకులు ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారు. చాల చోట్ల ఆర్యవైశ్య సంఘాల ఊరేగింపులు హిందూ జెండాలతో, నినాదాలతో సాగాయి. సంఘ్‌ పరివార్‌ నాయకులు స్వయంగా ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు, నాయకత్వం కూడ అందించారు. కోమటి కులానికి అవమానం అనే దగ్గరినుంచి క్రమక్రమంగా హిందూ మతానికి అవమానం, పరాయి మతాల కోసమే, క్రైస్తవ నిధులతోనే ఈ వివాదం అనేంత దూరం ఈ నిందలు సాగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలలోనూ ఆర్యవైశ్య సంఘాలు, సంఘ్‌ పరివార్‌ శక్తులు ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదులు కూడ చేశారు. రెండు రాష్ట్రాలలోను కొందరు మంత్రులు, శాసనసభ్యులు ఐలయ్య పుస్తకాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటన్నిటికీ పరాకాష్టగా జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లా పరకాలలో ఆర్యవైశ్య మూకలు ఐలయ్య వాహనాన్ని అడ్డుకుని, ఆయనపై భౌతిక దాడి చేయడానికి కూడ ప్రయత్నించాయి.

నిజానికి ఐలయ్య పుస్తక శీర్షిక కన్న, పుస్తకంలో ఐలయ్య చేసిన విశ్లేషణల కన్న తీవ్రమైన, నిందార్థకమైన, వ్యంగ్యమైన వ్యాఖ్యలు సమాజంలో ఎప్పటి నుంచో అన్ని కులాల మీదా ఉన్నాయి, ప్రత్యేకించి కోమట్ల మీద కూడ ఉన్నాయి. వేమన పద్యాలలో కోమట్ల గురించి ఉన్న వ్యాఖ్యలతో, చింతామణి వంటి ఎన్నో నాటకాలలో కోమటి పాత్ర చిత్రణతో పోలిస్తే ఐలయ్య వ్యాఖ్యలు ఎక్కువేమీ కాదు. మన సమాజంలోని అన్ని కులాలకూ ఒక్కొక్క ప్రత్యేక నిర్దిష్ట స్వభావాన్ని ఆపాదించి, దాని మీద ఆధారపడిన వ్యంగ్య వ్యాఖ్యలు, నిందలు, అవమానకరమైన సామెతలు ఎన్నో ఉన్నాయి. ఆమాటకొస్తే కులాల గురించి వ్యంగ్య, నిందార్థ, దూషణ వ్యాఖ్యలను కూడ ఒక ప్రత్యేక నేపథ్యంలో చూడవలసి ఉంది. అన్ని కులాల మీద వ్యాఖ్యలూ ఒకటి కావు. అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. లోతుగా ఆలోచించకుండా అలవోకగా పునరుక్తి చేసే సాధారణ వ్యవహారంలో కూడ ఉన్నాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. వాటి వల్ల గాయపడిన మనోభావాలకు ఇంతవరకూ ఎప్పుడూ పరిహారం దొరకలేదు. ఒక్క మనుస్మృతి చదివినా శూద్రుల మీద, చండాలుల మీద ఇటువంటి అవమానకరమైన నీచమైన వ్యాఖ్యలు కోకొల్లలుగా దొరుకుతాయి. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్నవాళ్లందరూ ఆ అవమానాల పుస్తకాన్ని పవిత్ర గ్రంథంగానే పూజిస్తున్నారు. మన సమాజంలో ఆధిపత్య కులాల మీద కూడ ఇటువంటి వ్యాఖ్యలు, సామెతలు ఉన్నమాట నిజమే. అయితే ఆధిపత్య కులాల మీద ఉన్న వ్యాఖ్యలూ తక్కువే, వాటిని వారివల్ల అణగారినవారు కడుపు మండి సృష్టించుకుని ఉంటారు, పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టు తమలో తాము మాత్రమే గొణుక్కుని ఉంటారు. ఇప్పుడు కొన్ని వందల, వేల ఏళ్ల తర్వాత ఆయా అణగారిన కులాల నుంచి విద్యావంతులూ, చైతన్యవంతులూ ఎదిగివచ్చిన తర్వాత తమ సంస్కృతిని వ్యక్తీకరించడంలో భాగంగా ఆ వ్యాఖ్యలనూ, సామెతలనూ బైటపెడుతున్నారు, అక్షరాలకు ఎక్కిస్తున్నారు. కనుక ఐలయ్య చేసిన వ్యాఖ్య అవమానకరంగా ఉందనో, తమ మనోభావాలను గాయపరిచిందనో అనే ముందు మన ఈ సామాజిక నేపథ్యం గురించి చర్చించవలసి ఉంది.

ఐలయ్య వ్యాఖ్యల మీద మర్యాదకరంగా ఉన్నట్టు కనబడుతున్న మరొక అభ్యంతరం అటువంటి తప్పులు చేసినవారు కొందరున్నా దాన్ని మొత్తం కులానికి అంటగడతారా అని. ఎవరు స్మగ్లింగ్‌ చేశారో వారిని నేరుగా విమర్శించవచ్చు గాని మొత్తంగా కులానికి ఆపాదిస్తారా, నేరం చేసినవారిని విచారించాలి, శిక్షించాలి గాని, నేరంలో భాగం లేనివారిని నిందించడం తగునా అనే ఈ ప్రశ్న న్యాయమైనదిలా కనబడుతుంది. కాని ఈ ప్రశ్నకు మూడు స్థాయిలలో జవాబు ఉంది.

ఒకటి, కులానికి ఒక స్వభావం ఉంటుందని, అది ఆ కులంలో పుట్టిన మనుషులందరికీ ఉంటుందని అంటున్నవాళ్లలో ఐలయ్య మొదటివారు కాదు. ఈ దేశంలో కులాన్ని పుట్టించి, పెంచి పోషించిన హిందూ మతం కులస్వభావం అనే భావనను నమ్ముతున్నది. పుట్టుకే స్వభావాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతున్నది. ఒకసారి ఒక మనిషి ఒక కులంలో పుడితే వృత్తిలోనూ, ఆచారవ్యవహారాలలోనూ, కుటుంబ, వివాహ సంబంధాలలోనూ ఆ కుల పరిధులను దాటగూడదని విధినిషేధాలు విధించినది హిందూ మతమే. కుల విభజనను స్థిరీకరించి, అనుల్లంఘనీయంగా మార్చి, దానికి నిచ్చెనమెట్ల నిమ్నోన్నత స్వభావాన్ని ఇచ్చినది కూడ హిందూ మతమే. అందువల్ల ఒక కులానికి ఒక స్వభావం ఇచ్చి అందరినీ నిందిస్తున్నారని ఐలయ్యను విమర్శించే ముందు అసలు హిందూ మతం ప్రారంభించిన, మనుస్మృతి అక్షరాలా సూత్రీకరించిన సంస్కృతి అదేనని గుర్తించాలి. భారత సమాజంలో కులం అనుల్లంఘనీయమైనది గనుక, అది కేవలం భౌతిక అంశాలలో మాత్రమే కాక, మానసిక, మేధో అంశాలలో కూడ, సాధారణ ఆలోచనలలో కూడ ప్రభావం వేస్తుంది గనుక, ప్రతి ఒక్కరూ తమను తాము నిరంతరం, ప్రతి పనిలో, ప్రతి మాటలో తరచి చూసుకుని పరీక్షించుకుని, సంస్కరించుకోకుండా ఉంటే ఆ కుల స్వభావం ఎప్పుడైనా ఎక్కడైనా చొరబడుతుంది. ఆ స్వభావం తరతరాలుగా వచ్చిన ఆధిపత్య ధోరణి కావచ్చు, లేదా ఆత్మన్యూనతా ధోరణి కావచ్చు, లేదా కొందరి దగ్గర ఆధిపత్యం, కొందరి దగ్గర న్యూనత ప్రకటించే ధోరణి కావచ్చు. ఎవరైనా దీని నుంచి తప్పించుకుని, ʹకులాన్ని అధిగమించానుʹ అని చెప్పే పరిస్థితి ఇవాళ్టికైతే లేదు. అది వారి చైతన్యంతో మాత్రమే సాధించగలిగేది కాదు, సామాజిక వాతావరణంలో సమూలమైన మార్పుకు సంబంధించినది. చైతన్యం, నిరంతర విమర్శ - ఆత్మవిమర్శలతో ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలకు, సవరణలకు మాత్రమే అవకాశం ఉంది.

రెండు, కొందరు నిజంగానే స్మగ్లర్లు గానే ఉండినా, అక్రమంగా సామాజిక సంపదను తమ స్వాధీనం చేసుకున్నా వారిని నేరుగా విమర్శించాలి గాని, ఆ పాపంలో భాగస్తులు కాని, కేవలం ఆ కులంలో పుట్టినవారందరినీ ఈ మాటతో అవమానించడం తగునా అనే ప్రశ్న పైకి చూడడానికి తార్కికంగా, సంబద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. కాని కాదు. చర్చలో ఎప్పుడైనా రాజకీయ పరిభాష ఉంటుంది. ఒక తప్పు గురించి సాధారణీకరించి చెప్పేటప్పుడు ఆ తప్పు చేసిన మనిషి ఏ సమూహానికి, ఏ జాతికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి చెందుతారో ఆ విశాల సమూహం పేరు చెప్పడం సాధారణ రాజకీయ పరిభాషే. ఈ అలవాటు ప్రపంచవ్యాప్తంగా ఉండగా భారతదేశంలో విభిన్న కుల, మత, ప్రాంత, భాషా సమూహాల వల్ల, నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న దురభిప్రాయాల వల్ల మరింత ఎక్కువగా ఉంది. ఒక్క పురుషుడిలో, కొందరు పురుషులలో బైటపడిన ధోరణుల, స్వభావాల వ్యక్తీకరణగా పురుషాధిపత్యం, పితృస్వామ్యం అనే భావనలు వచ్చాయి. హిందూ మతోన్మాదం అన్నప్పుడు, లేదా ఇతర మతోన్మాదాల గురించి మాట్లాడినప్పుడు కూడ ఆ మతంలోని మనుషులందరూ ఆ పని చేశారని కాదు. అన్నిటికన్న పెద్ద ఉదాహరణ చెప్పాలంటే, పిడికెడు మంది బ్రిటిష్‌ వ్యాపారస్తులు కలిసి పెట్టుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ దేశానికి వచ్చి దోపిడీ, పీడన, పాలన సాగిస్తే మన స్వాతంత్య్రోద్యమం మొత్తం బ్రిటిష్‌ వారిని మాత్రమే కాదు, తెల్లవాళ్లందరినీ తిట్టిపోసింది. ఈ రాజకీయ పరిభాష అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆమోదించవలసిందే తప్ప, ʹఆ సమూహాన్ని అంటున్నాము గాని ఆ సమూహంలో అందరినీ అనడం లేదుʹ అనే వివరణ ప్రతి సందర్భంలోనూ ఇస్తూ పోవాలని అడగడం హాస్యాస్పదం.

మూడు, ఒకవేళ ఒకరు ఆ సమూహంలో పుట్టినా, చారిత్రకంగా ఆ సమూహం చేసిన దురన్యాయాల పట్ల వారికి స్పృహ ఉంటే, ఆ సమూహపు దురన్యాయాలను విమర్శించినప్పుడు వారు ఉక్రోషపడ నవసరం లేదు. ʹఔను నేను పుట్టిన సమూహం ఇంత దుర్మార్గంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించింది, వారి తప్పులను నేను గుర్తెరిగాను, వాటినుంచి నన్ను నేను దూరం చేసుకుంటున్నానుʹ అని అనుకోగలిగితే ఆ ఉక్రోషం, మనోభావాలు గాయపడడం జరగనే జరగదు. ఆ సమూహాన్ని అధిగమించామని, తమకు కుల స్వభావం లేదని చెప్పుకునే వారు ఆ సమూహం మీద, కులం మీద విమర్శలకు నొచ్చుకోవలసిన అవసరం లేదు.

ఈ సందర్భంగా గుర్తించవలసిన మరొక అంశం ఉంది. ఐలయ్య మీద, ఒక రచన మీద జరుగుతున్న దాడిని నిర్ద్వంద్వంగా ఖండించవలసి ఉంది. ఆ దాడి వెనుక సంఘ్‌ పరివార్‌ శక్తులు ఉన్న నేపథ్యంలో, గోవింద్‌ పన్సారే, ఎం ఎం కల్బుర్గి, గౌరి లంకేశ్‌లను కేవలం వారు ప్రకటించిన భావాల కొరకే సంఘ్‌ పరివార్‌ శక్తులు హత్య చేసిన నేపథ్యంలో ఐలయ్యకు సంపూర్ణ క్రియాశీల సంఘీభావం తెలపవలసి ఉంది. అయితే ఈ దాడిని ఖండించడం, ఆయన ప్రజాస్వామిక హక్కును పరిరక్షించడం ఒక ఎత్తు అయితే, ఆయన ప్రకటించిన భావాలన్నిటినీ, చేసిన వాదనలన్నిటినీ బేషరతుగా సమర్థించడం మరొక ఎత్తు. ప్రస్తుతం దళిత, బహుజన, ప్రగతిశీల శక్తులు ఈ రెండు విభిన్న అంశాలను కలగలిపి చూస్తున్నాయి. ఐలయ్య మీద దాడిని ఖండించడమంటే ఆయన రచనలోని ప్రతి అక్షరాన్నీ సమర్థించడం అని అర్థం చెపుతున్నాయి. ఐలయ్య ఈ పుస్తకంలో గాని, ఇతరంగా గాని చేసిన, చేస్తున్న వాదనలతో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన చాల సందర్భాలలో అతి సాధారణీకరణలు చేస్తారు. ఒక సూత్రీకరణ చేయడానికి విస్తృత సామాజికానుభవం అవసరమని, వ్యక్తిగత, యాదృచ్చిక అనుభవం నుంచి సూత్రీకరణలు చేస్తే వాటికి విశ్వసనీయత, సంబద్ధత లోపిస్తుందని మరచిపోతారు. వాస్తవాల నుంచి సత్యాన్ని వెలికితీయడం, సాక్ష్యాధారాలతో సూత్రీకరణలు చేయడం వంటి సామాజికశాస్త్రాలలో సాధారణంగా పాటించవలసిన మంచి పద్ధతులను ఆయన తిరస్కరిస్తారు. చాల సూత్రీకరణలను చారిత్రక దృక్పథానికి దూరంగా, స్థలకాలాలతో సంబంధం లేకుండా చేస్తారు. తన వాదనలకు వ్యతిరేకులు అతి కొద్దిమంది అని, తనవైపు, అవతలివైపు కాకుండా మధ్యలో ఒప్పించ వలసిన వారు చాలమంది అని, వాదనలలో వారిని ఒప్పించడానికి ఒక ప్రత్యేక వాదనా పద్ధతి అవసరం అని ఆయన గుర్తించరు. తనతో లేనివారందరూ తన శత్రువులే అన్న పద్దతిలో అతివేలపు సూత్రీకరణలు చేస్తారు.

ఈ లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ పీడితకులాల తరఫున, మొదటితరం విద్యావంతుడిగా ఆయన చేస్తున్న వాదనలను మొదట యథాతథంగా గౌరవించి, వాటితో చర్చకు, సంభాషణకు, సంవాదానికి దిగడం ప్రగతిశీల శక్తులు చేయవలసిన పని. ʹనువ్వు ప్రకటించే భావాలతో నాకు ఏకీభావం లేకపోవచ్చు. కాని ఆ భావాలు ప్రకటించే నీ హక్కును కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తానుʹ అనే వోల్టేర్‌ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఐలయ్య మీద దాడిని ఖండించడం, ఐలయ్యకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించడం, ఐలయ్య వాదనలతో చర్చకు దిగడం చేయవలసి ఉంది.

-ఎన్. వేణుగోపాల్,వీక్షణం సంపాదకులు

Keywords : kancha ilaiah, book, arya vashyas, samajika smugglers, rss, hindutva,
(2019-01-21 11:35:18)No. of visitors : 706

Suggested Posts


అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

అదానీ కోపం..ఈపీడబ్ల్యూ సంపాదకుడి రాజీనామా - ఎన్.వేణు గోపాల్

అదానీ గ్రూపు కంపెనీలకు రు. 500 కోట్ల ప్రయోజనం కలిగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఇపిడబ్ల్యు వెబ్‌ సైట్‌ మీద అంతకు కొద్ది రోజుల ముందు...

మహాజనాద్భుత సాగరహారానికి ఐదేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.....

Search Engine

నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
more..


ʹసామాజిక