అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్


అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

అబ‌ద్ధాల

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సెషన్స్ జడ్జి సూర్యకాంత్‌ ఎస్ షిండే మార్చ్ 7న ఇచ్చిన తీర్పులో జి.ఎన్. సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీ, మ‌హేష్ టిర్కి, పాండ్ నరోటే లకు యావజ్జీవ కారాగార శిక్ష, విజయ్ టిర్కి కి పది సంవత్సరాల శిక్ష విధించారు. ఏదైనా నేరం, హింస చేశారని ఏ ఒక్క ఆధారం లేకుండా కేవలం భావాలు కలిగి ఉన్నందుకు, ఆ భావాలు ప్రచారం చేసినందుకు ఇంత కఠినమైన శిక్ష విధించడం అసాధారణమైన విషయం.

ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా గురించీ, ఆయన అంగవైకల్యం గురించీ, ప్రశాంత్ రాహీ, హేమ్ మిశ్రాల గురించీ, వారి కృషి గురించీ మీకు ఏ మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. ఈ ముగ్గురూ ఎన్నో సంవత్సరాలుగా బహిరంగ ప్రజా జీవితంలో ఉన్నారు. సాయిబాబా అధ్యాపక వృత్తిలో, ప్రశాంత్ రాహీ పాత్రికేయ వృత్తిలో, హేమ్ మిశ్రా విద్యార్థి సంఘ కార్యకర్తగానూ, గాయకుడిగానూ ఉన్నారు. అయినా వారి గురించే తెలియదంటే, మిగిలిన ముగ్గురు ఆదివాసులు మహేశ్ టిర్కి పాండు నరోటె, విజయ్ టిర్కిల గురించి ఇంక ఎంత మాత్రమూ తెలిసి ఉండకపోవచ్చు. వారి మీద కేసు ఏమిటో, వారి కార్యకలాపాలు ఏమిటో, వారి పట్ల రాజ్యం ఎందుకు కక్షపూనిందో కూడ మీకు తెలియక పోవచ్చు. కాని ఒక్కసారి ఓపిక చేసుకుని, గడ్చిరోలి జిల్లా జడ్డి సూర్యకాంత్ ఎస్ షిండే రాసిన 827 పేజీల తీర్పు చదివి చూడండి. ఆ 1014 పేరాగ్రాఫుల‌ తీర్పు, 24 పేరాగ్రాఫుల అంతిమ ఉత్తర్వులు చదివితే, పోలీసు ప్రాసిక్యూషన్ ఎన్ని అబద్దాలు కల్పించిందో, ఎన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించిందో, ఎన్ని నిరాధారాలను ఆధారాలుగా చూపడానికి ప్రయత్నిం చిందో అర్ధమవుతుంది. ఆ అబద్దాలనూ, సాక్ష్యాలనూ, "ఆధారాలనూ" డిఫెన్స్ న్యాయవాది సురేంద్ర గాడ్డింగ్ ఎంత ప్రతిభావంతంగా తుత్తునియలు చేశారో కనబడుతుంది. ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో అర్ధమవుతుంది.

మహేశ్ టిర్కి పాండు నరోటె, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీ, విజయ్ టిర్కి, జి.ఎన్. సాయిబాబాలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం సాగించడానికి నేరపూరితమైన కుట్ర పన్నారనీ, ఆ ఉద్దేశ్యంతో ప్రజలను సమీకరించారనీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ భారత ప్రభుత్వాన్నీ నేర‌పూరిత‌మైన బ‌ల‌ప్ర‌యోగం ద్వారా కూల‌దోయ‌డానికి ప్ర‌య‌త్నించార‌నీ, ప్రజల ప్రాణాలనూ ఆస్తులనూ విధ్వంసం చేసే భారీ హింసాకాండ ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వం పట్ల సాధారణ ప్రజల విశ్వాసాన్ని చెదర గొట్టడానికీ, తగ్గించడానికీ ప్రయత్నించారనీ, తద్వారా చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యవస్థను అస్థిరం చేయడానికీ ప్రయత్నించారనీ, వేర్పాటువాద, తిరుగుబాటు భావాలను రెచ్చగొట్టడానికి బహిరంగ రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారనీ, తమ నేరపూరిత కుట్ర లక్ష్యాలను సాధించడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), దాని అనుబంధ సంస్థ అయిన రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్డిఎఫ్)ల ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగించారనీ, హింసాపూరిత తీవ్రవాద చర్యలను, చట్టవ్యతిరేక చర్యలను సాగంచడానికి కుట్రపన్నడం, ప్రచారం చేయడం, రెచ్చగొట్టడం, ప్రోత్సహించడం, ఉద్దేశపూర్వకంగా అవకాశాలు కల్పించడం అనే నేరాలకు పాల్పడ్డారనీ ప్రాసిక్యూషన్ అభియోగం. ఈ నేరాలన్నీ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం 1967లోని సెక్షన్లు 13, 18, 20,38, 39 ప్రకారం, భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 120-బి ప్రకారం శిక్షార్హమైన నేరాలని ప్రాసిక్యూషన్ వాదించింది.

ఈ అభియోగపత్రంలో ఆరోపించిన నేరాలు నిజంగా నేరాలేనా, అధికారంలో ఉన్న వ్యవస్థ, ప్రభుత్వం తమ అక్రమాలను వ్యతిరేకించే ఆలోచనలనూ ఆచరణలనూ నేరాలుగా ప్రకటిస్తున్నదా అనే అనే తాత్విక, సామాజిక, రాజకీయార్థిక చర్చ ఎంతో చేయవలసి ఉంది. ఆ చర్చను కాసేపు పక్కన పెట్టి, ఉన్న వ్యవస్థను ఆమోదించేవారైనా అంగీక‌రించ‌క తప్పని వాస్తవమేమంటే, ఈ ఆరుగురు వ్యక్తులూ పైన చెప్పిన నేరాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేశారో నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో నిరూపించి, ఆ ఆరోపణలను తేల్చడం ప్రాసిక్యూషన్ బాధ్యత. కాని ఈ కేసులో ప్రాసిక్యూషన్ భారీ నేరారోపణలు చేసిందే తప్ప ఆ ఆరోపణలను నిర్ద్వంద్వంగా, సందేహాతీతంగా రుజవు చేయలేకపోయింది. సాక్ష్యాధారా లుగా ప్రాసిక్యూషన్ చూపించిన వాటన్నిటి బోలుతనాన్ని అబద్ధాన్ని దురుద్దేశాలను డిఫెన్స్ న్యాయవాది అద్భుతంగా ఎత్తిచూపారు, అయినా న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ ఆరోపణలను నమ్మితీర్పు తయారుచేశారు. మొట్టమొదట ఈ తీర్పును భారీగా 827 పేజీలు రాయడం "తిలకాష్టమహిషబంధనంʹ లాగ తయారుచేసి భయపెట్టడానికే తప్ప, ఎక్కడా హేతుబద్ధమైన, సకారణమైన, తార్కికమైన వాదనలు లేవు. చెప్పిందే చెప్పడం, అనవసరమైన అంశాలు చెప్పడం ఎంత ఎక్కువగా సాగిందంటే కనీసం ఇరవై అంశాలు ఒక్కొక్కటి పదిసార్ల పైన చెప్పారు. ప్రాసిక్యూషన్ న్యాయవాది ఉంటంకించిన ఇతర కోర్టుల తీర్పుల సారాంశం చెపితే సరిపోయేదానికి, ఆ తీర్పుల నుంచి అవసరమైనవీ కానివీ చాల ఎక్కువ భాగాలు ఉటంకించి పేజీలు నింపారు. డిఫెన్స్ న్యాయవాది ఉటంకించిన కేసుల గురించి మాత్రం పైపై వ్యాఖ్యలు చేసి ఆ వాదనలను కొట్టివేశారు. సాయిబాబా దగ్గర కంప్యూటర్ హార్డ్ డిస్కులలో దొరికాయని ప్రాసిక్యూషన్ చెప్పిన పత్రాలను, ఉత్తరాలను మొత్తానికి మొత్తం ఒకటికి నాలుగుసార్లు ఉటంకించి పేజీలు నింపారు. ఆర్డిఎఫ్ ప్రణాళిక - నిబంధనావళి మొత్తానికి మొత్తం, ఆర్డిఎఫ్ మొదటి మహాసభల నివేదిక మొత్తానికి మొత్తం, హేమ్ మిశ్రా దగ్గర దొరికిన పెన్ డ్రైవ్‌లో ఉన్నాయని ప్రాసిక్యూషన్ చెప్పిన కరపత్రాలు, ఉత్తరాలు మొత్తానికి మొత్తం ఎన్నోసార్లు ఉటంకించారు. చివరికి వోయిస్టు పార్టీ చరిత్ర అని తనకు తోచినదీ, ప్రాసిక్యూషన్ చెప్పినదీ రాశారు. అంటే, మొత్తం మీద ఈ 827 పేజీల తీర్పును నాలుగో వంతుకు, 200 పేజీలకు కుదించినా సారాంశంలో ఏమీ మార్పు ఉండేది కాదు. ఎంతో పరిశోధన చేసి, ఎన్నో పత్రాలు, ఆధారాలు చదివి, ఉటంకించి తీర్పు తయారుచేశారని అభిప్రాయం కలిగించడానికి మాత్రమే ఈ ʹతిలకాష్టమహిషబంధనంʹ తయారయింది.

ప్రాసిక్యూషన్ అల్లిన కథ ఏమంటే, మహేశ్ టిర్కి, పాండు నరోటె అనే ఇద్దరు ఆదివాసులు మావోయిస్టు పార్టీతో పనిచేస్తున్నారని, అజ్ఞాత న‌క్స‌లైట్ల‌కు స‌మాచారం, స‌రుకులు చేర‌వేస్తున్నార‌నే స‌మాచారంతో గడ్చిరోలి స్పెషల్ బ్రాంచి వారి మీద నిఘా పెట్టిందట. ఆ నిఘాలో భాగంగా 2013 ఆగస్ట్ 22న అహెరి బస్ స్టాండ్ దగ్గర మారుమూల ఎవరూ లేనిచోట, వారిద్దరూ, వారితోపాటు మరొకరూ ఉండగా పట్టుకున్నారట. ఆ మూడో వ్యక్తి హేమ్ మిశ్రా అని తెలిసిందట. ఆయన దగ్గర ఒక పెన్ డ్రైవ్, కెమెరా, ఇతర సమాచారం దొరికిందట. హేమ్ మిశ్రాను తీసుకురమ్మని నర్మదక్క చెపితే బల్లార్షా వెళ్లి తీసుకుని వస్తున్నా మని మహేశ్ టిర్కి, పాండు నరోటే తమ కన్ఫెష‌న్ స్టేట్ మెంట్ (ఒప్పదల ప్రకటన) లో చెప్పారట. అదే సమయంలో చిచ్‌గడ్ టి పాయింట్ దేష్టి దగ్గర అనుమానాస్పద స్థితిలో ఉండగా దొరికిన ప్రశాంత్ రాహీకి, విజయ్ టిర్కికి ఈ కేసుతో సంబంధం ఉందని తేలిందట. హేమ్ మిశ్రాను, ప్ర‌శాంత్ రాహీని విచారించే క్ర‌మంలో ఈ కేసుతో సాయిబాబాకూ సంబంధం ఉందని తేలిందట. సాయిబాబా ఇంటిని జప్తు చేస్తే ఐదు హార్డ్ డిస్క్‌లు, ఆరు సీడీలు, ఇర‌వై నాలుగు డీవీడీలు, మూడు పెన్ డ్రైవ్‌లు, ముప్పై రెండు మెమొరీ కార్డులు, ఒక లాప్‌టాప్‌, మూడు మొబైల్ ఫోన్లు, పుస్తకాలు, పత్రికలు, తుపాకి పట్టుకున్న ఒక మహిళా నక్సలైట్ ఫోటో వగైరా దొరికాయట. ఆ హార్డ్‌ డిస్కులలో ఒకటి క్రాష్ అయిందట. మిగిలిన హార్డ్‌ డిస్కులలోను, పెన్ డ్రైవ్‌ల‌లోనూ లోను వందల పేజీల సమాచారం దొరికిందట. ఆ సమాచారంలో సాయిబాబా మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ ఆర్డిఎఫ్ తరఫున పని చేస్తున్నట్టు, మావోయిస్టు పార్టీ కొరకు అంతర్జాతీయ సంబంధాలు నెరపుతున్నట్టు, హింసా కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు తేలిందట.

ఈ కథంతా తప్పుల తడక, ఈ ఆరుగురు నిందితులనూ అరెస్టు చేసిన స్థలాలూ సమయాలూ అబద్ధం. వారు ఇచ్చారని చెపుతున్న ఒప్పుకోలు ప్రకటనలు అబద్ధం. వారి దగ్గర దొరికాయని చెపుతున్న సమాచారం, ఆధారాలు అబద్ధం. ఆ సమాచారం, ఆధారాలు వారిదగ్గర దొరికినప్పుడు చేసిన పంచనామా నివేదికల మీద సాక్షి సంతకాలు చేసినవారందరూ పోలీసులు అన్ని కేసుల లోను ఉపయోగించే నిలువ సాక్షులే తప్ప గౌరవనీయమైన, విశ్వసనీయమైన సాక్షులు కాదు. వారిలో ఒక సాక్షి అయితే గతంలో హోం గార్డుగా పనిచేసి, ప్రస్తుతం పోలీసులు పెట్టే అన్ని కేసులలోను సాక్షిగా సంతకాలు చేస్తున్నవాడు. వారి మీద ఆరోపించిన నేరాలు అబద్ధం. హేమ్ మిశ్రాను ప్రాసిక్యూషన్ చెబుతున్న‌ట్లు ఆగ‌స్టు 23న అహోరిలో కాదు, ఆగ‌స్టు 20న బ‌ల్లార్షా రైల్వేస్టేష‌న్‌లో అరెస్టు చేశారు. అంగవికలుడైన హేమ్ మిశ్రా బ‌ల్లార్షా సమీపంలోని బాబా ఆమ్టే ఆశ్రమంలో నడిచే ఆస్పత్రికి వెళుతుండగా అరెస్టు చేశారు. ఆయన దగ్గర దొరికాయని చెపుతున్నవి ఆయనను పట్టుకున్నప్పడు నిజంగా ఆయన దగ్గరే దొరికాయనడానికి సాక్ష్యమేమీ లేదు.

వీటిలో మొదటి అరెస్టు చూపిన ఎఫ్ఐఆర్ అసలు ప్రతి మీద ఉన్న పదాలూ వాక్యాలూ తేదీలూ వేరు, కార్బన్ కాపీ మీద ఉన్న పదాలూ వాక్యాలూ తేదీలూ వేరు. మొదట రాసిన వాటిని మార్చి తర్వాత కొత్తవి రాయడం జరిగిందని క్రాస్ ఎగ్జామినేషన్ లో పోలీసు సాక్షి ఒప్పకున్నాడు. ఒకే పంచనామా పత్రం మీద వేరువేరు చోట్ల వేరువేరు ఇన్‌స్పెక్టర్ల సంతకాలు ఉండడంతో ఆ పంచనామా పత్రమే ఒక్కసారి తయారయినది కాదని, అసలు వాస్తవికమైనది కాదని రుజువైంది. ఆ ముగ్గురి అరెస్టు ఒక్కసారి జరగలేదని, హేమ్ మిశ్రాను బల్లారాలో అరెస్టు చేసి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఆతర్వాత ఇద్దరు ఆదివాసులతో కలిపి కేసు బనాయించారని డిఫెన్స్ న్యాయవాది నిరూపించారు. సాక్షుల వాంగ్మూలాలలో, ఎఫ్ఐఆర్లో, పంచనామా నివేదికలో ఎన్ని వైరుధ్యా లున్నాయో చూపించారు. "వందమంది అపరాధులు తప్పించుకుపోయినా ఫరవాలేదు గాని ఒక నిరపరాధికి శిక్ష పడగూడదు" అనే న్యాయసూత్రం ప్రకారం ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాలలో వైరుధ్యాలున్నా వారు ఒక అబద్ధం చెప్పారని రుజవైనా వారు చెప్పిన మిగిలిన అంశాలను సాక్ష్యాధారాలుగా ఆమోదించనక్కరలేదని న్యాయశాస్త్రం భావిస్తుంది. కాని ఈ తీర్పు రాసిన గడ్చిరోలి సెషన్స్ జడ్డి మాత్రం "ఒక తప్పు చెపితే మిగిలినవన్నీ అనుమానాస్పదమే అనే సూత్రం భారతదేశంలో వర్తించదని అంటూ, ఎన్నో అబద్దాలు చెప్పారని స్పష్టంగా రుజవైన ప్రాసిక్యూషన్ సాక్షుల అబద్దాలను ఆమోదించారు. ఆ అబద్దాల ఆధారంగా శిక్షలు విధించారు,
ఎప్పుడైనా ఎవరి మీదనైనా నేరం ఆరోపించినప్పుడు వారి మొబైల్ ఫోన్ల నుంచి ఎవరెవరికి ఫోన్లు చేశారో జాబితాలు సేకరించి వాటి ఆధారంగా నేరారోప‌ణ చేయ‌డం ప్రాసిక్యూషన్ ఆనవాయితీ. హేమ్ మిశ్రా, మ‌హేశ్ టిర్కిల‌ మొబైల్ ఫోన్లు జ‌ప్తు చేసుకుని, కేసులో ఆధారాలుగా చూపిన‌ప్ప‌టికీ, వాటి కాల్‌డాటాను మాత్రం సేక‌రించి చూపకపోవడం, ఆ డాటా ద్వారా వారి మీద నేరారోపణకు అవకాశం లేకపోవడం వల్లనే అని డిఫెన్స్ న్యాయవాది చేసిన వాదనకు న్యాయమూర్తి డొంకతిరుగుడు జవాబు చెప్పారు. ఆ జాబితాలు ప్రాసిక్యూషన్ ఇవ్వకపోయినా వారే ఇచ్చి ఉండవలసిందని, ప్రాసిక్యూషన్ ఇవ్వలేదు గనుక ప్రాసిక్యూషన్‌కు దురుద్దేశం అంటగట్టలేమని ఆయనే ప్రాసిక్యూషన్ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. హేమ్ మిశ్రా దగ్గర దొరికిన వస్తువులలో ఆగస్ట్ 20 లోక్ మత్ దినపత్రికను కూడ చూపారని, అంటే ఆయనను ఆగస్ట్ 20న అరెస్టు చేశారని రుజువవుతున్నదని డిఫెన్స్ న్యాయవాది చేసిన వాదనకు కూడ న్యాయమూర్తే జవాబు చెపుతూ, నిందితుడి దగ్గర మూడు రోజుల కిందటి పత్రిక ఉండవచ్చునని, మావోయిస్టుల కలయికలకు చేతిలో పత్రిక ఉండడం, అరటి పళ్లు పట్టుకోవడం అనే సంకేతం ఆనవాయితీ ఉందని, సి వనజ అనే జర్నలిస్టు రాసిన వ్యాసంలో ఉన్నదని, ఆ వ్యాసం సాయిబాబా హార్డ్ డిస్క్‌లో దొరికిందని, అందువల్ల డిఫెన్స్ వాదన చెల్లదని అన్నారు.

ఇటువంటి ఎన్నెన్నో స్పషమైన, నిర్దిష్టమైన తప్పలు, వైరుధ్యాలు, అసంగతాలు చూపి ప్రాసిక్యూషన్ చెపుతున్నవి అబద్దాలు కావచ్చునని డిఫెన్స్ న్యాయవాది వాదిస్తే, సాధారణంగా ఏ న్యాయస్థానమైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ (అనుమానించడానికి ఆస్కారం) అనే ప్రాతిపదికపై ప్రాసిక్యూషన్ వాదనను కొట్టివేస్తుంది. కాని గడ్చిరోలి న్యాయమూర్తి మాత్రం ప్రాసిక్యూషన్ అబద్దాలు కళ్ల ముందు నగ్నంగా కనబడుతుంటే అవన్నీ"స్వల్పమైన వైరుధ్యాలు" అని అభివర్ణించి, అవి ప్రధాన ఆరోపణ లకు అడ్డురావని అన్నాడు. ఆ స్వల్పమైన వైరుధ్యాల మీద ఆధారపడే మొత్తం కేసు నిర్మాణమైందని, ఆ స్వల్పమైన వైరుధ్యాలను నిజాలుగా నమ్మినందువల్లనే తాను గరిష్ట శిక్ష విధిస్తున్నానని మరిచిపోయాడు. పోలీసులు చూపే ఒప్పుద‌ల‌ ప్రకటనలు చెల్లవని, మెజిస్ట్రేట్‌ దగ్గర చేసిన ఒప్పుదల ప్రకటనలు మాత్రమే చెల్లతాయని న్యాయవ్వ‌స్థ‌లో ఒక సూత్రం. మెజిస్ట్రేట్‌ దగ్గర చేసిన ప్రకటన కూడ ఒత్తిడి మీద‌ చేశానని, దాన్ని ఉపసంహరించుకుంటున్నానని, ఇంకా పైన విచారణ జరిగే న్యాయస్థానంలో నిందితులు చెప్పకోవచ్చు. మ‌హేష్ టిర్కి, పాండు నరోటే ఇద్దరూ తమ ఒప్పుదల ప్రకటనలుగా పోలీసులు రాసిన ప్రకటనలనే మెజిస్ట్రేట్ దగ్గర కూడ చెప్పమని ఒత్తిడి చేశారని, మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు తలుపు దగ్గర నిలబడి తమను బెదిరించారని చెప్పాక కూడ, గడ్చిరోలి జడ్డి పోలీసులు రాసిన ఒప్పుదల ప్రకటనలనే యధాతథంగా అంగీకరించి, వాటి ఆధారంగానే వాదనలు చేశారు, శిక్షలు విధించారు.

ఇక సాయిబాబా గురించి చేసిన ఆర‌ప‌ణ‌ల్లో ఒక్క‌టి కూడా పూర్తి నిజం లేదు. అబద్దాలు, అర్థసత్యాలు, వక్రీకరణలు, జరిగినది ఒకటైతే మరొకటి చెప్పడం వంటి ఎన్నెన్నో అసంగతాలు ప్రాసిక్యూషన్ ఆరోపణల్లో ఉన్నాయి. సాయిబాబా ఇంటి మీద దాడికి అనుమతి లేదు. సాక్షులు లేరు. అటువంటి దాడికి వీడియో సాక్ష్యం ఉండవలసి ఉండగా, సమయానికి వీడియోగ్రాఫర్ దొరకలేదని, అప్పటికీ పోలీసు అధికారులు తమ మొబైల్ ఫోన్లలో జప్తును చిత్రీకరించడానికి ప్రయత్నించారని, కాని వారి ఫోన్ల సామర్ధ్యం సరిపోలేదని ప్రాసిక్యూషన్ ఆకుకు అందని, పోకకు పోందని కథలెన్నో చెప్పింది. జప్తు చేశామని చెపుతున్న సామాన్లు జప్తుచేస్తున్నప్పుడు పోలీసు సాక్షులను మాత్రమే తీసుకున్నారు. ఇంటిబైట పౌరసమాజ ప్రముఖులు, డిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎందరో ఉండగా వారినెవరినీ సాక్షులుగా పిలవలేదు. జప్తు చేసిన వ‌స్తువుల‌ను సాక్షుల ముంద‌ర సీల్‌ చేయ‌లేదు. సీళ్ల మీద‌ సంతకాలు లేవు. జప్తు చేసిన వస్తువులే న్యాయస్థానంలో ప్రవేశపెట్టారా, మరేవైనా చేర్చారా చెప్పలేని స్థితి ఉంది. చివరికి ఆ జ‌ప్తు సమయంలో ఆ వస్తువులన్నీ ఏ పెట్టెలో పెట్టామని పంచనామా నివేదికలో రాశారో, ఆ పెట్టె గడ్చిరోలి న్యాయస్థానానికి చేరలేదు. ఆ వస్తువులు మరొక రూపంలో చేరాయి, కంప్యూటర్ హార్ట్ వేర్ కు సంబంధించి జప్తు చేసిన వస్తువుకు చెందిన నిర్దిష్ట గుర్తింప్తు సంఖ్యను నమోదు చేయవలసి ఉండగా అటువంటిదేమీ జరగలేదు. అక్కడ 41 వస్తువులను జప్తు చేసినప్పుడు సాక్షి సంతకాలు పెట్టిన ఇద్దరికీ కంప్యూటర్ వస్తువుల గురించి కనీస అవగాహన కూడలేదు. వారిలో ఒక సాక్షికి తన పేరు సంతకం పెట్టడం మినహా మరే భాష చదవడం, రాయడం రాదు. ఏ పుస్తకాలు, పత్రాలు జప్తు చేశారో, పంచనామాలో ఏ జాబితా రాశారో తెలియదు. ఆ సాక్షి న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పడానికి గడ్చిరోలి వచ్చినప్పుడు, పోలీసులే వసతి కల్పించారని నిండు కోర్టులో ఒప్పకుని తాను స్వతంత్ర సాక్షిని కానని, పోలీసులు చెప్పమన్నట్టు చెప్పే సాక్షినని చూపుకున్నాడు. ఈ సాక్షులు చెప్పిన విషయాల ఆధారంగా డిఫెన్స్ న్యాయవాది, అసలు జప్తు అనేదే జరగలేదని, సాయిబాబా ఇంటి మీద దాడి చేసి ఎత్తుకొచ్చిన వస్తువులలో కొన్నిటిని మాత్రమే చూపుతున్నారని, కొన్నిటిని మార్చిచూపుతున్నారని, అక్కడ దొరకని వస్తువులను దొరికినట్టు చూపుతున్నారని వాదించారు. కానీ సాక్ష్యులు ఒక‌టి రెండు చోట్ల త‌డ‌బ‌డినందువ‌ల్ల‌, పొరబడినందువల్ల వారి సాక్ష్యాన్ని నమ్మకుండా ఉండనక్కరలేదని అంటూ ఆ అబద్ధపు సాక్ష్యాల ఆధారంగానే శిక్ష విధించారు.

ఇక హార్డ్ డిస్కులలో ఏమి ఉన్నదనే విషయం, అది ఎలా తేల్చారనే విషయం చూస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. ముంబైలోని సెంట్రల్ ఫారెన్సిటిక్‌ సైన్స్ లాబరేటరీలో సైంటిఫిక్ ఆఫీసర్‌ని అని చెప్పకుని వచ్చిన భవేశ్ నికమ్ అనే సాక్షి ఆ హార్డ్‌ డిస్కులను ఎన్కేస్‌ అనే ఒక సాఫ్ట్ వేర్ ద్వారా పరీక్షించి వాటిలో ఉన్న సమాచారాన్ని బైటికి లాగానని చెప్పకున్నాడు. సాయిబాబా మీద నేరారోపణలకు ప్రధాన ఆధారంగా చూపినవన్నీ ఈ సాంకేతిక ఆధారాలే, ఆ ఎన్కేస్‌ సాఫ్ట్ వేర్ వినియోగించడానికి "ఎనేస్ సర్టిఫైడ్ ఎగ్జామినర్ పరీక్ష పాసయి, ఆ సర్టిఫికెట్ పొంది ఉండాలి, కాని ఈ భవేశ్ నికమ్ ఆ పరీక్ష రాయలేదు. ఎన్కేస్ స్సర్టిఫైడ్ ఎగ్జామినర్ కాదు. అసలుసిఎఫ్ఎస్ఎల్ దగ్గర అవసరమైన ఎన్సేస్ సాఫ్ట్ వేర్ లేనేలేదు. ఇటువంటి పరీక్ష జరపడానికి ఎనిమిది వేరువేరు ప్రక్రియలుండగా ఆ సైంటిఫిక్ ఆఫీసర్ ఆ ప్రక్రియలలో ఏ ఒక్కటీ అమలు జరపలేదు. పోలీసులు రాసి ఇచ్చిన నివేదిక మీద సంతకం చేయడం మినహా ఆ సైంటిఫిక్ ఆఫీసర్ చేసిందేమీ లేదు. అసలు ఆ సైంటిఫిక్ ఆఫీసర్ అవసరమైన పరీక్షలే జరపలేదని డిఫెన్స్ న్యాయవాది నిస్సందేహంగా రుజవు చేశారు. ఈ డిఫెన్స్ వాదనలోని కొన్ని అంశాలను తీర్పులో న్యాయమూర్తి కూడ ఒప్పకున్నారు. నిజానికి అవి ఒప్పకున్నారంటే, సాయిబాబా మీద నేరారోపణకు తగిన ఆధారాలు లేవని ఒప్పకున్నట్టే. కాని అలా ఒప్పకున్న న్యాయమూర్తే తన నిర్ధారణకు భిన్నంగా తానే శిక్ష విధించారు. ఆ సాంకేతిక పరీక్ష సంగతి ఎలా ఉన్నా సాయిబాబా మీద మొత్తం నేరారోపణకు ప్రాతిపదిక హార్డ్‌డిస్కుల్లో ఉన్నదంటున్న సమాచారమే. ఆ సమాచారంలో అత్యధిక భాగం విప్లవోద్యమం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల, వ్యాసాల, కరపత్రాల ప్రతులు, ఆర్డీఎఫ్‌కు సంబంధించిన సమాచారం, ఆర్డిఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శిగా సాయిబాబా వివిధ మిత్రులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. వాటితో పాటు సాయిబాబా, సహచరి వసంత, కూతురు మంజీర ల వ్యక్తిగత సమాచారం, సినిమాలు, విడియోలు, వీటిలో ఏ ఒక్కటీ నేరారోపణకు వీలు కల్పించేవి కావు. విప్లవోద్యమానికి సంబంధించిన సమాచారమంతా స్వయంగా విప్లవోద్యమం నడుపుతున్న వెబ్ సైట్ల నుంచి తీసుకున్నదేనని, అలాగే వేరువేరు పత్రికల వెబ్ సైట్లలో విప్లవోద్యమానికి సంబంధించిన సమాచారం వచ్చినప్పుడు కాపీ చేసి భద్రపరచుకున్నదని డిఫెన్స్ న్యాయవాది చూపారు.

మొత్తంగా సాయిబాబా విడిగా గాని, ప్రశాంత్రాహీ, హేమ్ మిశ్రా లతో కలిసి గాని అజ్ఞాత నాయకులకు రాసిన ఉత్తరాలు, లేదా అజ్ఞాత నాయకుల నుంచి వచ్చిన ఉత్తరాలు అని ప్రాసిక్యూషన్ నాలుగైదు ఉత్తరాలను సాయిబాబా హార్డ్ డిస్క్ లలో ఉన్నట్టుగా చూపింది. అవి నిజంగా సాయిబాబా రాసినవేనా, పోలీసులు చొప్పించినవా చెప్పడానికి అవకాశం లేదు. వాటిని పోలీసులు చొప్పించిఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తారనే ఉద్దేశంతోనే ఆ హార్డ్ డిస్కులలో వ్యక్తిగత సమాచారాన్ని యథాతథంగా ఉంచారు. జడ్జికూడ ఆ వ్యక్తిగత సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ప్రస్తావించి, అవి ఉన్నాయంటే ఈ హార్డ్ డిస్కులు సాయిబాబావేనని తేలుతున్నదన్నారు. పోలీసులు తామే హార్డ్ డిస్కులు పెట్టి ఉంటే ఈ వ్యక్తిగత ఉత్తరాలు, సినిమాలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. సాయిబాబాకు పార్టీలో ప్రకాశ్ అనే రహస్యపేరు ఉన్నదని చెప్పిన ప్రాసిక్యూషన్, ఇచ్చిన సమాచారంలో ప్రకాశ్ రాసిన ఉత్తరంలో "నా హార్డ్ డిస్క్ క్రాష్ అయింది" అనే మాట ఉంది గనుక, ఇప్పుడు జప్తు చేసిన ఐదు హార్డ్ డిస్కులలో ఒకటి క్రాష్ అయి ఉంది గనుక అదీ ఇదీ ఒకటేనని ప్రాసిక్యూషన్ అల్లిన కథను జడ్డి యథాతథంగా అంగీకరించాడు. ఈ "నిస్సందేహమైన ఆధారాలను బట్టి జప్తు చేసిన ఎలక్రానిక్ వస్తువులన్నీ సాయిబాబావేనని, వాటిలో పోలీసులు మార్పులు చేర్పులూ చేయలేదని చెప్పవచ్చు" అని కితాబు ఇచ్చాడు.

ఇటువంటి హాస్యాస్పదమైన విషయాలెన్నో ఉన్నాయి గాని, ఒక మచ్చుతునక చూపాలి. సాయిబాబా హార్డ్ డిస్కుల్లో, 2010లో ప్రభుత్వానికీ మావోయిస్టు పార్టీకీ చర్చలు జరగాలని కోరుతూ చేసిన ఒక విజ్ఞప్తిపై ప్రాఫెస‌ర్‌ రణధీర్ సింగ్, జస్టిస్ రాజేందర్ సచార్, బి డిశర్మ, ప్రొఫెస‌ర్‌ మనోరంజన్ మొహంతీ, అరుంధతీ రాయ్, ప్రొఫెస‌ర్‌ అమిత్ భాదురి, సుమిత్ చక్రవర్తి, ప్రశాంత్ భూషణ్ వంటి మేధావులతో పాటు జి.ఎన్. సాయిబాబా సంతకం కూడ ఉండడం చూపి అది ఆయన మావోయిస్టు అనడానికి ఆధారమని ప్రాసిక్యూషన్ వాదించింది. జడ్డి ఆమోదించారు.
ప్రాసిక్యూషన్ అల్లిన కట్టుకథల గురించీ, ఆ కట్టుకథలను నమ్మి శిక్ష విధించిన న్యాయమూర్తి తీర్పు గురించి మరెన్నో విషయాలు చెప్పవచ్చు గాని ఇక్కడ ఆపి, అసలు ఇవి నేరాలేనా అనే ప్రశ్న చర్చించవలసి ఉంది. వ్యవస్థ ఉన్నతీరు మీద, పాలన నడుస్తున్న తీరు మీద ప్రజలకు, బుద్ధిజీవులకు అసంతృప్తి, భిన్నాభిప్రాయం ఉండడం కొత్త విషయం కాదు. ప్రస్తుత దుర్భర వ్యవస్థ రద్దయి మరొక మంచి వ్యవస్థ రావాలని కోరుకోవడమూ కొత్త కాదు.

అలాంటి భిన్నాభిప్రాయం ఉండడమే, దాన్ని ప్రకటించడమే, అలా ప్రకటించే ఇతరులతో సంఘిభావం ప్రకటించడమే నేరాలవుతాయా అని ప్రశ్నించవలసి ఉంది. అవి నేరాలయితే, అలా ఆలోచించే, ఆచరించే వారిని ఇలా శిక్షలకు గురి చేస్తూ పోతే సామాజిక చలనమే ఉండేది కాదు. సమాజ పురోగమనమే ఉండేది కాదు. అందువల్లనే భిన్నాభిప్రాయాలు ఉంచుకునే స్వేచ్చను, భావ ప్రకటనా స్వేచ్చను ఆధునిక నాగరిక సమాజాలన్నీ అంగీకరించాయి, గౌరవిస్తామని ప్రకటించాయి. చివరికి భారత రాజ్యాంగం కూడ దాన్ని ప్రాథమిక హక్కులలో భాగం చేసింది. కాని చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం ఈ భారత రాజ్యాంగపు ప్రాథమిక హక్కును కూడ కాలరాస్తూ అభిప్రాయాలు ఉండడమే, ప్రకటించడమే శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించింది. ఆ చట్టాన్ని ఇవాళ గడ్చిరోలి న్యాయస్థానం ఒక ప్రయోగంగా అమలు చేయడం ప్రారంభించింది. తక్షణమే ఈ తీర్పును, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టాన్ని ప్రతిఘటించే ఒక విశాల ప్రజా ఉద్యమాన్ని సంఘటితం చేయకపోతే ఈ దేశంలో భిన్నాభిప్రాయం ఉండడానికి వీలులేని స్థితి వస్తుంది. సృజనాత్మక జీవులైన మనుషులు తమ సృజన శక్తినంతా చంపుకుని యంత్రాలలో ఏకాభిప్రాయాన్ని అది కూడ పాలకుల అభిప్రాయాన్నిమాత్రమే నమ్మవలసి వస్తుంది, ఆచరించవలసి వస్తుంది. అంటే ఇది కేవలం జి.ఎన్. సాయిబాబా, ప్రశాంత్రాహీ, హేమ్ మిశ్రా, మ‌హేశ్ టిర్కి, పాండు నరోటే, విజయ్ టిర్కిలకు విధించిన శిక్ష సమస్య మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగంలో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల, వాక్ స‌భాస్వాతంత్ర్యాల సమస్య. ఇది మానవత్వం మీద దాడి. సృజన మీద, ఆలోచన మీద దాడి.

ఎన్.వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్
(ఈ వ్యాసం వీక్ష‌ణం 2017 ఏప్రిల్ సంచికలో ప్ర‌చురిత‌మైంది)

Keywords : GN Saibaba, delhi university, nagpur jail, court
(2021-01-26 21:06:45)No. of visitors : 1432

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

మహాజనాద్భుత సాగరహారానికి ఐదేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.....

Search Engine

ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
more..


అబ‌ద్ధాల