జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ


జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ

జంపన్న

మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని మావోయిస్టు పార్టీ కేంధ్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో అన్నారు. గత కొంత కాలంగా అతని ప్రవర్తన, కార్యకలాపాలను పరిగణలోనికి తీసుకొని పార్టీ నుంచి రెండేళ్లపాటు సస్పెండ్ చేస్తూ ఈ ఏడాది తొలినాళ్లలోనే నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. జంపన్న బలహీనతలు, తప్పులను సరిదిద్దుకొని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో మరింత ఉత్సాహంతో పాల్గొంటాడని భావించినా.. అతను మాత్రం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేక భావంతో చూశాడన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించాలని భావించినా జంపన్న ఆ బాధ్యతలను తలకెత్తుకోవడానికి సిద్దంగా లేడని అభయ్ అన్నారు. జంపన్న మీద సస్పెన్షన్ విధించిన తర్వాతే పార్టీకి.. సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడని.. పార్టీ పరంగా పలు విషయాలపై చర్చిద్దామని చెప్పినా తను మాత్రం లొంగుబాటుకే మొగ్గుచూపాడన్నారు. పార్టీ నుంచి జంపన్న వాళ్లు వెళ్లినంత మాత్రానా ఏమీ నష్టం లేదని కాకపోతే కొంత కాలం ఒడిదుడుకులు ఎదురైనా తిరిగి మా లక్ష్యాల వైపు పయనించే సామర్థ్యం మాకుందని అభయ్ స్పష్టం చేశారు.

ఈ అంశంపై అభయ్ చేసిన ప్రకటన పూర్తి పాఠం....

జినుగు న‌ర్సింహారెడ్డి ( జంప‌న్న , రాజేష్ ) పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడు శ‌త్రువుకు లొంగిపోయాడు. అజేయ‌మైన శ్రామిక వ‌ర్గ సిద్ధాంతము, మావోయిస్టు పార్టీ ఒక దీర్ఘ‌కాల ప్ర‌జా యుద్ధం పీడిత ప్ర‌జ‌ల విముక్తి ఉద్య‌మం యొక్క న‌మ్మ‌కాన్ని అత‌ను ఇప్ప‌టికే కోల్పోయాడు. వ‌ర్గ పోరాట‌ము ద్వారా కొత్త‌గా తలెత్తుతున్న నిర్భంధకాండ‌ను, మారుతున్న వాస్త‌విక ప‌రిస్థితుల‌ను ఎదుర్కోలేక శ‌త్రువు యొక్క పెరుగుతున్న బ‌హుముఖ దాడిని ప్ర‌తిఘ‌టించ‌లేక అత‌ను స్వార్థ పూరితమైన హేయ‌మైన పిరికి పంథాను ఎంచుకున్నాడు. శ‌త్రువు ముందు మోకాళ్ల పై సిగ్గు లేకుండా మోక‌రిల్లాడు. భార‌త దేశ‌ శ్రామిక వ‌ర్గ చోద‌క శ‌క్తి , భార‌త విప్ల‌వ పార్టీ, పీడిత ప్ర‌జ‌ల , శ్రామిక వ‌ర్గాల,వీరోచిత పోరాట‌ప‌టిమ గ‌ల పార్టీకి ద్రోహం చేశాడు. వేలాది విప్ల‌వ వీరులు త‌మ స్వార్థ రాహిత్యంతో త‌మ ప్రాణాల‌ను వ‌ర్గ శ‌త్రువుతో పోరాడుతు వీర‌మ‌ర‌ణం పొందితే... రాజేష్, అదే శ‌త్రువును సిగ్గు లేకుండా ఆలింగ‌నం చేసుకున్నాడు. ఈ పిరికిపంద‌ చ‌ర్య‌తో త‌న మూడు ద‌శాబ్దాల విప్ల‌వ రాజ‌కీయ జీవితం అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో అంత‌మైంది. త‌న హేయ‌క‌ర‌మైన ప్ర‌వృత్తి బ‌య‌ట‌ప‌డింది. ఆయన చేసిన ఈ దగాను మా కేంద్ర క‌మిటీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ స‌భ్యులు, విప్ల‌వ శ‌క్తులు పీడిత ప్ర‌జలు, భార‌తీయ విప్ల‌వోద్య‌మ మిత్రులు ఇత‌నిని తిర‌స్క‌రించి ఇటువంటి ద్రోహుల‌ను ఈ హేయ‌మైన లొంగుబాటును నిర్ద‌ద్వంద్వంగా ఖండించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తోంది. కేంద్ర క‌మిటీ విస్ప‌ష్టంగా న‌ర‌సింహారెడ్డి దిగ‌జారుడుత‌నాన్ని, ప‌త‌నాన్ని లెక్క చేయ‌కుండా త‌క్ష‌న ల‌క్ష్యాల కోసం, అంతిమ‌ ఆద‌ర్శాల కోసం త‌న విప్ల‌వ పంథాను శ్రామిక శ‌క్తుల అరుణ ప‌తాకాన్ని మ‌రింత స‌మున్న‌తంగా రెప‌రెప‌లాడించ‌టానికి ధృఢ సంక‌ల్పంతో పునః ప్ర‌తిజ్ఙ చేస్తోంది.

న‌ర‌సింహా రెడ్డి 1980 తొలినాళ్ల‌లో హైద్రాబాద్ న‌గ‌రంలో ఒక క‌ర్మాగారంలో టెక్నీషియ‌న్ గా ప‌ని చేస్తూ విప్ల‌వోద్య‌మంలో చేరాడు. త‌ద‌నంత‌రం అత‌నొక వృత్తి విప్ల‌వ‌కారుడిగా ఎదిగాడు. వ‌రంగ‌ల్ జిల్లాలోని ఏటూరు నాగ‌రం అట‌వీ ప్రాంతానికి గెరిల్లా స్క్వాడ్ మెంబ‌ర్ గా పార్టీ అత‌డ్ని పంపించింది. త‌రువాత 1986 నుంచీ 1995 మ‌ధ్య కాలంలో అత‌ను స్క్వాడ్ క‌మాండ‌ర్, ఏరియా క‌మిటీ మెంబ‌ర్, జిల్లా క‌మిటీ మెంబ‌ర్, జిల్లా క‌మిటీ సెక్ర‌ట‌రీగా ఎదుగుతూ వ‌చ్చాడు. ఉత్త‌ర తెలంగాణ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ ( NTSZC ) 1995లో ఆ ప్రాంత‌పు ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌టానికి, ఒక గెరిల్లా యుద్ధ ప్రాంతంగా నిర్మించ‌టానికి ఏర్ప‌డింది. ఆ ఏడాదిలోనే NTSZC తొలి మ‌హాస‌భ‌లో క‌మిటీ స‌భ్యుడిగా ఎన్నుకోబ‌డ్డాడు. 2000 సంవ‌త్స‌రంలో NTSZCకి కార్య‌ద‌ర్శి అయ్యాడు. అదే బాధ్య‌త‌లో 2007వ‌ర‌కూ కొన‌సాగాడు. 20001లో అత‌ను కేంద్ర క‌మిటీ మెంబ‌ర్ గా ఎన్నికయ్యాడు. 2001 నుంచి 2007 వ‌ర‌కూ ఉత్త‌ర తెలంగాణ CCMగా కొన‌సాగాడు. 2007లో CMC స‌భ్యుడుగా కోఆప్ట్ చేసుకోబ‌డ్డాడు. ఆ కాలంలో ఉత్త‌ర తెలంగాణలోనూ సెంట్ర‌ల్ రీజ‌న్ లోని ఇత‌ర ప్రాంతాల్లోనూ పని చేశాడు. 2011లో ఒడిషాకు బ‌దిలీ చేయ‌బ‌డ్డాడు. అక్క‌డే అత‌ను 2016 చివ‌రి వ‌ర‌కూ అక్క‌డే ప‌ని చేశాడు. కానీ, గ‌త ఏడాది నుంచి సైద్దాంతిక‌, రాజ‌కీయ డోలాయ‌మాన స్థితిలో కూరుకుపోయాడు. న‌వంబ‌ర్ 2017లో సంబంధిత CCMకి త‌న లొంగుబాటు నిర్ణ‌యాన్ని తెలిపాడు.

న‌రసింహారెడ్డి మూడు ద‌శాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం పాటూ విప్ల‌వ రాజకీయ ఉద్య‌మంలో ప‌ని చేసిన మాట వాస్త‌వం. అదే విధంగా రాజ‌కీయంగా ప‌లు ఉన్న‌త క‌మిటీల‌లో, సీసీలో ఉద్య‌మానికి తోడ్ప‌డుతూ ఎదిగాడు. కానీ, ఆయ‌నకు వ్య‌క్తి వాదం, బ్యూరోక్ర‌సీ, అన‌వ‌స‌ర‌పు అహంకారం వంటి ప‌లు బ‌ల‌హీన‌త‌లు, ప‌రిమితులు, అన్య‌వ‌ర్గ ధోర‌ణులు త‌న రాజకీయ జీవితం పొడ‌వునా కొనసాగాయి.అత‌డితో ప‌ని చేసిన గెరిల్లా స్క్వాడ్ , పార్టీ క‌మిటీలు, నాయ‌క‌త్వమూ త‌న వ్య‌తిరేక ధోర‌ణులపై నిరంత‌రము హెచ్చ‌రిస్తూ వుండేవి. సంబంధిత క‌మిటీలు ప్ర‌తీ సంద‌ర్భంలోనూ త‌న‌ని మార్చే దిశ‌గా ప్ర‌య‌త్నిస్తుండేవి. అత‌ను కూడా ఈ విమ‌ర్శ‌లను కొన్ని సంద‌ర్భంల్లో అంగీక‌రించాడు. కానీ, త‌న బ‌ల‌హీన‌త‌లు, త‌ప్పులు, ప‌రిమితులు కొనసాగుతూనే వ‌చ్చాయి. ప్ర‌త్యేకించి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ వ్య‌తిరేక ధోర‌ణులు పెచ్చ‌రిల్లాయి. చివ‌ర‌కు, అవి త‌న‌పై పెత్త‌నం చేసే స్థాయికి చేరాయి. ఈ ధోర‌ణులు పార్టీకి, ఉద్య‌మానికి ప‌లు క‌ష్టాల్ని తెచ్చిపెట్టాయి. శ‌త్రు భ‌యం అతడ్ని పూర్తిగా ఆవ‌హించ‌టంతో పార్టీ త‌న‌కు అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించ‌లేక‌పోయే వాడు. అతి ముఖ్య‌మైన మీటింగ్ ల‌కు సైతం హాజ‌రు కావ‌టానికి ఊహాజ‌నిత‌మైన శ‌త్రు దాడుల‌ను ఒక వంక‌గా చూపిస్తూ వుండేవాడు. ఇవే ప‌రిస్థితుల్ని ఎదుర్కుంటోన్న ఇత‌ర కామ్రేడ్లు ఈ భ‌యాల్ని నిరాధార‌మైన‌వని భావించేవారు. త‌న పై క‌మిటీ కామ్రెడ్లు, త‌న వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ ద‌ళ కామ్రెడ్లు ఈయన పిరికి ప్ర‌వ‌ర్త‌న‌ను , ఓట‌మి త‌త్వాన్నీ విమ‌ర్శించేవారు. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితులు, శ‌త్రువు యొక్క ఉధృత‌మైన దాడి నేప‌థ్యంలో పార్టీ ఉన్న‌త స్థాయి కామ్రెడ్లు నాయ‌క‌త్వ స్థానాల్లో వున్న వారు యుద్ధ రంగంలో స్థిరంగా, ధైర్యంగా, ధృఢంగా వార్ని వారు ర‌క్షించుకోవ‌టం, పార్టీని, పీఎల్జీఏ మ‌రియు ఉద్య‌మాన్ని ర‌క్షించుకోవాల్సిన సంద‌ర్భం. ఇది విప్ల‌వోద్య‌మంలోని అన్ని రంగాల‌కు ప్ర‌త్యేకించి మిల‌ట‌రీ రంగానికి వ‌ర్తిస్తుంది. కానీ, సీసీఎంగా న‌ర్సింహారెడ్డి ఈ ఉన్న‌తమైన పార్టీ అప్ప‌గించిన‌ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌టంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. రాజ‌కీయ చైత‌న్యం , సంసిద్ధ‌త‌, ధైర్యం, క్ర‌మ‌శిక్ష‌ణ , స్వార్థ ర‌హిత‌మైన త్యాగ‌మూ, ఆత్మ‌ విమ‌ర్శ వంటి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఏవీ న‌ర్సింహారెడ్డిలో లేవు.

త‌న నిరంతర బ‌ల‌హీన‌తలు, ప‌రిమితులు ఒక గంభీర స్థాయికి చేరిన త‌రువాత న‌ర్సింహారెడ్డి ప‌ని విధానంపై సీసీ స‌మీక్షించింది. త‌ను విప్ల‌వోద్య‌మం ప‌ట్ల ప్ర‌జ‌ల పట్ల త‌క్కువ అంచ‌నా వేస్తూ శ‌త్రువుకు అతిగా భ‌య‌ప‌డుతూ, వ్య‌క్తి వాదంతో, ఆత్మాశ్ర‌య ధోర‌ణిలో కూరుకుపోయాడ‌ని సీసీ నిర్ధారించింది. అత‌ను త‌న తులానాత్మ‌క దృష్టిని కోల్పోయాడ‌నీ, విశ్లేష‌ణ శ‌క్తి, వాస్తవ ప‌రిస్థితుల్ని అంచ‌నా వేయ‌టం, సాపేక్ష‌తా వంటి విష‌యాల్లో పార్టీ ఉన్న‌త క‌మిటీ మెంబ‌ర్ స్థాయిని దిగ‌జారుస్తూ ప్ర‌వ‌ర్తించాడు. త‌ర‌చూ త‌ప్పుడు నిర్మాణ విధానాలు, త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో వైఫ‌ల్యం అత‌డ్ని వెంటాడింది. దీనికి తోడు త‌న వ్య‌క్తి వాదాన్ని , ఆత్మ‌శ్ర‌య ధోర‌ణుల్ని పార్టీ క‌మిటీల‌పై రుద్దే ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగించాడు. త‌ర‌చూ వ్య‌క్తిగ‌త వివాదాలు, అహేతుక చ‌ర్చ‌లు, ఒంటెద్దు పోక‌డ‌లు త‌న‌కి అల‌వాటుగా మారాయి. వ్య‌క్తి పంథా , కేంద్రీకృత ప్ర‌జాస్వామ్య సూత్రాన్ని ధిక్క‌రించ‌టం, కార్మిక వ‌ర్గ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించ‌టం త‌న ధోర‌ణిగా మారింది. కొన్ని సంద‌ర్భాల్లో త‌నని పార్టీ క‌మిటీల‌లో స‌భ్యులు విమ‌ర్శిస్తే తాను స‌మావేశాల‌కు హాజ‌రు కాన‌ని బెదిరిస్తూ పార్టీ నిర్వ‌హ‌ణ‌ని స్థంభింప‌జేసేవాడు. అత‌ని పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల వ‌ల్ల వ్య‌క్తి వాద ధోర‌ణుల వ‌ల్ల క్ర‌మంగా త‌న కామ్రేడ్స్ యొక్క న‌మ్మ‌కాన్ని కోల్పోతూ ఒంట‌రి వాడ‌య్యాడు. ఈ పెడ‌, చెడు ధోర‌ణుల‌ను కామ్రేడ్స్ ప‌లు సంబంధిత పార్టీ క‌మిటీల‌లో త‌న‌ను సంస్క‌రించాల‌నే ఉద్దేశంతోటి త‌న త‌ప్పుల‌ను , త‌న బ‌ల‌హీన‌త‌ల‌ను ఐక్య‌త -పోరాటం-ఐక్య‌త‌ ప‌ద్ధ‌తిలో విమ‌ర్శిస్తూ వుండేవారు. మార్క్స్ ఇజ‌మ్ , లెనిన్ ఇజ‌మ్, మావోయిజం ప్రాపంచిక దృక్ప‌థం వెలుగులో త‌న‌ను తాను పున‌ర్ నిర్మించుకోవ‌టంలో త‌న త‌ప్పుల‌ను , ఆత్మ‌విమ‌ర్శ దృష్టితో స‌రిదిద్దుకోటానికి మొండిగా ప్ర‌తిఘ‌టిస్తూ త‌న వ్య‌క్తిగ‌త లోపాల్ని, మొండిగా కొన‌సాగిస్తూ త‌న‌ ప్ర‌స్తుత విప్ల‌వ ప‌రిస్థితిని గుర్తించ‌టంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ఇది త‌న ప‌తానానికి దారితీయ‌ట‌మే కాకుండా పార్టీకి చాలా న‌ష్టాన్ని క‌లిగించింది.

ఈ విష‌యాలు అన్నింటిని దృష్టిలో వుంచుకుని మా సీసీ న‌రసింహారెడ్డిని క‌మిటీ నుంచీ రెండు సంవ‌త్స‌రాలు స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆ కాలంలో పార్టీ కామ్రేడ్ల స‌హాయంతో త‌న త‌ప్పులను, బ‌ల‌హీన‌త‌ల‌ను గుర్తించి వాటిల్ని స‌వ‌రించుకునేందుకు త‌గిన ప్ర‌య‌త్నం చేస్తాడ‌నే ఉద్దేశ్యంతో నాయ‌క‌త్వం ఇలా స్పందించింది. కానీ అత‌డు ఈ నిర్ణ‌యాన్ని సానుకూల దృష్టితో చూడ‌లేదు. ఆత్మ విమ‌ర్శ చేసుకుని త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోలేదు. సీసీ అప్ప‌జెప్పిన రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడిగా బాధ్య‌త‌లు సైతం స్వీక‌రించ‌టానికి నిరాక‌రించాడు. పెటీ బూర్జువా తత్వ‌మూ, అన‌స‌వ‌స‌ర ద‌ర్పము, స్వార్థ, సంకుచిత త‌త్వ‌ముతో పార్టీ నిర్ణ‌యాన్ని తిర‌స్క‌రించాడు. త‌నలో అన్య వ‌ర్గ ధోర‌ణుల్ని వ‌దిలించుకోటానికి సైతం నిరాక‌రించాడు. క‌మ్యూనిస్టు విప్ల‌వ‌కారునిగా ఉన్న‌తీక‌రించుకోటంలో విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌జ‌ల‌కు త‌లవంచి సేవ‌కునిగా, విప్ల‌వకారునిగా కొన‌సాగ‌టం కంటే శ‌త్రువు సేవ‌లో పునీత‌మ‌వుదామ‌ని జీవ‌నాన్ని కొన‌సాగించే ఒక చీడ‌పురుగులా ప‌త‌న‌మై లొంగిపోయాడు. ఈ ప్ర‌యాణం ఒక విప్ల‌కారుడు ఒక ద్రోహిగా, ఒక దుష్టుడిగా, ఒక ద‌గాకోరుగా మార‌టంతో ముగిసింది.

ఎప్పుడైతే సీసీ త‌న‌ని స‌స్పెండ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుందో అత‌డు పార్టీ విధానంపై రాజ‌కీయ విభేదాల‌ను లేవ‌నెత్తే వాడు. అత‌ను ప్ర‌స్తుత భార‌త‌దేశం అర్థ భూస్వామ్య , అర్థ వ‌ల‌స దేశం కాద‌నీ, అది పెట్టుబ‌డిదారి దేశంగా మారింద‌నీ వాదించే వాడు. ఆ విధంగా పార్టీ పంథాను మారిన దేశ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారాల‌ని తిరుగుబాటు పంథాలో కూడా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్పు రావాల‌ని వాదించే వాడు. ఈ విష‌యాలేవీ పార్టీ క‌మిటీల‌లో కాకుండా కొంద‌రు కామ్రేడ్ల ద‌గ్గ‌ర వ్య‌క్తిగ‌తంగా ప్ర‌స్తావించేవాడు. కామ్రేడ్లు ఇటువంటి రాజీక‌య‌, సైద్దాంతిక అంశాల‌ను పార్టీ వేదిక‌ల‌పై చ‌ర్చించి ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించేవారు. అత‌ను దానికి సిద్ధంగా లేడు. ఆ ప‌ని అత‌నెప్పుడు చేసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కానీ, పార్టీ వీడిపోయాడు. అత‌ను చేస్తోన్న పార్టీలో రాజ‌కీయ విభేదాలు అనే ఆరోప‌ణ త‌న దిగ‌జారుడుత‌నానికి ఒక ముసుగు వాద‌న త‌ప్ప వేరొక‌టి కాదు.

విప్ల‌వాల‌న్నీ మ‌లుపుల గుండా, ఉత్ధాన ప‌థ‌నాల మ‌ధ్య క‌ష్టాలు, న‌ష్టాల మార్గ‌ల‌లో సాగిపోతుంటాయి. శ్రామిక వ‌ర్గ పార్టీ త‌న ధృఢ సంక‌ల్పంతో స్థిర నిశ్చ‌యంతో ప‌టిష్ట‌మైన సామ‌ర్థ్యంతో ఈ స‌మ‌స్య‌ల్ని అధిగ‌మిస్తూ విప్ల‌వాన్ని విజ‌యం వైపు న‌డిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో క‌మ్యూనిస్టులంద‌రికీ మ‌రీ ముఖ్యంగా, శ్రామిక వ‌ర్గేత‌ర శ‌క్తుల నుంచీ ఉద్య‌మంలో చేరే వారికి సైద్దాంతిక , రాజ‌కీయ అవ‌గాహ‌నను పెంపొందించుకుని శ్రామిక వ‌ర్గ ప్రాపంచిక దృక్ప‌థాన్ని ఆపాదించుకుని త‌మ‌ని తాము చైత‌న్య‌వంతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. కేంద్రీకృత ప్ర‌జాస్వామ్య సూత్రాన్ని వారు మ‌రింత‌గా దీక్షా కంక‌ణ బ‌ద్ధులై అమ‌లు చేయాలి. పార్టీ ఉక్కు క్ర‌మ‌శిక్ష‌ణ బ‌ద్ధులై కామ్రేడ్ల‌తోనూ , ప్ర‌జ‌ల‌తోనూ మ‌మేకం కావాలి.ఆచ‌ర‌ణ నుంచీ నేర్చుకుంటూ త‌ప్పుల‌ను స‌వ‌రించుకుంటూ వ్య‌క్తిత్వాన్ని మెరుగుప‌రుచుకుంటూ, ఆత్మ విమ‌ర్శ చేసుకుంటూ తది శ్వాస విడిచే వ‌ర‌కూ, జ‌వితాంతం నిబద్ధత క‌లిగిన విప్ల‌వ‌కారుడిగా స్వార్థ రాహిత్యంతో ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూ ఉద్య‌మంలో ముందు భాగ‌న నిల‌వాలి. కానీ, ఎల్ల‌ప్పుడూ ఇటువంటి ప‌రీక్షా కాలాల్లో కొంద‌రు విఫ‌లం అవుతూనే వుంటారు. త‌మ వ్య‌క్తిగ‌త జీవ‌న మ‌నుగ‌డ‌, భ‌ద్ర‌త‌కే అత్యంత ప్రాధాన్య‌మిస్తూ ఉద్య‌మ కీల‌క ద‌శ‌ల్లో త్యాగాల నుంచి పారిపోయే కొంద‌రు బీరుల చ‌రిత్ర ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌కు చూపిస్తూనే వుంటుంది. ఈ విప్ల‌వ పంథా నుంచీ పారిపోయే బీరులు కొన్ని సంద‌ర్భాలలో విప్ల‌వ ప్ర‌తీఘాత శ‌క్తులుగా మారి శ‌త్రువుకు సేవ‌లందిస్తారు. న‌ర‌సింహా రెడ్డి విప్ల‌వ మార్గంలో ఇటువంటి ఓ దుష్ట ఉదాహ‌ర‌ణ‌. అత‌ను పార్టీ శ్రేణుల‌తోనూ, ప్ర‌జ‌ల‌తోనూ మ‌మేకం కాలేక త‌న బ‌ల‌హీన‌త‌ల‌పై పోరాటం చేయ‌టంలో ప‌రాజ‌యం పొంది శ‌త్రు సేన‌ల‌ను చూసి భ‌య విహ్వలుడ‌య్యాడు. భ‌య‌కంపితుడై వ‌ర్గ శ‌త్రువు ముందు సాష్టాంగ ప‌డి ప్ర‌జ సేవ‌లో పునీత‌మ‌య్యే త‌మ జీవ‌న ప్ర‌యోజ‌నాన్ని చేజేతులా కోల్పోతున్నారు. వ‌ర్గ పోరాట మార్గంలో ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వ్య‌ర్థాల‌ను, చెత్తా చెదారాల‌ను విప్ల‌వ ప్ర‌యాణం వదులుకుంటూ ముందుకు సాగుతుంది.

పార్టీపై, నాయ‌క‌త్వంపై , విప్ల‌వ ఉద్య‌మం పై, భార‌త భావి విప్ల‌వంపై విషం చిమ్ముతూ నిందారోప‌ణ‌లు చేస్తూ శ‌త్రువుకు వంత పాడే ఇట్లాంటి తుచ్ఛ‌మైన కొంద‌రు శ‌క్తుల చ‌ర్య‌లు ఆశ్చ‌ర్యం కాదు. ఉద్య‌మాన‌కి, పార్టీకి, విప్ల‌వానికి న‌ష్టం క‌లిగించ‌ట‌మే ప‌ర‌మావధిగా శ‌త్రువు సృష్టించిన కొత్త అవ‌తారాలు కుహ‌నా మేధావులుగా జ‌ర్న‌లిస్టులుగా సంఘ సేవ‌కులుగా ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నారు. భార‌త విప్ల‌వానికి కామ్రేడ్లు , శ్రేయోభిలాషులు, మిత్రులు ఇటువంటి వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వుంటూ వారికి త‌గిన విధంగా బుద్ధి చెప్పాలి. శ‌త్రువు గోబెల్స్ ప్ర‌చార యంత్రంగంలో భాగంగానే వారిని గుర్తించాలి. వ‌ర్గ చైత‌న్యం క‌లిగిన శ్ర‌మ జీవులు, ఇటువంటి ద్రోహుల‌ను చెత్త గుట్ట‌లో విసిరేయాలి.

ఈ ద్రోహుల‌, ద‌గాకోరులకు పూర్తి భిన్నంగా ప్ర‌తీ శ్రామిక వ‌ర్గ విప్ల‌వం త‌మ‌ తుది శ్వాస విడిచేవర‌కూ ప్ర‌జా సేవ‌లో పూనీత‌మ‌య్యే రాజీలేని క‌మ్యూనిస్టు యోధులను ప్ర‌భ‌విస్తుంది. భార‌తీయ విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర కూడా దీనికి మిన‌హాయింపు కాదు. అది వేలాది మంది స్వార్థ రహిత యోధులను, అమ‌రుల‌ను త‌న ఘ‌న‌మైన వార‌స‌త్వంగా భార‌త‌దేశానికి అందించింది. వీరిలో మ‌న అత్యంత ప్రియ‌త‌మ మ‌హానాయ‌కులు, శ్రేణులు ఉదాహ‌ర‌ణ‌కు కామ్రేడ్స్ సీఎం-కేసీ, స‌రోజ్ ద‌త్తా, సుశీత‌ల్ రాయ్ చౌదురీ, అమూల్య సేన్, చంద్ర‌శేఖ‌ర్ దాస్, కృష్ణ‌మూర్తి, స‌త్యం, కైలాసం, అప్పు, వర్ఘీస్, బిస్వ‌క‌ర్మా, బాల‌న్, దిన‌క‌ర్, శ్యాం, మ‌హేష్‌, ముర‌ళీ, క‌ర‌మ్ సింగ్, ప‌రిమిళ్ సేన్, సందే రాజ‌మౌళి, వాద్కాపూర్ చంద్ర‌మౌళి, అనురాధ గాంధీ, ప‌టేల్ సుధాక‌ర్, చెరుకూరి రాజ్ కుమార్, మ‌ల్లోజ్వ‌ల కోటేశ్వ‌ర్లు, రవుఫ్‌, సుశీల్ రాయ్, శ్రీధ‌ర్ శ్రీనివాస‌న్, కుప్పు దేవ‌రాజ్, నారాయ‌ణ స‌న్యాల్, ప‌ద్మా , లలిత‌క్కా, ఊర్మిళ‌, ర‌జిత‌, అజిత‌, సాకేత్ రాజ‌న్, మైముద్దీన్, ఆశిష్ యాద‌వ్, ప్ర‌సాద్, ద‌యా, ప్ర‌భాక‌ర్, మంగ్తు, ష‌హీదా, ఆర్కే, యాద‌న్నా, మాధ‌వ్, మ‌హేంద‌ర్, మ‌స్తాన్ రావ్, పులి అంజ‌న్నా, కంచ‌న్, శ‌శథ‌ర్ మ‌హ‌తో, జ‌నార్ద‌న్, భూమ‌య్యా-కిష్టా గౌడ్ మ‌రియు వేలాదిగా నేల‌కొరిగిన అమ‌ర వీరులలో అరుణ‌తార‌లు. త‌మ జీవితాంతం అంకిత భావంతో ఆశ‌య సాధ‌న కోసం విప్ల‌వ మార్గంలో పయ‌నించిన ప‌థ‌గాములు. వారే నిజమైన ప్ర‌జా నాయ‌కులు మ‌హోన్న‌త‌లు మార్గ‌ద‌ర్శులు.

విప్ల‌వ ప్ర‌తీఘాత అధికార వ‌ర్గాల‌కు జీత‌గాళ్లుగా , గుమాస్తాలుగా దిగ‌జారిన ఈ ద్రోహులు కుట్ర‌దారులు, ద‌గాకోరులు, న‌మ్మ‌క ద్రోహులు దూర‌మవ‌టం ఉద్య‌మాన్ని, విప్ల‌వాన్ని ఆప‌లేదు. వారు కేవ‌లం తాత్కాలిక‌మైన అడ్డంకులు సృష్టించ‌గ‌ల‌రు, కొంత తాత్కాలిక న‌ష్టం చేయ‌గ‌ల‌రు. ఈ విప్ల‌వం ఇటువంటి చీడ‌, పీడ‌ల‌ను, క్రిమి, కీట‌కాల‌ను ఊడ్చి స‌మాధి చేసి ఉవ్వెత్తున త‌మ ల‌క్ష్య సాధన వైపు ఉర‌క‌లెత్తుతుంది. కార్మిక వ‌ర్గ విప్ల‌వ కారుల నాయ‌క‌త్వంలో అమ‌రులైన మ‌హాయోధుల స్ఫూర్తితో కోట్లాది పీడిత వ‌ర్గాలు ఈ విప్ల‌వ ద్రోహుల‌ను వారి య‌జ‌మానుల‌ను చ‌రిత్ర చెత్త బుట్ట‌లోకి విసిరి త‌మ అంతిమ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంటాయి.

( అభ‌య్ ) అధికార ప్ర‌తినిధి, కేంద్ర క‌మిటీ ,

సీపీఐ మావోయిస్ట్

Keywords : maoists party, telangana, jampanna,
(2022-09-24 02:19:58)No. of visitors : 6487

Suggested Posts


A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home Minister

When I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force....

జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖ

ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు.

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

విప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము.

ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

దోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు...

మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై....

మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !

ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మున్నా స్మార‌కార్థం కుటుంబ స‌భ్యులు ప్ర‌కాశం జిల్లా ఆల‌కూర‌పాడులో నిర్మించిన స్తూపాన్ని తొల‌గించాలంటూ కొంది మందిని డ‌బ్బులు తీసుకొచ్చిన జ‌నాల‌తో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, టంగుటూరు త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చారు. మావోయిస్టులు హింస‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ద పోరాటంలో ప్రాణాలు కోల్

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న అనారోగ్యంతో అమరుడయ్యాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆడియో ప్రకటనను విడుదల చేశారు.

Govt lost mercy petition of 4 Maoist convicts on death row

Four death row convicts in Bihar have been waiting for a decision on their mercy petition for more than a decade because their plea to be spared.....

37 మంది మావోయిస్టులను విషంపెట్టి చంపారా ?

ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర విప్లవోధ్యమంపై కక్షగట్టిన కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి ఒడిగట్టాయని

Search Engine

సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
more..


జంపన్న