చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

చేగువేరా

(చేగువేరా 50 వ వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు డాక్టర్ అలీదా గువేరా తో లుకొసె మాథ్యూ చేసిన ఇంటర్వ్యూను రాజేంద్రబాబు అర్విణి అనువాదం చేశారు. ఈ ఇంటర్వ్యూ వీక్షణం జనవరి 2018 సంచికలో ప్రచురించబడినది)

హవానా అక్టోబర్‌ 15 2017 సంచిక నుండి చేగువేరా కూతురు డా. అలీదా గువేరా మార్చ్‌తో ప్రత్యేక ఇంటర్వూ.

హవానా నగరంలో ప్రశాంతమైన ఓ వీథి. ఆ వీథిలో చేగువేరా అధ్యయన కేంద్రం. ఆ అధ్యయన కేంద్రం కార్యాలయంలోకి చాలా హడావిడిగా ఉన్న డా. అలైడా గువేరా మార్చ్‌ సుడిగాలిలా ప్రవేశించి నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని నన్ను చూస్తూ ʹఏం తీసుకుంటారు?ʹ అనడిగింది. నాకు నీళ్లు చాలు అని చెప్పాను. తాను ఎక్స్‌ప్రెసొ కాఫి తాగుతానంది. ఆమెకు సహాయకుడిగా ఉన్న ఆయన నీళ్లు, కాఫి రెండూ తెచ్చాడు. అప్పుడు సమయం ఉదయం పదిన్నర గంటలు. బయట చాలా వేడిగా ఉంది. అలైడాకు 57 ఏళ్ల వయస్సు ఉంటుంది. మెల్లగా కాఫి చప్పరిస్తూ ఆమె, 1997లో తన భారతదేశ పర్యటనను నెమరు వేసుకుంటూ అక్కడ తాను పొందిన ఆప్యాయత, సాదర ఆహ్వానాన్ని గురించి చాలా ఉత్సాహంగా చెప్పింది. ʹకలకత్తా, హైదరాబాద్‌, కాలికట్‌ వెళ్లడం నాకు బాగా గుర్తుంది. అక్కడి ప్రజలు స్నేహశీలురు.ʹ అంది ఆమె. ʹనేను హవానా నుండి బయల్దేరక ముందు, నా కూతుళ్లు (ఎస్టెఫేనియా, సీలియా) అక్కడి నుంచి ఏనుగుల బొమ్మలు తీసుకురమ్మని చెప్పారు. నాకు బాగా గుర్తు. ఒక నగరంలో... అది కాలికట్‌... అవును... కాలికట్‌ నగరంలో నేనొక ఏనుగుపై ఎక్కి కూర్చున్నాను. అదొక కష్టంతో కూడుకున్న వ్యాయామంలా అనిపించింది. అక్కడ ఒక బల్లను ఉంచారు. ఆ బల్లపై ఒక స్టూల్‌. కింద నుండి ఏనుగుపైకి ఎగిరి పడ్డట్లే అనిపించింది. అయితే, కత్తిమీద సాములాంటి ఈ ప్రక్రియ తర్వాత నడిచివెళ్లడానికి చాలానే ఇబ్బంది పడ్డాను.ʹ

ʹచేʹకు నలుగురు సంతానం. అందరిలోకి బాగా ప్రచారంలో ఉన్న వ్యక్తి, అందరికంటే పెద్దది అలైడా మార్చ్‌. ఆమె హవానాలోని విలియమ్‌ సోలెర్‌ పిల్లల ఆసుపత్రిలో శిశు వైద్య నిపుణురాలు. చేగువేరా కుటుంబం వైపు నుండి ప్రతినిధిగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేగాదు చేగువేరా అధ్యయన కేంద్రాన్ని నడపడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. చాలా సామాజిక కార్యక్రమాలలో, తన ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ నిమగ్నమై ఉండే ఆమె క్యూబాలో ఉన్నా, విదేశాలలో ఉన్నా వీటితోనే ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఒక గంటకు పైగా జరిగిన మా భేటీ ముగుస్తుండగా ఆమె తన వాచీ చూసుకుని హడావిడిపడుతూ ʹఓహ్‌! నేనిక బయల్దేరాలి. ఇప్పటికే ఆలశ్యమైందిʹ అంటూనే బయటకు పరుగెత్తింది. నేను లేచి బయటకు వస్తూనే ఉన్నాను, ఆమె అప్పటికే తన కారులో కూర్చుని డ్రైవ్‌ చేసుకుంటూ వేగంగా వెళ్లిపోయారు. చాలా మంది క్యూబా దేశస్థులకు కారు అందుబాటులో లేని విలాసవంతమైన వాహనమే! ఆమెతో నేను తీసుకున్న ఇంటర్వూ లోంచి కొన్ని భాగాలు:

ప్ర : మీ తండ్రిగారు లేని సమయాల్లో మీ తల్లిగారు ఒక్కరే నలుగురు పిల్లలను పెంచడం ఎంతో ఇబ్బందిగా ఉండి ఉంటుంది. దాన్ని గురించి వివరించండి.

జ : నాన్న నుంచి దూరంగా ఉండడమే అమ్మకు చాలా కష్టంగా తోచేది. మా నాన్నగారితో పాటు బొలీవియాలో ఉండడానికి చాలా ఇష్టపడింది మా అమ్మ. కాని తనను హవానాలోనే ఉండమన్నాడు నాన్న. కనీసం రెండు సంవత్సరాలైనా అక్కడే ఉండమన్నాడు. అది ఆయన నిబద్దత. యుద్ధం రెండేళ్లలో ముగియకపోతే ఎవరినైనా పంపి తన దగ్గరికి పిలిపించుకుంటానన్నాడు.

అయితే క్యూబా సమాజం నుండి ఆమెకు గొప్ప మద్దతు లభించింది. మా యోగ క్షేమాల్ని విచారించేందుకు మా నాన్నగారి మిత్రులు చాలా మంది చాలా తరచుగా ఇంటికి వస్తుండేవారు. మా అమ్మకు ఏదైనా సమస్య ఎదురయిందంటే ఫిడల్‌ (క్యాస్ట్రో) తో గాని రామిరొ వాల్డెజ్‌తో నేరుగా మాట్లేడేది. (రామిరొ వాల్డెజ్‌ క్యూబా విప్లవ పోరాటానికి ముందుండి నాయకత్వం వహించినవాడు. ఒకవేళ చేగువేరా పోరాటంలో అమరుడైతే, ఆయన పిల్లలను పెంచి పోషించే బాధ్యత రామిరొకు అప్పగించబడింది) వారు వెంటనే స్పందించి మా అమ్మను కలిసేవారు. ముఖ్యంగా రామిరొ.

ప్ర : ఒక తండ్రిగా చేగువేరా ఎలా ఉండేవాడు, చెప్పండి.

జ : నిజానికి మా నాన్న గురించి నాకు జ్ఞాపకం ఉన్న సంగతులు చాలా తక్కువే అని చెప్పాలి. ఆయనతో గడిపిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి నాన్నగారంటే కొంత భయం కూడా ఉండేది. ఆయన ఇంటికి రావడమే తక్కువ. చిన్నప్పుడు మా అమ్మ దగ్గరే పడుకునేదాన్ని. ఎప్పుడో ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎత్తుకుని గట్టిగా నా బుగ్గలు ముద్దు పెట్టుకునేవాడు. దాంతో నాకు మెలుకువ వచ్చేది. ఎలా ఉంటుందో ఊహించండి... చాలా అరుదుగా కనిపించే మనిషి... హఠాత్తుగా చీకట్లో కనిపిస్తే... కొన్నిసార్లు మా నాన్న మమ్మల్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి తీసుకెళ్లేవాడు. (విప్లవం విజయవంతం అయిన తర్వాత వారంలో ఒకరోజు ప్రజలందరూ ఉచితంగా సమాజం కోసం స్వచ్ఛందంగా పని చేయాలన్న పద్ధతిని అవలంబించేవారు) ఆ సమయంలో మాత్రమే మా నాన్న మాతో పిచ్చపాటి మాట్లాడేవాడు. మాతో కలిసి ఉండేవాడు. ఓసారి స్వచ్ఛంద సేవ నుండి తిరిగి వచ్చి తన గదిలో బట్టలు మార్చుకుంటున్నాడు. నేను, నా తమ్ముడు కామిలో మెల్లగా వెనకనుండి వెళ్లి ఆయన వీపు మీద ఎక్కి కూర్చుని ఛల్‌ ఛల్‌ గుర్రం... అంటూ ఆ హాలంతా నడిపించాము. అయితే ఇలాంటివి కొన్ని జ్ఞాపకాలు మాత్రమే. క్రమశిక్షణకు సంబంధించి మా నాన్న చాలా స్ట్రిక్ట్‌. కఠినంగా ఉన్నప్పటికి, చాలా ప్రేమగా కూడా ఉండేవాడు. ముఖ్యంగా మాకు చాలా విలువలు నేర్పాడు. ఉదాహరణకు పుస్తకాలంటే వల్ల మాలిన అభిమానం మాలో నెలకొనేటట్లు చేశాడు. ఎప్పుడూ చదవాలని, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన అవసరాన్ని గురించి, మనుషులను, జంతువులను గౌరవంగా, ప్రేమగా చూడాలని మాకు చెప్పేవాడు. అయితే ఈ విషయాల అమలు గురించి కృషి చేసే సమయం ఆయనకు జీవితంలో లభించలేదు.

ప్ర : చేగువేరా రాసిన ʹరెమినిసెన్స్‌స్‌ ఆఫ్‌ ది క్యూబన్‌ రివల్యూషనరీ వార్‌ʹ పుస్తకానికి మీరు రాసిన ముందు మాటలో ఒక చిన్న కుక్కపిల్లను చంపిన సంఘటనను వర్ణించిన అధ్యాయాన్ని గురించి ప్రస్థావించారు. ఆ కుక్కను చంపమని ఆదేశించడం పట్ల చేగువేరా చాలా ఆవేదన చేందారని రాశారు.

జ : అవును. శతృవులు వాళ్ల చుట్టూ ఉన్నారు. ఆ కుక్కపిల్ల ఒకటే మొరుగుతూ ఉంది. వాళ్ల ఆనవాలు తెలిసిపోయే ప్రమాదం దాపురించింది. ఆ సమయంలో మా నాన్న విధిలేక ఆ కుక్కను చంపమని ఆదేశించారు. ఆ రకంగా తన మనుషులను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కాని ఆ చిన్న జీవి కోసం ఆయన చాలా బాధపడ్డాడు. ఆ సంఘటన ఆయన మనస్సు మీద బలమైన ముద్ర వేసింది. అయితే తన మనుషుల కోసమే ఆయన ఆపని చేయాల్సి వచ్చింది.

ప్ర : కాంగోలో ఆయన కార్యకలాపాల గురించి, ఆ తర్వాత బొలీవియాలో ఆయన చేసిన పనుల గురించి మీకు సమాచారం ఉండేదా?

జ : లేదు. అప్పుడు మేం చిన్నవాళ్లం. కాబట్టి మా నాన్న ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో మాకు తెలిసేది కాదు. బహుశా మా అమ్మగారికి సమాచారం ఉండేదనుకుంటాను.

ప్ర : మీ నాన్నగారి మనస్సులో మీకో ప్రత్యేక స్థానం ఉండేది. ఆయన రాసుకున్న బొలీవియన్‌ డైరీలో ʹఅల్యూచాʹ జన్మదినాన్ని గురించి ప్రస్థావన ఉంది.

జ : నవంబర్‌ (1966) తొలి రోజులలో ఆయన బొలీవియా వచ్చారు. అదే నెల చివరి వారంలో నా పుట్టిన రోజు ఉండేది. ఆ రకంగా నా పేరు ప్రస్థావనకు వచ్చింది.

ప్ర : చేగువేరా చాలా విస్తారంగా రాసిన రచయిత. ఆయన రాసిన వాటిల్లో మీరు మొదట ఏ పుస్తకాన్ని చదివారు?

జ : నేను చదివిన మా నాన్నగారి మొదటి పుస్తకం ʹట్రావెల్‌ నోట్స్‌ʹ. ఆ తర్వాత ఆ పుస్తకం ఆధారంగా ʹమోటార్‌ సైకిల్‌ డైరీస్‌ʹ అన్న పేరుతో సినిమా కూడా తీశారు. ఆ పుస్తకానికి నేను ముందుమాట రాశాను. నిజానికి, మా అమ్మ ఆ పుస్తకాన్ని చదవమని నాకిచ్చినప్పుడు నాకప్పుడప్పుడే 16 ఏళ్లు నిండుతున్నాయి. అది అప్పటికి రాతప్రతి మాత్రమే. పుస్తక రూపంలో కూడా రాలేదు. మా అమ్మ ఆ పుస్తకం నాకిస్తూ అది ఎవరు రాశారో చెప్పలేదు. నేను పుస్తకం చదవడం ప్రారంభించి ఆ రచయితను ఎంతో ఇష్టపడ్డాను. ఆ తర్వాత తెలిసింది ఆ పుస్తకం రాసింది మా నాన్నేనని. అంత సాహసికుడైన ఆ పుస్తకంలోని పిల్లవాడు, పూర్తి ఉత్సాహంతో ఉన్నవాడు మా నన్నే అన్న విషయం తెలిసి నేనెంతో గర్వపడ్డాను. సంతోషపడ్డాను. అప్పట్నుంటే మా నాన్నకు దగ్గరగా ఫీలవడం ప్రారంభమైంది.

ప్ర : రచయితగా ఆయన గురించి మీరేమనుకుంటున్నారు?

జ : ఆయన మంచి వచనం రాసేవారు. దేన్ని గురించయినా ఆయన రాసిన వర్ణన చదువుతూ ఉంటే, నిజంగా దానిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లే ఉంటుంది. ʹది మోటార్‌ సైకిల్‌ డైరీస్‌ʹ సినిమాకు దర్శకత్వం వహించిన వాట్టెర్‌ సాలెస్‌ ఆ పుస్తకంలో ప్రస్థావించిన ప్రదేశాలు చూడడానికి వెళ్లినప్పుడు, మా నాన్న వర్ణించిన ప్రదేశాలన్నీ సరిగ్గా అలాగే ఉండడం వారికి చాలా ఆశ్చర్యం కలిగించింది.

ప్ర : మీ నాన్నగారు రాసిన పుస్తకాల్లో అన్నింటికంటే దేన్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు?

జ : ఆ పుస్తకాలన్నీ వివిధ విషయాలకు సంబంధించినవి. మా నాన్న మొదటి పుస్తకం రాసిన తర్వాత ఆయన దాన్ని ప్రచురించాలనుకోలేదు. చాలా రోజుల తర్వాత ʹచేగువేరా అధ్యయన కేంద్రంʹ దాన్ని ప్రచురించింది. మా కేంద్రమే ఆయన రచనల సంకలనాన్ని, ఆయనే స్వయంగా తీసిన ఎన్నో ఫోటోలతో సహా ప్రచురించింది.

ప్ర : ఆయన మంచి ఫోటోగ్రాఫర్‌ కూడా...

జ : చాలా మంచి ఛాయా చిత్రకారుడు. ఆయన తీసిన ఫోటోలను చాలా బాగా తీయబడిన చిత్రాలతో పోల్చవచ్చు. ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ కడుతున్నప్పుడు, పూర్తిగా తయారు కాని ఆ కార్మాగారాన్ని ఫోటో తీశాడు మా నాన్న. అందులో ఎన్నో గోట్టాలు, ఇనుప ముక్కలు కనిపిస్తాయి. వాటితో పాటు నిర్లక్ష్యంగా విసిరివేయబడ్డ ఓ చేయి తొడుగు. చెత్తకింద పారవేయబడ్డ చేయి తొడుగు ఏమాత్రం అందంగా కనిపించదని మనం అనుకోవచ్చు. కాని ఆయన ఫోటో తీసిన విధానం, దాన్ని ఎంతో అందంగా కనిపించేలా చేసింది.

ప్ర : కాంగోలో ఆయన తలపెట్టిన కార్యక్రమంలో ఎక్కడ పొరపాటు దొర్లింది?

జ : విభిన్న సంస్కృతులకు సంబంధించిన సమస్య అది. మా నాన్న అక్కడ కాంగోలో ఉన్నది వారికి సహాయపడడానికి వారిపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు. మా సంస్కృతిలో సైన్యాధ్యక్షుడు ముందుండి నడిపిస్తాడు. అది ʹజోస్‌ మార్టిʹ కానివ్వండి, ʹఆంటోనియో మేసియా గ్రజాలస్‌ʹ కానివ్వండి, ʹమాక్జియో గోమెజ్‌ʹ లేదా ʹఫీడల్‌ʹ, రేల్‌కాస్ట్రోʹ ఎవరైనా కానివ్వండి వారు ముందుండే నడిపిస్తారు. మా నాన్న ఆ పద్ధతికే అలవాటు పడ్డారు. అయితే ఆయన అక్కడ ముందు భాగానికి వెళ్లలేకపోయారు. ఎందుకంటే నాయకులెవ్వరు అక్కడ ముందు భాగాన కనిపించరు. అక్కడి పరిస్థితిని మెరుగుపరచలేకపోవడానికి ముఖ్య కారణం పోరాట పంథా అగ్ర భాగంలో ఏం జరుగుతుందో ఊహించి వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నం చేయడం. మైదానంలో గొయ్యి తవ్వడం కేవలం చనిపోయిన వారిని పూడ్చిపెట్టడానికే అని ఆఫ్రికన్ల నమ్మకం. అలా కాకుండా గొయ్యిని తవ్వి, అందులో దాక్కొని కూడా యుద్ధం చేయవచ్చని వాళ్లకెప్పటికి అర్థం కాదు.

వారికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పడానికి ఎక్కువ సమయం కావాల్సి వచ్చింది. ఆయనకు ఆ సమయం ఇవ్వడానికి వారు సిద్దంగా లేరు. క్యూబాకు చెందిన వాళ్లందరూ కాంగో విడిచి వెళ్లిపోవాలని వారు నిశ్చయించారు. మా నాన్నకు తెలుసు అక్కడ తన కర్తవ్యం పూర్తికాలేదని, అయినా తననిష్టపడని వాళ్లమీద ఆధిపత్యం చెలాయించడం తగదని ఇతర క్యూబన్‌లతో కలిసి ఆయన వచ్చేశారు.

ప్ర : తర్వాత, బొలీవియాలో ఏమైంది?

జ : బొలీవియాలో సమన్వయ లోపం కనిపించింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి - నాయకత్వమే, పార్టీకాదు - గెరిల్లా నాయకుని మధ్య విబేధాలు ఉండేవి. కమ్యూనిస్టు పార్టీ నాయకులు యుద్ధాన్ని వారే నడుపుతామన్నారు. వారే నాయకత్వ బాధ్యత వహించడంలో తనకేమీ ఇబ్బంది లేదని మా నాన్న చెప్పారు. అయితే వాళ్లు యుద్ధ రంగం మీదే ఉండాలి. నగరాలలో నివసిస్తూ సైన్యాన్ని నడపడం సాధ్యం కాదన్నారు. వారకది అర్థం కాలేదు. వారు హుందాగా కూడా ప్రవర్తించలేదు. ఉదాహరణకు గెరిల్లా యుద్ధంలో చేరకుండా గని కార్మికులను అడ్డుకున్నారు. దాంతో విప్లవోద్యం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది.

ప్ర : మీ నాన్నగారు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కాకపోవడానికి పార్టీలో సోవియట్‌ - అనుకూల, చైనా - అనుకూల వర్గాల భేదాభిప్రాయాలే కారణమా?

జ : కాదు. అవి స్వల్పమైన కారణాలే.

ప్ర : ఒకవేళ మంచి వనరులు, అన్ని వర్గాల నుండి మద్దతు ఉండి ఉంటే ఆ కార్యక్రమం విజయవంతం అయి ఉండేదా?

జ : ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. విజయం సాధించాలంటే గెరిల్లాలకు ప్రజల మద్దతు కావాలి. ప్రజల నుండి అనుకున్నంత మద్దుతు రాలేదు. కారణం వాళ్లు భయపడ్డారు. సమాజం మారాలంటే మరణానికైనా సిద్దం కావాలన్న విషయాన్ని సాంస్కృతికంగా చైతన్యం లేని ప్రజలకు అర్థం చేయించడం కష్టమైన పని.

ప్ర : ఆయన్ను చంపిన దేశమే ఇప్పుడు ఆయన్ను కొలుస్తున్నది. దీనికి మీరేమంటారు?

జ : ఈ పరిణామం ఆ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచేదైతే మాకేమీ సమస్య లేదు. ఈ పరిణామాలను మనం నివారించలేం కూడా. మేము కోరేదల్లా ఒకటే. ఒక అసాధరణమైన వ్యక్తికి తగిన గౌరవం, ప్రతిష్ట లభించాలన్నదే మా అభిమతం.

ప్ర : గెరిల్లా నాయకుడుగా ʹచేʹ ఎంత సమర్థుడు?

జ : ఈ విషయం చెప్పడానికి యుద్ధ వ్యూహాలలో నేనంత నిపుణురాలిని కాను. ఆయన సహచరులు ఆయన్ను గురించి చాలా గౌరవంగా మాట్లాడుకోవడం నేను విన్నాను. గెరిల్లా యుద్ధ తంత్రం గురించి ఆయనొక పుస్తకం రాశాడు. అమెరికా వారు ఇప్పుడా పుస్తకాన్ని తీవ్రంగా పఠించి గెరిల్లా యుద్ధ వ్యూహాలు నేర్చుకుంటున్నారు. వాటినే గెరిల్లాలతో యుద్ధంలో వాడుతున్నారు. శక్తిమంతుడైన శత్రువు ఆయన పుస్తకం లోంచి పాఠాలు నేర్చకుంటున్నారంటే ఆయన యుద్ధ తంత్ర నిపుణుడని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా!

ప్ర : చేగువేరా ఆదర్శాలకు ఈనాడున్న ప్రాసంగిత ఏమిటి?

జ : ఈనాటికీ అవి అనుసరణీయమే. ఎందుకంటే వేటికి వ్యతిరేకంగా పోరాడాడో, ఆ పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయి. ధనికులకు, పేదలకు మధ్య వ్యత్యాసం ఇంకా పెరిగిపోయింది. పేద దేశాలను దోపిడీ చేయడం దారుణంగా పెరిగింది.

ప్ర : చేగువేరా వారసత్వం ఏమిటి?

జ : ʹచేʹ వారసత్వం చాలా విస్తారమైనది. దానిలో అన్నింటికంటే ముఖ్యమైనది ఒక సరికొత్త సమాజాన్ని సృష్టించే నూతన మానవ ఆవిష్కరణ.

ప్ర : ఇప్పుడు టి-షర్ట్‌ల మీద కనిపించే ప్రతిమ అయిపోయారు ʹచేʹ. ఈ పరిస్థితి ఇట్లా అయిందని మీరు విచారిస్తున్నారా?

జ : క్యాపిటలిస్టు సమాజంలో మార్కెట్‌ పెంచుకోవడానికి అమలు పరిచే వ్యూహం ఇది. అయితే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటే మేం తప్పకుండా దానిని ఎదుర్కొంటాం. ఉదాహరణకు బీర్‌ బాటిల్లపైనో, సిగరెట్‌ పెట్టలపైనో ఆయన బొమ్మ వేస్తే మేం సరేమిరా అంగీకరించం. ఆయన బొమ్మను విచ్చల విడిగా, ఆనాలోచితంగా ఉపయోగించుకుంటే మేం అంగీకరించం. అయితే ఆయన ప్రతిమను పెట్టుబడిదారి మార్కెటింగ్‌ వ్యూహాలతో వ్యాపారపరం చేయాలనుకుంటే, అది బెడిసికొట్టింది. అది తిరుగుబాటు తత్వంతో ఉన్న యువతను ఒకే జెండా కింద ఐక్యం చేయడానికి తోడ్పడింది.

ప్ర : మీ నాన్నగారిని ప్రపంచం ఎట్లా గుర్తుంచుకోవాలని మీ అభిలాష

జ : మా నాన్న మనుషులను, ప్రపంచాన్ని ఎలా ప్రేమించాలో తెలిసినవాడు. ఆయన గొప్ప కమ్యూనిస్టు.

ప్ర : క్యూబా ప్రజలు మీ నాన్నగారి మరణ వార్తను ఎలా తట్టుకోగలిగారు?

జ : క్యూబా ప్రజలకు ఆ వార్త చాలా విషాదాన్ని మిగిల్చింది. మా నాన్న ఈ దేశంలో అడుగుపెట్టినప్పట్నుంచి వారు ఆయన్ను ప్రేమించారు. చాలా సంవత్సరాల తర్వాత కూడా, మా ప్రమేయం ఏమీ లేకుండానే ఇప్పటికీ మా నాన్న వలన వారి ప్రేమను పొందుతూనే ఉన్నాం. నేను శిశు వైద్యురాలిని. పిల్లలతో కలిసి పని చేయడాన్ని నేను ఇష్టపడతాను. కొన్ని కొన్ని సార్లు వారు నన్ను ఎంతో ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. నేను రాసే మందుల చీటీ మీద వంశనామాలు రెండు (గువేరా, మార్చ్‌) చూసి, నేనుʹచేగువేరాʹ కూతురునని తెలుసుకొని, ఆశ్చర్యంతో అడుగుతుంటారు - ʹమీరు ʹచేʹ కూతురట! నిజమా!ʹ అని. నేను అవునని చెప్పగానే, చాలా సీరియస్‌గా నన్ను చూసి ʹఆ! అందుకే నీవంత మంచి దానివిʹ అంటుంటారు. (నవ్వుతూ) ʹఇది విచిత్రం. చాలా సంవత్సరాలు వైద్య విద్యనభ్యసించి పసి ప్లిలల వైద్య నిపుణురాలిగా పనిచేస్తూ కూడా ʹచేగువేరాʹ కూతురును కాబట్టే నేను మంచిదాన్ని... దీన్ని మరో కోణంలో కూడా చూడవచ్చు. ఒక ఐదేళ్ల కుర్రవాడు, ʹచేʹ చాలా మంచివాడు కాబట్టి.. ఆయన కూడా మంచిదే అయి ఉండాలని అనుకోవడం... ఈ ఆలోచన మనసుకు హత్తుకునేలా ఉంది.ʹ

ఒకసారి నేను భయపడ్డాను కూడా. నేనొక స్కూలుకు వెళ్లాను. స్కూలు పిల్లలంతా నన్ను చుట్టుముట్టారు. ఆ జన సముద్రంలో పడి కొట్టుకుపోతానేమో అనిపించింది. ఆ రోజు కనీసం 600 మంది పిల్లలను నేను ముద్దు పెట్టుకొని ఉంటాను.

విప్లవం విజయవంతం అయినప్పటి నుండి క్యూబా దేశం ఆర్థిక దిగ్బంధం ఎదుర్కుంటుంది. యూరప్‌ ఖండంలో ఉన్న సోషలిస్టు శిబిరం సహాయంతో నెగ్గుకు వస్తున్నాం. అది కూడా మృగ్యమైనపుడు, అర్థికంగా అధమ స్థాయికి దిగజారిపోయాం. ఆ సమయంలో ʹగువాంటనాయోʹలో ఒక పాఠశాలకు వెళ్లాను. ఒక చిన్న బాలిక నా దగ్గరకు వచ్చి రెండు పెన్సిళ్లు బహుకరించింది. నేను ఆ అమ్మాయితో అన్నాను. ʹస్వీటీ, ఈ పెన్సిళ్లతో నాకంటే నీకే ఎక్కువ అవసరం ఉంటుంది. నీవే ఉంచుకో వీటిని.ʹ ఆ అమ్మాయి కొంచెం బాధపడి నాతో అన్నది - ʹదయచేసి వద్దనకండి. నేనివ్వగలిగింది మీకిదే.ʹ వాళ్లకు ʹచేʹ అన్న మనిషి తెలుసు. ఆయన ఇప్పుడు లేడు. కాబట్టి ఆయనపై ఉన్న ప్రేమను ఆయన పిల్లల వైపు మరల్చుకున్నారు. ఎంత మంచి విషయం!

ప్ర : ఒక వీరుని కూతురుగా పెరగడం మీకు ఎలా ఉండింది?

జ : మా అమ్మ నాకు పెట్టని కోటలా ఉండింది. మేము ప్రత్యేకమైన పిల్లలం అన్న భావన రానివ్వలేదు మా అమ్మ. అందరి పిలల్ల లాగా మా బాల్యమూ మామూలుగానే గడిచింది.

ప్ర : మీరు ʹచేʹ కూతురు అని తెలిసిన తర్వాత స్కూల్‌లో మీ సహ విద్యార్థుల ప్రతిస్పందన ఎలా ఉండింది?

జ : సమయంలో అదొక ప్రత్యేకమైన విషయంగా ఎవరూ పరిగణించ లేదు. మమ్మల్ని స్కూల్లో కార్లో ఎవరూ దింపేవాళ్లు కాదు. మా వెంట అంగరక్షకులు ఎవరూ ఉండేవారు కాదు. మేము సాధారణ పిల్లల లాగే స్కూలు జీవితం గడిపాము. మేము వయస్సులో పెద్దవాళ్లుగా పెరిగిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఎందుచేతనంటే క్యూబాలోని టెలివిజన్‌లో మమ్మల్ని చూపించే వాళ్లు. నిన్న నేనొక దుకాణానికి వెళితే అక్కడ వాళ్లు నన్ను చూసి అడిగారు ʹమిమ్మల్ని టివిలో చూస్తుంటాంʹ అని. నేను అవునని నవ్వాను. ఇంకోసారి నేను బ్యాంకుకు వెళితే అక్కడ పొడుగాటి క్యూ ఉంది. క్యూలో నిలబడ్డ పెద్ద మనిషి ఒకాయన నన్ను గుర్తుపట్టి ʹమీరు ముందుకెళ్లడానికి మాకెవరికీ అభ్యంతరం లేదుʹ అన్నాడు. నేను వినయపూర్వకంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించాను.

ప్ర : మీపై మీ నాన్నగారి ప్రభావం ఏ మేరకు ఉంది?

జ : నా చుట్టూ ఉండే ప్రజలకు ప్రయోజనకారిగా ఉండే విధంగా జీవించాలనుకుంటాను. మేము ఆ విధంగా జీవించాలని మా నాన్నగారు భావించేవారు. తన పిల్లలు ప్రత్యేకంగా ఉండాలని ఆయనెప్పుడూ అనుకునేవారు కాదు. వారు ఎక్కడ జీవించినా ప్రజలకు ఉపయోగపడేలా విలక్షణంగా జీవించాలని కోరకునేవారు. ఒక డాక్టరుగా, రెండు అంతర్జాతీయ సేవా కార్యక్రమాలు చేపట్టాను. ఒకటి నికరాగ్వాలో, మరొకటి ʹఅంగోలాʹలో. నేను ʹఈక్వడార్‌ʹలో స్థానికులతో కలిసి పని చేశాను. ʹఅర్జెంటీనాʹలో వైద్య బృందంతో పని చేశాను. ʹబ్రెజిల్‌ʹ దేశంలో భూమిలేని ప్రజల పోరాటంలో పాల్గొన్నాను. నేను ప్రజలకు ఉపయోగపడేలా జీవించాలనుకుంటున్నాను.

జాత్యహంకారానికి, వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్న నిబద్దతతో ʹఅంగోలాʹ దేశం నుండి వచ్చేశాను. ఒక రష్యన్‌ రచయిత మాటల్లో చెప్పాలంటే నీ జీవితం ఎలా గడపాలంటే చనిపోయేటప్పుడు నేనిన్నాళ్లు వృథాగా కాలం గడిపానే అన్న బాధ లేని విధంగా నీవు జీవించాలి. ఆ రకంగా జీవించేలాగా ప్రయత్నం చేస్తున్నాను.

ప్ర : మీ నాన్నగారు ఒక వైద్యుడు. మీ జీవనోపాధి ఎన్నుకొనే విషయంలో అది ఏమైనా ప్రభావం కలగజేసిందా?

జ : కొంతవరకు అది వాస్తవమే. కాని అంతిమంగా అది నా నిర్ణయమే. నేను నా ప్రజలకు చాలా రుణపడి ఉన్నాను. కొంతలో కొంతైనా వారికి సేవా రూపంలో తిరిగి ఇవ్వాలి. వారికి కావలసిన అతి అవసరం తీర్చే విషయంలోనే వారికి దగ్గరవుతాను. ఒక శిశువు మోముపై చిరునవ్వు చూడడంలోనే నేను ఆనందాన్ని అనుభవిస్తాను.

ప్ర : నిర్బంధం వైద్య రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నది?

జ : నిర్బంధం ప్రభావం వైద్యరంగం మీద ఎక్కువగానే ఉంది. అయితే క్యూబాలో వైద్యులు సంసిద్దంగానే ఉన్నారు. మా రోగులకు ఎలా సహాయకారిగా ఉండాలో మాకు బాగా తెలుసు. కాని, కొన్నిసార్లు మాకు సహాయం చేసే మార్గాలు ముసుకుపోతాయి. ఉదాహరణకు నా పెద్ద కూతురు ఒక సర్జన్‌. తాను కృత్రిమ అవయవాల లభ్యత విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇక్కడ ఎవరూ కృత్రిమ అవయవాలను అమ్మరు. ఎందుకంటే అవి అమెరికాలో తయారవుతాయి. తలలో నీరు చేరే (హైడ్రో సిఫాలస్‌) వ్యాధితో ఓ అమ్మాయి మా దగ్గరికొచ్చింది ఓసారి. నీటిని బయటకు తీసే గొట్టం (ట్యూబ్‌) ఒకటి కావలసి వచ్చింది (క్యాథటిర్‌). మా వద్ద నాణ్యమైన క్యాథటిర్‌ లభించక ఆ అమ్మాయికి మెదడులో నీరును పూర్తిగా తీసివేయడానికి 11 సార్లు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. రోగ నిర్ణయానికి సంబంధించిన విషయాలలోను ఈ ఆర్థిక నిర్బంధం చాలా ప్రభావం చూపిస్తున్నది. ప్రత్యామ్నాయాల కోసం చూడాల్సి వస్తున్నది. సహజ వైద్యం వాటిల్లో ఒకటి. రోగ నివారణ అన్న అంశాన్ని బాగా ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. రోగాన్ని నయం చేయడం కన్నా అది రాకుండా నివారించడం సులభం. క్యూబాలో వైద్య రంగం ప్రాథమికంగా ఈ అభిప్రాయంలో ఉంది.

ప్ర : ʹరెమినిసెన్సస్‌ʹ (జ్ఞాపకాలు) అన్న పుస్తకానికి మందు మాటలో మరింత మంచి సమాజం కోసం మన పోరాటాన్ని కొనసాగించాలని మీరు రాశారు. ఆ కోరిక ఎంత వరకు వాస్తవిక రూపం దాల్చే పరిస్థితులున్నాయి? ముఖ్యంగా, మనం నివశిస్తున్న ఈ ప్రపంచంలో ద్వేషభావం పెచ్చరిల్లిపోతున్న ఈ రోజుల్లో!

జ : ముఖ్యమైన విషయమేమిటంటే, మనం యుద్ధానికి భయపడకూడదు. అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది. ఎందుచేత? మొదటిది, మా ఐకమత్యం. రెండవది, మేము సంస్కృతి పరంగా నాగరికులం. మా నాగరిత వల్ల మేం స్వేచ్ఛగా జీవిస్తాం. మేము స్వేచ్ఛా ప్రియులం. మూడవది, మాకొక సామాజిక భావజాలం ఉంది. మా జీవన శైలి ప్రత్యేకమైనది. దాన్ని మేం మార్చుకోదలచుకోలేదు. దానిని ఇంకా అభివృద్ధి పరచుకోవాలి. దాన్ని మేం మార్చుకో దలచుకోలేదు.

ప్ర : ఇంకొక పది సంవత్సరాల తర్వాత ʹక్యూబాʹ ఏ స్థితిలో ఉంటుంది చెప్పగలరా?

జ : ఈ ప్రశ్నకు సమాధానం ప్రస్తుత అమెరికా అధ్యక్షుని (డొనాల్డ్‌ ట్రంప్‌) తిక్కదనంపై ఆధారపడి ఉంటుంది. మానవ జాతిని నాశనం చేసేంత శక్తిమంతుడాయన, ఆ మానవ జాతిలో మేమూ భాగమే. ఇదీ సమస్య, ఆయనకు ఆ శక్తి ఉంది. కాని వివేకం లేదు. ఆయనకున్న శక్తిని తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత బలవంతుడా అని. అతడు ఆ శక్తిని సక్రమంగా వినియోగిస్తాడా? అయితే మనకున్న రక్షణాంశాలు ఏమిటి? వాస్తవ పరిస్థితిని గమనించకుండా మనం సరైన పద్ధతిలో జీవించలేం.

ఒక ప్రముఖ ఆర్థిక వేత్త ఒక మంచి మాట చెప్పాడు. అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నైతిక విలువలు కోల్పోయిన మావనజాతి ఉనికిలో ఉండే అర్హతను కోల్పోతుంది అన్నది ఆ ఆర్థికవేత్త చెప్పిన మాట. ఈ అర్హతను మనం కోల్పోతున్నాం. ప్రపంచమే ఆ అర్హతను కోల్పోతున్నది. మనం మన భూ భాగాన్ని సర్వనాశనం చేసుకునే పనిలో ఉన్నామన్న విషయం మనకు అర్థం కావడం లేదు. లేదా మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. మనం వీటిమీద పోరాటం చెయ్యము. ఈ సోమరితనం వల్ల గొప్ప వినాశనం జరిగే పరిస్థితి నెలకొంది. తిక్కగా ఆలోచించే ఇలాంటి మనుషులు అధికారంలో ఉండడం వల్ల పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా తయారవుతున్నది.

కాబట్టి మేల్కొనే తరుణం ఆసన్నమైంది. మనం త్వరితగతిన మేల్కొనాలి. సమయం లేదు!

(అనువాదం : రాజేంద్రబాబు అర్విణి)

Keywords : aleida guevara, che guevara, aleida march, Cuba
(2024-05-22 15:16:39)No. of visitors : 4847

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్ల‌జాతీయుడైన‌ పోలీస్‌ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై విడాకులు కోరింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన‌ చౌవిన్‌తో తను ఇక ఎంత మాత్రమూ కలిసి ఉండలేనని ప్రకటించిన ఆమె తమ‌ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు ఎక్కారు.

Paris Museum Displays Beheaded Africans

There is a museum in Paris with 18 000 human heads of people killed by the french colonial troops and missionaries. Itʹs called Musee d Histoire Naturelle de Paris.

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !

వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల‌ మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చేగువేరా