ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ?


ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ?

ఆ

(పాత్రికేయులు జీ లింగమూర్తి రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక జనవరి 2018 సంచికలో ప్రచురించబడినది)

ముంబైలో కేంద్ర నేరపరిశోధక విభాగం (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ - సిబిఐ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా ఉండిన బ్రిజ్‌ మోహన్‌ హరికిషన్‌ లోయా 2014 నవంబర్‌ 30 రాత్రి నాగపూర్‌ లో రవి భవన్‌ అనే ప్రభుత్వ అతిథి గృహంలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించారని మూడు సంవత్సరాల కింద వెలువడిన వార్త నిజం కాదని, ఆయన హత్యకు గురై ఉండవచ్చునని ప్రస్తుతం వెలువడుతున్న కొత్త సమాచారం, లేవనెత్తుతున్న ప్రశ్నలు సంచలనం రేపుతున్నాయి. ఆ న్యాయమూర్తి సోహ్రాబుద్దీన్‌ షేక్‌, కౌసర్‌ బీల బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తూ ఉండడం, ఆ కేసులో అప్పటి గుజరాత్‌ హోం మంత్రి, ప్రస్తుత భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రధాన నిందితుడుగా ఉండడం, ఈ హఠాన్మరణం సంఘ్‌ పరివార్‌ కేంద్ర కార్యాలయపు నాగపూర్‌లో జరగడం, మరణవార్తను, న్యాయమూర్తి సెల్‌ఫోన్‌ను సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలే కుటుంబానికి చేరవేయడం, తర్వాత వచ్చిన న్యాయమూర్తి అమిత్‌ షా మీద కేసు ఎత్తివేయడం, మూడు సంవత్సరాలలో న్యాయమూర్తి మరణంపై కనీస విచారణ జరగకపోవడం వంటి ఎన్నో అంశాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. అటు 2005లో జరిగిన సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలోను, ఇటు 2014లో జరిగిన న్యాయమూర్తి లోయా మృతి విషయంలోను ఎన్నో జవాబు లేని ప్రశ్నలు, అనుమానాలకు ఆస్కారమిచ్చే సందేహాస్పద ప్రవర్తనలు ఉన్నాయి.

న్యాయమూర్తి లోయా మృతి గురించి తెలుసుకోవడానికి ముందు అసలు నేపథ్యమైన సొహ్రాబుద్దీన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ గురించి తెలుసుకోవాలి. అహ్మదాబాద్‌లోని విశాలా సర్కిల్‌ ప్రాంతంలో 2005 నవంబర్‌ 26న సోహ్రాబుద్దీన్‌ షేక్‌ మోటర్‌ సైకిల్‌ మీద వెళ్తూ కనబడ్డాడని, ఆయనను ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా ఆపకుండా దూసుకువెళ్లడమే కాక, పోలీసుల మీద కాల్పులు జరిపాడని, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆయన మరణించాడని పోలీసుల కథనం. ఆయన లష్కర్‌ ఎ తోయెబా సభ్యుడని, పాకిస్తాన్‌ కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటిలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) తరఫున గుజరాత్‌ లోని ఒక అత్యున్నత రాజకీయ నాయకుడిని, బహుశా అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని, చంపడానికి వచ్చాడని పోలీసులు ప్రకటించారు.

ఈ కుట్ర గురించి మొదట రాజస్తాన్‌ పోలీసులకు తెలిసిందని, వారు ఆ అనుమానితుడిని పట్టుకోవడానికి గుజరాత్‌ వచ్చారని గుజరాత్‌ పోలీసులు ప్రకటించారు. గుజరాత్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ పేరుతో చేసిన వందలాది హత్యలలో ఒకటిగా ఈ ఉదంతం కాలగర్భంలో కలిసి పోయి ఉండేది. కాని సోహ్రాబుద్దీన్‌ సోదరుడి నిరంతర ప్రయత్నాలు, కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు, అధికారవర్గంలో కొందరు నిజాయితీగా చేసిన పరిశోధన, సుప్రీం కోర్టు జోక్యం కలిసి ఈ ఎన్‌కౌంటర్‌ తీగలాగితే డొంక కదిలింది. ఈ ఎన్‌కౌంటర్‌ హత్యతో అప్పటి హోం మంత్రి అమిత్‌ షా కు, అరడజను మంది ఐపిఎస్‌ అధికారులకు, పాలరాతి వ్యాపారులకు నేరుగా సంబంధం ఉందని తేలింది.

తన సోదరుడి ఎన్‌కౌంటర్‌ విషయంలో పోలీసులు చెపుతున్న కథనం నమ్మశక్యంగా లేదని, ఆ సమయానికి సోహ్రాబుద్దీన్‌ భార్య కౌసర్‌ బీ కూడ ఆయనతో ఉన్నదని, ఆమెను పోలీసులు ఏమి చేశారో తెలియడం లేదని సోహ్రాబుద్దీన్‌ సోదరుడు రుబాబుద్దీన్‌ షేక్‌ 2005 డిసెంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశాడు. ఆ ఎన్‌కౌంటర్‌నూ, మృతుడి భార్య అదృశ్యాన్నీ విచారించాలని సుప్రీంకోర్టు గుజరాత్‌ పోలీసులను ఆదేశించింది. సరిగ్గా అప్పుడే గుజరాత్‌లో అగ్రశ్రేణి దినపత్రిక విలేఖరి ప్రశాంత్‌ దయాల్‌ కు కొందరు పోలీసు అధికారులకూ జరిగిన మద్యపానపు సంభాషణలలో ఈ ఎన్‌కౌంటర్‌ లోగుట్టు బైటపడింది.

విలేఖరిగా మారకముందు ప్రశాంత్‌ దయాల్‌ స్వయంగా ఆటోరిక్షా నడుపుతూ, ఒక గారేజిలో పనిచేస్తుండేవాడు. మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌ లో పోలీసు అధికారులకు అక్రమ మద్యం సరఫరా చేస్తూ, వారితో సత్సంబంధాలలో ఉండి, లోపలి సమాచారం తెలుసుకుంటుండేవాడు. ఆ తర్వాత విలేఖరిగా మారి, పోలీసు వ్యవస్థలోని లోపలి రహస్య సమాచారం తెలిసిన ప్రముఖుడుగా మారాడు. ఆ వరుసలోనే ఒక విందులో తాగిన మత్తులో కొందరు పోలీసు అధికారులు తాము కొందరు దేశ వ్యతిరేక శక్తులను ఎలా మట్టుబెట్టామో ప్రశాంత్‌ దయాల్‌ కు చెప్పారు. దయాల్‌ పరిశోధనలో ఇద్దరు పురుషులను, ఒక బుర్ఖా ధరించిన స్త్రీని పోలీసులు ఒక ఫార్మ్‌ హౌజ్‌లో నిర్బంధించారని ఆధారంతో పాటు మరెన్నో ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాలతో ఆయన నవంబర్‌ 2006లో, అంటే ఎన్‌కౌంటర్‌ జరిగిన ఏడాదికి ఒక సంచలనాత్మక కథనం ప్రచురించాడు.

సోహ్రాబుద్దీన్‌ షేక్‌ను, కౌసర్‌ బీ ని అరెస్టు చేసి, మొదట సోహ్రాబుద్దీన్‌ షేక్‌ను కాల్చి చంపారని, తర్వాత రెండు రోజులకు కౌసర్‌ బీని చంపారని ఆ కథనంలో ఆధారాలతో సహా రాశాడు. ఈ వార్త రాసినందుకు ప్రశాంత్‌ దయాల్‌ మీద గుజరాత్‌ పోలీసులు 2008లో రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసును న్యాయస్థానం 2013లో కొట్టివేసి ప్రశాంత్‌ దయాల్‌ ను నిర్దోషిగా విడుదల చేసింది.

ఆ వార్త గుజరాత్‌లో కలిగించిన సంచలనాత్మక పరిణామాలలో ప్రభుత్వం గుజరాత్‌ కు చెందిన ఐపిఎస్‌ అధికారులు డి జి వంజారాను, రాజ్‌కుమార్‌ పాండియన్‌ను, రాజస్తాన్‌ ఐపిఎస్‌ అధికారి ఎంఎన్‌ దినేష్‌ కుమార్‌ను ఈ హత్యానేరంలో ముద్దాయిలుగా చూపుతూ అరెస్టు చేయక తప్పలేదు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు నేతృత్వంలో గుజరాత్‌ ఐపిఎస్‌ అధికారి గీతా జోహ్రీ నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌ గురించి పోలీసు నివేదిక అబద్ధమని, తప్పుల తడక అని ఆమె నివేదికలో స్పష్టం చేశారు.

సోహ్రాబుద్దీన్‌ నడుపుతున్నాడని పోలీసులు చెప్పిన మోటర్‌ సైకిల్‌ వాస్తవంగా గుజరాత్‌ తీవ్రవాద వ్యతిరేక పోలీసు బృందంలో ఒక కానిస్టేబుల్‌ సోదరుడిదని కూడ బైటపడింది. అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఎన్‌కౌంటర్‌ జరగలేదని స్వయంగా గుజరాత్‌ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టులో ఒప్పుకోక తప్పలేదు.

సోహ్రాబుద్దీన్‌ షేక్‌, కౌసర్‌ బీ, వారి స్నేహితుడు తులసిరామ్‌ ప్రజాపతితో కలిసి 2005 నవంబర్‌ 22న హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లికి ఒక ప్రైవేటు బస్సులో వెళ్తుండగా దారిలో గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కలిసి అరెస్టు చేశారని రుజువైంది. మొదట పోలీసులు పురుషులు ఇద్దరినే పట్టుకుపోవాలని ప్రయత్నించారనీ, కాని కౌసర్‌ బీ తానూ వారి వెంట ఉంటానని పట్టుపట్టిందనీ తేలింది. అలా ముగ్గురినీ బస్సులోంచి దించి గుజరాత్‌ తీసుకువెళ్లి వేరువేరుగా ఫార్మ్‌ హౌజుల్లో ఉంచారని తేలింది. ప్రజాపతిని రాజస్తాన్‌ పోలీసులకు అప్పగించి, కేసు పెట్టి జైలుకు పంపారు.

సోహ్రాబుద్దీన్‌ను నవంబర్‌ 26న చంపేశారు. కౌసర్‌ బీ మీద అత్యాచారం జరిపి, చంపేసి, నవంబర్‌ 29న మృతదేహాన్ని రహస్యంగా కాల్చేశారు. ఆ మృతదేహం గురించి కూడ బైటపెట్టకుండా అసలు కౌసర్‌ బీ అనే మనిషి ఉండిందనే ఆధారాలనే తుడిచేశారు.

సోహ్రాబుద్దీన్‌ అరెస్టుకు సాక్ష్యంగా ఉన్నదనే కారణంతోనే కౌసర్‌ బీని చంపినప్పుడు, తనను కూడ చంపుతారని భయపడిన ప్రజాపతి రాజస్తాన్‌ జైలులో తోటి ఖైదీలతో, తన న్యాయవాదితో ఆ విషయాలు చెప్పుకున్నాడు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తన అరెస్టు, భయాలు అన్నీ రాసి, తన ప్రాణాలు కాపాడడానికి జోక్యం చేసుకొమ్మని విజ్ఞప్తి చేశాడు. కేసుల పేరు మీద పోలీసులు తనను వేరువేరు ప్రాంతాలకు తీసుకు వెళ్తున్నప్పుడు రక్షణగా అదే రైలులో ప్రయాణించమని తన బంధువులను, కుటుంబ సభ్యులను కోరాడు.

ఇన్ని చేసినా ఆయనను కూడ మరొక బూటకపు ఎన్‌కౌంటర్‌లో గుజరాత్‌ పోలీసులు చంపేశారు. ఆయనను రాజస్తాన్‌ పోలీసులు 2006 డిసెంబర్‌ 26న కోర్టు కేసు కోసం అహ్మదాబాద్‌ తీసుకువచ్చారు. ఆ కేసు అయిపోయాక ఆ రాత్రే తిరిగి ఉదయపూర్‌ వెళ్లే రైలు ఎక్కించారని రికార్డులలో రాశారు. కాని డిసెంబర్‌ 28 తెల్లవారు జామున గుజరాత్‌ - రాజస్తాన్‌ సరిహద్దులలో చాప్రి అనే గ్రామంలో గుజరాత్‌ పోలీసులు ఆయనను కాల్చి చంపారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆయనను ప్రశ్నించడానికి పరిశోధనాధికారి రానున్న సమయంలోనే ఈ హత్య జరిగింది. ఆ అధికారి నిజాయితీతో పరిశోధన సాగిస్తున్నందు వల్ల, ఆయన పరిశోధనను అడ్డుకొమ్మని స్వయంగా హోంమంత్రి అమిత్‌ షా తననూ ఇతర పోలీసు అధికారులనూ తిట్టి, ఈ సంగతి ఇక్కడితో ముగించమని ఆదేశించాడని, ఆ తర్వాతే ప్రజాపతి ఎన్‌కౌంటర్‌ జరిగిందని అందులో పాల్గొన్న పోలీసు అధికారి ఆ తర్వాత సిబిఐ విచారణలో చెప్పాడు.

సుప్రీం కోర్టు 2010లో ఈ కేసు మొత్తం పరిశోధనను సిబిఐకి అప్పగించింది. ఆ విచారణలో సోహ్రాబుద్దీన్‌కు అంతకు ముందు నేరాలతో, హత్యలతో సంబంధం ఉందని, సీనియర్‌ పోలీసు అధికారుల తరఫున వ్యాపారస్తుల నుంచి మామూళ్లు వసూలు చేస్తుండేవాడని బైటపడింది. ఉదయపూర్‌ లోని పాలరాతి వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేయడంలో సోహ్రాబుద్దీన్‌ అతిగా ప్రవర్తించాడని, దానితో అత్యున్నత రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం ఉన్న ఆ వ్యాపారులు సోహ్రాబుద్దీన్‌ను చంపించడానికి పథకం అల్లారని బైటపడింది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు అమిత్‌ షా 331 సార్లు ఈ విషయమై ఫోన్‌ చేశాడని, ఈ కేసులో ఆయనకు మితిమీరిన ఆసక్తి ఉందని సిబిఐ విచారణలో తేలింది. దీనితో మరికొందరు పోలీసు అధికారుల అరెస్టు, హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా అమిత్‌ షా పేరు చేర్చడం జరిగాయి.

ఈ కేసు విచారణ గుజరాత్‌లో జరిగితే అక్కడి రాజకీయ నాయకులు ప్రభావితం చేసే అవకాశం ఉంది గనుక ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలా ముంబై లోని సిబిఐ న్యాయస్థానంలో ఈ విచారణ కొనసాగుతూ వచ్చింది.

సొహ్రాబుద్దీన్‌, కౌసర్‌ బీల బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసును మొదటి నుంచి చివరి వరకూ ఒకే న్యాయమూర్తి విచారించాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా జెటి ఉత్పల్‌ అనే న్యాయమూర్తి దగ్గర ఈ కేసు విచారణ మొదలైంది.

ఈలోగా దేశ రాజకీయ చిత్రపటంలో నరేంద్ర మోడీ, అమిత్‌ షాల స్థానాలు మారాయి. 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాన మంత్రిగా మారాడు. అమిత్‌ షా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యాడు. నేరస్తులని రుజువైన, తీవ్రమైన నేరారోపణలతో విచారణలో ఉన్న గుజరాత్‌ పోలీసు అధికారులందరికీ పునరావాసాలు, పాత పదవులు, పదోన్నతులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కానక్కరలేని మినహాయింపు ఇవ్వాలని అమిత్‌ షా 2014 జూన్‌ 6న ముంబై సిబిఐ కోర్టును కోరగా న్యాయమూర్తి జెటి ఉత్పల్‌ అది సాధ్యం కాదని మందలించారు. అయినా ఆ తర్వాత వాయిదాకు జూన్‌ 20న అమిత్‌ షా గైర్హాజరయ్యాడు. న్యాయమూర్తి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కేసు విచారణను జూన్‌ 26కు వాయిదా వేసి, ఆరోజైనా ముద్దాయి కోర్టుకు రావలసిందేనని ఆదేశించారు.

ఒక్కరోజు ముందు, జూన్‌ 25న ఆ న్యాయమూర్తిని బదిలీ చేశారు. ఒకే న్యాయమూర్తి మొదటి నుంచి చివరివరకూ విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తుంగలో తొక్కి, తమకు వ్యతిరేకంగా ఉన్నాడనుకున్న న్యాయమూర్తిని బదిలీ చేశారు. ఆ స్థానంలో బ్రిజ్‌ మోహన్‌ లోయాను నియమించారు. అయితే లోయా కూడ వారు చెప్పినట్టు వినేవాడు కాదని త్వరలోనే తేలింది.

అక్టోబర్‌ 31న వాయిదాకు అమిత్‌ షా హాజరు కాకపోతే, ఆ రోజు గైర్హాజరుకు మినహాయింపు ఇస్తూనే, నిందితుడు ఆరోజు ముంబై లోనే ఉన్నాడు గదా, కోర్టుకు ఎందుకు రాలేదని న్యాయమూర్తి లోయా తన ఆగ్రహం, అసంతృప్తి ప్రకటించారు. ప్రధాన నిందితుడైన అమిత్‌ షా మీద, నిందితుల న్యాయవాదుల మీద కఠినమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత వాయిదా డిసెంబర్‌ 15కు వేశారు. ఆ తర్వాతి వాయిదా ఇంకా పదిహేను రోజులు ఉందనగా, నవంబర్‌ 30న నాగపూర్‌ లో ఒక సహచర న్యాయమూర్తి కూతురి పెళ్లికి లోయాకు ఆహ్వానం వచ్చింది.

మొదట లోయా ఆ పెళ్లికి వెళ్లాలని అనుకోలేదు గాని ముంబై కోర్టులోని ఇద్దరు సహ న్యాయమూర్తులు బలవంతాన ఆయనను ఒప్పించి నాగపూర్‌ తీసుకువెళ్లారు. పెళ్లి తర్వాత నవంబర్‌ 30 రాత్రి 11 గంటలకు లోయా ముంబైకి ఫోన్‌ చేసి భార్యతో నలబై నిమిషాలకు పైగా మాట్లాడారు. ఆ సమయంలో కూడ ఆయన తనకు నలతగా ఉందని ప్రస్తావించలేదు. తర్వాత మూడు నాలుగు గంటల్లోనే ఆయన ఛాతీ నొప్పి అన్నారని, కొద్ది సేపట్లోనే మరణించారని నమోదయింది.

మొదట దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక హృద్రోగ ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికే మరణం సంభవించిందని 2014 డిసెంబర్‌ 2న పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరణించే సమయానికి ఆయన వయసు 52 సంవత్సరాలు. అప్పటివరకూ గుండెపోటుతో సహా ఏ అనారోగ్యమూ ఉన్నట్టు దాఖలాలు లేవు. అయినా ఇటువంటి ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశం ఉంది గాని ఈ మరణాన్ని ప్రత్యేకంగా చూడడానికి, అనుమానించడానికి చాల అవకాశాలున్నాయి.

లోయా ఛాతీ నొప్పి అన్నారని చెపుతున్నప్పటి నుంచి మరణించిన దాకా జరిగిన పరిణామాలు, ఆ తర్వాతి పరిణామాలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత నవంబర్‌ 20 సంచికలో కారవాన్‌ పత్రిక ఒక సుదీర్ఘ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలోనూ, తర్వాత జరిగిన పరిణామాలలోనూ ఎన్నో జవాబు లేని ప్రశ్నలు, సాక్ష్యాధారాల తారుమారు జరిగిన ఉదాహరణలు బైటపడుతున్నాయి.

ఆయన న్యాయమూర్తి అయినప్పటికీ, ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్నప్పటికీ ఆయనను సమీపంలోని ఆస్పత్రికి కారులో కాకుండా ఆటోలో తీసుకువెళ్లారనే ప్రశ్న ఉంది. ఆ అతిథి గృహంలో ఆరోజటికి సంబంధించిన రికార్డులను తారుమారు చేశారని, ఆరోజు అక్కడే మరొక గదిలో ఉన్న దళిత నాయకుడొకరు సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఆయన ఆ గదిలో చేరిన తేదీ ఆ రోజే (2014 నవంబర్‌ 30) గా ఉండగా, గది ఖాళీ చేసిన తేదీ 2017 గా దిద్దారు. అంటే మొత్తంగా రికార్డును దిద్దడం జరిగి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

లోయా మరణించారని ఉదయం 5 గంటలకే కుటుంబ సభ్యులకు చెప్పారుగాని, ఆస్పత్రి రికార్డులలో 6.30 కు మరణించినట్టుగా నమోదు చేసి ఉంది. ఆ మరణం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేసిన వ్యక్తి కుటుంబంతో ఏ సంబంధమూ లేని, లాతూరుకు చెందిన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. అది సహజ మరణమే అయినప్పటికీ పోస్ట్‌ మార్టం అవసరం లేనప్పటికీ పోస్ట్‌ మార్టం చేశారు. పోస్ట్‌ మార్టం నివేదిక మీద కుటుంబానికి ఏమీ సంబంధం లేని ఎవరో వ్యక్తి ʹʹజ్ఞాతి సోదరుడుʹʹ అని సంతకం చేశాడు. కుటుంబ సభ్యులు నాగపూర్‌ వస్తామంటే అవసరం లేదని చెప్పారు. మృతదేహాన్ని ఎవరూ తోడు లేకుండా లాతూరు దగ్గరి స్వగ్రామానికి పంపించారు. చొక్కా మీద నెత్తుటి మరకలు చూసిన కుటుంబ సభ్యులు రెండో పోస్ట్‌మార్టం కోరితే ఇప్పుడెందుకు అని నిరుత్సాహపరిచి, హడావిడిగా అంత్యక్రియలు జరిపించారు.

మరణవార్త చెప్పిన ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తే మూడు రోజుల తర్వాత లోయా మొబైల్‌ ఫోన్‌ తెచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ ఫోన్‌లో డాటా అంతా చెరిపేయబడి ఉంది. ఆయనను బలవంతపెట్టి నాగపూర్‌కు తీసుకువెళ్లిన సహన్యాయమూర్తులు మృతదేహంతోనూ రాలేదు, అంత్యక్రియలకూ రాలేదు.కేసులో అమిత్‌ షా కు అనుకూలంగా తీర్పు ఇస్తే వంద కోట్ల రూపాయలు ఇప్పిస్తానని ఒక సహన్యాయమూర్తి తనతో అన్నారని లోయా తమకు చెప్పారని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. ఆ డబ్బు ఇవ్వజూపిన సహన్యాయమూర్తి ఆ తర్వాత ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడ అయ్యారు.

ఈ అనుమానాలన్నిటికి తోడు, లోయా మృతి తర్వాత నియమితులైన కొత్త న్యాయమూర్తి ఎంబి గోసావి అసలు మొత్తంగా కేసులోంచి అమిత్‌ షాను నిందితుడిగా తప్పించారు. అమిత్‌ షా మీద నేరారోపణకు ఆధారాలేమీ లేవని, సిబిఐ కేవలం రాజకీయ కారణాలతో ఆ ఆరోపణలు చేసిందని అన్నారు. ప్రధాన నిందితుడైన అమిత్‌ షా ను మాత్రమే కాదు, మరెంతో మంది కీలకమైన రాజకీయ నాయకులను, పోలీసు అధికారులను కూడ ఈ కొత్త న్యాయమూర్తి కేసు నుంచి తప్పించారు.

మామూలుగా ఏ నేరంలోనైనా, నిస్సందేహమైన సాక్ష్యాధారాలు లేకున్నా, పరిస్థితుల సాక్ష్యాధారాలు, నేరం వల్ల ప్రయోజనం పొందిన సందర్భం ఉంటే ఆరోపణ రుజువైనట్టే భావిస్తారు. సోహ్రాబుద్దీన్‌ హత్య కేసులోనూ, న్యాయమూర్తి లోయా అనుమానాస్పద మృతి కేసులోనూ పరిస్థితుల సాక్ష్యాధారాలు హంతకుడెవరో, హత్యల వల్ల లాభపడినదెవరో సూటిగా చూపుడువేలు ఒకే వ్యక్తి వైపు చూపుతున్నది. ఆ వ్యక్తి ఇవాళ పాలకపార్టీ అధ్యక్షుడిగా, అత్యున్నతాధికారంలో ఉన్నవారి సహచరుడుగా ఉన్నాడు. హంతకులే రాజ్యాధినేతలవుతున్న, హత్యల సాక్ష్యాధారాలను తుడిచేస్తున్న ఈ దేశం ఏమవుతున్నదో, ఏమి కాబోతున్నదో ఇప్పటికైనా ఆలోచించకపోతే ఆలోచనాపరులు అనే మాటకు అర్థం లేదు.
-జీ.లింగమూర్తి
(రచయిత పాత్రికేయులు)

Keywords : judge, loya, rss, amit shah, bjp, modi
(2018-04-21 05:41:33)No. of visitors : 818

Suggested Posts


తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !

యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు....

ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?

ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్ బంద్ లో జరిగిన సంఘటనలపై కూడా చెడ్డీ గ్యాంగ్ ఫేక్ న్యూస్ ప్రచారం మొదలు పెట్టింది. ఓ పోలీసును దళితులు కొట్టి చంపారని చెబుతూ దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై విషం చిమ్ముతూ ప్రచారం మొదలుపెట్టారు.

51 University VCs Attend RSS Workshop on Making Education More Indian

Over 721 academicians and experts including 51 Vice Chancellors of various central and state universities attended a two-day workshop organised by the RSS over the weekend hosted in the national capital....

Search Engine

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు
మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌
క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations
ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు
“It’s The State That’s Violating the Constitution, Not Us”
Women in People’s War: Past, Present and Future
Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !
బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !
ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !
యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్
ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !
SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్
పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)
పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ‌
ఇంట‌ర్మీడియెట్ బోర్డును ముట్ట‌డించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల‌ అరెస్టు
Ban Sri Chaitanya & Narayana Corporate Colleges
more..


ఆ