జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌


జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైలు

బయట సమాజంలో ఎవరినైనా పరిచయం చేసుకోడానికి ముందు పేరు అడుగుతారు. జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.
ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్ చేస్తున్నవేʹ అంది.
అప్పుడే అక్కడికి వచ్చిన ఫూల్ ముని మాత్రం నిజంగానే నాకు తెలియదు అని నమ్మింది. కారణం బహుశా ఆమె ఆదివాసీ కావడం అని నా అభిప్రాయం. వాళ్ళు అమాయకంగా అనిపిస్తుంటారు మనలాంటి అతి తెలివి వాళ్ళకి. కానీ ఎవరికైనా ఏదన్నా తెలియదు అనుకొంటే మన లాగా ప్రతి దానికీ ఆశ్చర్యపోకుండా మామూలుగా విషయాన్ని వివరిస్తుంటారు.
అందుకే ఫూల్ ముని వెంటనే అందుకొని, ʹఇప్పుడు చార్ సౌ బీస్ ఉందనుకో. వాళ్ళు చీటింగ్ కేసు అన్న మాట. చీటింగ్ అంటే తెలుసా. ధోఖా ఇవ్వడం అన్నమాట. తీన్ సౌ దో అనుకో మర్డర్ కేసు. అలాగే మనం పార్టీ కేసు కదా, అంటే సత్రా. సి ఎల్ అన్న మాట.ʹ అంది.
సునీత కలగజేసుకొని, ʹచీటింగ్ అంటే దీదీ కి తెలవదా? దీదీ కి అంగ్రేజీ కూడా నేర్పిస్తున్నావేʹ అని గట్టిగా నవ్వింది. ఫూల్ ముని తెగ ఆశ్చర్యపోయింది. ʹఅది హింది పదం కదా!ʹ అన్నది.
అంతే కాదు ఆమె చాలా విరివిగా ఏవో ఒక ఇంగ్లీష్ పదాలు వాడేస్తూ వుండేది. అది హింది అనే భ్రమలోనే. ఆమె మాతృభాష ముండారీ. తరవాత కాలంలో అది 17 సి. ఎల్. ఏ (క్రిమినల్ అమెండ్మెంట్ ఆక్ట్) అని తెలుసుకొన్నాను. ఝార్ఖండ్ లో మావోయిస్టు బందీలని దాని కిందనే బుక్ చేస్తారు. ఇంతకీ మనం అని మాట వరసకు అందా? అని అనుమానం వచ్చి, తన కేసు వివరాలు అడిగాను.
ʹనేను కూడా అదే కేసు దీదీ.ʹ
పక్కనే వున్న సరిత నవ్వి ʹఏం కాదు దీదీ బకిరి కేసుʹ అంది.
ఫుల్ ముని, ముఖం ఎర్రగా చేసుకుని, తరవాత గలా గలా నవ్వేసింది. నాకు అయోమయంగా అనిపించింది ʹబకిరీ కేసేంటి?ʹ అని అడిగా.
ʹఈ సరిత అట్లే నన్ను ఏడిపిస్తుంటది. కొత్తలో నేను అట్లే చెప్తుంటి, బకిరి కేసు అని. ఎవ్వరికీ అర్థం కాకపోతుండే. నాకు మాత్రం ఏం తెలుసు. అడవిలో మేకలు (బకిరి) మేపుకొంటుంటే తెచ్చారు. ఇంక అదే కేసు అనుకొన్నా. చాలా రోజులవరకు అసలు ఏం కేసోనాకు తెలీదు. కోర్టుకి పోయి వచ్చేటప్పుడు అక్కడ ఒకరోజు బడాబాబు నువ్వు సత్రా సి.ఎల్ అంట కదా అన్నాడు. అంటే ఏంది? అని అడిగితే. ఎంసీసీ నా అన్నాడు. కాదు సార్ బకిరీ కేసు అన్నా. ఆళ్ళందరూ ఒకటే నవ్విన్రు. ఇల్లెక్కడా అని అడిగితే, చెప్పా. అదా సంగతి అన్నారు.ʹ
నాకేం అర్థం కాలేదు. ʹఇంతకీ ఎక్కడా మీ ఇల్లు?
ʹజంగల్ల (అడవి) వుంటది. గింతప్పట్నించీ పిల్లలం అడివిలోనే పుల్లలేరుకోనికి, ఎండా కాలం అయితే మహువా(విప్పపూలు) ఏరడానికి పోతాము. మేకలు, బర్రెలు గానీ వుంటే తోల్క పోతాము. నేను ఒక దినం మేకలు తోల్కపోయాను. కూంబింగ్ పోలీసులు వొచ్చిన్రు. ఆయనతో పాటు మా ఊరు పిలగాడు కూడా వచ్చిండు. పోలీసులు నన్ను అటకాయించి, ఈమె ఎర్కేనా అంటే ఆ పిలగాడు. హా! ఎర్కనే అన్నాడు. నేను గూడా హా మా ఊరే అన్నా. అంతే! థానా కి పద! అనిరి. ʹతోర గోడ్ లాగేంగే! సారుʹ (నీ కాల్మొక్త సారూ) అన్న. అరె పారేశాన్ గాకు. గంటలో ఇడుస్తం కదా అని తీస్కపోయిరి. సార్ నా మేకలు తోలిచ్చి వస్తా సార్ అంటే ఎంతకీ ఇనక పోయే. ఒకడయితే బూతులు తిట్టే. కసమ్ సే దీదీ, మా మయ్య, బావుజీ కూడా నన్ను ఎప్పుడు తిట్టలే. నా కాళ్ళు వణుకబట్టే భయానికి. కానీ అంత చెడ్డ మాటలంటే మస్తు కోపం వచ్చే. ఇంక సప్పుడు చేయకుండా ఎంట పోయినా. రాత్రంతా థానా లో కూర్చుండ బెట్టిన్రు. ఉదయం బడా బాబు(ఎస్. ఐ) వచ్చిండు. మళ్ళా మళ్ళా గవ్వే ప్రశ్నలేసిన్రు. సాయంత్రానికి గాడి ఎక్కించి జైలుకి తీస్కని వచ్చిన్రు.ʹ
ʹఇంట్లో వాళ్ళు ఎవ్వరూ రాలేదా?ʹ ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.
ʹమా నాయన చనిపోయిండు. మా అమ్మ పిచ్చిది. వున్నట్టుండి ఎక్కడెక్కడికో ఎళ్లిపోతది. ఇంట్ల వుంటే నేనే అన్నం తినిపించుడు, స్నానం చేపిచ్ఛుడు, అంతా నేనే. ఒక అన్న, ఒక తమ్ముడు. ఇద్దరూ రోజు కూలీ చేస్తారు. ఇక్కడికి రావాలంటే మయ్యా ని ఒకరు చూసుకోవాలి, కమాయికి (సంపాదనకి) ఒకరు పోవాలి. నా మేకలు ఇంటికి పోయినయ్యో లేదో. ఇప్పుడు వాటినెవ్వరు మేపాలే?ʹ తలుచుకొన్న కొద్దీ ఆమెకు దుఖం పొంగుతోంది. ఏకధాటిగా కారుతున్న కన్నీళ్ళు తుడుచుకొనే ప్రయత్నం కూడా చేయకుండా కూర్చుంది.
ʹఎంత కాలం అయ్యింది?ʹ మెల్లగా అడిగాను. అవన్నీ చెప్పుకొంటేనే ఊరట.
ʹమూడున్నరేళ్ళు. 2006 ఏప్రిల్ లో అరెస్టు అయ్యా అంది. ఆమె అందరిలా చైత్ (చైత్రం) లోనో అఘన్ (మాఘం) లోనో వచ్చానని చెప్పకుండా ఇంగ్లీషు నెలలు చెప్పడం గమనించాను. అందుకే ʹనువ్వు చదువుకొన్నావా?ʹ అని అడిగాను.
ʹచదవను, రాయను అన్నీ వస్తయ్. కానీ, ఇస్కూల్ కి పోలేʹ అన్నది. చెట్టు కింద స్కూల్ కి ఫూల్ ముని కూడా వచ్చేది. అందరికన్నా వేగంగా రాసేది. ఆమె అక్షరాలు ప్రింట్ లాగా అందంగా వుండేవి. రోజూ వార్తాపత్రిక దగ్గరపెట్టుకొని దానిలో చూస్తూ చూచిరాత రాసేది. నన్ను కూడా అలా చెయ్యమని సలహా చెప్పింది.
ఏదైనా చాలా వేగంగా నేర్చుకొనేది. అవన్నీ జైలు స్కూల్లోనే నేర్చుకొన్నదట. ఎవరైనా చదువుకొన్నవాళ్ళు వచ్చినప్పుడు స్కూల్ నడుస్తుంది. పుస్తకాలు కూడా వున్నాయి. చివరికి ఆమె పట్టుదల వల్లే నేను కూడా మరో నలుగురు అమ్మాయిలతో కలిసి 5వ తరగతి పుస్తకాలు చదువుతూ హింది నేర్చుకొన్నాను.
ఒకరోజు నాకు పోస్టులో ఉత్తరం వచ్చింది. అదొక పెద్ద సంచలనాన్నే సృష్టించిందని చెప్పచ్చు. ఇప్పటివరకు మహిళా వార్డులో ఎవ్వరికీ పోస్టులో ఉత్తరం రాలేదట. ఆశ్చర్యం లేదు. ఉన్న వాళ్ళు చాలా మట్టుకు పేద, కింది మధ్యతరగతి ప్రజలు. వాళ్ళలో చదువుకొన్నవాళ్ళు ఇద్దరో ముగ్గురో. వాళ్ళు దగ్గర ఊరివాళ్లయితే ఇక కలవడానికి వస్తారు తప్ప ఉత్తరాలు రాసుకొనే అవసరం ఉండదు. అయితే ఈ ఉత్తర ఘట్టం ఫూల్ ముని కి ఒక కొత్త ఆలోచన ఇచ్చింది. తన ఇంటికి ఉత్తరం రాయాలనే ఆలోచనే అది. అప్పటివరకూ జైలు వాళ్ళే ప్రభుత్వ ఖర్చుతో ఉత్తరాలు పంపుతారనే విషయం ఎవరికి తెలియదు. ఇక ఫూల్ మునికి కొత్త ఆశలు కలిగాయి. వాళ్ళ అన్నకు ఉత్తరం రాసాము. జైలు కి ఎలా రావాలి? బయట గేటు దగ్గర ఏమి నిబంధనలుంటాయి? గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి, వగైరా అన్నీ విషయాలతోనూ ఉత్తరం రాసాము. ముఖ్యంగా భయపడొద్దు, నిన్ను అరెస్టు చెయ్యరు అనేది మూడు సార్లు రాసింది. ఇక ప్రతిరోజూ ఒక్క సారైనా వచ్చి ఆ ఉత్తరం అందడానికి ఎంత టైమ్ పట్టచ్చు, దారిఖర్చులు పోగేసుకోడానికి ఎంత టైమ్ పట్టొచ్చు, అనే లెక్కలు వేసుకొంటు కూర్చునేది. ఆశలు మెల్లగా అనుమానంలోకి, క్రమంగా ఆందోళనలోకి మారి చివరికి నిరాశగా అంతమయ్యాయి. రెండు మూడు నెలలు గడిచినా ఎవ్వరూ రాలేదు. తనని నిరాశలోనుండి బయటకు తీసుకురావడం నా తక్షణ కర్తవ్యంగా పరిణమించింది.
జైలు లో చాలా మంది మహిళలు అల్లిక పని చేస్తుంటారు. కాబట్టి తనని కూడా నేర్చుకొమ్మని ప్రోత్సహించాను. అయితే దానికి కావల్సిన సామగ్రి కొనడానికి ఆమె దగ్గర డబ్బు లేదు. ఏం చెయ్యాలి? ఉదయం పూట నాస్థా కోసం నానబెట్టిన శనగలు ఇస్తారు. నేను అవి తినలేను. కాబట్టి ఉదయం పూట ఒకేసారి 10 గంటలకి నేరుగా అన్నమే తినేదాన్ని. కాబట్టి నా వంతు శనగలు కూడా తనకే ఇచ్చేదాన్ని. అలాగే వంటికి తలకి పూసుకోడానికిచ్చే నూనెలు. ఇవన్నీ అమ్ముకొని డబ్బులు పోగు చెయ్యాలనుకొన్నాము. చాలా చవకగా దొరుకుతాయి కాబట్టి కొందరు బందీలు వాటిని కొని ఇళ్లకు పంపుతూ వుంటారు. అలా కొంత సేకరించి ఊలు అల్లే కాంటాలు తెప్పించాం. మొత్తానికి చాలా తొందరగానే తను నేర్చుకొన్నది. అక్కడ చాలా మంది స్వెటర్లు, ద్వారాలకు వేసే పట్టీలు, కర్టెన్లు, శాలువాలు వంటివి డబ్బులు ఇచ్చి అల్లించుకొంటారు. బయట చాలా ఎక్కువ వుంటుంది కాబట్టి, జమ్మేదారిణీలు కానీ, సిపాయిలు కానీ ఖైదీలతో అల్లించుకొంటారు. బయట 250-300 ఇచ్చే వాటికి ఇక్కడ 150-200 ఇస్తారు. చాలా శ్రమ వుంటుంది. ఇక ఫూల్ ముని పగలు రాత్రీ అల్లిక పని చెయ్యడం మొదలయ్యి తొందరలోనే ఆర్డర్లు తీసుకొనే స్థాయికి ఎదిగింది. ఖైదీలు తమ దగ్గర డబ్బు ఉంచుకోకూడదు. వంద రూపాయల వరకు మాత్రమే అనుమతిస్తారు. కాబట్టి వాటిని రహస్యంగా దాచిపెట్టి వుంచుకోవాల్సి వచ్చేది. అయితే ఇలా సంపాదన మొదలయ్యాక మరో కొత్త ఆలోచన వచ్చింది. అది, ఆమెకు బెయిల్ కోసం వెయ్యాలని. ఆలోచన వచ్చిన వెంటనే తన దగ్గరికి పరిగెత్తాను. తనకి చెప్పగానే ఎగిరి గంతేసింది. కానీ, మరి బెయిల్ వచ్చాకా స్యూరిటీలు ఇచ్చే దెవరు? ఇంటి నుండి ఎవరన్నా రావాలి కదా? మళ్ళీ నీరసం. సరే అంత వరకూ వచ్చాక చూద్దాంలే అన్నాను. కానీ తాను ఒప్పుకోలేదు. తీరా అంతా అయ్యి అక్కడ ఆగి పోతే ఇంత కష్టం గంగలో కలిసినట్టేగా అంది.
ఒకరోజు ఆమెకు ములాకాతీ వచ్చింది. ఆమెకు ఎంతకీ నమ్మకం కలగలేదు. ఆమె వచ్చేవరకు దాదాపు ఒక పెద్ద గుంపు గేటు దగ్గరే తయ్యారయ్యి ఆమె తెచ్చే ఖబురు కోసం ఎదురు చూడ్డం మొదలు పెట్టారు. అవునుమరి, జైల్లో పడ్డ నాలుగున్నరేళ్ల తరవాత మొదటిసారి, ఇంటినుండి ఎవరన్నా రావడం! వస్తూనే ఫూల్ ముని అందరి మధ్యా కూలబడి బిగ్గరగా ఏడ్చింది. అందరూ ఆమెని తలా ఒక మాట అని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ అంతకన్నా ఎక్కువమంది తమ తమ కుటుంబాలను తలుచుకొని ఏడ్చారు. చివరికి గట్టిగా కోప్పడి ఫూల్ ముని కి మంచినీళ్ళు తాగించి అసలు విషయం కనుక్కొన్నాను. ఫూల్ మునికి వకీలుని పెట్టాలని దానికయ్యే ఖర్చుకోసం అన్నదమ్ములిద్దరూ సంపాదించాలని అనుకోని ఇద్దరూ పనికి పోవడం మొదలుపెట్టారట. దాంతో అమ్మని ఇంటి దగ్గర ఒక్కదాన్నే వదిలిపెట్టవలిసి వచ్చింది. ఒక రోజు అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. మతిస్థిమితం లేని ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదట. కొంత డబ్బు కూడబెట్టాక ఎలా వెళ్ళాలో తెలియక పరేశాన్ అవుతుంటే ఫూల్ ముని రాసిన ఉత్తరం వచ్చిందట. ఇక బయలుదేరుదామనుకొంటుండగా తమ్ముడికి విపరీతంగా జ్వరం వచ్చిందట. బాగు చేసుకోడానికి డబ్బంతా ఖర్చుపెట్టారు కానీ, అతని కాళ్ళు చచ్చుపడిపోయాయట. ఇక అన్న ఒక్కడే మళ్ళీ సంపాదించి వచ్చేవరకు అంతకాలం గడిచింది. ధైర్యంగా వుండమని ఎలాగైనా బయటకు తీస్తానని చెప్పి వెళ్ళాడట.
ఉత్తరాలు అందుతున్నాయని తెలిసింది కనక. వెంటనే మరొక ఉత్తరం రాయాలని అనుకొన్నం. తాను వకీలుని పెట్టాల్సిన పని లేదని, కేవలం బెయిల్దార్లను చూడమని ఆ వివరాలు రాసి పోస్ట్ చేశాం. ఏమీ తెలియని వాళ్ళ దగ్గర అనేకమంది లాయర్లు జలగల్లాగా డబ్బు వసూలుచేయడం గురించి అప్పటికి నేను చాలా విన్నాను. కాబట్టి తెలిసిన వకీలుకే చెప్పి ఫూల్ ముని పోగేసిన వెయ్యి రూపాయలుకే కేసు వాదించేటట్టు బెయిల్ వచ్చాక మిగతా 500 ఇచ్చేటట్టు మాట్లాడాము. అంతేకాక ఆ ఊరి సర్పంచ్ నెంబరు సంపాదించి బెయిల్ రాగానే వాళ్ళకు వకీలు సమాచారం ఇచ్చే ఏర్పాటు కూడా చేశాము. చివరికి దాదాపు ఐదు యేళ్ళ తరవాత బెయిల్ పై విడుదలయ్యి ఫూల్ ముని ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఫూల్ మునిని తలుచుకొన్నప్పుడల్లా ఆమె మేకలు ఇంటికి పోయినయ్యో లేదో అనుకొంటాను. ***

Keywords : jharkhand, jail, maoist, bjp, rss, anuradha
(2018-02-23 09:40:36)No. of visitors : 265

Suggested Posts


జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి....

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
more..


జైలు