జైలు కథలు...బలి -బి.అనూరాధ


జైలు కథలు...బలి -బి.అనూరాధ

జైలు
ʹఏయ్! రియాజ్! పిలుస్తుంటే ఆ పొగరెంటీ? పెద్ద సల్మాన్ ఖాన్ అనుకొంటున్నావా?ʹ
ʹ మరి నువ్వు బుగ్గ మీద సొట్ట పడుతుంది కదా అని దీపిక అనుకొంటున్నావా?ʹ
ʹమీ ఆవిడ ఇంక రాదా? పుట్టింటికి వెళ్లిపోయిందటగా? ఇంకా ఎంతకాలం చూస్తావ్? నన్ను పెళ్ళి చేసుకోగూడదు?ʹ
ʹపిల్లా? పెళ్ళి కావాలా! ఆశ. తప్పుకో అసలే ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి. బోలెడు పని ఉంది. నీ వేళాకోళాలు చాలించు.ʹ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి పరిగెత్తాడు రియాజ్. నిరాశగా చూసి తిట్టుకొంటూ తమ వాటా లోకి నడిచింది నీరజ.
రియాజ్ నీరజ ఇంటి పక్కనే అద్దెకుంటాడు. నీరజకు అతనంటే ఇష్టం. ʹఅందంగా ఉంటాడని పెద్ద గర్వం!ʹ అని కోపంగా అనుకొంది మనసులో. అతని కోసం రోజూ మంచిగా తయారయ్యి ఎదురుచూస్తూ ఉంటుంది. అతనేమో అస్సలు పట్టించుకోనే పట్టించుకోడు. గుమ్మంలో ఎక్కువ సేపు నిలబడితే అమ్మ కోప్పడుతుంది.
ʹఆ తురకోడితో ఏంటే నీ ముచ్చట్లూ? అసలే వాడి పెళ్ళాం వదిలేసిపోయింది. మళ్ళీ వాడితో మాట్లాడావంటే చూడు కాళ్ళిరగ్గొడతా.ʹ కూతుర్ని కోప్పడి ఆకోపం అంతా బరబరా అంట్లు తోమడమ్మీద చూపించింది నీరజ తల్లి. రియాజ్‌కి పెళ్ళయిందని నీరజకీ తెలుసు. కానీ చాలా కాలంగా అతని భార్య పుట్టింటి నుండి రాలేదు. ఒకవేళ విడిపోయారేమో. అతను చాలా మంచివాడు. విడిపోతే తనని చేసుకొంటే తప్పేముంది అనుకొంటోంది నీరజ. కానీ అతనెప్పుడూ ఆమెతో సరదాగా మాట్లాడడం తప్ప విషయం అంతకన్నా పొడిగించడం లేదు.
*** *** ***
ʹఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి. పల్సగూడ నియోజకవర్గం టికెట్ మనవాడికి ఇప్పించాలి. ఈసారి అక్కడ మన కాషాయజెండా ఎగరాలి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ మీదే అనుకోండి. నేనంతా చూసుకొంటాను.ʹ
ʹఅరె ఎంత మాట! కానీ ఒక చిన్న సమస్య. అక్కడ మన ప్రత్యర్థి ఒకడున్నాడు. వాడిని అడ్డం తొలగించకపోతే అక్కడ గెలవడం కష్టం.ʹ
ʹఅంటే ఫినిష్ చెయ్యించాలా?ʹ
ʹఆబ్బెబ్బే! అంత అవసరం లేదు. వాడో బచ్చాగాడు. జస్ట్ చిన్న పిచ్చిక. వాడి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? ఎన్నికల గురించి వాడు మర్చిపోవాలంతే. కొంచెం జాగ్రత్త. మన చేతికి మట్టి అంటకూడదు. పైగా అతను మైనారిటీ. అందులోనూ యూత్ అసోసియేషన్. టికెట్ సంగతి నేను చూసుకొంటాను. వాడి సంగతి మీరు చూసుకోవాలి.ʹ
ʹఒకే! పని అయిపోయిందనుకోండి.ʹ
*** *** ***
ʹఆపా (అక్కా) అబ్బాజాన్‌ని (నాన్నని) పోలీసులు తీసుకెళ్ళారు. తొందరగా రా.ʹ ఏడుపుగొంతుతో అరిచాడు చోటూ! మిషన్ మీద ఏకాగ్రతతో ఎంబ్రోయిడరీ చేస్తున్న హసీనా గుండెలు భయంతో వేగంగా కొట్టుకొన్నాయి. తెల్లని ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. ఎక్కడివక్కడ పడేసి షాపు మూసేసి తాళం వేసి పరిగెత్తినట్టే పోయి ఇంట్లో పడ్డది. అమ్మిజాన్ గుండెలు బాదుకొంటూ ఏడుస్తోంది. వెళ్ళి తల్లిని గట్టిగా వాటేసుకొని భోరుమని ఏడ్చింది హసీనా. వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చినట్టు చటుక్కున లేచి, తల్లిని భుజాలు పట్టి కుదుపుతూ ʹఅసలు ఏం జరిగిందమ్మా?ʹ అన్నది.
ʹనాకేమీ అర్థం కావటంలేదమ్మా. పోలీసులు వచ్చి రియాజ్ ఎక్కడ అన్నారు. అతను ఇల్లొదిలి ఎప్పుడో వెళ్ళిపోయాడు. మాకు, అతనికి ఏమీ సంబంధం లేదు అని మీ అబ్బా చెప్తునే వున్నారు. అయితే నువ్వే పదా! అని తీసుకుపోయారు.ʹ చెంగుతో కళ్ళు, ముక్కు తుడుచుకొంటూ వెక్కిళ్ళ మధ్య చెప్పింది ఆమె.
హసీనా చటుక్కొన లేచి నిలబడి, గబగబా పర్సులో ఇన్ని డబ్బులు పడేసుకోని ʹనేనిప్పుడే స్టేషన్‌కు పోయి కనుక్కొని వస్తానాగు.ʹ అంటూ బయలుదేరింది. ʹవద్దమ్మా. ఆడపిల్లవి. ఒక్క దానివీ స్టేషన్‌కి పోవద్దు. పరువుగల ఇంటి ఆడపిల్లలు అలా పోలీసు స్టేషన్లకి పోకూడదమ్మా!ʹ అంటూ ప్రాధేయపడింది.
ʹఅమ్మా! ఇంకా యే కాలంలో వున్నావు నువ్వు. ఇప్పుడు స్టేషన్లలో ఆడ పోలీసులు కూడా వుంటారు. నాకేం భయం. అయినా అన్యాయంగా అలా తీసుకుపోతే నోరుమూసుకు కూర్చుంటామా? కనీసం నోరిప్పి అడగక పోతే ఎట్లా? నన్ను ఏం.ఏ. దాకా చదివించింది ఇందుకేనా? ఇప్పుడే వస్తా. నువ్వేం ఖంగారు పడకు.ʹ
తల్లికి నచ్చ చెప్పి బయటకు వచ్చి రిక్షా ఎక్కింది హసీనా. స్టేషన్‌లో ఎస్. ఐ. వున్నాడు. పక్కనే లాకప్లో తండ్రిని చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి హసీనాకి. బలవంతంగా నిగ్రహించుకొని, విషయం ఏమిటని అడిగింది.ఎస్.ఐ ని.
ʹ మీ అన్న ఏడి?ʹ
ʹమా అన్న ఎక్కడున్నాడో మాకు తెలియదు. అతను మాఇంట్లో వుండడు. మానాన్నను ఎందుకు తీసుకువచ్చారో ముందు చెప్పండి.ʹ
ʹమీ అన్న ఒకమ్మాయిని ఎత్తుకొచ్చి రేప్ చేశాడు.ʹ
నోట మాట రాలేదు హసీనాకి. ʹఅబద్ధం. మా అన్న అలాంటివాడు కాదు. ఇది తప్పుడు ఆరోపణ.ʹ
ʹమీ అన్నయ్య అంత మంచోడయితే మరి మీరు ఇంట్లోంచి ఎందుకు వెళ్లగొట్టారు?ʹ చేతిలో లాఠీని విలాసంగా తిప్పుతూ తాపీగా కుర్చీలో వెనక్కి వాలి ప్రశ్నించాడు ఎస్.ఐ.
ʹదానికీ దీనికీ సంబంధం లేదు. అది మా కుటుంబ విషయం.ʹ బింకంగా అంది హసీనా.
ʹఅదే మరి. నీ నోటితో నువ్వు చెప్పలేని తప్పుడు పని చేశాడనే కదా?ʹ వెటకారంగా నవ్వుతూ అన్నాడు.
హసీనా మొహం అవమానంతో ఎర్రగా కందిపోయింది. ʹఅతనేం తప్పుడు పని చేయలేదు. మా నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకొన్నాడు. మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటే తన మానాన తను బతుకుతున్నాడు.ʹ
ʹబేటీ నువ్వు ఇంటికెళ్ళు. అతనికి జవాబులు చెప్పాల్సిన పని లేదు.ʹ లాకప్ లోనుండి అరిచాడు ఆమె తండ్రి.
ʹరేయ్! చుప్ బే సాలాʹ కసిరాడు ఎస్.ఐ.
హసీనాకి కోపంతో శరీరం వణికింది. సన్నగా పొడుగ్గా, ఎర్రపడిన ముఖంతో, నుదుటి మీద మాటిమాటికి పడిపోతున్న జుట్టును ఎగదోసుకొంటు చిగురుటాకులా కంపించిపోతున్న ఆ అందమైన హసీనాని చూస్తుంటే ఎస్.ఐ కి పండగలాగానూ, వినోదంగానూ వుంది. చాలా హుషారుగా కూడా ఉంది.
ʹమా అన్న మీద కేసైతే, మా నాన్నని ఎందుకు తీసుకు వచ్చారు? మీకు చాతనయితే పోయి మా అన్నని అరెస్టు చేయండి. మా నాన్నని ఏ సెక్షన్ కింద ఏ నేరం కింద అరెస్టు చేశారో చెప్పాలి. మీరు బెదిరిస్తే బెదిరిపోతా మనుకొంటున్నారా? చూస్తాను ఎలా వదలరో? డి.ఎస్.పి. దాకా పోతాను. లేదా సరాసరి జడ్జి దాకా పోతాను. ఇదుగో నేను చెప్తున్నా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యచ్చనుకోకు. నాకూ చట్టం తెలుసు.ʹ కోపంతో ముక్కుపుటాలదిరిపోతుండగా గర్జించినట్టే అన్నది హసీనా. ఆ తరవాత గిరుక్కున వెనుదిరిగి వచ్చేసింది.
ఎస్.ఐ. క్రూరమైన నవ్వు నవ్వాడు. నాకన్నా చట్టం ఎక్కువ తెలుసా బేవకూఫ్ లడ్‌కీ, పట్టుమని ఇరవై యేళ్ళు లేవు నన్నే సవాల్ చేస్తుందా? అన్న సంగతే కాదు చెల్లి సంగతి కూడా చూడాల్సిందే అనుకొన్నాడు.
*** *** ***
డిఎస్.పి ఖాన్ కి సెల్యూట్ కొట్టి ʹసార్ ఆ రియాజ్ ని అరెస్ట్ చేశాం. పంపించెయ్యమంటారా?ʹ అన్నాడు ఎస్‌ఐ.
డి.ఎస్.పి ఒక్క క్షణం ఆలోచించి ʹఇక్కడికి తీసుకురా.ʹ అన్నాడు. మళ్ళీ ఒక సెల్యూట్ కొట్టి అతను వెళ్లిపోయాడు.
ఫోన్ మోగింది. అవతల ఎస్.పి గొంతు వినబడగానే డి‌ఎస్‌పి ఖాన్ స్టిఫ్‌గా సర్దుకొని అవతలనుండి వచ్చిన అన్నిటికీ యస్ సర్. నో ప్రోబ్లమ్ సర్. అని జవాబులిస్తూ పోయాడు.
ఇంతలో రియాజ్‌ని తీసుకొచ్చాడు ఎస్.ఐ. అతన్ని బయటకు వెళ్లమన్నట్టు సైగ చేశాడు డి.ఎస్‌.పి. రియాజ్‌కి డి.ఎస్.పి. ఖాన్‌ని చూడగానే చాలా రిలీఫ్ అనిపించింది. ఆయన్ని చాలా సార్లు శుక్రవారం పూట మసీదు దగ్గర చూశాడు. కమ్యూనిటీ హాల్ దగ్గర టెన్నిస్ ఆడేటప్పుడు కూడా చూశాడు. అందుకే తన వాళ్ళని చూసిన ఫీలింగ్ కలిగి, ʹసార్ నాకేం తెలియదు సార్. ఖుదాకీ కసమ్. ముఝే బచాలీజియే సర్ʹ (దేవుడి మీద వొట్టు. నన్ను రక్షించండి) అన్నాడు.
ʹఇప్పుడు నిన్ను ఖుదా కూడా రక్షించలేడు. వెనకా ముందు ఆస్తిపాస్తుల్లేవు. పోలిటికల్ బ్యాకింగ్ లేదు. నీకెందుకయ్యా రాజకీయాలు. ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మజాక్ అనుకున్నావా? ఆ పెద్ద గొడవలు నీకెందుకయ్యా. ఏదో యూత్ ఆర్గనైజేషన్ అంటే సరే. ఏకంగా నువ్వే నిలబడాలని అంత ఇదెందుకు? మీ పార్టీ నిన్నాదుకొంటుందనుకొన్నవా? ఇప్పుడు చూడు. ఎంత ఘోరంగా ఇరుక్కుపోయావో తెలుసా? నువ్వు ఇప్పట్లో బయటకు రాలేవు. పై నుండి ఆర్డర్స్. మావాడివే అయినా నేను ఏం చేయలేను. నీ కిస్మత్ అలా వుంది.ʹ
రియాజ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయ్. సార్ సార్ అని ప్రాధేయపడసాగాడు. ఇంతలో ఎస్.ఐ వచ్చాడు. డి.ఎస్.పి తలావూపగానే అతన్ని తీసుకెళ్లి జీప్ ఎక్కించారు.
*** *** ***
ఉదయం పేపర్ చూసినదగ్గర్నుండీ హసీనాకి మనసు మనసులో లేదు. భయ్యాని అరెస్టు చేశారట నిన్న. అమ్మకి ఇంకా చెప్పనే లేదు. ఆమెకు దానికన్న ఎక్కువ బాదించింది, అతను పనిచేస్తున్న పార్టీ అతన్ని వెంటనే పార్టీ నుండి తొలిగిస్తున్నట్టు స్టేట్‌మెంట్ ఇవ్వడం. కనీసం అసలు నిజంగా అతను దోషి అవునో కాదో తెలియకుండానే తీర్పు ప్రకటించేసింది.
డోర్ బెల్ మోగింది. హసీనా పరిగెత్తి తలుపు తీసింది. అబ్బాజాన్ వచ్చేసి వుంటారనుకొంది. తలుపుకవతల కానిస్టేబుల్ నిలబడ్డాడు.
ʹహసీనా ఖాతూన్ మీరేనా?ʹ చాలా మర్యాదగా అడిగాడతను. ʹజీ..హా..! నేనే. చెప్పండి.ʹ
ʹమేడమ్! మీ ఫాదర్ ని వదిలేస్తున్నారు. అయితే మీరొక్కసారి వచ్చికోర్టులో సంతకాలు పెట్టాలి. ఆలస్యం అయితే మళ్ళీ కోర్టు టైమ్ అయిపోతుంది. ఇంక ఈరోజుకి పని కాదు మా జీప్‌లో వెళ్దాంʹ అన్నాడతను. అప్పుడు బయటకు చూసిందామె. దానిలో ఇంకా పోలీసులున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తున్నారు. అయినా ఆమె లెక్క జెయ్యదలుచుకోలేదు. ఇప్పటికే అబ్బాజాన్‌ని తీసుకుపోయి రెండురోజులయ్యింది. అమ్మీకి చెప్పేసి గబగబా వెళ్ళి జీపెక్కింది.
*** *** ***
నీరజ గాజులు కొనుక్కొని బయటకు వచ్చేసరికి అతనెవరో తన వైపే చూస్తూ కనపడ్డాడు. తలవంచుకొని వెళ్ళిపోబోయింది. ʹఒక్క నిమిషం. నేను మీకు కావల్సిన వాడినే. మీ ఫ్రెండ్ లలిత నాకు వరసకి చెల్లెలవుతుంది.ʹ నీరజ ముఖం విచ్చుకొంది. నేను ఇక్కడే ఎస్.ఐగా పనిచేస్తున్నా. యూనిఫాం లేక పోవడంతో ఆమె అనుమానంగా చూసిందతనివైపు. అతను జేబులోనుండి ఐ.డి కార్డు తీసి చూపించాడు. ʹపదండి టీ తాగుతూ మాట్లాడుకొందాం అన్నాడు.ʹ అతను చెప్పిందంతా మౌనంగా విన్న ఆమెకి కొంచెం భయంగా అనిపించింది. అది గమనించి, ʹఏం కాదు. నేనున్నాగా? ప్రేమించినప్పుడు ఆ మాత్రం సాహసం చెయ్యాలి. ఆ తరవాత ఇక అతను నిన్ను పెళ్ళి చేసుకోక తప్పదు. నీ ప్రేమ సఫలం కావాలంటే ఇదే మంచి మార్గం.ʹ
ఆమె ఇంకా ఏమీ అనకపోయేసరికి, ʹచూడు! అనవసరంగా భయపడకు. తురకోళ్ళకి రెండు పెళ్లిళ్లయినా కోర్టు వొప్పుకొంటుంది. నువ్వు ఉట్టిగా ప్రేమించాను అంటే ఏ జడ్జి అయిన వొప్పుకుంటాడా? అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. దెబ్బకి ఆ రియాజ్ నిన్ను పెళ్ళి చేసుకొంటాడు.ʹ
వింటున్నకొద్దీ ఆమెకు ధైర్యంగా అనిపించింది. అవును తనెన్ని సినిమాలల్లో చూడలేదు? ఎప్పుడూ సినిమాలు చూసి ఊహాలోకాలలో తేలిపోయే అమాయకురాలు నీరజ సరేనన్నట్టు తలూపింది. ʹఎలాగూ అతని భార్య యేడాది నుండి పుట్టింట్లోనే వుంది. అంటే ఇక విడిపోయినట్టే. అతను మంచివాడు. మతాలు వేరనే కానీ లేకపోతే అతనికేం తక్కువ. తమ మంచికోసమే కదా పాపం ఆయన అంత ఇదిగా చెప్తున్నారు. రేపు లలితకి వెళ్ళి థాంక్స్ చెప్పాలి. అమ్మో! వద్దులే ఎవ్వరికీ చెప్పవద్దన్నారుగా.ʹ జడ్జి రియాజ్ ని పిలిచి తమ ఇద్దరికీ కోర్టులోనే పెళ్లి చేసినట్టు కలల్లో తేలిపోయింది. ఆమెకు తాను చేయబోయే పని ఎన్ని జీవితాలను అల్ల కల్లోలం చెయ్యగలదో ఊహించగల వయసు కాని, జీవితానుభవం కానీ లేవు.
ʹఐదు నిమిషాల పని. ఇప్పుడే వెళ్దాం మరి.ʹ సరే నన్నట్టు తలూపింది.
అతనికి పట్టరాని సంతోషంగా వుంది. తనకి చెప్పిన పనికి తాను ఎంత గొప్ప ట్విస్ట్ ఇచ్చాడో తెలిస్తే గెలిచే పార్టీ తనకి ప్రమోషన్ ఇవ్వడం ఖాయం. పైగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. గాలిలో తేలిపోతూ హుషారుగా ఈల వేయబోయి ఆగిపోయాడు.
*** *** ***
ʹఎలాగైనా అబ్బాజాన్‌ని వొప్పించి భయ్యాకి బెయిల్ ఇప్పించాలి. అన్నయ్య అలాంటి పని చేశాడంటే తనకి అస్సలు నమ్మ బుద్ధికావడం లేదు. హసీనా ఆలోచనల్లో మునిగిపోయింది. కోర్టు ముందుకు వచ్చి ఆగింది జీప్. చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అని బోర్డున్న గదిలోకి తీసుకువెళ్ళి ఒక పక్కన నిలబడమన్నారామెను. అప్పుడు గమనించింది హసీనా. తనకి ఇరుపక్కలా ఎక్కడినుంచి వచ్చారో కానీ ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ కూడా వున్నారు. మేజిస్ట్రేట్ తల ఎత్తేవరకు అందరూ మౌనంగా వున్నారు. ఎస్.ఐ కాగితాలు అందించాడు. ఆయన ఒక సారి ఆమె వైపు చూసి మళ్ళీ కాగితాల్లోకి చూశాడు. పేరు, తండ్రి పేరు, ఇంటి అడ్రస్సు అడిగాడు. ఆమె చెప్పింది. ʹఏమైనా చెప్పుకొనేదుందా?ʹ
ʹమా నాన్న నిర్దోషి. ఆయనకేమి తెలియదు.ʹ
మేజిస్ట్రేట్ ఒక క్షణం ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తరవాత చకచకా సంతకాలు పెట్టి కాగితాలు ఇచ్చేశాడు. చాలా ఆలస్యం అయిపోయింది. ఈరోజు ఇంటికి తొందరగా వస్తానని భార్యకు మాటిచ్చాడు. టైమ్ చూసుకొంటు నెక్స్ట్ అన్నాడు.
హసీనా సంతోషంగా నవ్వుతూ మేజిస్ట్రేట్‌కి చేతులు జోడించి ʹథాంక్‌యు సార్ʹ అనింది. ఆయన తల ఎత్తి చూడలేదు. హసీనాని చెయ్యిపట్టుకొని బయటకు తీసుకొచ్చింది లేడీ పోలీసు. బయటకు రాగానే, ఎస్.ఐ. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి అన్నాడు. అతనెందుకో మొన్నటి గొడవ గుర్తులేనట్టు చాలా మామూలుగా వున్నాడు. అందుకే హసీనా పెద్దగా పట్టించుకోకుండా సంతకాలు పెట్టేసింది. ʹఇక అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినట్టేనా?ʹ ఎస్.ఐ ని అడిగింది.
ʹఅయిపోయాయ్.ʹ పొడిగా సమాధానం ఇచ్చాడతను.
హసీనా ముఖంలో మూడురోజుల తరవాత చిన్న చిరునవ్వు మెరిసింది. జీప్ రివ్వున దూసుకుపోయింది. ఆలోచనల్లో కూరుకుపోయిన హసీనా జీప్ ఆగేసరికి గబుక్కున ఈ లోకంలోకి వచ్చి జీప్ దిగింది. పెద్ద భవనం. తలెత్తి చూసి కొంచెం షాక్ తిన్నది. ʹఅదేంటి అబ్బాజాన్ ని జైలుకి పంపారా?ʹ అన్నదామె. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమెకు ఏం అర్థం కాలేదు. ఓహ్! అందుకే కోర్టులో సంతకాలు పెట్టాల్సి వచ్చిందన్నమాట. అవునులే 24 గంటలలోపు ప్రవేశపెట్టాలి కదా. అమ్మీకి చెప్పాలి. తనని ఊరికే ఏం తెలియని పసిదానిలా చూడొద్దని. ఇప్పుడు అబ్బాజాన్‌ని తానేగా విడిపించుకొని వెళ్తున్నది! మెల్లగా భయ్యాని కూడా విడిపించాలి. రకరకాలుగా ఆలోచిస్తూ జైలుగేటు లోపలికి వెళ్ళింది. ఆఫీసు గదిలోకి తీసుకెళ్ళి ఒక పక్కగా నిలబెట్టారు. అందరూ తననే వింతగా చూస్తున్నారు. ఆమెకు ఒక సారి గర్వంగా అనిపించింది. ఎంత వద్దన్నా పెదవులమీద ఒకటే చిరునవ్వు.
అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్న ఒకాయన ఏవో కాగితాలు తీసి పట్టుకొని, మళ్ళీ మేజిస్ట్రేట్ అడిగినట్టే అడిగాడు. ఏమైనా చెప్పుకొనేదుందా అని మాత్రం అడగలేదు.
ʹగోడ దగ్గర నిలబడు!ʹ అన్నాడతను. ఆ గొంతులో ధ్వనించిన కరకుదనానికి ఆమె మారు ప్రశ్నించకుండానే వెళ్ళి నిలబడింది. ఆమె నెత్తి మీద స్కేలు పెట్టి 5.6ʹ అన్నాడతను. మరొకరు రాసుకొంటున్నారు. పుట్టుమచ్చలు...
ఆమెకంతా అయోమయంగా వుంది...అబ్బాజాన్...అని ఏదో అనబోయి ఊరుకొంది. ఈలోపు ఒకతను పలక తీసుకొచ్చి హసీనా ఖాతూన్ అని రాశాడు. ʹఇది పట్టుకొని ఆ గోడ దగ్గర నిలబడు. తొందరగా..టైమ్ లేదు.ʹ అన్నాడు. అతని చేతిలో కెమెరా.
ఈసారి ఆమెకు కోపం నశాళానికి అంటుకొంది. ʹముందు మా అబ్బాజాన్ ఏరీ చెప్పండిʹ అని నిలదీసింది. ఆమెకు సడెన్‌గా భయం వేసింది.
ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా చటుక్కున్న ఫోటో తీశాడు. నడుముకున్న బెల్టు నుంచి వాకీటాకీ తీసి ʹలేడీ వార్డర్ ని పంపండి.ʹ అని అవతలి ఎవరికో చెప్పాడు.
కాసేపటికి లోపలికి వచ్చిన మహిళా వార్డర్ ఈమెని ఆశ్చర్యంగా చూసి పక్కనున్న పోలీసులని ఏం కేసు అని అడిగింది.
ʹరేప్ కేసు. వీళ్ళన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చి తనరూమ్‌కి తీసుకుపోతే ఇదిగో ఈ పిల్లే బయటనుండి గొళ్ళెం పెట్టింది. ఆ పిల్ల ఈ పొద్దు మేజిస్ట్రేట్ ముందుకొచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎవరో నీరజ అట. నేనే డ్యూటీ లో ఉన్నా అప్పుడు.ʹ
ʹఅబ్బో ఆ పిల్లే వచ్చి జరిగింది చెప్పింటే ఇంక యావజ్జీవమే!ʹ అంది వార్డర్.
హసీనాకి వెయ్యి పిడుగులు తన నెత్తిమీదే పడిపోయినట్టు, భూమి విచ్ఛిన్నమయిపోయి తాను అందులో కూరుకుపోతున్నట్టు తోచింది. చెవులు దిబ్బెళ్ళు వేశాయి. హసీనాకి మెల్లగా కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి.
*** ***** ***
ʹఏయ్ బీనా! పేపర్లో ఈ వార్త చూశావా? హసీనా పైన రేప్ కేసు పెట్టారంట.ʹ
ʹఛ!ఛ! అలా ఎలా పెడతారు. అమ్మాయి మీద? పైగా తన మీద?ʹ
ʹవాళ్ళ అన్నయ్య ఎవరినో అమ్మాయిని ఎత్తుకువచ్చి రూమ్‌లో పెడితే ఈమె బయట నుండి గడియ పెట్టిందని ఎవరో అమ్మాయి మేజిస్ట్రేట్ ముందు చెప్పిందట.ʹ
ʹహసీనా వాళ్ళ అన్నయ్య అంటే యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి కదా. అతనలాంటి వాడు కాదు. మనం ఏం చేయలేమా?ʹ
ʹపద! జయ మేడంని కలుద్దాం. మన విద్యార్థులం అందరం కలిసి వెళ్తే మంచిదేమో! ఫిర్యాదు చేసినామె ఎవరో తెలుసుకొని ఆమెని కలిసి నిజాలేమిటో తెలుసుకోగలమా ప్రయత్నించాలి. మేడమ్ టీచర్స్ అసోసియేషన్‌లో కూడా ఉన్నారు. మనకి తప్పక సాయం చేస్తారు. పదండి పోదాం.ʹ
*** **** ***
పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి.
ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు.
రియాజ్, హసీనాల అక్రమ అరెస్టుని ఖండిస్తూ విద్యార్థులు, యువజనులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వస్తున్నారు.
***
అధ్యాపక సాహితి – సావనీర్ డిసెంబర్ 2016 లో ప్రచురితం.

Keywords : jail, virasam, anuradha, muslim, story
(2020-01-17 06:25:20)No. of visitors : 1176

Suggested Posts


జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా.

జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి....

Search Engine

ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
Cotton University Students Hoist Black Flags, Express Solidarity with JNU
JNU: బాధితులపై బీజేపీ నేతల చవకబారు వ్యాఖ్యలు
more..


జైలు