జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

జైలు



ʹఏక్ సౌ బారా.....ఏక్ సౌ తేరా ....ʹ
ఆమె అలా నాణేలు లెక్కపెట్టడం పూర్తి చేసి ప్లాస్టిక్ డబ్బా మూత పెట్టేవరకూ చూసి, ʹనాకూ అలా హిందీ లో లెక్కపెట్టడం నేర్పిస్తారా?ʹ నవ్వుతూ అడిగాను. ఆమె చప్పున సిగ్గుపడిపోయి గబుక్కున డబ్బా పక్కన పెట్టేసి ʹఅరె మీరా దీదీ! రండి,ʹ అంటూ గబగబా తన బిస్తర్ మీద దుప్పటి సరిచేసి కూర్చోమని ఆహ్వానించింది.
చాలా స్నేహంగా కనిపించిన ఆమె మొహం చూసి ʹనేను ఇక్కడ కొత్తగా వచ్చిన బందీని. నా పేరు...ʹ
అంటుండగానే ఆమె మధ్యలోనే అందుకొని ʹనాకు తెలుసు దీదీ. అసలు నేనే వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలనుకొన్నాను. నా పేరు సునీతా సింగ్.ʹ అని పరిచయం చేసుకొంది.
ʹమీరు ఇక్కడ స్కూలు నడుపుతున్నారట కదా? నాకు కొంచెం హిందీ నేర్పిస్తారా? చూస్తున్నారు కదా నా హిందీ చాలా వీక్. మీదగ్గర నేర్చుకొందామనీ......ʹ
ʹబాప్ రే, నేను మీకు హిందీ నేర్పించడమేంటీ? మీరు చాలా పెద్ద చదువులు చదువుకొన్నారని విన్నాను. మీ గురించి పేపర్లో చాలా చదివాను......ʹ ఆమె నవ్వుతూ అంది.
ʹఅబ్బే అదంతా మీడియా పైత్యం. నేను మామూలు గ్రాడ్యుయేట్ ని అంతే. ఎంత చదువుకున్నా హిందీ రాదనేది అసలు విషయం. చూస్తున్నారు కదా ఎంత కష్టంగా మాట్లాడుతున్నానో. చాలా మందికి నేను మాట్లాడేది అర్థమే కావడం లేదు. ఏదో పదో క్లాసులో కష్టపడి 35 మార్కులు తెచ్చుకొన్న బాపతు. ముఖ్యంగా అంకెలు లెక్కపెట్టడం అసలే రాదు. మీరు లెక్కపెడుతుంటే .... ʹ మధ్యలోనే అందుకొని ....ʹఎన్ని స్వెటర్లు అల్లానా అని చూస్తున్నʹ అన్నది. అర్థం కానట్టు చూశాను.
ఆమె సాలోచనగా ఆ డబ్బా చేతిలోకి తీసుకొని ʹఇవేంటో తెలుసా? నేనల్లిన స్వెటర్ల కి గుర్తు. టైం పాస్ కి స్వెటర్లు అల్లుతాను. డబ్బుకేమి కొదవ లేదు. జైల్లో ఎవ్వరూ డబ్బులు తీసుకోకుండా ఏ పనీ చెయ్యరు. సరే నేను కూడా తీసుకోవడం మొదలుపెట్టాను. ఒక స్వెటర్ కి ఒక రూపాయి. అలా నేను ఎన్ని స్వెటర్లు అల్లానో ఒక లెక్క వుంటుంది. మా ఆయన ఇదంతా ఉత్త పనికి మాలిన పని అంటుంటారనుకోండి ...ʹ అని నవ్వేసింది. అలా మాట్లాడుతూనే అప్రయత్నంగా పక్కనున్న సగం అల్లిన స్వెటర్ తీసుకొని చక చకా అల్లడం మొదలుపెట్టింది.
అంత్యంత వేగంగా, నైపుణ్యంగా కదులుతున్న ఆమె వేళ్ళని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ʹనిజమే మంచి టైమ్ పాస్ కదా?ʹ
ʹప్రస్తుతం ఇదే టైమ్ పాస్ కానీ, నిజంగా ఇక్కడ టైమ్ పాస్ అవుతుందంటారా? నాకయితే ఒక్కోసారి శక్తినంతా కూడదీస్కుని టైముని తోస్తున్నాననిపిస్తుంది.ʹ ఆమె గొంతు దిగులుగా ధ్వనించింది. చప్పున గుర్తుకొచ్చినట్టు ʹఅయ్యయ్యో నేను ఎంత పిచ్చిదాన్ని, మీరు హిందీ నేర్పమంటే నేనేదో మాట్లాడేస్తున్న కదా. సరే మీకు వీలైనప్పుడల్లా రండి. తప్పక నేర్పిస్తాను.ʹ అంది.
అలా మొదలయిన మా పరిచయం తొందరగానే స్నేహంగా మారింది. ఒకరి గురించి మరొకరం తెలుసుకొన్నాం.
సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు. సునిత, ఆమె కొడుకు కలిసి ఆమెని కొట్టి చంపేశారనీ ఫేనుకి ఉరేసినట్టు వేలాడదీసి కట్టారనీ, మామగారు, భర్త చూస్తూ నిలబడ్డారనీ అభియోగం. సంఘటన జరిగిన రోజు మరిది ఊర్లో లేడని అతని మీద మాత్రం కేసు పెట్టలేదు. ఇంటి కోడలు జైలుకి పోతే కుటుంబ పరువు పోతుందని చెప్పి ఫ్యామిలీ లాయరు సలహా తీసుకొని ఆమెని రహస్యంగా వేరే వూరికి పంపించారు. మిగతా వాళ్ళు అరెస్టు అయ్యారు. మామగారి పలుకుబడి తో తొందరగానే బెయిలు వచ్చింది. రెండేళ్ళ వరకు సునిత రహస్యంగానే వుంది. నిజానికి అంత పెద్ద రహస్యం అని ఏం కాదు కానీ, పోలీసులకి రెగ్యులర్గా లంచం ఇవ్వడమే వాళ్ళు చేసింది. ఈ లోపు కేసులోంచి సునీతని వేరు చేసి మిగతా ముగ్గురిని విచారించి నిర్దోషులుగా విడుదల చేశారు. దాంతో ధైర్యం చేసి సునీతని కోర్టులో సరెండర్ చేయ్యించారు. అలా ఆమె జైలుకి వచ్చింది. ఆమె కూడా విడుదలవుతుందని ఆశ పడ్డారు. కానీ ఆమెకి కింది కోర్టే కాదు హైకోర్టులో కూడా బెయిలు దొరకలేదు. దాంతో త్వరత్వరగా కేసు నడిపించాలని విపరీతంగా డబ్బు కురిపించారు. అవతలి వాళ్ళు కూడా తక్కువ బలగం వున్నవాళ్ళేమీ కాదు. చివరికి ఊహించని విధంగా ఆమెకి పదేళ్ళు శిక్ష పడింది. అలా ఆమె జిల్లా జైలు నుండి కేంద్రకారాగారానికి వచ్చింది. కింది కోర్టు లో తమకి న్యాయం జరగలేదనీ, అన్యాయంగా శిక్ష వేశారనీ హైకోర్టుకి అప్పీల్ చేసుకొన్నారు. అప్పీల్ మంజూరు అయ్యింది. కాబట్టి మళ్ళీ బెయిలు కోసం వేశారు. ఇవీ తన గురించి సునిత చెప్పిన వివరాలు.
*** *** ***
నేను ఉదయం, సాయంత్రం రోజు రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను. జైలు జీవితంలో ఇంక ఏ రకమైన శారీరకమైన శ్రమకైనా అవకాశం తక్కువ కాబట్టి వున్న ఆ కొంచెం స్థలం లోనే వాకింగ్ చేయడం తప్పనిసరి. పది పదిహేను మంది కంటే ఎక్కువ మంది లేరు, వాకింగ్ చేసేవాళ్ళు.
సునీత కూడా వాకింగ్ చేసేది కాబట్టి మేమిద్దరం అలా నడుస్తూ మాట్లాడుకొనేవాళ్ళం. వాకింగ్ కి వచ్చేటప్పుడు సునిత నైటీలో వుంటే దాని జేబులోనో లేకపోతే ఒక ప్లాస్టిక్ కవరుకి పిన్ను పెట్టో, దానిలో ఒక ఊలు వుండ వేసుకొని అల్లుతూనే వుండేది. ఆమెని అల్లిక పని లేకుండా చూసే సందర్భాలు చాలా తక్కువేనని చెప్పాలి.
ఖైదీ లతో పాటు లోపలికి వచ్చిన చిన్న పిల్లల కోసం ఒక గదితో స్కూల్ వుంది. దాని బాధ్యత సునీతదే. శిక్ష పడిన ఖైదీలకి వేతనాలతో పని దొరుకుతుంది. అలా పని చేసేవాళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువైనా, అది సత్ప్రవర్తన గా గుర్తించబడి వాళ్ళకి రెమిషన్ దొరుకుతుంది. అంటే శిక్ష పడ్డ తరవాత వాళ్ళు గడిపిన ప్రతి యేడాదికి మూడు నెలల చొప్పున మినహాయింపు దొరుకుతుంది. 9 నెలలని యేడాదిగా లెక్కిస్తారు. ఈ సమాచారం అంతా నాకు సునీతనే చెప్పింది. ఆమె చదువుకొన్న వ్యక్తి కాబట్టి ఆమెకి స్కూల్ బాధ్యత ఇచ్చారు. అయితే ఆమె స్కూల్ నడపడం లేదు. నేనడిగితే ʹఅస్సలు మనస్కరించదు. ఏ మాత్రం మూడ్ వుండదు. బుర్ర పెట్టి చెయ్యాల్సిన పనులేవీ నేను చేయలేక పోతున్నా. నన్ను బలవంతంగా ఇందులో పెట్టారుʹ అన్నది.
ʹఅరె, ఇది మీకు మంచి టైమ్ పాస్ కదా. నన్ను కూడా మీ స్టూడెంట్ ని చేసుకోండీ. పిల్లలకీ మేలు. మనకీ టైమ్ పాస్.ʹ అన్నాను.
సునిత తెగ సంబరపడిపోయింది. మీరుకూడా వస్తారా? అయితే తప్పక తెరుస్తాను.ʹ అన్నది.
అయితే సునీతకి చాలా భక్తి. నిజానికి చాలా మందే జైల్లో పడ్డాక భక్తి మార్గం ఎంచుకోడం గమనించాను. సునిత ఉదయం స్నానం చేసి పూజా పునస్కారాలన్నీ అయితే తప్ప చాయ్ కూడా తాగేది కాదు. కాబట్టి ఆమె కార్యక్రమాలన్నీపూర్తి చేసుకొని తిండి తిని అప్పుడు స్కూల్ తెరవడం కనక పన్నెండు నుంచి మూడు గంటలవరకూ అయితే జైలు టైంలో అనుకూలం అని తేల్చుకొన్నాం. ముఖ్యంగా అది శీతాకాలం కావడం వల్ల. మధ్యలో ఒకటిన్నరకి చాయ్ కోసం పది నిమిషాల బ్రేక్ తీసుకొనేవాళ్ళం.
అలాంటి ఒక బ్రేక్ లో చాయ్ తాగుతూ నేను కూని రాగం తీస్తున్నా. వాతావరణం చలిచలిగానూ చాలా ఆహ్లాదకరంగానూ వుంది. అందరం శాలువాలు కప్పుకొని దగ్గర దగ్గరగా కూర్చుని వేడి తప్ప మరేమీ లేని ఛాయ్ ని ఆస్వాదిస్తున్నాం. నేను గమనించనేలేదు కానీ పిల్లలు కూడా నిశ్శబ్దం అయిపోయారు. అప్పుడే సునిత నా వైపు చూసి ʹకొంచెం గట్టిగా....ʹ అన్నది. అంతే ఇక పిల్లలు ఒకటే గొడవ ʹపాట పాడు! పాట పాడు!ʹ అని. ʹఅలా కాదు. మనం రెండు గ్రూపులుగా అయ్యి అంత్యాక్షరి ఆడదంʹ అన్నా.
సునిత కూడా ఉత్సాహంగా పాటలు పాడింది. ʹమీ గొంతు బాగుంది. కానీ ఎందుకో స్వేచ్చగా పాడడం లేదు మీరు!ʹ అన్నాను.
ఆమె సిగ్గుగా నవ్వి, ʹఏదో సంకోచంగా వుంటుందిʹ అంది. ʹఎందుకట్లా?ʹ నేను వదల్లేదు.
ʹఎందుకో భయంగా వుంటది. ఎవరైనా వింటారేమో అని.ʹ చాలా ఆశ్చర్యం అనిపించింది. ʹవింటే ఏంటి? ఇది జైల్లోని మరో చిన్న జైల్లాంటి మహిళా వార్డు. ఎవరు విన్నా అంతా మహిళలే కదా? మరిక భయపడాల్సిందేముంటుంది?ʹ
సునిత ముఖం మ్లానమయ్యింది. ʹ నిజమే దీదీ! ఎవరూ లేరు. అయినా భయం ఎప్పుడూ నీడలా వెంటాడుతుంటుంది. మా ఇంట్లో గట్టిగా నవ్వకూడదు. ఇక పాట పాడడం అంటే దానికన్నా ఘోరమయిన విషయం మరొకటి లేదు. పరువుగల రాజపుత్రుల కోడలు ఇంట్లో నడిస్తే వినపడాల్సింది పట్టీల మువ్వల చిరు సవ్వడి తప్ప అడుగుల చప్పుడు కాదు. ఎలాంటి సమయం లోనైనా ఘూంఘట్ (నెత్తిమీద వేసుకొనే కొంగు) అటూ ఇటూ జారకూడదు. పిల్లలకి స్కూలు టైమ్ అయిపోతున్నా అంత మందికి ఉపాహారాలు, వంటలు చేసే హడావిడిలో మిగతా అన్నిటికన్నాఘూంఘట్ గురించి ʹఫికర్ʹ పడాల్సి వుంటుంది. మీకు తెల్సా నేను వచ్చిన కొత్తలో నన్ను చూసి అందరూ నవ్వే వాళ్ళు. మెల్ల మెల్లగా నాకు అర్థం అయ్యింది. ఈ నాలుగ్గోడల మధ్య అంతా స్వేచ్చనే. ఆంక్షలు లేవు.
ʹమరి మీరు గ్రాడ్యుయేషన్ ఎలా చెయ్యగలిగారు?ʹ
ʹమా పుట్టింట్లో అంత చాదస్తం లేదు. ముఖ్యంగా నేను మా పెద్దన్న దగ్గర వుండి ఢిల్లీ లో చదువుకొన్నాను. స్కూటర్ నేర్చుకొన్నాను. హాయిగా సల్వార్ కమీజులు వేసుకొనేదాన్ని. మా నాన్నగారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనక మేము దాదాపు పట్టణాల్లోనే పెరిగాము. ఒక పెళ్ళి లో చూసి ఆయన నన్ను ఇష్ట పడ్డాడు. మొదట నల్లగా వున్నాడని వద్దన్నాను. కలిసి మాట్లాడాకా నేనూ తననే చేసుకొంటానన్నాను.ʹ ఆమె బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. సునిత నిజానికి తెల్లని తెలుపేమీ కాదు. గోధుమరంగు ఛాయ. కానీ ఆమె బుగ్గలు ఎర్రగా వుండి చూసే వాళ్ళకి కాస్త హెవీగా మేకప్ చేసుకొన్నట్టనిపిస్తుంది. నాక్కూడా మొదలు అలాగే అనిపించి చాలా చిరాకనిపించేది. జైల్లో కూడా మరీ అంత మేకప్ ఏమిటని. బుగ్గలే కాదు కనురెప్పలపైనా కూడా చాలా ఎర్రగా వుంటుంది. పైగా ఆమె చాలా ఖరీదైన చీరలు కడుతుంది. ఉదయం స్నానం చేసి జుట్టు వదిలేసుకొని నెత్తిమీద కొంగు కప్పుకొని, సింధూరం పెట్టుకొని, చేతిలో ఇత్తడి పళ్ళెం లో పూజ సామాన్లు పెట్టుకొని... ఆమె సరిగ్గా వార్డు నుండి వంద గజాల దూరంలో వున్న పడమటిమూల లోని పూజాస్థలానికి వెళ్తుంటే, చేతినిండా గాజులు, ధగధగ లాడే ముక్కపుడకతో హెవీ బడ్జెట్ టీవీ సీరియల్ లోని ʹహీరోయిన్ కోడలుʹ లానే అనిపిస్తుంది. చుట్టూఎత్తైన గోడలు, ఎప్పుడూ మూసి వుండే పెద్ద పెద్ద ఇనప చువ్వల గేట్లు ఎటు చూసినా పేదరికం తాండవించే బందీల నేపధ్యం లో ఆమె గమ్మత్తుగా అనిపించేది.
సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనూ చూపించే విధంగా జైల్లో అడుగుపెట్టగానే తెల్ల చీరలిచ్చేస్తరేమో అనుకొన్నా. విచారణ లో వున్న ఖైదీలకి అసలు యూనిఫాం అంటూ ఏమి లేదు. శిక్ష పడ్డ వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం బట్టలిస్తుంది. అయితే జార్ఖండ్ జైళ్ళలో పురుషులకి మాత్రమే తెల్ల బట్టలు ఇస్తారు. వాళ్ళు అవి మాత్రమే వేసుకోవాలి. మహిళలకి మామూలు చీరలే ఇస్తారు. కేంద్ర కారాగారాల్లో విచారణలో వున్న వాళ్ళకి కూడా ఇస్తుంటారు. హోళీ కి, దసరాకీ ఇస్తారు.
ʹఇంతకీ మీ ఆయన కూడా అలానే చాదస్తంగా వుంటారా?ʹ అన్నాను. ʹఆ మేరకు బతికిపోయాననుకోండి. కానీ ఏం లాభం? మా మామగారు, పరమ చాదస్తుడు. పిల్లలు ఆయన ముందు వంచిన తలెత్తరు. తండ్రి మాటంటే శిలాశాసనం. అంతెందుకు నేను నైటీ బెడ్ రూమ్ లోనే వేసుకొంటాను. ఉదయం పూట చీర లోకి మారాకే గది బయటికి వెళ్తాను. అయినా సరే స్లీవ్ లెస్ నైటీ ఒకటి తెగ నచ్చి కొనమంటే వద్దు ఆరేసినప్పుడో ఎప్పుడో పొరపాటున నాన్న చూస్తే? అంటాడా మనిషి. ఉత్త పిరికి మొహం!ʹ అంది ఉక్రోషంగా. ʹ అలా ఏడ్చింది నా సంసారం. ఒక సరదా లేదు, పాడూలేదు. బెడ్ రూమ్ లోనైనా గొంతు విప్పి పాడాలంటే భయం. నాకన్నా ఎక్కువ మా ఆయనకి భయం. తెల్సా దీదీ? షాపింగ్ కి వెళ్ళాలన్న మావగారిని పర్మిషన్ అడగాలి. అదీ నేరుగా కాదు. ఆయన వెనకాల నేను నుంచుంటే అప్పుడు ఆయన అడుగుతాడు. ఆయన ఒప్పుకుంటే సరే. లేకపోతే ఇప్పుడెందుకూ? అంటారు. ఇక నోరుమూసుకొని లోపలికి పోవాలంతే!ʹ
ʹఇంటికీ జైలుకి తేడా లేదు. ఇంట్లో పిల్లలు, ఆయనా వుంటారని తప్ప రెండూ జైళ్ళే. కనీసం ఇక్కడ మావగారి టెన్షన్ లేదు. పూజకి పోయేటప్పుడు తప్ప కొంగు కప్పుకొనక్కర్లేదు. నేనసలు వేసవికాలంలో పగలూ రాత్రి నైటీ వేస్కునే వుంటాను. మా ఆయనను ఇక్కడికి కలవడానికి వచ్చేటప్పుడు నైటీలు తెమ్మంటే జైల్లో ఏం వేసుకొంటావ్ లెద్దూ! అని తీసుకురాలేదు. వొళ్ళు మండి నేను జమ్మెదారిణి ( మహిళా వార్డర్) తో తెప్పించుకొని పగలూ రాత్రి అవే వేసుకోవడం మొదలు పెట్టాను. తెలుసా? ఒకలాంటి మనశ్శాంతి కలుగుతోంది ఈ తిరుగుబాటులో.ʹ
ఒక ప్రవాహంలా చెప్పుకొంటూ పోతున్న సునీతకేసి చూస్తూ వుండిపోయాను. సునీతనే కాదు. ఇక్కడ చాలా మంది స్త్రీలు స్వేచ్ఛగా వుంటారు.
*** *** ***
సునీత మూలాకాతీకి (ఇంటర్వ్యూ) కి వెళ్ళి వచ్చింది. ముఖం వాడిపోయి వుంది. నన్ను చూడగానే రమ్మన్నట్టుగా సైగ చేసింది. వెళ్ళాను. సంచులన్నీ పక్కన పెట్టి, ఏదో చెప్పబోయి గొంతుజీరబోవడంతో ఆగిపోయింది. నేను కూజా లో నుండి మంచినీళ్ళు గ్లాసులోకి వొంపి మౌనంగా అందించాను. తీస్కుని తాగింది. కళ్ళనుండి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంది. కొద్దిసేపు ఆ ఉదృతం తగ్గనీ అని నేనూ ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపు చూసి లాభం లేదని ʹఇంట్లో అంతా బాగేనాʹ అన్నాను. ʹఊ!ʹ అని తలూపి, కష్టమ్మీద నోరు పెగిల్చి ʹబెయిల్ రిజెక్ట్ అయ్యింది.ʹ అంటూనే భోరున ఏడ్చింది.
హైకోర్టు నుండి బెయిల్ రిజెక్ట్ కావడం ఇది రెండో సారి. కొంచెం వోదార్పు మాటలు చెప్పాక అప్పుడే గుర్తు వచ్చినట్టుగా గబ గబా కళ్ళు తుడుచుకొని, సెక్యూరిటీ వాళ్ళ కళ్ళ బడకుండా దాచి పెట్టి తెచ్చుకొన్న ఉత్తరం బయటికి తీసింది.
ʹమాట్లాడటానికి సరిగ్గా అవకాశమే ఉండదని తాను ప్రతిసారీ, లెటర్ రాసి తెస్తారు.ʹ ఆమె ఉత్తరం పూర్తి చేసి, ʹఈసారి బెయిల్ రిజెక్ట్ అయినా కానీ, మూడేళ్ళ కస్టడీ పూర్తయ్యాకనే బెయిల్ ఇస్తానని కండిషన్ పెట్టాడట జడ్జి.ʹ అని చెప్పింది. ఇద్దరం గబగబా లెక్కగట్టి ఇంకా ఆరు నెలలు వుండాలని కనుక్కొన్నాం.
తను కొంత తేరుకొందని అర్థమయ్యాక నేను కొంచెం వాతావరణం తేలిక పరుద్దామని ... ʹఅయినా ఎందుకంత బాధ ఇంటికి పోవాలని. ఇంటికన్నా జైలే మేలని నువ్వే అన్నావుగా! అసలు ఇంటికీ జైలుకీ తేడా ఏంటో తెలుసా?ʹ ఏంటన్నట్టు చూసింది. అప్పటికి మిగతా వాళ్ళు కూడా మా చుట్టూ చేరారు. ʹఆడవాళ్ళు ఇంట్లో పొయ్యి వెలిగించకపోతే తన్నులు తింటారు. జైల్లో పొయ్యి వెలిగిస్తే తన్నులు తింటారు.ʹ అందరూ నవ్వారు. ʹఝార్ఖండ్ లో ఎప్పుడూ పవర్ కట్టే. ఇంట్లో వుంటే ఉక్కపోతకి వుసూరు మంటాం. జైల్లో రాత్రి పూట కరెంట్ పోతే వెంటనే జెనరేటర్ వేస్తారు. (ఈ ఏర్పాటు రాత్రి 11 గంటలవరకే) మరి ఇంట్లో అట్లా అవకాశం వుందా చెప్పుʹ అన్నా.
ʹపిల్లలు లేకపోతే ఇంతగా ప్రాణం కొట్టుకొనేది కాదు దీదీ. కానీ వాళ్ళని తలుచుకొంటే ఒక్క క్షణం కూడా వుండాలనిపించదు.ʹ
ʹనాకు తెలుసు సునీతా, ఇక్కడ ఎన్ని సౌకర్యాలిచ్చినా స్వేచ్చ లేకుండా వుండడానికి ఎవరిష్ట పడతారు?ʹ అన్నాను. ʹఅది నిజం దీదీ! ఒకసారి జైలుకి వచ్చిన వాళ్ళెవరూ మళ్ళీ జైలుకి పోవాలనుకోరు. నేను ఒక జైల్లోంచి మరో జైలుకు వచ్చాను. ఇక మళ్ళీ చస్తే ఏ జైలుకీ పోను. ఈసారి మా ఆయన తో ఖచ్చితంగా చెప్పాను. రాంచీ లో ఇల్లు తీసుకొని ఆ తర్వాతనే బెయిల్ కోసం వెయ్యమని. ఆయన వచ్చినా రాకున్నా నేను మళ్ళీ నా మెట్టినింట్లో అడుగుపెట్టేది లేదు. నా పిల్లల్ని పెట్టుకొని రాంచీలో వుంటాను. ఆయన సహకరించకపోతే స్వెటర్లు అల్లుకోనో, ట్యూషన్లు చెప్పుకోనో ఎలాగో ఒకలాగా బతుకుతాను. కానీ నా కంఠంలో ప్రాణం వుండగా ఆ ఇంట్లో అడుగుపెట్టను. నా తోటికోడల్లా నేను ఆత్మ హత్య చేసుకోను. బతుకుతాను. బతికి చూపిస్తాను.జైలు నాకు తెగింపు నేర్పింది. మా తోటికోడలు బతికున్నంతకాలం ఆ పంజరంలో ఊపిరాడక వేరుపడదాం అని పోరింది. మా ఇళ్ళల్లో మగవాళ్ళకి వెన్నెముకలు వుండవ్. మా పెళ్ళాలు షాపింగ్లు చెయ్యాలో వద్దో మీరే నిర్ణయించేటట్టయితే మేం వేరు కాపరం వుంటాం అని చెప్పే దమ్ములు లేనోళ్ళు. పెద్ద కొడుక్కే ధైర్యం లేకపోతే ఇంకా మా మరిది కెక్కడనుండి వస్తుంది ధైర్యం? బిజినెస్ పనుల్లో వూర్లు పట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో పెళ్ళాం ఏ ఏడుపు ఏడుస్తుందో ఏం పట్టింది? నేను పడివున్నట్టు ఆమె పడివుండలేకపోయింది. ఊపిరాడలేదామెకు. ఆ మార్గం ఎంచుకొంది. పసిపిల్లాడున్నాడన్న కనికరం లేకుండా ఎలా ఉరిపోసుకొందో దేవుడి కెరుక! బడీమా! బడీమా! అంటూ పిల్లాడు నాకొంగు పట్టుకొని వాళ్ళ బెడ్ రూమ్ లోకి తీసుకుపోతే అందరికన్నా ముందు నేనే చూశాను. కాపాడుకోవాలన్న తొందరలో ముందూ వెనకా ఆలోచించకుండా మేం అందరమూ కలిసి కిందకి దించాం. అప్పటికే ఊపిరాగిపోయింది. మేం దోషులమయిపోయాం!
ʹపెత్తనం చేసిన మామగారు శిక్ష తప్పించుకొనే! ధైర్యం చేసి వేరు పడని మొగుడూ తప్పించుకొనే. నోరు మూసుకొని ఇన్నాళ్ళా నరకాన్ని భరించిన నాకూ ఆ పసివాడికీ శిక్ష. చూసారా ʹన్యాయంʹ ఎలా జరుగుతుందో? పోనీలెండి! ఏం జరిగినా మన మంచికేనంటారు, ఇందుకేనేమో? దీదీ! నువ్వు చూస్తుండు. నేను విడుదలయ్యిన రోజు నా జీవితం నేనే నిర్ణయించుకొంటాను. ఆయన కలిసొస్తే సంతోషం. లేకపోతే చింత మాత్రం లేదు. నేను అనుభవించిన శిక్ష ఇక్కడితో సరి.ʹ సునీత అలా ఆవేశంతో చెప్పుకొంటూ పోతుంటే చూస్తూ వుండిపోయాను.
****
ఉపసంహారం:
అనుకొన్నట్టుగానే ఆరు నెలలకి సునీతకి బెయిలు వచ్చింది. కొద్ది రోజుల తర్వాత జమ్మెదారిణి కి ఫోన్ చేసి నాకు ఖబురు పంపించింది. తను అనుకొన్నట్టుగా పిల్లల్తో రాంచిలోనే వున్నదట. పిల్లల చదువుకోసం అప్పటికే రాంచిలో ఫ్లాట్ తీసుకొన్నారట. తను నేరుగా అక్కడికే వెల్ళిందట. వాళ్ళాయన మాత్రం సునీత విడుదలయిన విషయం వాళ్ళ నాన్నకెలా చెప్పాలా అని ఇంకా ఆలోచిస్తూనే వున్నాడట.
(ఆదివారం ఆంధ్రజ్యోతి 29-12-2013)

Keywords : jarkhand, jail, maoists,
(2024-04-24 20:48:15)



No. of visitors : 2254

Suggested Posts


జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు.

జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని.

చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా.

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు: లాఠీ బుడియా - -బి. అనూరాధ.

ʹఏయ్ మేడం! ఇధర్ ఆవ్!ʹ ఆ గొంతు కంచులా ఖంగున మోగింది. ఆ కంఠంలో పలికిన అథార్టీ, మైకు అక్కర్లేనంత బిగ్గరగా పలికిన ఆ స్వరం విన్నాక – ఆ కంఠం కలిగిన మనిషిని చూసి బిత్తర పోయాను. ఆ స్వరానికీ, ఆ మనిషికీ ఏం సంబంధం లేదు. ʹఒక్క నిమిషం ఇలా రా!ʹ నన్ను చూస్తూ చేతిలో లాఠీని తాటిస్తూ పిలిచింది

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జైలు