ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ

ముస్లిం

(అహ్మద్ మొహీయుద్దీన్ ఖాన్ యజ్డానీ (డానీ) రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక ఫిబ్రవరి 2018 సంచికలో ప్రచురించబడినది)

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రధాన విధాన నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టిలకన్నా ఎక్కువ వివాదాన్ని రేపుతున్న అంశం ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు - 2017. తక్షణ ట్రిపుల్‌ తలాఖ్‌ (చిటికెలో విడాకులు / ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌) ను కఠినంగా శిక్షించదగ్గ నేరంగా పరిగణించడం ఈ బిల్లులో కీలక అంశం. ఈ బిల్లు లోక్‌సభ ఆమోదాన్ని పొంది రాజ్యసభలో ప్రవేశించింది. రాజ్యసభలో బిల్లు పాస్‌ కావడానికి అవసరమైన సంఖ్యాబలం ఎన్‌డిఏకు లేని కారణంగా ఇప్పటికి అక్కడ ఆగివుంది. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో, అవసరమైరుుతే, పార్లమెంట్‌ ఉభయ సభల్ని సమావేశపరచైనా సరే ఈ బిల్లును చట్టంగా మార్చితీరాలని కమలనాథులు గట్టిపట్టుదలతో ఉన్నారు.

నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు పథకం సామాన్య ప్రజల్ని ఇబ్బందుల పాలుచేసి సూపర్‌ కార్పొరేట్లు, బ్యాంకులకు దోచిపెట్టిందని తెలియనివాళ్లు ఇప్పుడు ఎవరూ లేరు. ఆయన ప్రవేశపెట్టిన మరో పథకం జిఎస్‌టి దక్షణాది రాష్ట్రాల్ని దోచి ఉత్తరాది రాష్ట్రాలకు కట్టబెట్టడానికేనని ఇటీవలి గణాంకాలు చెపుతున్నారుు. భారత ముస్లిం సమాజాన్ని నయా బానిసగా మార్చి హిందూత్వ శక్తులకు ఊడిగం చేసేలా లొంగదీయడానికే ఇప్పుడు ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లును తెస్తున్నారని కొందరు వ్యక్తం చేస్తున్న ఆందోళన కొట్టిపడవేయ దగ్గదేమీకాదు.

దాదాపు 14 వందల సంవత్సరాలుగా కలిసి ఉంటున్నప్పటికీ ముస్లిం సమాజం గురించి సాటి సమాజాలకు తెలిసింది చాలా తక్కువ. కేవలం అపోహలే తప్ప ముస్లిం సమాజం గురించీ, వాళ్ల సాంస్కృతిక జీవనం గురించీ తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎవరికీ లేదు. ఇక మిగిలింది అపోహలు మాత్రమే. మిగిలిన అంశాల విషయం ఎలావున్నా ముస్లిం వివాహ వ్యవస్థ గురించి ఇప్పుడరుునా బయటి ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది.

ధార్మిక ప్రమాణాల ప్రకారం హిందూ వివాహం శాశ్వితమైనది. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే అది ఒక జీవితకాల బంధం మాత్రమే కాదు; ఏడు జన్మల అనుబంధం. ముస్లిం వివాహం దీనికి పూర్తిగా భిన్నమైనది. ఇస్లాం ధార్మిక ప్రమాణల ప్రకారం వివాహం అనేది ఒక పౌర ఒప్పందం. ఇది ఆధునిక అగ్రిమెంట్‌ మ్యారేజ్‌లను పోలి ఉంటుంది. అగ్రిమెంట్‌ అన్నాక ఒక అవసరం, ప్రతిపాదన, ఇష్టపూర్వక ఆమోదం, నోటరీ (ఖాజీ), సాక్షులు మాత్రమేగాక అగ్రిమెంటును రద్దు చేసుకోవడానికి ఇరుపక్షాలకు గల హక్కులు, దానికి షరతులు వగరుురా విధివిధానాలు ఉంటారుు. ఈ అంశాలన్నీ ముస్లిం పెళ్లిలో ఉంటారుు. ప్రతిపాదిత పెళ్లి తమకు ʹʹఇష్టమేʹʹ (ఖుబూల్‌) అని వధువు మూడుసార్లు, వరుడు మూడుసార్లు సాక్షుల ముందు విడివిడిగా ప్రకటించిన తరువాత మాత్రమే పెళ్లి జరుగుతుంది. వివాహ బంధాన్ని తెంచుకుంటున్నపుడు కూడా విడిపోతున్నామన్న విషయాన్ని మూడుసార్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఏ కారణం చేత అరుునా వివాహ బంధం నుండి బయట పడాలనుకున్నప్పుడు విడాకులు కోరే హక్కు స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానంగా ఉంటుంది.

ముస్లిం వివాహ వ్యవస్థలో పెళ్లి చేసుకోవడానికి మూడుసార్లు ఖుబూల్‌ చెప్పినట్టే, విడిపోవాల్సి వచ్చినపుడు కూడా మూడుసార్లు తలాఖ్‌ చెప్పాలి. ఈ ట్రిపుల్‌ ఖుబూల్‌, ట్రిపుల్‌ తలాఖ్‌ విధానం ముస్లిం సమాజంలో అనాదిగా ఉంది. ఇక భవిష్యత్తులోనూ ఉంటుంది. అదేమీ మారదు. అది వాళ్ల పౌరస్మృతి (షరియ).

ఇలాంటి హక్కులు భారత సమాజంలోని ఇతర సమూహాలకు దేశ స్వాతంత్య్రం తరువాత మాత్రమే వచ్చారుు. విడాకుల హక్కును సాధించుకోవడానికి భారత మహిళలు వీధుల్లో నెలల తరబడి ఆందోళనలు చేశారు, బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ పార్లమెంటులో భీకర పోరాటం చేశాడు. చాలా మందికి తెలియని విషయం ఏమంటే ముస్లిం సమాజంలో మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు మాత్రమేకాక విధవా స్త్రీ పునర్‌ వివాహ హక్కు కూడా ఏడవ శతాబ్దం నుండే ఉన్నారుు. మిగిలిన సమాజాల్లోని మహిళలు వీటిని సాధించడానికి దాదాపు 14 వందల సంవత్సరాలు పట్టింది. ముస్లిం సమాజానికి ప్రవక్త ముహమ్మద్‌ కేవలం దైవ సందేశహరుడు మాత్రమేకాదు వారే ఒక గొప్ప సంస్కర్త. వారు స్వయంగా విధవా స్త్రీని మాత్రమేగాక తన కన్నా వయసులో పెద్దవారైన మహిళను వివాహమాడి ఒక మహత్తర సాంప్రదాయానికి నాందీ పలికారు.

ఆధునిక ప్రమాణాల్లో విడిపోయే హక్కు ఏ రంగంలో అరుునా ప్రజాస్వామికమైనదే. విడిపోయే హక్కు ఉన్నంత మాత్రాన ముస్లిం సమాజంలో విడాకుల శాతం ఎక్కువ అనిగానీ, ఇతర సమాజాల్లో విడాకుల శాతం తక్కువ అనిగానీ చెప్పడానికి లేదు. భారత దేశంలో బౌధ్ధుల్లో విడాకుల శాతం అందరికన్నా ఎక్కువగా ఉందని ఇటీవలి జనాభా లెక్కలు చెపుతున్నారుు. విడాకుల్ని ఒక హక్కుగా గుర్తించిన సమాజం కనుక ముస్లింల విడాకుల కేసులు బాహాటంగా బయటి ప్రపంచానికి తెలుస్తున్నారుు. ఇతర సమాజాల్లో చట్టబద్దంగా విడాకులు పొందిన వాళ్ల సంఖ్య మాత్రమే అధికారికంగా తెలుస్తోంది. నిజానికి విడాకులు పొందకుండానే విడిగా ఉంటున్నవాళ్లు, ʹవిడిచిపెట్టబడ్డʹ వాళ్ల సంఖ్య ఇంతకన్నా తక్కువగా ఏమీలేదు.

అరుుతే, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే దాంపత్యంలో ఆర్థిక స్వేచ్ఛగలవారే విడాకుల సౌకర్యాన్ని ఎక్కువగా వాడుకుంటారు. దీనికి ఆ మతం, ఈ మతం అని తేడా ఏమీలేదు. ఇదొక సార్వజనీన సూత్రం. ఇప్పటి వరకు భర్తలే ఈ సౌకర్యన్ని వాడుకునేవారు. ఇటీవలి కాలంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సహితం ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు. ఆ మేరకు వాళ్లు కూడా అవసరమైనప్పుడు విడాకుల సౌకర్యాన్ని బాగానే వాడుకుంటున్నారు.

ఆర్థికరంగంలో సరళీకరణ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రవేశించాక మనుషుల్లో ఆర్థిక అత్యాశ, వస్తు వ్యామోహం విపరీతంగా పెరిగి పోయాయని మనకందరికీ తెలుసు. అరుుతే, దాంపత్య జీవితం మీద కూడా దాని ప్రభావం బలంగా పడిందని మాత్రం మనం ఇంతకాలంగా గుర్తించలేదు. మన సమాజంలో దాంపత్య జీవితం ఎంత వేగంగా విఛ్ఛిన్నం అరుుపోతున్నదో చెప్పడానికి కుటుంబ న్యాయస్థానాల్లో నమోదు అవుతున్న విడాకుల కేసుల సంఖ్య ఒక కొలమానం. హైదరాబాద్‌ లో విడాకుల కేసుల్ని విచారించడానికి గతంలో ఫ్యామిలీ కోర్టులు ఒకటో రెండో ఉండేవి. ఇటీవల కేసుల సంఖ్య పెరగడంతో కోర్టుల సంఖ్య కూడా నాలుగైదు రెట్లు పెరిగింది. అంతేకాక ఐటి ఉద్యోగుల విడాకుల కేసుల్ని ప్రత్యేకంగా విచారించడానికి కొన్ని కోర్టులు వీకెండ్స్‌లో కూడా పనిచేస్తున్నారుు.

ఇక్కడొక విచిత్రాన్ని గమనించాలి. ముస్లిం సమాజంలో ʹతాత్కాలికంʹ అనే ప్రాతిపదిక మీద వివాహ బంధంలో ప్రవేశించిన స్త్రీలు దాన్ని శాశ్విత బంధంగా మార్చాలని కోరుకుంటున్నారు. మరో వైపు, హిందూ సమాజంలో ʹశాశ్వితంʹ అనే ప్రాతిపదిక మీద వివాహ బంధంలో ప్రవేశించిన స్త్రీలు తమకు విడాకుల హక్కు ఉండాలని, అంటే వివాహాన్ని తాత్కాలిక బంధంగా మార్చాలని కోరుకుంటున్నారు!.

ముస్లిం సమాజంలో భార్య విడాకులు కోరడాన్ని ఖులా అంటారు. భర్త విడాకులు కోరడాన్ని తలాఖ్‌ అంటారు. తలాఖ్‌ పొందడానికి సాంప్రదాయంగా రెండు విధానాలున్నారుు. తలాఖ్‌ - ఏ-హసన్‌, తలాఖ్‌ -ఏ- అహసాన్‌. ఈ రెండు పద్ధ్ధతుల్లో స్వల్ప బేధాలున్నప్పటికీ కొన్ని సారూప్య ప్రమాణాలున్నారుు. ఏ కారణం చేతనరుునాసరే భార్య నుండి విడిపోవాలనుకున్న భర్త ఆ విషయాన్ని భార్యకు ముందుగా ప్రకటించాలి. అంటే మొదటిసారి తలాఖ్‌ చెప్పాలి. నెలకు ఒకసారి చొప్పున మూడు నెలల్లో మూడుసార్లు చెప్పాలి. మూడవసారి కూడా చెపితేనే విడాకులు పొందినట్టు. రెండుసార్లు తలాఖ్‌ చెప్పినా మూడోసారి చెప్పడానికి ముందు భర్త తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అప్పుడు అంతకు ముందు రెండుసార్లు చెప్పిన తలాఖ్‌లు రద్దరుుపోతారుు. భర్త తన ఆలోచనల్ని మార్చుకునే అవకాశం ఇవ్వడానికే ఈ మూడు నెలల సాగదీతను పెట్టారు. ఈ మూడు నెలల వ్యవధి ఇవ్వడానికి మరో ప్రధాన కారణం ఏమంటే భార్య గర్భవతి అరుుందో? లేదో? తేల్చడం. ఆ కాలంలో భార్య గర్భవతి అరుుతే పుట్టబోయే శిశువు పోషణ బాధ్యత భర్తదే అవుతుంది. అప్పుడు తలాఖ్‌ వారుుదా పడుతుంది.

తలాఖ్‌ నిర్ణయానికి మూడు నెలల గడువు సరిపోదని ఖలీఫాలే బలంగా భావించినట్టు చారిత్రక ఆధారాలున్నారుు. తలాఖ్‌ గడువును తగ్గించాలని తన మీద వత్తిడి తెచ్చిన వారి మీద రెండవ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. ʹʹమీరు సహనంతో వ్యవహరించాల్సిన చోట తొందరపాటును ప్రదర్శిస్తున్నారుʹʹ అని హెచ్చరించినట్టు కూడా ఇస్లాం ధార్మిక గ్రంథాల్లో ఉంది.

ఈ సందర్భంగా సంభోగ నియమాలని కూడా ఒకసారి పరికించాలి. ముస్లిం సమాజంలో వివాహేతర సంభోగానికి ధార్మిక సమర్ధన లేదు. వివాహమాడిన స్త్రీలతో మాత్రమే పురుషుడు సంభోగంలో పాల్గొనాలనే కట్టుడి ఉంది. అనాధలు, పనివాళ్లు, బానిసలు, విధవాస్త్రీలు తదితరులకు యజమానులైన పురుషుల సంభోగ కోరిక ముప్పు (ససెప్టిబుల్‌, వల్నరెబుల్‌) ఎప్పుడూ ఉంటుంది. అలాంటి స్త్రీలను డబ్బు, అధికారం, కండ బలాలతో లొంగదీసుకోకుండా గౌరవప్రదంగా వివాహమాడాలనే నియమం ఒకటి ఉంది. అలా పుట్టిందే బహుభార్యత్వం. ముస్లిం సమాజంలో బహు భార్యత్వానికి ధార్మిక సమర్ధన ఉన్నప్పటికీ దానికి సంఖ్యాపరమైన పరిమితి, ఇతర బాధ్యతలకు సంబంధించిన ఆదేశాలు అనేకమున్నారుు. బహుభార్యత్వం అనేది ముస్లిం సమాజంలో అధికారికం గా కొనసాగితే ఇతర సమాజాల్లో అనధికారికంగా సాగుతోంది. ఇక్కడా ఒక విచిత్రం ఉంది. మనదేశంలో ధార్మిక సమర్థన ఉన్న ముస్లింలకన్నా, ధార్మిక సమర్థనలేని హిందూ సమాజంలోనే బహు భార్యత్వం అధికంగా ఉన్నట్టు అనేక సర్వేలు చెపుతున్నారుు. వివాహేతర సంబంధంగా స్త్రీలను ʹఉంచుకోవడంʹ అనేది గ్రామీణ ప్రాంతపు భూస్వామ్య కుటుంబాల్లో సర్వసాధారణ విషయంగా మనం ఇప్పటికీ గమనించవచ్చు.

అప్పటి అరబ్బు ముస్లిం రాజులు కొందరు బహు భార్యత్వపు పరిధిని మించి వివాహాలు చేసుకున్నారు. పాత భార్యల్ని వదిలిపెట్టి కొత్త స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి వాళ్లు ఒక దుర్మార్గమైన, అమానవీయమైన విడాకుల విధానాన్ని కనుగొన్నారు. మూడు నెలల వ్యవధి విధానాన్ని పక్కన పెట్టి ఒక్క గుక్కలో ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పడం మొదలు పెట్టారు. దీనినే తలాఖ్‌ -ఏ - బిద్దత్‌ అంటారు. ముస్లిం సమాజంలో ఈ విధమైన విడాకులు మొదటి నుండీ వివాదాస్పదమైనవే. వీటికి ధార్మిక మద్దతు లేదు.

గతి తప్పిన దురాచారాన్ని ముస్లిం మతాచార్యులు మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేశారో? లేదో? మనకు తెలీదు. బహుకొద్ది మందికితప్ప సాధారణంగా మతాచార్యులకు చక్రవర్తుల్ని ఎదిరించే సాహసం ఉండదు. పైగా వాళ్లు ప్రభువుల మెప్పు పొందడానికి అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. ప్రభువులు చేసే అకృత్యాలను సహితం ధర్మ సమ్మతంగా చిత్రించడానికి తమ పాండిత్యాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. అన్నింటికి మించి మతాచార్యుల్లో అత్యధికులు పురుషాహంకారులు. మత నిబంధనల్ని ఆధునిక పరిణామాలకు వర్తింపచేయాల్సి వచ్చినపుడు వాళ్లు పురుషుల పక్షం వహించి పరిష్కారాలు చేస్తుంటారు. ఆ మేరకు మహిళల హక్కుల్ని కాలరాస్తుంటారు. తరచుగా కాకపోరుునా అరుదుగానరుునా తలాఖ్‌ - ఏ - బిద్దత్‌ ముస్లిం సమాజంలో కొనసాగిందన్నది వాస్తవం.

ముస్లిం మతాచార్యుల పురుష అభిజాత్యం సమీప గతంలో 1986 నాటి షాబానో కేసులో బాహాటంగా బయటపడింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన మొహమ్మద్‌ అహమ్మద్‌ ఖాన్‌ అనే వ్యాపారి ఐదుగురు పిల్లల తల్లి, 62 ఏళ్ల వృద్ధురాలైన తన భార్య షాబానోకు విడాకులిచ్చాడు. మాజీ భర్త నుండి తనకు జీవానాధారాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రరుుంచింది. ఆ కేసును విచారించిన సుప్రీం కోర్టు 1986లో నెలకు 179 రూపాయల మనోవర్తిని ఇవ్వాల్సిందిగా షా బానో భర్తను ఆదేశించింది.

ఆనాటి జీవన ప్రమాణాల ప్రకారం చూసినా నెలకు 179 రూపాయలు అనేది చాలా చిన్న మొత్తం. షాబానో గౌరవప్రదంగా బతకడానికి సరిపడేలా మనోవర్తి మొత్తాన్ని పెంచేలా ఆమె మాజీ భర్తను సుప్రీంకోర్టు ఆదేశించాలని ముస్లిం సమాజం ఆందోళనచేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. భారత ముస్లిం సనాతనవర్గం రంగప్రవేశం చేసి విడాకులు పొందిన స్త్రీకి మనోవర్తి తీసుకునే హక్కేలేదని వాదించింది. విడాకులు ఇచ్చిన భర్త పరపురుషునితో సమానమనీ, పరపురుషుని నుండి జీవనాధారాన్ని పొందడం ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమని విపరీత భాష్యాలు చెప్పింది. విడాకులు పొందిన స్త్రీల పోషణ భారాన్ని ఆమె రక్త సంబంధీకులు గానీ, వక్ఫ్‌ బోర్డుగానీ స్వీకరిస్తారని బూటకపు హామీలు గుప్పించింది. షాబానో మనోవర్తిని రద్దు చేయాలంటూ అప్పటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడి తెచ్చింది. అప్పట్లో, పంజాబ్‌లో అల్లకల్లోలం, అస్సాంలో విద్యార్థి ఉద్యమాలతో సతమతమవుతున్న రాజీవ్‌ గాంధీ చివరకు ముస్లీం సనాతనవర్గం వత్తిడికి లొంగిపోయారు. విడాకులు పొందిన ముస్లిం స్త్రీల మనోవర్తిని రద్దు చేస్తూ ʹముస్లిం మహిళ (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం-1986ʹ తెచ్చారు. ఇది ముస్లిం మాతాచార్యులు, కేంద్ర ప్రభుత్వం కలిసి చేసిన ఒక చారిత్రక తప్పిదం, సాంఘీక మహా అపచారం.

ప్రపంచ మతాల్లో కొత్తది కావడం వల్ల కావచ్చు సామ్యవాదం తదితర ఆధునిక భావజాలాల మూలాలు అనేకం ఇస్లాంలో కనిపిస్తారుు. ఇస్లాం ఆర్థిక విధానం ధర్మకర్తృత్వం. దానాలు చేయడం ద్వార మనుషులు తమ తప్పుల్ని సరిదిద్దుకోవచ్చనేది దీనికి అంతస్సూత్రం. ఫిత్రా, జకాత్‌, ఖుర్బానీ, పాత వస్తువుల్ని పంచడం వగరుురా సాంప్రదాయాలన్నీ ధర్మకర్తృత్వ దృక్పథం నుండి పుట్టినవే. నిరుపేదలు, అనాధలు, విధవా స్త్రీలు, రోగులు, నిస్సహాయులు దానం పొందడానికి తొలి అర్హులు అంటూ అనేక సందర్భాల్లో ధార్మిక ఆదేశాలున్నారుు. అన్నార్తులకు దానాలు చేయాలని ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు మాజీ భర్త నుండి మాజీ భార్య జీవనాధారాన్ని పొందడాన్ని ఈ మతాచార్యులు తప్పుబట్టడం ఒక వికారమే తప్ప మరేమీకాదు. లక్షల ఎకరాల వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం అరుుపోతున్నప్పటికీ నోరు మెదపలేని ఈ మతాచార్యులు విధవా స్త్రీల పోషణ బాధ్యతను వక్ఫ్‌ బోర్డులు స్వీకరిస్తాయని గొప్పలు చెప్పుకోవడం మరో బూటకం. సామాజిక దృక్పథంలో ఇస్లాం మతానికి అప్పటి వరకువున్న గౌరవ స్థానాన్ని షాబానో కేసు మసకబార్చింది.

ఆ తరువాతి కాలంలో, సమాచార సాంకేతిక (ఐటి) విప్లవం తెచ్చిన అనర్థాలకు దాంపత్య జీవితం కూడా బలరుుపోరుుంది. స్మార్ట్‌ ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌్‌, వాట్స్‌ అప్‌, ట్విట్టర్‌, ఇ-మెరుుల్‌ వగరుురా అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వార ఒక్క గుక్కలో ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పేసే తరం ఒకటి తయారైంది. ఇలాంటి సంఘటనలు వార్తల్లో వచ్చిన తొలి దశలోనే ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వంటి ధార్మిక సంస్థలు మేల్కొని ఉండాల్సింది. ఐటి డివోర్సు, తలాఖ్‌-ఏ-బిద్దత్‌, ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ లు ఏ విధంగానూ చెల్లవని స్పష్టంగా ప్రకటించి ఉండాల్సింది. విగ్రహారాధన కిందకు వస్తుందేమోననే అనుమానంతో ముస్లింలు ఫొటోలు దిగడం మీద రోజుల తరబడి చర్చించే మతాచార్యు లకు స్మార్ట్‌ ఫోన్‌ తలాఖ్‌-ఏ-బిద్దత్‌ ధర్మ విరుద్ధం అని తోచకపోవడం దారుణం.

ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ బాధితురాలరుున షాయరా బాను అనే మహిళ గత ఏడాది న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. మరికొందరు ముస్లిం మహిళలు కూడా ఈ కేసులో చేరారు. ఈ కేసు ముస్లిం సమాజంలోనే కాక ముస్లిమేతర సమాజాల్లోనూ సంచలనం రేపింది. ఈ కేసులో సుప్రీం కోర్టు విచారణాంశం మీద కూడా అనేక అపోహలు ప్రచారం అయ్యారుు. ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ లేదా తలాఖ్‌-ఏ-బిద్దత్‌ ఇస్లాం మూల సూత్రాలకు అనుకూలమా, వ్యతిరేకమా అనే అంశాన్ని మాత్రమే సుప్రీంకోర్టు విస్తారంగా పరిశీలించింది.

షా బానో కేసు సమయంలో రాజీవ్‌ గాంధీ ఉన్నట్టే షాయరా బానో కేసు సమయంలో నరేంద్ర మోదీ కూడా రాజకీయ ఇరకాటంలో ఉన్నారు. బీహార్‌ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు మరో పెద్ద సవాలుగా మారారుు. సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకునే స్థితిలోనూ ఆయన లేరు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలన్నీ కూలిపోయారుు. ఆ విఫల పథకాల గురించి చెప్పినా జనం నమ్మేస్థితిలో లేరు. మోదీ హయాంలో దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమన బాటలో నడుస్తోంద ని ఆయన పార్టీ సీనియర్లే బయటపడి మాట్లాడడం మొదలు పెట్టారు.

ఆధునిక పనిముట్లు పనిచేయనపుడు వాడడానికి పాలకుల దగ్గర పురాతన ఆయుధాలు ఎలాగూ ఉంటారుు; అదే మతతత్త్వాన్ని రెచ్చ గొట్టడం. ప్రభుత్వం తమ మేలు కోసం ఏమీ చేయకపోరుునా ముస్లింలను అణిచివేస్తే చాలని సంబరపడే ఓటర్లు మనకు తక్కువేం లేరు. అలాంటి వాళ్లు యుపిలో మరీ ఎక్కువ. వాళ్లను సంతృప్తి పరచడానికి నరేంద్ర మోదీజీ హఠాత్తుగా స్త్రీ జనోద్ధారకులు అరుుపోయారు. అందులోనూ ముస్లిం మహిళా బాంధవులరుుపోయారు. వారు పేదలకు ఉచిత వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్ననట్టు రూపొందించిన ప్రచార పోస్టర్‌లో ఇద్దరు మహిళలు బుర్ఖాలు వేసుకొని ఉంటారు. మహిళల ఆర్థిక వికాసం, దాంపత్య హక్కులు ముస్లింలతోనే ఆరంభం అన్న రీతిలో యుపి ఎన్నికల ప్రచారం సాగింది. ముస్లింలను సున్నీలుగా, షియాలుగా, తిరిగి వాళ్లను పురుషులుగా, స్త్రీలుగా చీల్చేస్తున్నట్టు సంకేతాలిస్తూ తన సాంప్రదాయ ఓట్‌ బ్యాంకును అలరించారు ప్రధాని.

ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ అనేది ఇస్లాం ఆదర్శాలకు విరుద్ధమంటూ, చట్టపరంగా అది చెల్లదంటూ ఈ ఏడాది ఆగస్టు 22న తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం సమాజంలోని ప్రగతిశీలురే కాకుండా చాందసులు సహితం ఆహ్వానించారు. ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ను ఇస్లాం సాంప్రదాయాలు, విలువలతో సంబంధంలేని భ్రష్టాచారంగా పేర్కొన్న సుప్రీం కోర్టు తన తీర్పులో ఇస్లాం ఆదర్శాలను కొనియాడడం ఆ సమూహాలకు ఆనందాన్నిచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఒక విశేషముంది. ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో 3:2 నిష్పత్తిలో భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. తీర్పుకు ఒక్క ఓటుతో స్వల్ప ఆధిక్యత మాత్రమే ఉంది. ముగ్గురు న్యాయమూర్తులు ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ అనేది ఇస్లాం ధార్మిక ఆదర్శాలకు విరుద్ధమని చట్టపరంగా అది చెల్లదని మెజారిటీ తీర్పును ప్రకటించారు. నిజానికి దీన్ని న్యాయస్థానాల్లో ఇస్లాం ధార్మిక విలువలు సాధించిన విజయంగా భావించవచ్చు. ట్రిపుల్‌ తలాఖ్‌ నే కాదు ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ను సహితం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పలేదు. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు ఆ తీర్పు మీద తమ అసమ్మతిని నమోదు చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం. వాళ్లిద్దరి అసమ్మతికి రాజ్యాంగపరమైన ధర్మసూక్ష్మాలు అనేకం ఉన్నారుు. మతవిశ్వాసాలు కలిగి ఉండడం, మతాచారాల్ని పాటించడం, మతాన్ని ప్రచారం చేసుకోవడం వంటి పౌరుల ప్రాథమిక హక్కుల జోలికి సుప్రీం కోర్టు పోదలచలేదు. ఒక పౌర సమూహపు వివాహం, విడాకులు, వారసత్వం వంటి సాంస్కృతిక అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని భారత రాజ్యంగంలోని 25వ అదికరణ ఆమోదించదని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జగదీష్‌ సింగ్‌ ఖేహార్‌ చాలా స్పష్టంగా వివరించారు.

అరుుతే సుప్రీం కోర్టు తీర్పును నరేంద్ర మోదీ అనుకూల మీడియా వక్రీకరించింది. ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌నే కాకుండా ఏకంగా సాంప్రదాయ ట్రిపుల్‌ తలాఖ్‌ను సహితం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్టు ప్రకటించినట్టు మీడియాలో కథనాలొచ్చారుు. ఇది ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం సాధించిపెట్టిన మేలు అన్నట్టు ఒక అబద్ధపు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

నిజానికి సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఈ వివాదం ముగిసిపోవాలి. ముస్లింలను ఎప్పుడూ ఏదో ఒక భావోద్వేగ ధార్మిక వివాదంలో ఉంచడమే కమలనాధుల ఎత్తుగడ. ఆ హోరులో తన పరిపాలనలోని లోపాలను, వైఫల్యాలను ప్రజలు మరిచిపోవాలనేదే మోదీ ప్రభుత్వ వ్యూహం. దానికోసం, ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2017ను రూపొందించి వివాదాన్ని కొత్త దశకు తీసుకొని వెళ్లింది మోదీ ప్రభుత్వం.

ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించడం ఈ బిల్లుల్లో కీలక అంశం. ఈ బిల్లు చట్టంగా మారితే ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ను చెప్పిన భర్తకు భారీ జుర్మానాతోపాటూ మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించవచ్చు. ఒక సమూహపు సాంస్కృతిక ఆచారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించ వచ్చునా? అన్నది ఒక ప్రశ్న అరుుతే దేశద్రోహ నేరానికి పాల్పడ్డవారితో సమానంగా కఠిన కారాగార శిక్ష విధించవచ్చునా అన్నది అంతకన్నా కీలకమైన ప్రశ్న.

సుప్రీం కోర్టు తీర్పు తరువాత కూడా ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ కేసులు కొన్ని తమ దృష్టికి వచ్చిన కారణంగా కొత్త చట్టం చెయ్యాల్సిన అవసరం వచ్చిందని మోదీ ప్రభుత్వం అంటున్నది. సుప్రీం కోర్టు తీర్పుకూ కొత్త చట్టానికీ అసలు పొంతనేలేదు. ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ ఇస్లాం ధార్మిక ఆదర్శాలకు విరుద్ధమని చట్టపరంగా చెల్లదని సుప్రీం కోర్టు చెప్పింది. అంటే, ఒక ముస్లిం భర్త తన భార్యకు ఏదైనా ఆవేశంలో ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పినా అది చెల్లదు. భార్యకు తన భర్త మీద, ఆమె పిల్లలకు తమ తండ్రి మీద గతంలో ఉన్న దాంపత్య, కుటుంబ, వారసత్వ హక్కులన్నీ యథాతథంగా కొనసాగుతారుు. సుప్రీం కోర్టు తీర్పు తుంటరులైన భర్తల్ని సరిదిద్దుతుంది; బాధితులైన భార్యల్ని పరిరక్షిస్తుంది. కొత్త చట్టం అలాకాదు. తుంటరులైన భర్తల్ని జైలుకు పంపుతుంది. భార్యనూ, ఆమె పిల్లల్నీ గాలికి వదిలేస్తుంది. ఇక్కడ ఇంకో తిరకాసుంది. భర్త చెప్పిన ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ చెల్లినట్టా? చెల్లనట్టా అనేది సమాధానంలేని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఒకవేళ ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ చెల్లేదరుుదే భర్తను జైలుకు పంపాల్సిన పనిలేదు. ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ చెల్లకుంటే ఆ మహిళ అతనికి భార్యగానే కొనసాగాల్సి ఉంటుంది. విడాకులు పొందలేదు గాబట్టి భర్త జైలు శిక్షాకాలం పూర్తిచేసే వరకు ఆమె మరో వివాహం చేసుకోవడానికి కూడా కుదరదు. భర్తను జైలుకు పంపిన కారణంగా అతని బంధువులు సహజంగానే ఆమెనూ, ఆమె పిల్లల్నీ దగ్గరకు రానివ్వరు. సారాంశంలో, ముస్లిం పురుషులతోపాటూ, ముస్లిం మహిళల్ని కూడా అణిచివేయడానికి ఈ చట్టాన్ని రూపొందించాడు అనవచ్చు. ఇంత అడ్దగోలు చట్టాన్ని భారత నేరస్మృతి చరిత్రలో ఇంతవరకు ఎవరూ చూసి ఉండరు.

ఈ చట్టంలో ఇంకో ప్రమాదం పొంచివుంది. భర్త ఇన్‌స్టాంట్‌ త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పినట్టు భార్య పిర్యాదు చేయకపోరుునా పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తనంతట తాను (సుమోటో)గా కేసు నమోదు చేయవచ్చు. కేసు నమోదు చేయడం అంటే జైలుకు పంపడమే. అంటే, ముస్లిం పురుషుల మీద ఎప్పుడరుునా సరే కేసులు పెట్టి జైళ్లకు పంపడానికి పోలీసులకు ఈ చట్టం అపార అధికారాల్ని ఇస్తుంది. తనతో విబేధించే రాజకీయ నాయకులు, వాణిజ్య వేత్తలపై మోదీ ప్రభుత్వం సిబిఐ, ఆర్‌బిఐ, ఇడి, ఐటి, ఇసి, చివరకు న్యాయస్థానాల్ని సహితం ఉపయోగించి దారికి తెచ్చుకోవడాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇక ముందు ముస్లిం సమాజాన్ని అణిచివేయడానికి పోలీసుల్ని, చట్టాల్ని ఉపయోగించడాన్ని మనం చూడబోతున్నాం.

కేంద్ర హోం, న్యాయశాఖలు సంయుక్తంగా రూపొందించిన ఈ బిల్లును డిసెంబర్‌ 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది డిసెంబర్‌ 29న ఈ బిల్లు లోక్‌ సభ ఆమోదాన్ని కూడా పొందింది. దీనికి కాంగ్రెస్‌ సహితం మద్దతివ్వడం విశేషం. 1986 నాటి షాబానో కేసులో మనవర్తిని రద్దుచేసి రాజీవ్‌ గాంధీ ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. మూడు దశాబ్దాల తరువాత ఆయన కుమారుడు రాహుల్‌ గాంధీ షయరా బానూ కేసులో కమలనాధులకు మద్దతు పలికి మరో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు.

ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2017ను తాము మత ప్రాతిపదికగా చూడడం లేదనీ మహిళల సమస్యల్ని మానవీయ కోణంలో చూస్తున్నామని కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర ప్రసాద్‌ అంటున్నారు. ప్రభుత్వం చెపుతున్న ఆదర్శాలకూ ఆచరణకూ పొంతన లేదు. మన దేశంలో ముస్లిం మహిళలు భర్తలవల్లనేగాక ప్రభుత్వాలవల్ల, వాళ్ల సైనికులవల్ల బాధపడ్డ సందర్భాలు అనేకం ఉన్నారుు. మాలియాన, ముజఫర్‌నగర్‌ హత్యలు, అల్లర్ల సందర్భంగా ముస్లిం మహిళలు ఇంతకన్నా పెద్ద సంఖ్యలో, ఇంతకన్నా హృదయ విదారకంగా రోదించారు. అప్పటి ప్రభుత్వాల్లోగానీ, ఇప్పటి ప్రభుత్వంలోగానీ అప్పుడెప్పుడూ ఇలాంటి ముస్లిం మహిళా సానుభూతి కనిపించలేదు. ప్రభుత్వానికి మహిళల గౌరవ మర్యాదలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల మీద అంతగా ప్రేమ ఉంటే దేశంలోని అన్ని మతసమూహాల్లోని మహిళలకు వర్తించేలా ఒక సమగ్ర చట్టాన్ని తెచ్చి ఉండాల్సింది. ప్రత్యేకంగా ముస్లిం మహిళ వైవాహిక హక్కుల పరిరక్షణ కోసమే కొత్త చట్టం తేవడం దేనికీ? ముస్లిం మహిళల మీద సానుభూతి ముసుగులో ముస్లిం స్త్రీ పురుషుల మీద ఒక అప్రకటిత దాడియే ఈ చట్టం.

సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మించిన పద్మావత్‌ సినిమా తమ మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నదంటూ ఆరోపిస్తూ ఆ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగిన రాజపుత్ర సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్యయించాయి. ఈ అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాన్ని నియమించడమేగాక, ఈ సమస్య పరిష్కారానికి ప్రముఖ చరిత్రకారుల అభిప్రాయాలు తెలుసుకోవాలని మానవ వనరుల అభివృధ్ధి శాఖను కోరింది. దాదాపు 20 కోట్ల జనాభాకు దాదాపు జీవన్మరణ అంశంగా మారనున్న అంశం పై చట్టం చేసే సమయంలో ఒక సినిమాకు చేసినంత కసరత్తు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ముస్లీం సమాజం రాజపూత్రుల మార్గంలో రోడ్ల మీదికి వచ్చి హింసాత్మక ఆందోళనలు చేయాలని నరేంద్ర మోది ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.

ట్రిపుల్‌ తలాఖ్‌ కేసుకు భారీ ప్రచారం ఇచ్చే క్రమంలో మీడియా దాచిపెట్టిన పెద్ద కేసు ఇంకొకటుంది. భార్య ఇష్టం లేకుండా సాగించే సంభోగాన్ని అత్యాచార నేరంగా పరిగణించి భర్తల్ని శిక్షించేలా ఒక చట్టం చేయాలని సుప్రీం కోర్టు ఆ మధ్య కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైవాహిక అత్యాచారం మీద ఢిల్లీ హై కోర్టులో ఇంకో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్‌) నడుస్తున్నది. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు దాటని భార్యతో సంభోగం చేయడాన్ని అత్యాచార నేరంగా పరిగణించి భర్తను శిక్షించాలనేది దీని సారాంశం.

ఈ అంశం ఇప్పుడు సుప్రీం కోర్టు పరిధిలోవుంది. ఎలా లెక్క వేసినా ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాక్‌ బాధిత స్త్రీల కన్నా వైవాహిక అత్యాచార బాధిత స్త్రీల సంఖ్య నిస్సందేహంగా అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్తల్ని నేరస్తులుగా పరిగణించమని సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ, వైవాహిక అత్యాచార నిందితుల్ని నేరస్తులుగా పరిగణించమని స్పష్టంగా చెప్పింది. సుప్రీం కోర్టు నేరస్తులుగా పరిగణించిన కేసుని పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు నేరస్తులుగా పరిగణించని కేసుని మాత్రం తీవ్రంగా పట్టించుకుంది. సుప్రీం కోర్టుతో నరేంద్ర మోదీ ఆడుకుంటున్న తీరుకు కూడా ఈ చట్టం అద్దం పడుతుంది.

వైవాహిక అత్యాచారానికి పాల్పడే పురుషుల్ని శిక్షించే సాహసం కేంద్ర ప్రభుత్వానికి ఎలాగూలేదు. పైగా, ఆ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ లో విచిత్ర వాదనలు చేశారు. ʹʹదాన్ని భార్య అత్యాచారంగా అనుకోవచ్చు. కానీ భర్తకు అది అత్యాచారంగా కనిపించకపోవచ్చు. ఇలాంటి చట్టాలను కనుక తీసుకుని వస్తే దేశంలో వివాహ వ్యవస్తే మొత్తంగా కూలిపోతుంది. భర్తల్ని వేధించడానికి భార్యల చేతికి ఆయుధాలను అందుబాటులో వుంచినట్టవుతుందిʹʹ అని అందులో పేర్కొన్నారు. ఇదే మాటను ముస్లిం సమాజం విషయంలో కేంద్రం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలనే కాదు, మతపక్షపాతాన్ని కూడా పాటిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు సమాజానికి ప్రమాదకరం కూడా.

భర్తల్ని హత్య చేసిన భార్యల కథనాలు ఇటీవలి కాలంలో ఒక పరంపరగా వెలుగులోనికి వస్తున్నారుు. మహబూబ్‌నగర్‌ స్వాతి, హైదరాబాద్‌ జ్యోతి, పద్మలు; గుంటూరు శ్రీవిద్య భర్తలను చంపిన భార్యలుగా మీడియాలో ప్రచారం పొందారు. తాము ఇన్‌స్టాంట్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పనప్పటికీ బయటికి వెళ్లిపోయే ఉద్దేశ్యంతోనే తమ మీద భార్యలు నిందలు వేస్తున్నారని ఆవేదన పడే ముస్లిం భర్తలు కూడా ఇప్పుడు లేకపోలేదు. భవిష్యత్తులో అలాంటివాళ్ల సంఖ్య పెరగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ముస్లిం భర్తల్ని జైళ్లకు పంపడానికీ, ముస్లిం భార్యల్ని రోడ్డున పడేయడానికీ కొత్త చట్టం సిద్ధం అరుుంది.
- అహ్మద్ మొహీయుద్దీన్ ఖాన్ యజ్డానీ (డానీ),
సీనియర్‌ పాత్రికేయులు

Keywords : narendra modi, bjp, central government, muslim women, triple talaq
(2024-04-24 20:48:27)



No. of visitors : 1355

Suggested Posts


ʹనేను ముస్లింను నన్ను కౌగలించుకోండిʹ....

ముంబై మహా నగరంలో గేట్ వే ఆఫ్ ఇండియాకు దగ్గరలో ఓ ఫుట్ పాత్ పై ఓ యువకుడు కళ్ళకు గంతలు కట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని పక్కన ఓ ప్లకార్డ్ ఉంది దానిపై ʹనేను ముస్లిం ను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్మేట్టయితే వచ్చి కౌగలించుకోండిʹ...

చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !

చిన్నారి ఆసిఫాపై అత్యాచారం, హత్య కేసులో బాధితుల పక్షాన కేసు వాదిస్తున్న అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్ కు బెదిరింపులు పెరిగి పోయాయి. కేసు వాదిస్తే ఆమెను కూడా రేప్ చేసి చంపుతాం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ...

Muslim child punished for refusing to sing Hindu prayer

Naushad Kashimjiʹs (name changed) school adopted a few Sanskrit shlokas as its official prayer for the morning assembly this academic year. Last week, when Kashimjiʹs principal caught him and a few other Muslim students for not singing the prayer, they were punished for it....

జై శ్రీరాం అనాలంటూ చితక్కొట్టారు..ఈ సంఘటను ఖండిచొద్దన్న అనుపమ్ ఖేర్ !

గురుగ్రాంలో నివాసముంటున్నబీహార్ కు చెందిన మహ్మద్ బార్కర్ అలామ్ సదార్ బజార్ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ మూక ఆయనను ఆపింది. తలపై టోపీ పెట్టుకోవడం ఇక్కడ నిషేధమని.. టోపీ తీసేయమని చెబుతూనే దాడి మొదలు పెట్టారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముస్లిం