జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

జైలు


ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని. ఎవరి దృష్టి నైనా ఇట్టే ఆకర్షించే చలాకీతనం. ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది. మోడల్స్ కష్టపడి ఎక్సర్ సైజులు చేసి సాధించే శరీరాకృతి, అవేమీ చేయకుండానే ఆమె సొంతం. కాబట్టి చాలా మంది మగ ఖైదీలు ఆమె కోర్టుకి ఎప్పుడు వెళ్ళేది శ్రద్ధగా వాకబు చేసి ఆమెని చూడడం కోసమే గేటుదగ్గర కాపు కాసేవారు. ఇదంతా నాకు కాలక్రమాన అర్థం అయ్యింది.
అయితే అందరిలా నా దృష్టికూడా ఆమె మీద తొందరగానే పడింది. బహుశా నేను ఝార్ఖండ్ లోని హజారీబాగ్ సెంట్రల్ జైల్ లో అడుగుపెట్టిన రెండోరోజో మూడో రోజో ఆమె నా దృష్టిలో పడింది. వంటికి అతుక్కుపోయిన పంజాబీ సూట్ లో జుట్టు వదిలేసుకొని చున్నీని భుజాలమీదుగా తెరచాపలా ఎగరేస్తూ ఆమె వెనుక ఆవరణలోకి గెంతుతూ .... ఊహూ....డాన్సు చేసుకొంటూ వస్తుండగా చూశాను. ఇరవై యేళ్లుండవచ్చు. లేదా ఒకటో రెండో ఎక్కువ కావచ్చు. చామన చాయ. ఆమె ముఖం యవ్వనంలో ఉండే ఒక ఆకర్షణతో వెలిగిపోతోంది. ఆ వయసులో ఉండే చీకూ చింతా లేని జీవితం కలిగించే ఒక తుళ్ళింత ఆమె లో ఉట్టి పడుతోంది. భూమికి ఒక అరడుగు ఎత్తులో ఎప్పుడూ తేలిపోతూ ఉండేది. ఒక్కోసారి శ్రద్ధగా మేకప్ వేసుకొనేది. గోళ్ళు పొడవుగా పెంచుకొని వాటికి రంగు వేసుకొనేది. మొత్తానికి ఆమెలో ఏదో విలక్షణత ఉంది. అది ఆమె రూపంలో కన్నా వ్యవహారంలోనే ఎక్కువ కనిపించేది. ప్రతిదానికీ నవ్వేది. మేము కొత్తగా కాలేజీలో అడుగుపెట్టిన కాలంలో సరిగ్గా అలాగే ప్రతిదానికీ ఇంకా చెప్పాలంటే అయినదానికీ కానిదానికీ నవ్వేవాళ్ళం. ఎందుకు నవ్వుతున్నామో మాకూ తెలియదు. అంత నవ్వెందు కొస్తుందసలు? అని ప్రతి వాళ్ళు చిరాకు పడేవాళ్ళు. అలా ఆమె నాకు నా టీనేజి రోజులు గుర్తుకుతెచ్చింది.
ఎవరా అమ్మాయి? అని కుతూహలం కొద్దీ నాతో పాటు ఉండే ఒక ఆదివాసీ అమ్మాయిని అడిగాను.
ʹనచినీʹ అన్న జవాబు నాకేమాత్రం అర్థం కాలేదు. ʹఅంటే?ʹ చాలా ఆశ్చర్యంగా అడిగాను. ఆమె బిత్తరపోయింది. ʹనచినీ అంటే......ʹఎలా చెప్పాలో ఆమెకూ అర్థం కానట్టుంది. చివరికి, ʹమేలా (జాతర) అవుతుంది కదా? అక్కడా, ఇంకా అలాంటి చోట్లా, సినిమా పాటలకి డాన్సులు చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. అదీ...! పల్లెల్లో నచినీ అంటారు. అంటే నాచినే వాలీʹ అంది.
ʹఅంటే అలాంటి వాళ్ళని కూడా అరెస్టు చేస్తారా?ʹ
ʹఏమో మరి! ఏం కేసో నాకూ తెలీదు.ʹ అంది.
మేము మున్నీ గురించి మాట్లాడుకొంటున్నామని అర్థం అయ్యిందో ఏమో కొంచెం దూరంలో కూర్చుని ఉన్న ఒకామే మా దగ్గరికి వచ్చి అడక్కుండానే రహస్యం చెప్తున్నట్టు అంది.
ʹఆ పిల్ల మర్డర్ కేసులో వచ్చింది. డబ్బున్న పిల్లోడ్ని వల్లో వేసుకొంది. వాడూ ఈమె కలిసి అతని పెళ్ళాన్ని చంపేశారు. పెళ్ళీ గిళ్ళీ ఏంకాలేదు. అయినా ఈ పిల్ల అతని పేరు మీదే సింధూరం పెట్టుకొంటుంది.ʹ అని సమాచారం చెప్పింది. ఆమె ఇంకా ఏదో మషాలాలు దట్టించి చెప్పబోయింది కానీ వద్దని వారించాను. ఆమె చాలా ఆశాభంగం చెందిందని ఆమె ముఖమే చెప్తోంది. ఆమె ఏదో అనేలోపు అక్కడికి రోబితా అనే ఒక ఖైదీ వచ్చింది. ఆమె ఒక బెంగాలీ. శిక్షపడి అంతకు రెండు మూడు రోజుల ముందే జిల్లా జైలు నుండి ఇక్కడికి వచ్చింది. ఆమె మేము కూర్చున్న దగ్గరికి వస్తూనే ʹఏంటి? నచినీ యా?ʹ అంటూ ఆ వివరాలు చెప్తున్న ఆమె దగ్గరికి వెళ్ళింది. మేము ఇంక అక్కడి నుండి లేచి వెళ్ళి పోయాము. ఆమె మున్నీ గురించి సమాచారం సేకరించగానే పోయి మున్నీ తో వెనుక ఆవరణలో ఏకాంతంగా చాలా సేపు మాట్లాడడం నా దృష్టిని దాటిపోలేదు.
మున్నీ మాత్రం ఏమీ పట్టించుకోకుండా అందరితోనూ కలిసిపోయేది. ఆమెకు ఇంజెక్షన్ చెయ్యడం, సెలైన్ పెట్టడం వచ్చు. కాబట్టి హాస్పిటల్ లో ఆమె సహాయం తీసుకొంటు ఉండేవాళ్ళు. ఉత్తరాలు రాసిపెట్టడం, ములాకాతీ పిటీషన్ లు రాయడం. పేపర్ చదివిపెట్టడం లాంటి పనులు కూడా చేసేది. ఇంటర్ దాకా చదువుకొందని తరవాత తెలిసింది. ఆమె ఇష్టంగా చేసే పని, బ్యూటీషియన్ పని. చాలా మంది ఖైదీలు కోర్టు కి వెళ్ళినప్పుడో, తమ కుటుంబ సభ్యులను కలవడానికి ములాకాతీ కి వెళ్ళినప్పుడో బాగా తయ్యారయ్యే వాళ్ళు. అలాంటి వాళ్ళకి హెయిర్ కట్ చెయ్యడం, రకరకాల హెయిర్ స్టైల్స్ చెయ్యడం, కనుబొమ్మలకి త్రెడింగ్ చేయడం, ఫేషియల్ వగైరాలు చేసేది. ఇది మాత్రం డబ్బులు తీసుకొనే చేసేది. వాటితోనే తన చిన్న చిన్న అవసరాలు తీర్చుకొనేది.
ఒకరోజు మున్నీ నా దగ్గరికి వచ్చి, ఇంగ్లీష్ నేర్పమని అడిగింది. రోజూ సాయంత్రం లాకప్ అయ్యాక ఒక గంట వస్తానని చెప్పింది. అలా రోజూ నా బిస్తర్ దగ్గరికి రావడం గంట ఎలాగో కానిచ్చి వెళ్ళడం అవుతోంది. ఒకరోజు క్లాసు అయ్యాక బాతాకానీ కొట్టి పోయింది. చాలా మందికి ఇంగ్లీష్ నేర్చేసుకొని గబ గబా మాట్లాడేయ్యాలని ఒక ఉత్సాహం ఉంటుంది. మొదలు పెట్టిన వారం రోజులకి ఇక నీరసం వచ్చేస్తది. ఇంక చాల్లే అనుకొంటారు. కష్టపడేందుకు సిద్ధపడరు. మున్నీ కూడా ఆ కోవకు చెందిందే. ఆమె ఇంగ్లీషు పాఠాలు అంతగా నడవకపోయినా ఆమె మాత్రం నా దగ్గరికి రావడం మానలేదు. అయితే ఆమె వ్యక్తిగత విషయాల గురించి నేనెప్పుడూ అడగలేదు, ఆమె చెప్పలేదు.
ఒకరోజు మాటల సందర్భంలో ʹనీకు బెయిల్ కోసం ప్రయత్నించే వాళ్ళెవ్వరూ లేరా?ʹ అని అడిగాను.
ʹనాకు బెయిల్ ఎప్పుడో వచ్చేసింది దీదీ. నేను అరెస్టు అయిన ఆరునెలల లోపే వచ్చింది. ఇంకా ష్యూరిటీలు నింపలేదు.ʹ
ʹఅదేంటీ? బెయిల్ ఎప్పుడొస్తుందా అని అందరు ఎదురు చూస్తుంటారు కదా. నువ్వు అరెస్టు అయ్యి యేడాదిన్నర అవుతుందన్నావుగా?ʹ చెప్పద్దూ నాకు చాలానే అశ్చర్యం వేసింది.
ʹఅతనికి బెయిల్ రిజెక్ట్ అయ్యింది, అందుకని నేను కూడా ఉండిపోయాను.ʹ
ఏం పాతివ్రత్యంరా నాయనా అని మనసులోనే నిట్టూర్చకుండా ఉండలేకపోయాను. ʹఅదేంటి? ఎందుకని?ʹ అని మాత్రం అడిగాను.
ʹఅతను కూడా రిలీజ్ అయితే అతనితో వెళ్లచ్చు కదా అని.ʹ
ఏంటో, అంతా డొంక తిరుగుడుగా నడుస్తోంది మా సంభాషణ అనిపించింది. అందుకే ఇక నేరుగా అడుగుదాం అనుకోని, ʹఅసలు ఆమె హత్య ఎలా జరిగింది?ʹ అన్నాను.
ఆమె పకపకా నవ్వింది. ʹఅయ్యో దీదీ మీకు తెలియదా? జైల్లో మన గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉంటాయి. అవన్నీ నిజం కాదు. ఇంతకీ ఆమె నెవ్వరూ హత్య చేయలేదు. ఆమెకు గుండె జబ్బు ఉంది. అందుకని హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది. మీరే ఆలోచించండి, హత్య కేసులో ఎవరికైనా ఒక ఆరు నెలలలోపు బెయిల్ వస్తుందా? అదీ కింది కోర్టు నుండి.ʹ అది మాత్రం నిజం. అప్పటికి నాకు అంతగా తెలియదు కానీ ఇప్పుడు కచ్చితంగా చెప్పగలను. రాదు! ముఖ్యంగా ఝార్ఖండ్ లో. మర్డర్ కేసుల్లో అయితే ఏ రాష్ట్రంలో అయినా జిల్లా కోర్టులు బెయిల్ మంజూరు చెయ్యవు. హైకోర్టు కి వెళ్ళ వలిసిందే.
ʹమరి మీ మీద కేసు? ఇంతకీ అతనూ, అతనూ అంటున్నావు కదా అతనెవరూ?ʹ అన్నాను.
ʹఅచ్ఛా! మీకు నా స్టోరీ మొత్తం చెప్తాను.ʹ అని ఆమె తన గురించి చెప్పడం మొదలు పెట్టింది. సాధారణంగా అక్కడ ఎవ్వరైనా మా ఊరు ఫలానా అనో దాదాపు అలాంటి వివరాలతో మొదలుపెడతారు. అయితే మున్నీ అందరిలాంటిది కాదు మరి. ఆమె ఎంత విలక్షణంగా ఉంటుందో అప్పటికే అర్థం అయినా కూడా ఆమె కథలోని ఓపెనింగ్ వాక్యం విని బిత్తర పోయాను.
ʹఅతను నా హీరో.ʹ
వార్నాయనో ఈ పిల్ల కలల్లో తప్ప జీవించదా? అనుకొనేశాను. ఎంత చెక్క మొహం వేసుకొని విందామని ప్రయత్నించినా నా ఫీలింగ్ కనపడిందేమో, ఆమె కూడా నవ్వింది.
ʹఅర్థం కాలేదా? నాకు డాన్సులంటే భలే ఇష్టం. ఏపాట వచ్చినా సరే వెంటనే ఆ స్టెప్స్ పట్టేస్తాను. అతను ప్రొడ్యూసర్. అంటే పాటల వీడియో ఆల్బమ్ లు చేస్తాడు. అతనే హీరో కూడా. మా జంట బాగా హిట్టయ్యింది. అతనికి నేనంటే చచ్చేంత ఇష్టం. నేనంటే చాలామంది మగవాళ్ళు పడి చచ్చేవాళ్ళు.ʹ ఈ మాట అంటున్నప్పుడు ఆమె మొహం లో ఎక్కడా గర్వం కనిపించలేదు. చాలా యధాలాపంగానే చెప్పింది.
బీహార్ లోనూ ఝార్ఖండ్ లోనూ ప్రస్తుతం ఇలాంటి ప్రైవేట్ వీడియో ఆల్బమ్స్ కి చాలా డిమాండ్ ఉన్నది, బస్సుల్లో కూడా సినిమాల బదులు ఇవే వేస్తుంటారు. అలాగే టీవీలో కూడా దూరదర్శన్ తో సహా విరామ సమయాలలో వీటినే వేస్తుంటారు.
ʹనా పేరు అతనితో ముడిపడ్డాక అలాంటి మగవాళ్ళందరికీ నా పట్ల మర్యాదగా ఉండక తప్పలేదు. లేకపోతే షూటింగ్ లు చేసేటప్పుడు, సెట్స్ మీదా, లొకేషన్స్ లోనూ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చి ఉండేది. అతనికి బాగా సన్నిహితులయిన వాళ్ళు నన్ను భాభీ అంటారు తెలుసా?ʹ తెగ మురిసిపోతూ చెప్పింది ఈ మాట.
ʹఅతను బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వాడు. వాళ్ళు యాదవులు. నేను రవిదాసు. (బీహార్, ఝార్ఖండ్ లలోని దళిత కులస్తులు) కాబట్టి మా వివాహాన్ని వాళ్ళింట్లో వొప్పుకోరు. మా ఇంట్లో కూడా వొప్పుకోరనుకోండి. ఇంట్లో అంటే మా అమ్మ నాన్న లేరు. మా అన్నయ్య ఉన్నాడు. పనీ పాటు చెయ్యడు. పైగా తాగుడు ఒకటి. చెల్లి ఉంది. తనని చదివిస్తున్నా. ఇల్లు నా సంపాదనతోనే గడవడం. కొన్నాళ్లు నర్సింగ్ హోమ్ లో పని చేశాను. చాలా తక్కువ డబ్బులు వచ్చేవి. పని చాలా ఎక్కువ. ఒక బ్యూటీ క్లినిక్ లో పని చేసి పని నేర్చుకొన్నాను. కానీ సొంతగా పెట్టుకొనేంత స్థోమత లేదు. ఎక్కడన్నా పని చేస్తే వచ్చే ఆదాయం సరిపోదు.ʹ
ఒకసారి అనుకోకుండా అవకాశం వచ్చి నేనిక ఈ ఆల్బమ్స్ చేసే పని ఎంచుకొన్న. ఆదాయం బాగానే ఉంటుంది. పైగా నాకిష్టమైన పని. ఎంచక్కా మేకప్ కూడా వేసుకోవచ్చు. నాకెంత ఇష్టమో! నా సంపాదన పెరిగాక మా అన్న తాగుడు కూడా పెరిగింది. మళ్ళీ నేనీ పని చెయ్యడమూ ఇష్టం లేదు. డబ్బులు ఆయనకి దొరక్కుండా ఎక్కడెక్కడో దాపెట్టాల్సి వచ్చేది. ఒక్కోసారి దొరక్కపోతే బాగా కొట్టేవాడు. నా డబ్బు కావాలి కానీ డాన్సు చెయ్యద్దు అంటాడు.ʹ
ఇదంతా చెప్తున్నప్పుడు కూడా ఆమె , ʹనాకు డాన్స్ అంటే ఎంతిష్టమోʹ అన్నప్పుడు ఎంత నవ్వుతూ చెప్పిందో ఈ కష్టాలన్నీ కూడా అంతే నవ్వుతూ చెప్పింది.
ʹఒకసారి మా అన్న విపరీతంగా కొట్టాడు. అంటే ఎప్పుడూ కొడతాడు కానీ, చేతులమీదో కాళ్ళమీదో తగిలితే మంచిగా మేకప్ వేసేసి దాపెట్టేసెదాన్ని. కానీ మొహం వాచిపోయింది. ఇంక షూటింగ్ ఏం చేస్తాం? అందుకని వెళ్లలేదు. వాళ్ళు విషయం తెలియక, నా వల్ల షూటింగ్ ఆగిపోయిందని తిట్టుకొంటుంటే అతను ఎలాగో నా గురించి వాకబు చేశాడు. ఆరోజు నా మొహం చూసి నువ్విక్కడ ఉండద్దు. పద! మనం రహస్యంగా పెళ్ళి చేసేసుకొందాం. నేనొక ఇల్లు తీసి పెడతాను. అక్కడ వుందువుగాని. తరవాత మెల్లగా చెప్పచ్చు అన్నాడు. అప్పటికే మాగురించి బాగానే పుకార్లు వచ్చాయి. మా అన్నకి అందులో బద్ నామ్ కనిపించింది. నాకేమో అతనిలో ఒక సహారా (అండ) కనిపించింది. అందుకే నేను కూడా బాగా ఆలోచించే సరే అని వొప్పుకొన్నా. ఇంక ఇద్దరం చిన్న ఇల్లు తీసుకొని, గుళ్ళో పెళ్ళి చేసుకొన్నాము. ఎవ్వరికీ చెప్పలేదు. నిజానికి నాకు పెళ్ళయితే మా అన్నకి సంపాదన పోతుందని భయం తప్ప మరేమీ లేదు.ʹ
ʹమరి అతనికి అప్పటికే పెళ్లయ్యిందేమో కదా?ʹ
ʹఅప్పటికి ఆ విషయం నాకూ తెలియదు. మొత్తానికి మా సంసారం మొదలయ్యింది. ఇంట్లో చెప్పలేదు కదా అని అతను ఆలస్యంగానైనా ఇంటికి వెళ్లిపోయేవాడు. చివరికి ఇలా ఎంత కాలం అని వాళ్ళింటికి తీసుకెళ్ళమని చెప్పాను. కనీసం పరిచయం అవుతారు కదా. పెళ్ళయ్యింది అని అప్పుడే చెప్పకున్నా తనతో పాటు పని చేస్తున్న అనైనా చెప్పచ్చు కదా అని. ఇక తప్పనిసరి అయ్యి ఒకరోజు తీసుకువెళ్ళాడు. అప్పుడే తెలిసింది అతనికి పెళ్లయ్యిందని, ఒక పాప ఉందని. నేను అక్కడేమీ గొడవ చేయలేదు. అయినా వాళ్ళు నానా మాటలు అన్నారు. నేనతన్ని వల్లో వేసుకొంటున్నాననీ, ఏవేవో. తరవాత ఇంటికి వచ్చాక కాళ్ళు పట్టుకొన్నాడు. ఆమెకు గుండెజబ్బుందని. ఏమాత్రం సుఖం లేదని, నేను లేకపోతే చచ్చిపోతానని అదనీ, ఇదనీ ఏడ్చాడు.ʹ
ʹమరి ఇదంతా నిన్ను మోసం చెయ్యడం కదా. అతను అలా నిజాయితీ లేకుండా ప్రవర్తిస్తే నువ్వెలా అతన్నే నమ్ముకొంటున్నావు?ʹ
మళ్ళీ అదే నవ్వు. ʹఅయ్యో దీదీ ఎలాగూ దెబ్బలు తప్పవు అనుకొన్నప్పుడు తక్కువ నొప్పి కలిగించే దెబ్బ తినడం నయం కదా. ఇప్పుడు అతన్ని వదిలేసి నేను సాధించేదేముంది. గద్దల్లా వచ్చి వాలడానికి అనేక మంది సిధ్ధంగా ఉన్నారు. ఇప్పటికైతే నా మీద ఈగ వాలదు. జైలు నుండి విడుదలయ్యాక చూద్దాం. తరవాత నా...ʹ అంటూ వాక్యం సగంలోనే ఆపి బొటనవేలు నుదిటి మీద అడ్డంగా ʹతలరాతʹ అనే అర్థం వచ్చేటట్టు గీసుకొంది.
ʹనాగురించి ఆమెకు అనుమానం మొదలయ్యింది కనక ఇంక వాళ్ళిద్దరికీ మధ్యలో బాగా గొడవలవుతుండేవి. అట్లే ఒకరోజు ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకుపోయేసరికి చనిపోయిందన్నారు. ఆమె పుట్టింటి వాళ్ళు మేమిద్దరం కలిసి చంపేశామని కేసుపెట్టారు. మొదలు అతని ఇంటివాళ్ళు నాకు బెయిల్ వెయ్యడానికి వొప్పుకోలేదు. కానీ అతను తన వకాలత్ నామ మీద సంతకం పెట్టనని గొడవ చేస్తే అప్పుడు ఇంక ఇద్దరికీ వేశారు. నాకు బెయిల్ వచ్చింది కానీ అతనికి రాలేదు. అయితే అతనికి రాకుండా నేను ఒక్కదాన్నే బయటికి పోదలుచుకోలేదు.ʹ
ʹఅంటే అతని కుటుంబం నుంచి ప్రమాదం ఉండచ్చనా?ʹ
ʹఅదొక్కటే అయితే ఒకతీరు. అసలు సమస్య అదికాదు. అదికూడా వుండొచ్చు. దానికన్న నేను అరెస్టు అయ్యి స్టేషన్ లో ఉన్నప్పుడు నలుగురు అబ్బాయిలు వచ్చారు. నాకు కొద్దిగా పరిచయం ఉన్నవాళ్ళే. ఎస్. ఐ తో ఏం మాట్లాడారో, డబ్బులిచ్చారో తెలియదు కానీ, నాతో విడిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. దానికి నేను వొప్పుకొంటే ఆ క్షణంలో డబ్బు ఖర్చుపెట్టి నన్ను విడిపించుకు పోతామన్నారు. తలొక లక్ష వేసుకొని ఇప్పటికిప్పుడే విడిపిస్తామన్నారు.ʹ అంతవరకూ చెప్పి ఆగింది ఆమె.
ప్రతిపాదన ఏమయ్యి ఉంటుందో తెలియదు కానీ, ఎలాంటిదయి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు.
ఆమె అలా నవ్వుతూనే మాట్లాడుతోందింకా.
ʹఒక ఫ్లాట్ తీసుకొని నన్ను ఉంచుతారట. వాళ్ళు నలుగురూ రోజుకొకరు చొప్పున నాతో ఇంట్లో ఉంటారట. వెధవల్ని నలుగుర్నీ ఒకేరోజు రమ్మనాల్సింది ఒకరినొకరు పొడుచుకొని చచ్చి ఉండేవాళ్ళు.ʹ అని విరగబడి నవ్వింది.
ʹకాబట్టి బయటికి వెళ్తే అన్నిటికన్నా పెద ప్రమాదం వాళ్ళూ. వాళ్ళే కాక ఇంకా ఎవరినైనా తీసుకొచ్చినా చెయ్యగలిగేది ఏమీ ఉండదు. ఇంకా అతని ఫేమిలీ..... వాళ్ళ పెద్దన్న ఏ కిరాయి మనుషులతో నైనా నన్ను చంపించేసినా, లేదా ఎవరికైనా అమ్మేసినా ఆశ్చర్యం లేదు. ఇంక చావో రేవో అతనితోనే.ʹ
ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ వుండే పిల్ల ఎన్ని కష్టాల వలయంలో ఉంది? అనిపించింది. ఆదేమాట తనతో అన్నాను.
ʹఅయ్యో, నా కష్టాలు బయటే ఆగిపోలేదు. జైల్లోకి వచ్చినప్పుడు కూడా నేను తక్కువ కష్టాలు పడలేదు. నలుగురు మహిళలు బాగా రుబాబ్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు నా గురించి చాలా నీచంగా మాట్లాడేవాళ్ళు. నేను వ్యభిచారిననీ, అదే కేసులో వచ్చి మర్డర్ కేసని అబధ్ధం చెప్తున్నానని, నేనే అతని భార్యని గొంతు నులిమి హత్య చేశానని, పదే, పదే అనడం. బూతులు తిట్టడం. నేను గట్టిగా ఎదిరించి మాట్లాడేసరికి ఒకసారి నన్ను వాళ్ళు నలుగురూ కలిసి బాగా కొట్టారు. ఒక్కదాన్నే ఎదుర్కొన్నాను. నేనూ కొట్టాను. సహించి ఊరుకొంటే మళ్ళీ మళ్ళీ ఎదురు కావచ్చు. అందుకే ఏం చేశానో తెలుసా? .....ʹ
ఏం చేసిందో చెప్పకుండానే పడీ పడీ నవ్వసాగింది. కడుపు పట్టుకొని బిస్తర్ మీద పడి పోయి నవ్వింది. తరవాత నవ్వాపుకోడానికన్నట్టు రెండు చేతులతో గట్టిగా నోరుమూసుకొని మళ్ళీ భళ్లున నవ్వింది. నేను వోపిగ్గా ఎదురుచూసి ఇంక అలిగినట్టు మొహం పెట్టాక.... ʹసారీ,సారీ చెప్తా!ʹ అని మొదలుపెట్టింది.
ʹమరునాడు పొద్దున్న జమ్మెదార్ ని అడిగి ఒక కాగితం తెప్పించుకొన్నా. కూర్చుని రాయడం మొదలుపెట్టాను. నేనేం రాస్తున్నానో అని అందరికీ అనుమానం. పైన మాత్రం జిల్లా న్యాయాధీష్ మహోదయ్ అని మొదలుపెట్టాను. ఇంక వాళ్ళు నలుగురికి అనుమానంగా ఉండే కానీ, నన్నైతే అడగలేరు. చివరికి జమ్మెదారిణీ ని బతిమాలుకొన్నట్టున్నారు. ఇంతకీ ఏంటంటే వాళ్ళు ఎవ్వరికీ చదువు రాదు. జమ్మెదారిణీ కూడా అంతంత మాత్రమే. అయినా ఆమె వచ్చి ఏమిటో రాస్తున్నావు అంటే.... వాళ్ళ నాలుగురిమీదా ఫిర్యాదు చేస్తున్న,మళ్ళీ వాళ్ళకి చెప్పద్దు అనిచెప్పాను.ʹ
ʹఇందులో అంత నవ్వాల్సిందేం ఉందీ!ʹ అన్నా.
ʹఅయ్యో! నాకసలు కోర్టుకి పిటీషన్ ఎట్లా రాయాలో తెలిస్తే కదా. అసలు అట్లా ఫిర్యాదు చెయ్యచ్చో లేదో కూడా తెలియదు. వట్టిగే అట్లా మొదలు పెట్టి నటిస్తాఉన్నా. చెప్పద్దు అన్నామంటే వాళ్ళు తప్పక చెప్తారు. అదే మనకి కావాల్సింది. నేను ఊహించినట్టే వాళ్ళు రాజీకి వచ్చారు. కొంచెం బెట్టు చేసి తరవాత కాగితం చింపేశాను. అంతే....!ʹ
ఆమె సమయస్పూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
ʹమరి అతనికి శిక్ష పడితే?ʹ
ʹఅతనికి శిక్ష పడే అవకాశాలు అయితే ఎక్కువే. కానీ వాళ్ళు అంతవరకూ రానివ్వరు. విచారణ మొదలు కాలేదు ఎలాగూ. మొదలయ్యేలోపే వాళ్ళూ అవతలి పార్టీతో రాజీ చేసుకొంటారు. నిజానికి ఈ పని ఎప్పుడో అయిపోయేది. వాళ్ళ కుటుంబం వాళ్ళు నన్ను వదిలేస్తానని మాటిస్తేనే రాజీ ప్రయత్నాలు చేస్తామంటున్నారట. ఇతను వొప్పుకోలేదు కనక ఇంకా జైల్లో ఉన్నాడు.ʹ
ʹదీదీ! ఒకవేళ ఇద్దరం విడుదల అవుతాం అనుకో నీ సలహా ఏమిటీ? నేను ఏం చేస్తే బాగుంటుంది?ʹ
ʹఇంకేముంటుంది? మీరు గతంలో చేసుకొన్న పెళ్ళి ఎలాగూ చెల్లదు. సాక్షులెవరూ లేరు. పైగా అతని భార్య అప్పటికి జీవించేవుంది. కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళగానే రిజిస్టర్ పెళ్ళి చేసుకొందామని పట్టుబట్టు. పెళ్ళి చేసుకో. నీ కాళ్ళమీద నువ్వు నిలబడు. నీకు బోలెడు పనులు వచ్చు. ఏవో ఒకటి చెయ్యి. కానీ ఈ ఆల్బమ్స్ పని నువ్వు ఎక్కువ కాలం చెయ్యలేవు. అతనే కొత్త హీరోయిన్ కావాలనుకోవచ్చు. మోజు తగ్గాక ఏం చేస్తాడో చెప్పలేం. అతను తన భార్యని మోసగించాడు. ఎన్ని చెప్పినా అతని భార్య చావుకి అయితే అతను తప్పక బాధ్యుడు. నువ్వు ఆ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. ముఖ్యంగా ఆర్థికంగా ప్రతిదానికీ అతని మీద ఆధారపడకు. నర్సు పనో, లేదా బ్యూటీ క్లినిక్ పెట్టుకోవడమో ఏదో ఒకటి చెయ్యి. అప్పుడు ఏదన్నా సమస్య వచ్చినా నీకు ఎక్కువ ఇబ్బంది ఉండదు. కనీసం పెళ్ళికి రిజిస్ట్రేషన్ ఉంటే ఒకసారి జైలుకి వచ్చాడు కనక అప్పుడు నీ విషయంలో నైనా మోసం చెయ్యడానికి పది సార్లు ఆలోచిస్తాడు.ʹ
ఆమె అకస్మాత్తుగా గంభీరంగా అయిపోయి నా రెండు చేతులూ పట్టుకొని ʹనీ మనసు చాలా మంచిది దీదీ.ʹ అన్నది. మొదటి సారిగా ఆమె కళ్ళలో లీలగా తడి మెరిసింది. ఇప్పుడామె నవ్వడం లేదు.
నాకేం అర్థం కాలేదు. ఎందుకంత భావోద్వేగం కలిగిందామెకు అని ఆశ్చర్యపోయాను. నా ఆశ్చర్యం గుర్తించి, చెప్తాను అనబోయింది కానీ. గొంతు గాద్గదికంగా అయిపోయింది. దానిని దగ్గు వెనుక దాచేసి, గబుక్కున నవ్వేసింది. అయినా ఒక కంటి నుండి బుగ్గమీదకు సగం వరకు ఒక కన్నీటి చుక్క జారిపడింది. జుట్టు వెనక్కి తోసుకొంటూ దానిని రెప్పపాటులో తుడిచేసింది. నేను కూడా గమనించనట్టే ఊరుకొన్నాను. మంచినీళ్ళ సీసా తీసి నేను ఒక గుక్క తాగి, యధాలాపంగా అందించాను. తాను ఒక గుక్క తాగి, గలగల నవ్వేసి అంతకు కొన్ని క్షణాల ముందు ఉన్న మున్నీ ఆమెనేనా కాదా అని నాకే అనుమానం వచ్చేలా ఉత్సాహంగా మాట్లాడడం మొదలుపెట్టింది.
ʹరోబితా తెల్సుగా?ʹ
ʹఆ బెంగాలీ ఆమెనేనా? తెలుసు.ʹ ఆమె నేను వచ్చిన తెల్లారే పరిచయం అయ్యింది. మహా చిరాకు కలిగించే మనిషి. చదువుకొన్న ఆమె. ఫ్రాడ్ కేసులో శిక్షపడి జిల్లా జైలు నుండి సెంట్రల్ జైలు కి వచ్చింది. ఆమే వచ్చి పరిచయం చేసుకొంటూ మీరు బ్యాంకు లో పనిచేశారట కదా అన్నది. బహుశా పేపర్ లో చూసినట్టుంది.
అవును అనగానే నేను కూడా బ్యాంక్ లోనే పనిచేస్తాను. అన్నది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేంటి మీరు ఎన్.జీ.వోలో పని చేస్తారట కదా అన్నాను. అవును అందులో కూడా చేస్తాను. అన్నది. ఇంతకీ ఆ ఎన్.జీ.వో ఫండ్స్ తినేసిందన్న ఆరోపణలోనే ఆమెకు శిక్ష పడింది. ఆ తరవాత యధాలాపంగా ఆమె బ్యాంకు ఉద్యోగం గురించి నేను అడిగిన ప్రశ్నలకి చాలా ధైర్యంగానూ అలవోకగానూ చెప్పిన అబధ్ధాలు విని ఆమె ఏ బ్యాంకులోను ఉద్యోగం చేసి ఉండదని తేలిగ్గానే అర్థం అయ్యింది. మొదలు నవ్వొచ్చింది. తర్వాత జాలి కలిగింది. చాలా తొందరలోనే ఆమె అతిశయం చూస్తే చికాకు గలిగింది.
ʹమీరు గమనించారో లేదో కానీ, ఆమె వచ్చిన వెంటనే ఒకరోజు నన్ను వెనకవైపు ఆవరణలోకి తీసుకుపోయి చాలా సేపు మాట్లాడింది. అదీ మొదటి పరిచయంలోనే. నాగురించి వివరాలు అడిగింది. మీకు చెప్పినంత వివరంగా కాకపోయినా చాలా వరకూ చెప్పాను. ఆమె ఏమందో తెలుసా? అతన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతావు? వదిలెయ్యి. వయసులో ఉన్నావ్. తర్వాత ఈ అందం ఆకర్షణా ఉండవు. ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. నువ్వు ఊ అను. నీ ష్యూరిటీలు నేను నింపిస్తాను. నాతో చేయి కలుపు, దేనికీ లోటుండదు. నాకు కొందరు బాగా డబ్బున్న స్నేహితులున్నారు. వాళ్ళకి టూర్లు పోవడానికీ, సరదాగా గడపడానికీ కంపెనీ కావాలి. అది నువ్విస్తావనుకో! ఒక్కరోజులో యాభైవేలు సంపాదించవచ్చు. హాయిగా బతకొచ్చు అంది.ʹ
ఈమె ఏం జవాబు చెప్పిందో అని ఆతృత పడ్డాను. బహుశా అది గమనించిందేమో, వెంటనే ఏం చెప్పకుండా చిద్విలాసంగా కూర్చుంది. ʹనీ సస్పెన్సు చాలుగానీ ఇంక చెప్పు. అనేశాను. కానీ అలా అనకుండా వోపికపట్టాల్సింది అనిపించింది.
ʹఅతన్ని వదిలేయడం ఎందుకు. అతను అలా ఉంటాడు పక్కన. అతన్నలా ఉంచి కూడా మేనేజ్ చెయ్యగలనులే అని కన్నుగీటాను.ʹ అంటూ పకపక లాడుతూనే ఉంది.
నేను అయోమయంగా చూశాను. ʹహా! దీదీ. నేను నిజంగానే అలా చెప్పాను. అలాంటి వాళ్ళకి అదే సరైన జవాబు. లేకపోతే ఆమె విడుదలయ్యేవరకు నన్ను దారికి తేవాలని తల తింటుంది. సరే అనేశాం అనుకో మనశ్శాంతి. నిజంగా అలా చేయదల్చుకొంటే, నేను జైలుకి వస్తానా? వచ్చినా ఇన్నాళ్ళు ఉండేదాన్నా? కానీ అలాంటివాళ్లకి అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఆమె పెద్ద పతివ్రతలా ఫోజు పెడుతుంది. నేనేమో అందరి దృష్టిలో తిరుగుబోతుని.ʹ
అప్పటివరకూ మా పక్క బిస్తర్ మీద గుర్రుపెట్టి నిద్రపోతున్న ముసలామె లేచి, ఎవరినే పిల్లా తిరుగుబోతంటున్నావ్? అని వాకబు చేసింది.
నేనేలే ముసల్దానా! నీ ముసలోడిని ఎగరేసుకుపోతా... అంటూ లేచి ʹమున్నీ బద్ నామ్ హుయీ డార్లింగ్ తేరే..... లియే......ʹఅని డ్యాన్సు చేసుకొంటూ బిస్తర్ లను దాటుకొంటూ తన చోటులోకి వెళ్ళిపోయింది.
- బి. అనూరాధ
***

Keywords : jharkhand, maoist, story, anuradha
(2024-04-24 20:50:30)



No. of visitors : 1980

Suggested Posts


జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు.

చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా.

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు: లాఠీ బుడియా - -బి. అనూరాధ.

ʹఏయ్ మేడం! ఇధర్ ఆవ్!ʹ ఆ గొంతు కంచులా ఖంగున మోగింది. ఆ కంఠంలో పలికిన అథార్టీ, మైకు అక్కర్లేనంత బిగ్గరగా పలికిన ఆ స్వరం విన్నాక – ఆ కంఠం కలిగిన మనిషిని చూసి బిత్తర పోయాను. ఆ స్వరానికీ, ఆ మనిషికీ ఏం సంబంధం లేదు. ʹఒక్క నిమిషం ఇలా రా!ʹ నన్ను చూస్తూ చేతిలో లాఠీని తాటిస్తూ పిలిచింది

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జైలు