జైలు కథలు: లాఠీ బుడియా - -బి. అనూరాధ.


జైలు కథలు: లాఠీ బుడియా - -బి. అనూరాధ.

జైలు

లాఠీ బుడియా
-బి. అనూరాధ.
ʹఏయ్ మేడం! ఇధర్ ఆవ్!ʹ
ఆ గొంతు కంచులా ఖంగున మోగింది. ఆ కంఠంలో పలికిన అథార్టీ, మైకు అక్కర్లేనంత బిగ్గరగా పలికిన ఆ స్వరం విన్నాక – ఆ కంఠం కలిగిన మనిషిని చూసి బిత్తర పోయాను. ఆ స్వరానికీ, ఆ మనిషికీ ఏం సంబంధం లేదు. ʹఒక్క నిమిషం ఇలా రా!ʹ నన్ను చూస్తూ చేతిలో లాఠీని తాటిస్తూ పిలిచింది కనక ఇక సందేహం కూడా ఏమీలేదు. నన్ను పిలిచింది ఆమే! వయసుభారంతో వంగిపోయిన నడుము. చిన్నగా కత్తిరించిన జుట్టు కి మాత్రం ఇంకా పూర్తి వృద్ధాప్యం రాలేదు. సగం మాత్రమే నెరిసింది. మోకాళ్ళదాకా కట్టుకొన్న చీర, పీక్కుపోయిన చెంపలు, లోతుకుపోయిన కళ్ళూ. పక్కనే పాత గుడ్డలతో సగం కుట్టిన సంచి.
ఓహ్! బహుశా సూదిలో దారం ఎక్కించడానికి కావచ్చు. దీనికైతే ఇంకెవరినైనా పిలుచుకోవాల్సిందే. ఈ మధ్య నేను ఒక రోజు సూదిలో దారం ఎక్కించలేక పోయాను. రీడింగ్ గ్లాసెస్ తీసుకోవాలి. ఒక్క క్షణంలో నా లోపల కలిగిన ఇన్ని ఆలోచనల్ని చెల్లా చెదురు చేస్తూ, ʹఈరోజు ఏం తేదీ?ʹ అన్నదామె.
ʹఇరవైమూడుʹ అన్నాను. ఆమె సాలోచనగా చూసి ʹచబ్బీస్ జనవరిʹ ఇంకా ఎన్ని రోజులుంది?ʹ అని అడిగింది. ʹరెండు నెలలుʹ అన్నాను. ʹరెండు నెలలా? ఆమె భారంగా నిట్టూర్చింది. ʹఈరోజు పేపరు వచ్చిందా!ʹ
ʹఆ వచ్చింది.ʹ ʹ నా గురించి ఏమన్నా రాసారా? ʹ ఆరా తీసింది. నాకు కొంచెం నవ్వూ దానితో పాటు జాలి కలిగాయి. ఆమె గురించి పేపర్లో ఏం వచ్చే అవకాశం వుంది? ʹఏం రాలేదుʹ అన్నాను.
ʹఈ దొంగ పిల్లలు నన్ను ఆట పట్టిస్తున్నారు, చూడు! రానీ కాళ్ళు విరగ్గొడతాను. అయినా నువ్వు పేపరు జాగ్రత్తగా చూడు. చబ్బీస్ జనవరికి నేను విడుదలయిత, పేపర్ల ఇస్తరు. నీకు అంగ్రేజి కూడా వస్తదంట కదా? అంగ్రేజి పేపర్ల కూడా జూడాలే!ʹ అన్నది. అప్పటికి నా బుర్ర వెలిగింది. చబ్బీస్ జనవరి అంటే ʹరిపబ్లిక్ డేʹ సందర్భంగా సాధారణంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల జేస్తుంటారు కనక ఆ విషయం అడుగుతుందని అర్థం అయ్యింది.
ʹఅద్సరే కానీ చాచీ (పిన్ని)నేను నీ బిడ్డలాంటి దాన్ని. నేను కూడా నీలాంటి ఖైదీ నే. నన్ను మేడమ్ అంటున్నవెందుకు? బేటీ అను.ʹ ఆమె బోసి నోటి తో గలా గలా నవ్వింది.
ʹమాయమ్మే! దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నువ్వు జల్ది ఇంటికి పోతావు. మీ ఆయన నిన్ను ముద్దులాడతాడు!ʹ అంటూ నాబుగ్గలు పుణికింది. అప్పటికే ఆమెని అల్లరి పట్టించిన ఆడపిల్లలు గుమికూడి .....పకపక నవ్వారు. నాకు భలే సిగ్గనిపించింది.
ʹముసల్ది చూడు! రంగీలా! అన్నీ అట్లాంటి దీవెనలే ఇస్తుంటది.ʹ అంది నవ్వుతూ రేష్మి. ముసలామె మెల్లగా ఏదో పాటందుకొని పక్కనున్న సగం కుట్టిన సంచి తీసి చక్కగా సూదిలో దారం సునాయాసంగా ఎక్కించి కుట్టుపని మొదలుపెట్టడం చూసి నోరెళ్ళబెట్టాను.
అలా మొదలయ్యింది ఆమెతో నా పరిచయం. ఆమెను పేరుపెట్టి ఎవ్వరూ పిలవరు. అందరూ లాఠీ బుడియా అనే అంటారు. మాట్లాడేటప్పుడు మాత్రం నాలాంటి కొందరు చాచీ అంటారు. ఆమె మాత్రం నన్ను ʹమేడమ్ బేటీʹ అని పిలవడం మొదలు పెట్టింది. ఎంత చెప్పినా మేడమ్ పదాన్ని వదిలిపెట్టదు.
ఆమె ప్రతిరోజూ ఉదయం లాకప్ తెరిచాక సంచిలో ఏవేవో సామాన్లు పెట్టుకొని కుట్టుపని బట్టలు తీస్కుని కర్ర (లాఠీ) పోటెసుకొంటూపోయి మహిళా బ్యారక్ లో ఒకటో నంబర్ వార్డు పక్కనే వున్న పిల్లల స్కూల్ వరండా మీదకి చేరేది. ఇక సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటుంది. స్కూల్ వెనుకనే వున్న వేప చెట్టుకింద పాత ఖైదీలెవరో పరిచిన బండల మీద కూర్చుని స్నానపానాదులు ముగించుకొని అక్కడే ఉతికిన బట్టలు ఆరబెట్టుకుంటుంది.
ప్రతి రోజూ నేను స్కూల్ వైపు పోయినప్పుడు ఆమె నన్ను తారీకు, చబ్బిస్ జనవరి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అనే విషయం అడుగుతూనే వుండేది. అది రానూ వచ్చింది. పోనూ పోయింది. ఆమె చాలా నిరాశ పడింది. మళ్ళీ పంద్రాగస్టు కోసం ఎదురుచూపులు.
*** *** ***
ఆదివారం జైల్లో చాలా ప్రత్యేకమైన రోజు. ఆరోజున మహిళా మూలాకాతీ జరుగుతుంది. మహిళా ఖైదీలు తమ కుటుంబ సభ్యులను కలిసే కార్యక్రమం. మధ్యాహ్నం రెండు తరవాత ఒక అరగంట సేపు అందర్నీ జైలు కార్యాలయం ముందున్న వరండా లో కలుసుకోనిస్తారు. ఇక్కడ దాదాపు 85% మంది మహిళలకు ఎవరో ఒక కుటుంబ సభ్యులు వున్న వాళ్ళే. కాబట్టి ఆ కార్యక్రమం అంతా ఏదో ఒక జాతరకు పోతున్నట్టే వుంటుంది. జైల్లో మంట నిషిద్దం. కాబట్టి వంట కూడా నిషిద్దమే. ఆ ఒక్కరోజు అన్ని నియమాలను ఉల్లంఘించి మహిళలు ఏదో ఒకటి తమ వాళ్ళకోసం చేస్తుంటారు. మహిళలలో వుండే సృజనాత్మకత బయటపడేదంతా ఇక్కడే.
ఉదయం నాస్తా కోసం ఇచ్చే నాన బెట్టిన శనగలను రోజూ ఎండబెట్టి ఉంచుతారు. శనివారం రాత్రి వాటిని మళ్ళీ నానబోసి ఉదయాన్నే గచ్చు కడిగి రాయితో నూరుతారు. దానిలోనే జైల్లో ఎవరోవొకరు నాటిన పచ్చిమిరపకాయలు తెంపి, వారం,వారం ఇచ్చే కొంచెం ఆవనూనెని దాచిపెట్టి ఆ ఇంతలోనే పకోడీలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అన్నం తినడానికిచ్చే జర్మన్ సిల్వర్ పళ్ళెలే మూకుళ్ళు. మూడు రాళ్ళ పొయ్యి కింద కాదేదీ మంట పెట్టడానికనర్హం అన్నట్టు కాగితాలు, ఎండుటాకులు, పళ్ళుదోమ్ పుల్లలు, ఖాళీ సెలైన్ బాటిల్స్ ఇలా ఏవి దొరికితే అవి పొయ్యికిందకి చేరుకొంటాయి.
అలా పకోడీలు చేసిన వాళ్ళెవరైనా లాఠీ బుడియాకి కూడాఓ రెండు ఇస్తుంటారు. లేదా తానే ఎవరినైనా అడుగుతుంటుంది. అవి జాగ్రత్తగా ఆకులో చుట్టి, చీర చెంగు అంచున మూట కడుతుంది. ఇక పదిసార్లు కేకలేసి టైమ్ అడుగుతా వుంటుంది. జోరు జోరుగా పాటలు పాడుతుంది. అందరికన్నా ముందెళ్ళి గేటు దగ్గర కూర్చుంటుంది.
మూలాకాతీ కోసం గేటు గంట మోగించగానే పేర్లు పిలిచే కార్యక్రమం మొదలుపెట్టక ముందే బయటకు తోసుకొని వెళ్ళిపోతుంది. మెల్లగా కర్ర పోటేసుకొంటూ మెయిన్ గేట్ వైపు నడక మొదలు పెడుతుంది. పూర్తిగా నడుం వంగిపోయిందేమో మెల్లగా నడుస్తుంది. దాదాపు 85 మంది పేర్లు, వాళ్ళు కలవాల్సిన వాళ్ళపేర్లు పిలిచేసరికి ఆమె గేటు దగ్గరికి చేరుకొంటుంది. ముసలాయన, ఆమె కొడుకు ఆ టైంకు చేరుకొంటారు. కొడుకు అయిదు నిమిషాలు మాట్లాడి క్యాంటీన్ నుండి కొనుక్కొచ్చిన రెండు జిలేబీలో,మిఠాయిలో ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముసలావిడా, ముసలాయన కూర్చుని బోసినవ్వులతో ముచ్చట్లు పెట్టుకొనేవారు. వాళ్ళ అన్యోన్య దాపంత్యం ఖైదీలతో పాటు, జైలు సిబ్బందికీ ముచ్చటే. కొన్నాళ్ళకి తాను అంత దూరం వెళ్ళలేనని పైగా ఆ గుంపులో ఒకరిమాట ఒకరికి వినపడక తామిద్దరూ మాట్లాడుకోలేకపోతున్నామని చెప్పి లాఠీ బుడియా సరిగ్గా మధ్య దారిలో వున్న చెట్టుకింద కట్టిన గట్టు మీదనే కూర్చుని మాట్లాడుతానని మొండికేసింది. హెడ్ వార్డర్ కోప్పడుతాడని సిపాయి నసిగితే నాలుగు చీవాట్లు పెట్టింది.
ʹఇంటికి పంపెయ్యరాదు? మంచిగా ఇంట్లనే ముచ్చట్లు పెడతా!ʹ అన్నది.
ʹఆ.....ఇగ నిన్ను ఇంటికి పంపే ʹపవరుʹ నాకే ఉన్నది మల్లʹ వెటకారమాడాడు సిపాయి.
ʹపవరు లేదు కదా! మల్ల నోరు మూసుకొని ఉండరాదు? ʹపవరున్నోన్నిʹ పంపియ్యి. ఆని తోనే కొట్లాడుతా.ʹ అన్నది. ఆమె కొట్లాడాల్సి వస్తే ఎవ్వరికీ జంకేది కాదు. ఎదుట వున్న వాల్లెవరైనా సరే జైలర్ గాని, సూపరింటెండెంట్ కానీ, తనిఖీలకి వచ్చే జడ్జి లను గాని తనని ఇంటికి పంపాలని డిమాండ్ చేసేది. అయితే వాళ్ళంతా అది తమ పరిధిలో లేదనే వాళ్ళు. ఎవరినడిగినా ఆమె ʹబర్కరార్ʹ అయ్యిందనే వాళ్ళు. అంటే ఏమిటో సరిగ్గా ఎవ్వరికీ తెలియదు. భాషా సమస్య వల్ల నాకు అర్థం కాలేదు. చివరికి, చదువుకొన్న సునీత ని అడిగాను. ఆమెకూ, ఆమె భర్తకూ, కొడుకుకు కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. హైకోర్టుకు అప్పీల్ చేస్తే అక్కడ కూడా శిక్ష ʹఖరారుʹ అయ్యింది. అదే బర్కరార్ అవ్వడం అంటేనని చెప్పింది. అంటే ఆమెనిప్పుడు కేవలం సుప్రీం కోర్టు మాత్రమే విడుదల చెయ్యగలదు.
ఒకరోజు లాఠీ బుడియా నన్ను కూర్చోబెట్టి తననెలాగైనా విడుదల చెయ్యించమని వేడుకొన్నది. ʹమేడమ్ బేటీ! నువ్వు చాలా మందికి సాయం చేశావు. నువ్వొక మాట చెప్తే అయిపోతది. ముసల్దాన్ని నా మీద దయుంచు.ʹ అన్నది. నాకు ఆమె అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నేను రాజకీయ ఖైదీనే కానీ వకీలునైనా కాను. కనీసం చట్టం తెలిసిన మనిషినైనా కాక పోతిని. ఒకవేళ తెలిసినా చేయగలిగిందేమీ వుంది? అర్జీలు రాయడం తప్ప.
ఆమె నాతో ఇలా చెప్తుంటే అక్కడే కూర్చున్న రింకూ ʹముసలాయనా ఇక్కడే వున్నాడు. నీ కొడుకూ ఇక్కడే వున్నాడు. ఇంటికి పోయి ఏంచేస్తావ్? ʹ అంది.
ʹ నాకు ఇంకా బిడ్డల్లేరా? మనుమలు, మనుమరాండ్రు లేరా? ఆళ్ళందర్నీ కళ్ళారా జూసుకోవాలే. ఆళ్ళ మధ్యనే కడతేరిపోవాలే బేటీ! నేనీ జైళ్ల సావ! నన్నిడిసిపెట్టమని జెప్పు.ʹ అంటూ కుమిలి, కుమిలి ఏడ్చింది. ఆమెను ఏమని ఓదార్చాలి?
ʹకోడల్ని సంపినప్పుడు తెల్వదానే ముసల్దానా?ʹ రింకూ వదల్లేదు. ముసలామె చివ్వున తలెత్తింది. ʹనేను సంపిన్నా కోడల్ని? పై నున్నోడు సూస్తలేడా?ʹ ఆకాశం కేసి వేలు పెట్టి చూపెడుతూ అంది. ʹఅసలు ఫైసలా అక్కడ అయితది. నేను సంపింటే నా తల తెగి పడుద్ధి. నాకీ శిచ్ఛ ఏసీ నోడిని ఆ పైనోడే చూసుకొంటడు.....ʹ ఆ పైన ఏడుపు గొంతుతో ఆమె అంటున్న మాటలు ఆమె కంఠం రుద్దమవ్వడం వల్ల కొంత, ఆ ఝార్కండ్ హిందీ సరిగ్గా అర్థం అవ్వక కొంతా నాకు తెలియలేదు. నాకు అర్థమయ్యిందంతా ఆమె చాలా కాలమే శిక్ష అనుభవించింది. ఇప్పుడీ వృద్ధాప్యంలో ఆమె పడుతున్న కష్టం మాత్రం వర్ణనాతీతం.
నా కళ్ళ ముందే ఆమె మరో మూడు ʹచబ్బిస్ జనవరిʹలు, మూడు ʹపంద్రాగస్టుʹలు చూసింది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఇంటికెళ్ళి అందరిమధ్యా ప్రాణాలు విడవడంకోసమే, ప్రాణాలు నిలబెట్టుకోడానికి ఆ ముసలామె పడుతున్న కష్టం ఎంత దయనీయం? ఇంత వరకే అయితే అదొక తీరు. కానీ తొందరలోనే ముసలామె ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తెలిసాయి నాకు. ఒకటి ఆమెకి టీబీ వుంది. దానికన్న పెద్ద కష్టం ఆమె గర్భసంచి జారిపోయి శరీరం బయటికి వచ్చేసింది. అదొక నరకం ఆమెకి. చంటిపిల్లలకి న్యాప్కిన్ లు కట్టినట్టు బట్ట కట్టుకోవాల్సి వచ్చేది. దానినుండి వచ్చే కష్టాలు చెప్పుకోలేనివి. అప్పుడప్పుడు జైలుకి వచ్చే మహిళా డాక్టర్కి చెపితే చూసింది. కానీ ఆపరేషన్ని తట్టుకోగలిగే వయసు కాదామెది. డాక్టర్ చెయ్యగలిగేది ఏమీ లేదని తేల్చేసింది.అయితే నన్ను షాక్ చేసిన సమాచారం ఒకటి తర్వాత కాలంలో నాకు తెలిసింది. ఆ గర్భసంచి బయటికి వచ్చిన వైనం గురించిన సమాచారం అది. ఆమెకి ఆఖరి బిడ్డ కలిగిన కొద్దికాలం తర్వాత ఏదో రోజువారీ గొడవలలో భాగంగా ఆమె భర్త ఆమె పొత్తికడుపు మీద తంతే ఆ గర్భ సంచి అలా కిందికి జారిందట. ప్రాణమ్మీదికొచ్చినా ఆమె ఆపరేషన్ చెయ్యించుకోలేదు. చేయించుకోకపోడానికి డబ్బులు లేవన్నది కాదు. అవి ఎలాగూ లేవు. ఆమె ఆపరేషన్ చెయ్యించుకోనని మొండికేసిందట. అది భర్త మీద ఆమె చేసిన తిరుగుబాటు. అతను చేసిన తప్పుకి ఇంకెప్పుడూ ఆమె దగ్గరకు రాకుండా ఆమె ʹఅతనికిʹ వేసిన ఒక భయంకర శిక్ష. వింటుంటే వొళ్ళు జలదరించింది నాకు.
ఆమెని ఎలా అర్థం చేసుకోవాలి నేను? మూర్ఖత్వానికి పరాకాష్ట అనుకోవాలా? ఒక అసహాయ మహిళ కుటుంబహింస కి వ్యతిరేకంగా చేసిన ఒక తిరుగుబాటు అనుకోవాలా? ఇంత జరిగాక ఆమె భర్త తో అంత అన్యోన్యంగా ఎలా వుండగలుగుతోంది? బహుశా ఆయన మారాడేమో? పశ్చాత్తాప పడ్డాడేమో? ఇన్ని బాధలతో ఆమె అలా ఎలా నవ్వగలుగుతోంది? ఎలా హాస్యోక్తులాడుతోంది? అర్థం చేసుకోవడానికి నా జీవితానుభవం ఏమాత్రం సరిపోలేదు. కానీ నాకు తెలియకుండానే ఆమె పట్ల ఒక ఆపేక్ష కలిగింది.
ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా ఆమె విడుదల కోసం ఒక అర్జీ ఇచ్చే వాళ్ళం. ఆమె కష్టాలు వివరంగా చెప్పేవాళ్ళం. ఆమెకి న్యాయ సహాయం అందించమని అర్థించేవాళ్లం. జైళ్ళ ఐ.జి.కీ, గవర్నర్ కూ అర్జీలు పెట్టేవాళ్ళం. ప్రతి కాగితం ఆమెలో కొత్త ఆశలు నింపేది. ప్రతి అధికారీ, ప్రతి జడ్జీ సానుభూతితో పరిశీలిస్తామనీ వెంటనే నోట్ చేసుకొని, సిఫారసు చేస్తామనే వాళ్ళు. కానీ ఏమీజరిగేది కాదు.
**** **** ***
నేను వచ్చాక నాలుగో చబ్బిస్ జనవరి అయ్యాక జరిగిందది. ఎప్పటిలా మూలాకాతీకి పోయింది. ముసలాయన రాలేదు. ఆరోగ్యం బాగోలేక జైలు ఆసుపత్రిలో వుంచారని తెలిసింది. ఇక ఆమె దిగులికి అంతం లేదు. కొంచెం బాగయ్యాక ఆయన రాగలిగినప్పుడు ములాకాతీకీ తీసుకుపోతామని సిబ్బంది నచ్చ చెప్పినా వినేది కాదు. ప్రతి ఆదివారం ఆ గట్టు మీద వంటరిగా కూర్చుని ముసలాయన కోసం అరగంట ఎదురుచూసి వచ్చేది. ఈలోపు ఆమె కొడుకు శిక్ష పూర్తయ్యి విడుదలయ్యి వెళ్ళిపోయ్యాడు. ముసలాళ్ళిద్దరూ మిగిలిపోయారు. వీళ్ళిద్దరూ కింది జైల్లో వుండగా బెయిల్ పై విడుదలయ్యాక కొంత కాలం బయట వున్నారు. హైకోర్టు లో ఒక పదేళ్ళ తర్వాత శిక్ష ఖరారు అయ్యాక ఈవృద్ధాప్యం లో మళ్ళీ జైలుకి వచ్చారు. కొడుకు ఎన్నడూ బెయిల్ మీద బయటికి పోలేదు కనక అతని శిక్ష ముందు పూర్తయ్యింది. నన్ను మర్చిపోక కొడుకా అని అతను వెళ్ళేటప్పుడు పొగిలి పొగిలి ఏడ్చింది.
ఎప్పుడు ముసలాయన గురించిన వార్త వింటామో అని గుబులు గుబులుగా వుండేది. చివరికి ముసలాయన పరిస్తితి విషమించిందని బయట ఆసుపత్రికి తీసుకుపోయారని తెలిసింది. నాలుగో రోజు వచ్చిందా ఖబురు. ఆమెకి ఏమీ చెప్పకుండానే వీల్ చెయిర్ తీసుకొచ్చి ఆఫీసులో పిలుస్తున్నారు పదా అని రమ్మనగానే అందరికీ అర్థం అయ్యింది. బహుశా ఆమెకి కూడా. కుటుంబ సభ్యులను పిలిపించి శవాన్ని అప్పగించారు.
ఆమె తల్లడిల్లిపోయింది. ప్రతి రోజూ ఆకాశం కేసి చూస్తూ ʹఅమ్మా నన్ను బయటికి తీయమ్మ? ఇంటికి పొయ్యేదాకా ప్రాణాలు నిలుపమ్మా....ʹఅని ఏడ్చేది. 80యేళ్ళు పైబడ్డ ఆ ముసలామె కన్నతల్లిని తలుచుకొని అలా రోదిస్తుంటే మాలో ఎవ్వరికీ ముద్ద దిగేది కాదు.
*** *** ***
ఆమెని ఓదార్చటానికి నా దగ్గర ఏమీ మాటలు లేకపోయినా రోజూ ఆమె దగ్గర కాసేపు కూర్చోనే దాన్ని. తిండి తినమని కొప్పడేదాన్ని.
ముసలాయన చనిపోయిన వారానికి ఆయనికి పదో రోజు ఖర్మకాండ చెయ్యాలనీ, దానికి కావల్సిన సామాను, తనకి చీర, ఇత్తడి గాజులతో సహా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమె పట్టుపట్టిందంటే ఇంక దానికి తిరుగులేదు. ఆమె పేరున నాతో అర్జీ కూడా రాయించింది. తొమ్మిదో రోజున ఆమె కొడుకు ఆ వస్తువులన్నీ తెచ్చాడు. అయినా సరే జైలర్ తనకి ఇవ్వాల్సిందే అని పట్టుపట్టి సాధించుకొని మరీ ఖర్మకాండ జరిపింది.
స్నానం చేసి తెల్లచీర కట్టుకొని ఇత్తడి గాజులు వేసుకొన్నది. కొద్దిగా అన్నం తిని నడుం వాల్చింది. సాయంత్రం పూట ఒకసారి ఆమెని పలకరిద్దమని స్కూలు వైపు నడిచాను. ఆకాశం వైపు చేతులూపుతూ ముసలామె తనలో తానే మాట్లాడుకొంటూ కనపడింది.
నన్ను చూడగానే ʹమేడమ్ బేటీ, చూశావా ముసలోడు పైకి పోయినా బుద్ధి పోనిచ్చుకొన్నాడు కాదు.ʹ అంది. అదెలా అని అడిగితే, ʹనేనలా నడుం వాల్చానా తెల్ల బట్టలు కట్టుకొని కల్లోకి వచ్చాడు. అంతా బాగుంది. బేషుగ్గా చేశావ్. కాసింత ఆలుగడ్డల వేపుడు చేస్తే నీ సోమ్మెమ్ పోయింది అన్నాడు. నేను ఉలకలేదని, అదుగో ఆ చెట్టు మీదేక్కి రాయేశాడు. ఇదిగో చూడు!ʹ అని చిన్న గులకరాయి చూపించింది.
ʹఏ కాకో పడేసినట్టున్నది లేʹ అని కొట్టి పడేశాను.
ʹఊర్కోవమ్మా ఒక్క పిట్టకూడా లేదిక్కడ. ముసలోడి నైజం నాకు తెల్వదా ఏంది?ʹ అని కొప్పడింది.
ʹరేపు పావుకిలో ఆలుగడ్డలు తెప్పించిపెడతావా? పైసలున్నాయ్.....ముసలాయనకి ప్రాణం కొట్టుకుంటుందేమో ఆలుగడ్డలకోసం.ʹ కొంగు చివర ముడేసిన పైసల కోసం విప్పబోతుంటే వారించడానికి చెయ్యిపట్టుకొని, నాదగ్గరున్నయిలే ఆలుగడ్డలు తెస్తానుʹ. అంటుంటే నా కళ్ళలో కప్పెసిన నీటితెరలోంచి లాఠీ బుడియా రూపం మసక మసగ్గా కనిపించింది.
*** **** *****
ఒక రోజు హటాత్తుగా నన్ను రమ్మని కబురుపెట్టింది.
ʹనేను జేలర్ తోని మాటాడతా! ఒకసారి పిలిపిస్తవా?ʹ అంది. ʹఆఫీసుకి తీసుకుపోనా?ʹ అన్నా! ఆమె తల అడ్డంగా వూపింది. ʹఈడకే పిలిపించాలి. అందుకేగా నీకు చెప్పిన. నువ్వు పిలిస్తే వస్తాడు.ʹ
ʹనేను పిలిస్తే కాదు. మనం పిలిస్తే....మనం అందరం పిలిస్తే వస్తాడు. రాక తప్పదు.ʹ అన్నా.అప్పటికప్పుడు అన్నీ వార్డుల వాళ్ళని సమావేశ పరిచి మరుసటిరోజు జైలర్ వచ్చేవరకూ అన్న పానాదులు బంద్ పెట్టాలని నిర్ణయించుకొన్నం. హెడ్ వార్డర్ ని పిలిచి విషయం చెప్పాం. ఉదయం ఛాయ్ నుంచీ ఏదీ ముట్టం అని స్పష్టం చేశాం. వాతావరణం లోని వేడిని గమనించి అతను సరే అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం చాయ్ తో పాటుగా హెడ్ వార్డర్ కూడా వచ్చి, ʹమీరు చాయ్ నాస్తాలు తీసుకొంటేనే తాను 8.30 కీ వచ్చి కలుస్తానన్నాడు జైలర్ సాబ్ʹ అని కబురు తెచ్చాడు. ఓటమిలో కూడా తనదే పైచేయి వుండాలనే అతని నైజం అర్థం అయినా అది మా అందరి విజయం గనక చాయ్, నాస్తా తీస్కున్నం. మాట ప్రకారం చెప్పిన టైంకే మందీ మార్బలం తో జైలర్ వచ్చాడు.
కర్ర పోటేసుకొంటూ, కాళ్ళు వణుకుతుంటే తిరగేసిన లంబకోణంలా ముసలామె మెల్లగా నడుచుకొంటూ జైలర్ ఎదుటికి వచ్చింది. కర్ర మీద భారం వేసి మెల్లగా నడుం ఎత్తి నడుం మీద చెయ్యి పెట్టుకొని నిటారుగా నిలబడింది. జైలర్ కేసి సూటిగా చూసింది. కొద్ది క్షణాలు అక్కడంతా మౌనం. ఏం అడుగుతుందో అని అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు. ʹఏం కావాల్నో అడుగు! సార్ ఇస్తాడులేʹ అన్నది వెనుక నించి సీత. జైలర్ మొహంలో ఈ మాట తో కొద్దిగా రిలీఫ్ కనిపించింది. ఆయన ఏదో అనబోయెంతలోనే .......
ʹనిన్నింకా జైల్ల ఎందుకు పెట్టలేదు?ʹ ఆ ప్రశ్న ముసలామె నోటినుండి తూటాలా దూసుకొచ్చింది. ఖంగుమనే కంఠ స్వరంతో, మొహం అంతా జేవురించిపోగా, ఎర్రబడ్డ కళ్ళతో ముసలామే ఆ ప్రశ్న తననే వేసిందనే విషయం అర్థం కావడానికి జైలర్కే కాదు, మా అందరికీ కొంచెం టైమ్ పట్టింది. అర్థం అయ్యాక బిత్తరపోవడం జైలర్ వంతయ్యింది.
ʹనా ముసలాయన సచ్చిపోతే నిన్ను ఇంకా ఎందుకు అరెస్టు చెయ్యలే అని అడుగుతున్నా.ʹ అని రెట్టించింది ముసలమ్మ. ʹఇది బాగుంది. నేను చంపిన్నా ఏంది?ʹ వెటకారంగా నవ్వుతూ అన్నాడు జైలర్.
ʹమరి నన్నెందుకు జైల్ల బెట్టింరు? నేను జంపిన్నా కోడల్నీ ? నా ఇంట్ల కోడలు సచ్చిపోతే నన్ను, నా ముసలాయన్ని, నా కొడుకుని తెచ్చి జైల్ల పెట్టింరే? మరి నా ముసలాయన సచ్చిపోతే నిన్నూ నీ డాక్టర్ ని జైల్ల పెట్టాల కదా? ఎందుకు పంపలేదూ అంట. అసలు నా ముసలాయన్ని నువ్వు చెప్తే ఆ డాక్టర్ సూది ఇచ్చి చంపేశాడు అని నేను అంట. నిన్ను జైల్లో పెట్టాల కదా మరి. ఒక్క మాట నా కోడలి పుట్టినిన్టోల్లు అంటే మా అందరినీ జైల్లో నూకేసారే. నెత్తి నోరూ కొట్టుకొని చెప్పిన ఎవ్వరూ ఇనలేదే? ఇయ్యాల నేను అంటే నిన్నెందుకు జైల్ల బెట్టరాని?ʹ కోపంతో ఆమెకు పిచ్చి శక్తి వచ్చేసింది. నిలబడి ఇక కర్ర కూడా భూమ్మీద ఆనించకుండా దాన్ని లేపి చేతిలో లాఠీ లా పట్టుకొని, ఖడ్గం పట్టుకొన్న తీరులో నిలబడ్డది.
ఏమనాలో అర్థంకాక ...ʹసరేలే నేను మాత్రం జైల్లో లేనా ఏంటి?ʹనవ్వుతూ ఎగరకొట్టబోయాడు.
ʹనువ్వెక్కడ జైల్ల వున్నావ్? కుర్సీలో వున్నావ్. జైల్లో కూచోవాల. మేం తినే కూడు తినాల. మా లెక్క పరేశాన్ గావల అప్పుడు కదా. ఇది మీరు చెప్పిన న్యాలమే కదా? కానీ తీయ్ అదే సరైందనుకొందాం. అట్లే చేద్దాం. మరి నాకో న్యాలమూ నీకో న్యాలమూ ఎందుకూ? లేకుంటే నా ముసలాయన్ని నాకు తెచ్చియ్. తేనీకి నీకు ʹపవర్ʹ లేదంటావా? అయితే నన్ను ఇంటికి పంపేయ్యి.ʹ
ʹ ఆమెని వార్డులోకి తీసుకు పొండి.ʹ అని ఒక ఆదేశం పారేసి జైలర్ జారుకోబోయాడు.
ʹఅవును ఆమె అన్నదాన్లో తప్పేంటి? పైసలున్నోళ్ళకో న్యాయం, లేనోల్లకో న్యాయమా?ʹ
ʹఆమె విడుదలకోసం మీరు చేస్తానన్న సిఫారసులేమయ్యాయ్?ʹ నేను కూడా కోపంగా అన్నాను. ʹఆమె అనారోగ్యం, వయసు అన్నీ విషయాలు రాస్తూ మీరు కూడా ఐ.జీకి రాయాల్సిన బాధ్యతలేదా? ఆమెకి సుప్రీంకోర్టు కి పోడానికి న్యాయ సహాయం అందించే బాధ్యత మీకు లేదా?ʹ నేనామాత్రం అనగానే అందరూ తలో మాటతో జైలర్ ని నిలదీశారు.
ముసలామె జైలర్ ముఖం ముందు లాఠీ చూపిస్తూ ʹపోవయ్యా పెద్ద మనిషీ, పొయ్యి ఆ పని చూడు ముందు అంది.ʹ
****
ఈ ఘటన తరవాత ఆమె కొడుకు ఎవరో లాయర్ ని పట్టుకొని సుప్రీంకోర్టుకి అప్పీల్ తయారుచేయించుకొని తెచ్చి ఇచ్చాడు. నాకొక చిన్న ఉత్తరంతో పాటు ఆ ఫైల్ తెచ్చి ముసలామె నా చేతిలో పెట్టింది. తను చేయగలిగినంత చేశానని ఇక దానిని ఎలాగైనా సుప్రీంకోర్టుకి పంపే బాధ్యత నాదేనని అందులో రాయించాడు. జైల్ అప్పీల్ గా దానిని పంపాలని జైలర్ తో మాట్లాడి పంపించాము. ఇక ఆరోజు నుండి ఢిల్లీ నుండి కాయితం వచ్చిందా మేడమ్ బేటీ అని అడగడం మొదలుపెట్టింది. ఈలోపు నేను బెయిల్ పై విడుదలయ్యాను. నేను విడుదలయ్యిన రోజు ప్రతి ఒక్కరూ ఏడ్చారు. ముసలామె దగ్గరికి పోయి చెప్పడానికి భయమేసింది నాకు. కానీ ఆమె హాయిగా నవ్వుతూ ʹఖుష్ రహో మేడం బేటీ, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు.ʹ అని నా తల మీద చెయ్యెసి ఆశీర్విదించి పంపింది.
నా సహచరుడు ఇంకా జైల్లో వుండడాన్న నెల తరవాత నేనుజైలు కి వెళ్తూ ʹఅమ్మ గుర్తుగా వుంచుకోʹ అని అక్క ఇచ్చిన చీర కూడా లాఠీ బుడియా కోసం సర్దుకొన్నాను. నేను జైల్లో పడిన కొద్ది నెలలకే మా అమ్మ గుండెపోటుతో చనిపోయింది. మధ్యాహ్నానికి హజారిబాగ్ చేరుకొన్న. నన్ను చూడగానే గేట్ దగ్గరే సిపాయిలు.... ʹఅరె ఉదయం వచ్చి వుంటే లాఠీ బుడియా ని కలిసి పోయేవారు కదా. ఈ ఉదయమే విడుదలయ్యింది. మొత్తానికి బుడియా అసాధ్యురాలు విడుదల్లయ్యేవరకు యముడిని కూడా అల్లంత దూరాన నిలబెట్టిందిʹ అన్నాడొక సిపాయి.
నేను బుడియా కోసం తెచ్చిన చీర ...అమ్మ జ్ఞాపకంగా అక్క ఇచ్చిన చీర ...నా దగ్గరే వున్నది, ..నాలో నిండిపోయిన బుడియాలాగా. ***

Keywords : jail, maoist, lathi, anuradha
(2019-02-16 20:46:10)No. of visitors : 358

Suggested Posts


మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు.

జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా.

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


జైలు