తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
జూన్ 6న రిపబ్లిక్ చానెల్, టైమ్స్ నౌ లేఖల దుమారం మొదలైన రోజుల్లోనే కొమురమ్మ మహబూబాబాద్‌లో చనిపోయిన వార్త తెలిసింది. తీరినప్పుడు, తేరుకున్నపుడు ఆమె జ్ఞాపకాలు ముసురుకుంటూనే ఉన్నాయి గానీ రాయడానికి వీలు కాలేదు. మేము సికిందరాబాదు కుట్ర కేసులో సహ ముద్దాయిలం. అట్లా పరిచయం అయ్యాం గాని విప్లవ పార్టీ అజ్ఞాత జీవితంలో కోటగిరి వెంకటయ్య, కొమురమ్మల పేర్లు బర్ల యాదగిరి రాజు, జగన్‌మోహన్ రెడ్డి, స్నేహలతలతోపాటు వరంగల్‌లో వింటూనే ఉండేవాళ్లం. సిపిఐఎంఎల్‌సిఒసి వరంగల్ జిల్లా తొలి నాయకత్వంలో బర్ల యాదగిరి రాజు ఒకడు. మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.
1974 మే 18న హనుమకొండలో అరెస్టు చేసి మే 20న నన్ను మరో నలుగురు విప్లవ రచయితల(ఎం.టి ఖాన్, చెరబండరాజు, ఎం. రంగనాథం, త్రిపురనేని మధుసుదనరావు ఎండకాలం సెలవుల్లో మద్రాసులో ఉన్నందున కె.వి. రమణారెడ్డిని అప్పటికింకా అరెస్టు చేయలేదు.)ను సికిందరాబాదు మెజిస్ట్రేటు కోర్టులో హాజరుపరచినపుడు ఇవ్వబడిన ప్రథమ దర్యాప్తు నివేదిక(ఎఫ్‌ఐఆర్)లో కోటగిరి వెంటకయ్య, కొమురమ్మల పేర్లను చూశాం. బయ్యారం, మహబూబాబాద్, ఈ ప్రాంతాలనుంచి ఇంకా ఈ కేసులో బర్ల యాదగిరి రాజు, వీరభద్రయ్య, సిహెచ్. వెంకటయ్య మొదలైనవాళ్లను కూడా ముద్దాయిలుగా చూపారు. నాతోపాటు జనగామనుంచి గోపాలరెడ్డిని సికెఎం కాలెజిలో నా విద్యార్థి పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డిని కూడా చేర్చారు. మొత్తం 43మంది ముద్దాయిల్లో కె.జి. సత్యమూర్తి, కొండపల్లి సీతరామయ్య, ముక్కు సుబ్బారెడ్డి, ఇంగువ మల్లిఖార్జున శర్మ, మాదాటి రవీందర్ రెడ్డి, పర్సయ్య, లింగా విజయకుమార్ వంటి వాళ్లు నక్సలైట్ నాయకులు. ఆ జాబితాలో వాళ్లే కోటగిరి వెంకటయ్య, కొమురమ్మ. గోపాలరెడ్డి, నారాయణ రెడ్డివంటి వాళ్లు, నక్సలట్‌లకు సహాయం చేసినవాళ్లు. లేదా ఆశ్రయమిచ్చినవాళ్లు(అబెటర్స్). మేం ఆరుగురం విప్లవ రచయితలం. మొత్తంగా ఈ కేసులో ముద్దాయిల విభజన ఈ మూడు రకాలుగా ఉండేది.
చార్జిషీటు కూడా వేసి సెషన్స్‌కు కూడా కమిట్ అయి ఒకరొకరే కొందరు బెయిల్‌పై విడుదలవుతూ మరికొందరు అజ్ఞాతంలో ఉన్నవాళ్లు అరెస్టు అవుతూ ఉండగానే 1975 జూన్ 26న ఎమర్జెన్సీ వచ్చింది. విప్లవ రచయితలం ఈ కుట్ర కేసులో ఉన్నవాళ్లం మాత్రమే కాకుండా కార్యవర్గ సభ్యులందరమూ మీసా కింద అరెస్టయి రాష్ట్రంలోని ఆయా జైళ్లలో డిటెన్యూలుగా ఉన్నాం. అట్లా నేను ఎన్.కె రాడికల్ విద్యార్థుల్లో చెరుకూరి రాజకుమార్, శంబయ్య, మొదలైనవాళ్లం వరంగల్ జైలులో ఉండగా కొమురమ్మ అరెస్టయి ఇదే ఆవరణలోని మహిళా జైలుకు వచ్చిందని జైలు జవాన్ల ద్వారా తెలిసింది. పత్రికా సెన్సార్‌షిప్‌ల వల్ల పత్రికల్లో వార్తలు ఎక్కువగా వచ్చేవి కావు. ఎన్‌కౌంటర్ వార్తలయినా, అసహజ మరణాల వార్తలయినా పోలీసులు విడుదల చేసిన వార్తలుగానే వచ్చేవి. కృష్ణా నదీ తీరాన అటువైపు మంగళగిరి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోటగిరి వెంకటయ్య మరణించినట్లు పత్రికల్లో చదివాం. సహజంగానే అందులో కొమురమ్మ అరెస్టు వార్తలేదు. అప్పటికి ఆమె గర్భవతి. జగన్‌మోహన్ రెడ్డి, స్నేహలతలు ఇద్దరూ విద్యావంతులు. స్నేహలతది కృష్ణా జిల్లా తేలప్రోలు. ఆ ఊరు అవిభక్త కమ్యూనిస్టు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ ఊరిలో మంచి మార్క్సిస్టు గ్రంథాలయం కూడా ఉండేది. ఆ ఊరికి చెందిన ప్రొ. వి.వి రెడ్డి రీజినల్ ఇంజినీరింగ్ కాలెజిలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. ఇటీవలెనే హైదరాబాదులో కన్నుమూశారు. మార్క్సిస్టు మేధావి. ఆయన మేనకోడలే స్నేహలత. ఎంఎ చదువకుని జగన్‌మోహన్ రెడ్డి సాహచర్యంలో లిన్‌పియావో విప్లవ గ్రూపులోకి వెళ్లింది. ఆమె ఎన్‌కౌంటర్ తరువాత సృజన ఆమె ముఖచిత్రంతో వెలువడింది. వాళ్ల ప్రభావంలోనే వెంకటయ్య, కొమురమ్మలు దళంలో పనిచేస్తూ ఉండేవారని వినేవాళ్లం. కొమురమ్మ గర్భవతిగా ఉండి రహస్యప్రదేశంలో ఉన్నపుడు కోటగిరి వెంకటయ్యను, ఆమెను అరెస్టు చేశారని, ఇద్దరినీ వేరుచేసి ఆయనను ఎన్‌కౌంటర్ పేరుతో చంపేసి, ఆమె కదలలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నందున అరెస్టు చూపి వరంగల్ జైలుకు తీసుకువచ్చారని తరువాత కాలంలో తెలిసింది.
మేం మీసా డిటెన్యూలుగా ఉన్నందున మా సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్నందున జైలులో మాకు కొంత వెసులుబాటు, సదుపాయాలు, సౌకర్యాలు ఉండేవి. మహిళా జైలు, అందులోను సాధారణ ఖైదీల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేది. జైలు కిచెన్ నుంచే వాళ్లకు ఆహారం వెళ్లేది. 1975 ఎమర్జెన్సీ కాలం. జైలు అధికారులు మేం కొమురమ్మకు బిస్కెట్ల వంటి తినుబండారాలు, బట్టల వంటి అవసరాలు పంపడానికి కొన్ని పరిమితులతో అనుమతించేవారు. ఆమె జైలులోనే ప్రసవించింది. ఆమె పాప జైలులోనే పెరిగింది. ఆమెకు రహస్యంగా జైలు జవాన్ల ద్వారా ఉత్తరాలు రాసి యోగక్షేమాలుకూడా తెలుసుకుంటుండేవాళ్లం. కాని మేము ఒకే కేసులో ముద్దాయిలం అయినప్పటికి మేం డిటెన్యూలం ఆమె సాధారణ ఖైదీ గనుక ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు అన్నీ రద్దయిన డిటెన్యూలుగా మాకు కుటుంబ సభ్యులతో తప్ప ములాఖత్‌లు ఇచ్చేవాళ్లు కాదు. కనుకు ఆమె గురించి జైలు జవాన్ల ద్వారానో సానుభూతిగల శౌరయ్య వంటి డిప్యుటి జైలర్ ద్వారా వినడమే తప్ప వరంగల్ జైల్లో ఉండగా చూడలేకపోయాం.
ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూక నిమ్మపల్లి చరిత్రాత్మక పోరాటంలో అరెస్టయి వచ్చిన చండ్రపుల్లా రెడ్డి నాయకత్వంలో రైతాంగ కార్యకర్తలలో ఒకరికోసం ములాఖత్‌కు వచ్చిన ఆయన భార్యతో జైలు గేటు ఇంచార్జ్ జమేదారు అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడని తెలిసి డిటెన్యూలందరం పెద్ద ఆందోళన చేపట్టాం. జైలు అధికారులు సైరన్ మోగించి బయట నుంచి కూడా పోలీసులను రప్పించి మాపై లాఠిచార్జి చేశారు. అది చాలనట్లు శిక్షగా నన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడ నుంచి 1976-77లో సికిందరాబాదు కుట్రకేసు విచారణకు స్పెషల్ కోర్టుకు తీసుకెళ్లేవాళ్లు. ఈ కేసు విచారణ కోసమే కొమురమ్మను కూడా చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటికే ఆ జైలులో డిటెన్యూలుగా విప్లవ రాజకీయ ఖైదీలుగా డా. వీణా శత్రుజ్ఞ, ప్రొగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ వుమెన్(పిఒడబ్ల్యు) అధ్యక్షురాలు కె.లలిత ఉన్నారు. ఈ ఇద్దరి వలన బహుశా తరువాతి కాలంలో మేడే రోజు కరపత్రాలు పంచి అరెస్టయిన పిఒడబ్ల్యు అంబిక, స్వర్ణలత(అమరుడు మధుసుదన్‌రాజ్ సహచరి)ల సహచర్యం, ఆదరణ వల్ల కొమురమ్మ, ఆమె పాప ఆరోగ్యం, స్వాస్థ్యం సమకూరి తేరుకున్నట్లున్నది. మిగిలిన నలుగురు డిటెన్యూలు గనుక మా మెస్‌నుంచే వాళ్లకు భోజనం పంపించేవాళ్లం. ఆ నలుగురు ఆమె అవసరాలు కూడా చూస్తుండేవాళ్లు. రాజకీయాలు చెబుతూ ఆమెను, పాపను కనిపెట్టుకుని ఆమెకు ఒక మంచి రాజకీయ, సాంస్కృతిక వాతావరణాన్ని కూడా కల్పించారు. కోర్టు వాయిదాలకు తీసుకవెళ్లేప్పుడే మొదటిసారి ఆమెను ఎస్కార్ట్ వ్యానులో చూడగలిగాను. ఆజానుబాహువు. దృఢకాయం. గంభీరమైన వ్యక్తిత్వం. హుందాగా, ఆరోగ్యంగా కూడా కనిపించింది. జైలు వాయిదాలలో కలుస్తున్నప్పుడు ఆమెలో పాదుకుంటున్న ఆత్మ విశ్వాసాన్ని, రాజకీయ వికాసాన్ని గమనించగలిగేవాళ్లం. చాల ముక్తసరిగా మాట్లాడేది. క్రమశిక్షణాయుతంగా కనిపించేది.
ఎమర్జెన్సీ ఎత్తివేసి ఏర్పడిన ఒక ప్రజాస్వామిక వాతావరణంలో రాజకీయ ఖైదీల విడుదల పోరాటం ఉదృతమైంది. కొమురమ్మ కూడా విడుదలై మహబూబాబాద్ ప్రాంతంలో ప్రజాఉద్యమంలో పనిచేయడం ప్రారంభించింది. వరంగల్‌లో రాడికల్ విద్యార్థి సంఘం రెండో మహాసభలు(1978 ఫిబ్రవరి), గుంటూరులో రాడికల్ యువజన సంఘం ఆవిర్భావ మహాసభలు (1978 మే) జరిగి ʹగ్రామాలకు తరలండిʹ కార్యక్రమం చేపట్టి వందలాది గ్రామాలు తిరిగే సందర్భంలో కొమురమ్మ రాడికల్ యువజన సంఘంలో పనిచేసింది. ఆమె పాపను స్నేహలత అనే పేరు పెట్టి హనుమకొండ హాస్టల్‌లో చేర్చాం. బర్ల యాదగిరి రాజుతోపాటు పార్టీలో పనిచేసిన దార చుక్కయ్య కూడా మహబూబాబాద్ ప్రాంతం వాడే. ఆయన కూడా జైలు నుంచి విడుదలై ఆ ప్రాంతంలోనే పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరికీ పరిచయం సహచర్యం ఏర్పడి అది ప్రేమగా పరిణమించింది. 1981లో అనుకుంటా.. వరంగల్ జిల్లా రాడికల్ యువజన సంఘం మహాసభలు మహబూబాబాద్‌లో జరిగి ఆ సభల్లోనే కొమురమ్మ, చుక్కయ్యలకు ఆ వేదికమీదనే ఆదర్శ వివాహం జరిగింది. నేను ఆ సభలకు, ముఖ్య అతిథిగా వెళ్లాను. మహబూబాబాద్‌కు దగ్గరలో ఉండే కేసముద్రంలో రాడికల్ యువజన సంఘం సభలు కొమురమ్మ ఆధ్వర్యంలోనే జరిగాయి. వేలాది మంది విద్యార్థి, యువజనలు, రైతాంగం తరలి వచ్చారు. ఈ సభలో జననాట్య మండలి ʹబీదల పాట్లుʹ నాటిక ప్రజలను ఉర్రూతలూగించింది. సభలో నాతోపాటు కొమురమ్మ కూడా వక్త. 1983లో గిరాయిపల్లి విద్యార్థి అమరుల సంస్మరణ సభకూడా మహబూబాబాద్‌లో జరిగింది. అక్కడికి వేలాది మంది వచ్చి తిరుగుప్రయాణంలో పోలీసులు లాఠిచార్జి వలన గందరగోళం ఏర్పడింది. అప్పటికే చుక్కయ్య అరెస్టయి జైలులో ఉన్నాడు. నేనూ అరెస్టయి వరంగల్ జైల్లో వారం రోజులు ఉన్నాను. కొమురమ్మను మహబూబాబాద్‌లో చూశాను.
సికిందరాబాదు కుట్రకేసు విచారణకు ఆమె అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆమె రాకపోకల ఖర్చులు ఇచ్చి ట్రైన్ దిగి ఈస్ట్ మారెడ్‌పల్లిలోని తన ఇంటికి వస్తే కన్నభిరాన్ గారే ఆమెను కారులో కోర్టుకు తీసుకువస్తుండేవారు. కోర్టులో విరామ సమయంలో ఆమెకు, ఇతర ముద్దాయిలకు ఏమైనా తినిపిస్తుండేవాడు. ఎంతో ఆదరిస్తుండేవాడు. 1985 నుంచి పెరిగిన నిర్బంధంలో మళ్లీ నేను జైలు నుంచే కోర్టు కేసుకు వెళ్తుండేవాడిని. 1989 ఫిబ్రవరిలో సికిందరాబాదు కుట్రకేసులో తీర్పు సందర్భంగా బతికుండి బహిరంగ జీవితంలో ఉన్న ముద్దాయిలందరం కలుసుకున్నాం. నేను ఒక్కడిని జైలు నుంచి వెళ్లేవాడిని. కేసు కొట్టివేసి అందరు నిర్దోషులుగా ప్రకటింపబడ్డాం. అప్పటికే కొమురమ్మ జీవితంలో చాల కష్టాలు, విషాదాలు అనుభవించింది. దార చుక్కయ్యతో కూడా ఆమె సంబంధాలు చెడి విడిపోయి ఆయన ఆత్మహత్య కూడా చేసుకున్నాడని విన్నాను. ఆయనతో కలిగిన పిల్లల వివరాలు కూడా నాకు ఎక్కువగా తెలియదు. ఆమె చాల కష్టాలు అనుభవిస్తున్నదని మాత్రం విన్నాను.
చాల విరామం తరువాత ఆఖరుసారి ఆమెను 2015 జనవరి 27న కవి విమల ఇంటిలో కలవగలిగాను. 2015 జనవరి 26న హైదరాబాదు బుక్ ట్రస్ట్ ఎన్. వేణుగోపాల్‌తో అనువాదం చేయించి విడుదల చేసిన కోశాంబి పుస్తకావిష్కరణ సందర్భంగా వచ్చిన సుప్రసిద్ధ చరిత్ర రచయిత ప్రొ. ఉమా చక్రవర్తి మహిళా రాజకీయ ఖైదీల మీద డాక్యుమెంటరీ చేయదలుచుకుని కొమురమ్మను పిలిపించింది. ఆమె విమల ఇంటిలో ఉంది. అక్కడ అంబిక కూడా ఉంది. ఆమె నన్ను కూడా అక్కడికి రమ్మని పిలిచింది. అక్కడ ఒక పూటంతా కొమురమ్మతో ఆమె కష్ట సుఖాలు, ఆమె కుటుంబం గురించి విని చాల బాధ కలిగింది. ఆమెకు వయసు పైబడింది. మళ్లీ ఒకసారి వచ్చి తన సమస్యలన్నీ చెప్పుకుంటానని తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది. అంతే రాలేకపోయింది. కలవలేకపోయింది. ఆ సమస్యలతో, అనారోగ్యంతోనే బహుశా మరణించి ఉంటుంది. మహబూబాబాద్‌లోని విప్లవ అభిమానులు, ప్రజాసంఘాలు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారని ప్రజాసంఘాల కార్యకర్తల ద్వారా తెలిసింది. ఆమె కుటుంబానికి సంతాపం, ఆమె కోసం అశ్రునయనాల జోహార్లు చెప్పడానికి ఇంత ఆలస్యమైంది.
-వరవరరావు

Keywords : komuramma, naxalite, warangal, RYL, Peopleswar, varavararao, virasam
(2023-09-28 09:43:01)
No. of visitors : 4049
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
చారు మజుందార్ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ భుజాసింగ్ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు..... |
| కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు... |