మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు


మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు

మరణశిక్ష

వలసవాద వ్యతిరేక స్వాతంత్య్రోద్యమాన్ని ʹప్రధాని స్రవంతిʹ భావజాలం జాతీయోద్యమంగా పిలిచింది. బ్రిటిష్‌వాళ్లు వెళ్లిపోవాలనే పోరాటం ప్రధాన స్రవంతి భావజాలంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం కాలేకపోయింది. ఆ పరిమితులు మనకు రాజ్యాంగ రచనలో కూడా కనిపిస్తాయి. వివిధ భావజాలాల పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో అది ʹప్రజలకోసం ప్రజలు రచించుకున్నదిʹ అనే ఆదర్శం ప్రకటించినప్పటికీ పాలకుల రాజ్యం దానిని తనకు అనుగుణంగా మలుచుకుని అమలు చేస్తున్నది. ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా అవి నిర్ధిష్టమైన ఆచరణాత్మకమైన విధులుగా నిర్దేశించబడకపోవడం వల్ల అవి ఉల్లంఘనకు గురి అయినంతగా అమలుకు కాలేదు. ఇంక రాజ్యాంగంలోనే మరణశిక్షకు అవకాశం కల్పించబడినపుడు మొదటినుంచీ బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో సామ్రాజ్యవాద అనుకూలతతో పాలిస్తున్న పాలకవర్గం అది నేరమూ శిక్షకు అన్వయించబడవలసి వచ్చినపుడు సహజంగానే దళిత, ముస్లిం, ఆదివాసీ, బడుగు వర్గాల పట్ల అమలయ్యే వివక్షనే చూపుతుంది. చూపింది కూడా. గత 70సంవత్సరాలుగా, రాజ్యంగం అమల్లోకి వచ్చిన 68 సంవత్సరాలుగా చూసినప్పటికీ ʹస్వతంత్రʹ భారతంలో మరణశిక్షను అనుభవించినవాళ్లందరూ పై సామాజిక నేపథ్యంగలవాళ్లు. లేదా రాజకీయ ప్రత్యర్థులు.

హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టులను అణచివేయడానికి వచ్చిన ʹకల్లోలిత ప్రాంతాల చట్టాʹన్ని ʹస్వతంత్రʹ భారతంలోని మద్రాసు ప్రావిన్స్‌ కూడా ఉపయోగించుకొని నైజాంతోపాటు అక్కడ కూడా కమ్యూనిస్టు పార్టీపై అమలు చేసింది. రెండు చోట్లా సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన ʹమా భూమిʹ నాటకాన్నీ, ప్రదర్శననూ నిషేధించింది. మద్రాసు ప్రావిన్స్‌(ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ అందులో భాగమే) టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కళా వెంకటరావు ʹమా భూమిʹ నాటకాన్ని చూసి, మనిషిగా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్లగానే మంత్రిగా దానిని నిషేధించాడని శ్రీశ్రీ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు.

ఇదే ʹకల్లోలిత ప్రాంతాల చట్టాʹన్ని శ్రీకాకుళ ఆదివాసీ రైతాంగ పోరాటాన్ని అణచడానికి 1969 నుంచి జలగం వెంగళరావు శ్రీకాకుళం ఏజెన్సీ, ఉద్దానం, ఆంధ్ర తెలంగాణలోని ఉభయగోదావరి, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా అమలు చేశాడు. ఇది కొనసాగుతుండగానే సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాన్ని అణచడానికి చెన్నారెడ్డి కూడా అదే ʹకల్లోలిత ప్రాంతాల చట్టాʹన్ని వాడుకున్నాడు. కల్లోలిత ప్రాంతాల చట్టం అంటే కేవలం ఎన్‌కౌంటర్‌లు, పోలీసు క్యాంపులు, సిఆర్‌పిఎఫ్‌ వంటివి ఉండడమే కాదు ఎదుటివాని చేతిలోని కర్ర నుంచి తనకు ప్రమాదం ఉందని భావించే ఒక హెడ్‌కానిస్టేబుల్‌ కూడా కాల్పులకు ఉత్తర్వులు ఇవ్వవచ్చు. ప్రజలపై పోలీసు కాల్పులకు ఒక ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులు ఇవ్వాలన్న సాధారణ శిక్షాస్మృతి ఇక్కడ అక్కర్లేదు.

సిరిసిల్ల, జగిత్యాలలో 1978 అక్టోబర్‌ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినపుడు జగిత్యాల జైత్రయాత్ర(7 సెప్టెంబర్‌ 1978) జరిగి అప్పుడు అక్కడ సిపిఐఎంఎల్‌(సెంట్రల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ) సెంట్రల్‌ ఆర్గనైజర్‌గా ఉన్న ముప్పాళ లక్ష్మణరావు సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేశాడు. ఇది రాజ్యాంగ రచనకంటే ముందు వచ్చిన చట్టం గనుక, పైగా అది కూడా హైదరాబాదు నైజాం సంస్థానం చేసిన చట్టం గనుక భారత గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగం దానిని అమలు చేయకూడదని ఆక్షేపించాడు. సుప్రీంకోర్టులో ఆ కేసును పియుడిఆర్‌ అధ్యక్షుడు గోవింద ముఖోటి వాదించాడు. వరంగల్‌లో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రెండో మహాసభలు జరిగినపుడు అవి ప్రారంభించడానికి వచ్చిన గోవింద ముఖోటి ʹఇది ఎప్పుడు సుప్రీంకోర్టులో వాదనకు వచ్చినా అది వినవలసిన జస్టిస్‌ భగవతి, జస్టిస్‌ కృష్ణయ్యర్‌లవంటివాళ్లకు తీరిక ఉండేదికాదు. ఎందుకంటే వాళ్లు ఏ జెనీవాలోనో, ఏ హేగ్‌లోనో, మరెక్కడో అటువంటి అంతర్జాతీయ న్యాయ కేంద్రాల్లో అంతర్జాతీయ సదస్సులలో మానవ హక్కుల గురించి మాట్లాడడానికి వెళ్లడానికి ఎంచుకునేవాళ్లుʹ అని చెప్పాడు. అప్పటికే కాదు ఇప్పటికీ సుప్రీంకోర్టు ʹకల్లోలిత ప్రాంతాల చట్టంʹపై విచారణను చేపట్టనేలేదు. ఈ ఇద్దరి పేర్ల ప్రస్తావన ఎందుకంటే వీళ్లూ జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా, జస్టిస్‌ దేశాయ్‌, జస్టిస్‌ చిన్నపరెడ్డి వంటివాళ్లు రాజ్యాంగాన్ని ప్రజానుకూలంగా అన్వయించి వ్యాఖ్యానించినవాళ్లుగా ప్రఖ్యాతిపొందినవాళ్లు. రాజ్యమే కాదు, రాజ్యాంగం కూడ కొన్ని పరిమితులతో వాళ్ల చేతులు కట్టేసిందనడానికే ఈ చరిత్రలోకి వెళ్లవలసి వచ్చింది.

రాజ్యాంగం మరణశిక్ష ఆమోదించింది గనుకనే ఎమర్జెన్సీలో తన ముందుకు వచ్చిన భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు అప్పీలును జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఆమోదించలేకపోయాడు. వాస్తవానికి అప్పటికి ఉరిశిక్ష రెండుసార్లు ఆగిపోయింది. మొదటిసారి 1974 డిసెంబర్‌లో ఎపిసిఎల్‌సి(పత్తిపాటి వెంకటేశ్వర్లు) కృషి వల్ల సిపిఐ నాయకత్వం చండ్ర రాజేశ్వర రావు, భూపేశ్‌గుప్తా, కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌. జైపాల్‌రెడ్డిల అభ్యర్థన మేరకు కేంద్ర హోం మంత్రి బ్రహ్మానందా రెడ్డి అనుకూలంగా స్పందించడంతో ఆగిపోయింది. రెండవసారి 1975 మే 11న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌గా ఉన్న జస్టిస్‌ చిన్నపరెడ్డి జస్టిస్‌ గంగాదర రావు గార్లు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినట్లుగా భూమయ్య కిష్టాగౌడ్‌లకు తెలియజేయలేదనే సాంకేతిక కారణంతో అర్ధరాత్రి ఉరి శిక్షను ఆపివేస్తూ ఉత్తర్వులు పంపారు. ముగ్గురు యువన్యాయవాదులుగా పేరుపొందిన సి. వెంకటకృష్ణ, కె.ఎన్‌. చారి, కె. వెంకట్‌రెడ్డి, కన్నబిరాన్‌ గారి పనపున సెలవుల్లో తమ ఇళ్లలోనే ఉన్న న్యాయమూర్తులనుంచి ఈ ఉత్తర్వులు పొందగలిగారు. అప్పుడు ఇంక ʹభూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దుʹ అనే ఒకేఒక్క ఎజెండాపై ఎపిసిఎల్‌సి కార్యదర్శి పత్తిపాటి వెంకటేశ్వర్లు కన్వీనర్‌గా కమిటీ ఏర్పడి కలిసివచ్చే శక్తులను అన్నింటినీ కలుపుకుని దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టింది. ఎస్‌.జైపాల్‌ రెడ్డి మొదలు వాజపేయి, జయప్రకాశ్‌ నారాయన్‌ దాకా ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. అంతర్జాతీయంగా ఝా పాల్‌ సార్త్ర్‌, సైమన్‌ డీ బావ్‌రా, తారీక్‌ అలీ (ఈ ముగ్గురు ఫ్రాన్స్‌ నుంచి), నోమ్‌ చామ్‌స్కీ(అమెరికా) మొదలైన మూడు వందల మంది ప్రపంచ ఖ్యాతిగలవాళ్లు తమ మద్దతు తెలిపారు. అంతర్జాతీయ పత్రికలలో రాశారు. లండన్‌, ప్యారిస్‌ వంటి నగరాలలో భారత రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలు జరిగాయి.

నెలన్నర దాటకముందే ఎమర్జెన్సీ(25 జూన్‌ 1975) వచ్చింది. అప్పటికి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు గురించి ఒక పెద్ద ప్రదర్శనను ఢిల్లీ బోట్‌ క్లబ్బు ముందర ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. కాని ఇంతలో ప్రాథమిక హక్కులనన్నీ రద్దు చేసే(సభావాక్‌ విశ్వాస హక్కులు) ఎమర్జెన్సీ రావడంతో జార్జ్‌ ఫెర్నాండెజ్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దాదాపు భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు పోరాటంలో ఉన్న కాంగ్రెసేతర రాజకీయ నాయకులు, ఉద్యమకారులందరూ జైళ్లపాలయ్యారు.

బయట మిగిలిన కె.జి కన్నబిరాన్‌, సుప్రీంకోర్టు న్యాయవాది గార్గ్‌ వంటివాళ్లు భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దుకొరకు మళ్లీ చివరి ప్రయత్నం చేశారు. ఆ పిటిషన్‌ జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ముందుకే వచ్చింది. తనకన్నా ముందు సుప్రీంకోర్టు కూడ ధృవపరిచి రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించిన తర్వాత తానేమీ చేయలేనని తాను మళ్లీ ఒకసారి భారత గణతంత్ర ప్రథమపౌరుడైన రాష్ట్రపతి విశాల హృదయానికే ఈ అంశాన్ని వదిలివేస్తున్నానని పేర్కొన్నాడు. ఆ విధంగా 1975డిసెంబర్‌ 1 న భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష అమలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యమైంది.

రాజ్యసభ సభ్యుడుగా ఉన్న భూపేశ్‌గుప్తా నవంబర్‌ 30న రాష్ట్రపతిని కలిసి మరునాడు ఉదయం భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షను ఆపవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లుగా డిసెంబర్‌ 1 ʹఇండియన్‌ఎక్స్‌ప్రెస్‌ʹలో చిన్న వార్తగా వచ్చినందువల్లగాని జైల్లో ఉన్న రాజకీయ డిటెన్యూలందరికీ వాళ్లను అప్పటికే ఉరితీసిన విషయం తెలియదు.

రాజ్యాంగం నుంచే ఉరిశిక్షను తొలగిస్తే తప్ప ఇంత అమానుషమైన రాజ్యహత్యలను ఆపడం సాధ్యం కాదనడానికి మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించాను. అరుదైన నేరాలలో అరుదైన నేరానికే ఉరిశిక్ష వేయాలని సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. కాని దళితులు, ఆదివాసులు, ముస్లింలు విప్లవకారులవంటి రాజకీయ ప్రత్యర్థులను ఉరితీయడం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నదనడానికి భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షయే తిరుగులేని దాఖలా.

ఎలక్ట్రిక్‌ చైర్‌ మీద కూర్చోబెట్టి మరణశిక్ష అమలు చేసే పద్ధతి ఉన్న చోట కరెంట్‌ ఫెయిల్‌ అయితే ఇంక ఆ శిక్ష అమలుకాని పాశ్చాత్య దేశాల ఉదాహరణలు ఉన్నవి. మరే సాంకేతిక కారణాల వల్లనైనా ఉరిశిక్షలు ఆగిన ఉదంతాలున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉరిశిక్షలు పడిన 11మంది కమ్యూనిస్టు విప్లవకారుల ఉరిశిక్షలు ఆగడానికి కమ్యూనిస్టు పార్టీ లండన్‌ నుంచి తెచ్చిన బారిష్టర్‌ ప్రిట్‌, సుప్రీంకోర్టు నుంచి తెచ్చిన డానియెల్‌ లతీఫ్‌ల వంటి సుప్రసిద్ధ న్యాయవాదుల వాదనల కన్నా తన మత విశ్వాసాల వల్ల పాపభీతితో నిజాం నవాబు మరణ శిక్షను ఆమోదించే సంతకం చేయకపోవడం కూడా ఓ కారణం. అట్లాగే గోడకు నిలబెట్టి తుపాకీతో కాల్చివేసే పద్ధతి ఉన్న జారిష్టు రష్యాలో ఏదో నేరానికి మరణ శిక్ష పడిన డాస్టోవ్‌స్కీ రచయిత అనే విషయం తెలిసి జార్‌ స్వయంగా మరణ శిక్ష అమలును ఆపివేశాడు. కాని రెండు సార్లు ఉరికంబం దాకా వెళ్లి మరణవేదననంతా అనుభవించి, మరణద్వారాలు తట్టి తిరిగి వచ్చిన భూమయ్య కిష్టాగౌడ్‌లు మాత్రం ఈ రాజ్య చట్టబద్ధ హత్యనుంచి బయటపడలేకపోయారు.

-వరవరరావు
(02 ఆగస్టు 2018)

Keywords : varavararao, jagityala, bhumayya, kishtagoud, death penalty
(2019-01-16 02:41:33)No. of visitors : 579

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
more..


మరణశిక్ష