ప్రజల సభంటే.. ఇట్లుంటది
ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి.
అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..
అప్పటి దాకా.. సభలు చూసిన అనుభవం ఉన్నది. కాని ఈ సభ అన్ని సభలలాగా మామూలు సభ కాదు.
అది వరంగల్.. 1990 సంవత్సరం..
అప్పుడు ఒక సభ జరిగింది. అదే రైతుకూలీ సంఘం 3వ మహాసభ.
నాకు.. ఆ సభలు చూడటమే కాదు.. ఆ సభా నిర్వాహణలో భాగస్వామ్యం అయ్యే అవకాశం చరిత్ర కల్పించింది.
****************************************************************************************
అప్పుడు ఎక్కడ చూసినా ఎర్రజెండాలు చేత బట్టి వరంగల్ వైపు కదులుతున్న పల్లెలు కనిపి౦చాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ పల్లెల నుంచి మూడు రోజుల ముందే బయలుదేరిన వేలాది మంది కాలినడక వరంగల్ చేరుకున్నారు. రొట్టెలు కట్టుకొచ్చినోళ్లు.. మధ్యమధ్యలో ఆగి వంటలు వండుకున్నోళ్లు.. పిల్లలను ఎత్తుకొన్న అమ్మలు కూడా సంబరంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వందల కిలోమీటర్లు ఉత్సాహంగా నడిచొచ్చారు. ఇది తమకోసమే ఏర్పాటు చేసుకున్న సభ అని ఉత్సాహంగా కదిలిన అద్భుత దృశ్యమిది.
బండెనక బండి కట్టి వరుసగా బారులు తీరిన ఎడ్లబండ్లు.. తమకు తాముగా తీసుకొచ్చిన లారీలు, ట్రాక్టర్లతో తెలంగాణ రోడ్లన్నీ ఎర్రజెండాలతో వెలిగిన రోజది. ఆ మూడు రోజులూ ఎర్రని జెండాలు.. ప్రజల ఉత్సాహ కవాతుతో నిండిన రోడ్లే కనిపించాయి. ఈ నాటిలా టెక్నాలజీనా, ప్రకటనలా..! కేవలం ఫలానా రోజు మన సభ ఉన్నదనే నోటి మాట తప్ప వారిని తరిమింది లేదు. కేవలం అభిమానంతో ప్రజలు బయలుదేరుడే తప్ప.
ఎవ్వరి తిండి వాళ్ళు పట్టుకొని.. ఓ రెండు రోజులకు వంట సామాగ్రితో సహా కట్టుకొని కుటుంబాలకు కుటుంబాలే చేతిలో ఎర్రజెండాలు పట్టుకుని ఎగిరే ఉత్సాహంతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల ప్రజలు ఊరేగుతూ వచ్చారు. ఒక ఉర్సుకు పోయినట్టు.. ఒక జాతరకు ఏగినట్టు.. జనజాతరలా వరంగల్లుకు బైలెల్లినారు. ఎందుకంటే అది మన సభ.. మన జీవితాలనే మార్చే అద్భుతమైన పోరు సభ. అందుకే అటు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా నిండు కొలిమిలా ఉన్న మే నెల ఎండల్ని కూడా తమ చెమట చుక్కలతో చల్లబరుస్తూ.. నడిచారు. కడుపులో ఆకలి మంటను తమ పాటలతో చల్లబరుచుకుంటూ.. ఉప్పెన తరంగంలా వరంగల్లు వైపు పయనమయ్యారు.
-----------------------------------------------------------------------
వరంగల్ సభ ఏర్పాట్లు మహాద్భుతం
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం 3వ మహాసభలు 1990 మే 5,6 తేదీల్లో జరపాలనే తలంపుతో సభా నిర్వహణకు ఏర్పాట్లు చేయటానికి ఏప్రిల్ మొదటి వారం నుంచి పనులు మొదలయ్యాయి. ఒకటేమో ప్రతినిధుల సభలకు కాశీబుగ్గలోని ఏనుమాముల పొలాల ప్రాంతాన్ని చదును చేసి సభకు అనువుగా మార్చటం. మరొకటి బహింరగ సభ కోసం వరంగల్ శివారులోని ప్రకాశరెడ్డి పల్లి ప్రాంతంలో వందల ఎకరాల స్థలంలో ప్రజల కోసం అనువుగా మార్చటం.
ఈ సభ ఏర్పాట్ల కోసం ఏడొందల మంది వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చారు. ప్రతినిధుల సభ జరుపుకోవాలని నిర్ణయించుకున్న ఏనుమాముల పొలాలు సర్కారు, తుమ్మ చెట్లు, ముళ్ల పొదలు, తంగేడు పొదలు ఇలా అనేక రకాలైన చెట్లు చేమలతో నిండి ఉన్నది. ప్రతినిధుల సభ ఏర్పాట్ల కోసం మూడు వందల మంది వాలంటీర్లు, బహిరంగ సభ ఏర్పాట్ల కోసం నాలుగొందల మంది వాలంటీర్లు నెల రోజులు రాత్రింబగళ్లూ శ్రమించారు.
ఇక్కడ ʹశ్రమించారుʹ అనే పదం ఉపయోగించటం ఎందుకో నచ్చటం లేదు. భాషా పరమైన పరిమితి వల్ల మరో పదం లేక అలా అనటమే తప్ప.. ఆనాడు వందలాది మంది యువకులు ఆడుతూ పాడుతూ స్వచ్ఛందంగా తమ కోసం తాము చేసే పనే అని అనుకున్నరు, వాళ్లందరూ త్యాగపూరితంగా, నిబద్దతతో చేస్తే ఎలా ఉంటుందో ఆనాడే అనుభవంలోకి వచ్చింది.
ఆ ఉత్సాహం.. స్వచ్ఛందత చూడాల్సిందే కాని.. అక్షర రూపం ఇవ్వేలేం..!
ఆనాటి సభ కోసం ప్రతీ రోజు పది పన్నెండు మందితో ఒక టీంని తయారు చేసి వరంగల్ టౌన్‌తో సహా పరిసర గ్రామాల్లో ప్రచారం చేసేవారు. సభ కోసం ప్రజల నుంచి చందాల రూపంలో ఫండ్ ఏర్పటు చేసుకోవాలనే కార్యక్రమం ఏర్పాటు చేసినా.. కొన్ని పరిమితులు విధించారు. ప్రచార దళాలు గ్రామాలకు పోయినప్పుడు వారి చందా డబ్బాలో నాణేలు, రూపాయి, ఐదు, పది రూపాయల నోటు కన్నా పెద్ద నోట్లు వేయకూడదు అని స్ట్రిక్ట్‌గా చెప్పారు. కాని వాలంటీర్లు ఎంత వద్దన్నా.. సామాన్యులు కూడా తాము తమ అవసరాల కోసం దాచుకున్న వందల రూపాయలు చందాగా వేశారు.
మరోవైపు.. సభ కోసం..
ఒకవైపు ప్రజలు సభకు బయలుదేరారు.. అవసరమైన ఆర్థిక వనరుల కోసం గ్రామాల్లో వలంటీర్లు తిరుగుతున్నారు. కాని ఇంకా బహిరంగ సభాస్థలి సిద్దం కాలేదు. ప్రతినిధుల సభ జరిగే ఏనుమాముల పొలాల్లో అన్నీ తుమ్మ చెట్లు, తంగెడు పొ దలు ఇంకా అనేక రకాల పొదలు నిండా ఉన్నాయి. వాటిని తవ్వి తీయాలనేది మా లక్ష్యం. సభలు దగ్గర పడుతున్నాయి. చెట్లు తొలగించే పని మొదలు కాలేదు. వాటన్నింటిని తొలగించాలంటే.. గడ్డపారలు, పారలు కనీసం వందల సంఖ్యలో అవసరం. వాటిని సమకూర్చుకునే పనిలో రోజులు గడిచి పోతున్నాయి.
ఒక రోజు వాలంటీర్లు.. నిర్బంధకాలంలో తమను కావాలని వేదించిన పోలీసు కనిపిస్తే అతడిని తన్ని తన్ని తరిమి కొట్టారు. ఆ విషయం తెలిసి అలా చేయొద్దని వాలంటీర్లను వారించినం. అలాంటి పనులు చేస్తే సభలు నిర్వహించుకోవాలనే మన లక్ష్యం నెరవేరదని, ఇలాంటి ఘటనలు సాకుగా చూపి సభలకు ఆటంకం కలిగిస్తారని వాలంటీర్లకు నచ్చజెప్పాం. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సభ ఏర్పాట్లపై ఆందోళన పెరుగుతున్నది. ప్రతినిధుల సభ జరిపే వందల ఎకరాల పొలాలు చెట్లు చేమలతో అలాగే నిండి ఉన్నది. సభ ఏర్పాట్లపై ఆందోళనతో.. వాలంటీర్లతో మాట్లాడాం. నిజంగానే మనకు ఈ అమానవీయ, దుర్మార్గ వ్యవస్థపై కసి ఉంటే మహా సభలు విజయవంతంగా నిర్వహించుకోవటానికి మన శక్తినంతా దారపోద్దామని చెప్పాం. పారలు, గడ్డపారలు మనకు లేవు. కాబట్టి మన సభలు జరుపుకోలేమా. మన చేతులే గడ్డపారలు, పారలుగా, గొడ్డళ్లుగా కంప చెట్లను, ఇతర ముండ్ల పొదలను, తంగెడు వనాలను పీకి పారేద్దామని చెప్పాను. గులక రాల్లు బుల్లెట్లుగా, కొడవలి కొస బాయెనెట్‌గా తెలంగాణ రైతు పోరాటం చేస్తున్నాడు. మనం మన చేతులే ఆయుదాలుగా, పనిముట్లుగా పనిచేద్దామని వాలంటీర్లకు ఉద్బోదించాం. అంతే.... మూడొందల మంది వాలంటీర్లు.. ఉదయం పది గంటలకు పొలాలపై పడి సాయంత్రం నాలుగు గంటల వరకే.. పొలాలన్నింటినీ ఒక్క చెట్టు చేమ లేకుండా చదును చేశారు.
మా ఆకలి తీర్చడానికి ఒక అమ్మ వచ్చింది..
ఆనాడు జరిగిన ఒక సంఘటన ఎప్పటికీ మరువలేం. ఒక రోజు వందలాది వాలంటీర్లంతా సభల ఏర్పాట్లలో పనిచేస్తున్నారు. అంతలో ఒక అరవై, డెబ్బై ఏండ్ల అమ్మ తన కొంగులో మూడు అరటి పండ్లు కట్టుకొని అక్కడికి వచ్చింది. బిడ్డా.. చాలా కష్టపడుతున్నరు ఎప్పుడు తిన్నరో ఏమో. తిండి దొరుకుతున్నదో లేదో.. ఈ పండ్లు తినండని తన కొంగులో కట్టుకొచ్చిన అరటి పండ్లను తీసి ఇచ్చింది. వందలాది మంది వలంటీర్లకు ఆ మూడు అరటి పండ్లు ఏ మూలకు వస్తయి. అయినా ఆ అమ్మ ప్రేమ అక్కడి దాకా నడిపింది. అప్పుడు అడిగాం.. అమ్మా నీవు ఎవరు? నీవే ఏమీ తిననట్లు కనిపిస్తున్నవ్ కదా.. ఆ పండ్లు నీవే తినమ్మా అని అన్నం. అప్పుడు ఆ అమ్మా.. తాను సారంగపాణి అమ్మనని చెప్పింది. నా కొడుకు కూడా మీ లాగే పనిచేసేటోడు. రాడికల్ సంఘంలో చేరిండు. పోలీసులు పొట్టన పెట్టుకున్నరని చెప్పి.. తన కొంగుతో కండ్లు తుడుచుకొని మీరంతా నా కొడుకులేనని చెప్పి ఆప్యాయంగా అరటిపండు ఒలిచి నోటికి అందించింది. ఆనాడు ఆ అమ్మ తన కొడుకుకే తినిపించినట్లు అనుకుంది. ఆ తర్వాత అమరుడు సారంగపాణి తల్లిలాగే రోజూ ఎవరో ఒకరు వచ్చి తమ కొడుకుల బాటలో పనిచేస్తున్న వారి ఆకలి తీర్చేందుకు తమకు చాతనైనది తెచ్చేవారు. ఒకమ్మ రోజూ అటుకులు తెచ్చి తన కొడుకుకు ఇవంటే పానం అని చెప్తూ అందరికీ పంచి పెట్టేది. ఇలాంటి అనుభవాలతో.. సభలు రేపు ప్రారంభం అవుతాయనంగ.. రాత్రి పెద్ద గాలిదుమారం. కుండపోత వాన. నాలుగైదు రోజులుగా కష్టపడి వేసిన టెంట్లన్నీ నేల కూలాయి. ప్రతినిధుల ప్రాంగణమంతా బురదయ్యింది.
మే 5.. ఉదయం ప్రతినిధుల సభ.. మరోవైపు మైదానమంతా వర్షానికి బురదమయం.!!
భారీ వర్షం పడిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. రాత్రి వర్షానికి అంతా బురదమయం.. గందరగోళం. అయినా సరే మళ్లీ వాలంటీర్లు వీర సౌనికులుగా కదిలిండ్రు. బురద గుంటల్నీ పూడ్చేసిండ్రు. కూలీన టెంట్లను నిలబెట్టిండ్లు. ఉదయం ఐదారు గంటల నుంచి ప్రతినిధుల రాక మొదలైంది. వందలు, వేలుగా ప్రతినిధులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. పదిగంటల కల్లా ఏడు వేల మంది రైతుకూలీ సంఘం మహాసభల ప్రతినిదులు, 50 వేల మంది సౌహార్ధ్ర ప్రతినిదులు చేరుకున్నారు. దాదాపుగా లక్షమంది ప్రతినిదులతో రైతుకూలీ సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి.
ప్రతినిధులకు కావాల్సిన వంటలు మొదలయ్యాయి. బియ్యం కడిగిన నీళ్లతోనే చెరువులోని కోపులన్నీ నిండిపోయాయి. వెదురు తడకలతో అల్లిన గదుల్లో అన్నం రాసులు. లక్ష మంది రైతుకూలీ సంఘం ప్రతినిధులకు భోజన సదుపాయాలు.ఎక్కడా తొక్కిస లాట లేకుండా అన్నం అందరికీ అందించారు.
వరంగల్లులో అద్భుతమైన ర్యాలీ..
ఇక రెండో రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రకాశరెడ్డిపల్లి దాకా ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఊరేగింపు జరుగాలి. ఊరేగింపు మొదలైంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ర్యాలీలో ముందర ఉన్న వారు బహిరంగ సభా స్థలికి చేరుకుంటే అదే ర్యాలీలో చివర ఉన్న వాళ్లు ప్రతినిధుల సభా ప్రాంగనంలో ఉన్నరు. అంటే ఎంత మంది ఆ ర్యాలీలో ఉన్నరో అర్థం చేసుకోవచ్చు.
ఎండాకాలం.. భారీ ర్యాలీ.. దాహం తీర్చిన ఓరుగల్లు జనం
సభల కోసం వచ్చే ప్రజలకు దాహం తీర్చేందుకు, ఆకలి తీర్చేందుకు వరంగల్ ప్రజానీకమంతా స్వచ్ఛందంగా తమ ఇండ్లముందు నీళ్ల డ్రమ్ములు పెట్టి నీళ్లు పోశారు. ఆకలేసిన వారికి తమ ఇండ్లల్లో వండిన అన్నం పెట్టారు. అటుకులు, అరటి పండ్లు ఇచ్చి ప్రజల ఆకలి దప్పులు తీర్చారు. దారి పొడవునా వరంగల్ మున్సిపల్ అధికారులు నల్లాలను ఏర్పాటు చేశారు. అనేక స్వచ్చంద సంస్థలు ఊరేగింపు దారి పొడవునా టెంట్లు వేసి ఆకలి దప్పులు తీర్చారు. బహిరంగ సభకు లక్షలాదిగా తెలంగాణ పల్లెల నుంచి తరలి వచ్చారు. వరంగల్లు ప్రజలు అంతా ఏకమైం.. సభకు వచ్చిన ప్రజలకు బాసటగా నిలిచిన్రు.
నిర్బంధం కాదు.. అంతా స్వచ్ఛందమే..!
సద్దులు గట్టుకొని, బండ్లుగట్టుకొని వచ్చారు.
వందలు వేలుగా... అలలు అలలుగా కిలోమీటర్లు నడిచి వచ్చారు.
నిజామాబాద్ జిల్లానుంచి వేలాది మంది మూడు రోజులు నడిచి సభలకు చేరుకున్నారు.
మెదక్ జిల్లా నుంచి వేలాది మంది నెత్తమీద సద్దిమూటలతో నడిచి వచ్చారు.
ఆనాడు పత్రికలు చెప్పిన ప్రకారమే.. 15నుంచి 20 లక్షల మందిదాకా తరలి వచ్చారు.
అప్పటి దాకా తెలుగు నేలలో జరిగిన అతిపెద్ద బహింరగ సభల్లో అతి పెద్ద బహిరంగ సభగా చరిత్రలో నిలిచి పోయింది.
ప్రజా కవి కాళోజీ మాటల్లో చెప్పాలంటే..
వరంగల్ రౌతుకూలీ సంఘం మహాసభ దేశంలోనే అతిపెద్దది
నేను( కాళోజీ) గాంధీ, నెహ్రూలు పెట్టిన మహాసభలు చూసిన. గాంధీ వరంగల్ వచ్చినప్పుడు పెట్టిన బహిరంగ సభ స్థలంలో ఇప్పుడు రైతుకూలీ సంఘం మహాసభలకు వచ్చిన వారి వాహనాలు నిలుపటానికి కూడా సరిపోలేదు.
ఇది ఇప్పటిదాకా జరిగిన బహింరగ సభల్లో కెల్లా అతి పెద్దది. ప్రజలు స్వచ్చందంగా కదిలి వచ్చిన సభ ఇది.
ప్రజలు తమ విముక్తికోసం త్యాగాలకోర్చి జరుపుకున్న సభ ఇది.
ప్రజలు తాము కంటున్న కల ఎంత గొప్పదో, విప్లవం ఎంత సుందరంగా, త్యాగపూరితంగా నిర్మించుకుంటున్నారో సభలు చాటి చెప్పాయి అని కాళోజీ వరంగల్ సభల గురించి చెప్పారు.
ఆ సభలకు ఎవరినీ ఎవరూ తరలించలేదు.
ఏ ప్రలోబాలు లేవు.
ఎండాకాలపు ఎండలు, ఆకలి దప్పులకు ఓర్చి విజయవంతం చేసుకున్న వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభల విశేషాలు... అనేకం.
ప్రజలు తమ కోసం, తమ విముక్తి కోసం ఎంతటి త్యాగపూరితంగా, ఎంతటి అద్బుతాలు చేస్తారో.. వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభళు నిరూపించాయి. చరిత్రపై చెరగని సంతకం చేశాయి.
- పరశురాం
Keywords : సభ, ప్రగతి నివేదన, రైతుకూలీ, వరంగల్ సభ, ప్రజలు, స్వచ్ఛందం, meeting,raitu coolie, warangal, pragati nivedana
(2024-11-06 05:33:11)
No. of visitors : 4368
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
చారు మజుందార్ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ భుజాసింగ్ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు..... |