హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే

హక్కుల

భీమా కోరేగాం కేసులో ఆగస్ట్ 28న జరిగిన అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 17న గంటన్నరపాటు వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మళ్లీ ఒకసారి ఈ పిటిషనర్లకు (రొమిలా థాపర్ తదితరులకు) ఈ కేసుతో సంబంధం లేదనీ, అరెస్టయినవారు ఇప్పటికే హైకోర్టులకు వెళ్లారనీ అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంతకు ముందే సుప్రీం కోర్టు అంగీకరించిన విషయాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేశారు. అరెస్టయినవారి లిఖిత పిటిషన్లు కూడ ఇప్పటికే సుప్రీం కోర్టుకు అందాయని, వాటిని సెప్టెంబర్ 5న దాఖలు చేసినట్టుగా కోర్టు గుర్తించిందనీ, కనుక పిటిషనర్లకు వాదనార్హత ఉన్నదా లేదా అనే సమస్య సమసిపోయిందని అన్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరయిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ సుదీర్ఘంగా వాదిస్తూ ఈ విచారణ మహారాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదనీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదనీ అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఉన్న నక్సలిజం ఎంత తీవ్రమైన సమస్యో చెప్పారు. ప్రస్తుత కేసు జాతీయ భద్రతమీద ప్రభావం చూపగల అనేక నేరారోపణలతో కూడినదని అన్నారు. ఈ కేసును విచారించే సామర్థ్యం హైకోర్టులకు, ఇంకా కింది కోర్టులకు ఉన్నందువల్ల సుప్రీం కోర్టు ఇందులో జోక్యం చేసుకోగూడదని అన్నారు.

పిటిషనర్ల తరఫున వాదిస్తూ డా. అభిషేక్ మను సింఘ్వి తాము పిటిషనర్లం గనుక కోర్టు మొదట తమ వాదనలు వినాలని, ఆ తర్వాతనే ప్రతివాదులు తమ వాదనలు వినిపించవచ్చునని అన్నారు. అసలు అరెస్టుల, విచారణల స్వభావం దురుద్దేశంతో, అనుచితత్వంతో కూడినదని తాను మౌలికంగా చెప్పదలచానని ఆయన అన్నారు.

డా. అభిషేక్ సింఘ్వి మొదట భీమా కోరేగాం లో 2018 జనవరి 1 న జరిగిన హింస ఎలా జరిగిందనే సంఘటనలతో ప్రారంభించారు. ఎల్గార్ పరిషద్‌లో ఎల్గార్ అంటే అర్థం మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రతివాదనలో ఆరోపించినట్టుగా ప్రభుత్వం మీద దాడి అని కాదని, ఆ మాటకు పిలుపు, శంఖారావం అనే అర్థాలున్నాయని అన్నారు. అరెస్టయిన వారందరి మీద ఎఫ్ఐఆర్‌లో చేసిన నేరారోపణలకు మొత్తం పునాది సుధీర్ ధావలే పాడిన ఒక పాట అని, ఆ పాటలో ప్రభుత్వాన్ని కూలగొట్టమని పదాలున్నాయని ఎఫ్ఐఆర్‌లో రాశారని సింఘ్వి అన్నారు. అయితే ఆ పాట వాస్తవానికి జర్మన్ కవి, నాటకకర్త బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసిన నాటకం ది గుడ్ పర్సన్ ఆఫ్ స్జెచువాన్‌లోని ఒక కవితకు అనువాదం అని సింఘ్వి వివరించారు. ఇటీవలనే మలయాళం నవల మీషా మీద విధించిన నిషేధాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ కోర్టే భావ ప్రకటనా స్వేచ్చను, ప్రత్యేకంగా ఒక కవి ప్రకటించే సాంస్కృతిక, కళాత్మక వ్యక్తీకరణను, ఎలా ఎత్తిపట్టిందో సింఘ్వి ఉటంకించారు.

ఆ తర్వాత సింఘ్వి ఎల్గార్ పరిషద్ సభను రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ సావంత్, జస్టిస్ కోల్సే పాటిల్ నిర్వహించారని, ఆగస్ట్ 28న అరెస్టయినవారిలో ఒక్కరికి కూడ ఆ సభతో ఎటువంటి సంబంధం లేదని, వారెవరూ ఆ సభలో పాల్గొనలేదని చెప్పారు. నిజానికి భీమా కోరేగాం హింసకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, వాటిలో మొదటిది జనవరి 2న అనితా సాంవ్లే నమోదు చేశారని అన్నారు. ఆ ఎఫ్ఐఆర్ జనవరి 1న అభివృద్ధి నిరోధక బృందాలు రెచ్చగొట్టిన హింస గురించి ఫిర్యాదు చేసిందని, అందులో మిలింద్ ఎక్బోటె, శంభాజి భిడేల పేర్లు ఉన్నాయని, ఈ వ్యక్తులు, బృందాలు హింసకు ఎలా బాధ్యులో ఉందని సింఘ్వి అన్నారు. కాగా, ఒక వారం తర్వాత జనవరి 8న మరొక ఎఫ్ఐఆర్ నమోదయిందని, తుషార్ దంగుడె అనే వ్యక్తి ఫిర్యాదు మీద నమోదైన ఈ ఎఫ్ఐఆర్‌లో మొదటిసారి ఈ ఘటనలో మావోయిస్టు కోణం ఉన్నదనే స్థిరమైన ప్రకటన వచ్చిందని అన్నారు.

అయితే, మిలింద్ ఎక్బోటె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు 2018 ఫిబ్రవరిలో ఆ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రతివాదనలో భీమా కోరేగాం హింస ముందస్తు పథకం ప్రకారం జరిగిందని, ఆ హింసలో ఎక్బోటె పాత్ర ఉందని వాదించిందని సింఘ్వి అన్నారు. అలాంటప్పుడు హఠాత్తుగా ఆ హింసలో ప్రస్తుతం అరెస్టయినవారి పేర్లు చేర్చడం ఎలా జరిగిందని సింఘ్వి ప్రశ్నించారు. ఇదే సందర్భంలో పుణె డిప్యూటీ మేయర్ సిద్ధార్థ్ దెండె పోలీసు ఇనస్పెక్టర్ జనరల్‌కు సమర్పించిన ఒక నివేదికను సింఘ్వి ప్రస్తావించారు. సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా, హింసా సామగ్రిని పోగు వేయడం ద్వారా దళిత సమూహం మీద దాడికోసం పథక రచన జరిగిందని ఆ నివేదిక కూడ చెప్పింది. ఈ పథక రచనలో, హింసాకాండలో శంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటె లకు కీలక పాత్ర ఉందని, తమ హిందుత్వ కార్యక్రమాన్ని వ్యతిరేకించే చరిత్రను ఉత్సవంగా జరుపుతున్న దళిత సమూహానికి ఒక పాఠం చెప్పే ఉద్దేశంతోనే హింసాకాండ జరిగిందని ఆ నివేదిక రాసింది.

పుణె పోలీసు ఐజికి ఈ నివేదిక 2018 జనవరిలో అందగా, సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలైన తర్వాత, తమ వాదనలలో సెప్టెంబర్ 10న ఈ వైరుధ్యాన్ని బైటపెట్టిన తర్వాత మాత్రమే సెప్టెంబర్ 11న పుణె పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో అటువంటి కమిటీ గాని, నివేదిక గాని ఏమీ లేదని అన్నారని సింఘ్వి ఎత్తిచూపారు. ఇలా మాటమార్చడం రాష్ట్ర ప్రభుత్వపు దురుద్దేశాన్ని బైటపెడుతున్నదని సింఘ్వి అన్నారు. ఇక విచారణ కూడ ఎంత దురుద్దేశ పూరితంగా జరిగిందంటే సోదాకు వెళ్లేటప్పుడు పుణె పోలీసులు పుణె నుంచి సాక్షులను తీసుకువెళ్లారని, కాని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్దేశించే ప్రకారం స్థానిక స్వతంత్ర వ్యక్తులను మాత్రమే సాక్షులుగా ఉంచుకోవాలని సింఘ్వి అన్నారు. పుణె పోలీసులు బైటపెట్టిన ʹఉత్తరాలుʹ పైపైన చూసినా అవి కల్పితమైనవని తేలిపోతుందని అన్నారు.

ఈ సమయంలో న్యాయమూర్తులు ఆ వాదనలు వినడానికి సమయం సరిపోదని, బుధవారానికి వాయిదా వేస్తున్నామని అన్నారు.

సింఘ్వి వాదన సాగుతున్నంతసేపూ అడ్డుపడుతున్న అడిషనల్ సాలిసిటర్ జనరల్ తాము విచారణలో సేకరించిన సాక్ష్యాధారాలను, పోలీసులు తయారు చేసిన కేస్ డైరీని న్యాయమూర్తులకు చూపుతామని, అవి చూసి న్యాయమూర్తులు దిగ్భ్రాంతి చెందుతారని, న్యాయవ్యవస్థ చైతన్యం దిగ్భ్రమకు లోనవుతుందని అంటూ వచ్చారు. నేరవిచారణ ప్రస్తుతం ఉన్న స్థాయిలో కేస్ డైరీని గాని, విచారణ సంస్థ పోగు చేసిన సమాచారాన్నిగాని అరెస్టయిన వ్యక్తులకు, పిటిషనర్లకు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు.

ఇదంతా నేర విచారణా పద్ధతికి సంబంధించిన అంశమని, అందువల్ల మహారాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న సాక్ష్యాధారాలన్నిటినీ మరుసటి వాయిదాలో చూస్తామని, ఆ సమాచారం ఆధారంగా అవసరమనుకుంటే ప్రత్యేక విచారణా బృందాన్ని నియమించే విషయం ఆలోచిస్తామని న్యాయమూర్తులు అన్నారు.

తదుపరి విచారణ సెప్టెంబర్ 19న జరుగుతుందని, అరెస్టు చేసిన వారిని గృహ నిర్బంధంలో ఉంచాలనే మధ్యంతర ఉత్తర్వులు అప్పటిదాకా కొనసాగుతాయని న్యాయమూర్తులు అన్నారు.

- ఎన్. వేణుగోపాల్

Keywords : భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషత్, పూణే పోలీసులు, సుప్రీంకోర్టు, అక్రమ అరెస్టులు, వరవరరావు, గృహ నిర్బంధం, bhima koregaon, elgar parishad, supreme court, varavararao
(2024-03-23 02:07:02)



No. of visitors : 1440

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హక్కుల